మన మహోన్నత సృష్టికర్త, ఆయన కార్యములు
ఎంత మనోహరం! పెద్ద శబ్దంతో జాలువారే ఇగ్వాసు లేదా నయగారా జలపాతాలు, ఆరిజోనా లేదా హవాయిలోవున్న లోతైన లోయల్లోని సెలయేళ్లు, నార్వే లేదా న్యూజీలాండ్‌లో కొండల నడుమగా చొచ్చుకొనివచ్చి కనులవిందు చేసే సముద్ర శాఖలు—ఈ సహజ అద్భుతాలు ఎంత విస్మయం గొల్పుతున్నాయి! అయితే ఇవి కేవలం ప్రకృతిమాత అని పిలువబడేదాని ఆకస్మిక సంభవములా? కానేకావు, అవి అంతకంటే ఎంతో ఉన్నతమైనవి. అవి ప్రేమగల పరలోకపు తండ్రి, మహోన్నత సృష్టికర్త చేసిన ఆశ్చర్యకార్యములై యున్నవి. ఆయనను గూర్చి జ్ఞానియైన సొలొమోను రాజు యిలా వ్రాశాడు: “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.” (ప్రసంగి 3:11) అవును, సృష్టికర్త తన మహిమగల సమస్త కార్యములతో నింపిన యీ విశ్వాన్ని పరిశోధించుటకు మానవులకు శాశ్వతకాల సమయం అవసరం.
మనమెంతటి మహోన్నత సృష్టికర్తను కలిగియున్నాము! మరియు ఈ సర్వశక్తిగల దేవుడు “ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను” అని తెలిసికొనుటకు మనమెంతగా సంతోషిస్తున్నాము. (హెబ్రీయులు 1:2) ఈ కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రిచేసిన సృష్టి యందలి శోభాయమానమైన సంగతులను అభినందించాడు. తన తండ్రి సంకల్పాలను దృష్టాంతపరచుటలో, తనను వినువారిని ప్రోత్సహించి మాట్లాడే మాటలలో ఆయన తరచు వాటిని సూచించాడు. (మత్తయి 6:28-30; యోహాను 4:35, 36) సృష్టిలోని అద్భుతాలన్నియు “దేవుని వాక్యమువలన నిర్మాణమైనవని” “విశ్వాసముచేత” అనేకులు గ్రహించారు. (హెబ్రీయులు 11:3) మన దైనందిన జీవితాలలో అట్టి విశ్వాసం ప్రతిబింబించాలి.—యాకోబు 2:14, 26.
అవును, మన దేవుని సృష్టికార్యములు నిశ్చయంగా మహోన్నతమైనవి. అవి అద్భుతరీతిలో ఆయన జ్ఞానాన్ని, శక్తిని, నీతిని, ఆయన ప్రేమను ప్రతిబింబిస్తున్నవి. ఉదాహరణకు, భవిష్యత్తులో తాను సృష్టించు మానవుడు క్రమంగా ఉల్లాసవంతమైన ఋతువుల ననుభవించులాగున భూమి సరియైన వంపుకలిగి సూర్యునిచుట్టు పరిభ్రమించునట్లు ఆయన ఏర్పాటుచేశాడు. దేవుడిలా చెప్పాడు: “భూమి నిలిచి యున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవు.” (ఆదికాండము 8:22) అంతేకాదు, దేవుడు భూమిని సమృద్ధిగా అపురూపమైన ఖనిజ సంపదతో నింపాడు. ప్రత్యేకంగా, ఆ తర్వాతి కాలాల్లో సమస్త భూప్రాణులకు ఆవశ్యకమగు, జీవాధారమైన అంశంగా విస్తారమైన జలసంపదను ఆయన దయచేశాడు.
ఒక్కొక్కటీ వేలాది సంవత్సరాల నిడివిగల ఆరు ‘సృష్టిదినాల’ క్రమములో, “దేవుని చురుకైన శక్తి” భూమిని మానవ నివాసయోగ్య స్థలంగా తయారుచేసింది. మనం చూడగలిగే వెలుగు, మనం పీల్చుకునే గాలి, మనం నివసించే నేల, చెట్లుచేమలు, క్రమంగా వచ్చే రాత్రింబగళ్లు, చేపలు, పక్షులు, జంతువులు—యిలా సమస్తాన్ని మానవుని ఉపయోగం కొరకు, ఆనందం కొరకు మన మహోన్నత సృష్టికర్త ఒక క్రమపద్ధతిలో సృష్టించాడు. (ఆదికాండము 1:2-25, NW) “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నింటిని నిర్మించితివి. నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది” అని ఆశ్చర్యం వ్యక్తంచేయుటలో మనం నిశ్చయంగా కీర్తనల రచయితతో ఏకీభవించగలము.—కీర్తన 104:24.
