కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 11/1 పేజీలు 19-24
  • ఒకరినొకరు బలపరచుకొనుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒకరినొకరు బలపరచుకొనుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దుర్భాషను విసర్జించుట
  • ఇతరులను బలపరచుటకు కృషిచేయండి
  • దైవిక మార్గమందు బలపరచుము
  • బలపరచు పెద్దలు
  • క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రోత్సాహకరంగా మాట్లాడండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • మీ వస్త్రధారణనూ కేశాలంకరణనూ—దేవుడు పట్టించుకుంటాడా?
    తేజరిల్లు!—1998
  • మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 11/1 పేజీలు 19-24

ఒకరినొకరు బలపరచుకొనుడి

“క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”—ఎఫెసీయులు 4:29.

1, 2. (ఎ) సంభాషణ ఒక అద్భుతమని ఎందుకు సరిగా చెప్పవచ్చును? (బి) మన నాలుకను ఎట్లు ఉపయోగిస్తున్నామను విషయంలో, ఎటువంటి జాగ్రత్త తీసికొనుట సరియైనది?

“సంభాషణ, స్నేహితులను, కుటుంబాలను, సమాజములను కలిపే ఒక చమత్కార ప్రక్రియ. . . . [నాలుకయొక్క] సమన్వయపరచబడిన వివిధ కండరాల కదలికలతో మానవ మేధస్సునుండి వెలువడు సంకేతాల మూలంగా ప్రేమ, ఈర్ష్య, గౌరవభావం ఇలా—నిజానికి ఏ మానవ భావాన్ని వ్యక్తపరచే శబ్దాలనైనను మనం చేస్తాము.”—హియరింగ్‌, టేస్ట్‌ అండ్‌ స్మెల్‌.

2 మన నాలుక కేవలం తినడానికి, రుచి చూడడానికి ఉపయుక్తమైన అవయములకంటే ఎక్కువైనది; మనము తలంచు, భావించు దానిని ఇతరులతో పంచుకొను మన సామర్థ్యమందు ఒక భాగమై యున్నది. “నాలుక . . . చిన్న అవయవము. . . . దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 3:5, 9) అవును, యెహోవాను స్తుతించుటవంటి శ్రేష్ఠమైన మార్గములలో మనము మన నాలుకను ఉపయోగించగలము. అయితే అసంపూర్ణులమైనందున, మనము సుళువుగా హానికరమైన లేదా ప్రతికూలమైన సంగతులు మాట్లాడుటకు మన నాలుక నుపయోగించ గలము. యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, యీలాగుండ కూడదు.”—యాకోబు 3:10.

3. మన మాటల విషయములో ఏ రెండు విషయాలకు మనము శ్రద్ధనివ్వవలెను?

3 ఏ మానవుడును పరిపూర్ణముగా తన నాలుకను అధీనములో ఉంచుకోలేక పోయినను, అభివృద్ధి సాధించుటకు మనము నిశ్చయముగా కృషిచేయవలెను. అపొస్తలుడైన పౌలు మనకిలా సలహానిస్తున్నాడు: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని, దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” (ఎఫెసీయులు 4:29) మనమేమి విసర్జించుటకు కృషిచేయాలి, మనమేమి చేయుటకు ప్రయత్నించాలి, అను రెండు అంశాలు ఈ ఉపదేశమందు ఉండడాన్ని గమనించండి. ఈ రెండు అంశాలను మనమిప్పుడు విచారిద్దాం.

దుర్భాషను విసర్జించుట

4, 5. (ఎ) దుర్భాష విషయములో క్రైస్తవులు ఎటువంటి పోరాటమును కలిగియున్నారు? (బి) “దుర్భాష” అను మాటకు ఏ చిత్రీకరణ సరిపోవును?

4 ఎఫెసీయులు 4:29 మొదట మనకిట్లు ఉద్భోదిస్తున్నది: “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” అదంత సులభము కాదు. ఒక కారణమేమంటే మనచుట్టూవున్న లోకములో దుర్భాష సర్వసాధారణమై యున్నది. ఇతరులు తమను గొప్పవారిగా, శూరులుగా ఎంచుతారని తలంచి, తోటివిద్యార్థులు పరస్పరం శపించుకోవడాన్ని అనేకమంది క్రైస్తవ యౌవనులు ప్రతిదినం వింటారు. అటువంటి బూతుమాటలు వినకుండా మనం పూర్తిగా తప్పించుకోలేక పోవచ్చును, అయితే వాటిని మనస్సులోనికి తీసికొనకుండుటకు మనము మనఃపూర్వక ప్రయత్నం చేయగలగాలి, చెయ్యాలి. వాటికి మన మనస్సులోగాని, నోటిలోగాని స్థానం లేదు.

5 పౌలు హెచ్చరికలో చేరియున్న గ్రీకు పదము పాడైన చేపలకు లేదా కుళ్లిన ఫలములకు సంబంధించినదై యున్నది. దీనిని మదిలో చిత్రీకరించుకొనండి: సహనం కోల్పోయిన ఒక వ్యక్తి కోపం తారాస్థాయికి చేరుతుంది. చివరికి అతను కోపంతో నోరు తెరిచేసరికి, కుళ్లిన చేప అతని నోటినుండి జారిపడడం, ఆ తర్వాత పాడైపోయి దుర్వాసనగల ఫలము బయటపడి దగ్గరలో ఉన్నవారందరిపై చిందిపడడం మీరు చూస్తారు. అతనెవరు? అతడు మనలో ఒకడైతే ఎంత ఘోరం! అయినను, ‘మన నోటినుండి దుర్భాషయేదైనా వచ్చినట్లయిన’ మనమా పోలికకు సరిపోయిన వారమవుతాము.

6. ఎఫెసీయులు 4:29 ఎట్లు విమర్శనాత్మకమైన, ప్రతికూలమైన మాటలకు వర్తించును?

6 ఎఫెసీయులు 4:29యొక్క మరొక అన్వయింపు, మనం ఎల్లప్పుడూవుండే కఠినధోరణిని విసర్జించుటకు సంబంధించినదై యున్నది. నిజమే, మనమందరం ఇష్టపడని లేదా అంగీకరించని అనేక విషయాలను గూర్చిన అభిప్రాయాలను, అభిరుచులను కలిగియుంటాము. అయితే ప్రతి వ్యక్తిని, ప్రదేశాన్ని, లేదా ప్రస్తావించు ప్రతి విషయాన్ని గూర్చి ప్రతికూలముగా వ్యాఖ్యానించు (లేదా అనేక వ్యాఖ్యానములు చేయు) వాని మధ్య మీరున్నారా? (రోమీయులు 12:9; హెబ్రీయులు 1:9 పోల్చుము.) అతని మాటలు కృంగదీయును, నిరాశపరచును, లేక నాశనము చేయును. (కీర్తన 10:7; 64:2-4; సామెతలు 16:27; యాకోబు 4:11, 12) మలాకీ వర్ణించిన కఠినాత్ములకు అతనెంతగా తగియున్నాడో అతడు గ్రహించక పోవచ్చును. (మలాకీ 3:13-15) ‘అతని నోటినుండి కుళ్లిన చేపలు, మురిగిపోయిన పండ్లు జారిపడుతున్నాయని ప్రక్కనున్న వ్యక్తి అతనికి చెబితే అతడెంత దిగ్భ్రాంతి చెందునోగదా!

7. మనలో ప్రతి ఒక్కరము ఎటువంటి స్వయం-పరీక్ష చేసికొనవలెను?

7 వేరొకరు తదేకముగా ప్రతికూలమైన లేదా విమర్శనాత్మక వ్యాఖ్యానాలు చేస్తుంటే వారిని గుర్తించడం తేలికైనప్పుడు, నిన్ను నీవు ఇట్లు ప్రశ్నించుకొనుము: ‘అలాంటి ప్రవృత్తి నాకున్నదా? నిజానికి నేనలా ఉన్నానా?’ ఆయా సందర్భాలలో మన మాటల ధోరణినిగూర్చి తలంచుట జ్ఞానయుక్తము. ప్రాథమికముగా అవి ప్రతికూలంగా, విమర్శనాత్మకంగా ఉన్నవా? యోబును ఓదార్చవచ్చిన ఆ ముగ్గురు అబద్ధ స్నేహితులవలె మనమున్నామా? (యోబు 2:11; 13:4, 5; 16:2; 19:2) ప్రస్తావించుటకు అనుకూలమైన దానిని ఎందుకు కనుగొనకూడదు? సంభాషణ ముఖ్యముగా విమర్శనాత్మకంగా ఉంటే, దానిని క్షేమాభివృద్ధికరమైన దానిగా ఎందుకు మలచకూడదు?

8. మాటల విషయంలో మలాకీ 3:16 ఎటువంటి పాఠము నిచ్చుచున్నది, మనమా పాఠము నన్వయిస్తున్నామని ఎట్లు చూపగలం?

8 ఈ వ్యత్యాసమును మలాకీ ప్రస్తావించాడు: “యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడు కొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను.” (మలాకీ 3:16) క్షేమాభివృద్ధికరమైన మాటలకు దేవుడెలా ప్రత్యుత్తరమిచ్చాడో నీవు గమనించావా? సహవాసుల మధ్య అటువంటి సంభాషణా ప్రభావమేమై ఉంటుంది? మన దైనందిన మాటలను గూర్చి వ్యక్తిగతముగా మనమొక పాఠం నేర్చుకోవచ్చును. మన సాధారణ సంభాషణ ‘దేవునికి చేయు స్తుతియాగమును’ పోలియుంటే మనకు మరియు ఇతరులకు అదెంతో శ్రేష్ఠముగా ఉంటుంది.—హెబ్రీయులు 13:15.

ఇతరులను బలపరచుటకు కృషిచేయండి

9. క్రైస్తవ కూటములెందుకు ఇతరులను బలపరచుటకు ఒక చక్కని సందర్భాలై యున్నవి?

9 ‘వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్నిబట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు’ మాటలాడుటకు సంఘ కూటములు చక్కని సందర్భాలై యున్నవి. (ఎఫెసీయులు 4:29) బైబిలు విషయం మీద ప్రసంగించునప్పుడు, ప్రదర్శనలలో పాల్గొనునప్పుడు, లేదా ప్రశ్నాజవాబుల భాగములలో వ్యాఖ్యానించునప్పుడు మనమలా చేయవచ్చును. ఆ విధముగా మనము సామెతలు 20:15ను రూఢిపరచవచ్చును: “తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.” మనమెంతమంది హృదయాలను స్పర్శిస్తామో లేక బలపరుస్తామో ఎవరికి తెలుసు?

10. మనం సాధారణంగా ఎవరితో సంభాషింతుమో ఆలోచించిన మీదట మనమే సవరణ చేసికొనుట సరియైయుండును? (2 కొరింథీయులు 6:12, 13)

10 అవసరాన్నిబట్టి వినువారిని బలపరచు సంభాషణలకై కూటములకు ముందున్న, కూటములు అయిపోయిన తర్వాతి సమయాలు అనుకూలమైనవి. ఈ సమయాలలో మన బంధువులతో, మనకిష్టమైన కొద్దిమంది స్నేహితులతో ప్రీతికరముగా మాట్లాడుట సులభమే. (యెహాను 13:23; 19:26) అయితే, ఎఫెసీయులు 4:29 ప్రకారం, మాట్లాడుటకు వేరేవారి కొరకెందుకు వెదకకూడదు? (లూకా 14:12-14 పోల్చుము.) కొంతమంది కొత్తవారికి, వృద్ధులకు లేదా యౌవనులకు కేవలము పేరుకు మాత్రం వెళ్లొస్తామని చెప్పుటకంటె ఎక్కువచేయాలని, యౌవనులతో వారి స్థాయికి తగినట్లు వారితో కలిసి కూర్చొనుటకు మనము ముందుగానే తీర్మానించుకొన వచ్చును. మన నిజమైన శ్రద్ధ, బలపరచు సంభాషణ కొరకు సమయాన్నిచ్చుట వలన ఇతరులు కీర్తన 122:1లోని దావీదు భావాలను మరింత ఎక్కువగా ప్రతిధ్వనించగలుగునట్లు చేయును.

11. (ఎ) కూర్చొను సీట్ల విషయంలో అనేకమంది ఏ అలవాటును పెంపొందించుకొనిరి? (బి) కొందరెందుకు ఉద్దేశపూర్వకముగా తాము కూర్చుండు స్థలమును మార్చుదురు?

11 కూటములలో సాధారణంగా మనము కూర్చొను స్థలాలను మార్చుట క్షేమాభివృద్ధికరమైన సంభాషణ చేయుటకు మనకున్న మరొక సహాయము. పాలిచ్చు తల్లి విశ్రాంతి గది దగ్గర కూర్చోవలసి వస్తుంది లేదా వికలాంగుడైన వ్యక్తి దారికి ప్రక్కగా వేయబడిన కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది, కానీ మన విషయమేమి? అలవాటు చొప్పున మనము యథావిధిగా మనం కూర్చునే కుర్చీ లేక చోటుకు వెళ్లవచ్చును; పక్షి సహితము తన సహజ జ్ఞానముచొప్పున తన గూటికి చేరును. (యెషయా 1:3; మత్తయి 8:20) సూటిగా చెప్పాలంటే, మనమెక్కడైనా కూర్చొనవచ్చును గనుక—కుడివైపున, ఎడమవైపున, ముందుభాగాన, అలా మరెక్కడైనా—కూర్చొనుటకు మీరు స్థల మార్పిడిచేసికొని ఆ విధముగా వేర్వేరు వ్యక్తులతో ఎందుకు ఎక్కువ పరిచయము చేసికొనకూడదు? మనమిలా చేయవలెననే నియమమేదీ లేకపోయినను, తాము కూర్చొను స్థలమును మార్చిన పెద్దలు, ఇతర పరిణతిచెందిన వ్యక్తులు కొద్దిమంది సన్నిహిత స్నేహితులకు బదులుగా తాము అనేకులకు మేలుకరమైన దానిని చేయుట సులభమని తెలుసుకున్నారు.

దైవిక మార్గమందు బలపరచుము

12. చరిత్రయంతటిలో ఎటువంటి కోరదగని స్వభావము కనబరచబడుచున్నది?

12 ఇతరులను బలపరచవలెనను ఒక క్రైస్తవుని కోరిక అనేక నియమాలు చేయవలెనను మానవ స్వభావమును అనుసరించుటకు బదులు, ఈ విషయంలో దేవుని అనుకరించుటకు అతన్ని కదిలించవలెను.a తమ చుట్టున్న వారిపై అధికారము చేయవలెనను భావము అసంపూర్ణ మానవులకు దీర్ఘకాలముగా వుంది, కాగా కొంతమంది దేవుని సేవకులు సహితము ఈ స్వభావమునకు లొంగిపోయారు. (ఆదికాండము 3:16; ప్రసంగి 8:9) యేసు కాలములో యూదా మతనాయకులు ‘మోయ శక్యము కాని భారమైన బరువులు ఇతరుల భుజాలపై పెట్టారే గాని, తాము మాత్రము వాటిని మోయ నిష్టపడకపోయిరి.’ (మత్తయి 23:4) వారు నిరపాయకరమైన సాంప్రదాయాలను ఆదేశపూర్వక ఆచారములుగా మార్చారు. మానవ నియమాలయెడల వారికున్న అమితమైన శ్రద్ధనుబట్టి, ఎంతో ప్రాముఖ్యమని దేవుడు గుర్తించిన సంగతులను వారు అలక్ష్యము చేశారు. వారు తయారుచేసిన అనేక లేఖన రహిత నియమాలవలన ఎవరును బలపరచబడలేదు; వారి మార్గము అసలు దేవుని మార్గమే కాదు.—మత్తయి 23:23, 24; మార్కు 7:1-13.

13. తోటి క్రైస్తవుల కొరకు అసంఖ్యాకమైన నియమములుంచుట ఎందుకు సరియైనది కాదు?

13 క్రైస్తవులు నిష్కల్మషముగా దైవిక నియమాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటారు. మనము కూడ భారమైన అనేక నియమాలను పెట్టే స్వభావానికి లోనుకావచ్చును. ఎందుకు? ఒక విషయమేమంటే, అభిరుచులు లేదా అభీష్టాలు భిన్నముగా ఉంటాయి, కాబట్టి ఇతరులు ఇష్టపడని మరియు అనవసరమని తలంచు విషయాలు కొందరికి ఆమోదయోగ్యముగా ఉండవచ్చును. క్రైస్తవులు ఆత్మీయ పరిణతికి పురోగమించు విషయములో కూడా భిన్నముగా ఉంటారు. అయితే అనేక నియమాలు చేయుట పరిణతి సాధించునట్లు వేరొకవ్యక్తికి సహాయముచేయు దైవిక మార్గమేనా?? (ఫిలిప్పీయులు 3:15; 1 తిమోతి 1:19; హెబ్రీయులు 5:14) ఒక వ్యక్తి తీవ్రమైనదిగా, విపత్కరమైనదిగా కన్పించు విధానమును నిజముగా చేబడుతున్నట్లయితే, అట్టి విధానాన్ని నిషేధించు నియమమేదైనా శ్రేష్ఠమైన పరిష్కారముగా ఉండునా? తప్పిదము చేయు వ్యక్తితో మృదువుగా తర్కించి అతన్ని పునరుద్ధరించుటకు అర్హులైన వారు ప్రయత్నించుట దేవుని విధానమై యున్నది.—గలతీయులు 6:1.

14. దేవుడు ఇశ్రాయేలీయుల కిచ్చిన నియమముల ద్వారా ఏ సంకల్పములు నెరవేర్చబడెను?

14 నిజమే, ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఉపయోగించిన కాలములో, దేవాలయములోని ఆరాధన, బలులు, చివరకు పారిశుధ్యము విషయములో దేవుడు వందలాది నియమాలు విధించాడు. ఒక నిర్దిష్ట జనాంగమునకు ఇది సరియే, మరియు అందలి అనేక నియమాలు ప్రవచనార్థకమై యుండి, యూదులను మెస్సీయనొద్దకు నడిపించుటకు సహాయము చేయునవై యుండెను. పౌలు ఇట్లు వ్రాశాడు: “మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.” (గలతీయులు 3:19, 23-25) ధర్మశాస్త్రము హింసాకొయ్యకు కొట్టివేయబడిన తర్వాత, విశ్వాసమును బలపరచుటకిదే మార్గమన్నట్లు జీవితంలోని అనేక విషయాలను గూర్చి దేవుడు క్రైస్తవులకు ఒక పెద్ద నియమ పట్టికనియ్యలేదు.

15. క్రైస్తవ ఆరాధికులకు దేవుడు ఏ నడిపింపును దయచేసెను?

15 అయినను, మనము నియమము లేకుండా లేము. విగ్రహారాధనను, వ్యభిచారమును, జారత్వమును రక్తము దుర్వినియోగము చేయుటను విసర్జించవలెనని దేవుడు మనకాజ్ఞాపించుచున్నాడు. నరహత్యను, అబద్ధమును, అభిచారమును, ఇంకా ఇతర పాపాలను ఆయన నిర్దిష్టముగా నిషేధించుచున్నాడు. (అపొ. కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8) అనేక విషయాలపై ఆయన తన వాక్యమందు స్పష్టమైన సలహాను దయచేయుచున్నాడు. అయినను, ఇశ్రాయేలీయులకంటే ఎంతో విస్తారమైన రీతిలో మనము బైబిలు సూత్రాలను నేర్చుకొని వాటిని అన్వయించు బాధ్యతను కలిగియున్నాము. కేవలము నియమాల కొరకు చూచుట లేక వాటిని చేయుటకు బదులు, ఈ సూత్రాలను కనుగొని వాటినిగూర్చి ఆలోచించుటకు సహాయము చేయుటద్వారా పెద్దలు ఇతరులకు సహాయము చేయగలరు.

బలపరచు పెద్దలు

16, 17. తోటి క్రైస్తవులకు నియమములుంచుట విషయములో అపొస్తలులు ఏ చక్కని మాదిరినుంచారు?

16 పౌలు ఇలా వ్రాశాడు: “అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.” (ఫిలిప్పీయులు 3:16) ఆ దైవిక దృక్కోణము ననుసరించి, ఇతరులను బలపరచు విధముగా అపొస్తలుడు వారితో వ్యవహరించాడు. ఉదాహరణకు, విగ్రహములున్న దేవాలయమునుండి తీసుకురాబడిన మాంసమును తినవచ్చునా లేదాయను ప్రశ్న లేవదీయబడింది. అయితే ఈ పెద్ద, పొందిక లేదా సరళత అను పేరుమీద తొలి సంఘాలన్నింటికి ఏదొక నియమాన్ని ఏర్పాటుచేశాడా? లేదు. పరిణతి విషయములో వివిధ రీతుల జ్ఞానము, పురోభివృద్ధి ఆ క్రైస్తవులను వివిధ ఎంపికలకు నడిపిస్తుందని ఆయన గుర్తించాడు. తన విషయమైతే, తాను శ్రేష్ఠమైన మాదిరినుంచడానికి ఆయన తీర్మానించుకున్నాడు.—రోమీయులు 14:1-4; 1 కొరింథీయులు 8:4-13.

17 వస్త్రధారణ, శిరోజాలంకరణవంటి విషయాలలో అపొస్తలులు సహాయకరమైన సలహానిచ్చారని, అయితే వారు అన్ని సందర్భాలకు అన్వయించు ఒక బండగుర్తులాంటి నియమముంచుటకు పూనుకోలేదని క్రైస్తవ గ్రీకు లేఖనములు చూపుచున్నవి. ఈనాడు మందను బలపరచవలెనని శ్రద్ధకలిగియున్న క్రైస్తవ అధ్యక్షులకు ఇది శ్రేష్ఠమైన మాదిరియై యున్నది. నిజానికిది, ప్రాచీన ఇశ్రాయేలీయుల విషయములో దేవుడు అనుసరించిన ప్రాథమిక విధానము యొక్క విస్తరణయే.

18. దుస్తుల విషయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ నియమముల నిచ్చెను?

18 దుస్తులను గూర్చి దేవుడు ఇశ్రాయేలీయులకు విస్తారమైన నియమాలివ్వలేదు. మొత్తానికి స్త్రీపురుషులు ఒకేవిధమైన వస్త్రాలను, లేదా పైదుస్తులను ధరించేవారు. కాకపోతే స్త్రీలు, ఎంబ్రాయిడరీ లేదా రంగురంగుల వస్త్రాలు ధరించేవారు. స్త్రీపురుషులిరువురు సాధిన్‌, లేదా అంగవస్త్రము ధరించేవారు. (న్యాయధిపతులు 14:12; సామెతలు 31:24; యెషయా 3:23) వస్త్రాలను గూర్చి దేవుడు ఎటువంటి నియమాలనిచ్చాడు? స్త్రీలుగాని పురుషులుగాని సలింగ సంయోగ ఉద్దేశముతో, వారివస్త్రాలు వీరు వీరివస్త్రాలు వారు వస్త్రాలు ధరించరాదు. (ద్వితీయోపదేశకాండము 22:5) తమ చుట్టునున్న జనాంగముల నుండి తాము వేరైయున్నామని చూపించుటకు, ఇశ్రాయేలీయులు తమ వస్త్రాల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను. (సంఖ్యాకాండము 15:38-41) వస్త్రధారణ పద్ధతులను గూర్చి ప్రాథమికముగా ధర్మశాస్త్రము ఇచ్చిన సమస్త నడిపింపు అదే.

19, 20. (ఎ) వస్త్రాలంకరణ, శిరోజాలంకరణ విషయములో క్రైస్తవులకు బైబిలు ఏ నడిపింపు నిచ్చుచున్నది? (బి) వ్యక్తిగత అలంకరణను గూర్చి నియమములు చేయుటలో పెద్దలు ఏ దృష్టిని కలిగియుండాలి?

19 క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రింద లేరు గనుక, వస్త్రధారణను గూర్చి లేదా అలంకరణను గూర్చి మనకు బైబిలులో వివరణాత్మక నియమాలు ఏమైనా కలవా? నిజానికి అలాంటివేమీ లేవు. మనము అనువర్తించగల సమతూకమైన సూత్రాలను దేవుడు మనకు దయచేశాడు. పౌలు ఇలా వ్రాశాడు: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధి గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొన [కూడదు].” (1 తిమోతి 2:9) భౌతిక అలంకరణ మీద దృష్టి నిల్పుటకు బదులు, క్రైస్తవ స్త్రీలు “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల హృదయపు అంతరంగ స్వభావముపై” దృష్టిని కేంద్రీకరించవలెనని పేతురు ఉద్భోదించాడు. (1 పేతురు 3:3, 4) తొలి శతాబ్దములో కొంతమంది క్రైస్తవులు తమ వస్త్రధారణ, శిరోజాలంకరణ విషయంలో మరింత అణకువ, నమ్రత కలిగియుండు అవసరత ఉందని వ్రాయబడిన ఆ సలహా సూచిస్తున్నది. అయినను ఫలాని పద్ధతులు ఉండవలెనని కోరుటకు—లేక నిషేధించుటకు—బదులు, అపొస్తలులు కేవలము క్షేమాభివృద్ధికరమైన సలహాను సమకూర్చారు.

20 నమ్రతగా కన్పించు విషయములో యెహోవాసాక్షులు సాధారణముగా గౌరవింపబడుదురు, గౌరవింపబడాలి. అయినప్పటికిని, అలంకరణా పద్ధతులు ఆయా దేశాలలో, ప్రాంతాలలో లేదా సంఘములో వివిధ రీతులలో ఉండును. బలమైన అభిప్రాయాలున్న లేక వస్త్రధారణ లేదా శిరోజాలంకరణ విషయములో ఒకానొక అభిరుచి కలిగియున్న పెద్ద తదనుగుణ్యముగా తనకొరకు తన కుటుంబము కొరకు వాటిని తీర్మానించవచ్చును. కానీ మంద విషయానికొస్తే, ఆయన పౌలు చెప్పిన అంశాన్ని మనస్సులో ఉంచుకొను అవసరత ఉంది: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలకడగా ఉన్నారు.” (2 కొరింథీయులు 1:24) అవును, సంఘానికి నియమాలుంచుటకు కలుగు ఎటువంటి ప్రేరణనైనను ఎదిరించుట ద్వారా, పెద్దలు ఇతరుల విశ్వాసమును బలపరచుటకు పనిచేయగలరు.

21. దుస్తుల విషయములో ఎవరైనా మితిమీరినట్లయిన పెద్దలు ఎటువంటి క్షేమాభివృద్ధికరమైన సహాయమునందించ గలరు?

21 మొదటి శతాబ్దములోవలెనే, కొన్నిసార్లు ఒక క్రొత్తవ్యక్తి లేదా ఆత్మీయ బలహీనతగల వ్యక్తి ప్రశ్నించదగిన లేదా అయుక్తమైన వస్త్రధారణను, అలంకరణను, లేదా నగలు పెట్టుకొనవచ్చును. అప్పుడేమి? ఇక్కడకూడా, సహాయపడవలెనని చిత్తశుద్ధితో కోరుకొను క్రైస్తవ పెద్దలకు గలతీయులు 6:1 నడిపింపునిచ్చు చున్నది. ఏదైనా సలహానిచ్చుటకు ముందు ఒక పెద్ద జ్ఞానయుక్తముగా, తన అభిరుచిని, తనవంటి తలంపునే కలిగియున్న పెద్దను కాకుండా, వేరొక తోటిపెద్దను సంప్రదించ వచ్చును. ఒకవేళ లౌకిక పద్ధతిగల వస్త్రధారణ లేదా శిరోజాలంకరణ సంఘమందలి అనేకమందిపై ప్రభావము చూపుతున్నట్లు కన్పించినట్లయితే, ఒకానొక కూటములో దయాపూర్వకముగా, క్షేమాభివృద్ధికరముగా లేదా వ్యక్తిగతముగా సహాయము నందించుటకు, శ్రేష్ఠమైన సహాయమునెట్లు అందించవలెనో పెద్దల కూటమి చర్చించవచ్చును. (సామెతలు 24:6; 27:17) రెండవ కొరింథీయులు 6:3 నందున్న దృక్కోణమును ప్రోత్సహించుటే వారి ధ్యేయమై యుండును: “మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయకున్నాము.”

22. (ఎ) చిన్న చిన్న విషయములలో వివిధ రీతుల దృక్కోణములున్నట్లయిన అది ఎందుకు కలతకు కారణము కారాదు? (బి) పౌలు ఎటువంటి చక్కని మాదిరి చూపాడు?

22 ‘తమ సంరక్షణలోనున్న దేవుని మందను కాయు’ క్రైస్తవ పెద్దలు, ‘దేవుని స్వాస్థ్యముగానున్న వారిపై ప్రభువులైనట్టుండకుడి’ అని పేతురు వ్రాసినట్లుగా చేయుటకు యిష్టపడుదురు. (1 పేతురు 5:2, 3) వారి ప్రేమపూర్వకమైన పనిలో, వివిధ అభిరుచులకు సంబంధించి ప్రశ్నలు లేవదీయబడవచ్చును. కావలికోట పఠనములో నిలువబడి పేరాలు చదువుట బహుశ స్థానిక ఆచారమై యుండవచ్చును. ప్రాంతీయ సేవ కొరకైన ఏర్పాట్లు, పరిచర్య విషయములో అనేక ఇతర వివరములు స్థానిక వాడుకచొప్పుననే జరిగించవచ్చును. అయితే, ఎవరైనా కొంచెం భిన్నముగా ప్రవర్తిస్తే ఇక పెద్ద తప్పు జరిగిపొయినట్లేనా? “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగవలెనని” ప్రేమగల అధ్యక్షులు కోరుకొందురు. ఈ మాటలను పౌలు అద్భుతరీతిలో ఇవ్వబడిన ఈవుల విషయములో ఉపయోగించాడు. అయితే “సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుటే” పౌలుయొక్క ముఖ్యాసక్తియని దాని సందర్భము చూపించుచున్నది. (1 కొరింథీయులు 14:12, 40) అందరూ ఒకేలా వుండాలనిగాని, సంపూర్ణ సామర్థ్యము గలవారై ఉండాలనుటే తన ముఖ్యోద్దేశమన్నట్లు, ఆయన అసంఖ్యాకమైన నియమాలుంచవలెనను దృక్పధాన్ని చూపించలేదు. ఆయనిట్లు వ్రాశాడు: “పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు [అధికారము] అనుగ్రహించెను.”—2 కొరింథీయులు 10:8.

23. ఇతరులను బలపరచు విషయంలో మనము పౌలు మాదిరిని అనుకరించగల కొన్ని మార్గములేమై యున్నవి?

23 అనుకూలమైన, ప్రోత్సాహకరమైన మాటలద్వారా ఇతరులను బలపరచుటకు పౌలు నిస్సందేహముగా పనిచేశాడు. కేవలము కొద్దిమంది స్నేహితులను కలిగియుండుటకు బదులు, ఆత్మీయతలో బలంగా ఉన్నవారిని, ప్రత్యేకముగా బలపరచవలసిన అవసరమున్న అనేకమంది సహోదర సహోదరీలను సందర్శించుటకు ఆయన అధికముగా కృషిచేసెను. ఆయన నియమములకు బదులు ప్రేమను నొక్కితెలియజేశాడు, ఎందుకనగా “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.”—1 కొరింథీయులు 8:1. (w92 8/15)

[అధస్సూచీలు]

a పరిస్థితులపై ఆధారపడి, ఒక కుటుంబములో వివిధ నియమాలు అవసరమై యుండవచ్చును. తమ పిల్లలకు కావలసిన విషయాలను నిర్ణయించు అధికారమును బైబిలు తలిదండ్రుల కిస్తుంది.—నిర్గమకాండము 20:12; సామెతలు 6:20; ఎఫెసీయులు 6:1-3.

పునఃసమీక్షా అంశములు

◻ విమర్శనాత్మకముగా లేదా ప్రతికూలముగా మాట్లాడు స్వభావము మనకున్నట్లయిన, మార్పుచేసికొనుట ఎందుకు సరియైనది?

◻ సంఘములో మరింత బలపరచు వారిగా ఉండుటకు మనమేమి చేయగలము?

◻ ఇతరుల కొరకు అనేక నియమములుంచుట విషయములో దైవిక మాదిరి ఏమిటి?

◻ మందకు మానవ సంబంధ నియమాలు పెట్టకుండుటకు పెద్దలకేది సహాయము చేయును?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి