కుటుంబ దురవస్థ—మన కాలానికి ఒక విలక్షణమైన సూచన
కుటుంబ దురవస్థ—దీనిని అనేకులు, వివాహము మరియు మాతృ పితృ బాధ్యతల సంప్రదాయ కట్టడలు మరుగైపోతున్నందుకు గుర్తుగా భావిస్తున్నారు. కొందరు దీనిని రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులయొక్క ఫలితంగా ఎంచుతున్నారు. ఇంకా కొందరైతే కేవలం దానిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా పరిగణిస్తున్నారు. అయితే వాస్తవానికి నేడు కుటుంబాలను పట్టిపీడిస్తున్న సమస్యలు వీటన్నిటికంటె గొప్పదైన మరొకదానికి గుర్తుగా నిలుస్తున్నవి. బైబిలులో 2 తిమోతి 3:1-4లోని మాటలను గమనించండి:
“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునైయుందురు.”
ఈ మాటలు నేటి సమస్యల మూల కారణమును తేటపరచుట లేదా? స్పష్టంగా నేటి కుటుంబ దురవస్థ, ప్రపంచపు ఆఖరు దినాలలో సంభవిస్తాయని ప్రవచింపబడిన పరిస్థితుల ప్రత్యక్ష ఫలితమైవుంది. ఇంతేగాక ఈ దురవస్థతో కూడినకాలము 1914వ సంవత్సరం నుండే ప్రారంభమైనదనుటకు త్రోసిపుచ్చలేనంత నిదర్శనముంది.a ముఖ్యంగా అప్పటినుండి, అపవాదియైన సాతాను అని పిలువబడు మానవాతీత ఆత్మీయప్రాణియొక్క ప్రభావము మరీ ప్రత్యేకరీతిలో ప్రాణాంతకంగా పరిణమించింది.—మత్తయి 4:8-10; 1 యోహాను 5:19.
సాతాను 1914 నుండి భూపరిధిని దాటివెళ్లకుండా నిర్భంధించబడినవాడై “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధముగలవాడై” యున్నాడు. (ప్రకటన 12:7-12) “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో” ఆ దేవునికి సాతాను విరోధియైయున్నందున, కుటుంబాలకు భూమి ఒక విపత్కర స్థలంగా మారిందనుటలో ఆశ్చర్యమేమైనా ఉందా? (ఎఫెసీయులు 3:14) సాతాను మానవజాతినంతటిని దేవునికి విరోధంగా మళ్లించేందుకు తీర్మానించుకొనియున్నాడు. అందుచేత, కుటుంబములను సమస్యలతో తలక్రిందులు చేయుటకంటె అతనికి మంచి మార్గం మరొకటేముంది?
అలాంటి మానవాతీత ముట్టడినుండి, కుటుంబములను పరిరక్షించుటకు నిపుణులమని భావించేవారి పట్టులేని సిద్ధాంతాలకంటె ఉన్నతమైనది అవసరము. అంతేగాక, సాతానును ‘అతని తంత్రములను మనము ఎరుగనివారము కాము’ అని బైబిలు చెబుతుంది. (2 కొరింథీయులు 2:11) కావున, అతని నిర్దిష్ట ముట్టడి మార్గాలను కొన్నింటిని తెలిసికొనుటద్వారా కొంతమట్టుకు రక్షణ లభించగలదు.
ధనము, పని
సాతాను తన ముట్టడిలో ఉపయోగించు బలమైన ఆయుధాలలో ఆర్థిక వత్తిడి ఒకటి. ఇవి “అపాయకర కాలములు,” లేక రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ 2 తిమోతి 3:1ని అనువదించినట్లు “వత్తిడిగల కాలములు.” అభివృద్ధిచెందుతున్న దేశాలలో నిరుద్యోగము, స్వల్పమైన వేతనములు, ప్రాథమిక అవసరతల కొరత మొదలగు సమస్యలు కుటుంబములను తీవ్ర బాధకు గురిచేస్తున్నవి. కొంతమేరకు సుసంపన్న దేశమైన అమెరికాలో సహితము ఆర్థిక వత్తిడులు గంభీరంగా వాటి ఫలితాలను ప్రదర్శిస్తున్నవి. కుటుంబ పోరాటాలలో ధనము ఒక మూలకారణమని ఒక యు. యస్. సర్వే వెల్లడించింది. సీక్రెట్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అనే పుస్తకము వివరించేదేమనగా లౌకిక వృత్తి నిర్భంధంగా కోరే “సమయము, అవధానము, శక్తి” వివాహ ఒప్పందాన్ని నిలబెట్టుకోలేక తుడిచిపెట్టే ‘కుతంత్ర విరోధిగా’ ఉన్నది.
