లోకములో జ్యోతులవలె ప్రకాశించుట
నైతిక కుటిలత, దుర్నీతితో నిండిన లోకములో, ప్రపంచ వ్యాప్తముగానున్న నిజ క్రైస్తవులు వెలుగుకు మూలమై యుండాలి. అంధకార లోకములో వారు జ్యోతులై యుండాలి. (ఫిలిప్పీయులు 2:15) పయినీర్లుగా, లేక పూర్తికాల ప్రచారకులుగా దీనిని చేయుటకు అనేక వేలమంది ఇష్టపడుచున్నారు. వారిలో చాలామంది ఈ సేవలో అనేక సంవత్సరాలు గడిపి, అన్నిజాతుల ప్రజలు యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులగుటకు తమ జీవితాలలో మార్పులు చేసికోవడాన్ని చూసే ఆధిక్యతను పొందారు.—మత్తయి 28:19.
ఈ పవిత్ర సేవలో పయినీర్లు కొనసాగునట్లు ప్రోత్సహించుటకు, వారి బోధనా నైపుణ్యతలయందు అభివృద్ధి సాధించుటకు, యెహోవాసాక్షులు పయినీర్ సేవా పాఠశాలను ఏర్పాటుచేశారు. అది పయినీర్లకు బైబిలు ఆధారిత శిక్షణనిచ్చే పదిరోజుల కోర్సు; అది మూడు రంగాలలో, అనగా యేసుక్రీస్తు అనుచరులుగా యెహోవాతో నడచుట; సహోదరుల సహవాసమంతటి యెడల ప్రేమతో నింపబడియుండుట; లోకములో జ్యోతులవలె ప్రకాశించుటయందు సహాయపడుతుంది.
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లో పయినీరు పాఠశాల
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ రాజధానియగు బాంగుయ్‌నందు 1991 ఆగష్టులో 48 మంది విద్యార్థులు, యిద్దరు ఉపదేశకులు సమావేశమయ్యారు. వారి పని నిమిత్తమై ఆ విద్యార్థులు ఉపదేశాలు, అభ్యాససిద్ధమైన సూచనలు పొందారు. బాంగుయ్ తరగతిని గూర్చి అంత ఉత్తేజకరమైన సంగతి ఏమున్నది?
ఒక సంగతేమంటే, ఆ విద్యార్థులలోని 21 మంది అప్పటికి ఇంకను పాఠశాలలో చదువుతునే ఉన్నారు. పాఠశాలలో చదువుచున్నను, వారు క్రమ పయినీరు సేవ చేయుటకు వీలు కల్పించుకున్నారు. తమ సెలవులను, వారాంత దినములను, మధ్యాహ్న సమయాలను వారు ప్రకటించుటకు, బోధించుటకు ఉపయోగించారు.
ఈ యౌవనస్థులు ఇప్పుడే తమ సృష్టికర్తను సేవించు ప్రాముఖ్యతను గుర్తించారు. (ప్రసంగి 12:1; 1 కొరింథీయులు 7:29 పోల్చండి.) గమనించవలసిన వాస్తవమేమంటే వారిలో 12 మంది అవిశ్వాసులైన తలిదండ్రులను కలిగియున్నారు. వారింట్లో వారు మాత్రమే సత్యమందున్నారు. వారికున్న విశ్వాసమునుబట్టి ఆ ఇద్దరు అన్నదమ్ములను వారి తండ్రి బలవంతంగా ఇంటినుండి వెళ్లగొట్టాడు. సంఘములోని ఒక దంపతులు ఈ ఇద్దరు బాలురను తమ ఇంటికి చేరదీసారు.
మెకా మరియు సూలమేట్ కాలేబ్ విషయం మరొకరకంగా ఉంది. వారిద్దరు పయినీర్లు మరియు పాఠశాల విద్యార్థులు కూడ, అయితే వారి తలిదండ్రులు యెహోవాసాక్షులే. నిజానికి, వారి తండ్రికూడ అదే తరగతిలో విద్యార్థిగా ఉండెను!
బాంగుయ్‌లోని సంఘాలు కూడ ఆ పాఠశాలలో భాగం వహించాయి, కాని మరొక విధంగా. ఆహారం ఇవ్వడంవంటి ఇతర వస్తుదాయక అవసరాలను వారు తీర్చారు. ఆ తరగతి వారి భోజనయేర్పాటు కొరకు వారు డబ్బు, కోళ్లు, చక్కెర, బియ్యం, కర్రపెండలం చందాగా ఇచ్చారు.
భోజనం మామూలుదైనను దాన్ని రుచికరంగా చేయుటకు సమీప సంఘములు వంటలుచేయు జట్లను ఏర్పాటుచేశారు. ప్రతివారు ఇష్టపడే ఎన్‌గూంజె అనే వంటకానికి మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ పేరుగాంచింది. ఎలాంటి వంటకం? దానిని చేయడానికి కర్రపెండలము ఆకులు, పామాయిల్, ఉల్లిపాయలు, ఎక్కువగా వెల్లుల్లి, పీనట్ బట్టర్ ఉండలు కావాలి, దానిని బాగా ఉడికించడానికి ఓపిక కావాలి. ప్రతి జట్టు దానిని చేయడానికి తమదైన ప్రత్యేక విధానాన్ని కలిగియుండిరి. అది ఎంతో విజయవంతమైంది; దానిని వద్దన్న వాళ్లెవ్వరూ లేరు.
బాంగుయ్ వెలుపల మరి రెండు తరగతులు నిర్వహించబడ్డాయి, ఒకటి బ్వార్‌లో మరొకటి బాంబారేలో. ఈ రెంటికి కలిపి మొత్తం 68 మంది విద్యార్థులు హాజరయ్యారు. గడచిన రెండు సంవత్సరాలలో మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ నందు పయినీర్ల సంఖ్య పెరిగింది. జనవరి 1992లో అక్కడ 149 మంది క్రమ పయినీర్లు, 17 మంది ప్రత్యేక పయినీర్లు, ఆలాగే వీరితోపాటు 78 మంది సహాయ పయినీర్లును ఉండిరి. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రచారకుల గంటలు, పునర్దర్శనములు, బైబిలు పఠనముల సంఖ్యలు క్రొత్త శిఖరాలు చేరినవి. ఎప్పుడైతే పనివారు ఎక్కువగా ఉంటారో, అప్పుడు కోత విస్తారంగా ఉంటుంది.—యెషయా 60:21, 22; మత్తయి 9:37, 38.
ఈ ఏర్పాట్ల కొరకు యెహోవా దేవునికి, ఈ తరగతులను ఏర్పాటుచేసినందుకు ఆయన భూసంస్థకు మన కృతజ్ఞతలు. ఈ అంధకార లోకములో జ్యోతులవలె ప్రకాశించుటకు విద్యార్థులకు, ఉపదేశకులకు కూడ అవి సహాయపడ్డాయి.
[20వ పేజీలోని చిత్రం]
పయినీరు పాఠశాలలోని 21 మంది విద్యార్థులు ఇంకను ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు
[21వ పేజీలోని చిత్రం]
సత్యము కారణముగా ఈ ఇద్దరు బాలురు ఇంటినుండి వెళ్లగొట్టబడిరి