కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 9/1 పేజీలు 14-19
  • మనుష్యులను పట్టు జాలరులుగా సేవచేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుష్యులను పట్టు జాలరులుగా సేవచేయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మనుష్యులను సజీవముగా పట్టుట’
  • మనుష్యులను పట్టు జాలరులు
  • మానవజాతియనే సముద్రంలో చేపలుపట్టుట
  • “ప్రభువు దినమందు” మనుష్యులకొరకు వెదకుట
  • నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • నలుగురు శిష్యులు పిలువబడిరి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • భూగోళపు నీటిలో మనుష్యులను పట్టుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • బైబిలు కాలాల్లో చేపలు పట్టే వలలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 9/1 పేజీలు 14-19

మనుష్యులను పట్టు జాలరులుగా సేవచేయుట

“యేసు—భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను [సజీవముగా NW] పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.”—లూకా 5:10.

1, 2. (ఎ) మానవ చరిత్రలో చేపలు పట్టుట ఏ పాత్ర వహించెను? (బి) దాదాపు 2,000 సంవత్సరముల క్రితము చేపలు పట్టే ఏ క్రొత్త పద్ధతి పరిచయము చేయబడెను?

వేలాది సంవత్సరాలుగా, మానవులు ఆహారము కొరకు భూమిమీది సరస్సులలో, నదులలో, సముద్రాలలో చేపలు పట్టిరి. ప్రాచీన ఐగుప్తులో ఆహారమునకు నైలునది చేపలు ఒక ప్రాముఖ్యమైన భాగమైయుండెను. మోషే దినములలో నైలునది నీళ్లు రక్తముగా మారినప్పుడు, ఐగుప్తీయులు నీటి కొరత వల్లనే కాకుండ అందలి చేపలు చనిపోయినందున వారి ఆహార సరఫరాకు అంతరాయమేర్పడి అలమటించిరి. ఆ తర్వాత, సీనాయినొద్ద యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము నిచ్చినప్పుడు, కొన్నిరకాల చేపలను తినవచ్చును గాని మరికొన్ని అపరిశుద్ధమని, వాటిని తినకూడదని ఆయన వారికి చెప్పెను. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు వచ్చినప్పుడు వారు చేపలు భుజింతురని ఇది సూచిస్తున్నది, కావున వారిలో కొందరు జాలరులైయుందురు.—నిర్గమకాండము 7:20, 21; లేవీయకాండము 11:9-12.

2 అయితే, దాదాపు 2,000 సంవత్సరముల క్రితం, మానవజాతికి వేరొక విధమైన చేపలుపట్టు పద్ధతి పరిచయం చేయబడెను. ఇది ఆత్మీయ రీతిలో చేపలుపట్టుట, గనుక దీనిద్వారా కేవలము జాలర్లు మాత్రమే కాదు చేపలుకూడ ప్రయోజనము పొందును. ఈ విధముగా చేపలుపట్టుట ఈనాడును కొనసాగుచున్నది, దీనివలన ప్రపంచవ్యాప్తముగా లక్షలాదిమందికి అనేక ప్రయోజనములు కలుగుచున్నవి.

‘మనుష్యులను సజీవముగా పట్టుట’

3, 4. ఏ ఇద్దరు జాలరులు యేసుక్రీస్తు నందు శ్రద్ధచూపిరి?

3 చేపలుపట్టు ఈ క్రొత్త విధానము పరిచయము చేయనైయున్న యేసు, సా.శ. 29 వ సంవత్సరములో, బాప్తిస్మమిచ్చు యోహానుద్వారా యొర్దాను నదిలో బాప్తిస్మము తీసికొనెను. కొన్నివారాల తర్వాత, యోహాను తన ఇద్దరు శిష్యులకు యేసును చూపిస్తూ ఇట్లనెను: “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల.” ఈ శిష్యులలో అంద్రెయ అను పేరుగలవాడు, త్వరగా తన సహోదరుడైన సీమోను పేతురునొద్దకు వెళ్లి, “మేము మెస్సీయను కనుగొంటిమి” అని చెప్పెను. ఆసక్తికరమైన విషయమేమంటె, అంద్రెయ, సీమోను వీద్దరు వృత్తిరీత్యా జాలరులై యుండిరి.—యోహాను 1:35, 36, 40, 41; మత్తయి 4:18.

4 ఆ తర్వాత, యేసు గలిలయ సముద్ర ప్రాంతములలో జనసమూహములకు ప్రకటించుచుండెను, ఇది పేతురు, అంద్రెయలు నివసించు ప్రాంతానికి సమీపములో ఉన్నది. ఆయన ప్రజలకిట్లు ఉపదేశించుచుండెను: “పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడి.” (మత్తయి 4:13, 17) ఆయన చెప్పుచున్న వర్తమానమును వినుటకు పేతురు, అంద్రెయలు ఆతురతగా ఉన్నట్లు మనము ఊహించగలము. వారి జీవితాలను శాశ్వతముగా మార్చివేయు దేనినో యేసు తమతో చెప్పనైయుండెనను సంగతిని వారు బహుశ గ్రహించకపోయి ఉండవచ్చును. అంతేకాకుండ, యేసు చెప్పనైయున్నదియు, వారి సమక్షములో చేయనైయున్నదియు ఈనాడు మనందరికి ఒక ప్రాముఖ్యమైన భావమును కలిగియున్నది.

5. జాలరియైన పేతురు యేసుకు ఎట్లు సేవచేసెను?

5 మనమిట్లు చదువుదుము: “జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.” (లూకా 5:1, 2) ఆ కాలములో, వృత్తిరీత్యా జాలరులుగా ఉన్నవారు తరచు రాత్రులందు పనిచేసెడివారు, కావున ఈ మనుష్యులు రాత్రిపూట చేపలుపట్టిన తర్వాత తమ వలలను శుభ్రము చేసికొనుచుండిరి. జనసమూహములకు మరింత సమర్థవంతముగా ప్రకటించుటకు వీలగునట్లు యేసు ఆ దోనెలలో ఒకదానిని ఉపయోగించుటకు నిర్ణయించుకొనెను. “ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనెయెక్కి—దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.”—లూకా 5:3.

6, 7. చేపలు పట్టుట విషయమై యేసు ఏ అద్భుతం చేసెను, చేపలు పట్టుటను గూర్చి ఆయన ఏమి చెప్పుటకు అది నడిపెను?

6 జనసమూహములకు బోధించుటకంటె యేసు మరి ముఖ్యమైన దేనినో తన మనస్సులో కలిగియుండుట గమనించుము: “ఆయన బోధించుట చాలించిన తరువాత—నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు వీలుగా మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను.” ఈ జాలరులు అప్పటికే రాత్రంతయు పనిచేశారని గుర్తుంచుకొనుము. కాబట్టి పేతురు, “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతుము” అని జవాబిచ్చిరనుటలో ఆశ్చర్యము లేదు. వారట్లు చేసినప్పుడు ఏమి సంభవించెను? “వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.”—లూకా 5:4-7.

7 యేసు ఒక అద్భుతము చేసెను. సముద్రమందు ఆ ప్రాంతములో రాత్రివేళ చేపలు ఏమాత్రము లేకుండెను; ఇప్పుడు అక్కడ చేపలు విస్తారముగా ఉన్నాయి. ఈ అద్భుతము పేతురుపై గట్టి ప్రభావము చూపెను. “సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి—ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడ నున్నవారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి).” యేసు పేతురును శాంతపరచి ఆ పిమ్మట పేతురు జీవితమునే మార్చివేయు ఈ మాటలను అతనితో చెప్పెను. “భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను [సజీవముగా NW] పట్టువాడవై యుందువు.”—లూకా 5:8-10.

మనుష్యులను పట్టు జాలరులు

8. ‘మనుష్యులను సజీవముగా పట్టుటకు’ ఇవ్వబడిన ఆహ్వానమునకు వృత్తిరీత్యా జాలరులైన ఏ నలుగురు ప్రతిస్పందించిరి?

8 ఆ విధముగా యేసు మనుష్యులను చేపలతో పోల్చెను. ఆలాగే తన ప్రాపంచిక వృత్తిని విడిచి మరెంతో గొప్పగా చేపలుపట్టుటకు అనగా మనుష్యులను పట్టుటకు దీనుడైన ఈ జాలరిని ఆయన ఆహ్వానించెను. పేతురు, అతని సహోదరుడగు అంద్రెయ అట్టి పిలుపును అంగీకరించి, “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” (మత్తయి 4:18-20) ఆ పిమ్మట యేసు దోనెలోకూర్చుని తమ వలలు బాగుచేసికొనుచున్న యోహాను, యాకోబులను పిలిచెను. మనుష్యులను పట్టు జాలర్లుగా ఉండుట ఆయన వీరినికూడ ఆహ్వానించెను. వారెట్లు ప్రతిస్పందించిరి? “వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” (మత్తయి 4:21, 22) ఆత్మల జాలరిగా యేసు తన నైపుణ్యమును ప్రదర్శించెను. ఈ సందర్భములో ఆయన నలుగురు మనుష్యులను సజీవముగా పట్టుకొనెను.

9, 10. పేతురు అతని సహవాసులు ఎటువంటి విశ్వాసమును ప్రదర్శించిరి, మరియు వారు ఆత్మీయముగా చేపలు పట్టుటకు ఎట్లు శిక్షణ నివ్వబడిరి?

9 వృత్తిరీత్యా జాలరిగా ఉన్నవాడు తానుపట్టిన చేపలను అమ్ముకొని తన జీవనం సాగిస్తాడు, కాని ఆత్మీయ జాలరి అలాచేయలేడు. కావున, ఈ శిష్యులు యేసును వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టినప్పుడు వారు గొప్ప విశ్వాసమును ప్రదర్శించిరి. వారికి సందేహమేమియు లేకుండెను, అయితే వారు ఆత్మీయముగా చేపలుపట్టుట విజయవంతమగును. యేసు చేపలులేని నీళ్లలో విస్తారముగా అక్షరార్థమైన చేపలు వచ్చునట్లు చేయగలిగియుండెను. అదేప్రకారము, వారు ఇశ్రాయేలు జనాంగమను నీటిలో తమ వలలు వేసినప్పుడు, దేవుని సహాయముతో వారు మనుష్యులను సజీవముగా పట్టుకొందురని శిష్యులు నిశ్చయత కలిగియుండగలరు. అప్పుడు ప్రారంభమైన ఆత్మీయముగా చేపలుపట్టు పని ఇంకను కొనసాగుచుండగా, యెహోవా ఇంకను గొప్ప ఫలితాల నిస్తున్నాడు.

10 రెండు సంవత్సరాలకు పైగా, మనుష్యులను పట్టుకొను విషయములో యేసు ఆ శిష్యులకు శిక్షణనిచ్చెను. ఒక సందర్భములో ఆయన వారికి సూక్ష్మమైన ఉపదేశాలిచ్చి, ప్రకటించుటకు వారిని తనకంటె ముందుగా పంపెను. (మత్తయి 10:1-7; లూకా 10:1-11) యేసు అప్పగింపబడి, హత్యచేయబడినప్పుడు ఆ శిష్యులు నిశ్చేష్ఠులైరి. అయితే యేసు మరణము మనుష్యులను పట్టుపని ఇకలేదని భావమిచ్చెనా? జరిగిన సంఘటనలు త్వరలోనే దానికి సమాధానమిచ్చెను.

మానవజాతియనే సముద్రంలో చేపలుపట్టుట

11, 12. పునరుత్థానము తర్వాత, చేపలుపట్టు విషయములో యేసు ఏ అద్భుతం చేసెను?

11 యెరూషలేము వెలుపల యేసు మరణము, తదుపరి ఆయన పునరుత్థానము తర్వాత, కొద్దిదినములలోనే శిష్యులు తిరిగి గలిలయకు వెళ్లిరి. ఒక సందర్భములో వారిలో ఏడుగురు కలిసి గలిలయ సముద్ర సమీపమున ఉండిరి. తాను చేపలు పట్టుటకు పోవుచున్నానని పేతురు చెప్పినప్పుడు, ఇతరులును అతనితో చేరిరి. ఎప్పటివలెనే, వారు రాత్రంతయు చేపలుపట్టిరి. నిజానికి, వారు ఆ రాత్రంతయు సముద్రములో వలలు వేయుచునేయుండిరి గాని వారికేమియు దొరుకలేదు. సూర్యోదయమగుచుండగా, దరిని నిలువబడిన ఎవరో ఒక వ్యక్తి సముద్రమందున్న వారిని పిలిచి వారినిట్లడిగెను: “పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైనా ఉన్నదా?” అందుకు శిష్యులు ప్రత్యుత్తరమిచ్చుచు, “లేదని” చెప్పిరి. కావున దరిని నిలుచ్చున్న వ్యక్తి వారితో, “దోనె కుడిప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.”—యోహాను 21:5, 6.

12 ఎంతటి ఆశ్చర్యకరమైన అనుభవము! శిష్యులు అంతకుముందు ఇదేవిధముగా చేపలుపట్టిన అద్భుతమును బహుశ గుర్తుతెచ్చుకొని యుందురు, వారిలో ఒకరు మాత్రము ఆ దరిని నిలువబడిన వ్యక్తి ఎవరో గ్రహించాడు. “యేసు ప్రేమించిన శిష్యుడు—ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పై బట్టవేసి (కట్టుకొని NW) సముద్రములో దుమికెను. దరి యించుమించు ఇన్నూరు మూరల [మూడువందల అడుగుల] దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్నదోనెలో వచ్చిరి.”—యోహాను 21:7, 8.

13. యేసు పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత, చేపలుపట్టు ఏ అంతర్జాతీయ కార్యక్రమము ఆరంభమాయెను?

13 ఈ అద్భుతము దేనిని సూచించెను? మనుష్యులను పట్టుకొను పని ఇంకా పూర్తికాలేదని. యేసు పేతురుతో—ఆయన ద్వారా శిష్యులందరితో—తన గొర్రెలను మేపుమని మూడుసార్లు చెప్పినప్పుడు ఈ వాస్తవము నొక్కితెల్పబడెను. (యోహాను 21:15-17) అవును, ఆత్మీయముగా మేపు కార్యక్రమము ముందున్నది. తన మరణానికి ముందు ఆయనిట్లు ప్రవచించెను: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును.” (మత్తయి 24:14) ఆ ప్రవచన మొదటి శతాబ్దపు నెరవేర్పు ఆరంభమయిన కాలము అదే. ఆయన శిష్యులు మానవజాతియనే సముద్రంలో తమ వలలు వేయనైయున్నారు, కాగా ఆ వలలు ఖాళిగా పైకిరావు.—మత్తయి 28:19, 20.

14. యేసు అనుచరులయొక్క చేపలుపట్టు పని యెరూషలేము నాశనమునకు ముందరి సంవత్సరములలో ఎట్లు ఆశీర్వదింపబడెను?

14 పరలోకమందలి తన తండ్రి సింహాసనము నొద్దకు ఎక్కిపోకముందు, యేసు తన శిష్యులతో ఇట్లనెను: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురు.” (అపొ. కార్యములు 1:8) సా.శ. 33 పెంతెకొస్తునాడు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు, ఆత్మీయముగా చేపలుపట్టు ఒక గొప్పపని అంతర్జాతీయముగా ప్రారంభమాయెను. ఒక్క పెంతెకొస్తు దినముననే, మూడువేల ఆత్మలు సజీవముగా పట్టబడెను మరియు ఆ తర్వాత కొద్దికాలములోనే “పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.” (అపొ. కార్యములు 2:41; 4:4) అట్టి అభివృద్ధి కొనసాగెను. వ్రాయబడిన చరిత్ర మనకిట్లు చెప్పుచున్నది. “పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.” (అపొ. కార్యములు 5:14) ఆ వెంటనే సమరయులు, ఆ పిమ్మట అనతికాలములోనే సున్నతిపొందని అన్యులు సువార్తకు ప్రతిస్పందించిరి. (అపొ. కార్యములు 8:4-8; 10:24, 44-48) పెంతెకొస్తు తర్వాత దాదాపు 27 సంవత్సరములకు, సువార్త “ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడెను” అని అపొస్తలుడైన పౌలు కొలొస్సయలోనున్న క్రైస్తవులకు వ్రాసెను. (కొలొస్సయులు 1:23) స్పష్టముగా యేసు శిష్యులు గలిలయ సముద్ర జలాలకు సుదూర ప్రాంతాలలో చేపలుపట్టిరి. వారు రోమా సామ్రాజ్యమంతటా చెదరియున్న యూదులమధ్య, ఆలాగే అంత ఫలదాయకముగా కన్పించని యూదులుకాని ప్రజలు అనే సముద్రంలో తమ వలలువేసిరి. వారి వలలు నిండుగా పైకివచ్చెను. మొదటి శతాబ్దపు క్రైస్తవుల అవసరాలమేరకు, యేసు మత్తయి 24:14లో చెప్పిన ప్రవచనము సా.శ. 70 లో యెరూషలేము నాశనమునకు ముందు నెరవేరెను.

“ప్రభువు దినమందు” మనుష్యులకొరకు వెదకుట

15. ప్రకటన గ్రంథములో, మరింకే చేపలుపట్టు పని ప్రవచింపబడెను, అది ఎప్పుడు నెరవేర్చబడవలసి యుండెను?

15 అయితే, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ జరుగనైయున్నది. మొదటి శతాబ్దాంతానికి, యెహోవా ఇంకను జీవించియున్న అపొస్తలుడైన యోహానుకు “ప్రభువు దినమందు” జరుగనైయున్న అనేక సంగతులుగల ప్రకటనను అనుగ్రహించెను. (ప్రకటన 1:1, 10) దానిలో ఒక ప్రముఖమైన సంగతి ప్రపంచవ్యాప్తముగా సువార్తను ప్రకటించుటయై యున్నది. మనమిట్లు చదువుదుము: “అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” (ప్రకటన 14:6) దేవదూతల నడిపింపు క్రింద దేవుని సేవకులు, కేవలము రోమా సామ్రాజ్యమందంతట మాత్రమే కాదు, భూదిగంతముల వరకు అక్షరార్థముగా సువార్తను ప్రకటించుదురు. ప్రపంచ వ్యాప్తముగా ఆత్మలను పట్టుకొను పని చేపట్టబడనైయుండెను, కాగా మనకాలము ఆ దర్శనపు నెరవేర్పును చూచెను.

16, 17. ఆధునిక కాలములో ఆత్మీయముగా చేపలుపట్టు పని ఎప్పుడు ప్రారంభమాయెను, దానిని యెహోవా ఎట్లు ఆశీర్వదించెను?

16 ఈ 20వ శతాబ్దములో యీ చేపలుపట్టుట ఎలావున్నది? తొలుత జాలర్లు బహు తక్కువగా ఉండిరి. మొదటి ప్రపంచయుద్ధము ముగిసిన తర్వాత, సువార్తను చురుకుగా ప్రకటించువారు షుమారు నాలుగువేల మంది మాత్రమే యుండిరి, ఆసక్తిగల యీ స్త్రీపురుషులలో దాదాపు అందరు అభిషక్తులే. యెహోవా ఎక్కడ మార్గము తెరిస్తే అక్కడ వారు తమ వలలువేసిరి, అలావారు అనేకమందిని సజీవముగా పట్టుకొనగల్గిరి. రెండవ ప్రపంచ యుద్ధానంతరము, చేపలుపట్టుటకు యెహోవా వారికి క్రొత్త జలములను అనుగ్రహించెను. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిల్యాడ్‌కు హాజరైన అనేకులు అనేక దేశాలలో పనిని ముందుకు సాగింపజేసిరి. తొలుత అంత ఫలవంతమైనవిగా కన్పించిన జపాను, ఇటలీ, స్పెయిన్‌వంటి దేశాలు, ఆత్మలను పట్టుటలో చివరకు గొప్ప ఫలితాలనిచ్చినవి. తూర్పు ఐరోపాలో చేపలుపట్టుట ఎంత విజయవంతముగా ఉన్నదో ఇటీవల మనము నేర్చుకొంటిమి.

17 ఈనాడు, అనేక దేశాలలో వలలు దాదాపు పిగిలిపోవుచున్నవి. ఆత్మలను సమకూర్చు గొప్ప ఫలితాలు క్రొత్త సంఘాలను, ప్రాంతాలను ఏర్పాటుచేయు అవసరతను కల్గించెను. వీరికి స్థానము కల్పించుటకు, ఎడతెగక క్రొత్త రాజ్యమందిరాలు, సమావేశ మందిరాలు నిర్మించబడుచున్నవి. ఈ అభివృద్ధి అవసరాలు తీర్చుటకు ఎక్కువమంది పెద్దలు, పరిచారకులు అవసరము. 1919లో ఆ నమ్మకస్థులచే ఒక గొప్ప పని ప్రారంభించబడెను. అక్షరార్థముగా యెషయా 60:22 నందలి ప్రవచనము నెరవేరెను. ఆ నాలుగువేలమంది ఈనాడు నలభైలక్షలమంది యగుటతో, ‘ఒంటరియైన వాడు వెయ్యిమందియైరి.’ అయినను అంతము ఇంకా రాలేదు.

18. మొదటి శతాబ్దపు ఆత్మీయ జాలర్ల చక్కని మాదిరిని మనమెట్లు అనుకరించగలము?

18 ఆయావ్యక్తులుగా మనకు ఇదంతయు ఏ భావమును కలిగియున్నది? పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులు మనుష్యులను పట్టు జాలరులుగా ఆహ్వానింపబడినపప్పుడు, “వారు . . . సమస్తమును విడిచిపెట్టి ఆయనను [యేసును] వెంబడించిరి” అని లేఖనము చెప్పుచున్నది. (లూకా 5:11) విశ్వాసము, అంకితభావములకిది ఎంతచక్కని మాదిరి! మనమూ అటువంటి త్యాగనిరతిని, ఆలాగే దాని మూల్యమెంతైనను యెహోవాను సేవించుటకు సిద్ధమనస్సును పెంపొందించుకొనగలమా? తామట్లు చేయగలమని లక్షలాదిమంది జవాబిచ్చిరి. మొదటి శతాబ్దములో, యెహోవా అనుమతించిన ప్రతి ప్రదేశములో శిష్యులు మనుష్యులకొరకు వెదకిరి. వారు యూదులైనను, అన్యులైననూ ఎలాంటి మినహాయింపు లేకుండా వారు మనుష్యుల కొరకు వెదకిరి. మనము కూడ ఎలాంటి ఆటంకము లేదా దురభిమానము లేకుండ ప్రతియొక్కరికి ప్రకటించుదము.

19. మనము చేపలుపట్టు జలములు ఫలవంతముగా లేనట్లు కన్పించినట్లయిన మనమేమి చేయవలెను?

19 మీ ప్రాంతము ప్రస్తుతము ఫలవంతముగా కన్పించనట్లయిన అప్పుడు విషయమేమి? నిరుత్సాహపడకుము. శిష్యులు రాత్రంతయు శ్రమపడి చేపలేమియు పట్టలేకపోయిననూ, యేసు వారి వలలను చేపలతో నింపిన విషయాన్ని గుర్తుంచుకొనుము. ఆత్మీయ రీతిలోకూడ అదే సంభవించవచ్చును. ఉదాహరణకు, ఐర్లాండులో నమ్మకస్థులైన సాక్షులు అనేక సంవత్సరాలు శ్రమించినను ఫలితము అంతంత మాత్రముగానే యుండెను. అయిననూ, ఇటీవలి కాలములలో పరిస్థితి మారిపోయెను. 1990వ సేవాసంవత్సర ముగింపునకు ఐర్లాండు వరుసగా 29 సార్లు శిఖరాగ్ర సంఖ్యలను చేరుకొనెనని యెహోవాసాక్షుల 1991 వార్షిక పుస్తకము నివేదించినది. అదే విధముగా ఏదో ఒకరోజు మీ ప్రాంతముకూడ ఫలించవచ్చును. యెహోవా అనుమతించినంత కాలము నిర్విరామముగా చేపలు పట్టుచునే యుండుము.

20. మనుష్యులకొరకు వెదకే విషయములో మనమెప్పుడు ఆ పనిలో పాల్గొనవలెను?

20 ఇశ్రాయేలీయులలో, ప్రతిఒక్కరు తమ పడకపై వెచ్చగా, హాయిగా నిద్రించు రాత్రి సమయములో జాలర్లు చేపలుపట్టుటకు వెళ్లెడివారు. వారికి అనుకూల సమయములో కాదుగాని, వారు చేపలు ఎక్కువ పట్టగల సమయములో వెళ్లేవారు. మనము కూడ మనుష్యులను వెదకుటకు మన ప్రాంతమును పరిశోధించవలెను, అనగా ఎక్కువమంది ప్రజలు ఇండ్లలో ఉండగా, వినే అనుకూలత ఉండగా మనము వారియొద్దకు వెళ్లవలెను. ఇది బహుశ సాయంకాల సమయములందు, వారాంతములయందు, లేక వేరొక సమయములో కావచ్చును. అది ఏ సమయమైననూ, సహృదయులైన ప్రజలను కనుగొనుటకు చేయగలిగినదంతా మనము చేయుదము.

21. మన ప్రాంతము తరచు పనిచేసినదైనట్లయిన మనమే విషయమును గుర్తుంచుకొనవలెను?

21 మన ప్రాంతము తరచు పనిచేసిన ప్రాంతమైనట్లయిన అప్పుడేమి? ప్రపంచములో వృత్తిరీత్యా చేపలు పట్టువారు అనేకసార్లు చేపలుపట్టిన ప్రాంతములనుగూర్చి అలా ఫిర్యాదుచేయుదురు. అయితే ఆత్మీయముగా మనము చేపలుపట్టు ప్రాంతములనుగూర్చి ఫిర్యాదు చేయగలమా? మనమట్లు చేయలేము. తరచు పనిచేసినను అనేక ప్రాంతములు ఇంకను అభివృద్ధిని సాధించుచునే యున్నవి. మరింత సమర్థవంతముగా పనిచేసినందున కొన్ని ప్రాంతములు సత్ఫలితాల నిస్తున్నవి. అయినప్పటికిని, తరచు ఇండ్లను సందర్శించినప్పుడు, ఇండ్లయొద్ద లేనివారిని గుర్తుపెట్టుకొని వారిని తిరిగి కలిసికొనుటకు మరి విశేషశ్రద్ధను కలిగియుండుము. సంభాషణ కొరకు వైవిధ్యముగల అంశములను నేర్చుకొనుము. త్వరలోనే వారిని వేరొకరు సందర్శించగలరను విషయమును గుర్తుపెట్టుకొని, మీరు వెళ్లిన ఇంటిలో ఎక్కువ సమయము గడపకుము లేక పొరపాటునకూడ ఆ కుటుంబమును విసిగించకుము. వీధి సాక్ష్యమందును ఆలాగే తటస్థ సాక్ష్యమందును మీ నైపుణ్యములను వృద్ధిచేసికొనుడి. ప్రతి సందర్భములోను, సాధ్యమైన ప్రతి పద్ధతిలోను మీ ఆత్మీయ వలలు విసరండి.

22. ఈ కాలములో మనమే గొప్ప ఆధిక్యతను అనుభవిస్తున్నాము?

22 గుర్తుంచుకొనండి, ఈ విధముగా చేపలుపట్టుట జాలర్లకు, చేపలకుకూడ ప్రయోజనకరమే. మనము పట్టుకొనినవారు పట్టుదల కలిగియున్నట్లయిన, వారు నిత్యము జీవించగలరు. పౌలు తిమోతిని ఇట్లు ప్రోత్సహించెను: “నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) ఆత్మీయముగా చేపలు పట్టుటలో మొదట యేసు తన శిష్యులకు శిక్షణనిచ్చెను, ఇది యింకను ఆయన నడిపింపు క్రింద జరిగింపబడుచున్నది. (ప్రకటన 14:14-16 పోల్చుము.) దానిని నెరవేర్చుటలో ఆయన నడిపింపు క్రింద పనిచేయు ఎంతగొప్ప ఆధిక్యతను మనము కలిగియున్నాము! యెహోవా అనుమతించునంత కాలము మనము అహర్నిశలు మన వలలను విసరుదము. సజీవముగా, ఆత్మలను పట్టుటకంటె గొప్పపని ఇంకేమి ఉండగలదు? (w92 6/15)

మీరు గుర్తుతెచ్చు కొనగలరా?

◻ ఏ పని చేయుటకు యేసు తన అనుచరులకు శిక్షణనిచ్చెను?

◻ ఆత్మీయముగా చేపలుపట్టు పని తన మరణముతో ముగించబడలేదని యేసు ఎట్లు చూపించెను?

◻ మొదటి శతాబ్దములో ఆత్మీయముగా చేపలుపట్టు పనిని యెహోవా ఏ విధముగా ఆశీర్వదించెను?

◻ “ప్రభువు దినమందు” ఎంత విస్తారముగా చేపలు పట్టుట జరిగెను?

◻ ఆయావ్యక్తులుగా మనమెట్లు మనుష్యులనుపట్టు జాలర్లుగా కృతకృత్యులము కాగలము?

[17వ పేజీలోని చిత్రాలు]

యేసు పునరుత్థానము తర్వాత, ఆయన అపొస్తలులు మనుష్యులను పట్టుకొను దైవిక పనిని విస్తరింపజేసిరి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి