కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 8/15 పేజీలు 17-22
  • ఆశానిగ్రహం నిలుపుకొని, నిండుగా చూపండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆశానిగ్రహం నిలుపుకొని, నిండుగా చూపండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాముఖ్యమే గాని సులభం కాదు
  • మన భావోద్రేకాల విషయంలో ఆశానిగ్రహము
  • మీ భావోద్రేకాలు, మీ సహోదరులు
  • అది సాధ్యమే!
  • బహుమతి గెలుచుకోవడానికి ఆశానిగ్రహం పాటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని అమర్చుకొనండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఆత్మనిగ్రహం—యెహోవాను సంతోషపెట్టే లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 8/15 పేజీలు 17-22

ఆశానిగ్రహం నిలుపుకొని, నిండుగా చూపండి

“మీ విశ్వాసమునందు . . . ఆశానిగ్రహమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5, 6.

1. ఎలాంటి అసాధారణ పరిస్థితిలో ఒక క్రైస్తవుడు సాక్ష్యమివ్వాల్సి వచ్చును?

యేసు యిలా చెప్పాడు: “సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.” (మత్తయి 10:18) ఒక గవర్నరు, న్యాయాధిపతి, లేదా ఒక అధ్యక్షుని యొద్దకు పిలువబడితే మీరేం మాట్లాడతారు? మొదట మీరెందుకు అక్కడున్నారు, మీపైగల ఆరోపణను గూర్చి మీరు బహుశ మాట్లాడతారు. అలా చేయుటకు దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తుంది. (లూకా 12:11, 12) అయితే ఆశానిగ్రహాన్ని గూర్చి మాట్లాడటాన్ని మీరు ఊహించగలరా? మన క్రైస్తవ వర్తమానమందు అదొక ప్రాముఖ్యమైన భాగమని మీరు పరిగణిస్తారా?

2, 3. (ఎ) పౌలు ఫేలిక్సుకు, ద్రుసిల్లకు సాక్ష్యమిచ్చే సందర్భమెలా వచ్చింది? (బి) ఆ పరిస్థితిలో పౌలు ఆశానిగ్రహాన్ని గూర్చి మాట్లాడుట ఎందుకు సరియైన అంశమై యుండెను?

2 ఒక నిజజీవిత ఉదాహరణను పరిశీలించండి. ఒకానొక యెహోవాసాక్షిని నిర్భందించి, న్యాయవిచారణకు తీసుకొచ్చారు. మాట్లాడుటకు అవకాశమిచ్చినప్పుడు, సాక్ష్యమిచ్చుటకు క్రైస్తవునిగా తనకున్న నమ్మకాలను గూర్చి వివరించాలని ఆయన కోరుకున్నాడు. ఆ రికార్డును పరిశీలిస్తే ఆయన “నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు” తగిన సాక్ష్యమివ్వడాన్ని మీరు కనుగొనగలరు. కైసరయలో అపొస్తలుడైన పౌలు అనుభవాన్ని మేము సూచిస్తున్నాము. అక్కడ ప్రాథమిక విచారణ జరిగింది. “కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడవచ్చి పౌలును పిలిపించి క్రీస్తుయేసును పక్షముగా ఆయన చెప్పిన దానిని విన్నాడు.” (అపొస్తలుల కార్యములు 24:24) ఫేలిక్సు “పశుప్రాయుడై ప్రతివిధమైన క్రూర, కామవికార చేష్టలకు తన రాజ్యధికారము నుపయోగించాడని” చరిత్ర చెబుతోంది. ద్రుసిల్ల (దేవుని నియమాన్ని ఉల్లంఘించి) తన భర్తకు విడాకులిచ్చి తన మూడవ భార్య అయ్యేందుకు ఆమెను బలవంత పెట్టకముందే అతడు రెండుసార్లు పెండ్లి చేసుకున్నాడు. బహుశ ఆమెయే క్రొత్త మతమగు క్రైస్తవత్వాన్ని గూర్చి వినాలని ఇచ్ఛయించి ఉండవచ్చు.

