పెద్దలు, నీతిననుసరించి తీర్పుతీర్చుదురు
“మీ సహోదరుల వ్యాజ్యెములను [విని], . . . న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.”—ద్వితీయోపదేశకాండము 1:16.
1. తీర్పు విషయములో, అధికారం అప్పగించుట ఎలా జరిగింది, ఇది మానవ న్యాయాధిపతులకు ఏ భావము నిచ్చును?
సర్వోన్నత న్యాయాధిపతిగా, యెహోవా న్యాయనిర్ణయ అధికారమును తన కుమారునికి అప్పగించెను. (యోహాను 5:27) ఆలాగే, క్రైస్తవ సంఘమునకు శిరస్సుగా, క్రీస్తు కొన్నిసార్లు న్యాయాధిపతులుగా వ్యవహరించు పెద్దలను నియమించుటకు నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని దాని పరిపాలక సభను ఉపయోగించుచున్నాడు. (మత్తయి 24:45-47; 1 కొరింథీయులు 5:12, 13; తీతు 1:5, 9) ప్రత్యామ్నాయ న్యాయాధిపతులుగా, వీరు పరలోక న్యాయాధిపతులైన యెహోవా, క్రీస్తు యేసు మాదిరులను సన్నిహితముగా అనుసరించు బాధ్యతను కలిగియున్నారు.
క్రీస్తు—మాదిరికరమైన న్యాయాధిపతి
2, 3. (ఎ) మెస్సీయకు సంబంధించిన ఏ ప్రవచనము న్యాయాధిపతిగా క్రీస్తు అర్హతలను బయల్పరచినది? (బి) ఏ అంశములు ప్రత్యేకముగా గమనార్హమై యున్నవి?
2 న్యాయాధిపతిగా క్రీస్తునుగూర్చి ప్రవచనార్థకముగా ఇలా వ్రాయబడింది: “యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటిచూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును. భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును.”—యెషయా 11:2-4.
3 ఆ ప్రవచనములో “నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చుటకు” క్రీస్తుకు సహాయపడు లక్షణములను గమనింపుము. (అపొ. కార్యములు 17:31) ఆయన యెహోవా ఆత్మ, దైవిక జ్ఞానము, తెలివి, ఆలోచన, వివేచనల ననుసరించి తీర్పుతీర్చును. ఆయన యెహోవా యందలి భయభక్తులతోకూడ తీర్పుతీర్చుటను గమనించుము. ఆ విధముగా “క్రీస్తు న్యాయపీఠము,” “దేవుని న్యాయపీఠమునకు” ప్రాతినిధ్యమై యున్నది. (2 కొరింథీయులు 5:10; రోమీయులు 14:10) దేవుడు తీర్చునట్లుగా ఆయన వ్యాజ్యెములు తీర్చుటకు జాగ్రత్తపడును. (యోహాను 8:16) బాహ్యరూపమునుబట్టి లేక వదంతినిబట్టి ఆయన తీర్పుతీర్చడు. ఆయన నీతిననుసరించి దీనులకును సాత్వికులకును తీర్పుతీర్చును. ఎంత గొప్ప న్యాయాధిపతి! మరియు ఈనాడు న్యాయనిర్ణయ అధికారముతో వ్యవహరించుటకు పిలువబడిన అసంపూర్ణ మానవులకు అది ఎంతగొప్ప మాదిరి!
భూసంబంధమైన న్యాయాధిపతులు
4. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో 1,44,000 మందిచేయు ఒక పని ఏమైయుండును? (బి) వారింకను భూమిమీద ఉన్నప్పుడే అభిషక్తులైన క్రైస్తవులలో కొంతమంది న్యాయాధిపతులుగా నియమించబడుదురని ఏ ప్రవచనము చూపించుచున్నది?
4 పన్నెండుమంది అపొస్తలులతో ఆరంభమై, పోలికకు చిన్న సంఖ్యలోనున్న అభిషక్త క్రైస్తవులు వెయ్యేండ్లపాలనలో క్రీస్తుతోపాటు సహన్యాయాధిపతులుగా ఉందురు. (లూకా 22:28-30; 1 కొరింథీయులు 6:2; ప్రకటన 20:4) భూమిపైగల ఆత్మీయ ఇశ్రాయేలీయుల అభిషక్త సభ్యుల శేషము, తీర్పుతీర్చబడి 1918-19లో పునరుద్ధరింపబడిరి. (మలాకీ 3:2-4) ఆత్మీయ ఇశ్రాయేలీయుల యీ పునరుద్ధరణను గూర్చి, ఇట్లు ప్రవచింపబడెను: “మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను.” (యెషయా 1:26) ఆ విధముగా, ఆయన సహజ ఇశ్రాయేలీయుల విషయములో “మొదట” చేసినట్లు, పునరుద్ధరింపబడిన శేషమునకు నీతిమంతులైన న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను యెహోవా దయచేసెను.
5. (ఎ) ఆత్మీయ ఇశ్రాయేలీయులు పునరుద్ధరింపబడిన తర్వాత ఎవరు “తీర్పుతీర్చుటకు” నియమించబడిరి, ప్రకటన గ్రంథమందు వారెట్లు వర్ణింపబడిరి? (బి) న్యాయనిర్ణయ పనియందు అభిషక్తులైన అధ్యక్షులకు ఎవరు సహాయము చేయుచున్నారు, మంచి న్యాయాధిపతులుగా తయారగుటకు వీరికెట్లు శిక్షణ ఇవ్వబడుచున్నది?
5 మొదటగా, “తీర్పుతీర్చుటకు” నియమించబడిన ‘జ్ఞానవివేచనలుగల మనుష్యులందరు’ అభిషక్తులైన పెద్దమనుషులు, లేదా పెద్దలై యుండిరి. (1 కొరింథీయులు 6:4, 5) నమ్మకస్థులును, గౌరవనీయులును, అభిషక్తులైన అధ్యక్షులు యేసు కుడిచేతిలో, అనగా ఆయన అధీనములో, ఆయన నడిపింపుక్రింద ఉన్నట్లు ప్రకటన గ్రంథములో వర్ణింపబడిరి. (ప్రకటన 1:16, 20; 2:1) పందొమ్మిది వందల ముప్పయైదు నుండి అభిషక్తులైన వారికి “మహాశ్రమలు” తప్పించుకొని పరదైసు భూమిపై నిత్యము జీవించు నిరీక్షణగల ఎడతెగక వృద్ధియగుచున్న “గొప్పసమూహము” యొక్క మద్దతు లభించుచున్నది. (ప్రకటన 7:9, 10, 14-17) “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము” సమీపించుచుండగా, భూవ్యాప్తముగా 66,000లకు పైగావున్న యెహోవాసాక్షుల సంఘాలలో పెద్దలుగా, న్యాయాధిపతులుగా సేవచేయుటకు వీరిలో అంతకంతకు ఎక్కువమంది అభిషక్త పరిపాలక సభచే నియమించబడుచున్నారు.a (ప్రకటన 19:7-9) “క్రొత్త భూమి” సమాజములో బాధ్యత నిర్వహించుటకు వారికి ప్రత్యేక పాఠశాలలద్వారా శిక్షణ ఇవ్వబడుచున్నది. (2 పేతురు 3:13) 1991లో అనేక దేశాలలో నిర్వహించిన రాజ్య పరిచర్య పాఠశాలలు, న్యాయనిర్ణయ విషయాలతో సరిగా వ్యవహరించుటను నొక్కితెల్పినవి. న్యాయాధిపతులుగా సేవచేయు పెద్దలు, సత్యము ననుసరించి, నీతి ననుసరించి తీర్పుతీర్చు యెహోవా మరియు క్రీస్తు యేసులను అనుకరించు కర్తవ్యమును కలిగియున్నారు.—యోహాను 5:30; 8:16; ప్రకటన 19:1, 2.
‘భయభక్తులతో వ్యవహరించు’ న్యాయాధిపతులు
6. న్యాయనిర్ణయ కమిటీలలో సేవచేయు పెద్దలెందుకు ‘భయభక్తులతో వ్యవహరించాలి’?
6 యెహోవా యందలి భయభక్తులతో, ఆయన ఆత్మ సహాయముతో క్రీస్తే న్యాయము తీర్చుచున్నట్లయిన, అసంపూర్ణులైన పెద్దలు ఇంకెంత ఎక్కువగా అలా చేయవలెను! న్యాయనిర్ణయ కమిటీలో సేవచేయుటకు పని అప్పగింపబడినప్పుడు, నీతి ననుసరించి తీర్పుతీర్చుటకు సహాయము చేయుమని “పక్షపాతము లేకుండ . . . తీర్పుతీర్చు . . . తండ్రికి” ప్రార్థనచేయుచు, వారు ‘భయభక్తులతో వ్యవహరించవలెను.’ (1 పేతురు 1:17) “లెక్క ఒప్పచెప్పవలసినవారివలె” ప్రజల జీవితాలతో, “ఆత్మలతో” వ్యవహరించుచున్నారని వారు గుర్తుంచుకొనవలెను. (హెబ్రీయులు 13:17) దీని దృష్ట్యా, అజాగ్రత్తగా వారుచేయు న్యాయనిర్ణయ పొరపాట్ల విషయములోకూడా వారు నిశ్చయముగా యెహోవా యెదుట జవాబుదారులై యున్నారు. హెబ్రీయులు 13:17పై తానుచేసిన వ్యాఖ్యానమందు జె. హెచ్. ఎ. ఎబ్రార్డ్ ఇట్లు వ్రాశాడు: “కాయుమని తన కప్పగింపబడిన ఆత్మలను కనిపెట్టుకొనియుండు కర్తవ్యమును కాపరి కలిగియున్నాడు, మరియు . . . తన తప్పిదము కారణముగా పోగొట్టుకొనబడిన వారితో సహా, వారందరి విషయములో ఆయన లెక్క ఒప్పచెప్పవలెను. ఇది గంభీరమైన మాట. ఈ తీవ్రమైన [భీకరమైన] బాధ్యతా కార్యమును తాను స్వచ్ఛందముగా గైకొనియున్నాడని, వాక్యముయొక్క ప్రతి పరిచారకుడు పరిగణించవలెను.”—పోల్చుము యోహాను 17:12; యాకోబు 3:1.
7. (ఎ) ఆధునిక-దిన న్యాయాధిపతులు ఏమి గుర్తుంచుకోవాలి, వారి ధ్యేయమేమై యుండాలి? (బి) మత్తయి 18:18-20 నుండి ఏ పాఠాలను పెద్దలు గ్రహించాలి?
7 న్యాయనిర్ణయ అధికారముతో సేవచేయు పెద్దలు, ప్రతి వ్యాజ్యెమందును యెహోవా, క్రీస్తుయేసులే నిజమైన న్యాయాధిపతులని గుర్తుంచుకొనవలెను. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులకు ఏమిచెప్పబడిందో గుర్తుతెచ్చుకొనుము: “మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; యెహోవా భయము మీమీద ఉండునుగాక; . . . మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.” (2 దినవృత్తాంతములు 19:6-10) పవిత్రమైన భయముతో, ఒక వ్యాజ్యెమందు తీర్పుతీర్చు పెద్దలు ‘తీర్పు విషయంలో యెహోవా తమతో ఉన్నాడని’ నిశ్చయపరచుకొనుటకు తాము చేయగలిగినదంతా చేయవలెను. యెహోవా మరియు క్రీస్తు ఆ విషయమును పరిగణించు విధానమును వారి నిర్ణయము కచ్చితముగా ప్రతిబింబించవలెను. దేవుని ప్రేరేపిత వాక్యమందు వ్రాయబడినది బయల్పరచినట్లుగా, సూచనార్థకముగా వారు భూమిపై ‘బంధించునది’ (దోషము కనుగొనుట), లేదా ‘విప్పునది’ (నిర్దోషమును కనుగొనుట) పరలోకములో అప్పటికే బంధింపబడిన దానికి, లేదా విప్పబడిన దానికి అనుగుణముగా ఉండవలెను. యేసు నామమున వారు యెహోవాకు ప్రార్థించినట్లయితే, సహాయము చేయుటకు యేసు వారి “మధ్యన” ఉండును. (మత్తయి 18:18-20, అథస్సూచి; ది వాచ్‌టవర్, ఫిబ్రవరి 15, 1988, పుట 9) న్యాయ విచారణ స్థలమందలి వాతావరణము క్రీస్తు నిజముగా వారి మధ్యను ఉన్నాడని చూపించవలెను.
పూర్తికాల కాపరులు
8. యెహోవా, యేసుక్రీస్తులు చూపిన మాదిరినిబట్టి, మందయెడల పెద్దల ముఖ్య బాధ్యత ఏమైయున్నది? (యెషయా 40:10, 11; యోహాను 10:11, 27-29)
8 పెద్దలు ఎల్లప్పుడు తీర్పుతీర్చరు. వారు పూర్తికాల కాపరులై యున్నారు. వారు స్వస్థపరచు వారేగాని, శిక్ష విధించువారు కారు. (యాకోబు 5:13-16) అధ్యక్షుడు (ఎపిస్కోపోస్) అనుటకు ఉపయోగింపబడిన గ్రీకు పదము వెనుక సంరక్షించు శ్రద్ధ అను ప్రాథమిక భావము కలదు. ది థియెలాజికల్ డిక్షనరీ ఆఫ్ ది న్యూ టెస్ట్‌మెంట్ ఇట్లనుచున్నది: “కాపరి [1 పేతురు 2:25లో], అను మాటకు [ఎపిస్కోపోస్] అదనంగావున్న భావము, కావలికాయు లేదా కనిపెట్టుకొనియుండుటకు సంబంధించిన సంరక్షణను సూచించుచున్నది.” అవును, గొర్రెలను కాయుచు వాటిని మందలో ఉండునట్లు చేయుచు, వాటిని కనిపెట్టుకొని యుండుట వారి ప్రాథమిక బాధ్యతయై యున్నది.
9, 10. (ఎ) పెద్దల ప్రథమ కర్తవ్యమును పౌలు ఎట్లు నొక్కి తెలియజేశాడు, కావున వారే మంచి ప్రశ్న వేసికొనవచ్చును? (బి) అపొ. కార్యములు 20:29లోని పౌలు మాటలు ఏ భావమునిచ్చుచున్నవి, కావున పెద్దలు ఎట్లు న్యాయనిర్ణయ వ్యాజ్యెముల సంఖ్యను తగ్గించుటకు ప్రయత్నించవచ్చును?
9 ఎఫెసులోని సంఘపెద్దలతో మాట్లాడుచు, అపొస్తలుడైన పౌలు ఎక్కడ నొక్కితెల్పాలో అక్కడ నొక్కి ఇలా చెప్పాడు: “దేవుడు తన స్వకుమారుని రక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా వుంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీమట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తపడుడి.” (అపొ. కార్యములు 20:28, NW) శిక్షించుటను కాదుగాని, పౌలు కాయుటను నొక్కితెల్పుచున్నాడు. కొంతమంది పెద్దలు ఈ క్రింది ప్రశ్నను ధ్యానించుట మంచిది: ‘కాయుటకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, కృషి చేసినట్లయిన న్యాయనిర్ణయ విషయములను పరిశోధించుటకు, పరిష్కరించుటకు అవసరమయ్యే సమయాన్ని మనము గణనీయముగా తగ్గించగలమా?’
10 నిజమే, పౌలు “క్రూరమైన తోడేళ్లను” గూర్చి హెచ్చరించాడు. అయితే ఆయన వారు ‘మందను కనికరింపరని’ వారిని నిందించలేదా? (అపొ. కార్యములు 20:29) ఈ “తోడేళ్లను” నమ్మకమైన అధ్యక్షులు వెళ్లగొట్టవలెనను భావమును ఇస్తున్నను, ఆయన మాటలు పెద్దలు మందయందలి ఇతర సభ్యులను “కనికరముతో” చూడవలెనని చూపించుటలేదా? ఒక గొర్రె ఆత్మీయముగా బలహీనపడి, దేవుని సేవించుటకు మానుకొనినట్లయిన, అతనికి లేదా ఆమెకు అవసరమైన దేమి—కొట్టుటా లేక స్వస్థపరచుటా, శిక్షించుటా లేక కాయుటా? (యాకోబు 5:14, 15) కావున, పెద్దలు కాయు పనికి క్రమమైన సమయ పట్టికను వేసికొనవలెను. పాపములో చిక్కుకొనిన క్రైస్తవుల విషయమై ఎక్కువ సమయము తీసికొను న్యాయనిర్ణయ వ్యాజ్యెములకు తక్కువ సమయము గడుపు సంతోషదాయకమైన ఫలితమును ఇది తీసుకువచ్చును. సేదదీర్చు వారిగా, విశ్రాంతినిచ్చు వారిగా నుండుట, నిశ్చయముగా పెద్దల ప్రథమ శ్రద్ధయై యుండవలెను, అలా వారు యెహోవా ప్రజల మధ్య సమాధానమును, నెమ్మదిని, భద్రతను పెంపొందించవలెను.—యెషయా 32:1, 2.
ప్రయోజనమిచ్చు కాపరులుగా, న్యాయాధిపతులుగా సేవచేయుట
11. న్యాయనిర్ణయ కమిటీలలో సేవచేయు పెద్దలకు ఎందుకు నిష్పక్షపాత వైఖరి, “పైనుండివచ్చు జ్ఞానము” అవసరము?
11 ఒక క్రైస్తవుడు తప్పిదములో చిక్కుకొనకముందే మిక్కుటముగా చేయు కాపరిపని యెహోవా ప్రజల మధ్య న్యాయనిర్ణయ వ్యాజ్యెముల సంఖ్యను తగ్గించవచ్చును. (గలతీయులు 6:1 పోల్చుము.) అయినప్పటికిని, మానవ పాపము, అసంపూర్ణత కారణముగా, ఆయా సమయములలో క్రైస్తవ అధ్యక్షులు తప్పిదము చేసినవారితో వ్యవహరించవలసి వస్తుంది. ఏ సూత్రములు వారిని నడిపించును? మోషే కాలమునుండి, లేక తొలి క్రైస్తవుల కాలమునుండి అవి మారలేదు. ఇశ్రాయేలీయులలోని న్యాయాధిపతుల నుద్దేశించి మోషే పలికిన మాటలు ఇంకను వర్తించును: “మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి . . . న్యాయమునుబట్టి తీర్పు తీర్చవలెను. . . . పక్షపాతములేకుండ వినవలెను.” (ద్వితీయోపదేశకాండము 1:16, 17) నిష్పక్షపాతము “పైనుండివచ్చు జ్ఞానము” యొక్క ఒక లక్షణమై యున్నది, కాగా న్యాయనిర్ణయ కమిటీలలో సేవచేయు పెద్దలకు ఈ జ్ఞానము ఆవశ్యకము. (యాకోబు 3:17; సామెతలు 24:23) అటువంటి జ్ఞానము బలహీనతకు మరియు భక్తిహీనతకు మధ్య భేదమును వివేచించుటకు వారికి సహాయము చేయును.
12. న్యాయాధిపతులు ఏ భావమందు నీతిమంతులే కాదు మంచివారునై యుండవలెను?
12 తప్పు ఒప్పులకు సంబంధించిన యెహోవా కట్టడల కనుగుణ్యముగా, పెద్దలు “న్యాయమునుబట్టి తీర్పు తీర్చవలెను.” (కీర్తన 19:9) అయినను, నీతిమంతులుగా ఉండుటకు కృషిచేయుచునే, రోమీయులు 5:7, 8లో పౌలుచూపిన ప్రత్యేక భావమందు వారు మంచివారుగా నుండుటకు కూడ ప్రయత్నించవలెను. ఈ వచనములపై వ్యాఖ్యానించుచు “రైచ్యస్‌నెస్” (నీతి) అను శీర్షికక్రింద, ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్ అను గ్రంథము ఇలా చెప్పుచున్నది: “మంచితనమునకు గుర్తింపబడిన, లేక దానిచే ప్రత్యేకింపబడిన వ్యక్తి ప్రయోజనకర్త (మేలుచేయువాడు లేక ఇతరులకు ప్రయోజనము చేయువాడు) మరియు లాభము చేకూర్చువాడు (అటువంటి మంచితనమును చురుకుగా వ్యక్తపరచువాడు) అని ఆ గ్రీకు పద ప్రయోగము చూపించుచున్నది. ఆయన కేవలము న్యాయము కోరుదానిని మాత్రమే చేయుటయందు శ్రద్ధ కలిగియుండడు గాని, అంతకంటే ఎక్కువ చేయుటకు అనగా ఇతరులయెడల నిజమైన శ్రద్ధతో ప్రేరేపింపబడి, వారికి సహాయము చేయుటకు, లాభము చేకూర్చుటకు అతడు కోరును.” (సంపుటి 2, పుట 809) నీతిమంతులే గాక మంచివారైన పెద్దలు తప్పిదస్థులతో దయాపూర్వకముగా వ్యవహరిస్తారు. (రోమీయులు 2:4) వారు కరుణను, కనికరమును చూపుటకు ఇష్టపడవలెను. తప్పిదస్థుడు తమ ప్రయత్నములకు ప్రతిస్పందించనట్లు మొదట కన్పించినను, అతడు పశ్చాత్తాపమునొందు అవసరతను చూచుటకు తాము చేయగలిగినంత సహాయము చేయుటకు వారు కృషిచేయవలెను.
విచారణప్పుడు సరియైన దృక్పధము
13. (ఎ) ఒక పెద్ద న్యాయాధిపతిగా పనిచేయునప్పుడు, ఆయన దేనిని మరచిపోకూడదు? (బి) పౌలు యిచ్చిన ఏ సలహాయు న్యాయ విచారణలలో అనువర్తించును?
13 న్యాయ విచారణ అవసరమైన పరిస్థితిలో, అధ్యక్షులు తామింకను కాపరులని, “మంచి కాపరి” క్రింద, యెహోవా గొర్రెలతో వారు వ్యవహరిస్తున్నారని మర్చిపోకూడదు. (యోహాను 10:11) కష్టములోనున్న గొర్రెలకు క్రమముగా సహాయము చేయవలెనని పౌలు ఇచ్చిన సలహా అంతే శక్తివంతముగా న్యాయ విచారణలలోను అనువర్తించును. ఆయనిట్లు వ్రాసెను: “సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.”—గలతీయులు 6:1, 2.b
14. న్యాయ విచారణలను అధ్యక్షులు ఎట్లు దృష్టించవలెను, తప్పిదస్థుని యెడల వారి స్వభావమేమై యుండవలెను?
14 శిక్షను అమలుచేయుటకు కూడుకొను ఉన్నతమైన న్యాయాధిపతులుగా తమను పరిగణించుకొనుటకు బదులు, న్యాయనిర్ణయ కమిటీలో సేవచేయు పెద్దలు ఆ విచారణను తమ కాపరిపనిలో మరొక భాగమని తలంచవలెను. యెహోవాకు చెందిన ఒక గొర్రె కష్టములో ఉన్నది. అతనిని లేక ఆమెను కాపాడుటకు ఏమి చేయవచ్చును? మందకు దూరముగా వెళ్లిపోయిన ఈ గొర్రెకు సహాయపడుటకు అది మరీ ఆలస్యమైపోయినదా? అలా జరుగలేదని ఆశిద్దాం. సరియైనప్పుడల్లా కనికరము చూపుటకు పెద్దలు అనుకూల దృష్టిని కలిగియుండాలి. అంటే గంభీరమైన పాపము చేసినప్పుడు యెహోవా కట్టడలను వారు తక్కువచేయవలెనని దీని భావము కాదు. అయితే తప్పిదముల తీవ్రతను తగ్గించు పరిస్థితులనుగూర్చి తెలుసుకొంటే, సాధ్యమైనచోట వారు కనికరము చూపుటకు వారికి సహాయము చేయును. (కీర్తన 103:8-10; 130:3) విచారకరంగా, కొంతమంది తప్పిదస్థులు ఎంత మొండివారిగా ఉంటారంటే పెద్దలు దృఢముగా వ్యవహరించవలసి వస్తుంది, అయినా కఠినంగా మాత్రం కాదు.—1 కొరింథీయులు 5:13.
న్యాయవిచారణ యొక్క ఉద్దేశం
15. ఆయావ్యక్తుల మధ్య గంభీరమైన సమస్య తలెత్తినప్పుడు, దేనిని మొదట తీర్మానించవలెను?
15 ఇద్దరిమధ్య ఒక గంభీరమైన సమస్య తలెత్తినప్పుడు, మత్తయి 5:23, 24 లేక మత్తయి 18:15లో చెప్పబడినట్లు వారిద్దరు వ్యక్తిగతముగా సమస్యను పరిష్కరించుకొనుటకు ప్రయత్నించారా లేదాయని జ్ఞానవివేచనలుగల పెద్దలు మొదట తీర్మానించుదురు. ఇలా చేయలేదంటే, ఒకరు లేదా ఇద్దరు పెద్దలిచ్చు సలహా సరిపోతుంది. బహిష్కరణకు నడుపగల గంభీరమైన పాపము జరిగినప్పుడు మాత్రమే న్యాయపరమైన చర్య అవసరము. (మత్తయి 18:17; 1 కొరింథీయులు 5:11) న్యాయనిర్ణయ కమిటీ ఏర్పడుటకు సరియైన లేఖన ఆధారముండవలెను. (ది వాచ్‌టవర్, సెప్టెంబరు 15, 1989, పుట 18 చూడుము.) అలా కమిటీ నొకదానిని ఏర్పాటుచేసినప్పుడు, ఆ ప్రత్యేకమైన వ్యాజ్యెము కొరకు మంచి అర్హతగల పెద్దలను ఎన్నుకొనవలెను.
16. న్యాయ విచారణల ద్వారా ఏమి సాధించుటకు పెద్దలు ప్రయత్నింతురు?
16 న్యాయవిచారణల ద్వారా పెద్దలు ఏమి సాధించుటకు ప్రయత్నించుదురు? మొదట, సత్యము తెలియనట్లయిన నీతిననుసరించి తీర్పుతీర్చుట అసాధ్యము. ఇశ్రాయేలీయులలో వలెనే, విషయమును ‘బాగుగా శోధించి పరీక్షించవలెను.’ (ద్వితీయోపదేశకాండము 13:13; 17:3) కావున విచారణయొక్క ఒక ధ్యేయమేమంటే, వ్యాజ్యెమునకు సంబంధించిన అసలు వాస్తవాలను కనుగొనుటే. అయితే దీనిని ప్రేమతో చేయగలగాలి, చెయ్యాలి. (1 కొరింథీయులు 13:4, 6, 7) వాస్తవాలు తెలిసినప్పుడు, యెహోవా ఉన్నతమైన నీతికట్టడల ననుసరించి సంఘమును కాచి కాపాడుటకు, దానియందు ఆయన ఆత్మ ధారాళముగా ప్రవహించుటకు పెద్దలు అవసరమైన చర్యలు తీసికొంటారు. (1 కొరింథీయులు 5:7, 8) ఏమైనను, విచారణయొక్క ఒక సంకల్పమేమనగా, ఒకవేళ సాధ్యమైతే ప్రమాదమందున్న పాపిని కాపాడుటే.—లూకా 15:8-10 పోల్చుము.
17. (ఎ) విచారణప్పుడు నిందింపబడిన వ్యక్తితో ఎట్లు వ్యవహరించాలి, ఏ సంకల్పముతో? (బి) దీనికి న్యాయనిర్ణయ కమిటీ సభ్యుల పక్షమున ఏమి అవసరము?
17 ఆరోపింపబడిన వ్యక్తిని ఎన్నటికిని దేవుని గొర్రెగా కాకుండ మరొక రకముగా చూడకూడదు. అతనితో లేక ఆమెతో కనికరము కలిగి వ్యవహరించాలి. ఒకవేళ పాపము (లేక పాపములు) చేసినట్లయిన, నీతిమంతులైన న్యాయాధిపతుల ఉద్దేశము ఆ పాపి తన తప్పు తెలిసికోవడానికి, పశ్చాత్తాప పడుటకు, తననుతాను సవరించుకోవడానికి, అలా అతన్ని “సాతాను . . . యురిలోనుండి తప్పించుటకు” సహాయము చేయుటయై యుండాలి. దానికి ‘బోధనా సామర్థ్యము,’ “సాత్వికముతో శిక్షించుట” అవసరము. (2 తిమోతి 2:24-26; 4:2) ఆ పాపి అప్పుడు తాను పాపము చేశానని గుర్తించి, హృదయమందు నిజముగా నొచ్చుకొని, యెహోవాను క్షమాపణ అడిగినట్లయిన సంగతేమి? (అపొ. కార్యములు 2:37 పోల్చుము.) అతడు నిజముగా సహాయము నర్ధించుచున్నాడని పెద్దలు నమ్మినట్లయితే, సాధారణంగా అతన్ని బహిష్కరించాల్సిన అవసరము ఉండదు.—ది వాచ్‌టవర్, జనవరి 1, 1983, పుట 31, పేరా 1 చూడుము.
18. (ఎ) తప్పిదస్థుని బహిష్కరించుటలో న్యాయనిర్ణయ కమిటీ ఎప్పుడు దృఢత్వమును చూపించాలి? (బి) దుఃఖకరమైన ఏ పరిస్థితి దృష్ట్యా పెద్దలు తప్పిపోవు గొర్రెల పక్షముగా ప్రయాసపడవలెను?
18 మరోవైపున, స్పష్టముగా పశ్చాత్తాపములేని మతభ్రష్టత, ఉద్దేశపూర్వముగా యెహోవా నియమాలను ఎదిరించుట, లేక కేవలము దుష్టత్వముగల వ్యాజ్యెమును న్యాయనిర్ణయ కమిటీ సభ్యులు ఎదుర్కొనినట్లయిన, పశ్చాత్తాపము చూపని అట్టి దోషిని బహిష్కరించుట ద్వారా ఇతర సంఘ సభ్యులను కాపాడుట వారి కర్తవ్యము. ఆ తప్పిదస్థునికి దైవిక విచారము లేదని స్పష్టమైనట్లయిన, అతన్ని పదేపదే కలిసికొనుటకు లేక అతనికి మాటలందించుటకు, పశ్చాత్తాపము చూపుటకు అతన్ని బలవంతపెట్టుటకు ప్రయత్నించాల్సిన అవసరత న్యాయనిర్ణయ కమిటీ సభ్యులకు లేదు.c ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తముగా బహిష్కరింపబడుట ప్రచారకుల సంఖ్యలో దాదాపు 1 శాతము ఉండెను. అంటే వంద గొర్రెలున్న మందలో ఒక గొర్రె—కనీసము తాత్కాలికముగానైనను—పోగొట్టుకొనబడెనని దీని భావము. మందలోనికి ఒక వ్యక్తిని చేర్చుటకు పట్టు సమయమును, పడిన ప్రయాసమును పరిగణలోనికి తీసికొంటే, ప్రతి సంవత్సరము వేలాదిమంది ‘తిరిగి సాతానుకు అప్పగించబడుచున్నారని’ తెలిసికొనుట దుఃఖకరముగా లేదా?—1 కొరింథీయులు 5:5.
19. న్యాయనిర్ణయ కమిటీలో సేవచేయు పెద్దలు దేనిని ఎన్నటికిని మరువకూడదు, కావున వారి ధ్యేయమేమై యుండాలి?
19 న్యాయనిర్ణయము చేయుటకు వెళ్లు పెద్దలు, సంఘములో పాపమునకు సంబంధించిన అత్యధిక విషయాలు దుష్టత్వముతో కాదుగాని, బలహీనతవల్లనే అని గుర్తుంచుకోవాలి. వారెన్నడును తప్పిపోయిన గొర్రెపిల్లను గూర్చి యేసుచెప్పిన ఉపమానమును మర్చిపోకూడదు, ఆయన దానిని ఈ మాటలతో ముగించెను: “మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.” (లూకా 15:7) నిజముగా, “ప్రభువు [యెహోవా NW] . . . యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.” (2 పేతురు 3:9) యెహోవా సహాయముతో, తప్పిదస్థులు మారుమనస్సుపొందు అవసరతను చూచి, నిత్యజీవమునకు నడుపు యిరుకు మార్గమున తిరిగి కాళ్లూని నిలుచుటకు సహాయము చేయుట ద్వారా ప్రపంచవ్యాప్తముగానున్న న్యాయనిర్ణయ కమిటీలు పరలోకమందు సంతోషము కలుగుటకు తాము చేయగలినంతా చేయును గాక.—మత్తయి 7:13, 14. (w92 7/1)
[అధస్సూచీలు]
a క్రీస్తు కుడిచేతియందలి వేరే గొఱ్ఱెలలోని పెద్దల స్థానమును గూర్చి, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కా. వారిచే ప్రచురించబడిన రెవిలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లెమాక్స్ ఎట్ హ్యాండ్!, అను పుస్తకము, పుట 136 అథస్సూచి చూడుము.
b ది వాచ్‌టవర్ సెప్టెంబరు 15, 1989, పుట 19 చూడుము.
c ది వాచ్‌టవర్, సెప్టెంబరు 1, 1981, పుట 26, పేరా 24 చూడుము.
పునఃసమీక్షా ప్రశ్నలు
◻ మహాగొప్ప కాపరి, మంచి కాపరి మాదిరి ననుసరించి, పెద్దల ముఖ్యాసక్తి ఏమై యుండవలెను?
◻ ఏ విధముగా పెద్దలు న్యాయనిర్ణయ వ్యాజ్యెముల సంఖ్యను తగ్గించుటకు ప్రయత్నించగలరు?
◻ ఏ భావమందు న్యాయాధిపతులు నీతిమంతులే గాక మంచివారునై యుండవలెను?
◻ విచారణప్పుడు తప్పిదస్థునితో ఎట్లు వ్యవహరించాలి, ఏ సంకల్పముతో?
◻ బహిష్కరణ ఎందుకు చివరిదారియై యున్నది?
[16వ పేజీలోని చిత్రాలు]
సరియైన రీతిలో కాపరిపని చేసినప్పుడు, అనేక న్యాయనిర్ణయ వ్యాజ్యెములు తప్పించవచ్చును
[18వ పేజీలోని చిత్రాలు]
న్యాయ విచారణ సమయములో కూడ, తప్పిదస్థుని సవరించుటకు పెద్దలు సాత్వికమైన ఆత్మతో ప్రయత్నించవలెను