“నమస్కారం! దేవుని పేరేమిటో మీకు తెలుసా?”
బ్రెజిల్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి, ఫోర్టెలిజా పట్టణంలోని 12 సంవత్సరాల ఇద్దరు కవల బాలికలు వ్రాసిన ఈ ఉత్తరం వచ్చింది:
“గత 1990 సం.లో మేము ఐదవ తరగతి చదువుతున్నప్పుడు, మా పాఠశాల విజ్ఞానం, కళలు, మరియు సాంస్కృతిక విషయాలను గూర్చి ఓ ప్రదర్శనను నిర్వహించింది. ఇతర విద్యార్థులు తయారుచేయ నిశ్చయించుకున్న వాటికి భిన్నంగా మా అందింపు ఉండాలని మేము ఇష్టపడుతున్నామని మా ఉపాధ్యాయినికి వివరించాము. మేము యెహోవా మరియు బైబిలు గురించి మాట్లాడడం ఆమె విన్నందువల్లనే ఆమె, ‘మరి మీరు మీ దేవున్ని గురించి వ్రాయండి!’ అని సలహా ఇచ్చింది.
“మేము సాక్ష్యమిచ్చుటకు ఇదొక తరుణంగా భావించి, యెహోవా నామముపై కేంద్రీకరింపబడిన బైబిలు ప్రచురణలతో ఒక ప్రదర్శిత వస్తువును సమకూర్చాలని నిర్ణయించుకున్నాము. మేము కీర్తన 83:18 నందలి వచనాలను పెద్దగా వ్రాసి తయారు చేసి దానిని బైబిలు తెరిచి ఉన్నట్లున్న పఠానికి అతికించాము. ఇంకా, యెహోవా నామాన్ని కలిగి ఉన్న వేర్వేరు బైబిలు తర్జుమాలను బల్ల మీద పెట్టాము. అదే బల్లమీద, బైబిలు ప్రచురణలను క్రమబద్ధంగా ప్రదర్శించాము. బల్ల చివరలో, బాగా జనాదరణ పొందిన చిత్రంలో యెహోవా నామాన్ని ఉపయోగించిన ఒక ఉదాహరణను దర్శకులకు చూపించడానికి ఒక విసిఆర్ను టివిని ఏర్పాటుచేశాము.
“ప్రదర్శనలో, ఒక వ్యక్తి మా బల్ల వద్దకు వచ్చినప్పుడు, మేము ఇలా అన్నాము: ‘నమస్కారం! దేవుని పేరేమిటో మీకు తెలుసా?’ ప్రతిస్పందించుటకు దర్శకునికి అవకాశం ఇచ్చిన తరువాత, మేమిలా అన్నాం: ‘ఇటు చూడండి! ఆయన పేరు యెహోవా అని అనేక బైబిలు తర్జుమాలు చూపుచున్నవి,’ జోవా ఫెరైరా డె అల్మైయిడా, ది జెరుసలేమ్ బైబిలు, మరియు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ వంటి వేర్వేరు బైబిళ్లనుండి ఆ నామమును చూపించాము. తరువాత చలన చిత్రంలోని ముఖ్యపాత్ర, యెహోవా అనేది దేవుని నామము అని నొక్కిచెప్పుచున్న ఘట్టాన్ని చూపించాము. ప్రజలు ఆసక్తి చూపినప్పుడు, ఎక్కువ విషయాలు తెలుసుకొనుటకు వారికి మేము ఒక పత్రిక లేక ఓ కరపత్రాన్ని ఇచ్చాము.
“మా బల్ల వద్దకు వచ్చిన యౌవనులలో ఒకరు కొశ్చెన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అను పుస్తకము కావాలని అడిగారు. మా ఉపాధ్యాయిని, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అను పుస్తకమును పరిశీలించి ‘అబ్బా! యీ పుస్తకం ఎంత బాగుంది!’ అని ఆశ్చర్యపడింది. ప్రదర్శనాంతానికల్లా, మేము 7 పుస్తకాలు, 18 కరపత్రాలు, మరియు 67 పత్రికలు అందించాము. ప్రదర్శనలో మాకు మూడవ స్థానం వచ్చింది. కాని అన్నింటికన్నా ఎక్కువగా, యెహోవా అను దైవిక నామమును తెలియపర్చే ఆధిక్యతకై మేము ఎంతో ఆనందించాము.”