దేవుని సృష్టిలో ఉత్కృష్టమైనది
ఆరవ సృష్టి “దినము” ముగింపుకు వస్తుండగా, దేవుడు నరున్ని అతని సహాయకారియైన స్త్రీని చేశాడు. అంతకుముందు చేయబడిన భౌతిక సృష్టియంతటిలో అత్యద్భుతమై, భూమిపై సృష్టించిన వాటికి అది ఎంతటి నైపుణ్యవంతమైన ముగింపు! కీర్తన 115:16 మనకిట్లు తెలియజేస్తున్నది: “ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” తదనుగుణంగా, భూమిపై అంతకుముందు సృష్టింపబడిన వాటినిబట్టి సంతోషిస్తూ, వాటిని ఉపయోగించగల్గునట్లు మానవ ఆత్మలైన మనలను యెహోవా రూపించాడు. మన చుట్టూవున్న వర్ణభరిత లోకాన్ని చూచి ఆనందించేటట్లు—ఏ అత్యుత్తమ కెమెరాకంటే సంశ్లిష్టంగా—చేయబడిన మన నేత్రాలనుబట్టి మనమెంత కృతజ్ఞులమై యుండాలి! సంభాషణను, సంగీతాన్ని, పక్షుల మధుర గీతాల్ని వినడానికి సహాయపడు—మానవుడు కనిపెట్టిన ఏ శబ్ద పరికరం కంటెను శ్రేష్ఠమైన—చెవులను మనం కలిగియున్నాము. విభిన్న సామర్థ్యములున్న నాలుకతో సహా, అంతర్నిర్మితమైన సంభాషణా యాంత్రిక విధానాన్ని మనం కలిగియున్నాము. నాలుకపైవుండే రస గ్రంథులు, వాటితోపాటు వాసనచూడగల మన శక్తి అనంత రుచులుగల ఆహారమునుబట్టి ఉల్లసించుటకు అనుగ్రహింపబడెను. ప్రేమగల హస్తస్పర్శను మనమెంతగా అభినందిస్తాం! “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని చెప్పిన కీర్తనల రచయిత వలెనే మనమూ మన సృష్టికర్తకు కృతజ్ఞత తెల్పగలము.—కీర్తన 139:14.
మన సృష్టికర్త కృప
కీర్తనల రచయిత యిలా వ్రాశాడు: “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. . . . ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు.” (కీర్తన 136:1-4) మేమిప్పుడే వర్ణించి చెప్పిన సృష్టికార్యములన్నింటికంటె మరెంతో గొప్పవైన ఆశ్చర్యకార్యాలు చేయుటకు ఆ కృప ఆయననిప్పుడు పురికొల్పుతుంది. అవును, సృష్టికార్యముల నుండి విశ్రాంతి తీసుకుంటూనే, ఆయన ఆత్మీయ రీతిలో సృష్టించనారంభించాడు. తనపై విసిరిన దుష్ట సవాలుకు జవాబుగా ఆయన దీనిని చేస్తున్నాడు. ఎలా?
మొదటి స్త్రీపురుషులు మహిమాన్విత పరదైసగు ఏదెనులో ఉంచబడిరి. అయితే, విశ్వాసఘాతకుడైన దూతయగు సాతాను తననుతాను దేవునిగా చేసికొని, యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుటకు ఆ మానవ జతను నడిపాడు. న్యాయసమ్మతంగా, దేవుడు వారిరువురికి మరణశిక్ష విధించాడు, దాని ఫలితంగా వారి సంతానము, ఆలాగే యావత్ మానవజాతి పాపగ్రస్తమైనదై మరణించే స్థితికి తేబడింది. (కీర్తన 51:5) శోధనలో ఏ మానవుడును యథార్థపరునిగా ఉండలేడని చెప్పుచు, సాతాను దేవున్ని సవాలు చేశాడని యోబును గూర్చిన బైబిలు వృత్తాంతము సూచిస్తున్నది. అయితే, బైబిలు కాలంలోను, మన కాలంలోను అనేకమంది దేవుని నమ్మకమైన సేవకులు నిరూపించినట్లుగానే సాతాను ఒక పచ్చి అబద్ధికుడని యోబు నిరూపించాడు. (యోబు 1:7-12; 2:2-5, 9, 10; 27:5) పరిపూర్ణ మానవునిగా యేసు యథార్థత చూపుటలో సాటిలేని మాదిరినుంచాడు.—1 పేతురు 2:21-23.
కాబట్టి, యేసు యిలా చెప్పగల్గాడు: “ఈ లోకాధికారితో [సాతానుతో] . . . సంబంధమేమియు లేదు.” (యోహాను 14:30) అయినను, నేటివరకు “లోకమంతయు దుష్టునియందున్నది.” (1 యోహాను 5:19) యెహోవా సార్వభౌమాధిపత్యపు హక్కుపై వివాదము లేవదీసినందున, మానవజాతిపై తన పరిపాలన విజయవంతం కాగలదో లేదో చూపించుకొనుటకు సాతానుకు 6,000 సంవత్సరములు ఇవ్వబడ్డాయి. అంతకంతకు క్షీణిస్తున్న ప్రపంచ పరిస్థితులు రుజువు పరచునట్లుగా, అతడెంత ఘోరంగా విఫలుడయ్యాడు! మన ప్రేమగల దేవుడైన యెహోవా, భూమిపై తన సార్వభౌమాధిపత్యమును నిశ్చయపరుస్తూ, త్వరలోనే ఈ అవినీతి మానవ సమాజాన్ని తీసివేస్తాడు. సమాధానకరమైన, నీతియుక్తమైన పరిపాలనకై తపించే మానవులకు అదెంత సంతోషకరమైన విడుదలను తెస్తుంది!—కీర్తన 37:9-11; 83:17, 18.
అయితే, దానికి అంతకంటె ఎక్కువ ఉంది! “దేవుడు [మానవుల] లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16లో యేసు పలికిన మాటల ఆధారంగా దేవుని ప్రేమగల కృప మరింత అధికంగా ప్రదర్శింపబడును. భూమిపై నిత్యజీవపు ఈ ఉత్తరాపేక్షకు మానవజాతిని పునరుద్ధరించుటలో నూతన సంగతుల సృష్టి యిమిడియున్నది. ఇవి ఏమైయున్నవి? మూల్గులిడుచున్న మానవజాతికి అవి యేవిధంగా ప్రయోజనమివ్వగలవు? మా తర్వాతి శీర్షిక వీటిని తెలియజేస్తుంది.