సామాజిక వినోదము—ప్రయోజనాలు అనుభవించండి, ఉరులను తప్పించుకోండి
“అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.”—ప్రసంగి 2:24.
1. వినోదము విషయములో దేవుని నడిపింపు ఏయే విధములుగా ఆయన ప్రజలకు సహాయము చేయును?
యెహోవా నడిపింపు ఆయన సేవకులకు అనేక ప్రయోజనాలను తెచ్చును. దీనిని మనము వినోదపు రంగమందు చూడగలము. వివిధ దృక్పధాల కిరువైపులనున్న హద్దులు మీరకుండుటకు ఆయన నడిపింపు క్రైస్తవులకు సహాయము చేస్తుంది. దుస్తులు, ప్రవర్తన విషయంలో కఠినంగా ఉండాలని వత్తిడిచేయు మతవాదులు కొందరు, దాదాపు ఎలాంటి సుఖమునైనను పాపముగా దృష్టిస్తారు. మరోవైపున, అనేకమంది అవి యెహోవా నియమములకు, సూత్రాలకు భిన్నముగా ఉన్నను సుఖభోగాలను వెంబడిస్తారు.—రోమీయులు 1:24-27; 13:13, 14; ఎఫెసీయులు 4:17-19.
2. వినోదము విషయములో దేవుని దృష్టినిగూర్చి ఏది తొలి సూచననిచ్చింది?
2 మరి దేవుని ప్రజల విషయమేమి? బైబిలును పఠించుట కారంభించిన అనేకులకు, దేవుడు నిజానికి జీవితాన్ని అనుభవించు సామర్థ్యముతో మానవులను సృజించాడని నేర్చుకొనుట ఆశ్చర్యంగా ఉంది. ఆయన మన మొదటి తలిదండ్రులకు చేయడానికి పని నిచ్చాడు—అయితే అది ఈనాడు అనేకమంది అసంపూర్ణ మానవులు కలిగియున్న బానిసవృత్తి వంటిది కాదు. (ఆదికాండము 1:28-30) పరదైసు భూమిలో జీవించువారందరు ఆనందాన్ని అనుభవించు లెక్కలేనన్ని యోగ్యమైన విధానాలను గూర్చి ఆలోచించండి. దైనందిన జీవితములో ఒక భాగముకాగల నిరపాయకరమైన అడవి మృగాలను, వివిధ రకాల సాధు జంతువులను చూచునప్పుడు వారి ఆనందమును ఊహించుము! “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము” నుండి వారెటువంటి ఆహారమును పొందెదరో!—ఆదికాండము 2:9; ప్రసంగి 2:24.
3-5. (ఎ) వినోదము ఏ సంకల్పాన్ని నెరవేర్చాలి? (బి) వినోదము విషయములో దేవుడు ఇశ్రాయేలీయులను నిరుత్సాహపరచలేదని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?
3 నిజానికి, ఆ కార్యములను మనోరంజకముగా దృష్టించవచ్చును, పరదైసులో సంకల్పము నేటివలెనే వుండును: ఇంకా ఫలభరితమైన కార్యములు [పనిని] చేయుటకు ఒక వ్యక్తి సామర్థ్యమును ఉత్తేజపరచి, శక్తిని పునరుద్ధరించును. వినోదము దీనిని నెరవేర్చినప్పుడు, అది ప్రయోజనకరమగును. అంటే నిజమైన ఆరాధికులు ఇంకను పరదైసులో జీవించకపోయినను తమ జీవితములో వినోదమునకు ఒక స్థానము కల్పించవచ్చునని దీని భావమా? అవును, యెహోవా ప్రాచీన ప్రజల మధ్యనుండిన వినోదమును గూర్చి ఇన్సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్ ఇలా చెబుతున్నది:
4 “ఇశ్రాయేలీయుల మనోరంజక కార్యక్రమాలు, తీరికవేళ కాలక్షేపాలు బైబిలు చరిత్రలో ప్రముఖంగా వర్ణించబడలేదు. అయినప్పటికిని, ఆ జనాంగము యొక్క మత సూత్రాలతో పొందికగాయున్నప్పుడు వాటిని సరియైనవాటిగా, కోరదగినవిగా దృష్టించాలని అది వారికి చూపిస్తున్నది. సంగీత వాద్యములు, పాటలు పాడుట, నృత్యము, సంభాషణ, ఆలాగే కొన్ని ఆటలు వారి వినోదమునకు ముఖ్యమైన సంగతులుగా ఉండెను. పొడుపు కథను విప్పి, చిక్కుప్రశ్నలకు జవాబుచెప్పుట గొప్పగా ఎంచబడేది.—న్యాయా. 14:12.”—సంపుటి 1, పుట 102.
5 దావీదు విజయోత్సాహుడై తిరిగివస్తుండగా, ఆ సంభ్రమమందు (హెబ్రీ, సాచక్) హెబ్రీ స్త్రీలు తంబురలను, తంతి వాద్యములను ఉపయోగించారు. (1 సమూయేలు 18:6, 7) ఆ హెబ్రీ పదమునకు ప్రాథమికముగా “బిగ్గరగా నవ్వుట” అని భావము, మరియు కొన్ని భాషాంతరములు “అమితముగా ఉల్లసించు స్త్రీలను” గూర్చి మాట్లాడుతున్నవి. (బైయింగ్‌టన్, రోథర్హామ్, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) మందసపు పెట్టెను తీసుకొని వెళ్లుచుండగా, “దావీదును ఇశ్రాయేలీయులందరును . . . నానావిధములైన [వాద్యములు] . . . వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.” దావీదు భార్యయైన మీకాలు, అసమంజసమైన దృష్టిగలదై, ఆ మనోరంజక కార్యక్రమములందు దావీదు పాల్గొనుటను అభ్యంతరపెట్టింది. (2 సమూయేలు 6:5, 14-20) బబులోను చెరనుండి తిరిగివచ్చువారు అటువంటి ఆనందమునే అనుభవిస్తారని దేవుడు ప్రవచించాడు—యిర్మీయా 30:18, 19; 31:4; పోల్చుము కీర్తన 126:2.
6. వినోదము విషయములో మనము కలిగియుండవలసిన దృష్టికి క్రైస్తవ గ్రీకు లేఖనములు ఎట్లు సహాయము చేయును?
6 మనము కూడా వినోదము విషయములో సమతూకముగా ఉండుటకు ప్రయత్నించాలి. ఉదాహరణకు, యేసు సమస్తము త్యజించిన బైరాగిగా ఉండలేదను విషయమును మనము మెచ్చుకొనమా? లేవి ఏర్పాటుచేసిన “గొప్ప విందు” వంటి విందు భోజనాలకు ఆయన సమయము తీసికొన్నాడు. మరియు ఆయన తిని త్రాగుటను స్వయం-నీతిపరులైన వారు విమర్శించినప్పుడు, యేసు వారి తలంపులను, యోచనలను తిరస్కరించాడు. (లూకా 5:29-31; 7:33-36) ఆయనొక వివాహానికి హాజరై, దాని ఉత్సవ సంబరమునకు తోడ్పడెనని కూడ గుర్తు తెచ్చుకొనుము. (యోహాను 2:1-10) యేసు సహోదరుడైన యూదా, క్రైస్తవులు “ప్రేమవిందులు” కలిగియుండిరని చెబుతున్నాడు. సాధారణంగా ఇటువంటి విందులలో బీదలైనవారు భోజనం చేసి, ఆహ్లాదకరమైన, సేదదీర్పుగల సహవాసమును అనుభవించేవారు.—యూదా 12.
దాని సమయములో, స్థానములో సామాజిక వినోదము
7. వినోదము విషయములో దేవునివాక్యమెట్లు సమతూకమును ప్రోత్సహించుచున్నది?
7 ప్రసంగి 10:19 యుక్తముగా, ‘పనివారి నవ్వులాటల కొరకైన భోజనమును, ప్రాణమునకు సంతోషమునిచ్చు ద్రాక్షారసమును’ గూర్చి మాట్లాడుతున్నది. వినోదము బొత్తిగా తప్పని, చెడ్డదని అది చెప్పుట లేదా? అయినను, అదే పుస్తకము చెప్పునదేమనగా: “ప్రతిదానికి సమయము కలదు. . . . ఏడ్చుటకును నవ్వుటకును; దుఃఖించుటకును నాట్యమాడుటకును.” (ప్రసంగి 3:1, 4) అవును, యుక్తమైన వినోదమును ఖండించకపోయినను, బైబిలు మనకు హెచ్చరికలను ఇస్తున్నది. సమయము, మోతాదు విషయములో వినోదమును దాని స్థానములో ఉంచవలెనను సలహా వీటిలో ఇమిడియున్నది. పెద్దపెద్ద సామాజిక విందులలో తరచు సంభవించు ప్రమాదములను గూర్చి కూడ అది మనలను హెచ్చరిస్తున్నది.—2 తిమోతి 3:4.
8, 9. మనము నివసించు కాలము, దేవుడు మనకప్పగించిన పని వినోదముపై ఎందుకు ప్రభావము చూపాలి?
8 బబులోను నుండి తిరిగివచ్చిన యూదులు—బహుగా కష్టించి పనిచేయవలసి యున్నను—ఎంతో ఆనందాన్ని అనుభవించారని మనము గమనించాము. అయినను, తాను ‘ఉల్లసించు వారితో, హాస్యోక్తులు మాట్లాడు వారితో నేను కూర్చుండబోనని’ యిర్మీయా అంతకుముందు చెప్పాడు. (యిర్మీయా 15:17) రానైయున్న తీర్పు వర్తమానమును ప్రకటించు దైవిక పనిని కలిగియున్నందున, అది ఆయన ఉల్లసించే సమయం కాదు.
9 దేవుని నిరీక్షణా వర్తమానమును, ఆలాగే సాతాను దుష్ట విధానముపై ఆయన తీర్పులను ప్రకటించు పని నేడు క్రైస్తవులకు అప్పగింపబడి యున్నది. (యెషయా 61:1-3; అపొ. కార్యములు 17:30, 31) కాబట్టి మన జీవితములలో వినోదము ఒక ప్రధాన భాగమయ్యేందుకు మనమనుమతించకూడదనుట స్పష్టము. ఈ అంశమును మనము ఆహారపు రుచిని ఇనుమడింప జేయుటకు ఉపయోగించు చిటికెడు ఉప్పు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించుటతో ఉదహరించ వచ్చును. ఆహారపు ఘుమఘుమ వాసనను పాడుచేసేంత ఎక్కువగా ఆ సుగంధ ద్రవ్యాలను నీవు కుమ్మరిస్తావా? నీవలా చేయవు. యోహాను 4:34 మరియు మత్తయి 6:33 లోని యేసు మాటల ననుసరించి, మన ముఖ్య శ్రద్ధ—మన ఆహారము—దేవుని చిత్తాన్ని చేయుటయై యుండాలి. అప్పుడు వినోదం రుచిని పెంచేదిగా తయారవుతుంది. అది సువాసనను, రుచిని పెంచాలేగాని, దానిని బొత్తిగా పాడుచేసి, పనికిరాకుండా చేయకూడదు.
10. వినోదం కొరకు వెచ్చించు సమయం విషయంలో మనమందరము ఎందుకు పునఃపరీక్షించుకోవాలి?
10 అయితే ఒక క్షణమాగి ఇట్లు ఆలోచించుము: వినోదానికి తామిచ్చు అవధానము, సమయము పరిమితమేనని అనేకమంది చెప్పుటలేదా? వారు మరొక విధముగా భావించినట్లయితే, వారు తగిన సవరణలు చేసికొని యుండేవారే. మనలో ప్రతి ఒక్కరము ఆగి, వినోదము మన జీవితములలో నిజముగా ఏ స్థానమందున్నదో గంభీరముగా నిర్మొహమాటముగా విశ్లేషించుకొనవలెనని ఇది సూచించుట లేదా? అది అనుకొనని రీతిలో ప్రధాన విషయముగా తయారయిందా? ఉదాహరణకు, మనము ఇంటికి తిరిగివచ్చిన వెంటనే యాంత్రికంగా టీవి. పెడుతున్నామా? ప్రతివారం శుక్రవారం రాత్రి లేదా శనివారం రాత్రి వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించు అలవాటులో పడిపోయామా? ఆ సమయానికి, మనము ఇంట్లోవుండి ఎలాంటి వినోదం లేకపోతే మనము నిరుత్సాహపడుదుమా? మరి రెండు ప్రశ్నలుయేమంటే: అలా సమకూడిన మరుసటి దినము క్రైస్తవ పరిచర్యలో లేదా యజమాని కొరకు సరిగా పనిచేయలేనంతగా అలసిపోవునట్లు మనం చాలా రాత్రివరకు మెలకువగా ఉన్నామా లేదా ఎక్కువ దూరం ప్రయాణం చేశామా? మన వినోదము ఎప్పుడైనా లేదా తరచు అటువంటి ప్రభావమును కలిగియుంటే, అది నిజానికి యుక్తముగా, సమతుల్యమైన తమాషాగా ఉందా?—పోల్చుము సామెతలు 26:17-19.
11. మన వినోదము యొక్క స్వభావాన్ని పునఃసమీక్షించుట ఎందుకు సరియైయున్నది?
11 మనము ఎంచుకొనే వినోదాన్ని కూడ మనము పరిశీలించుకొనుట మంచిది. మనము దేవుని సేవకులమైనంత మాత్రాన మన వినోదము యోగ్యమైనదనే అభయమేమియు లేదు. అభిషక్త క్రైస్తవులకు అపొస్తలుడైన పేతురు వ్రాసిన విషయాన్ని పరిశీలించుము: “మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును.” (1 పేతురు 4:3) లోకస్థులు చేస్తున్న వాటిని వారనుకరిస్తున్నారని ఆయన తన సహోదరులను వేలెత్తి చూపుటలేదు. అయినప్పటికిని, క్రైస్తవులు (అప్పుడును ఇప్పుడును) అప్రమత్తముగా ఉండుట మంచిది, ఎందుకనగా హానికరమగు వినోదమునకు ఒకడు సులభముగా బలియైపోగలడు.—1 పేతురు 1:2; 2:1; 4:7; 2 పేతురు 2:13.
ఉరుల విషయములో అప్రమత్తముగా ఉండుము
12. మొదటి పేతురు 4:3 ఎటువంటి ఉరిని నొక్కితెల్పుచున్నది?
12 ఎటువంటి ఉరి విషయములో మనము అప్రమత్తముగా ఉండవలెను? ‘మద్యము సేవించుట, వినోదములు, త్రాగుబోతుల విందులను’ గూర్చి పేతురు ప్రస్తావించాడు. ఇచ్చట ఉపయోగించబడిన గ్రీకు పదములు “ప్రాముఖ్యముగా విందులో అందరు కలిసి త్రాగుటకు అనువర్తించును” అని ఒక జర్మన్ వ్యాఖ్యాత వివరించాడు. ఆ కాలములో అటువంటి పనులు సర్వసాధారణమై యుండెనని, ఒక స్విస్ పండితుడు ఇలా వ్రాశాడు: “వర్ణింపబడిన అట్టి సిగ్గుమాలిన కార్యకలాపాలు సాగించు క్లబ్బులకు, ఏర్పాటైన గుంపులకు ఆ వివరణ సంబంధించినదై యుండాలి.”
13. అందరు సమకూడు సందర్భాలలో ఆల్కహాలు నుపయోగించుట ఎట్లు ఒక ఉరి కాగలదు? (యెషయా 5:11, 12)
13 పెద్దయెత్తున ఏర్పాటుచేయబడిన సామాజిక విందులలో మత్తుపానీయములు కలిగియుండుట అనేకమందిని ఉరిలో పడవేసింది. అంటే బైబిలు అటువంటి పానీయాలను పరిమితముగా ఉపయోగించుటను నిషేధిస్తున్నదని కాదు, ఎందుకనగా అది అలా నిషేధించడం లేదు. దీనికి రుజువుగా, కానాలో జరిగిన ఒక వివాహవిందులో యేసు ద్రాక్షారసమును తయారుచేశాడు. త్రాగుబోతుల సాంగత్యమును విసర్జించుమని చెప్పిన దేవుని సలహాను యేసు గౌరవించేవాడు గనుక, అచ్చట అమితముగా త్రాగుట ఉండకపోవచ్చును. (సామెతలు 23:20, 21) అయితే ఈ వివరణనను చూడండి: ఇతర విందులలో మొదట మంచి ద్రాక్షారసము పోసి, ‘జనులు మత్తుగా ఉన్నప్పుడు, జబ్బురసము పోయుదురని’ ఆ విందు ప్రధాని అన్నాడు. (యోహాను 2:10) అందరికి విస్తారముగా ద్రాక్షారసముపోయు వివాహపు విందులలో అమితముగా త్రాగుట యూదులకు సాధారణ వాడుకై యుండెను.
14. ఆల్కహాలు పానీయాలు తీసుకురాగల ఉరులను క్రైస్తవ అతిథేయులు ఏ విధములుగా ఎదుర్కొనవచ్చును?
14 దానికనుగుణ్యముగా, కొంతమంది క్రైస్తవ అతిథేయులు అతిథులకు ఇవ్వబడుదానిని లేదా వారు పుచ్చుకొనుదానిని వ్యక్తిగతముగా పర్యవేక్షించగలిగినప్పుడు మాత్రమే ద్రాక్షారసము, బీరు, ఇతర ఆల్కహాలు పానీయాలు ఏర్పాటుచేయుటకు తీర్మానించుకున్నారు. ప్రస్తావించబడిన యూదుల వివాహముల వలె, అతిథేయి సూటిగా పర్యవేక్షించగల దానికంటె పెద్దగుంపు ఉన్నట్లయితే, ఆల్కహాలు విరివిగా సరఫరా చేయుట ప్రమాదభరితమగు ఉరి కాగలదు. తాగే అలవాటును అధిగమించుటకు పోరాడిన వ్యక్తి అక్కడ హాజరైవుండ వచ్చును. క్రమరహితముగా, అదుపులేకుండా ఆల్కహాలు పుచ్చుకొను ఏర్పాటువలన అతడు అమితముగా సేవించి, అందరు చేరియున్న ఆ సందర్భమును పాడుచేయుటకు అతడు శోధింపబడవచ్చును. తోటి విశ్వాసులతో జరిపే సామాజిక విందుల ఆహ్లాదకరమైన సహవాసము నుండి తన కుటుంబము ప్రయోజనము పొందునని జర్మనీలో కుటుంబ యజమానిగావున్న ఒక అధ్యక్షుడు వ్యాఖ్యానించాడు. అయితే, బీరు విస్తారముగా అందుబాటులో వున్నప్పుడు సమస్యలు ఉత్పన్నముకాగల అవకాశములు మెండుగా ఉండునని కూడా ఆయనన్నాడు.
15. సామాజిక వినోదములందు సరియైన నడిపింపును ఎట్లు సాధించవచ్చును?
15 కానాలోని వివాహమునకు ఒక “విందు ప్రధాని” ఉండెను. (యోహాను 2:8) అంటే భోజనానికి లేదా కొంతసేపు సహవాసము కొరకు కొంతమందిని ఒక కుటుంబము తమయింటికి పిలిచినప్పుడు వారొక ప్రధానిని నియమించవలెనని దాని భావము కాదు. దానిని పర్యవేక్షించు బాధ్యతను భర్త కలిగియుంటాడు. ఆ గుంపు కేవలము రెండు కుటుంబాలవారైనను లేదా ఇంకాస్త పెద్దగా ఉన్నను, ఎవరో ఒకరు అక్కడ జరిగే విషయాల బాధ్యత తీసికోవాలి. తమ కుమారుడు లేదా కుమార్తె ఒక సామాజిక విందుకు ఆహ్వానింపబడినప్పుడు, అనేకమంది తలిదండ్రులు దీనిని పరిశీలింతురు. చివరి నిమిషం వరకు అక్కడే ఉంటూ, ఆ విందునంతటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారని వారు అతిథేయిని కలిసి అడుగుదురు. పెద్దలు, యౌవనులు పరస్పర సహవాసము ననుభవించ గలుగునట్లు, క్రైస్తవ తలిదండ్రులు తమ కాలపట్టికను సహితం సవరించుకొన్నారు.
16. సమకూడు గుంపు పరిమాణం విషయంలో ఎటువంటి తలంపులు సరియైనవి?
16 వాచ్‌టవర్ సొసైటి కెనడా బ్రాంచి ఇలా వ్రాస్తున్నది: “సామాజిక విందుల గుంపుల పరిమాణమును పరిమితము చేసికొనవలెనని ఇచ్చిన సలహాను కొంతమంది పెద్దలు వివాహపు విందులకు ఎక్కువమంది హాజరగుట ఆ సలహాను ఉల్లంఘించుటేనని అర్థం చేసికొన్నారు. సామాజిక విందులకు హాజరగు వారి సంఖ్యను చిన్నదిగా, నిర్వహించగలిగిన పరిమాణములో ఉండాలని మనకు సలహాయివ్వబడింది గనుక, వివాహపు విందుకు 200 లేదా 300లకంటె ఎక్కువమందిని కలిగియుండుట తప్పు అనే ముగింపుకు వచ్చారు.”a ఓ గుంపు ఈ పరిమాణములో ఉండాలని నిర్దేశించుటకు బదులు, ఎంతమంది వున్నను, సరియైన పర్యవేక్షణకు అధిక శ్రద్ధనివ్వవలెను. యేసు తయారుచేసి ఇచ్చిన ద్రాక్షారసపు పరిమాణము కానాలోని వివాహమునకు ఎక్కువమంది హాజరయ్యారని సూచిస్తున్నది, అయితే అది సరిగా పర్యవేక్షింపబడెను. ఆ కాలమందలి ఇతర విందులకు ఇలాంటి పర్యవేక్షణ లేకుండెను; పర్యవేక్షణ కష్టమగునంత పెద్దగా వాటి పరిమాణము ఉండుటయే బహుశ దానికి కారణమై యుండవచ్చును. గుంపు ఎంత పెద్దగావుంటే, సవాలు అంత ఎక్కువగా వుంటుంది, మితిమీరు స్వభావంగల బలహీనులు సులభంగా అదుపుతప్పు అవకాశం వుంది. పర్యవేక్షణలేని గుంపులున్న ప్రదేశాలలో వారు అనుమానాస్పద పనులను పురికొల్పవచ్చును.—1 కొరింథీయులు 10:6-8.
17. కూడుకోవలెనని పథకము వేసినప్పుడు క్రైస్తవులెట్లు సమతూకము చూపవచ్చును?
17 సామాజిక విందులను చక్కగా పర్యవేక్షించుటలో మంచి పథకము, సిద్ధపాటు ఇమిడియున్నది. అలాంటి విందులను విశిష్ఠమైనవిగా లేదా గుర్తుంచుకొనదగినవిగా చేయునట్లు, అందరిని ఆకట్టుకొను సంగీతముతో, లోకస్థుల విందులనుపోలి రంగు దుస్తుల బృంద నాట్యములతో లేదా చిత్రవిచిత్ర వేషాల అభినయాలతో అవి ఉండనవసరము లేదు. వాగ్దాన దేశమందలి నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు, విందును ఏర్పాటుచేసి వారంతా ఐగుప్తు లేక మరొక దేశమందలి అన్యులవలె దుస్తులు ధరించి యుందురని మీరూహించగలరా? వారు మోహముగల నృత్యమును లేదా అన్యులమధ్య బహు జనాదరణపొందిన ఉన్మాద సంగీతమును ఏర్పాటుచేశారా? గతంలో ఒకసారి, వారు సీనాయి పర్వతమునొద్ద అప్పటికి ఐగుప్తులో బహుశ వాడుకలోనున్న, జనాదరణ పొందిన సంగీతము, నృత్యముల ఉరిలో చిక్కుకొన్నారు. ఆ వినోదమును దేవుడు, పరిణతిపొందిన ఆయన సేవకుడగు మోషే ఎట్లు దృష్టించిరో మనకు తెలుసు. (నిర్గమకాండము 32:5, 6, 17-19) కావున, ఒక సామాజిక విందునేర్పాటుచేసిన అతిథేయి లేదా దాని పర్యవేక్షకుడు అక్కడ ఏదైనా సంగీతము లేదా నృత్యము ఉండునో లేదో చూడాలి; ఒకవేళ అలాంటిదేదైనా ఉన్నట్లయితే, అది క్రైస్తవ సూత్రముల కనుగుణ్యముగా ఉండునట్లు అతడు చూచుకోవాలి.—2 కొరింథీయులు 6:3.
18, 19. యేసు ఒక వివాహానికి ఆహ్వానింపబడెననుట నుండి మనమే విషయాన్ని గ్రహించవచ్చును, మరియు మనము దీనిని ఎట్లు అనువర్తించవచ్చును?
18 చివరగా, ‘యేసు, ఆయన శిష్యులు ఒక వివాహపు విందుకు ఆహ్వానింపబడుటను’ మనం జ్ఞాపకం చేసికోవచ్చును. (యోహాను 2:2) ఆహ్లాదకరమైన, క్షేమాభివృద్ధికరమైన సమయము కొరకు ఒక క్రైస్తవుడు లేదా ఒక కుటుంబము ఇతరులను సందర్శించవచ్చును. అయితే ఏర్పాటుచేయబడిన సామాజిక విందులు వినోదాల విషయములో, అనుభవము చూపునదేమంటే అక్కడ ఎవరెవరు ఉందురో ముందే నిర్దారించుకొనుట సమస్యలను అరికట్టుటకు సహాయం చేస్తుంది. ప్రస్తుతము పూర్తికాలసేవలో ఉన్న కుమారులను కుమార్తెలను పెంచిపెద్దచేసిన, అమెరికా, టెన్నిసీ నందలి ఒక పెద్ద దీని ప్రాముఖ్యతను నొక్కి తెలియజేస్తున్నాడు. ఆయన, ఆయన భార్య, ఆహ్వానాన్ని అంగీకరించుటకు లేదా తమ పిల్లలు దానికి హాజరు కావడానికి ముందే ఆయన అతిథేయిని కలిసికొని ముందు నిర్ణయించిన వారే హాజరగుదురా అని రూఢిపరచుకొనేవాడు. భోజనానికి గాని, విహారయాత్రకు గాని, లేదా బంతి ఆడుటవంటి మరొక విధమైన ఆటకుగాని ఎవరైననూ పాల్గొను అవకాశముగల గుంపులలో కొందరు పడిపోవుటకు కారణమైన ఉరులనుండి ఆయన కుటుంబము సంరక్షింపబడింది.
19 కేవలము బంధువులను, పాత స్నేహితులను, లేదా సమాన వయస్కులను లేదా ఆర్ధిక సమానత్వము గలవారిని మాత్రమే ఆహ్వానించుటను యేసు నిరుత్సాహపరచాడు. (లూకా 14:12-14; పోల్చుము యోబు 31:16-19; అపొ. కార్యములు 20:7-9.) ఎవరిని ఆహ్వానించాలో నీవు జాగ్రత్తగా ఎంచుకొనినట్లయితే, వివిధ వయస్సులు, పరిస్థితులుగల క్రైస్తవులను విందులో చేర్చుట నీకు సులభముగా ఉండును. (రోమీయులు 12:13; హెబ్రీయులు 13:2) పరిణతిపొందిన క్రైస్తవుల సహవాసము వలన ప్రయోజనము పొందునట్లు ఆత్మీయతలో బలహీనముగా ఉన్నవారిని లేదా క్రొత్తవారిని కొంతమందిని అందులో చేర్చవచ్చును.—సామెతలు 27:17.
వినోదమును దాని స్థానములో ఉంచుట
20, 21. మన జీవితములలో వినోదము ఎందుకు ఒక సరియైన స్థానమును కలిగియున్నది?
20 దైవభయంగల వారిగా మనము మన వినోదం విషయంలో ఆసక్తి కలిగియుంటూ, అది సరియైనదిగా ఉండునట్లు శ్రద్ధ కలిగియుంటూ, దానికొరకు వెచ్చించు సమయం విషయంలో సమతూకముగా ఉన్నామనుట యెడల శ్రద్ధచూపుట యుక్తము. (ఎఫెసీయులు 2:1-4; 5:15-20) ప్రసంగి పుస్తకాన్ని వ్రాసిన ప్రేరేపిత రచయిత ఇలా భావించాడు: “అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.” (ప్రసంగి 8:15) అటువంటి సమతూకమైన ఆనందములు శరీరమునకు సేదదీర్పునిచ్చి, ప్రస్తుత విధానములో సర్వసాధారణమై యున్న సమస్యలను, నిరాశానిస్పృహలను నివారించుటకు సహాయము చేయును.
21 ఉదాహరణకు, ఆస్ట్రియాలోనున్న ఒక పయినీర్ తన పాత స్నేహితురాలికి ఇలా వ్రాసింది: “మేమొక రోజు విహారయాత్రకు వెళ్లాము, అదెంతో ఉత్తేజకరంగా గడిచింది. మేము దాదాపు 50 మందిమి ఫెర్లాక్కు దగ్గర్లోవున్న ఒక చిన్న సరస్సుకు వెళ్లాము. సహోదరుడైన బి—— మమ్మల్ని తన వ్యాన్‌లో తీసుకెళ్లాడు. ఆలాగే ఆయన వంటచేయుటకు మూడు గ్రిల్స్, మడత కుర్చీలు, టేబిల్స్ మరియు ఒక టేబిల్ టెన్నీస్ టేబిల్నుకూడా తీసుకొచ్చాడు. చెప్పలేనంత ఆనందంగా మేము ఆ రోజు గడిపాము. ఒక సహోదరి తనతోకూడ అకార్డియన్ తీసుకొచ్చింది, మేము చాలా కింగ్డం సాంగ్స్ పాడాము. సహోదరులంతా, పెద్దలు, చిన్నలు అంతా కలిసి చక్కని సహవాసాన్ని అనుభవించాము.” అమితముగా త్రాగుట, అపవిత్రతవంటి ఉరులు మచ్చుకైనా లేని, చక్కని పర్యవేక్షణగల వినోదపు జ్ఞాపకాలు ఆమె మనస్సులో ఉండెను.—యాకోబు 3:17, 18.
22. సామాజిక వినోదము ననుభవించుచుండగా, ఏ హెచ్చరికను మనమందరము ప్రముఖముగా మన తలంపులలో ఉంచుకొనవలెను?
22 మనలను శోధనలకు గురిచేయు ఎటువంటి దాని కొరకైనను పథకములు వేయకుండా, మన అసంపూర్ణ శరీరాశలకు లొంగిపోకుండా మనము జాగ్రత్తగా ఉండవలెనని పౌలు మనకు ఉపదేశిస్తున్నాడు. (రోమీయులు 13:11-14) దీనిలో సామాజిక విందులు వినోదాలుకూడా ఇమిడియున్నవి. అటువంటి వాటికి మనమాయన సలహాను అనువర్తించినట్లయితే, ఆత్మీయ ఓడ బ్రద్దలగుటకు కొందరిని నడిపిన పరిస్థితులను మనము తప్పించుకొందుము. (లూకా 21:34-36; 1 తిమోతి 1:19) బదులుగా, దేవునితో మన సంబంధమును కాపాడుకొనుటకు మనకు సహాయముచేయు ఆరోగ్యదాయకమైన వినోదమునే మనము జ్ఞానయుక్తముగా ఎంచుకొందుము. ఆ విధముగా మనము దేవుడనుగ్రహించిన మంచి బహుమానమని తలంచగల సామాజిక వినోదమునుండి ప్రయోజనం పొందగలం.—ప్రసంగి 5:18. (w92 8/15)
[అధస్సూచీలు]
a వివాహములు, వివాహపు విందులపై సమతూకమైన సలహాను ది వాచ్‌టవర్ ఏప్రిల్ 15, 1984 ఇస్తున్నది. తమ వివాహపు ఏర్పాట్లకు ముందు తమ ప్రయోజనార్థమై పెండ్లికానైయున్న పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ఆలాగే వారికి సహాయముచేయు ఇతరులు ఈ విషయాన్ని పునఃసమీక్షించ వచ్చును.
మనమేమి నేర్చుకొంటిమి?
◻ సామాజిక వినోదములనుభవించుటను గూర్చి బైబిలులో ఏ సమతూక దృష్టిని మనము కనుగొందుము?
◻ వినోదము యొక్క స్వభావము, దానికి వెచ్చించు సమయాన్ని గూర్చి ఎందుకు పరిశీలించవలెను?
◻ ఉరుల విషయంలో జాగ్రత్త వహించుటకు ఒక క్రైస్తవ అతిథేయి చేయగల కొన్ని సంగతులేమై యున్నవి?
◻ వినోదం సరియైనది, సమతూకం గలదైతే అది క్రైస్తవుల కేమివ్వగలదు?
[27వ పేజీలోని చిత్రాలు]
ఒక గుంపులో అతిథులు ఉరిలో చిక్కుకొనకుండా అతిథేయి లేక విందు ప్రధాని బాధ్యత తీసికుంటాడు