ఈ భోజనము మీకు భావము కలిగియుండగలదా?
నిండు పున్నమి రోజు, ఆ ప్రాంతమంతా చల్లని వెన్నెలతో నిండివుంది. పురాతన యెరూషలేములోని ఒక మేడగదిలో 12 మంది పురుషులు బల్లచుట్టూ కూర్చొనివున్నారు. వారి బోధకుడు అత్యంత ప్రాధాన్యతగల ఒక ఆచరణను ప్రారంభిస్తూ, గొప్ప భావంగల మాటలను పలుకుతుండగా పదకొండుమంది ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఒక వృత్తాంతము దానిని వర్ణించిన విధము ఇలా ఉంది:
“యేసు [క్రీస్తు] ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—‘మీరు తీసికొని తినుడి; ఇది నా శరీర’మని చెప్పెను. మరియు ఆయన గిన్నె, పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకొరకు చిందింపబడుచున్న “నిబంధన రక్తము.” నా తండ్రి రాజ్యములో మీతోకూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.”—మత్తయి 26:26-30.
మన సామాన్యశకము 33వ సంవత్సరము యూదుల నీసాను నెల 14వ దినమున ఈ సంఘటన జరిగింది. యేసు ఆయన అపొస్తలులు అప్పుడే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వములోనుండి సా.శ.పూ. 16వ శతాబ్దములో విడుదలై వచ్చిన దానికి జ్ఞాపకార్థముగా పస్కాను ఆచరించారు. ఆయనను అప్పగించబోతున్న యూదా ఇస్కరియోతును క్రీస్తు బయటకు పంపించాడు. అందుకే యేసు ఆయన 11 మంది అపొస్తలులు మాత్రమే ఉన్నారు.
ఈ రాత్రిభోజనము యూదా పస్కాలో ఓ భాగంగా ఆచరింపబడుట లేదు. ఇది కొత్తదైయుండి ప్రభువు రాత్రిభోజనమని పిలువబడింది. ఈ ఆచరణ విషయంలో తన అనుచరులకు యేసు, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయు”డి అని ఆజ్ఞాపించెను. (లూకా 22:19, 20; 1 కొరింథీయులు 11:24-26) ఆయన దీనిని ఎందుకు చెప్పాడు? శతాబ్దముల కాలమునాటి ఈ సంఘటన నీ కెట్లు ఒక భావాన్ని కలిగి యుండగలదు?