దేవుని సేవించడంలో నేను తృప్తిపొందాను
జాషువా టాంగ్వానా చెప్పింది
వెనుకటికి 1942లో, నేను చాలా కలత చెందాను. వాచ్‌టవర్ సొసైటి మరియు సెవెంత్ డే ఎడ్వెంటిస్టులు ప్రచురించిన సాహిత్యాలను చదువుతుండేవాన్ని. ప్రాచీన ఇశ్రాయేలీయుల వలెనే, నేనునూ “రెండు తలంపుల మధ్య తడబడుతూ” ఉంటిని.—1 రాజులు 18:21.
నాకు “వాయిస్ ఆఫ్ ప్రాఫసి” అని పిలువబడే అచ్చువేసిన ప్రసంగాలను సెవెంత్ డే ఎడ్వెంటిస్టులు పంపించేవారు. వారి ప్రశ్నలకు సమాధానమివ్వడంలో నేనెంతో ఆనందించాను, మరియు ఒకవేళ నేను అన్ని పరీక్షలలో విజయం సాధించితే నాకు ఒక మంచి యోగ్యతాపత్రాన్నిస్తామని వారు వాగ్దానం చేశారు. కాని నేను గుర్తించిందేమంటే “వాయిస్ ఆఫ్ ప్రాఫసి,” మరియు వాచ్‌టవర్ సొసైటి ప్రచురణలు రెండూకూడ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ అనే నగరం నుండే పంపబడేవి. ‘ఈ రెండు సంస్థలూ ఒకదానికొకటి పరిచయంకలవా? వారి బోధలు ఒకదానితోనొకటి పొత్తుకలవా? లేనట్లయితే, ఎవరిది సత్యము?’ అని నేను ఆలోచించాను.
ఈ విషయాన్ని పరిష్కరించడానికి, నేను రెండు సంస్థలకు ఒకేవిధమైన ఉత్తరాలు పంపాను. ఉదాహరణకు, వాచ్‌టవర్ సొసైటికి ఈ విధంగా వ్రాశాను: “మీకు ‘వాయిస్ ఆఫ్ ప్రాఫసి’ సభ్యులు తెలుసా, ఒకవేళ తెలిస్తే వారి బోధలను గూర్చి మీరేం చెబుతారు?” తగిన సమయంలోనే, రెండు వర్గాలనుండి సమాధానం పొందాను. “వాయిస్ ఆఫ్ ప్రాఫసి” గురించి తెలుసని వాచ్‌టవర్ సొసైటినుండి వచ్చిన ఉత్తరం తెలియజేసింది, అయితే త్రిత్వము, క్రీస్తు శరీరంతో భూమికి తిరిగి రావడం వంటి వారి బోధలు లేఖనానుసారమైనవి కావని వివరించింది. ఈ మతసిద్ధాంతాలు అసత్యాలని నిరూపించే లేఖనాల్ని కూడా వారి ఉత్తరంలో చేర్చారు.—యోహాను 14:19, 28.
అయితే “వాచ్‌టవర్ సొసైటి సభ్యులు” తెలుసుగాని, వారి బోధలతో అంగీకరించము అని మాత్రమే “వాయిస్ ఆఫ్ ప్రాఫసి” నుండి వచ్చిన ఉత్తరం వివరించింది. ఏవిధమైన కారణాలు కూడ ఇవ్వలేదు. యెహోవాసాక్షులు నడిపించే చట్టబద్దమైన సంస్థయైన వాచ్‌టవర్ సొసైటికి అనుకూలంగా ఉండడానికి నేను నిర్ణయించుకున్నాను. యెహోవాసాక్షులతో 50 సంవత్సరాలు సహవసించిన తర్వాత అట్టి నిర్ణయం తీసుకున్నందుకు ఈనాడు నేనెంత ధన్యుడనో!
మతసంబంధమైన చరిత్ర
దక్షిణాఫ్రికాలోని పీటర్స్‌బర్గ్ పట్టణానికి తూర్పునవున్న మాకాన్యె అనే గ్రామప్రాంతంలో 1912లో నేను జన్మించాను. ఆ కాలంలో మాకాన్యె ఆంగ్లికన్ చర్చి ఆధీనంలో ఉంది కాబట్టి, నేను ఆ చర్చి సభ్యుడనయ్యాను. నాకు పదిసంవత్సరాలున్నప్పుడు, లూథరన్ బెర్లిన్ మిషన్ చర్చి ఆధ్వర్యంలోనున్న ప్రదేశానికి మా కుటుంబం వెళ్లినప్పుడు నా తలిదండ్రులు ఆ చర్చిసభ్యులయ్యారు. తొందరలోనే నేను కమ్యూనియన్ సర్వీసుకు హాజరవ్వడానికి, రొట్టె ద్రాక్షారసం తీసుకోడానికి యోగ్యత సంపాదించుకున్నానేగాని, అది నా ఆత్మీయావసరతలను తీర్చలేదు.
ఎనిమిది సంవత్సరాలు పాఠశాలలో గడిపిన పిమ్మట నేను నాతండ్రి ద్వారా కీల్‌నర్టన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్‌కు పంపబడి, 1935లో, టీచర్‌గా యోగ్యత పొందడానికి మూడు సంవత్సరాల కోర్సు తర్వాత యివ్వబడే టీచర్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నాను. కారోలిన్ అనే యౌవన స్త్రీ, నాతో పనిచేసిన టీచర్లలో ఒకరు. మేమిద్దరం వివాహం చేసుకున్నాం, తర్వాత కారోలిన్ ఆడపిల్లను ప్రసవించగా, ఆమెకు డామారిస్ అని పేరు పెట్టుకున్నాం. నేను కొన్ని సంవత్సరాల తర్వాత, మామాట్చ అను గ్రామప్రాంతంలోని సెత్లాల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడనయ్యాను. ఆ పాఠశాల డచ్ రిఫార్మడ్ చర్చిచే నడిపించబడ్డంవల్ల మేము ఆ చర్చిలోచేరి, సేవలకు క్రమంగా హాజరయ్యేవాళ్లం. మేమలా చేసింది కేవలం అది అందరూ చేస్తున్నారు గనుకనే, కాని ఇది కూడా నాకు సంతృప్తినివ్వలేదు.
ఒక మలుపు
ఒక ఆదివారం 1942లో, మేము చర్చిలో పాటలు ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శ్వేతజాతి యౌవనుడొకడు వాచ్‌టవర్ సంస్థ ప్రచురించిన—క్రియేషన్, విండికేషన్, ప్రిపరేషన్ అను మూడు పుస్తకాలతో తలుపు దగ్గర కన్పించాడు. ఆ పుస్తకాలు నా లైబ్రరీషెల్ఫ్‌లో మంచిగా వుంటాయనుకున్నాను, కాబట్టి మూడు రూపాయిలకు వాటినంగీరించాను. ఆ వ్యక్తి యెహోవాసాక్షులలో ఒకడైన టీనీ బాసడన్హాట్ అని తర్వాత తెలుసుకున్నాను. ఆ ప్రాంతంలో ఆయనొక్కడు మాత్రమే. టీనీ తన తర్వాతి సందర్శనంలో, గ్రామఫోను తీసుకువచ్చి జడ్జి రూథర్‌ఫర్డ్ యిచ్చిన ప్రసంగాలను వినిపించాడు. “స్నేర్ అండ్ రాకెట్” అనే ప్రసంగాన్ని నేను చాలా ఆనందించాను, అయితే కారోలిన్‌కు మరియు మాతోపాటు వుంటున్న నా చెల్లి ప్రిసిల్లాకు మాత్రం నచ్చలేదు. టీనీ తన మూడవ సందర్శనలో, నేను రికార్డులను స్నేహితులకు వినిపించడానికి గ్రామఫోను ఇచ్చాడు.
ఒకరోజు నేను క్రియేషన్ పుస్తకంలోని పేజీలన్నీ పరిశీలించి, “మృతులెక్కడ వున్నారు?” అనే అధ్యాయాన్ని చూశాను. మనల్ని విడిచిపోయిన ఆత్మలు పరలోకంలో అనుభవించే ఆనందాల్ని గూర్చి నేర్చుకోవాలనే ఆశతో చదవడం మొదలు పెట్టాను. కాని నా ఊహలకు విరుద్ధంగా, మృతులు వారి సమాధుల్లోనే ఉన్నారనీ, వారేమీ యెరుగరని ఆ పుస్తకం వివరించింది. దాన్ని బలపర్చడాన్కి ప్రసంగి 9:5, 10 లాంటి బైబిలు వచనాలు ఎత్తిచూపబడ్డాయి. మరొక అధ్యాయం “మృతులను మేల్కొల్పుట” అనే పేరుతోవుంది, మృతులు ఏమీయెరుగరని, వారు పునరుత్థానం కొరకు వేచియుంటారని నిరూపించుటకు యోహాను 5:28, 29 ఎత్తిచూపబడింది. ఇది అర్థవంతమైంది, సంతృప్తికరమైందని నాకు తోచింది.
అది 1942వ సంవత్సరం, ఆ సమయంలో నేను “వాయిస్ ఆఫ్ ప్రాఫసి” తో నాకున్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకుని, వాచ్‌టవర్ సొసైటి ప్రచురణలనుండి నేర్చుకుంటున్న విషయాల్ని యితరులకు చెప్పడం ప్రారంభించాను. కీల్‌నర్టన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌నందు నాతోపాటు చదివిన నా స్నేహితుడు జూడా లెట్స్‌వాలొ ప్రతిస్పందించిన వారిలో మొట్టమొదటివాడు.
పీటర్స్‌బర్గ్‌లోని ఆఫ్రికన్ సాక్షుల సమావేశానికి హాజరయ్యేందుకు నేను, జూడా 51 కిలోమీటర్లు సైకిలు ప్రయాణం చేశాం. ఆ తర్వాత, రాజ్యవర్తమానాన్ని యిరుగుపొరుగు వారికి అందించడంలో నాకు సహాయం చేయడానికి, పీటర్స్‌బర్గ్‌లోని స్నేహితులు తరచూ మామాట్చాకు వస్తూండేవారు. చివరకు, నేను 1944లో పీటర్స్‌బర్గ్ సమావేశంలో, యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందాను.
నా కుటుంబం, ఇతరుల ప్రతిస్పందన
కారోలిన్, ప్రిసిల్లా, నా కుమార్తె డామారిస్ అంతా డచ్ రిఫార్మడ్ చర్చికి వెళ్తూనే వున్నారు. అప్పుడే ఆపద అలుముకుంది. కారోలిన్ చూడ్డానికి ఆరోగ్యంగా కన్పించే మగబిడ్డను ప్రసవించింది, ఆ బిడ్డకు సామ్యూల్ అని పేరుపెట్టాం. కాని హఠాత్తుగా అతడు జబ్బుపడి, చనిపోయాడు. దేవుడు తనతోపాటు పరలోకంలో ఉండుటకు మీ బిడ్డను కోరుకున్నాడని చెప్తూ, కారోలిన్ చర్చి మిత్రులు ఏ ఓదార్పునుకూడ యివ్వలేదు. “మన బాబును దేవుడెందుకు తీసుకున్నాడండీ?” అని కారోలిన్ దుఃఖంతో అడుగుతుండేది.
మా దుస్థితి గురించి పీటర్స్‌బర్గ్‌లోని సాక్షులకు తెలిసిన వెంటనే, వారు వచ్చి దేవుని వాక్యంపై ఆధారపడిన నిజమైన ఓదార్పునిచ్చారు. తర్వాత కారోలిన్ ఈ విధంగా అంది: “మరణానికిగల కారణం, మరణించినవారి పరిస్థితిని గూర్చి, పునరుత్థాన నిరీక్షణను గూర్చి యేదైతే బైబిలు చెప్పిందో అది అర్థవంతంగా వుంది, మరి నేనెంతో ఓదార్పు పొందాను. నేను నూతనలోకంలో ఉండాలని, నేను నా బిడ్డను సమాధినుండి తిరిగిపొందాలని కోరుకున్నాను.”
కారోలిన్ చర్చికి వెళ్లడం మాని, 1946లో ఆమె, ప్రిసిల్లా, జూడా కలసి బాప్తిస్మం పొందారు. తన బాప్తిస్మం అయిన వెంటనే, మామాత్లోల అనే గ్రామప్రాంతంలో సువార్తపని ప్రారంభించేందుకు జూడా వెళ్లాడు. ఈనాటి వరకు ఆయన పూర్తికాలసేవా పరిచారకుడిగానే సేవ చేస్తున్నాడు.
జూడా వదలివెళ్లేటప్పటికి, బోయిని అని పేరుపెట్టబడ్డ మా సంఘాన్ని పర్యవేక్షించడానికి నేనొక్కడినే పురుషున్ని మిగిలాను. ఆ తర్వాత గ్రేస్‌లీ మాహ్లాట్జి మా ప్రాంతానికి వచ్చి, చివరకు ఆయన ప్రిసిల్లాను వివాహం చేసుకున్నాడు. ప్రాంతీయ ఆఫ్రికా భాషైన సెపెడి భాషలో నేను, గ్రేస్‌లీ ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కవారం బహిరంగ ప్రసంగాలిచ్చేవాళ్లం. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బైబిలు సాహిత్యాలను సెపెడి భాషలోకి తర్జుమా చేయమని సొసైటి నన్ను కోరింది. ప్రజలు ఈ సాహిత్యాలనుండి ప్రయోజనం పొందుట చూడడం నాకెంతో సంతృప్తినిచ్చింది.
బహిరంగసభ కార్యక్రమ విలువను పెంచడానికి, బైబిలు ప్రసంగాల్ని మా ప్రాంతమంతా వినిపించడానికి పెద్ద లౌడ్‌స్పీకరున్న గ్రామఫోను మేము కొన్నాం. ఒకచోటునుండి మరోచోటుకు ఈ బరువైన పరికరాన్ని మోసేందుకుగాను గాడిదలు లాగే బండిని సంపాదించాం. ఫలితంగా, మాకు ఇరుగుపొరుగువారు “గాడిద చర్చి సభ్యులని” మారుపేరు పెట్టారు.
అదేసమయంలో మా చిన్నసంఘం వృద్ధిచెందడం కొనసాగింది. చివరకు, నా అక్కలిద్దరు, వాళ్ల భర్తలు సాక్షులుగా మారి, మరణించేంతవరకు విశ్వాసంలోనే వున్నారు. అంతేకాకుండా, బోయిని (ప్రస్తుతం పోకోడిబె అని పిలువబడుతుంది.) సంఘంనుండి చాలామంది పూర్తికాల సువార్తసేవను చేపట్టారు, వారిలో కొందరు ఇంకనూ అదేసేవలో ఉన్నారు. అక్కడక్కడ చెదరివున్న ఈ పల్లెగ్రామాల విశాలప్రదేశంలో ప్రస్తుతం రెండు సంఘాలున్నాయి, 70 మందికి పైగా ప్రచారకులు చురుకుగా సువార్తపని చేస్తున్నారు.
ఒక క్రొత్త జీవితవిధానము
నేను 1949లో పాఠశాలలో బోధించడం చాలించి, క్రమపయినీరు పరిచారకుడనయ్యాను. ట్రాన్స్‌వాల్‌లోని వాల్వాటర్ చుట్టుప్రక్కలనున్న శ్వేతజాతివారి స్వాధీనంలోని భూములలో కూలిచేసుకుని జీవిస్తున్న సాగుబడిచేసే నల్లకార్మికులకు సువార్తనందించే పని నాకు మొదట యివ్వబడింది. ఆ కాలంలో ప్రబలివున్న జాతివివక్షతావిధానాన్ని కొంతమంది భూస్వాములు ప్రకటించి, నల్లవారంతా శ్వేతజాతి వారికంటె తక్కువవారని గుర్తించి, వారు శ్వేతజాతి భూస్వాములకే సేవచేయాలని నిర్ణయించారు. నేను నల్లకార్మికులకు సువార్త ప్రకటించినప్పుడు, కొంతమంది శ్వేతజాతివారు నన్ను అధికార ధిక్కారం చేసే సువార్తికుడనని అపార్థం చేసుకున్నారు. కొంతమంది నన్ను ఒక కమ్యూనిస్టని కూడ నిందించి, కాల్చేస్తామని బెదిరించారు.
నేను ఈ పరిస్థితి గురించి వాచ్‌టవర్ సంస్థ బ్రాంచి కార్యాలయానికి విన్నవించుకున్నాను, దాంతో నేను డావెల్స్‌క్లూఫ్ అనే గ్రామప్రాంతానికి వేరేపనిమీద బదిలీ చేయబడ్డాను. ఇప్పుడు నా భార్యకూడ తన టీచరు పనిని వదలి నాతోపాటు పయినీరుసేవలో చేరింది. ఒక మధ్యాహ్నం 1950లో, మేము ప్రాంతీయసేవనుండి తిరిగి వచ్చేసరికి సంస్థనుండి వచ్చిన పెద్ద కవరు కన్పించింది. మేము ఆశ్చర్యపడేట్టుగా ప్రయాణకాపరి శిక్షణ పొందేందుకు దానిలో నాకు ఆహ్వానముంది. మూడు సంవత్సరాలపాటు దక్షిణాఫ్రికాలోని సంఘాల్ని దర్శించాము. ఆ తర్వాత 1953లో మేము దక్షిణాఫ్రికా మధ్యభాగంలోని భూపరివేష్టిత ప్రాంతమైన లెసెతొకు పంపబడ్డాము.
లెసెతొ, బోట్స్‌వానాలో సేవ
మేము లెసెతొలో సేవ ప్రారంభించినప్పుడు మతాచార సంబంధంగా జరిగే హత్యలకు చాలామట్టుకు క్రొత్తవారే బలౌతున్నారని చాలా గాలివార్తలు విన్నాం. నేను నా భార్య ఇద్దరమూ అందుకు భయపడ్డాం, కాని సొథొసహోదరుల ప్రేమ, వారి అతిథిసత్కారం మేము అలాంటి భయాలను మరచిపోయేటట్టు చేశాయి.
లెసెతొలో మాలూటి పర్వతాల్లోని సంఘాలలో సేవచేయడానికి నేను విమానంపై ప్రయాణిస్తూండేవాన్ని, నా భార్యను పల్లపుప్రాంతాలలో వదలివెళ్లేవాడిని, నేను తిరిగి వచ్చేవరకు ఆమె పయినీరు సేవచేసేది. పర్వతాల్లో చిక్కుకుపోకుండా సహాయపడడానికి స్నేహితులు ఒక సంఘంనుండి మరొక సంఘానికి రక్షణార్ధం నావెంట వస్తూండేవారు.
ఒకసారి నేను ఒక సంఘంనుండి మరొక సంఘానికి వెళ్లాల్సి వచ్చినపుడు, మేము గుర్రంమీద కూర్చుని ఆరంజ్ నదిని దాటవలసి వచ్చింది. గుర్రం చాలా మంచిదని చెప్పారుగాని నీళ్లు ఎక్కువయ్యేసరికి సాధారణంగా గుర్రాలు వాటిపైనున్న బరువును వదలించుకోవడానికి ప్రయత్నిస్తాయని హెచ్చరిక చేశారు. నేను చాలా గాబరాపడ్డాను, ఎందుకంటే నాకు స్వారీచేయడం, ఈదడం రెండూకూడ అంతగా తెలియవు. మేము నదిలోకి దిగినవెంటనే నీళ్లు గుర్రం జీనువరకు వచ్చాయి. నేనెంతో భయపడిపోయి కళ్లెం విడిచిపెట్టి, గుర్రం మెడమీది జూలు పట్టుకున్నాను. మేము క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరడంతో ఎంత ఉపశమనం కల్గిందో!
గుర్రంపై స్వారీచేయడంవల్ల నా శరీరం నలిగిపోయి ఆ రాత్రంతా అసలు నిద్రపట్టలేదు. కాని కష్టానికి తగిన ఫలితం లభించింది, ఎందుకంటే స్నేహితులు సందర్శనను ఎంతగానో అభినందించారు. నేను లెసెతొలో సర్క్యూట్ పని ప్రారంభించినపుడు అక్కడ 113 మంది ప్రచారకులుండేవారు. అయితే, ఈనాడు ఆ సంఖ్య 1,649కు పెరిగింది.
మా సేవ 1956లో ప్రస్తుతం బోట్స్‌వానా అని పిలువబడుచున్న సంరక్షకపాలిత దేశమైన బెచ్‌వానాలాండ్‌కు మారింది. బోట్స్‌వానా చాలా పెద్దదేశం, మరియు ప్రచారకులనందరినీ దర్శించేందుకు ఎంతో దూరం ప్రయాణించవలసి వచ్చింది. మేము రైలు లేదా ట్రక్కుపై ప్రయాణం చేశాం. సీట్లుండేవి కావుగనుక మేము మా సామానుతోపాటు క్రింద కూర్చోవలసి వచ్చింది. చాలా సందర్భాల్లో మేము అలసిపోయి, బాగా మురికితో మా గమ్యం చేరేవాళ్లం. మా క్రైస్తవ సహోదరులు ఎప్పుడూ ఆహ్వానించేవారు, ఆనందంతోకూడిన వారి ముఖాలు మమ్ములను ఉత్సాహితులను చేసేవి.
ఆ సమయంలో, సంస్థ ప్రచురించిన సాహిత్యాలు బోట్స్‌వానాలో నిషేధించబడ్డాయి, గనుక సంస్థ సాహిత్యాలను ఉపయోగించకుండానే మా ఇంటింటిసేవ జాగరూకతతో జరిగేది. ఒకసారి మేము మాపాషలాలె అనే గ్రామసమీపంలో సేవచేస్తుండగా పట్టుబడి, అరెస్టు చేయబడ్డాము. మమ్మల్ని మేము కాపాడుకొనేందుకు మాకివ్వబడ్డపనిని తెల్పుతూ బైబిల్లో మత్తయి 28:19, 20 వచనాల్ని చదివి వినిపించాము. అది అక్కడున్న మనుష్యుల్లో కొందరి మనస్సున నాటుకున్నప్పటికి, మమ్ములను కొరడా దెబ్బలు కొట్టాలని వారి గ్రామాధికారి ఆదేశించాడు. అప్పుడు మేము ఆశ్చర్యపోయేలా, అక్కడున్న క్రైస్తవమతాధికారి మమ్ములను దయతో క్షమించమని గ్రామాధికారిని ప్రాధేయపడి అడిగాడు. అందుకాయన అంగీకరించాడు, మేము విడుదలయ్యాము.
హింస, సాహిత్యాలనిషేధం ఈ రెండూ వున్నప్పటికి రాజ్యపని వృద్ధిచెందుతూనే వుంది. నేను బోట్స్‌వానాకు వచ్చిన సమయంలో అక్కడ 154 మంది ప్రచారకులున్నారు. మూడు సంవత్సరాల తర్వాత నిషేధం ఎత్తివేయబడినప్పుడు, ఆ సంఖ్య 192కు పెరిగింది. ఈనాడు, ఆ దేశంలో 777 మంది యెహోవాసాక్షులు సువార్తసేవ చేస్తున్నారు.
బోధించుట, తర్జుమా చేయుట
ఆ మధ్యకాలంలో, నేను క్రైస్తవ పెద్దలకున్న రాజ్య పరిచర్య పాఠశాలకు ఉపదేశకుడిగా ఉపయోగించబడ్డాను. ఆ తర్వాత పయినీరు సేవాపాఠశాలలో ఉపదేశకుడిగా పనిచేసే ఆధిక్యతను ఆనందించాను. అప్పుడప్పుడు నేను నా భార్య దక్షిణాఫ్రికా బ్రాంచిలో సేవచేశాము. ఆ సందర్భాల్లో నేను తర్జుమా చేయడంలోను, కారోలిన్ వంటపనిలోను సహాయపడ్డాము.
ఒకరోజు 1969లో, బ్రాంచి ఓవర్‌సియర్ అయిన ఫ్రాంజ్ ముల్లర్ నాదగ్గరకు వచ్చి యిలా చెప్పాడు: “బ్రదర్ టాంగ్వానా, నేను మిమ్మల్ని, మీ భార్యను నా ఆఫీసులో ఒకసారి చూడాలనుకుంటున్నాను.” అక్కడకు వెళ్లిన తర్వాత, మేము 1969లో లండన్‌లో జరిగే “భూమిపై శాంతి” అనే సమావేశానికి ఎన్నుకోబడ్డ ప్రతినిధులతోపాటు వున్నామని ఆయన వివరించారు. మేము ఇంగ్లాండ్‌లోను, స్కాట్‌లాండ్‌లోను సహోదరులు చూపిన ప్రేమామయ ఆతిధ్యాన్ని ఆనందించాము, మరియు అది ప్రపంచవ్యాప్త సహోదరత్వం యెడల మాకున్న మెప్పుదలను వృద్ధిచేసింది.
గత నాలుగు దశాబ్దాలుగా, కారోలిన్ నాతోపాటు మా జీవితవిధానమైన పూర్తికాలసువార్తసేవలో నమ్మకంగా వుంది. మేమిద్దరమూ ఆనందాల్ని, కొన్నిదుఃఖాల్ని కలసి పంచుకున్నాం. మేము మా పిల్లల్లో యిద్దరిని కోల్పోయినప్పటికి, మా కుమార్తె డామారిస్ ఒకమంచి సాక్షిగా ఎదిగి, దక్షిణాఫ్రికా బ్రాంచిలో అనువాదం చేయడంలోకూడ భాగం వహించింది.
మా ఆరోగ్యం ప్రయాణకాపరి సేవచేయడానికి ఇక అనుమతించలేదు కాబట్టి, గత కొన్ని సంవత్సరాలుగా మేము పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఆఫ్రికా పట్టణప్రాంతమైన సెషెకొ సంఘంలో స్పెషల్‌పయినీర్లుగా పనిచేస్తున్నాము. నేను సంఘాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిజంగా నేను ఆఫ్రికా దక్షిణప్రాంతంలో దేవుని సేవించడంలో తృప్తిని, సంతోషాన్ని పొందాను, బైబిలు చెప్పినట్లుగా “[యెహోవా] సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు.”—కీర్తన 16:11.
[26వ పేజీలోని చిత్రం]
దక్షిణాఫ్రికాలోని సెషెకొ పట్టణప్రాంతంలో సాక్ష్యమిచ్చుట