3 పౌలు “నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు” మాట్లాడాడు. (అపొస్తలుల కార్యములు 24:25) ఇది దేవుని నియమాల సత్యసంధతకు ఫేలిక్సు, ద్రుసిల్లాలో నెలకొనియున్న క్రూరత్వానికి, అన్యాయానికి మధ్యనున్న భిన్నత్వాన్ని స్పష్టంచేసి యుండవచ్చు. తన విషయంలో న్యాయం ప్రదర్శించుటకు ఫేలిక్సు కదిలింపబడునని పౌలు నిరీక్షించి యుండవచ్చు. అయితే “ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు” ప్రస్తావించాల్సిన అవసరమేమి? దుర్నీతిపరులైన ఈ జంట “క్రీస్తుయేసునందలి విశ్వాసము” ఎందుకు అవసరమో వాకబు చేస్తుండిరి. కాబట్టి ఆయనను అనుసరించుటకు ఒకవ్యక్తి తన తలంపులను, మాటలను, క్రియలను అదుపులో పెట్టుకొనుట, అనగా ఆశానిగ్రహము అవసరమని వారు తెలుసుకోవాలి. తమ తలంపులు, మాటలు, క్రియల విషయంలో మానవులందరు దేవునికి జవాబుదారులే. ఆ విధంగా, పౌలు విషయంలో ఫేలిక్సుయిచ్చే ఎటువంటి తీర్పుకంటెను దేవునియెదుట ఆ గవర్నరు, అతని భార్య ఎదుర్కొనే తీర్పు గొప్పది. (అపొస్తలుల కార్యములు 17:30, 31; రోమీయులు 14:10-12) బహుశ, దానినిబట్టియే పౌలు చెప్పిన వర్తమానం విని ‘ఫేలిక్సు మిగుల భయపడ్డాడు.’

ప్రాముఖ్యమే గాని సులభం కాదు

4. ఆశానిగ్రహం నిజ క్రైస్తవత్వమందు ఎందుకు ఒక ముఖ్యభాగమై యుంది?

4 ఆశానిగ్రహం క్రైస్తవత్వంలో ఒక ప్రముఖ భాగమని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. యేసు సన్నిహిత సహచరుల్లో ఒకడైన అపొస్తలుడైన పేతురు దీనిని ధృవపర్చాడు. పరలోకమందు “దేవస్వభావమునందు పాలివారగు” వారికి వ్రాస్తూ, విశ్వాసము, ప్రేమ, ఆశానిగ్రహం వంటి ఆవశ్యకమైన లక్షణాలు ప్రదర్శించాలని పేతురు ఉద్బోధించాడు. కావున, ఆశానిగ్రహం ఈ అభయమందు ఇమిడియున్నది: “ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.”—2 పేతురు 1:1, 4-8.

5. ఆశానిగ్రహాన్ని గూర్చి మనమెందుకు ప్రత్యేకంగా శ్రద్ధకలిగి ఉండాలి?

5 అయితే, మన దైనందిన జీవితంలో నిజంగా ఆశానిగ్రహాన్ని అభ్యసించుట కంటె అది కనబర్చాలని చెప్పుట సులభమని మీకు తెలుసు. దానికిగల ఒక కారణమేమంటే ఆశానిగ్రహమనేది ఒక అరుదైన లక్షణం. మన కాలమగు “అంత్యదినములలో” ప్రబలంగా ఉండే మనోభావాలను పౌలు 2 తిమోతి 3:1-5నందు వర్ణించాడు. మన కాలాన్ని గుర్తించే ఒక లక్షణం అనేకులు ‘ఆశానిగ్రహం లేనివారై’ ఉంటారు. ఇది నిజమనే రుజువును మనం మనచుట్టూ చూడడం లేదా?

6. నేడు ఆశానిగ్రహం లేకపోవడం ఎలా కనబర్చబడుతోంది?

6 “మీ భావాల్ని బయటకు చెప్పుకోవడం” లేదా “కోపాన్ని వెళ్లగ్రక్కడం” ప్రాథమికంగా ఆరోగ్యదాయకమని అనేకమంది ప్రజలు నమ్ముతారు. ప్రచార సాధనాల్లో ప్రముఖంగా కనబడుతూ, ఎలాంటి ఆశానిగ్రహాన్నైనా అలక్ష్యంచేస్తూ తమ భావాల్ని బయటకు వెళ్లగ్రక్కే నటుల పాత్రలు వారి ఈ దృక్కోణాన్ని బలపరుస్తున్నవి. దృష్టాంతమునకు: క్రీడల్ని బాగా ఇష్టపడేవారు తమ భావాల్ని తీవ్రంగా, హింసా ధోరణిలో సహితం వ్యక్తం చేయడానికి అలవాటుపడ్డారు. క్రీడా స్థలాల్లో క్రూరంగా కొట్టుకున్న లేదా దొమ్మిగా కలబడిన సంఘటనల్ని గూర్చిన వార్తల్ని కనీసం వార్తాపత్రికల్లో చదివినట్లు మీరు గుర్తుతెచ్చుకొనలేరా? అయితే, మన అంశానికి ఆశానిగ్రహం లేకపోవడాన్ని గూర్చిన ఉదాహరణలను పునఃసమీక్షించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. మనం ఆశానిగ్రహం చూపాల్సిన రంగాల్ని అనగా మనం తీసుకునే ఆహారం, పానీయం, వ్యతిరేక లింగ వ్యక్తులతో మన ప్రవర్తన, మన వ్యాపకాల కొరకు ఖర్చుచేసే సమయం, డబ్బువంటి అనేక విషయాలను మీరు పేర్కొనగలరు. అయితే, అటువంటి అనేక విషయాలను పైపైగా పరిశీలించే బదులు, మనం ఆశానిగ్రహం కనబర్చాల్సిన ఒక ప్రాథమిక రంగాన్ని పరిశీలిద్దాము.

మన భావోద్రేకాల విషయంలో ఆశానిగ్రహము

7. ఆశానిగ్రహమందలి ఏ విషయంమీద మనం ప్రత్యేక శ్రద్ధచూపాలి?

7 మన క్రియల్ని క్రమబద్ధం చేయడంలో లేదా అదుపులో ఉంచుకొనుటలో మనలో అనేకులము సహేతుక విజయం సాధించాము. దొంగతనం చేయము, లైంగిక దుర్నీతికి లొంగిపోము, లేదా హత్య చేయము; అటువంటి అపరాధాల విషయంలో దేవుని నియమేమో మనకు తెలుసు. అయితే మన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకోవడంలో మనమెంత జయప్రదంగా ఉన్నాము? భావోద్రేక ఆశానిగ్రహాన్ని పెంపొందించుకొనలేనివారు తరచు యుక్తకాలంలో తమ క్రియల సంబంధంగా ఆశానిగ్రహాన్ని కోల్పోతారు. కాబట్టి మన భావోద్రేకాలపై దృష్టి నిల్పుదాం.

8. మన భావోద్రేకాల విషయంలో యెహోవా మననుండి ఏమి కోరుచున్నాడు?

8 ఎలాంటి భావోద్రేకాలు వ్యక్తపరచకుండా మనం యంత్రాల్లాగ ఉండాలని యెహోవా దేవుడు కోరుటలేదు. లాజరునుంచిన సమాధినొద్ద యేసు “కలవరపడి ఆత్మలో మూలిగెను.” ఆ పిమ్మట “యేసు కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:32-38) తన క్రియల్ని పరిపూర్ణంగా అదుపులో ఉంచుకొని, దేవాలయమందు రూకలు మార్చువారిని వెళ్లగొట్టినప్పుడు ఆయన విభిన్నమైన భావోద్రేకాన్ని కనపర్చాడు. (మత్తయి 21:12, 13; యోహాను 2:14-17) ఆయన యథార్థ శిష్యులు సహితం లోతైన భావోద్రేకాల్ని కనబర్చారు. (లూకా 10:17; 24:41; యోహాను 16:20-22; అపొస్తలుల కార్యములు 11:23; 12:12-14; 20:36-38; 3 యోహాను 4) అయిననూ, వారి భావోద్రేకాలు పాపమునకు నడుపకుండా తమకు ఆశానిగ్రహం అవసరమని వారు గ్రహించారు. ఎఫెసీయులు 4:26 దీనినిలా స్పష్టంచేస్తున్నది: “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.”

9. మన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?

9 ఒక క్రైస్తవుడు పైకి ఆశానిగ్రహాన్ని కనబరుస్తున్నట్లు కన్పించిననూ, వాస్తవానికి అతని భావోద్రేకాలు అదుపుతప్పే ప్రమాదమున్నది. హేబెలు బలిని దేవుడు అంగీకరించినప్పుడు కలిగిన ప్రతిస్పందనను గుర్తుతెచ్చుకొనండి: “కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో—నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును, నీ యెడల దానికి వాంఛ కలుగును” (ఆదికాండము 4:5-7) కయీను తన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు, కాగా అది అతడు హేబెలును హత్యచేయుటకు నడిపింది. అదుపులేని భావోద్రేకాలు అదుపులేని క్రియలకు నడిపిస్తాయి.

10. హామాను ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకుంటారు?

10 ఆలాగే మొర్దెకై, ఎస్తేరు కాలమందలి ఉదాహరణను కూడా పరిశీలించండి. మొర్దెకై తనకు వంగి నమస్కారము చేయనందున హామాను అనే అధికారి మహాకోపము తెచ్చుకొనెను. ఆ తర్వాత హామాను తాను ఘనపర్చబడతానని తప్పుగా తలంచాడు. “ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి, రాజు గుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకైమీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయెను.” (ఎస్తేరు 5:9, 10) అతడు వెంటనే భావానందం పొందాడు. అయినను తనకు కోపమున్న వారిని చూచినంతనే అతడు ఉగ్రుడయ్యేవాడు కూడ. అంటే హామాను ‘కోపము అణచుకొన్నాడని’ బైబిలు చెప్పినప్పుడు, ఆశానిగ్రహం విషయంలో అతడు మాదిరిగా ఉన్నాడని నీవనుకుంటున్నావా? ఎంతమాత్రము కాదు. అప్పటికి హామాను తన చర్యల్ని, భావోద్రేకాన్ని అణచుకున్నాడు గాని ఈర్ష్యతోకూడిన తన రౌద్రాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. అతని భావోద్రేకాలు అతను హత్యకు కుట్రపన్నునట్లు నడిపించాయి.

11. ఫిలిప్పీ సంఘములో, ఎలాంటి సమస్య ఉండెను, దానికి ఏది నడిపియుండవచ్చును?

11 అదే ప్రకారం, భావోద్రేకాల్ని అదుపులో పెట్టకపోవడం నేడు క్రైస్తవులకు బహుగా హాని కల్గించగలదు. ‘సంఘంలో ఆ సమస్యే ఉండదులే’ అని కొందరు భావించవచ్చు. కాని ఆ సమస్య ఉత్పన్నమైంది. ఫిలిప్పీ సంఘమందలి ఇద్దరు అభిషక్త క్రైస్తవులకు తీవ్రమైన భిన్నాభిప్రాయం ఉండెను, అదేమిటో బైబిలు వివరించడం లేదు. బహుశ ఆ సమస్య యిలావుండెనని ఊహించండి: భోజనానికి లేక ఒక ఉల్లాస కార్యక్రమానికి యువొదియ కొంతమంది సహోదర సహోదరీలను ఆహ్వానించింది. అయితే దానికి సుంటుకేను పిలువలేదు, దానికామె చాలా బాధపడింది. దానికి ప్రతి స్పందనగా ఆమె మరో సందర్భంలో యువొదియను ఆహ్వానించలేదు. అప్పటినుండి వారిద్దరు ఒకరిలో ఒకరు తప్పులు వెదుక్కోవడం ఆరంభించారు, అలా కొంతకాలానికి వారిద్దరు మాట్లాడుకోవడం మానివేశారు. ఇలాంటి సందర్భాల్లో కేవలం భోజనానికి ఆహ్వానించకపోవడమే మూల సమస్యా? కాదు. అది కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే. ఎప్పుడైతే ఈ అభిషక్త సహోదరీలిద్దరు తమ భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకోలేకపోయారో, ఆ నిప్పురవ్వ బడబాగ్నిగా మారింది. ఆ సమస్య ఎంతగా పెరిగిందంటే చివరకు ఒక అపొస్తలుడు ఆ విషయంలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.—ఫిలిప్పీయులు 4:2, 3.

మీ భావోద్రేకాలు, మీ సహోదరులు

12. ప్రసంగి 7:9 నందలి సలహాను దేవుడు మనకెందుకు ఇస్తున్నాడు?

12 తక్కువ చేయబడ్డానని బాధపడినప్పుడు లేదా తను దురభిమానంతో చూడబడ్డానని ఒకవ్యక్తి భావించినప్పుడు, తన భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు. ఆ విషయం యెహోవాకు తెలుసు, ఎందుకంటె మానవుని ఆరంభం నుండి మానవ సంబంధాల్ని ఆయన గమనించాడు. దేవుడు మనల్నిలా హెచ్చరిస్తున్నాడు: “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” (ప్రసంగి 7:9) దేవుడు క్రియలకు కాదుగాని భావోద్రేకాలకు మొదట శ్రద్ధనిస్తాడని గమనించండి. (సామెతలు 14:17; 16:32; యాకోబు 1:19) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను నా భావోద్రేకాల్ని అదుపుపెట్టుటపై ఎక్కువ శ్రద్ధనివ్వాలా?’

13, 14. (ఎ) లోకంలో భావోద్రేకాల వైఫల్యత నుండి సాధారణంగా ఏది వృద్ధి అవుతుంది? (బి) క్రైస్తవులు విరోధ భావాలు కలిగియుండుటకు ఏ సంగతులు నడిపించవచ్చును?

13 తమ భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకోలేకపోయిన లోకమందలి అనేకమంది ప్రజలు తమ లేదా తమ బంధువు విషయంలో జరిగిన నిజమైన లేదా ఊహించిన దోషాన్నిబట్టి బద్ధవైరుధ్యాన్ని—తీవ్రమైన, చివరకు హింసాయుతమైన విరోధభావాన్ని పెంచుకోవడం ఆరంభిస్తారు. భావోద్రేకాలు ఒక్కసారి అదుపుతప్పితే చాలు, అవి చాలాకాలం వరకు తమ హానికరమైన ప్రభావాల్ని చూపుతూనే ఉంటాయి. (ఆదికాండము 34:1-7, 25-27; 49:5-7; 2 సమూయేలు 2:17-23; 3:23-30; సామెతలు 26:24-26.) నిశ్చయముగా క్రైస్తవులు ఏ దేశమందున్ననూ లేదా వారిది ఏ సంస్కృతియైననూ అట్టి బద్ధవైరుధ్యాలు, కక్షలు తప్పు అని వాటిని విసర్జించాలి. (లేవీయకాండము 19:17) భావోద్రేకాల సంబంధముగా విరోధస్వభావాన్ని విసర్జించుట మీ ఆశానిగ్రహంలో భాగమని మీరు దృష్టిస్తారా?

14 యువొదియ సుంటుకేల విషయంలో జరిగినట్లే, భావోద్రేకాలను అదుపులో పెట్టకపోవుట ఇప్పుడు సమస్యలకు నడిపిస్తుంది. ఒకానొక వివాహ విందుకు ఆహ్వానించనందుకు, లేదా తన పిల్లవాడినో లేదా తన బంధువునో చేర్చనందుకు ఒక సహోదరి తను తక్కువ చేయబడ్డానని భావించవచ్చు. బహుశ ఒక సహోదరుడు తోటి క్రైస్తవుని వద్దనుండి ఒక సెకండ్‌హ్యాండ్‌ వాహనాన్ని కొంటే అది త్వరలోనే పాడైపోవచ్చు. కారణమేదైనను, ఇది వారి భావాలను గాయపరుస్తుంది. భావోద్రేకాలు అదుపు తప్పుతాయి, అందులో ఇమిడియున్న వారు వ్యధకు గురౌతారు. అప్పుడేమి సంభవించగలదు?

15. (ఎ) క్రైస్తవుల మధ్య విరోధభావాల ఫలితంగా ఎలాంటి విశాదకర పరిణామాలు సంభవించాయి? (బి) విరోధభావం కలిగియుండే స్వభావంపై బైబిలు నందలి ఏ సలహా ప్రభావం చూపాలి?

15 అలా వ్యధకు గురైనవ్యక్తి తన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకొని, తన సహోదరునితో సమాధానపడనట్లయిన, విరోధ స్వభావాలు వృద్ధికాగలవు. ఫలాని క్రైస్తవుడు లేదా కుటుంబమంటే గిట్టదు కాబట్టి వారు హాజరగుతున్న ఆ సంఘపుస్తక పఠనగుంపుకు నన్ను పంపవద్దని ఒక సాక్షి అడగడంవంటి సందర్భాలు వున్నాయి. ఎంత విచారకరం! ఒకరినొకరు కోర్టుకు ఈడ్చుకోవడం క్రైస్తవులకు పరాజయమని బైబిలు చెబుతుండగా, ఒక సహోదరుడు గతంలో మనని లేదా మన బంధువుని చిన్నబుచ్చాడని అతని విడనాడితే అదికూడ పరాజయము కాదా? మన సహోదరసహోదరీలతో మనం కలిగివుండే సమాధానంకంటే రక్తసంబంధీకులే మనకెక్కువని మన భావోద్రేకాలు వెల్లడిచేస్తున్నాయా? మా సహోదరి కొరకు మేము మరణించడానికైనా సిద్ధమే, గాని మా భావోద్రేకాలు ఇప్పుడామెతో మాట్లాడ్డానికి మమ్మల్ని ఏ మాత్రం ప్రేరేపించడం లేదని చెప్పుదుమా? (యోహాను 15:13 పోల్చండి.) దేవుడు నిశితంగా యిలా చెబుతున్నాడు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి.”—రోమీయులు 12:17-19; 1 కొరింథీయులు 6:7.

16. భావోద్రేకాలతో వ్యవహరించే విషయంలో అబ్రాహాము ఏ చక్కని మాదిరినుంచాడు?

16 విరోధభావాలు నిలిచియుండుటకు అనుమతించే బదులు, మన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకొనుటకు మనంవేసే అడుగు, ఫిర్యాదుకు కారణమైన సమస్యను సమాధానపర్చేది లేదా పరిష్కరించేదై ఉంటుంది. అబ్రాహాముకు, లోతుకు కలిగిన విస్తారమైన పశువులు వాటి కాపరులు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సరిపోనప్పుడు ఆ కాపరులమధ్య కలహము పుట్టడాన్ని గుర్తుతెచ్చుకోండి. తన భావోద్రేకాలు తనను స్వాధీనపరచుకొనునట్లు అబ్రాహాము అనుమతించాడా? లేక ఆయన ఆశానిగ్రహం కనబర్చాడా? మెచ్చుకోదగిన విధంగా ఆయన ఆ వ్యాపార కలహానికి శాంతియుత పరిష్కారాన్ని అనగా చెరో ప్రదేశం కలిగియుండడాన్ని సూచించాడు. మరియు ఆయన లోతుకే ఆ మొదటి అవకాశమిచ్చాడు. తనకు ఎలాంటి బాధ లేదా విరోధ స్వభావం లేదని నిరూపిస్తూ ఆ తర్వాత అబ్రాహాము లోతు పక్షమున యుద్ధం చేయడానికి వెళ్లాడు.—ఆదికాండము 13:5-12; 14:13-16.

17. ఒక సందర్భంలో పౌలు, బర్నబాలు ఎట్లు విఫలమయ్యారు, అయితే ఆ తర్వాత ఏమి సంభవించింది?

17 పౌలు, బర్నబాలు యిమిడియున్న ఒక సందర్భం నుండి కూడ మనం ఆశానిగ్రహాన్ని గూర్చి నేర్చుకోగలము. ఎన్నో సంవత్సరాలు కలిసి సేవచేసిన తర్వాత వారు మార్కును తమతోకూడ తీసుకెళ్లే విషయంతో విభేదించారు. “వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను.” (అపొస్తలుల కార్యములు 15:39) పరిపక్వ స్థితికి ఎదిగిన ఈ మనుష్యులును ఆ సందర్భంలో తమ భావోద్రేకాలను అదుపులో పెట్టుకోలేకపోయారు, ఇది మనలను హెచ్చరించాలి. వారికే ఇది సంభవించగల్గితే, అది మనకు సంభవించగలదు. అయితే వారు శాశ్వతమైన ఎడబాటు లేదా విరోధ స్వభావం వృద్ధికావడానికి అనుమతించలేదు. వీరిరువురు తమ భావోద్రేకాలను స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ పిమ్మట సమాధానముతో కలిసి సేవచేశారని రికార్డు నిరూపిస్తున్నది.—కొలొస్సయులు 4:10; 2 తిమోతి 4:11.

18. బాధ కల్గినట్లయిన, పూర్ణసిద్ధికి ఎదిగిన క్రైస్తవుడు ఏమిచేయవచ్చును?

18 దేవుని ప్రజల మధ్య బాధాతప్త భావాలు, విరోధ భావాలు సహితం ఉండొచ్చునని మనం ఊహించవచ్చు. అవి హెబ్రీ కాలాల్లో, అపొస్తలుల కాలాల్లో కూడా ఉండెను. మనకాలమందలి యెహోవా సేవకుల మధ్య కూడ అవి సంభవించాయి, ఎందుకంటే మనందరము అసంపూర్ణులము. (యాకోబు 3:2) సహోదరుల మధ్య అటువంటి సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించుకొనుడని యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు. (మత్తయి 5:23-25) అయితే మన ఆశానిగ్రహాన్ని వృద్ధిచేసుకొనుట ద్వారా మొదట్లోనే వాటిని నివారించుట శ్రేష్ఠము. నీ సహోదరుడు లేదా సహోదరి చెప్పిన లేదా చేసిన ఒకానొక చిన్న సంగతి నిన్ను చిన్నబుచ్చితే లేదా అభ్యంతరపెడితే, నీవెందుకు నీ భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకొని, ఆ విషయాన్ని మర్చిపోకూడదు? అతడు తప్పు ఒప్పుకొనే వరకు నీవు తృప్తిపడవన్నట్లు ఆ వ్యక్తిని ఎదుర్కోవాల్సిన అవసరం నిజంగా ఉందా? నిజానికి మీరు మీ భావోద్రేకాల విషయంలో ఎంత అదుపుగా ఉంటున్నారు?

అది సాధ్యమే!

19. మన చర్చ భావోద్రేకాలను అదుపులో పెట్టుకొనుటపై దృష్టినిల్పుట ఎందుకు సరియైయున్నది?

19 ఆశానిగ్రహానికి సంబంధించిన ఒక సంగతిని అనగా మన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకొనుటనే ప్రాథమిక విషయాన్ని పరిశీలించాము. అది కీలకమైన విషయం, ఎందుకంటె మన భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకోలేకపోవడం మన నాలుక, మన లైంగిక ప్రేరణలు, భోజనపు అలవాట్లు, మన జీవితంలో ఆశానిగ్రహం కనబర్చాల్సిన ఇతర అనేక సంగతులపై మనం అదుపు తప్పడానికి నడిపించగలదు. (1 కొరింథీయులు 7:8, 9; యాకోబు 3:5-10) కాని, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీరు ఆశానిగ్రహాన్ని కాపాడుకొనుటలో అభివృద్ధి సాధించగలరు.

20. అభివృద్ధి సాధ్యమే అని మనమెట్లు నిశ్చయత కలిగియుండగలము?

20 యెహోవా మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనమెట్లు అభయం కలిగియుండగలము? ఆశానిగ్రహం ఆయన ఆత్మఫలాల్లో ఒకటైయుంది. (గలతీయులు 5:22, 23) అలా, మనం అర్హులమై, యెహోవా నుండి పరిశుద్ధాత్మ పొంది దాని ఫలాల్ని కనబర్చుటకు మనమెంతగా కృషిచేస్తే, అంత విస్తారంగా ఆశానిగ్రహం గలవారమై యుందుమని అపేక్షించగలము. యేసు యిచ్చిన ఈ అభయాన్ని ఎన్నటికి మర్చిపోవద్దు: “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”—లూకా 11:13; 1 యోహాను 5:14, 15.

21. భవిష్యత్తులో ఆశానిగ్రహం, భావోద్రేకం విషయంలో ఏమి చేయడానికి తీర్మానించుకున్నారు?

21 ఇది సులభమని ఊహించవద్దు. తమ భావోద్రేకాల్ని కళ్లెంవేయని అనగా బహు కోపిష్టులుగా కొందరుంటే, ఆశానిగ్రహాన్ని కనబర్చుటకు ఎన్నటికిని ప్రయత్నించని ప్రజల మధ్య పెరిగిన కొందరికి ఇది కష్టంగా ఉండొచ్చు. అట్టి క్రైస్తవుడు ఆశానిగ్రహం నిలుపుకొని, దానిని నిండుగా చూపడం నిజంగా సవాలే. అయిననూ అది సాధ్యమే. (1 కొరింథీయులు 9:24-27) అంతకంతకు మనం ప్రస్తుత విధానాంతానికి సమీపిస్తుండగా, వత్తిడి, వ్యాకులత ఇంకా పెరుగుతాయి. మనకు ఆశానిగ్రహం తక్కువగా కాదుగాని మరింత ఎక్కువగా ఉండాలి. మీ ఆశానిగ్రహాన్ని గూర్చి మిమ్మల్నిమీరు ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు వృద్ధిచేసుకోవాల్సిన రంగాల్ని మీరు చూస్తే, వాటివిషయమై కృషిసల్పండి. (కీర్తన 139:23, 24) దేవుని ఆత్మకొరకు ఆయనను మరింతగా అడగండి. మీరు ఆశానిగ్రహం నిలుపుకొని, నిండుగా చూపగల్గునట్లు ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేస్తాడు.—2 పేతురు 1:5-8.

ధ్యానించవలసిన అంశాలు

◻ మీ భావోద్రేకాల్ని అదుపులో పెట్టుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?

◻ హామాను, యువొదియ, సుంటుకేల ఉదాహరణల నుండి మీరేమి నేర్చుకున్నారు?

◻ దోషానికి కారణమైనది జరిగితే ఏమిచేయుటకు మీరు యథార్థంగా ప్రయత్నిస్తారు?

◻ ఎలాంటి విరోధభావాన్నైనా విసర్జించుటకు ఆశానిగ్రహం మీకెలా సహాయపడగలదు?

[18వ పేజీలోని చిత్రం]

ఫేలిక్సు, ద్రుసిల్ల యెదుట పౌలు నీతిని గూర్చి ఆశానిగ్రహాన్ని గూర్చి మాట్లాడాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి