అంతకంతకూ జ్ఞానమందు ఎదగండి
“మీ విశ్వాసమునందు . . . జ్ఞానమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5.
1, 2. (ఎ) ఆకాశమువైపు చూచుటనుండి మీరేమి నేర్చుకోగలరు? (రోమీయులు 1:20) (బి) నిజానికి మానవుని జ్ఞానము ఎంత విస్తారంగా వున్నది?
రాత్రిపూట ఆరుబయట, నిర్మలమైన ఆకాశంలో వెన్నెల విరజిమ్మే చంద్రున్ని, అసంఖ్యాకములైన నక్షత్రాల్ని చూసి మీరేం నేర్చుకోగలరు? ఈ సమస్తాన్ని సృష్టించినవాని గూర్చి మీరు ఎంతోకొంత నేర్చుకొనగలరు.—కీర్తన 19:1-6; 69:34.
2 ఆ జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవాలని మీరు కోరితే, మీ ఇంటికప్పు ఎక్కి అక్కడనుండి చూడాలనుకుంటారా? బహుశ మీరలా చేయరు. విజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వాన్ని గూర్చిన జ్ఞానాన్ని నిజంగా అభివృద్ధి చేసుకోలేదని, దానిని సృజించిన వానిని గూర్చి నిశ్చయంగా వారికి చాలాతక్కువ తెలుసనే అంశాన్ని చెప్పడానికి ఆల్బర్ట్ ఐనిస్టీన్ ఒకసారి ఆ దృష్టాంతాన్ని ఉపయోగించాడు.a డా. లూయిస్ థామస్ యిలా వ్రాశాడు: “శతాబ్దాల్లోకెల్లా విజ్ఞానశాస్త్రం అత్యంత గొప్ప ఫలితాలు సాధించిన ఈ కాలంలో విజ్ఞానశాస్త్రం కనుగొన్న ఒకేఒక గొప్ప సంగతేమంటే మనమింకా ఎంతో అజ్ఞానంలో వున్నాము; ప్రకృతిని గూర్చి మనకు తెలిసింది, మనం అర్థంచేసుకుంది చాలా తక్కువ.”
3. ఏ భావమందు విస్తారమైన జ్ఞానార్జనచేత విస్తారమైన దుఃఖము కలుగును?
3 అట్టి జ్ఞానార్జనకు మీ శేషజీవిత సంవత్సరాలన్నీ వెచ్చించినను, జీవితమెంత చిన్నదనే విషయాన్ని మీరు మరెక్కువ గుర్తించవచ్చు, మరియు అసంపూర్ణత, ఈ లోక ‘వక్రస్వభావం’ ద్వారా మానవజ్ఞానం పరిమితం చేయబడిందని మీరు చూడవచ్చు. ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ సొలొమోను యిలా వ్రాశాడు: “విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.” (ప్రసంగి 1:15, 18) అవును, దేవుని సంకల్పాలకు సంబంధంలేని జ్ఞానవివేచనాల్లో సాధారణంగా బాధ, దుఃఖం ఇమిడివుంటాయి.—ప్రసంగి 1:13, 14; 12:12; 1 తిమోతి 6:20.
4. మనమెలాంటి జ్ఞానం సంపాదించాలి?
4 జ్ఞానార్జన యెడల మనం శ్రద్ధచూపకూడదని బైబిలు సిఫారసు చేస్తున్నదా? అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగునుగాక.” (2 పేతురు 3:18) ఆ ఉద్బోధ మనకు అన్వయిస్తున్నట్లుగా, జ్ఞానమందు అభివృద్ధిపొందుడని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం అంగీకరించగలము, అంగీకరించాలి. అయితే ఎలాంటి జ్ఞానము? దానిని మనమెలా వృద్ధిచేసుకోగలము? మరియు మనం నిజంగా అలాచేస్తున్నామా?
5, 6. మనం జ్ఞానం సంపాదించే అవసరతను పేతురు ఎలా నొక్కిచెప్పాడు?
5 ఈ విశ్వ సృష్టికర్తను గూర్చి, యేసును గూర్చి కచ్చితమైన జ్ఞానాన్ని వృద్ధిచేసుకొనవలెననుటే పేతురు రెండవ లేఖలోగల ముఖ్యమైన తలంపు. దాని ఆరంభమందు ఆయనిలా వ్రాశాడు: “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.” (2 పేతురు 1:2, 3) కావున మనం కృప, సమాధానము కలిగియుండుటకు దేవుని గూర్చిన, ఆయన కుమారుని గూర్చిన జ్ఞానము సంపాదించుటను ఆయన ముడిపెట్టుచున్నాడు. అది సమంజసము, ఎందుకంటే సృష్టికర్తయగు యెహోవా నిజమైన జ్ఞానమునకు కేంద్రమై యున్నాడు. దేవునికి భయపడువాడు సరియైన దృక్పథంతో విషయాల్ని చూడగల్గి, యోగ్యమైన తీర్మానాలు చేయగలవాడై యుంటాడు.—సామెతలు 1:7.
6 ఆ పిమ్మట పేతురిలా గట్టిగా ప్రోత్సహిస్తున్నాడు: “మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.” (2 పేతురు 1:5-8)b తర్వాతి అధ్యాయములో, జ్ఞానము సంపాదించుట ప్రజలకు ఇహలోక మాలిన్యము నుండి తప్పించుకోవడానికి సహాయం చేయుటను గూర్చి మనం చదువుతాము. (2 పేతురు 2:20) ఆ విధంగా పేతురు క్రైస్తవులగు వారు అప్పటికే యెహోవాను సేవిస్తున్న వారివలెనే జ్ఞానం సంపాదించవలెనను విషయాన్ని స్పష్టం చేశాడు. అలాంటి వారిలో నీవునూ ఒకడవై యున్నావా?
నేర్చుకుని, పునరుద్ఘాటించి, ఉపయోగించుడి
7. ప్రాథమిక బైబిలు సత్యాల కచ్చితమైన జ్ఞానాన్ని అనేకమంది ఏ విధంగా పొందారు?
7 యెహోవాసాక్షులు చెప్పే వర్తమానమందలి సత్యాన్ని గుర్తించినందున మీరు వారితో బైబిలు పఠనం చేస్తుండవచ్చు. మీరు బహుశ వారానికొకసారి, ఒకగంటపాటు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్నుండి ఒక బైబిలు అంశాన్ని పరిశీలిస్తుండవచ్చును. చాలామంచిదే. యెహోవాసాక్షులతో అలా పఠనం చేసిన అనేకులు కచ్చితమైన జ్ఞానం సంపాదించారు. అయితే, మీరు వ్యక్తిగతంగా నేర్చుకుంటున్న విషయాల జ్ఞానాన్ని వృద్ధిచేసుకొనుటకు మీరేమి చేయగలరు? ఇక్కడ కొన్ని సలహాలు కలవు.c
8. పఠనము కొరకు సిద్ధపడుచుండగా, మరింత నేర్చుకోవడానికి ఒక విద్యార్థి ఏమిచేయవచ్చును?
8 పఠనానికి మీరు ముందుగానే సిద్ధపడుచుండగా, చర్చించనైయున్న విషయాన్ని పరీక్షించండి. అంటే అధ్యాయం పేరును, ఉపశీర్షికల్ని, అంశాన్ని ఉదహరించుటకు ఉపయోగింపబడిన చిత్రాల్ని చూడమని దానిభావం. ఆ పిమ్మట, మీరు పేరాను లేదా ఒక భాగాన్ని చదువునప్పుడు, కీలకమైన తలంపులను, వాటిని బలపర్చే లేఖనాల్ని వెదకి వాటి క్రింద గీతగీయడమో, ఉన్నతపర్చడమో చేయాలి. చర్చించబడిన సత్యాలను మీరు నేర్చుకున్నారో లేదో చూచుటకు, వివిధ పేరాల్లోని ప్రశ్నలకు జవాబులివ్వడానికి ప్రయత్నించండి. దీనిని చేయుటలో, మీ స్వంత మాటల్లో జవాబులివ్వడానికి కృషిచేయండి. చివరగా, ఆ పాఠాన్ని పునఃసమీక్షించి, ముఖ్యాంశాల్ని, వాటిని బలపరచే వాదాల్ని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి.
9. పఠనమును గూర్చిన సలహాలను అన్వయించుట నేర్చుకోవడానికి ఒక వ్యక్తికి ఎలా సహాయపడును?
9 ఈ సలహాల్ని పాటిస్తే జ్ఞానార్జనను మీరు అపేక్షించవచ్చు. ఎందుకు? ఒక కారణమేమంటే, నేర్చుకోవాలనే గాఢమైన కోరికతో, సాగుచేయడానికి సిద్ధపడుతున్నట్టు మీరట్టి అంశాన్ని సమీపిస్తున్నారు. విషయాన్ని గూర్చి ఒక అవగాహనకు వచ్చి, ఆపై ముఖ్యాంశాల్ని, సహేతుకమైన వాక్యాల్ని చూడడం ద్వారా, వివరాలు మూలాంశానికి లేదా ముగింపుకు ఎలా సంబంధం కలిగివున్నాయో మీరు చూస్తారు. చివరగా ఒకసారిచేసే పునఃసమీక్ష మీరు పఠించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మీ బైబిలు పఠనమప్పుడు మీకేది సహాయం చేస్తుంది?
10. (ఎ) వాస్తవాల్ని లేదా క్రొత్త సమాచారాన్ని కేవలం పునరుక్తించుట ఎందుకు పరిమిత విలువను కలిగియున్నది? (బి) “కొంతవిరామం తర్వాత తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునే పద్ధతిలో” ఏమి ఇమిడియున్నది? (సి) పునరుక్తి ద్వారా ఇశ్రాయేలీయుల కుమారులు ఎలా ప్రయోజనం పొందియుండవచ్చు?
10 సమయానుసారమైన, సంకల్పీకృతమైన పునరుక్తి విలువేమిటో విద్యారంగమందున్న నిపుణులకు తెలుసు. ఇది, పాఠశాల్లో కంఠస్థం ద్వారా ఒక పేరును, వాస్తవాన్ని లేదా తలంపును నేర్చుకొనుటకు మీరు ప్రయత్నించినట్టు కేవలం మాటల్ని పదేపదే చెప్పుట కాదు. ఒకసారి కంఠస్థం చేసిన విషయాన్ని త్వరగా మరచిపోతున్నట్టు మీరు కనుగొన్నారా, అంటే అది వేగంగా మీకు జ్ఞాపకం లేకుండా పోతుందా? ఎందుకు? ఒక క్రొత్త పదాన్ని లేదా వాస్తవాన్ని పదేపదే పలకడం విసుగు పుట్టించగలదు, దాని ఫలితం ఎక్కువకాలం నిలువదు. ఆ పరిస్థితి నేది మార్చగలదు? నిజంగా నేర్చుకోవాలనే మీ కోరిక అందుకు సహాయపడగలదు. మరో కీలకమైన విషయమేమంటే, సంకల్పంతోకూడిన పునరుక్తి. ఒక అంశాన్ని నేర్చుకున్న కొన్ని నిమిషాల తర్వాత, మీ జ్ఞాపకాలనుండి అది తొలగిపోకముందే, మీరు నేర్చుకున్న ఆ అంశాన్ని మీకైమీరు గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది “కొంతవిరామం తర్వాత తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునే పద్ధతి” అని పిలువబడింది. మరచిపోకముందే విషయాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకొంటారు. ఇశ్రాయేలీయుల్లో, తండ్రులు తమ పిల్లలకు దేవుని ఆజ్ఞలను అభ్యసింపజేయవలసి యుండిరి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) “అభ్యసింపజేయుట” అనగా పదేపదే చెప్పుటద్వారా బోధించుట అని దానర్థం. బహుశ వారిలో అనేకమంది తలిదండ్రులు తమ పిల్లలకు నియమాల్ని చెప్పేవారు; ఆ తర్వాత అదే వర్తమానాన్ని పునరుక్తించేవారు; ఆ పిమ్మట వారు నేర్చుకున్న విషయాల్ని గూర్చి తమ కుమారులను ప్రశ్నించేవారు.
11. నేర్చుకోవడాన్ని వృద్ధిచేసుకొనుటకు బైబిలు పఠనమప్పుడు ఏమిచేయవచ్చును?
11 సాక్షి ఒకరు మీతో బైబిలు పఠనం చేస్తుంటే, అతడు లేక ఆమె పఠనమప్పుడు ఆయాసమయాల్లో ప్రగతిశీల సారాంశముల ప్రస్తావన ద్వారా నేర్చుకొనుటకు మీకు సహాయపడవచ్చు. ఇది పిల్లల పాఠాలవంటిది కాదు. నేర్చుకోవడాన్ని వర్థిల్లజేసే ఒక నైపుణ్యమై యుంది, కాబట్టి ఆయాసమయాల పునఃసమీక్షలో సంతోషంగా భాగం వహించండి. ఆ తర్వాత, పఠనముగింపునందుండే, చివరి పునఃసమీక్షలో పాల్గొని, మీకు జ్ఞాపకమున్న జవాబులు చెప్పండి. వేరొక వ్యక్తికి బోధించునప్పుడు చేసినట్లే, మీరు మీ స్వంతమాటల్లో అంశాల్ని వివరించండి. (1 పేతురు 3:15) మీరు నేర్చుకున్నది దీర్ఘకాలం జ్ఞాపకం ఉంచుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది.—కీర్తన 119:1, 2, 125; 2 పేతురు 3:1 పోల్చండి.
12. తన జ్ఞాపకశక్తిని వృద్ధిచేసుకొనుటకు విద్యార్థి తానుగా ఏమిచేయవచ్చును?
12 మీకు సహాయంచేసే మరో చర్య ఏమంటే, ఒకటి రెండు రోజుల్లో మీరు నేర్చుకున్న విషయాల్ని వేరొకరితో బహుశ మీ తోటి విద్యార్థికి, తోటి ఉద్యోగికి, లేదా మీ పొరుగువారికి చెప్పడమే. మీరట్టి అంశాన్ని ప్రస్తావించి, దానికి సంబంధించిన కీలకమైన హేతువు లేదా బలపరచే బైబిలు వచనాలు గుర్తు తెచ్చుకొనగలనేమో చూస్తున్నానని మీరనవచ్చు. అది ఆ వ్యక్తి ఆసక్తిని రేకెత్తించవచ్చు. అదలా చేయకపోయినను, ఒకటి రెండు రోజుల విరామం తర్వాత అట్టి క్రొత్త సమాచారాన్ని మరలా గుర్తుతెచ్చుకోవడం మీ మదిలో దానిని స్థిరంగా నిలుపుతుంది. అప్పుడు మీరు 2 పేతురు 3:18 ఉద్బోధించినట్లుగా చేయుచు నిజంగా నేర్చుకున్నవారై యుంటారు.
చురుకుగా నేర్చుకొనుట
13, 14. సమాచారాన్ని కేవలం సంపాదించి, గుర్తుపెట్టుకొనుటకంటే ఎక్కువ చేయుటకు మనమెందుకు కోరుకోవాలి?
13 నేర్చుకొనుట అంటే కేవలం వాస్తవాలు తెలుసుకొనుట లేదా గుర్తుతెచ్చుకొనగల్గుటకంటె ఎక్కువైయుంది. యేసు కాలమందలి మతప్రజలు పదేపదే వల్లించు ప్రార్థనలతో అలానే చేశారు. (మత్తయి 6:5-7) అయితే వారిపై ఆ సమాచారం ఎట్టి ప్రభావం చూపింది? వారు నీతిఫలాలు ఫలిస్తూవుండిరా? ఎంతమాత్రం లేదు. (మత్తయి 7:15-17; లూకా 3:7, 8) సమస్యేమంటే జ్ఞానము వారి హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి మేలుచేయునట్లు వారిపై ప్రభావం చూపలేదు.
14 పేతురు చెప్పిన ప్రకారం, ఆ కాలమందలి, ఇప్పటి క్రైస్తవుల విషయంలో అది భిన్నంగావుండాలి. క్రియాశూన్యులుగా లేదా నిష్ఫలులుగా ఉండకుండా మనకు సహాయపడు జ్ఞానాన్ని మన విశ్వాసానికి అమర్చవలెనని ఆయన మనకు ఉద్బోధించాడు. (2 పేతురు 1:5, 8) ఇది మన విషయంలో నిజమై యుండాలంటే, జ్ఞానమందు ఎదగాలని, హృదయాంతరంగాలను స్పర్శిస్తూ అది మనపై ప్రభావం చూపాలని మనం కోరుకోవాలి. అదలా అన్ని సమయాల్లో జరుగకపోవచ్చు.
15. కొంతమంది హెబ్రీ క్రైస్తవుల విషయంలో ఎటువంటి సమస్య తలెత్తింది?
15 ఈ విషయంలో పౌలు కాలమందలి హెబ్రీ క్రైస్తవులకు సమస్యవుండెను. యూదులుగా వారికి లేఖనములను గూర్చిన కొంత జ్ఞానముండేది. వారికి యెహోవా ఎవరో, ఆయన నియమాలు కొన్ని తెలుసు. ఆ తర్వాత వారు అదనంగా మెస్సీయను గూర్చిన జ్ఞానం పొంది, విశ్వసించి క్రైస్తవులుగా బాప్తిస్మం పొందారు. (అపొస్తలుల కార్యములు 2:22, 37-41; 8:26-36) అనేక నెలలు, సంవత్సరాలపాటు వారు క్రైస్తవ కూటాలకు హాజరగుతూ, అక్కడ లేఖనాల్ని చదవడంలో, వ్యాఖ్యానించడంలో భాగం వహించగల్గుతూ ఉండేవారు. అయినప్పటికిని వారిలో కొందరు జ్ఞానమందు ఎదుగలేదు. పౌలు యిలా వ్రాశాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.” (హెబ్రీయులు 5:12) అదెలా కాగలదు? మనకు కూడా అలా జరుగవచ్చునా?
16. శాశ్వతంగా గడ్డకట్టిన నేల అనగానేమి, మొక్కలపై దాని ప్రభావమెలా ఉంటుంది?
16 దృష్టాంతమునకు, సగటు ఉష్ణోగ్రత సున్నకంటే తక్కువ డిగ్రీలువుండే అర్కిటిక్, మరితర ప్రాంతాల్లో పూర్తిగా, శాశ్వతంగా గడ్డకట్టిన నేల ప్రదేశాల్నే తీసుకోండి. మట్టి, రాళ్లు, నీరు అన్నీ కలిసి ఒకపెద్ద మంచు దిబ్బగా, కొన్నిసార్లు 900 మీటర్ల లోతువరకు గట్టిగా గడ్డకట్టిపోతుంది. వేసవిలో, పైపై మంచు (చురుకైన పొర అనబడే ఈ మంచు) కరుగుతుంది. అయితే, క్రింద శాశ్వతంగా గడ్డకట్టిన నేలలో తేమ ఇంకని కారణంగా కరిగిన ఈ పల్చని మంచుపొర సాధారణంగా చిత్తడిగా ఉంటుంది. ఆ పల్చని మంచుపొరలో పెరిగిన మొక్కలు తరచు చిన్నవిగా లేదా ఎదగనివిగా ఉంటాయి; వాటి వేర్లు క్రింద శాశ్వతంగా గడ్డకట్టిన మంచులోనికి చొచ్చుకొనిపోలేవు. ‘నేను బైబిలు జ్ఞానమందు ఎదుగుచున్నానా లేదానేది శాశ్వతంగా గడ్డకట్టిన ఈ మంచుకు ఏమి సంబంధము?’ అని మీరు ఆలోచించవచ్చు.
17, 18. కొంతమంది హెబ్రీ క్రైస్తవుల్లో వృద్ధియైన దానిని ఉదహరించుటకు శాశ్వతంగా గడ్డకట్టిన మంచును దానిపైనుండే చురుకైన పొరను ఎలా ఉపయోగించవచ్చును?
17 చురుకుగా జ్ఞానం సంపాదించి, గుర్తుపెట్టుకొని, అట్టి కచ్చితమైన జ్ఞానాన్ని ఉపయోగించేలా మానసిక శక్తిని ఉపయోగించని వారి పరిస్థితిని అలా శాశ్వతంగా గడ్డకట్టిన నేల చక్కగా ఉదహరిస్తున్నది. (మత్తయి 13:5, 20, 21 పోల్చండి.) బైబిలు సత్యంతోసహా వివిధ అంశములను నేర్చుకునే మానసిక సామర్థ్యం ఒకవ్యక్తికి ఉండవచ్చు. ఆయన హెబ్రీ క్రైస్తవుల వలెనే “దేవోక్తులలో మొదటి మూలపాఠములను” పఠించి, బాప్తిస్మము కొరకు అర్హత పొందాడు. అయితే అతడు “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము” కంటే మిన్నగా ‘సంపూర్ణుడగుటకు’ ముందుకు సాగకపోవచ్చు.—హెబ్రీయులు 5:12; 6:1.
18 అట్టి క్రైస్తవులు కొందరు కూటములకు హాజరుకావడాన్ని దృశ్యీకరించుకొనండి. వారు హాజరై మెలకువగా ఉన్నారు, అయితే వారి మనస్సులు నేర్చుకోవడంలో ఇమిడివున్నాయా? వారు చురుకుగా, యథార్థంగా జ్ఞానమందు ఎదుగుచున్నారా? బహుశ వారట్లుండ లేదు. పూర్ణసిద్ధికి ఎదగని అట్టి వారు కూటాల్లో ఇమిడివుండుట శాశ్వతంగా గడ్డకట్టిన మంచు మీదగల చిత్తడిలో వేర్లూనుటగా ఉండెను. మరింత పటిష్ఠమైన లేదా సంశ్లిష్టమైన సత్యాలనే వేర్లు శాశ్వతంగా గడ్డకట్టిన మంచువంటి మానసిక ప్రదేశంలో చొచ్చుకొనిపోవు.—యెషయా 40:24 పోల్చండి.
19. ఏ విధముగా అనుభవంగల ఒక క్రైస్తవుడు నేడు ఆ హెబ్రీ క్రైస్తవులవలెనే తయారుకాగలడు?
19 నేడు క్రైస్తవుని విషయం కూడ అదేవిధంగా ఉండగలదు. కూటములకు హాజరైనప్పుడు అతడు ఆ సమయాల్ని జ్ఞానాభివృద్ధికి ఉపయోగించకపోవచ్చును. వాటిలో చురుకుగా పాల్గొను విషయమేమిటి? క్రొత్తవారు లేదా యౌవనులు ముందుకువచ్చి ఒక లేఖనం చదవడానికి లేదా పేరాలోని పదాలను బట్టి వ్యాఖ్యానించడానికి కొంత కృషి అవసరం, అది అతని సామర్థ్యానికి చక్కని, మెచ్చుకోదగిన అభ్యాసానికి అద్దం పడుతుంది. అయితే పౌలు ఎంతోకాలంగా క్రైస్తవులుగా ఉన్న ఇతరులను చూపిస్తున్నాడు, వారు ఎడతెగక జ్ఞానమందు ఎదగాలని ఇచ్ఛయిస్తే భాగం వహించడంలో ప్రాథమిక స్థాయినుండి వారు ఇంకెంతో పురోభివృద్ధి సాధించిన వారైయుండాలి.—హెబ్రీయులు 5:14.
20. మనలో ప్రతి ఒక్కరము ఏ స్వయం విశ్లేషణ చేసుకోవాలి?
20 అనుభవంగల ఒక క్రైస్తవుడు కేవలం బైబిలు వచనం చదవడం లేదా తిన్నగా పేరాలోని విషయాన్నే చెప్పడంకంటే ఎక్కువ అభివృద్ధి చెందలేదంటే, అతడు బహుశ “చురుకైన పొర” అనబడే తన మనస్సునుండి పైపైనే భాగం వహిస్తుంటాడు. మన దృష్టాంతమందలి శాశ్వతంగా గడ్డకట్టిన మంచు ప్రదేశాన్నిపోలి అతడెన్ని కూటములకు హాజరైనను, అతని మానసిక సామర్థ్యములు శాశ్వతంగా గడ్డకట్టిన మంచులోనే నిలిచిపోతాయి. మనల్నిమనం యిలా ప్రశ్నించుకోవాలి: ‘నా విషయం అలానేవుందా? నాలో ఒకవిధంగా శాశ్వతంగా గడ్డకట్టిన మంచువంటి మానసిక పరిస్థితిని అనుమతించానా? నేర్చుకోవడంలో నేను మానసికంగా ఎంత చురుకుగా, శ్రద్ధగా ఉన్నాను?’ మన యథార్థమైన జవాబులతో మనకు ఇబ్బంది లేకపోయిననూ, జ్ఞానమందు ఎదుగుటకు మనమిప్పుడే చర్యలు తీసికొన నారంభించగలము.
21. కూటాలకు సిద్ధపడుటకు లేదా హాజరగుటకు ముందు చర్చించిన ఏ విషయాల్ని మీరు అన్వయించగలరు?
21 వ్యక్తిగతంగా మనం 8వ పేరాలోని సలహాలను అన్వయించగలము. సంఘంతో ఎంతకాలం సహవసించిననూ, పూర్ణసిద్ధికి ఎదుగుటకు, మరియెక్కువ జ్ఞానము సంపాదించుటకు మనం తీర్మానించుకోగలము. అంటే మరింత పట్టుదలతో, బహుశ అనేక సంవత్సరాల క్రితం తామనుసరించిన అయితే క్రమేపి కుంటుపడిన తమ అలవాట్లను ఉజ్జీవింపజేసుకుని పట్టుదలతో కూటములకు సిద్ధపడుటని కొందరికి దీనిభావము. మీరు సిద్ధపడుచుండగా, కీలక విషయాల్ని, సహేతుకత్వాన్ని వృద్ధిచేయడానికి ఉపయోగించబడిన అపరిచిత లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి తీర్మానించ ప్రయత్నించండి. పఠన శీర్షికలో ఏదైనా క్రొత్తవిధానం లేదా ఆకృతి కొరకు చూడండి. అదేప్రకారం, కూటాల్లో 10, 11 పేరాల్లో ప్రస్తావించబడిన సూచనలను మీకైమీరు అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. మెదడుకు మంచి పని అన్నట్లు, మానసికంగా చురుకుగా ఉండటానికి కృషిచేయండి. “శాశ్వతంగా గడ్డకట్టిన మంచుకు” కారణమయ్యే ఎటువంటి స్వభావాన్నైనా అది ఎదుర్కొంటుంది, ఆలాగే మనఃపూర్వకంగా చేసే ఈ ప్రయత్నం గతంలో బహుశ వృద్ధియైన ఎలాంటి “గడ్డకట్టే” స్థితినైననూ కరిగించివేస్తుంది.—సామెతలు 8:12, 32-34.
జ్ఞానము, సఫలతకు ఒక సహాయకము
22. జ్ఞానాభివృద్ధికై పనిచేసినట్లయిన మనమెట్లు ప్రయోజనం పొందుతాము?
22 మన ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, జ్ఞానమందు ఎదిగే ఈ విషయంలో పనిచేస్తే, మనమెలా వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతాము? మన మానసిక శక్తులను చురుకుగా ఉంచుటకు కృషిచేయడం, జ్ఞానార్జనకు సిద్ధంగా ఉండటం ద్వారా క్రొత్త మరియు మరింత సంశ్లిష్టమైన బైబిలు సత్యాలనే విత్తనాల వేర్లు లోతుగా నాటుకుంటాయి, అందువల్ల మన అవగాహన పెరిగి, శాశ్వతంగా నిలిచిపోతుంది. హృదయాల్ని గూర్చి యేసుచెప్పిన మరో ఉపమానానికిది పోలివుంది. (లూకా 8:5-12) మంచి నేలలో పడే విత్తనాలు ఫలించి అభివృద్ధిచెందే వృక్షాలకు ఊతమిచ్చే బలమైన వేర్లతో పెరుగగలవు.—మత్తయి 13:8, 23.
23. రెండవ పేతురు 3:18ని మన హృదయానికి తీసుకున్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? (కొలొస్సయులు 1:9-12)
23 యేసుచెప్పిన దృష్టాంతము కాస్త భిన్నంగా ఉన్ననూ, మంచి ఫలితాలు పేతురు వాగ్దానంచేసిన దానికి పోలివున్నాయి: “ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును . . . అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.” (2 పేతురు 1:5-8) అవును, జ్ఞానమందు ఎదుగుట ఫలవంతముగా ఉండుటకు మనకు సహాయం చేస్తుంది. మరింత జ్ఞానం సంపాదించుట మరియెక్కువ ఆనందదాయకమని మనం కనుగొంటాము. (సామెతలు 2:2-5) మీరు నేర్చుకొనేది మీకు గుర్తుంటుంది, శిష్యులగుటకు ఇతరులకు బోధించేటప్పుడు మీకదెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడ, మీరు మరింత ఫలవంతులుగా, దేవునికి ఆయన కుమారునికి మహిమ తెచ్చేవారిగా ఉంటారు. పేతురు తన రెండవ లేఖను యిలా ముగించాడు: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక.”—2 పేతురు 3:18.
[అధస్సూచీలు]
a “[చంద్రున్ని] గూర్చి ఎక్కువ తెలుసుకోవాలనే శ్రద్ధగల వ్యక్తి, ఆ జ్యోతిని దగ్గరగా చూద్దామని తన యింటి పైకప్పు ఎక్కి తెలుసుకున్న దానికి వృద్ధిచెందిన మన జ్ఞానం పోలియున్నది.
b ఈ వచనమందలి విశ్వాసము, సద్గుణమనే ఈ రెండు లక్షణాలు, మా జూలై 15, 1993 సంచికలో చర్చించబడ్డాయి.
c ఈ సలహాలు దీర్ఘకాలంగా క్రైస్తవులుగా వున్నవారికి కూడ తమ వ్యక్తిగత పఠనమందు, కూటములకు సిద్ధపడునప్పుడు సహాయం చేయగలవు.
గుర్తుతెచ్చుకోగలరా?
◻ జ్ఞానం వృద్ధిచేసుకొనుటయందు మీరెందుకు శ్రద్ధకలిగి ఉండాలి?
◻ ఒక క్రొత్త బైబిలు విద్యార్థి తన పఠనమునుండి ఎలా ఎక్కువ ప్రయోజనం పొందగలడు?
◻ శాశ్వతంగా గడ్డకట్టిన నేల ఉదహరించినట్లుగా, ఏ అపాయాన్ని తప్పించుకోవడానికి మనం కోరుకుంటాము?
◻ జ్ఞానం వృద్ధిచేసుకునే మీ సామర్థ్యాన్ని పెంచుకొనుటకు మీరెందుకు తీర్మానించుకున్నవారై యుండాలి?
[15వ పేజీలోని చిత్రం]
శాశ్వతంగా గడ్డకట్టిన నేలవంటి మానసిక సమస్య నాకు ఉందా?