త్వరలో వ్యాధి లేక మరణము ఇక ఉండవు!
జబ్బుపడుట ఎవరికీ ఆనందదాయకము కాదు. అలాగే మానవులు చనిపోవుటకు యిష్టపడరు. ఒక మెడికల్ సోషియాలజి ప్రొఫెసర్ యిట్లు వాదించెను: “దీర్ఘాయువును గూర్చిన అన్వేషణ మానవ చరిత్రంతటిలోను, అన్ని సమాజములలోను దాదాపు సార్వత్రికమైనట్లున్నది. ఇది ప్రాథమికమైన స్వయం సంరక్షణా పురోగమనమునకు సంబంధించియుండెను. దీర్ఘాయువును కోరుచు తమ జీవితములను గడిపిన వారియొక్క పొడవైన, వరుసలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి పోన్స్‌డిలియోన్ మాత్రమే. రోగము మరియు మరణములపై పోరాడుటద్వారా దీర్ఘాయువును కాపాడుటకై వైద్యశాస్త్రమెక్కువగ అంకితమైనది.”
మరణము మన అంతరంగ స్వభావమును ఎంత నొప్పించుననగా, అది మన స్నేహితులపై మరియు కుటుంబ సభ్యులపై పడునప్పుడు దాని ప్రభావమును సహజముగనే అణిచివేయుటకు దాదాపు ప్రయత్నింతుము. ఫ్యునరల్ కస్టమ్స్ ది వరల్డ్ ఓవర్ అను పుస్తకము యిట్లు గమనించుచున్నది: “ఏ సమాజము దానంతట అదే స్వతంత్రముగ వదలివేయబడలేదు. ఒక చివర అది ఎంత ప్రాచీనమైనదైనను లేక మరో చివర ఎంత నాగరికమైనదైనను, తన సభ్యుల శవములను దానికున్నంతలో సాంప్రదాయకముగా పారవేయకుండ ఉండదు. అది సర్వ సామాన్యమైన లోతైన కోరికలు తృప్తిపర్చును. దానిని తీసికొని పోవుట ‘సరైన’ దనిపించును. దానిని తీసికొనక పోవుట మరి ముఖ్యముగ కుటుంబ సంబంధముగల దగ్గరవారికి, అనుభవించి కలిసి జీవించి, ఉమ్మడి అనుభవము లేక యితర బంధము కలవారికి, అది ‘తప్పు’ అనిపించును. అసహజముగ వదలివేయబడినది, క్షమాపణ చెప్పుకోదగినది. లేక సిగ్గుపడదగినది. . . [మానవుడు] చనిపోయిన తనవారిని సాంప్రదాయకముగ పాతిపెట్టు ప్రాణి.”
వ్యాధి మరియు మరణముల మూలము
వ్యాధి మరియు మరణము ఒకనాడు తీసివేయబడునను తలంపు చాల బలవత్తరమైనది. కాని అట్లు నమ్ముటకు ఒక ఆధారమున్నదా? నిజంగానే ఉన్నది. అది సహేతుకమైనది, నమ్మదగినది మరియు ఏ లోపము లేనిది. అది మన సృష్టికర్త ప్రేరేపిత వాక్యము—పరిశుద్ధ బైబిలు.
ఆ పుస్తకము, మానవ దుఃఖమెట్లు ప్రారంభమయ్యెనో స్పష్టముగ వివరించుచున్నది. మొదటి మానవుడైన ఆదాము దేవునిచేత సృజింపబడెనని, మధ్య ప్రాశ్చపు ఒక ప్రాంతములో అతడు పరదైసువంటి వనములో ఉంచబడెనని అది చెప్పుచున్నది. ఆదాము పరిపూర్ణముగ సృజింపబడెను ఒక వ్యాధి మరణము ఆయనకు తెలియకుండెను. అతడు త్వరలోనే తనవంటి పరిపూర్ణత గల భార్యతో జత పర్చబడెను, వారిరువురు భూమిపై నిరంతరము జీవించునట్టి ఆశాభావముననుభవించిరి.—ఆదికాండము 2:15-17, 21-24.
ఈ సుందరమైన స్థితి ఎక్కువ కాలము ఉండలేదు. ఎందుకు? ఎందుకనగా ఆదాము స్వార్థపరుడై దేవుని నుండి స్వతంత్రముగ నున్న మార్గమును ఎన్నుకొనెను. నిష్ప్రయోజనమగు శ్రమ, బాధ, వ్యాధి, చివరకు మరణము వచ్చెను. (ఆదికాండము 3:17-19) ఆదాము నిర్ణయించుకొనిన అసంతోషకరమగు జీవితమునే అతని సంతానము స్వాస్థ్యముగ పొందెను. రోమా 5:12 యిట్లు వివరించుచున్నది: “ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమయ్యెను.” రోమా 8:22 యింకా యిలా తెల్పుతున్నది: “సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగ మూలుగుచు ప్రసవవేదనపడుచున్నదని ఎరుగుదుము.”
భూమి మీదనా లేక పరలోకములోనా?
అయినను, దేవుడు త్వరలో విధేయులైన మానవులను ఆదాము హవ్వలు పోగొట్టుకొనిన సంతోషకరమగు పరిస్థితికి తిరిగి తెచ్చునని బైబిలు అభయమిచ్చుచున్నది. ప్రకటన 21:3, 4లో యిట్లున్నది: “దేవుడు తానే వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోవును.” “నాకు దేహములో బాగు లేదని అందులో నివసించు వాడెవడును” అనడని ఆ కాలమును గూర్చి ముందుగానే పూర్వము ఒక ప్రవక్త కూడ ఆలాగే తెల్పెను.—యెషయా 33:24.
ఆస్పత్రులు, శవముల గదులు మరియు సమాధులు లేనట్టి లోకమును నీవు ఊహించగలవా? బాధ మరియు మరణముల భయము కూడ లేకుండా, జీవించుచుండుటను నీవు ఊహించగలవా? అవును, దేవుని వాగ్దానము మనందరి యొక్క లోతైనటువంటి భావోద్రేకములను తట్టుచున్నది. అయినను యీ ఆశ్చర్యకరమగు ఉత్తరాపేక్ష మనమున్న గ్రహమైన భూమికేనని, పరలోకమునకు కాదని మనమెట్లు నిశ్చయత కలిగియుండగలము. ముందు చెప్పబడిన లేఖన పాఠముయొక్క సందర్భమును గమనించుము. ప్రకటన 21వ అధ్యాయము మొదటి వచనములు “క్రొత్త ఆకాశము” మరియు “క్రొత్త భూమిని” గూర్చి మాట్లాడుచున్నవి. స్పష్టముగా చెప్పబడుతున్నదేమనగా దేవుడు మానవులతో ఉండును మరియు వారు ఆయన ప్రజలైయుందురు. నాదేహములో బాగులేదని ఎవడు అనడన్న వాగ్దానము తెల్పిన వెనువెంటనే “దేశములో నివసించు ప్రజలు” “దోషము పరిహరింపబడినవారు” అని యెషయా గ్రంథము వివరించుచున్నది.
కావున ప్రోత్సాహకరమైన యీ వాగ్దానములు భూమిపై జీవితమును వివరించుచున్నవి. యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనతో అవి పొందిక గలిగియున్నవి. ఏలయనగా ఆ ప్రార్థన ఇట్లున్నది: “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమి మీదను నెరవేరును గాక.”—మత్తయి 6:10.
త్వరలో ఎందుకు?
సమీప భవిష్యత్తులో యీ వాగ్దానములు నెరవేరగలవని గుర్తించునట్లుగా యెహోవాసాక్షులు లక్షలాది ప్రజలకు సహాయము చేసిరి. అయినప్పటికి దేని ఆధారము మీద? ఇది ఖచ్చితమని వారు భావించుచున్నారా? మనము ఈ భూమిపైనున్న ప్రస్తుత విధానము లేక ఏర్పాటుయొక్క “అంత్యదినములలో” జీవించు చున్నామనుటకు మనలను ముంచెత్తి వేయుచున్నట్టి సాక్ష్యాధారము మీదనే. (2 తిమోతి 3:1-5) యేసు శిష్యులు యీ విధానముయొక్క అంతమునకు సూచన లేవని అడిగిరి. వారికి జవాబుగ, 1914లో చెలరేగిన మొదటి ప్రపంచ యుద్ధమునుండి ప్రబలు చున్నట్టి ప్రపంచ సంఘటనలను యేసు సవివరముగ ముందుగనే తెల్పెను.a అప్పుడు యింకా యిట్లనెను: “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలుసుకొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగ మీతో చెప్పుచున్నాను.” 1914లో జీవించిన యీ తరము వారు కొందరు ప్రస్తుత ప్రపంచ విధానము అంతమును చూచుటకు జీవించియుందురు.—మత్తయి 24:33, 34.
అప్పుడు యెహోవా దేవుడు, ఈ సుందరమైన భూమిపై నున్న వేదనలకు, దుఃఖమునకు గల కారణములన్నింటిని వెళ్లి తీసివేయ వలసినదిగా తన కుమారుడైన యేసు క్రీస్తుకు ఆజ్ఞాపించును. దుష్టత్వమును, తీసివేయుదానిని బైబిలు హార్‌మెగిద్దోను వద్ద జరుగు “సర్వశక్తిగల దేవుని మహాయుద్ధము” అని తెల్పుచున్నది.—ప్రకటన 16:14, 16.
దేవునికి భయపడు అనేకమంది మానవులు యీ భయంకర పరిణామమునుండి రక్షించబడి యేసుక్రీస్తు శాంతియుత పాలనను చూచుటకు జీవింతురు. ప్రకటన 7:9, 14; 20:4) ఆయన పాలన పరలోకమునుండియే ఐనను దీని ప్రయోజనములు భూమి మీద జీవించు మానవులందరు—హార్‌మెగిద్దోనునుండి రక్షించబడినవారు మరియు చనిపోయినవారిలో నుండి లేపబడు కోట్లాదిమంది అనుభవింతురు. అప్పుడు ఈ వాగ్దానము నిజమగును: “తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన (క్రీస్తు) రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.”—1 కొరింథీయులు 15:25, 26.
మనము ఈవిధంగా దృఢ నమ్మకముతో: “త్వరలో వ్యాధి లేక మరణము ఇక ఉండవు” అని బిగ్గరగా చెప్పగలము. ఇది కేవలము ఒక కలకాదు. లేక మనమాశించునట్టి ఆలోచన కాదు. ఇది “అబద్ధమాడని” యెహోవా దేవుని ఖచ్చితమైన వాగ్దానము. ఈ నిరీక్షణలో నీవును నీయొక్క నమ్మకముంచుదువా? శాశ్వతముగా నీకిది ప్రయోజనము తేగలదు.—తీతు 1:2. (w91 6/15)
[అధస్సూచీలు]
a మానవ జాతి అంత్యదినములలో జీవించుచున్నదనుటకు మరికొంత సాక్ష్యమును “మీరు భూమిపై నిరంతరము జీవించగలరు” అను పుస్తకములో 18వ అధ్యాయమును చూడుము. ఇది వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడినది.
[7వ పేజీలోని చిత్రం]
మరణము మరియు వ్యాధికి బదులుగా బలమైన ఆరోగ్యము, నిత్య జీవము తొందరలోనే వచ్చును.