“మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును”
వన విహారంలో ఆ కుటుంబము ఎంతో ఆనందముగా ఉన్నది. అంతలోనే వారిలో అందరికంటె చిన్నవాడైన పీటర్ ప్రక్కనే గుట్టదగ్గర ఒక ఉడుతను తరుముకుంటూ వెళ్లి దారి తప్పాడు. అకస్మాత్తుగా మేఘాలు కమ్మి వర్షం కురవడం ఆరంభమైంది. మొదట చిరుజల్లుగా ప్రారంభమై అది చివరకు కుండపోత వర్షంగా మారింది. ఆ కుటుంబం హడావిడిగా తమ సామాన్లన్నీ సర్దుకుని తమ వాహనం వద్దకు పరుగెత్తారు. తమమధ్య పీటర్ లేకపోవడంతో అంతా కంగారు పడ్డారు.
అదే సమయంలో, పీటర్ తన కుటుంబ సభ్యులను కలిసికోవడానికి ప్రయత్నించసాగాడు. ముందున్నది చూడడం కష్టంగా వుంది, గుట్టమీద దారంతా వర్షం కారణంగా జారుతూవుంది. అనుకోకుండా, అతని కాళ్లక్రింద నేల మాయమైనట్లయి, అతడు పైకి కనబడని ఒక పెద్ద గుంటలో పడ్డాడు. అతడు పైకెగబ్రాగుటకు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఆ గుంట అంచులు చాలా జారిపోతున్నాయి.
గుట్టమీద వర్షం జోరుగా కురవడంతో, క్రమేపి ఆ గుంట బురదతో నిండిపోసాగింది. పీటర్ నిజంగా మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్నాడు. అదే సమయంలో అతని తండ్రి అతన్ని కనుగొని ఒక త్రాడుతో అతన్ని పైకి లాగాడు. అలా తిరగడానికి వెళ్లినందుకు పీటర్కు ఆ తర్వాత చీవాట్లు తగిలాయి. అయినను, దుప్పట్లు కప్పుకొని తల్లి ఒడిలో ఒదిగి కూర్చున్న అతనికి ఆ చీవాట్లు ఏమంత బాధకలిగించలేదు.
ఒకప్పుడు దేవుని ప్రజల మధ్య ఉండిన కొంతమందికి ఏమి సంభవించినదో ఈ అనుభవము చక్కగా ఉదహరిస్తున్నది. వారు ఈ విధానముయొక్క లోతైన గుంటలో పడి, తిరిగి ఆశ్రయముగానున్న యెహోవా సంస్థలోనికి వచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నారు. యెహోవా కనికరము గలవాడని, ‘తాడు దింపి’ వారు సురక్షితముగా పైకి వచ్చులాగున సహాయము చేయ సిద్ధముగా ఉన్నాడని తెలిసికొనుట ఎంత సంతోషకరముగా ఉన్నది!
యెహోవా కనికరముగల వ్యవహారములు
ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలములో, దేవాలయ నిర్మాణ ముగింపు కాలంలో ప్రతిష్టిత ప్రార్థనచేస్తూ, ఆ దేవాలయము తట్టుతిరిగి చేయు విన్నపములను యెహోవా ఆలకించవలెనని సొలొమోను యాచించాడు. ఆ తరువాత ఆయనిట్లన్నాడు: “పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, . . . వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని, . . . తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన యెడల . . . ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించవలెను.”—1 రాజులు 8:46-49.
ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేక సందర్భాలలో సొలొమోను విన్నపము నెరవేరింది. దేవుని ప్రజలు అనేకమార్లు ప్రక్కకు తొలగిపోయి ఆయనను విడిచిపెట్టారు. ఆ తర్వాత, వారు తమ తప్పు తెలిసికొని, ఆయనను వెదకుతూ ఆయనయొద్దకు మరలి వచ్చారు. కాగా యెహోవా వారిని క్షమించాడు. (ద్వితీయోపదేశకాండము 4:31; యెషయా 44:21, 22; 2 కొరింథీయులు 1:3; యాకోబు 5:11) తన ప్రజలతో వెయ్యి సంవత్సరముల తన వ్యవహారమును యెహోవా మలాకీద్వారా సంక్షిప్తపరస్తూ, ఇట్లన్నాడు: “మీ పితరుల నాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదును.”—మలాకీ 3:7.
అభ్యంతర కారణాలు
ఇశ్రాయేలీయుల వలెనే ఈనాడు అనేకమంది దేవుని ప్రజలు ప్రక్కకు తొలగిపోయి దేవుని సంస్థనుండి తమనుతాము వేరుపరచుకున్నారు. ఎందుకు? పీటర్ ఉడుతను పట్టుకోవడానికి పోయిన విధంగా కొందరు మొదట నిరపాయకరముగా కన్పించిన దాని వెంటవెళ్లారు. ఆడా విషయంలో ఇదే జరిగింది. ఆమె ఇలా చెప్పింది: “మధ్యహ్నన సమయాలలో తోటిపని వారందరము కలిసి భోజనానికి దగ్గరలోవున్న హోటలుకు వెళ్లుట వాడుక అయ్యింది. సాయంకాలమప్పుడు ఓ కప్పు కాఫీ త్రాగుదాం రమ్మని వారు నన్ను ఆహ్వానించినప్పుడు, దానికి అంగీకరించడం అంత కష్టంగా ఉండేది కాదు. కూటములకు లేదా ప్రకటించడానికి ఉపయోగించాల్సిన సమయాన్ని నేను వాడడం లేదేయని నాలో నేనే తర్కించుకున్నాను. ఇది 1 కొరింథీయులు 15:33 నందలి సూత్రాన్ని పాటించడంలో తప్పిపోవడమని నేను గ్రహించలేదు.
“త్వరలోనే, నేను వారితోపాటు శనివారాల్లో గుర్రపుస్వారికి వెళ్లడం, ఆ తర్వాత వారితో కలిసి సినిమాల కెళ్లడం ఆరంభించాను. దీని ఫలితంగా నేను కొన్ని కూటాలకు హాజరు కాలేకపోయాను. చివరకు, నేను కూటాలకు ప్రకటించడానికి వెళ్లడం మానుకున్నాను. జరుగుతున్న దానిని నేను గ్రహించే సమయానికే, సంస్థతో నేను సహవాసం చేయుట మానివేయడం జరిగింది.”
మరికొన్ని సందర్భాల్లో కారణం బహుశ దాచిపెట్టబడిన పాపము కావచ్చును, అది ఆ వ్యక్తి దేవుని సేవించుటకు అతడెంత మాత్రము అర్హుడు కాదని భావింపజేస్తుంది. (కీర్తన 32:3-5) లేదా తోటి క్రైస్తవులు చెప్పిన లేక చేసిన ఒక సంగతినిబట్టి ఒక వ్యక్తి అభ్యంతర పడవచ్చును. అట్టి వ్యక్తి సొలొమోను చెప్పినట్లు, “పాపము చేయనివాడు ఒకడును లేడు” అని అర్థము చేసికొనుట లేదు.—1 రాజులు 8:46; యాకోబు 3:2.
ఇంకా కొంతమంది తమకు క్రమశిక్షణ ఇవ్వబడినప్పుడు నిరుత్సాహపడతారు. (హెబ్రీయులు 12:7, 11) వస్తుదాయక జీవన విధానము అనేకమందిని దేవుని సేవించకుండా మానుకొనుటకు నడిపించింది. తరచు లౌకిక విజయాల అన్వేషణలో, వారు ఉద్యోగాలందు ఎంతగా మునిగిపోయారంటే వారి జీవితాలలో దేవుని సేవకు ఏమాత్రం చోటు లేకుండా పోయింది. (మత్తయి 13:4-9; 1 తిమోతి 6:9, 10) అలాంటి వారి పరిస్థితి నిరాశాజనకంగా వుందా?
యెహోవా ఆహ్వానమునకు నీవు ప్రత్యుత్తరమిత్తువా?
ఒక సందర్భములో యేసు చెప్పిన ఒక విషయం అర్థము చేసికొనుటకు కష్టముగా ఉన్నందుకు, కొందరు అభ్యంతరపడి వెళ్లిపోయారు. ఆ వృత్తాంతమిట్లు చెబుతున్నది: “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.” అయితే అందరు అభ్యంతరపడలేదు. ఆ బైబిలు వృత్తాంతము ఇంకను తెల్పినదేమనగా: “కాబట్టి యేసు—మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా సీమోను పేతురు—ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవని . . . ఆయనతో చెప్పెను.” (యోహాను 6:66-68) యేసును విడిచివెళ్లుట నాశనకరమని యేసు అపొస్తలులు జ్ఞానయుక్తముగా గ్రహించారు.
పడిపోయిన కొంతమంది చివరకు అదే ముగింపునకు వస్తారు. దేవుని సంస్థను విడిచిపెట్టుట నాశనకరమైన చర్యయని, యెహోవా మరియు క్రీస్తుయొద్దనే జీవమునకు నడుపు మాటలను తాము కనుగొనగలమని వారు తెలిసికొంటారు. ఒకసారి వారలాంటి గ్రహింపునకు వచ్చిన పిదప, యెహోవాను క్షమాపణ అడిగి తిరిగి ఆయనయొద్దకు వచ్చుటకు పునరాలోచించేందుకు ఇంకనూ ఆలస్యము కాలేదని కూడ వారు తెలిసికోవాలి. యెహోవా తానుగా ఈ ఆహ్వానమిచ్చాడు: “మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదును.”—మలాకీ 3:7.
నిజానికి, యెహోవాను సేవించుటలో కాకుండ చిత్తశుద్ధిగల క్రైస్తవుడు మరెక్కడ సంతోషమును కనుగొనగలడు? కొంతకాలము దేవుని సంస్థలో భాగమైయున్న తర్వాత ఒక వ్యక్తి నెమ్మదిగా కొట్టుకొనిపోయినట్లయితే, అతని కొరకు లోకములో ఏమి వేచియున్నది? అనతికాలములోనే అతడు తానిప్పుడు అంతకంతకు మరింత హింసాత్మకముగా తయారవుతున్న లోకములో భాగమై యున్నాడని తెలిసికొనును. వేషధారణ, అబద్ధము, మోసము లైంగిక అవినీతితో నిండియున్న విధానములో అనగా యౌవనుడైన పీటర్ ప్రాణాలకే ముప్పుతెచ్చిన బురదగుంటంత ప్రమాదకరమైన, అప్రీతికరమైన లోకములో తాను మునిగియున్నాడని అతడు తెలిసికొంటాడు. అతడు తెలివికివచ్చి, తన నిత్యజీవము ప్రమాదములో ఉన్నదని గ్రహించినప్పుడు, ఆ పరిస్థితిలోనుండి బయటపడునట్లు సహాయము కొరకు అతడు వెంటనే స్పందించాలి. అయినను, అలా తిరిగివచ్చుట అంత సులభము కాకపోవచ్చును.
యెహోవా యొద్దకు తిరిగి వచ్చుటకు ప్రయత్నిస్తూ, అది కష్టముగా ఉన్నట్లు తోచిన వారిలో నీవును ఒకడవై యున్నావా? కాబట్టి నీకు సహాయము అవసరమని తెలిసికొనుము. దేవుని సంస్థలోని సహోదర సహోదరీలు నీకు సహాయపడుటకు ఇష్టపడుతున్నారని విశ్వసించుము. అయితే నీకున్న కోరికను యెహోవాకు చూపుటకు నీవు కృషిచేయాలి. ‘బుద్ధి తెచ్చుకొని,’ ‘యెహోవావైపు తిరుగుటకిదే’ సమయము.—1 రాజులు 8:47.
తిరిగివచ్చుటకు సహాయము చేయబడిరి
యెహోవాయొద్దకు తిరిగివచ్చుటకు తనకేది సహాయపడెనో ఆడా ఇలా వివరిస్తుంది: “సరియైన సమయములో నాకు బైబిలు పఠనము నిర్వహించిన సహోదరి తనతోకూడ ప్రాంతీయ సమావేశానికి హాజరుకమ్మని నన్ను ఆహ్వానించింది. ఆమె చాలా ప్రేమగలది! ఆమె నన్ను ఏమాత్రం నిందించలేదు! ఆమె నాయెడల ఎంతో ప్రేమ కనబరచింది. నేను చివరిసారి కూటమునకు హాజరై దాదాపు ఒక సంవత్సర మయింది, అయినా లోకంలోవున్న శూన్యతను గూర్చి ఆలోచిస్తునే ఉన్నాను, ఆ పైపై మెరుపు వెనుక కేవలం దుఃఖం, నిరాశ, లైంగిక అవినీతి దాగివున్నాయి. కాబట్టి నేను సమావేశానికి హాజరగుదామనే నిర్ణయించుకున్నాను. సమావేశ స్థలానికి వచ్చినప్పుడు, నేను చివరి వరుసలో ఎవరికి కనబడకూడదని చీకటిలో ఒదిగి కూర్చున్నాను. సహోదరులు నన్నుచూసి ఎలాంటి ప్రశ్నలు అడుగకూడదని నేను ఆశించాను.
“అయితే, సరిగ్గా నాకు కావలసిన ఉపదేశాన్నే ఆ కార్యక్రమం నాకు అందించింది. కార్యక్రమం ముగిసేసరికి, నేను యెహోవా ప్రజలయొద్దకు మరలవలెననే కాకుండా పూర్ణహృదయంతో ఆయనకు నేను అంకితమవ్వాలనే నిర్ణయానికొచ్చాను. ‘తప్పిపోయి’ తిరిగివచ్చిన నన్ను సహోదరులు ఎంతో ఆప్యాయంగా చేర్చుకొన్నారు.” (లూకా 15:11-24) ఇదంతా ఎప్పుడో జరిగింది, ఆడా ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా పూర్తికాల సేవలో ఉన్నది.
ఇదే విధముగా తప్పిపోయిన మరొక వ్యక్తి విషయములోకూడా ఇలానే సంతోషకరమైన పరిణామమే సంభవించింది. కొంతమంది పెద్దలు హోసాకు, బైబిలు సూత్రాలకు బదులు ఎక్కువగా తమ స్వంత ఆలోచనలే ప్రతిబింబించిన సలహానిచ్చారు. దానితో హోసా నిరుత్సాహపడి, ఉక్రోషంతో వెళ్లిపోయి చివరకు ఆసక్తి కోల్పోయిన వ్యక్తిగా తయారయ్యాడు. ఎనిమిది సంవత్సరాలు ఆయన దేవుని ప్రజలకు దూరంగా ఉండి, ఆ కాలంలో ఒక అవిశ్వాసిని వివాహమాడి పిల్లలనుకూడా కన్నాడు. ఒక పిల్లవాడు కాథోలిక్ చర్చిలో బాప్తిస్మం తీసికోవడానికి కూడా ఆయన అనుమతించాడు.
చివరకు, ప్రాంతీయ కాపరి అతనిని సందర్శించి పెద్దలును అట్లే చేయవలెనని ప్రోత్సహించుటతో ఆయనకు సహాయం లభించింది. తాను పునరుద్ధరింపబడి, తన భార్య సత్యంయెడల ఆసక్తి చూపడం ఆయనకు సంతోషానిచ్చింది. హోసా ప్రస్తుతం సంఘములో ఒక పెద్దగా సేవచేస్తున్నాడు. ఈ రెండు అనుభవాలు చూపినట్లుగా, తిరిగి రమ్మని ప్రేమతో తానిచ్చిన ఆహ్వానమునకు ప్రతిస్పందించిన వారికి యెహోవా తన ఆశీర్వాదములు ఇవ్వకుండా ఉండడు.
అయితే, అటువంటి ఆశీర్వాదములను అనుభవించుటకు, ఒక వ్యక్తి తనకు అందించబడే సహాయాన్ని ప్రశంసించి దానికి ప్రతిస్పందించాలి. అనేక సంఘాలలో ఆసక్తి కోల్పోయిన వారిని సహోదరులు గుర్తుపెట్టుకొని, వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ, ఆయా సమయాలలో వారిని సందర్శిస్తారు. అటువంటి సహాయమునకు ప్రతిస్పందించుట, యెహోవా కనికరము యెడల ప్రశంస చూపించుటయే.—యాకోబు 5:19, 20.
నిజానికి, “నా తట్టు తిరుగుడి” అని యెహోవా ఇచ్చిన ఆహ్వానానికి ప్రత్యుత్తరమిచ్చుటకిదే అనువైన సమయం. (మలాకీ 3:7; యెషయా 1:18) ఇక ఏమాత్రం వేచియుండకుము. లోక సంఘటనలు అమిత వేగంగా కదిలిపోతున్నాయి. భవిష్యత్తులోని విపత్కర కాలములలో శ్రేష్ఠమైన స్థానము యెహోవా సంరక్షణలోని ఆయన సంస్థయే. కేవలము యెహోవాను ఆశ్రయించిన వారు మాత్రమే ఆయన మహా ఉగ్రత దినమందు దాచబడతారనే గట్టి నిరీక్షణ కలిగియుందురు.—జెఫన్యా 2:2, 3. (w92 8/1)
[32వ పేజీలోని చిత్రాలు]
“నా తట్టు తిరుగుడని” యెహోవా ఇచ్చిన ఆహ్వానానికి నీవు ప్రతిస్పందిస్తావా?