వారు యెహోవా చిత్తాన్ని చేశారు
యేసు వీడ్కోలు మాటలను లక్ష్యపెట్టడం
సా.శ. 33, నీసాను 14 సాయంకాల సమయమున, యెరూషలేములోని ఓ మేడగదిలో యేసూ ఆయన నమ్మకమైన 11 మంది అపొస్తలులు ఒక బల్లవద్ద ఒరిగి ఉన్నారు. తన మరణం సమీపంలో ఉందని తెలిసి, ఆయన వారితో ఇలా అన్నాడు: “యింక కొంతకాలము మీతోకూడ ఉందును.” (యోహాను 13:33) నిజానికి, యేసు చంపబడాలని కోరుకుంటున్న దుష్ట వ్యక్తులతో కుట్ర చేయడానికి అప్పటికే ఇస్కరియోతు యూదా బయలుదేరాడు.
ఆ మేడగదిలో ఉన్నవారిలో ఎవ్వరూ యేసు గ్రహించినంతకన్న ఎక్కువగా పరిస్థితియొక్క అత్యవసరతను గ్రహించలేదు. తాను బాధననుభవించబోతున్నాడని ఆయనకు బాగా తెలుసు. తన అపొస్తలులు తనను అదే రాత్రి విడిచిపెడతారని కూడా యేసుకు తెలుసు. (మత్తయి 26:31; జెకర్యా 13:7) తన మరణానికి ముందు తన అపొస్తలులతో మాట్లాడేందుకు యేసుకు ఇదే ఆఖరి అవకాశం గనుక, ఆయన వీడ్కోలు మాటలు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలపై కేంద్రీకరించబడ్డాయని మనం నిశ్చయతను కలిగియుండవచ్చు.
‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి’
తన నమ్మకమైన అపొస్తలులతో, యూదా పస్కా స్థానంలో రాబోయే ఒక క్రొత్త ఆచరణను యేసు ఆరంభించాడు. అపొస్తలుడైన పౌలు దానిని “ప్రభువు రాత్రి భోజనము” అని పిలిచాడు. (1 కొరింథీయులు 11:20) యేసు ఒక పులియని రొట్టెను తీసుకుని, ప్రార్థన చేశాడు. తరువాత ఆయన రొట్టెను విరిచి దానిని తన అపొస్తలులకు ఇచ్చాడు. “మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని” ఆయన చెప్పాడు. తరువాత ఆయన ఒక ద్రాక్షారసపు గిన్నె తీసుకొని, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేసి అపొస్తలులకు ఇచ్చి ఇలా అన్నాడు: “దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.”—మత్తయి 26:26-28.
ఈ సంఘటనయొక్క ప్రాముఖ్యత ఏమిటి? యేసు సూచించినట్లుగా, రొట్టె ఆయన పాపరహిత శరీరానికి ప్రాతినిధ్యం వహించింది. (హెబ్రీయులు 7:26; 1 పేతురు 2:22, 24) ద్రాక్షారసం, పాప క్షమాపణను సాధ్యపరిచే యేసు చిందించిన రక్తాన్ని సూచించింది. ఆయన బలి రక్తం యెహోవా దేవునికి, తుదకు యేసుతో పరలోకంలో పరిపాలించే 1,44,000 మంది మానవులకు మధ్య క్రొత్త నిబంధన చెల్లేటట్లు చేస్తుంది. (హెబ్రీయులు 9:14; 12:22-24; ప్రకటన 14:1) ఈ భోజనంలో పాల్గొనమని యేసు తన అపొస్తలులను ఆహ్వానించడం ద్వారా, వారు పరలోక రాజ్యంలో తనతో భాగం వహిస్తారని సూచించాడు.
ఈ జ్ఞాపకార్ధ భోజనం గురించి యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’ (లూకా 22:19) అవును, పస్కా పండుగ వలెనే ప్రభువు రాత్రి భోజనము, ఒక వార్షిక సంఘటనయైయుంటుంది. పస్కా పండుగ ఐగుప్తులోని బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదలకు స్మారకంగా ఉండగా, ప్రభువు రాత్రి భోజనము ఇంకా గొప్ప విడుదలపై—పాప మరణాల దాసత్వంనుండి విముక్తిపొందదగిన మానవజాతి యొక్క విడుదలపై కేంద్రీకరిస్తుంది. (1 కొరింథీయులు 5:7; ఎఫెసీయులు 1:7) అంతేగాక, సూచనార్థక రొట్టె, ద్రాక్షారసంలో పాలుపంచుకొనేవారు, రాజులుగా యాజకులుగా తమ భవిష్యత్ ఆధిక్యతల గురించి జ్ఞప్తికి తేబడతారు.—ప్రకటన 20:6.
మానవ చరిత్రలో యేసు క్రీస్తు మరణం నిజంగా అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనయైయుండెను. యేసు చేసినదానిని మెచ్చుకునేవారు ప్రభువు రాత్రి భోజనము గూర్చి ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటిస్తారు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’ యెహోవాసాక్షులు యేసు మరణాన్ని ప్రతి సంవత్సరము నీసాను 14కు సరిసమానమైన తేదీన ఆచరిస్తారు. 1996లో ఈ దినం ఏప్రిల్ 2న సూర్యాస్తమయం తరువాత వస్తుంది. మీ ప్రాంతంలోవున్న రాజ్యమందిరంలో హాజరుకమ్మని మీరు హృదయపూర్వకంగా ఆహ్వానింపబడుతున్నారు.
‘నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను’
ప్రభువు రాత్రి భోజనాన్ని ఆరంభించడమే కాక, యేసు తన అపొస్తలులకు కొంత వీడ్కోలు సలహాను ఇచ్చాడు. ఈ మనుష్యులు మంచి శిక్షణపొందినప్పటికీ వారు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. వారు యేసు ఎడల, తమ ఎడల, లేక భవిష్యత్తు ఎడల దేవునికిగల సంకల్పమేమిటో పూర్తిగా గ్రహించలేదు. కానీ ఈ సమయంలో యేసు వారికి ఈ విషయాలన్నింటినీ స్పష్టంచేయడానికి ప్రయత్నించలేదు. (యోహాను 14:26; 16:12, 13) బదులుగా, ఆయన అతి ప్రాముఖ్యమైన విషయాన్నిగూర్చి మాట్లాడాడు. “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను” అని ఆయన అన్నాడు. తరువాత యేసు ఇలా జతచేశాడు: ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’—యోహాను 13:34, 35.
ఇది ఏ విధంగా “క్రొత్త ఆజ్ఞ” అయ్యుండింది? సరే, మోషే ధర్మశాస్త్రం ఇలా ఆజ్ఞాపించింది: “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను.” (లేవీయకాండము 19:18) అయితే, తోటి క్రైస్తవుల కొరకు జీవితాన్నిచ్చేంతటి స్వయం-త్యాగపూరిత ప్రేమను చూపించాలని యేసు తన అనుచరులను కోరాడు. నిజమే, ‘ప్రేమ నియమము’ తక్కువ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వర్తిస్తుంది. యేసు క్రీస్తు అనుచరుడు అన్ని పరిస్థితుల్లోను, ఆత్మీయంగాను లేక ఇతర విధాల్లోను ఇతరులకు సహాయం చేయడంద్వారా ప్రేమను కనపరచడానికి చొరవ తీసుకుంటాడు.—గలతీయులు 6:10.
యేసు భూ జీవితంలోని ఈ చివరి రాత్రి, ప్రేమ తన శిష్యుల పక్షాన యెహోవా దేవునికి ప్రార్థన చేయడానికి యేసును పురికొల్పింది. ఆయన చేసిన ప్రార్థనలో కొంత భాగం ఇలా ఉంది: “వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.” (యోహాను 17:11) తన తండ్రికి చేసిన ఈ విజ్ఞాపనలో, యేసు తన అనుచరుల ప్రేమపూర్వకమైన ఐక్యత కొరకు ప్రార్థన చేశాడన్నది గమనార్హమైనది. (యోహాను 17:20-23) ‘యేసు వారిని ప్రేమించినట్లే వారు ఒకరినొకరు ప్రేమించవలసిన’ అవసరం ఉంది.—యోహాను 15:12.
నమ్మకమైన అపొస్తలులు యేసు వీడ్కోలు మాటలను లక్ష్యపెట్టారు. మనం కూడా ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ అపాయకరమైన “అంత్యదినములలో” సత్యారాధికుల మధ్య ప్రేమ, ఐక్యత ఇంతకుముందెన్నటి కన్నా చాలా ప్రాముఖ్యము. (2 తిమోతి 3:1) వాస్తవానికి, నిజ క్రైస్తవులు యేసు ఆజ్ఞలకు విధేయులై సహోదర ప్రేమను ప్రదర్శిస్తారు. ఇందులో ప్రభువు రాత్రి భోజనమును ఆచరించాలన్న ఆయన ఆజ్ఞకు విధేయులు కావడం ఇమిడివుంది.