అనేకమంది స్త్రీలు బయట ఉద్యోగాలను వెదకేలా పరిస్థితులు దిగజారినవి. రచయిత వాన్స్ పాకార్డ్ నివేదించేదేమనగా: “ప్రస్తుతం అమెరికా పసిబిడ్డలలోని తప్పటడుగులువేసే మూడేండ్లలోపు బిడ్డలలో నాలుగోవంతు మంది, ఏదోరకమైన బయటి పనులకువెళ్లే తల్లులనే కలిగివున్నారు.” ఎంతకూ తీరని చిన్నపిల్లల అవసరతలు, పూర్తిగా సొమ్మసిల్లి, అలసిపోయ్యేలాచేసే పనులు ఇటు తల్లిదండ్రులమీద అటు పిల్లలమీద దుష్పరిణామాలను కల్గివుంటున్నవి. అమెరికాలోని శిశు సంక్షేమ ఏర్పాట్ల కొరతనుబట్టి, పాకార్డ్ ఇంకా ఇలా అంటున్నాడు, “అనేక లక్షలాదిమంది పిల్లలు తమ పసితనంలో మంచి పరామర్శకు నోచుకోవడంలేదు.”—అవర్ ఎండేంజర్డ్ చిల్డ్రన్.
వీటికితోడు ఉద్యోగ స్థలం కూడ కుటుంబ అనుగుణ్యతను దిగజార్చుతుంది. అనేకమంది ఉద్యోగస్థులు తమతోటి జతపనివారితో ధర్మవిరుద్ధమైన లైంగిక వ్యవహారాలలో చిక్కుబడిపోతున్నారు. మరికొంతమంది వ్యర్థమైనరీతిలో విజయం పొందాలనే ఉద్దేశ్యంతో, తమ ఉద్యోగంలో పైకెళ్లిపోవాలని కుటుంబజీవితాన్ని త్యాగం చేస్తున్నారు. (ప్రసంగి 4:4ను పోల్చుము.) ఒక మనుష్యుడు సేల్స్ రెప్రజెంటేటివ్‌గా తన ఉద్యోగంలో పూర్తిగా ఇమిడిపోయినదాన్నిబట్టి అతని భార్య, “తనను తాను భర్తవుండికూడా లేనిదానిగాను, తాను ఒంటరిగా తల్లిదండ్రుల బాధ్యతను మోయవలసి వస్తుందని” వర్ణించుకుంటుంది.
బలహీనమైన వివాహ బంధాలు
అసలు వివాహ సంస్థాపనమే నేడు ముట్టడికి గురౌతుంది. ఇంటిమేట్ ఎన్విరాన్మెంట్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “పూర్వమైతే, వివాహమైన దంపతులు—వారిలో ఎవరో ఒకరు జారత్వము, క్రూరత్వము, విపరీతమైన నిర్లక్ష్య పరిస్థితికి గురైనంత వరకు కలిసి ఉంటారని తలంచబడేది. అయితే ఇప్పుడు అనేకులు వివాహాన్ని కేవలం వ్యక్తిగత ఉద్దేశాన్ని నెరవేర్చుకొనేదిగా చూస్తున్నారు.” అవును, వివాహాన్ని మరొకవ్యక్తితో చేసుకొనే యావజ్జీవ ఒప్పందంగా ఎంచేబదులు అసంతోషానికి, విసుగుకు, ఒంటరితనానికి ఒక విరుగుడు మందులా ఎంచుతున్నారు. ముఖ్యంగా వివాహమునుండి నీవు ఏమి పొందుతావనే దానిపైనే అవధానమంతా ఉందిగాని, వివాహానికి నీవు ఏమి చేకూరుస్తావు అనే దానిపై లేదు. (అపొ. కార్యములు 20:35లో గల భిన్నత్వాన్ని చూడండి.) “వివాహ విలువలందలి ఈ మూల మార్పులే” వివాహ బంధాలను ఎక్కువగా బలహీనపరచినవి. వారి వ్యక్తిగత ఉద్దేశాన్ని నెరవేర్చుకొనే పరిస్థితి లేకపోతే దంపతులు తరచు విడాకులే తక్షణ పరిష్కారంగా చూస్తారు.
ఈ “అంత్య దినములలోని” ప్రజలు “పైకి భక్తిగలవారైయుండి దాని శక్తిని ఆశ్రయించని” వారైనట్టు ఉంటారని బైబిలు ప్రవచనాత్మకంగా వర్ణిస్తుంది. (2 తిమోతి 3:4, 5) అనేకమంది నిపుణులు మతము యొక్క క్షీణ దశ వివాహమును బలహీనపరచుటలో వంతు కలిగివుందని భావిస్తున్నారు. ది కేస్ ఎగెంస్ట్ డివోర్స్ అనే తన పుస్తకములో డా. డైన్ మెడ్వెడ్ ఇలా వ్రాసింది: “అనేక మతాల ప్రకారం వివాహం శాశ్వతమైందని దేవుడు చెప్పాడు. కాని నీవు దేవునిగూర్చిన నిశ్చయతలేక, ఆయనను నమ్మనప్పుడు, నీవనుకున్న దానినే నీవు చేస్తావు.” అందువలన వివాహములో సమస్యలున్నప్పుడు, దంపతులు సరైన పరిష్కారాన్ని వెదకరు. “తమ వివాహాన్ని వారు గ్రుడ్డిగా అంతమొనరుస్తారు.”
యౌవనులు ముట్టడికి గురగుట
నేటి వత్తిడుల మూలంగా పిల్లలు వ్యధననుభవిస్తున్నారు. విశాదకరంగా అనేకమంది పిల్లలు తమ స్వంత తల్లిదండ్రుల వలన క్రూరంగా దెబ్బలు తినడం, దూషించబడటం, లేక లైంగికంగా చెరపబడటం జరుగుతుంది. విడాకుల మూలంగా లక్షలాది మంది పిల్లలకు తమ తల్లిదండ్రులిరువురు చూపే ప్రేమ కొరవడుతుంది. తల్లిదండ్రుల విడాకుల వలన కలిగే వేదన జీవితాంతం మిగిలిపోతుంది.
యౌవనులు ఇతర బలమైన ప్రభావాల ఎడతెరిపిలేని తాకిళ్లకు గురౌతున్నారు. సగటు అమెరికా పిల్లవాడు 14 యేండ్లు వచ్చేసరికి 18,000 హత్యలను, లెక్కించలేనన్ని హింసాత్మక సంఘటనలను, లైంగిక దుర్నీతిని, లైంగిక విపరీత ప్రవృత్తిని, నేరాలను కేవలం దూరదర్శినిద్వారానే చూస్తున్నాడు. సంగీతం కూడా యువకులపై ఎంతో శక్తిని ప్రయోగిస్తుంది. దానిలో ఎక్కువభాగం అసభ్యకరంగాను, లైంగిక ప్రక్రియలను వివరించేదిగాను, సాతాను సంబంధమైనదిగాను ఉంటుంది. పాఠశాలలైతే దేవుడు మరియు బైబిలునందు విశ్వాసాన్ని బలహీనపరచే పరిణామ సిద్ధాంతాలను వారిలో నాటుచున్నవి. తోటివయస్సు సహవాసుల వత్తిడి అనేకమందిని వివాహానికి ముందే లైంగిక క్రియలలో పాల్గొనేటట్లు, మత్తుమందులు, మత్తుపానీయాలు తీసికొనేటట్లు పురికొల్పుతుంది.
కుటుంబ దురవస్థకు మూలకారణాలు
కుటుంబములపైన ముట్టడి ఎంతో అధికంగా, వినాశకరంగా ఉంది. కుటుంబాలు బ్రతికి బయటపడాలంటే ఏవి సహాయపడగలవు? కుటుంబ సలహాదారుడు జాన్ బ్రాడ్షా ఇలా సూచిస్తున్నాడు: “గత 150 సంవత్సరముల నుండి తల్లిదండ్రులుగా మనకు గల విధులు నూతనపరచబడలేదు. . . . నా అభిప్రాయం ప్రకారం సనాతన ధర్మాలు పనిచేయవు.” ఏమైనను, మానవ కల్పిత కట్టడలను ఎక్కువచేస్తే పరిష్కారం లభించదు. కుటుంబమునకు మూలకర్త యెహోవా దేవుడు. ఆయనకు అందరికంటె మిన్నగా వ్యక్తిగత సంతోషములో కుటుంబ జీవిత పాత్ర ఎంత ప్రాముఖ్యమో, కుటుంబ జీవితాన్ని సంతోషంగా బలమైనదిగా చేయటానికి అవసరమైనదేదో తెలుసు. ఆయన వాక్యమైన బైబిలు కుటుంబ దురవస్థకు సరైన పరిష్కారమందిస్తున్నదనుట మనకు ఆశ్చర్యం కలిగించవలెనా?
అతిపురాతనమైన ఆ గ్రంథం కుటుంబ జీవితమెలా వక్రమార్గం పట్టిందో వివరిస్తుంది. మొదటి దంపతులైన ఆదాము హవ్వలు, ఒక అందమైన ఉద్యానవనములో ఉంచబడి, భూమిని ఒక భూవ్యాప్త పరదైసుగా మార్చు ఆశాజనకమైన సవాలును కలిగియుండిరి. ఆదామును దేవుడు కుటుంబమునకు శిరస్సుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ‘సాటియైన సహాయకారిణిగా’ ‘సహచరిగా’ ఆదాము శిరసత్వమునకు హవ్వ సహకరించవలసివుండెను. అయితే హవ్వ ఈ ఏర్పాటుపై తిరుగుబాటు చేసింది. తన భర్తయొక్క శిరసత్వాన్ని తాను అపహరించి, దేవుడు వారిపై విధించిన ఒకే ఒక నిషేధాజ్ఞను ఉల్లంఘించింది. ఆదాము తన శిరసత్వాన్ని పరిత్యజించి, ఆమె తిరుగుబాటుతో ఏకీభవించాడు.—ఆదికాండము 1:26–3:6.
దేవుని ఏర్పాటునుండి వైదొలగినందున కలిగే దాని వినాశకర ఫలితాలు వెంటనే స్పష్టమయ్యాయి. నిష్కళంకంగా, స్వచ్ఛతతో ఉన్న ఆదాము హవ్వలు దోషపూరిత భావంతో, అవమానంతో నిండిపోయారు. మొదట తన భార్యను పద్యకావ్యముతో ఆదరముగా పొగడిన ఆదాము ఇప్పుడామెను నిరాశా హృదయముతో ‘నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే’ అనే వరకు వచ్చాడు. ఈ ప్రతికూల మాటయే వివాహ దుర్దశకు ప్రారంభము. ఆదాము తన శిరసత్వాన్ని తిరిగి సంపాదించుకొనుటకు చేసే నిష్ఫల ప్రయత్నాలు ఆయన ‘ఆమెను ఏలేవానిగా’ చేస్తాయి. మరోప్రక్క హవ్వకు ఆమె భర్తయెడల వాంఛ కలుగుతుంది, చాలావరకు ఇది మితములేనిదై, సమతూకాన్ని కోల్పోయేదై ఉంటుంది.—ఆదికాండము 2:23; 3:7-16.
నిస్సందేహంగా, ఆదాము హవ్వల వివాహ కలత వారి సంతానముపై హానికరమైన ప్రభావాన్ని చూపింది. వారి మొదటి కుమారుడైన కయీను నిర్దాక్షిణ్య హంతకుడయ్యాడు. (ఆదికాండము 4:8) కయీను నుండి వచ్చిన లెమెకు మొట్టమొదటి బహు భార్యాచరునిగా చరిత్రపుటలకెక్కి, వివాహ క్షీణతకు నాంది పలికాడు. (ఆదికాండము 4:19) ఆ విధంగా ఆదాము హవ్వలు పాపమును, మరణమును వారసత్వంగా ఇచ్చుటతోపాటు, మానవజాతి అప్పటినుండి అనుభవిస్తున్న వ్యాధిగ్రస్తమైన కుటుంబ విధానాన్ని అందించారు. అట్టి వివాహ అననుగుణ్యత ఈ అంత్యదినములలో ఎప్పుడూలేని రీతిగా దాని ఉచ్ఛస్థాయికి చేరుకున్నది.
వర్థిల్లే కుటుంబాలు
అయితే కుటుంబాలన్ని నేటి వత్తిడులతో సతమత మగుటలేదు. ఉదాహరణకు అమెరికాలో ఒక వ్యక్తి, భార్యా ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. వారి పొరుగువారిలోనైతే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అంతరమున్నప్పటికిని, ఆయనకేగాని, ఆయన భార్యకేగాని వారి బిడ్డలు మత్తుమందులను వాడతారనిగాని లేక లైంగికదుర్నీతికి పాల్పడుటకు ప్రయత్నిస్తారేమోననిగాని భయంలేదు. సోమవారం సాయంకాలాలలో ఇతర యౌవనులు టివికి అతుక్కుపోయి ఉన్న సమయంలో, వారి కుటుంబమంతా భోజన బల్లవద్ద బైబిలు చర్చకు కూడుకొని ఉంటారు. “మేమందరము కూడుకొని కలిసి మాట్లాడుకొనుటకు సోమవారం రాత్రి మాకు ఒక ప్రత్యేక రాత్రి” అని ఆయన వివరిస్తున్నాడు. “మా కుమార్తెలు వారి సమస్యలనుగూర్చి సందేహం లేకుండా మాతో స్వేచ్ఛగా మాట్లాడతారు.”
మరోవైపు, న్కూయార్క్ నగరంలో ఒక ఒంటరియైన తల్లి ఉంది. ఆమెకూడా తన ఇద్దరు కుమార్తెలతో అసాధారణమైన కుటుంబ బంధాన్ని అనుభవిస్తుంది. ఇందులో రహస్య మేమిటి? ఆమె ఇలా వివరిస్తుంది, “మేము వారాంతంవరకు టివిని మూసేస్తాం.” “మాకు అనుదినము బైబిలు వచనాలపై చర్చ ఉంటుంది. ఒక రోజు సాయంత్రాన్ని మేము కుటుంబ బైబిలు చర్చకు కేటాయిస్తాము.”
ఈ రెండు కుటుంబాలు యెహోవాసాక్షులే. కుటుంబాల కొరకు బైబిలిచ్చే ఉపదేశాన్ని వారు అనుసరిస్తుంటారు. అది వారికి తగిన ఫలితాలనిస్తుంది. అయినను, వారు మాత్రమే కాదు. వారిలాగే కుటుంబ జీవితముపై ఆ గ్రంథములో వ్రాయబడివున్న కట్టడలను గైకొంటూ మంచి ఫలితాలను పొందుతున్న వందలవేల కుటుంబాలు గలవు.b మరి ఆ కట్టడ లేమిటి? అవి మీకు మీ కుటుంబానికి ఎలా ప్రయోజనకరం కాగలవు? సమాధానం కొరకు తదుపరి పేజిలో ప్రారంభమయ్యే శీర్షికలను పరిశీలించమని మిమ్ము నాహ్వానిస్తున్నాము.
[అధస్సూచీలు]
a అంత్యదినములు 1914 నుండి ప్రారంభమైనవనుటకు ఇంకా ఎక్కువ నిదర్శనాలకై వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ వారు ప్రచురించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకము 18వ అధ్యాయము చూడండి.
b యెహోవాసాక్షులు ఉచిత గృహ బైబిలు పఠనము ద్వారా బైబిలు సూత్రములను కుటుంబములో అన్వయించుకొనేందుకు వ్యక్తిగత సహాయంచేస్తారు. ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయుటద్వారా మీరు వారితో పరిచయమేర్పరచుకొనవచ్చును.
[4వ పేజీలోని చిత్రం]
అభివృద్ధిచెందుతున్న దేశాలలో పేద ఆర్థిక పరిస్థితులు కుటుంబములలో ఎంతో దురవస్థకు కారణమవుచున్నవి
[క్రెడిట్ లైను]
U.S. Navy photo
[7వ పేజీలోని చిత్రం]
బైబిలు సూత్రములను అన్వయించు కొనుటద్వారా అనేక కుటుంబములు నేటి వత్తిడులను ఎదుర్కొని, తాళగలుగుచున్నవి