కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/1 పేజీలు 14-19
  • మెస్సీయ ప్రత్యక్షత, ఆయన పరిపాలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మెస్సీయ ప్రత్యక్షత, ఆయన పరిపాలన
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీస్తు తిరిగివచ్చు విధానం
  • అదెప్పుడు ఆరంభమగును?
  • ఎందుకు కష్టభరిత కాలము?
  • భూమిని మెస్సీయ పరిపాలించునప్పుడు
  • ఆయన పరిపాలన నీమీదెట్లు ప్రభావం చూపును
  • యేసు ప్రత్యక్షతపై దృష్టిని కేంద్రీకరించుట
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసు రాకడ లేక యేసు ప్రత్యక్షత—ఏది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మెస్సీయ— దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/1 పేజీలు 14-19

మెస్సీయ ప్రత్యక్షత, ఆయన పరిపాలన

“మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.”—అపొస్తలుల కార్యములు 1:11.

1, 2. (ఎ) యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఇద్దరు దేవదూతలెట్లు ఆయన అపొస్తలులను ఓదార్చారు? (బి) క్రీస్తు రాకడను గూర్చిన ఉత్తరాపేక్షచే ఏ ప్రశ్నలు ఉత్పన్నమగుచున్నవి?

ఒలీవ కొండ తూర్పువైపుగల దిగువ ప్రాంతమందు పదకొండు మంది మనుష్యులు ఆకాశంవైపు తేరిచూస్తు నిలువబడియున్నారు. కొద్ది క్షణాల క్రితమే యేసుక్రీస్తు వారిమధ్యనుండి పైకిలేచాడు, అలా పైకివెళ్తున్న ఆయన రూపం క్రమేణి మసకబారుతూ చివరకొక మేఘం అడ్డంరావడంతో పూర్తిగా కనుమరుగై పోయింది. ఆయనతో గడిపిన సంవత్సరాలలో, యేసు తాను మెస్సీయనని నిరూపించుటకు కొండంత సాక్ష్యమివ్వడాన్ని ఈ మనుష్యులు చూశారు; హృదయవిదారకంగా ఆయన మరణించడాన్ని చూశారు, ఆ తర్వాత అత్యానందభరితమైన ఆయన పునరుత్థానాన్ని వారు చూశారు. ఇప్పుడాయన వెళ్లిపోయాడు.

2 అకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు వారిమధ్య ప్రత్యక్షమై వారికి ఈ ఓదార్పుకరమైన మాటలు విన్పించారు: “గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.” (అపొస్తలుల కార్యములు 1:11) ఎంత చక్కని అభయం—యేసు పరలోకానికి ఎక్కిపోవడమంటే భూమిని గూర్చి, మానవజాతిని గూర్చి ఆయనిక ఏ మాత్రం పట్టించుకోడని దాని భావం కాదు! బదులుగా, యేసు తిరిగి వస్తాడు. ఈ మాటలు నిస్సందేహముగా అపొస్తలులలో నిరీక్షణను నింపాయి. క్రీస్తు తిరిగి వస్తాడను ఈ వాగ్దానానికి లక్షలాదిమంది ప్రజలీనాడు ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిస్తున్నారు. కొంతమంది దీనిని “రెండవ రాకడని” లేదా “ఆగమనమని” అంటారు. అయితే క్రీస్తు తిరిగి వస్తాడనగా దాని నిజమైన భావమేమను విషయంలో చాలామంది గలిబిలిని కలిగియున్నట్లు కన్పిస్తోంది. క్రీస్తు ఏ విధంగా తిరిగి వస్తాడు? ఎప్పుడు? ఇది ఈనాటి మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపును?

క్రీస్తు తిరిగివచ్చు విధానం

3. క్రీస్తు రాకడను గూర్చి అనేకమంది ప్రజలు ఏమని నమ్ముతున్నారు?

3 ఏన్‌ ఇవాంజిలికల్‌ క్రైస్టోలజీ అను పుస్తకం ప్రకారం, “క్రీస్తు రెండవసారి రావడం లేదా తిరిగి వచ్చుట (పరోసియా) చివరకు, బాహాటంగా దేవుని రాజ్యాన్ని శాశ్వతంగా స్థాపించును.” క్రీస్తు రాకడ భూమిపైనున్న ప్రతివారు అక్షరార్థంగా చూసేటట్లు, అందరికి కనబడేటట్లు ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఈ అభిప్రాయాన్ని బలపరచుటకు చాలామంది ప్రకటన 1:7 సూచిస్తారు, అక్కడ మనమిలా చదువుతాము: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు.” అయితే ఈ వచన భావాన్ని అక్షరార్థముగా తీసికోవాలా?

4, 5. (ఎ) ప్రకటన 1:7కు అక్షరార్థ భావము లేదని మనకెట్లు తెలియును? (బి) యేసు స్వంత మాటలే దీనినెట్లు స్థిరపరుస్తున్నవి?

4 ప్రకటన గ్రంథం “సూచనలతో” ఇవ్వబడిందని గుర్తుంచుకొనుము. (ప్రకటన 1:1) కాబట్టి, ఈ వాక్యం సూచనార్థకమై యుండాలి; లేనట్లయితే “ఆయనను పొడిచిన వారు” సహితం క్రీస్తు రాకడను ఎలా చూడగలరు? వారు చనిపోయి ఇప్పటికే దాదాపు 20 శతాబ్దాలు కావస్తుంది! అంతేకాకుండా, క్రీస్తు తిరిగి రావడం ఆయన ఎలా వెళ్లాడో “ఆ రీతిగానే” ఉంటుందని దేవదూతలు చెప్పారు. మరి ఆయనెలా వెళ్లాడు? లక్షలాది మంది చూస్తుండగానా? లేదే, ఆ సంఘటనను కేవలం ఆయన నమ్మకస్థులుగా వున్న కొద్దిమంది మాత్రమే చూశారు. ఆలాగే దేవదూతలు వారితో మాట్లాడినప్పుడు, క్రీస్తు పరలోకం వరకు ప్రయాణమై వెళ్లడాన్ని అపొస్తలులు అక్షరార్థంగా చూశారా? లేదే, వారికి కనబడకుండ ఒక మేఘం అడ్డువచ్చింది. ఆ తర్వాత కొంతసమయానికి, మానవ నేత్రాలకు అదృశ్యంగా ఆయన ఆత్మీయప్రాణిగా ఆత్మీయాకాశంలో ప్రవేశించాడు. (1 కొరింథీయులు 15:50) కాబట్టి, ఎంతచూసినా, అపొస్తలులు కేవలం యేసు ప్రయాణపు ఆరంభాన్ని మాత్రమే చూశారు; దాని గమ్యాన్ని అనగా ఆయన తన తండ్రియగు యెహోవా పరలోక సన్నిధికి తిరిగిచేరడాన్ని వారు చూడలేకపోయారు. దీనిని వారు కేవలం తమ విశ్వాస నేత్రాలతో మాత్రమే చూడగల్గారు.—యోహాను 20:17.

5 యేసు అదేరీతిలో తిరిగి వస్తాడని బైబిలు బోధిస్తున్నది. తన మరణానికి ముందు యేసు తానుగా ఇలా చెప్పాడు: “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు.” (యోహాను 14:19) “దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు” అని కూడ ఆయన చెప్పాడు. (లూకా 17:20) కాబట్టి, ఏ భావమందు ‘ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది’? దీనికి జవాబిచ్చేందుకు, ఆయన రాకడను గూర్చి యేసు, ఆయన అనుచరులు వాడిన పదాన్ని మొదట మనం స్పష్టంగా అర్థం చేసికోవాలి.

6. (ఎ) “రాకడ,” “వచ్చుట,” “రాబోవును,” మరియు “ఆగమనం” వంటి పదాలు ఎందుకు గ్రీకు పదమైన పరోసియా కు సరియైన అనువాదం కాదు? (బి) పరోసియా, లేదా “ప్రత్యక్షత” ఏదోక క్షణికమైన సంఘటన కంటె ఎక్కువకాలం నిలిచియుండేదని ఏది చూపిస్తున్నది?

6 వాస్తవమేమంటే, కేవలం “తిరిగి వచ్చుట” కంటే క్రీస్తు మరెంతో ఎక్కువచేస్తాడు. “రాకడ,” “వచ్చుట,” లేదా “ఆగమనం” వంటి ఆ పదం కొద్దిసమయంలో జరిగే ఒకే సంఘటనను సూచిస్తుంది. అయితే యేసు ఆయన అపొస్తలులు ఉపయోగించిన గ్రీకు పదానికి అంతకంటే ఎక్కువ భావం ఉంది. ఆ పదం పరోసియా, దీనికి అక్షరార్థముగా “కూడ ఉండుట” లేదా “ప్రత్యక్షత” అని భావం. ఈ పదంలో కేవలం రావడమనే కాకుండా—రాజ కుటుంబీకుని అధికార పర్యటనలోవలె—ఆ తర్వాత ఉండు ప్రత్యక్షత అనే భావం కూడ చేరియున్నట్లు అనేకమంది విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ఈ ప్రత్యక్షత కేవలం క్షణికమైనది కాదు; అది ఒక ప్రత్యేకమైన కాలం, ఒక గుర్తింపబడిన కాలమై యుండును. మత్తయి 24:37-39లో “మనుష్యకుమారుని రాకడ [ప్రత్యక్షత, NW]” చివరకు జలప్రళయం ద్వారా ముగించబడిన “నోవహు దినముల” వలె నుండునని యేసు చెప్పాడు. జలప్రళయం వచ్చి, ఆ యవినీతి విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టుటకు ముందు దశాబ్దాలపాటు నోవహు ఓడను నిర్మిస్తూ, దుష్టులను హెచ్చరిస్తుండెను. కాబట్టి, అదేప్రకారం మహాగొప్పనాశనం సంభవించడానికి ముందు క్రీస్తు అదృశ్య ప్రత్యక్షత కొన్ని దశాబ్దాలపాటు ఉంటుంది.

7. (ఎ) పరోసియా మానవ నేత్రాలకు దృశ్యమైనది కాదని ఏది నిరూపిస్తున్నది? (బి) క్రీస్తు తిరిగి వచ్చుట “ప్రతి నేత్రము” చూచునని వివరించిన లేఖనములు ఎట్లు మరియు ఎప్పుడు నెరవేరును?

7 నిస్సందేహముగా, పరోసియా మానవ నేత్రాలకు అక్షరార్థముగా దృశ్యమగురీతిలో కనబడదు. ఒకవేళ అలావుంటే, మనము చూడబోవునట్లు, ఈ ప్రత్యక్షతను వివేచించుటకు సహాయపడు సూచనను తన అనుచరులకిస్తూ యేసు ఎందుకంత సమయం గడిపాడు?a అయితే సాతాను లోక విధానాన్ని నాశనం చేయడానికి క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షత ఎంతో స్పష్టముగా అందరికి కనుపరచబడును. అప్పుడు “ప్రతి నేత్రము ఆయనను చూచును.” తాము ఆశ్చర్యపడు రీతిగా యేసు వ్యతిరేకులు సహితం క్రీస్తు పరిపాలన నిజమని గ్రహించగల్గుదురు.—మత్తయి 24:30; 2 థెస్సలొనీకయులు 2:8; ప్రకటన 1:5, 6 చూడుము.

అదెప్పుడు ఆరంభమగును?

8. క్రీస్తు ప్రత్యక్షత యొక్క ఆరంభము వలన ఏ సంఘటన గుర్తించబడును, ఇది ఎక్కడ సంభవించింది?

8 పదేపదే ప్రస్తావించబడిన మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలను నెరవేర్చు సంఘటనతో మెస్సీయ ప్రత్యక్షత ఆరంభమగును. పరలోకమందు రాజుగా ఆయన కిరీటం ధరించాడు. (2 సమూయేలు 7:12-16; యెషయా 9:6, 7; యెహెజ్కేలు 21:26, 27) తన ప్రత్యక్షత తన రాజరికముతో ముడిపెట్టబడి యుండునని యేసు తానుగా తెలియజేశాడు. అనేక దృష్టాంతములలో, ఆయన తనను తన యింటిని సేవకులను విడిచి ‘రాజ్యాధికారము’ పొందుటకు చాలాకాలము ప్రయాణించి “దూరదేశమునకు” వెళ్లిన ఒక యజమానునికి పోల్చుకొనెను. ఆయన పరోసియా ఆరంభమెప్పుడని ఆయన అపొస్తలులు అడిగిన ప్రశ్నకిచ్చిన జవాబులో భాగంగా ఆయన ఇటువంటి దృష్టాంతము నొకదానిని చెప్పాడు; “దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచి” నందున ఆయన మరొక దృష్టాంతాన్ని చెప్పాడు. (లూకా 19:11, 12, 15; మత్తయి 24:3; 25:14, 19) కాబట్టి, మానవునిగా ఆయన జీవించిన కాలములో, “దూరదేశమను” పరలోకములో ఆయన రాజ్యాభిషేకం జరుగుటకు ఇంకా చాలాకాలము పట్టును. అదెప్పుడు జరుగును?

9, 10. యేసు ప్రస్తుతం పరలోకంలో పరిపాలిస్తున్నాడనుటకు ఏ రుజువు కలదు, మరియు ఆయనెప్పుడు తన పరిపాలనను ఆరంభించాడు?

9 “నీ రాకడకును [ప్రత్యక్షతకును NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని యేసు శిష్యులు ఆయనను అడిగారు. యేసు దానికి జవాబిస్తూ ఆ భవిష్యత్తుకు సంబంధించిన వివరణాత్మకమైన సమాచారము నిచ్చాడు. (మత్తయి, 24వ అధ్యాయం; మార్కు, 13వ అధ్యాయం; లూకా, 21వ అధ్యాయం; మరియు 2 తిమోతి 3:1-5; ప్రకటన, 6వ అధ్యాయములు కూడ చూడండి.) ఈ సూచన ఒక అపాయకరమైన కాలముయొక్క వివరణాత్మక చిత్రాన్ని ఇస్తున్నది. అది అంతర్జాతీయ యుద్ధములు, నేరము పెరుగుట, కుటుంబ జీవనము విచ్ఛిన్నమగుట, తెగుళ్లు, కరవులు, భూకంపములు—మొదలగునవి స్థానిక సమస్యలుగా కాదుగాని ప్రపంచవ్యాప్త సంక్షోభముగా గుర్తింపబడు కాలమై యుండును. ఇది సుపరిచితమే అన్నట్లున్నదా? ఈ 20వ శతాబ్దం యేసు యిచ్చిన వర్ణనకు సరిగ్గా సరిపోతుందని గతించే ప్రతిదినం స్థిరపరుస్తుంది.

10 మానవ చరిత్రలో 1914 ఒక మలుపు వంటిదని చరిత్రకారులు ఒప్పుకొందురు, ఆ కీలక సంవత్సరము తర్వాత అనేక సమస్యలు అంతర్జాతీయ సమస్యలుగా పెరుగుచు అధీనము తప్పుట కారంభమాయెను. అవును, బైబిలు ప్రవచనాల ప్రకారం నెరవేరుచున్న ప్రపంచ సంఘటనలన్నియు 1914లో యేసు పరలోకములో రాజుగా ఏలనారంభించెనని సూచిస్తున్నవి. అంతేకాకుండ, దానియేలు 4వ అధ్యాయమందలి ప్రవచనము కూడ యెహోవా నియమించిన రాజు పరిపాలన ఆరంభించు కాలమని, అదే సంవత్సరం అంటే 1914కు మనలను నడుపు కాలవృత్తాంత రుజువు నిస్తున్నది.b

ఎందుకు కష్టభరిత కాలము?

11, 12. (ఎ) ఇప్పుడు క్రీస్తు పరలోకంలో పరిపాలిస్తున్నాడను మాటను నమ్మడానికి కొందరికెందుకు కష్టమౌతుంది? (బి) యేసు కిరీటధారియైన తర్వాత జరిగినదానిని మనమెట్లు దృష్టాంతపరచ గలము?

11 అయితే, ‘మెస్సీయ పరలోకము నుండి పరిపాలిస్తుంటే లోకమెందుకింత కష్టముతో నిండియున్నది? ఆయన పరిపాలన అసమర్థముగా ఉన్నదా?’ అని కొందరు ఆశ్చర్యపడవచ్చును. దీనికి ఒక దృష్టాంతము సహాయము చేయవచ్చును. ఒక దేశాన్ని దుష్టుడైన ఒక అధ్యక్షుడు పరిపాలిస్తున్నాడు. దేశం నలుమూలలా విస్తరించిన అవినీతి ప్రభావముతో కూడిన విధానాన్ని అతడు నెలకొల్పాడు. అలావుండగా ఎన్నికలు జరిగి ఒకమంచి వ్యక్తి ఎన్నికయ్యాడు. ఇప్పుడేమి జరుగుతుంది? కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో జరిగినట్లు కొత్త అధ్యక్షుడు పదవీ స్వీకారానికి ముందు అధికార మార్పిడికి కొన్ని నెలలు పడుతుంది. ఆ కాలంలో ఈ ఇరువురు వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు? ఆ మంచి వ్యక్తి వెంటనే ముట్టడిచేసి ఆ మాజీ అధ్యక్షుడు దేశమంతట ప్రబలింపజేసిన ఆ దుష్కార్యములన్నింటిని నిర్మూలం చేస్తాడా? లేదు, దానికి బదులు, ఆయన క్రొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసికొని, ఆ మాజీ అధ్యక్షుని దుష్ట సన్నిహితుల, అనుయాయుల సంబంధాలను నియంత్రించుటకు మొదట రాజధానిపై దృష్టినిలుపడా? ఆ విధముగా ఆయన పూర్తి అధికారమునకు వచ్చినప్పుడు, ఆయన మచ్చలేని, సమర్థవంతమైన అధికార పీఠమునుండి అధికారము చేయగలడు. ఇక అవినీతిపరుడైన అధ్యక్షుని విషయానికొస్తే, తాను అధికారాన్ని కోల్పోకముందే దేశము నుండి తనకు చేతనైనంతగా అక్రమ ధనార్జన చేయుటకు తనకున్న ఆ కొద్దిసమయాన్ని ఉపయోగించుకొనడా?

12 నిజానికి, క్రీస్తు పరోసియా విషయం కూడ అంతే. క్రీస్తు పరలోకంలో రాజుగా చేయబడినప్పుడు ఆయన పరలోకం నుండి సాతానును అతని దయ్యాలను పడద్రోసి, తన ప్రభుత్వ స్థానాన్ని పరిశుభ్రం చేశాడని ప్రకటన 12:7-12 చూపిస్తున్నది. దీర్ఘకాలంగా వేచియున్న ఈ ఓటమిపాలైన సాతాను, భూమిపై క్రీస్తు తన అధికారాన్ని పూర్తిగా వినియోగించుటకు ముందు మిగిలియున్న ఆ “కొద్దికాలములో” ఎలా ప్రవర్తిస్తాడు? ఆ యవినీతి అధ్యక్షునివలెనే, అతడు ఈ పాత విధానం నుండి సాధ్యమైనంత మేరకు ప్రతిదానిని చేజిక్కించుకొనుటకు ప్రయత్నిస్తాడు. అతనికి కావల్సింది డబ్బు కాదు, మనుష్యుల జీవితాలు. తనకు సాధ్యమైనంత మేరకు యెహోవా నుండి, పరిపాలిస్తున్న ఆయన రాజునుండి ప్రజలను వేరుచేయాలని అతడు కోరుతున్నాడు.

13. క్రీస్తు పరిపాలనారంభ కాలములో ఈ భూమిపై కష్టాలుండునని లేఖనములెట్లు చూపిస్తున్నవి?

13 కాబట్టి, మెస్సీయ పరిపాలనారంభ కాలమందు “భూమికి శ్రమ” ఉంటుందనుటలో ఆశ్చర్యం లేదు. (ప్రకటన 12:12) అదేప్రకారం, కీర్తన 110:1, 2, 6 కూడ మెస్సీయ ‘తన శత్రువుల మధ్యనూ’ తన పరిపాలనను ఆరంభించునని చూపిస్తున్నది. ఆ తర్వాత మాత్రమే ఆయన సాతాను కుళ్లిన విధానంయొక్క ప్రతి భాగంతోపాటు “అన్యజనులను” సంపూర్ణముగా నలుగగొట్టును!

భూమిని మెస్సీయ పరిపాలించునప్పుడు

14. సాతాను దుష్ట విధానాన్ని నాశనం చేసిన తర్వాత మెస్సీయా ఏమి చేయగల్గును?

14 సాతాను విధానాన్ని, దాని మద్దతుదారులందరిని నాశనం చేసిన తర్వాత, మెస్సీయ రాజగు యేసుక్రీస్తు తన వెయ్యేండ్ల పరిపాలనను వర్ణించు అద్భుతకరమైన బైబిలు ప్రవచనాలను నెరవేర్చు స్థితిలో ఉంటాడు. మెస్సీయ ఎటువంటి రాజుగా ఉండునో మనం గ్రహించుటకు యెషయా 11:1-10 మనకు సహాయము చేయును. ఆయన “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మను” కలిగియుండునని 2వ వచనము మనకు తెలుపుచున్నది.

15. మెస్సీయ పరిపాలనలో ‘బలముగల ఆత్మ’ అనగా దాని భావమేమి?

15 యేసు పరిపాలనయందలి ‘బలమునకు ఆధారమగు ఆత్మ’ అంటే దాని భావమేమిటో ఆలోచించుము. ఆయన భూమిపైనుండగా అద్భుతాలు చేయుటకు యెహోవా ఆయనకు అనుగ్రహించిన బలమును ఆయన కొంత కలిగియుండెను. “నా కిష్టమే” అని చెప్పుచు, ప్రజలకు సహాయం చేయు హృదయపూర్వక కోరికను ఆయన చూపాడు. (మత్తయి 8:3) అయితే ఆ దినాలలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన పరలోకం నుండి పరిపాలించునప్పుడు చేయుదానికి కేవలం ముంగుర్తులు మాత్రమే. యేసు భూవ్యాప్తంగా అద్భుతాలు చేస్తాడు! రోగులు, గ్రుడ్డివారు, మూగవారు, అంగవిహీనులు, కుంటివారు శాశ్వతంగా స్వస్థపరచబడతారు. (యెషయా 35:5, 6) అందరికి సమానంగా పంచబడు విస్తారమైన ఆహారం శాశ్వతంగా ఆకలి సమస్యను అంతమొందించును. (కీర్తన 72:16) దేవుడు జ్ఞాపకం చేసికోవడానికి ఇష్టపడిన సమాధులలోని ఆ కోటానుకోట్ల మంది సంగతేమి? ప్రతియొక్కరికి పరదైసు భూమిలో నిత్యము జీవించు అవకాశమునిస్తూ, వారిని పునరుత్థానముచేయు శక్తి యేసు “బలము” నందు ఇమిడియుండును! (యోహాను 5:28, 29) ఇంత బలమున్ననూ, ఆ మెస్సీయ రాజు అన్నిసమయాలలో ఎంతో వినయస్థుడై యుండును. “యెహోవా భయము అతనికి ఇంపుగా” ఉండును.—యెషయా 11:3.

16. రాజైన మెస్సీయ ఎలాంటి న్యాయాధిపతియై యుండును, మరియు అది మానవ న్యాయాధిపతికి ఎట్లు భిన్నమై యుండును?

16 ఈ రాజు పరిపూర్ణమైన న్యాయాధిపతిగా కూడ ఉండును. “కంటిచూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు, తాను వినుదానినిబట్టి విమర్శచేయడు.” గతమందు లేదా ప్రస్తుతమందు ఏ న్యాయాధిపతి ఆ విధంగా వర్ణింపబడ గలడు? అతడెంత న్యాయవంతుడైనను, జ్ఞానము లేదా వివేచన గలవాడైనను, అతడు కేవలము తాను చూచిన, వినిన దానిని బట్టియే తీర్పుతీర్చగలడు. కాబట్టి, ఈ పాప లోకపు న్యాయాధిపతులు, న్యాయనిర్ణేతలు తెలివిగా పన్నిన కుయుక్తులు, కోర్టుగదిలోని ఎత్తులు, లేదా పరస్పర విరుద్ధ సాక్ష్యాలతో గలిబిలి చేయబడవచ్చు. తరచు ధనవంతులు, అధికారం గలవారు మాత్రమే సమర్థవంతమైన ప్రతివాదనకు డబ్బు పెట్టగలరు, అంటే నిజానికి న్యాయాన్నికొంటున్నారు. న్యాయాధిపతియగు మెస్సీయ విషయంలో అలా జరుగదు. ఆయన హృదయాలను పసిగడతాడు. ఆయన దృష్టికి రాకుండా ఏదియు తప్పించుకొనదు. ప్రేమ, కనికరముతో బలపర్చబడిన న్యాయం, అమ్మబడదు. అది అన్నివేళలా నిలిచి ఉంటుంది.—యెషయా 11:3-5.

ఆయన పరిపాలన నీమీదెట్లు ప్రభావం చూపును

17, 18. (ఎ) యెషయా 11:6-9లో మానవజాతి భవిష్యత్తును గూర్చి ఎట్టి శోభాయమానమైన చిత్రీకరణ ఇవ్వబడింది? (బి) ఈ ప్రవచనం ప్రాథమికంగా ఎవరికి అన్వయించును, ఎందుకు? (సి) ఈ ప్రవచనం ఎట్లు అక్షరార్థమైన నెరవేర్పును కలిగియుండును?

17 మెస్సీయ పరిపాలన దాని ప్రజలపై బలమైన ప్రభావాన్ని కలిగియుంటుందని మనం అర్థంచేసికోవచ్చు. అది ప్రజలను మారుస్తుంది. ఆ మార్పులు ఎంత విస్తారంగా ఉంటాయో యెషయా 11:6-9 చూపిస్తుంది. ఈ ప్రవచనం గగుర్పాటుకల్గించే రీతిలో, ప్రమాద భరితమైన, మాంసభక్షక జంతువులు అంటే, ఎలుగులు, తోడేళ్లు, చిరుతలు, సింహాలు, నాగుబాములు, నిరపాయకరమైన సాధు జంతువులతో, చివరకు పిల్లలతో కలిసిమెలసి యుండే దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది. అయినను ఈ మాంసాహార జంతువులు ఎలాంటి హాని చేయవు! ఎందుకు? దానికి 9వ వచనం ఇలా జవాబిస్తుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశనము చేయదు; సముద్రము జలముతో నిండియున్నట్టు, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.”

18 “యెహోవాను గూర్చిన జ్ఞానము” అక్షరార్థ జంతువులపై ఎలాంటి ప్రభావం చూపదు; కాబట్టి ఈ వచనాలు ప్రాథమికంగా ప్రజలకే అన్వయిస్తాయి. యెహోవాను గూర్చి, ఆయన మార్గాలను గూర్చి ప్రజలకు బోధించే, మరియు ప్రతివారు తమ పొరుగువారిని ప్రేమించి, గౌరవించి, సన్మానించాలని బోధించే భూవ్యాప్త విద్యాబోధనా కార్యక్రమాన్ని మెస్సీయ పరిపాలన ఏర్పాటుచేస్తుంది. రానైయున్న పరదైసులో, మానవజాతిని మెస్సీయ అద్భుతంగా శారీరక, నైతిక పరిపూర్ణతకు పునరుద్ధరిస్తాడు. అసంపూర్ణ మానవ స్వభావాన్ని పాడుచేయు వేటాడే మరియు జంతు లక్షణాలు గతించిన సంగతులై యుండును. అక్షరార్థంగా కూడ, చివరకు మానవజాతి జంతువులతో సమాధానము కలిగి జీవించును!—ఆదికాండము 1:28 పోల్చండి.

19. ఈ అంత్య దినములందలి ప్రజల జీవితాలపై మెస్సీయ పరిపాలన ఎట్లు ప్రభావం చూపిస్తుంది?

19 అయితే, మెస్సీయ ఇప్పుడు పరిపాలిస్తున్నాడని మర్చిపోవద్దు. ఒక భావమందు యెషయా 11:6-9ని నెరవేరుస్తూ ఇప్పుడు కూడ ఆయన రాజ్య ప్రజలు సమాధానముగా కలిసి జీవించడాన్ని నేర్చుకుంటున్నారు. అంతేకాకుండ, దాదాపు గత 80 సంవత్సరాల నుండి యేసు యెషయా 11:10ని నెరవేరుస్తున్నాడు: “ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” ప్రతి జనాంగమందలి ప్రజలు మెస్సీయవైపు తిరుగుచున్నారు. ఎందుకు? ఎందుకనగా, ఆయన పరిపాలింప మొదలుపెట్టి నప్పటినుండి ఆయన “ధ్వజముగా నిలుచుచున్నాడు.” పైన వివరింపబడిన విస్తారమైన విద్యాబోధన కార్యక్రమము ద్వారా ప్రపంచ వ్యాప్తముగా ఆయన తన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. నిజానికి, ఈ విధానాంతమునకు ముందు తన ప్రత్యక్షతకు లోకమందంతట జరుగు ప్రకటించుపని ఒక అసాధారణ సూచనగా ఉండునని యేసు ప్రవచించాడు.—మత్తయి 24:14.

20. మెస్సీయ పాలన క్రిందుండే ప్రజలందరు ఏ దృక్పధాన్ని విసర్జించాలి, ఎందుకు?

20 కాబట్టి రాజ్యాధికారమందలి క్రీస్తు ప్రత్యక్షత ఏ మూలనో పడివున్న సిద్ధాంత విషయం కాదు, లేక కేవలం వేదాంతుల మధ్య జరిగే మేధావుల చర్చ కాదు. యెషయా ప్రవచించినట్లుగానే ఆయన పరిపాలన భూమిపైనున్న వారిపై ప్రభావం చూపి వారి జీవితాలనే మార్చివేస్తుంది. ఈ కుళ్లిన లోక విధానం నుండి యేసు తన రాజ్యం కొరకు లక్షలాది మంది ప్రజలను సమకూర్చాడు. నీవు ఆ ప్రజలలో ఒకడవేనా? అట్లయిన మన పరిపాలకునికి తగినట్లు నీ పూర్ణ ఉత్సాహముతో, ఆనందముతో సేవచేయుము! నిజమే, సహనం కోల్పోయి, “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను?” అనే లోకపు అపనమ్మక మాటలతో చేరిపోవుట చాలా సులభమే. (2 పేతురు 3:4) అయితే యేసు స్వయంగా చెప్పినట్లు, “అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:13.

21. మనమందరము మెస్సీయకు సంబంధించిన నిరీక్షణ యెడల మన గుణగ్రహణను ఎట్లు పెంపొందించు కొనవచ్చును?

21 గడచే ప్రతి దినం కూడ, సమస్త లోకానికి తన ప్రత్యక్షతను కనబరచునట్లు తన కుమారుని యెహోవా నడిపించు ఆ మహాదినమునకు మనల్ని చేరువ చేస్తున్నది. ఆ దినమందు నీకున్న నిరీక్షణను ఎన్నటికి కాంతివిహీనం కానివ్వకుము. మెస్సీయగా ఆయనకున్న అర్హతను, రాజుగా పరిపాలిస్తున్న ఆయన లక్షణాలను ధ్యానించుము. ఆలాగే బైబిలులో వ్రాయబడిన మెస్సీయను గూర్చిన గొప్ప నిరీక్షణకు సూత్రధారి మరియు గ్రంథకర్తయగు యెహోవా దేవుని గూర్చి కూడా లోతుగా తలంచుము. నీవలా చేయుచుండగా, నిస్సందేహముగా నీవు అపొస్తలుడైన పౌలువలెనే భావింతువు. ఆయనిలా వ్రాశాడు: “ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము.”—రోమీయులు 11:33.

[అధస్సూచీలు]

a వేదాంతియైన ఆర్‌. గోవెట్‌ 1864లోనే దీనిని ఈ విధంగా వివరించాడు: “ఇదెంతో నిర్ణయాత్మకమైన విషయంగా నాకు కన్పిస్తుంది. ప్రత్యక్షతకు ఒక సూచన ఇవ్వడమే అది ఒక రహస్యమని చూపిస్తుంది. మనం చూసే ప్రత్యక్షతను మనకు తెలియజేయడానికి మనకే సూచనా అవసరం లేదు.”

b వివరాలకు, “లెట్‌ యువర్‌ కింగ్‌డం కం,” అను పుస్తకములోని పుటలు 133-9 చూడుము.

మీరెట్లు జవాబిస్తారు?

◻ క్రీస్తు ఏ రీతిగా తిరిగి వస్తాడు?

◻ క్రీస్తు పరోసియా అదృశ్యముగా ఉండునని, అది కొంత కాలము వరకు కొనసాగునని మనకెట్లు తెలియును?

◻ క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడు ఆరంభమగును, ఇది మనకెట్లు తెలియును?

◻ మెస్సీయ ఎటువంటి పరలోక పరిపాలకుడై యున్నాడు?

◻ ఏయే విధాలుగా క్రీస్తు పరిపాలన దాని ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది?

[15వ పేజీలోని చిత్రం]

యేసు తిరిగివస్తాడనే నిరీక్షణ ఆయన నమ్మకమైన అపొస్తలులకు ఎంతో భావాన్ని కలిగియుండెను

[17వ పేజీలోని చిత్రం]

యేసు పరలోకం నుండి పరిపాలిస్తు, భూవ్యాప్తముగా అద్భుతాలు జరిగించును

[క్రెడిట్‌ లైను]

Earth: Based on NASA photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి