లోక భ్రమలను త్యజించి, రాజ్య వాస్తవములను వెంబడించుడి
“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:33.
1. సూచనార్థక హృదయమును గూర్చి దేవుని వాక్యము ఏ హెచ్చరిక నిస్తుంది, అది మనలను మోసగించగల ఒక ముఖ్య మార్గమేమై యున్నది?
“నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:23) జ్ఞానియైన రాజగు సొలొమోను ఎందుకు ఈ హెచ్చరిక నివ్వవలసి వచ్చెను? ఎందుకనగా “హృదయము అన్నింటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది.” (యిర్మీయా 17:9) మన సూచనార్థక హృదయము మనలను మోసగించగల ఒక ముఖ్య మార్గమేదనగా, మనము లోక భ్రమలలో మునిగియుండునట్లు చేయుటయే. అయితే భ్రమలంటే ఏమిటి? అవి అవాస్తవమైన ఊహలు, పగటి కలలు, పనిలేని తిరుగులాటల మనస్సు. ఈ పగటి కలలు లోక భ్రమలుగా తయారైనప్పుడు, అవి కేవలము కాలమును వృధాచేసేవే గాక, అవి బహు ప్రమాదకరమైనవి కూడ. కావున, మనం వాటిని పూర్తిగా విసర్జించాలి. వాస్తవంగా, మనము యేసువలె దుర్నీతిని ద్వేషించినట్లయితే, మన హృదయాలు లౌకిక భ్రమలలో తేలియాడకుండ జాగ్రత్త పడతాము.—హెబ్రీయులు 1:8, 9.
2. లోక భ్రమలంటే ఏమిటి, వాటిని మనమెందుకు తృణీకరించవలెను?
2 అయితే లోక భ్రమలంటే ఏమిటి? సాతాను అధికారమునందున్న ఈ లోకసంబంధమైన భ్రమలై యున్నవి. దీనిని గూర్చి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:16; 5:19) క్రైస్తవులెందుకు లోక భ్రమలను విసర్జించాలి? ఎందుకంటె అటువంటి భ్రమలు మనస్సులో, హృదయములో స్వార్థపూరిత కోరికలను ఉసిగొల్పును. చెడ్డదైన దానిని చేయుటకు పగటికలలు కనుట, వాస్తవానికి ఒక వ్యక్తి నిజముగా చేయబోవు దానిని మనస్సునందు పూర్వాభ్యాసము చేయుటవంటిది. శిష్యుడైన యాకోబు మనలనిట్లు హెచ్చరించుచున్నాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.”—యాకోబు 1:14, 15.
హెచ్చరికతోకూడిన మాదిరులు
3. స్వార్థపూరిత భ్రమలు కల్గించు హాని విషయములో ఎవరి సంగతి ప్రధానమైన హెచ్చరికతో కూడిన ఉదాహరణను సమకూర్చుచున్నది?
3 లోక భ్రమలను ఎందుకు తృణీకరించవలెనో చూపించుచున్న ఉదాహరణలను మనమిప్పుడు విచారిద్దాం. స్వార్థపూరిత భ్రమలలో మునిగియుండుట ద్వారా కలుగు హానికి అపవాదియగు సాతాను విషయమే ఒక ప్రధాన ఉదాహరణను సమకూర్చుచున్నది. యెహోవా యొక్క ఉన్నతమైన విశ్వసార్వభౌమాధిపత్యము యెడల ఈర్ష్యపడి, తను ఆరాధింపబడవలెనని కోరునంతగా అతడు తనలో స్వయం-ప్రధాన భావాలు వృద్ధియగుటకు అనుమతించెను. (లూకా 4:5-8) ఇది అవాస్తవమైన భ్రమయా? నిశ్చయముగా! సాతాను వెయ్యి సంవత్సరముల పాటు బంధింపబడి, ప్రత్యేకముగా అతడు రెండవ మరణమైన, “అగ్ని . . . గుండములో” పడవేయబడినప్పుడు ఇది నిస్సందేహముగా నిరూపించబడును.—ప్రకటన 20:1-3, 10.
4. సాతాను హవ్వను ఎట్లు మోసగించెను?
4 మొదటి స్త్రీయైన హవ్వ విషయములో మనకు మరొక హెచ్చరికతోకూడిన ఉదాహరణ కలదు. తన అత్యాశను నిజం చేసికోవాలనే ప్రయత్నములో సాతాను, హవ్వను మోసగించి, నిషేధించబడిన ఫలమును భుజించినను, ఆమె చనిపోదుగాని, మంచి చెడ్డలు తెలిసికొనినదై దేవునివలె తయారుగునను భ్రమను ఆమె మనస్సునందుంచెను. ఆ భ్రమ అవాస్తమైనదియు, స్వార్థపూరితమైనదై యున్నదా? అవును, యెహోవా హవ్వను ఆమె భర్తయగు ఆదామును విచారించి, ఆ తర్వాత వారిని ఖండించుట దీనిని మనకు చూపిస్తున్నది. తత్ఫలితముగా, వారు తమకొరకును, తమ అసంపూర్ణ సంతానమంతటి కొరకును పరదైసులో జీవితమును అనుభవించు హక్కును పొగొట్టుకొనిరి.—ఆదికాండము 3:1-19; రోమీయులు 5:12.
5. దేవుని కుమారులైన కొంతమంది దూతలు పడిపోవడానికి కారణమేమి, వారియెడల దాని ఫలితమేమైయుండెను?
5 దూతలైన కొంతమంది దేవుని కుమారుల విషయములో కూడ మనము హెచ్చరికను కలిగియున్నాము. (ఆదికాండము 6:1-4) పరలోకమందు యెహోవా సమక్షములో వారికనుగ్రహింపబడిన ఆశీర్వాదములను అనుభవించుటకు బదులు, వారు భూమిపైనున్న స్త్రీలనుగూర్చి, వారితో లైంగిక సంబంధం కలిగియుండుట ఎంతో సుఖమని భ్రమించిరి. ఈ భ్రమల ననుసరించి ప్రవర్తించినందున, ఆ అవిధేయులైన దూతలు ఇప్పుడు ఆత్మీయ కటికచీకటిగల బిలమందు బంధింపబడి, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనాంతమున నిర్మూలించబడుటకు వేచియున్నారు.—2 పేతురు 2:4; యూదా 6; ప్రకటన 20:10.
లోక భ్రమలను తృణీకరించుము
6, 7. వస్తుసంపత్తి విషయములో లోక భ్రమలు ఎందుకు హానికరము, మోసకరము?
6 మనమిప్పుడు సాతాను ప్రేరేపించు అత్యంత సాధారణమైన, ప్రమాదకరమైన ఒక భ్రమనుగూర్చి విచారిద్దాం. లోక భ్రమలలో మునిగియుండుటకు మనము ప్రతి విధమైన ప్రచారసాధనము ద్వారా శోధింపబడుచున్నాము. ఈ భ్రమలు తరచు ధనాశచే కల్గించబడుచున్నవి. ధనమును కలిగియుండుట తప్పేమీకాదు. దైవభక్తిగల అబ్రాహాము, యోబు, రాజైన దావీదు బహు ధనవంతులై యుండిరి, కానీ వారు వస్తు సంపత్తిని వాంఛించలేదు. వస్తుదాయక భ్రమలు ధనార్జనకొరకు ప్రజలు అనేక సంవత్సరాలు విపరీతముగా శ్రమించి పనిచేయుటకు పురికొల్పును. అటువంటి భ్రమలు గుర్రపు పందాలు కాయుట, లాటరీ టిక్కట్లు కొనుటవంటి అన్నిరకాల జూదమందు మునిగియుండుటకు కూడ నడిపించును. వస్తుసంపత్తి మనకు భద్రతనిచ్చునని మనము తలంచినట్లయిన, ఈ వాస్తవిక సామెతను ఆలోచించుము: “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణమునుండి రక్షించును.” (సామెతలు 11:4) నిజానికి, “మహాశ్రమల” నుండి రక్షింపబడుటకు వస్తుసంపత్తి ఏమాత్రం ప్రయోజనకరం కాదు.—మత్తయి 24:21; ప్రకటన 7:9, 14.
7 వస్తుసంపత్తి సులభముగా మనలను మోసగించగలదు. అందుకే మనమిట్లు ఉపదేశించబడ్డాము: “ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి యెత్తయిన ప్రాకారము.” (సామెతలు 18:11) అవును, కేవలం అతని దృష్టికి మాత్రమే, ఎందుకనగా ద్రవ్యోల్బణము అదుపు తప్పినప్పుడు, ఆర్ధిక రంగం పతనమైనప్పుడు, రాజకీయ సంక్షోభం లేక మరణకరమగు రోగము వచ్చినప్పుడు వస్తుసంపత్తి ఎక్కువ భద్రత నివ్వలేదు. వస్తుసంపత్తియందు మన నమ్మకాన్ని వుంచు తెలివితక్కువ పనినిగూర్చి యేసుక్రీస్తు హెచ్చరించెను. (లూకా 12:13-21) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను కూడ మనము కలిగియున్నాము: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మునుతామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:10.
8. లైంగిక స్వభావముగల లోక భ్రమలు ఎంత ప్రభలమై యున్నవి, వీటిలో ఏ ప్రమాదములున్నవి?
8 ఇతర భ్రమలు అక్రమ లైంగిక సంబంధమైనవి. కొన్ని టెలిఫోను నంబర్లు కలిపి, అశ్లీల వాక్యాలు వినుటకు అందుబాటులోనున్న దుర్భాష జనాదరణ పొందుట, పాపభరిత మానవ స్వభావము లైంగిక భ్రమలలో ఎంతమేరకు తేలియాడాలని యిష్టపడుతుందో మనము చూడవచ్చును. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, టెలిఫోన్ద్వారా లభ్యమయ్యే అశ్లీలత్వము (డయల్-ఎ-పోర్న్) అనేక కోట్ల డాలర్ల వ్యాపారమై యున్నది. అక్రమ లైంగికత్వముపై మన మనస్సులు ఊగిసలాడుటకు అనుమతించినట్లయిన, మనము కేవలము శుద్ధమైన క్రైస్తవులుగా కన్పించు, వేషధారులమై యుండమా? అటువంటి భ్రమలు అక్రమ సంబంధాలకు నడిపించగల ప్రమాదము లేదా? ఇది సంభవించి, తత్ఫలితముగా వ్యభిచారము లేదా జారత్వము జరిగించినందుకు కొందరు క్రైస్తవ సంఘము నుండి వెలివేయబడిరి. మత్తయి 5:27, 28 నందుగల యేసు మాటల దృష్ట్యా, అటువంటి భ్రమలలో అదేపనిగా మునిగియుండు వారందరు తమ హృదయాలలో వ్యభిచరించు దోషులు కారా?
9. లోక భ్రమలను గూర్చి మనలను హెచ్చరించుటకు ఏ శ్రేష్ఠమైన సలహాను లేఖనములు కలిగియున్నవి?
9 అటువంటి భ్రమలలో మునిగియుండు మన పాపభరిత హృదయముల స్వభావమును ఎదుర్కొనుటకు, మనము పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను మనస్సు నందుంచుకొనవలెను: “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పజెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:13) అన్నిసమయాలలో మనము మోషేవలె ఉండవలెను, ఈయన “అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” యుండెను. (హెబ్రీయులు 11:27) అవును, లోక భ్రమలు యెహోవాకు అప్రీతికరమని, అవి కేవలము మనకు హాని తేగలవని ఎడతెగక మనకు మనము చెప్పుకొనవలెను. దేవుని ఆత్మఫలాలన్నింటిని, ప్రత్యేకముగా ఆశానిగ్రహమును పెంపొందించుకొనుట యెడల మనము శ్రద్ధ కలిగియుండవలెను, ఏలయనగా శరీర సంబంధముగా మనము విత్తినట్లయిన, శరీరమునుండి క్షయమను పంట కోయుదుమను వాస్తవము నుండి తప్పించుకోలేము.—గలతీయులు 5:22, 23; 6:7, 8.
రాజ్యము యొక్క వాస్తవములు
10, 11. (ఎ) సృష్టికర్త నిజత్వమును ఏ వాస్తవాలు బలపరచుచున్నవి? (బి) బైబిలు నిజముగా దేవుని వాక్యమని ఏది నిరూపించుచున్నది? (సి) దేవుని రాజ్యము యొక్క రాజు నిజమై యున్నాడనుటకు ఏ నిదర్శనమున్నది?
10 లోక భ్రమలను తృణీకరించుటకు శ్రేష్ఠమైన మార్గము రాజ్యము యొక్క వాస్తవాలను వెంబడించుటయై యున్నది. దేవునిచే కలుగజేయబడిన రాజ్యము యొక్క వాస్తవాలు లోక భ్రమలకు పూర్తిగా భిన్నమై యున్నవి. దేవుడు ఉన్నాడనుట వాస్తవమా? ఆయన ఉనికిని గూర్చి ఎలాంటి సందేహము లేదు. ఆ వాస్తవమునకు దృశ్య సృష్టి సాక్ష్యమిచ్చుచున్నది. (రోమీయులు 1:20) వాచ్‌టవర్ సొసైటి దాదాపు వంద సంవత్సరాల పూర్వమే ప్రచురించిన ది డివైన్ ప్లాన్ ఆఫ్ ది ఏజెస్ అను పుస్తకములో చెప్పబడినది మనకు గుర్తుచేయబడుచున్నది. ఆ పుస్తకమిట్లు చెప్పెను: “టెలిస్కోపుతోగాని, తన సహజ నేత్రముతోగాని ఆకాశములోనికి తొంగిచూడగలిగి, సృష్టి విస్తారతను, దాని అనురూపతను, అందమును, క్రమమును, అనుగుణ్యతను, వైవిధ్యతను చూసి, వీటిని సృజించిన సృష్టికర్త జ్ఞానమందును, శక్తియందును ఆయనకంటె మహా ఉన్నతుడనుటను ఇంకను సందేహించు ఏ వ్యక్తియైనను లేక అటువంటి క్రమము సృష్టికర్త లేకుండానే దానంతటదే వచ్చినదని ఊహించు వ్యక్తి బుద్ధిహీనుడని బైబిలు సరిగానే పిలిచినట్లు తెలివిని, ఆలోచనను పోగొట్టుకొనిన వాడైయుండును.”—కీర్తన 14:1.
11 రాజ్యమును గూర్చి సమస్తమును మనము పరిశుద్ధ బైబిలులో నేర్చుకొందుము. బైబిలు వాస్తవముగా దేవుని లిఖిత వాక్యమై యున్నదా? దాని అనుగుణ్యత, దాని విజ్ఞానశాస్త్ర ప్రామాణికత, ప్రజల జీవితాలను మార్చు దాని శక్తి, ప్రత్యేకముగా దాని ప్రవచనముల నెరవేర్పును బట్టి అది నిశ్చయముగా దేవుని వాక్యమని చూడగలము.a దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు విషయమేమి? ఆయన నిజముగా ఉనికిలో ఉండెనా? సువార్త వృత్తాంతములు, దైవప్రేరిత క్రైస్తవ గ్రీకు లేఖనముల పత్రికలు సుస్పష్టముగా, వాగ్ధాటిగా యేసుక్రీస్తు చరిత్రాత్మక వ్యక్తియని రూఢిపరచుచున్నవి. యేసు చారిత్రకతకు యూదుల టాల్ముడ్ రుజువుకూడ కలదు, ఇది ఆయనను ఒక వ్యక్తిగా సూచించుచున్నది. ఆలాగే సా.శ. మొదటి శతాబ్దపు యూదుల మరియు రోమీయుల చరిత్రకారులును ఈ విషయమును ధృవీకరించుచున్నారు.
12, 13. దేవుని రాజ్య సత్యాలను ఏ వాస్తవములు రుజువు చేయుచున్నవి?
12 మరి రాజ్య వాస్తవము విషయమేమిటి? “ఒక మతపరిచారకుడు తన ప్రజలకు రాజ్యము యొక్క వాస్తవాన్ని వివరించడానికి ప్రయత్నించడం నేను విని ముప్పైకిపైగా సంవత్సరాలయ్యిందని” అని ఒక ప్రముఖ ప్రెస్బిటేరియన్ చేసిన ఫిర్యాదు చూపించినట్లు క్రైస్తవమత సామ్రాజ్యం దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇంతకూ, రాజ్యము ద్వారా యెహోవా నామమును పరిశుద్ధపరచుట ఆయన వాక్యము యొక్క మూలాంశమై యున్నది. “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” అని చెప్పుచూ దేవుడు తానుగా రాజ్యమునుగూర్చి మొదట వాగ్దానము చేసెను. (ఆదికాండము 3:15) ప్రత్యేకముగా రాజైన సొలొమోను పరిపాలనలో, ఇశ్రాయేలీయుల జనాంగముద్వారా ఆ రాజ్యము సాదృశ్యముగా చూపించబడెను. (కీర్తన 72) అంతేకాకుండా, రాజ్యము యేసు ప్రచారములో ముఖ్యాంశమై యుండెను. (మత్తయి 4:17) మత్తయి 13లో ఉన్నవాటినిపోలి, ఆయన అనేక ఉపమానములందు దానిని చేర్చి మాట్లాడెను. ఆ రాజ్యము కొరకు ప్రార్థించుమని, దానిని మొదట వెదకమని ఆయన మనకు ఉపదేశించెను. (మత్తయి 6:9, 10, 33) వాస్తవానికి, క్రైస్తవ గ్రీకు లేఖనములలో దేవుని రాజ్యము దాదాపు 150 సార్లు ప్రస్తావించబడినది.
13 శక్తి, అధికారము కలిగిన ఆ రాజ్యము ఒక నిజమైన ప్రభుత్వమై యున్నది, మరియు అది న్యాయసమ్మతమైన అన్ని ఉత్తరాపేక్షలను నెరవేర్చును. బైబిలులో కనుగొనగల, నియమాలు దానికి కలవు. ఆ రాజ్యము ఇప్పటికే అనేక సంగతులను నిజం చేసింది. దానికి 40,00,000లకు పైగా యెహోవాసాక్షులను యథార్థ ప్రజలున్నారు. మత్తయి 24:14 నెరవేర్పు ననుసరించి, వారు 211 దేశాలలో దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచున్నారు. వారి 1991 సేవాసంవత్సర కాలములో, వారు రాజ్యవర్తమానమును ప్రకటించుటలో 95,18,70,021 గంటలు గడిపారు. బైబిలు సత్యమను “స్వచ్ఛమైన భాషను” వేలాదిమంది నేర్చుకొనుచుండగా, ఈ కార్యవిధానము స్పష్టమైన, నిలిచియుండగల ఫలితాలను ఉత్పన్నము చేయుచున్నది.—జెఫన్యా 3:9 NW.
రాజ్యము యొక్క వాస్తవాలను వెంబడించుట
14. రాజ్య వాస్తవము యెడల మన మెప్పును మనమెట్లు వృద్ధిపరచుకొనగలము?
14 కాబట్టి, మనమెట్లు రాజ్య వాస్తవాలను వెంబడించగలము? మన నిరీక్షణ భద్రముగా బలమైన నమ్మకముపై ఆధారపడి యుండాలి. దేవుడు వాగ్దానము చేసిన నూతన లోకము మనకు నిజమై యుండాలి. (2 పేతురు 3:13) దేవుడు “[మన] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదను” వాగ్దానమందు మనకు విశ్వాసముండాలి. (ప్రకటన 21:4) ఇది ఎంతమాత్రము భ్రమ కాదని మనమెట్లు నిశ్చయత కలిగియుండగలము? ఇది దేవుని నియమిత కాలమున నిశ్చయముగా నిజమగును, ఏలయనగా అబద్ధమాడుట ఆయనకు అసాధ్యము. (తీతు 1:1, 2; హెబ్రీయులు 6:18) ఆ వాగ్దానములను మనము ధ్యానించవలెను. దేవుని నూతన లోకములో ఉండి, దాని ఆశీర్వాదములు అనుభవించుచున్నట్లు మనలను మనము చిత్రీకరించుకొనుట ఒక అవాస్తవమైన భ్రమ కాదుగాని అది విశ్వాసమునకు రుజువై యున్నది. పౌలు దానినిట్లు నిర్వచించెను: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.” (హెబ్రీయులు 11:1) దేవుని వాక్యమును, దానిని అర్థము చేసికొనుటకు, అన్వయించుకొనుటకు మనకు సహాయముచేయు క్రైస్తవ ప్రచురణలను క్రమముగా పఠించుట ద్వారా మన విశ్వాసమును బలపరచుకొందము. అంతేగాక తదేకముగా, తటస్థముగా రాజ్యమునుగూర్చి ఇతరులకు చెప్పేందుకు మనమెంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే, అంత ఎక్కువగా మన విశ్వాసము బలపడును, దానియందుగల మన నిరీక్షణ తేజరిల్లును.
15. క్రైస్తవ పరిచర్య విషయములో మనమే బాధ్యతను కలిగియున్నాము?
15 మన పరిచర్య నాణ్యతను వృద్ధిచేసికొనుట ద్వారా రాజ్య వాస్తవాల కనుగుణ్యముగా మనము పనిచేయవలసిన అవసరత కూడ కలదు. ఇంకా ఎంతో జరిగించవలసి యున్నందున, దీనిని మనమెట్లు చేయగలము? (మత్తయి 9:37, 38) నేర్చుకొనుటకు వయసుతో పనిలేదు అను లోకోక్తి సత్యమై యున్నది. మనమెన్ని సంవత్సరాలు సాక్ష్యపు పనిలో భాగము వహించినను, మనమింకను అభివృద్ధి చెందగలము. దేవుని వాక్యమును ఉపయోగించుటలో మరింత సమర్థవంతులమగుట ద్వారా, రాజైన యేసుక్రీస్తు స్వరము వినునట్లు ఇతరులకు మరింత ఎక్కువగా సహాయము చేయగల వారమగుదుము. (యోహాను 10:16 పోల్చుము.) ప్రజల శాశ్వతకాల భవిష్యత్తు ఇమిడియున్నదని మనము ఆలోచించినప్పుడు, ‘మేకలుగా’ లేక ‘గొర్రెలుగా,’ తామెక్కడ నిలుచున్నామో ప్రదర్శించుటకు ప్రజలకు పదేపదే అవకాశమిచ్చునట్లు మనము మన ప్రాంతమును సంపూర్ణముగా చుట్టివచ్చుటకు కోరుకొనవలెను. (మత్తయి 25:31-46) అంటే ఇండ్లయొద్ద లేనివారి వివరాలను, ప్రత్యేకముగా రాజ్య వర్తమానమందు శ్రద్ధచూపిన వారి వివరాలను జాగ్రత్తగా వ్రాసిపెట్టుకొనుట అని దాని భావము.
రాజ్యమును ఎడతెగక వెంబడించుము
16. రాజ్య వాస్తవాలను వెంబడించుటలో ఎవరు చక్కని మాదిరినుంచారు, వారెట్లు రాజ్యమును “ఆక్రమించుచున్నారు”?
16 రాజ్య వాస్తవాలను ఎడతెగక వెంబడించుటకు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నము అవసరము. మిగిలియున్న అభిషక్తుల ఆసక్తితోకూడిన మాదిరి ద్వారా మనము ప్రోత్సహింపబడలేదా? దశాబ్దాలుగా వారు రాజ్య వాస్తవాలను వెంబడిస్తున్నారు. ఈ విధముగా వెంబడించుట యేసు మాటలలో ఈ విధముగా వర్ణించబడినది: “బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.” (మత్తయి 11:12) ఇక్కడ రాజ్యమును శత్రువులు ఆక్రమించుకొనుచున్నారని భావము కాదు. బదులుగా, ఇది రాజ్యము కొరకు వేచియున్నవారి కార్యవిధానమునకు సంబంధించినదై యున్నది. ఒక బైబిలు విద్వాంసుడు ఇట్లు చెప్పెను: “మెస్సీయ రాజ్య రాకడ విషయమై ఆత్రముగా, ఆపుజేయజాలనంత కృషిని, పోరాటమును ఇది వర్ణిస్తుంది.” రాజ్యమును తమస్వంతం చేసికొనుటకు అభిషక్తులు చేయని ప్రయత్నమంటూ లేదు. దేవుని పరలోక రాజ్యముయొక్క భూసంబంధమైన ప్రజలుగా అర్హులగుటకు “వేరే గొఱ్ఱెలు” కూడా ఇటువంటి శక్తివంతమైన ప్రయత్నములు చేయుట అవసరము.—యోహాను 10:16.
17. లోక భ్రమలను వెంబడించు వారి భాగ్యమేమి?
17 నిజముగా మనము అవకాశముగల ఒక ప్రత్యేక కాలమందు జీవించుచున్నాము. లోక భ్రమలను వెంబడించువారు ఒకరోజు కఠిన వాస్తవాల కొరకు మేల్కొల్పబడుదురు. వారి భాగ్యము ఈ మాటలలో కడుచక్కగా వర్ణించబడినది: “ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును . . . [ఇది] సంభవించును.” (యెషయా 29:8) నిశ్చయముగా, లోక భ్రమలు ఎన్నటికిని ఒకనికి సంతృప్తిని, సంతోషమును తీసుకురాలేవు.
18. రాజ్య నిజత్వము దృష్ట్యా, మనమే విధానమును వెంబడించవలెను, ఎటువంటి ఉత్తరాపేక్షతో?
18 యెహోవా రాజ్యము ఒక వాస్తవము. అది చురుకుగా పాలన సాగించుచుండగా, ఈ దుష్ట విధానము రానైయున్న, శాశ్వతకాల నాశనమును ఎదుర్కొనుచున్నది. కావున, పౌలు చెప్పిన సలహాను హృదయమునకు తీసికొనుము: “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” (1 థెస్సలొనీకయులు 5:6) మన మనస్సులను, హృదయాలను రాజ్య వాస్తవాలపై కేంద్రీకరించి, ఆ విధముగా నిత్యాశీర్వాదములను అనుభవించుదము గాక. “నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని ఆ రాజ్యముయొక్క రాజు మనతో చెప్పుట మన భాగ్యమగును గాక.—మత్తయి 25:34. (w92 7/15)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారిచే ప్రచురింపబడిన ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకమును చూడుము.
మీరెలా జవాబిస్తారు?
◻ లోక భ్రమలంటే ఏమిటి, వాటిని మనమెందుకు విసర్జించాలి?
◻ లోక భ్రమలలో మునిగియుండుట తెలివితక్కువ పనియని ఏ ఉదాహరణలు చూపిస్తున్నవి?
◻ సృష్టికర్త, ఆయన లిఖిత వాక్యము, యేసుక్రీస్తు, రాజ్యముయొక్క నిజత్వములను ఏ వాస్తవములు నిరూపిస్తున్నవి?
◻ రాజ్య వాస్తవములందు మన విశ్వాసమును ఎట్లు బలపరచుకొనగలము?
[27వ పేజీలోని చిత్రాలు]
తరచు వస్తుసంపత్తి కొరకైన అత్యాశవలన లోక భ్రమలు కలుగుచున్నవి
[28వ పేజీలోని చిత్రాలు]
రాజ్య వాస్తవాలను వెంబడించుటకు సువార్త ప్రకటించుట ఒక మార్గమై యున్నది
[29వ పేజీలోని చిత్రాలు]
దేవుని వాక్యమును పట్టుదలతో పఠించుట ద్వారా రాజ్య వాస్తవాలను నీవు వెంబడించుచున్నావా?