యెహోవా ప్రజలు విశ్వాసమందు స్థిరపరచబడిరి
“సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.”—అపొ.కార్యములు 16:5.
1. దేవుడు అపొస్తలుడైన పౌలును ఎట్లు ఉపయోగించెను?
తార్సు వాడైన సౌలును యెహోవా దేవుడు “ఏర్పరచుకొనిన సాధనముగా” ఉపయోగించెను. అపొస్తలుడైన పౌలుగా ఆయన ‘ఎన్నో శ్రమలను అనుభవించెను.’ ఆయన మరియు యితరుల పనిద్వారా యెహోవా సంస్థ ఐక్యమత్యమును అద్భుతమైన విస్తరణను అనుభవించెను.—అపొ.కార్యములు 9:15, 16.
2. అపొ.కార్యములు 13:1–16:5 ను విచారించుట ఎందుకు ప్రయోజనకరము?
2 అన్యులు అసంఖ్యాకముగా క్రైస్తవులుగా తయారగుచుండిరి, కాగా దేవుని ప్రజలమధ్య ఐక్యమత్యమును మరియు వారిని విశ్వాసమందు స్థిరపరచుటను ప్రోత్సహించుటకు ప్రాముఖ్యమైన గవర్నింగ్ బాడి కూటమొకటి ఎంతోచేసినది. వీటిని మరియు అపొ.కార్యములు 13:1–16:5 లో వ్రాయబడియున్న యితర పరిణామములను విచారించుట ఎంతో ప్రయోజనకరమగును, ఏలయనగా యెహోవా సాక్షులు యిప్పుడు అటువంటి అభివృద్ధిని మరియు ఆత్మీయ ఆశీర్వాదములను అనుభవించుచున్నారు. (యెషయా 60:22.) (అపొ.కార్యములను గూర్చిన శీర్షికలను మీరు వ్యక్తిగతముగా పఠించునప్పుడు పెద్ద అక్షరములతో సూచించబడిన పుస్తక భాగములను మీరు చదువవలెనని మా సలహా.)
మిషనరీలు కార్యప్రవేశము చేయుట
3. అంతియొకయలోని “ప్రవక్తలు మరియు బోధకులు” ఎటువంటి పనిని చేసిరి?
3 అంతియొకయ, సిరియా సంఘమునుండి బయటకు పంపబడిన మనుష్యులు విశ్వాసులు విశ్వాసమందు స్థిరులగుటకు సహాయము చేసిరి. (13:1-5) అంతియొకయలో బర్నబా, సుమెయోను (నీగెరె), కురేనీయుడైన లూకియ, మనయేను, తార్సువాడైన సౌలు అను “ప్రవక్తలును బోధకులును” ఉండిరి. ప్రవక్తలు దేవుని వాక్యమును వివరించి ముందు జరుగబోయే సంగతులను చెప్పుచుండగా, బోధకులు లేఖనములనుగూర్చి, భక్తిగల జీవనమునుగూర్చి ఉపదేశించెడివారు. (1 కొరింథీయులు 13:8; 14:4) సౌలు బర్నబాలకు ఒక ప్రత్యేకమైన పని అప్పగింపబడెను. బర్నబాకు సమీపజ్ఞాతియైన (COUSIN) మార్కును తీసుకొని వారు కుప్రకు వెళ్లిరి. (కొలస్సయులు 4:10) వారువచ్చి సలమీ తూర్పుతీర ప్రాంత సమాజమందిరములలో ప్రకటించిరి, అయితే యూదులు సరియైన ప్రత్యుత్తరమిచ్చిరనుటకు ఎలాంటి వ్రాతచరిత్రయు లేదు. అటువంటివారు బహుగా ఐశ్వర్యవంతులై యుండినందున, మెస్సీయా కొరకైన అవసరత వారికేమి?
4. కుప్రలో మిషనరీలు తమ పనిని కొనసాగించుచుండగా ఏమి సంభవించెను?
4 కుప్రలో యితర సాక్ష్యపు పనిని దేవుడు ఆశీర్వదించెను. (13:6-12) పాఫునందు, ఈ మిషనరీలకు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్-యేసు (ఎలుమ) అను ఒక యూదుడు ఎదురుపడెను. అతడు అధిపతియైన సెర్గి పౌలు దేవుని వాక్యము వినకుండ అడ్డగించ ప్రయత్నించినప్పుడు, సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను: ‘సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు యెహోవాయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?’ దానితో దేవుని శిక్ష అతని మీదికిరాగా, ఎలుమ కొంతకాలము వరకు గ్రుడ్డివాడాయెను. “జరిగిన దానిని చూచి యెహోవా బోధకు ఆశ్చర్యపడి” సెర్గి పౌలు విశ్వాసిగా తయారయ్యెను.
5, 6. (ఎ) అంతియొకయలోని పిసిదియ సమాజమందిరములో పౌలు మాట్లాడినప్పుడు, యేసునుగూర్చి ఆయన ఏమని చెప్పెను? (బి) ఆయన ప్రసంగ ప్రభావము ఏమైయుండెను?
5 కుప్రనుండి వారు ఓడయెక్కి బయలుదేరి ఆసియామైనరులోని పెర్గేకు వెళ్లిరి. ఆ పిమ్మట పౌలు బర్నబాలు ఉత్తర దిశగా ‘నదులవలననైన దొంగలవలననైన ఆపదలుగల,’ కొండదారులగుండా అంతియొకయకు, పిసిదియకు వెళ్లిరి. (2 కొరింథీయులు 11:25, 26) అక్కడ పౌలు సమాజమందిరములో మాట్లాడెను. (13:13-41) ఆయన ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారములను పునఃసమీక్షించి, దావీదు వారసుడైన యేసును రక్షకునిగా వారికి తెలియజెప్పెను. యూదా పాలకులు యేసు మరణించవలెనని గట్టిగా అడిగినను, వారి పితరులకు చేసిన వాగ్ధానమును నెరవేర్చుచు దేవుడు ఆయనను పునరుత్థానుని చేసెను. (కీర్తన 2:7; 16:10; యెషయా 55:3) క్రీస్తుద్వారాగల దేవుని రక్షణ వరమును అపహసింపవద్దని పౌలు తన ప్రేక్షకులను హెచ్చరించెను.—హబక్కూకు 1:5, సెప్టాజింటు.
6 ఈనాడు యెహోవా సాక్షులద్వారా యివ్వబడు బహిరంగ ప్రసంగముల మాదిరిగానే, పౌలు ప్రసంగము ఎంతో ఆసక్తిని రేపెను. (13:42-52) మరుసటి విశ్రాంతి దినమున యెహోవా వాక్యము వినుటకు దాదాపుగా ఆ పట్టణమంతయు కూడివచ్చెను, కాగా దీనినిబట్టి యూదులు మత్సరముతో నిండుకొనిన వారైరి. అంతెందుకు, కేవలము ఒక్క వారములోనే, ఆ యూదులు తమ జీవితకాలమంతటిలో చేసినదానికంటే ఎక్కువగా ఈ మిషనరీలు అన్యులను స్పష్టముగా మార్చివేసిరి! యూదులు దూషించుచు పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పినందున, ఆత్మీయ వెలుగు మరొకచోట ప్రకాశించుటకు అది సమయమై యుండెను, కాగా వారికీలాగు చెప్పబడెను: ‘మీరు దేవుని వాక్యమును త్రోసివేసి, మిమ్మునుమీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము.’—యెషయా 49:6.
7. పౌలు బర్నబాలు హింసకు ఎట్లు ప్రతిస్పందించిరి?
7 యిప్పుడు అన్యులు సంతోషించుటకు ఆరంభించి, నిత్యజీవమునకు పాత్రులైన వారందరు విశ్వాసులైరి. అయితే, యెహోవా వాక్యము ఆ దేశమందంతటను వ్యాపించుచుండగా, యూదులు మర్యాదగల స్త్రీలను (బహుశ తమ భర్తలమీద యితరులమీద వత్తిడి తెచ్చుటకు) మరియు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంత సరిహద్దులనుండి వెళ్లగొట్టిరి. అయితే అది మిషనరీలను ఆపుజేయలేదు. వారు “తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి,” రోమా రాష్ట్రమైన గలలియలోని ఈకొనియకు (ఆధునిక కొన్యా), వెళ్లిపోయిరి. (లూకా 9:5; 10:11) అంతియొకయలోని పిసిదియలో వారువిడిచి వెళ్లిన శిష్యుల సంగతియేమి? విశ్వాసమందు స్థిరపరచబడినవారిగా వారు “ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి. వ్యతిరేకత ఆత్మీయ పురోగతిని ఆపుజేయనవసరము లేదని చూచుటకు యిది మనకు సహాయము చేయుచున్నది.
హింస ఉన్నను విశ్వాసమందు స్థిరముగా ఉండుట
8. ఈకొనియలో విజయవంతముగా యిచ్చిన సాక్ష్యమునకు ఫలితముగా ఏమి జరిగెను?
8 హింస ఉన్నను పౌలు బర్నబా తాము విశ్వాసమందు స్థిరముగా ఉన్నామని నిరూపించుకొనిరి. (14:1-7) ఈకొనియలోని సమాజమందిరములో వారి సాక్ష్యమునకు ప్రత్యుత్తరముగా, అనేకమంది యూదులు మరియు గ్రీసు దేశస్థులు విశ్వాసులైరి. అవిశ్వాసులైన యూదులు క్రొత్తగా విశ్వాసులైనవారిమీద అన్యులను పురికొల్పినప్పుడు, దేవుని అధికారముతో శ్రామికులైన ఈ యిద్దరు ధైర్యముగా మాట్లాడగా, సూచనలను చేయుటకు వారిని బలపరచి వారిమీది తన అంగీకారమును దేవుడు చూపించెను. యిది వారిలో భేదములు పుట్టించగా, వారిలో కొందరు యూదుల పక్షముగాను మరికొందరు అపొస్తలుల (పంపబడిన వారు) పక్షముగాను నిలిచిరి. అపొస్తలులు పిరికివారు కాదు, అయితే వారిని రాళ్లతో కొట్టవలెనని పథకము వేయబడినదని తెలుసుకొనినప్పుడు, వారు ప్రకటించుటకు తెలివిగా ఆసియామైనరులోని దక్షిణ గలతీయ ప్రాంతమగు లుకయొనియకు వెళ్లిపోయిరి. యుక్తాయుక్త పరిజ్ఞానముద్వారా వ్యతిరేకత ఉన్నను మనముకూడ తరచుగా పరిచర్యయందు చురుకుగా నిలిచియండగలము.—మత్తయి 10:23.
9, 10. (ఎ) కుంటివాడు స్వస్థపరచబడినప్పుడు లుస్త్ర నివాసుల ప్రతిస్పందన ఏమైయుండెను? (బి) లుస్త్రలో పౌలు బర్నబాలు ఎట్లు ప్రతిస్పందించిరి?
9 లుకయొనియ పట్టణమగు లుస్త్ర తర్వాత సాక్ష్యముపొందెను. (14:8-18) అక్కడ పౌలు పుట్టుకతో కుంటివాడైన వానినెకని స్వస్థపరచెను. ఆ అద్భుతమునకు కారణము యెహోవా అని గ్రహించక, జనసమూహములు బిగ్గరగా యిట్లు కేకలు వేసిరి: “దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారు!” ఆ మాటలన్నియు లుకయొనియ భాషలో పలుకబడినందున జరుగుచున్న దానిని పౌలు బర్నబాలు తెలుసుకొనలేకపోయిరి. పౌలు మాట్లాడుటయందు నాయకత్వము వహించినందున ప్రజలు అతనిని హెర్మే (అనర్గళముగా మాట్లాడు దేవతల వార్తాహరుడు) అనియు, బర్నబాను ముఖ్య గ్రీకు దేవతయైన, ద్యుపతి అనియు దృష్టించిరి.
10 ద్యుపతి దేవత పూజారి పౌలు బర్నబాలకు బలి అర్పించవలెనని యెడ్లను పూదండలను తీసుకొనివచ్చెను. బహుశ సాధారణముగా మాట్లాడు గ్రీకుభాషలో లేక అనువాదకుల సహాయముద్వారా మాట్లాడి వెంటనే వారు, తామును లోపముగల నరులేనని, ప్రజలు యిలాంటి “వ్యర్థమైనవాటిని” (జీవములేని దేవతలను, లేక విగ్రహములను) విడిచిపెట్టి సజీవుడైన దేవునివైపు తిరుగవలెనని వారికి తాము సువార్త ప్రకటించుచున్నామని చెప్పిరి. (1 రాజులు 16:13; కీర్తన 115:3-9; 146:6) అవును, గతకాలమందు దేవుడు (హెబ్రీయులను కాదు) జనాంగములు తమ స్వంత విధానముననుసరించి వెళ్లుటకు అనుమతించెను, అయినను ‘ఆకాశమునుండి వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారముననుగ్రహించుచు, ఉల్లసముతో హృదయములను నింపుచు,’ ఆయన తన ఉనికి మరియు మంచితనమును గూర్చిన సాక్ష్యము లేకుండ చేయలేదు. (కీర్తన 147:8) అలా తర్కించుటయే కాకుండ, పౌలు బర్నబాలు జనసమూహములు తమకు బలి అర్పింపకుండ ఆపుటకు బహుగా ప్రయాసపడిరి. ఏదిఏమైనను, మిషనరీలు దేవతవలె తమకొరకు శ్రద్ధాంజలిని అంగీకరించలేదు, లేక ఆ ప్రాంతములో క్రైస్తవత్వమును స్థాపించుటకు వారికి కలిగిన ఆ అధికారమును వారు ఉపయోగించనులేదు. తనసేవను నెరవేర్చుటకు మనలను యెహోవా అనుమతించుచున్న కారణముగా పొగడబడవలెనని కోరుటకు మనము మొగ్గు చూపువారమయినట్లయిన, ప్రత్యేకముగా యిది ఎంతచక్కని ఉదాహరణ!
11. “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను” అను మాటనుండి మనమేమి నేర్చుకొనగలము?
11 ఆకస్మికముగా హింస తన వికృతరూపమును దాల్చెను. (14:19-28) ఎట్లు? అంతియొకయలోని పిసిదియ మరియు ఈకొనియలోని జనసమూహములు యూదులచే వత్తిడి చేయబడినవారై పౌలుమీద రాళ్లురువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. (2 కొరింథీయులు 11:24, 25) అయితే శిష్యులు అతనిచుట్టు గుమికూడినప్పుడు, అతడు లేచి బహుశ చీకటిలో ఎవరు గమనించకుండ లుస్త్రలో ప్రవేశించెను. ఆ మరుసటి దినమున తను బర్నబా దెర్బేకు వెళ్లగా, అక్కడ కేవలము కొద్దిమంది మాత్రమే శిష్యులుగా తయారయిరి. మరలా ఒకసారి లుస్త్ర, ఈకొనియ అంతియొకయలను దర్శించి, మిషనరీలు శిష్యులను బలపరచి, విశ్వాసమందు నిలిచియుండుటకు వారిని ప్రోత్సహించి వారితో యిట్లనిరి: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.” క్రైస్తవులుగా మనము కూడ శ్రమలు వచ్చునని ఎదురుచూడవచ్చును, అయితే విశ్వాసమందు రాజీపడిపోవుటద్వారా వాటిని తప్పించుకొనుటకు మనము ప్రయత్నించకూడదు. (2 తిమోతి 3:12) ఆ సమయమున, సంఘములలో పెద్దలు నియమింపబడిరి, వాటికి పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక వ్రాయబడెను.
12. పౌలు మొదటి మిషనరీ యాత్ర ముగించబడినప్పుడు, ఆ యిద్దరు మిషనరీలు ఏమిచేసిరి?
12 పిసిదియగుండా వెళుతూ, పౌలు బర్నబాలు పంఫూలియయొక్క ప్రముఖ పట్టణమైన పెర్గేలో వాక్యము బోధించిరి. తగిన కాలమునకు వారు సిరియా, అంతియొకయకు వెనుదిరిగి వచ్చిరి. యిప్పుడు పౌలు మొదటి యాత్ర అయిపోయెను, ఈ యిద్దరు మిషనరీలు సంఘమునకు “దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి.” కొంతకాలము వారు శిష్యులతో అంతియొకయలో గడిపిరి, యిది నిస్సందేహముగా వారిని విశ్వాసమందు స్థిరులను చేసినది. ఈనాడు ప్రయాణ కాపరులుచేయు దర్శనములును అటువంటి ఆత్మీయ ప్రభావములనే కలిగియున్నవి.
ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న పరిష్కరింపబడినది
13. క్రైస్తవత్వము హెబ్రీయులు మరియు యూదాయేతర వర్గములుగా విడిపోకుండా వుండాలంటే, ఏమి అవసరము?
13 విశ్వాసమందలి స్థిరత ఆలోచనా ఐక్యతకు పిలుపునిచ్చినది. (1 కొరింథీయులు 1:10) క్రైస్తవత్వము హెబ్రీ మరియు యూదాయేతర వర్గములుగా విడిపోకుండా వుండాలంటే, దేవుని సంస్థలోనికి ప్రవాహముగా వచ్చుచున్న అన్యులు మోషే ధర్మశాస్త్రమును అనుసరించి సున్నతి పొందాలా వద్దా అను విషయమును గవర్నింగ్‌బాడి నిర్ణయించవలసి యుండెను. (15:1-5) అప్పటికే కొంతమంది మనుష్యులు యూదయనుండి సిరియా అంతియొకయకు బయలుదేరివెళ్లి, అక్కడి అన్యులైన విశ్వాసులకు సున్నతిపొందితేనే తప్ప వారికి రక్షణ కలుగనేరదని బోధింపనారంభించిరి. (నిర్గమకాండము 12:48) కాబట్టి, పౌలు బర్నబా మరియు యితరులు యెరూషలేములోని పెద్దలయొద్దకును అపొస్తలులయొద్దకును పంపబడిరి. అక్కడకూడ, ఒకప్పుడు చట్టమే ప్రాముఖ్యమను మనస్సును కలిగియుండిన విశ్వాసులైన పరిసయ్యులు అన్యులు సున్నతిపొందవలెననియు ధర్మశాస్త్రమును పాటించవలెననియు వాదించిరి.
14. (ఎ) యెరూషలేము సభలో వాదము జరిగినను, ఏ మంచి మాదిరి ఉంచబడెను? (బి) ఆ సందర్భములో పేతురు హేతుబద్ధముగా చెప్పినదానియందు ఏ సారాంశముండెను?
14 దేవుని చిత్తమేమిటో నిర్ధారించుటకు ఆలోచనా సభ ఒకటి జరిగించబడెను. (15:6-11) అవును, అక్కడ బహు తర్కము జరిగెను, అయితే బలమైన నమ్మకములు కలిగియున్న వారు తమ అభిప్రాయములను చెప్పినను అక్కడ కక్ష మాత్రము లేకుండెను—ఈనాటి పెద్దలకు అది శ్రేష్ఠమైన మాదిరి! తగిన సమయమున పేతురు యిట్లనెను: ‘అన్యజనులు (కొర్నేలీ వంటివారు) నా నోట సువార్త విని విశ్వసించులాగున దేవుడేర్పరచుకొనెను. ఆయన వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. [అపొ.కార్యములు 10:44-47] గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని [ధర్మశాస్త్రమును పాటించవలెనను బాధ్యతను] వారి మెడమీద పెట్టుచు మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము [శరీరాను సారముగా యూదులు] రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము, ఆలాగే వారును రక్షణ పొందుదురు.’ సున్నతిపొందని అన్యులను దేవుడు అంగీకరించుట, రక్షణ కొరకు సున్నతిపొందుట మరియు ధర్మశాస్త్రమును పాటించుట అవసరము లేదని చూపించెను.—గలతీయులు 5:1.
15. ఏ ముఖ్యాంశములను యాకోబు చెప్పెను, మరియు ఆయన అన్యులైన క్రైస్తవులకు ఏమి వ్రాయవలెనని సలహానిచ్చెను?
15 పేతురు చెప్పుట చాలించునప్పటికి సంఘము శాంతించెను, అయితే యింకను చెప్పవలసినది చాలా ఉండెను. (15:12-21) బర్నబాయు పౌలును తమద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించిరి. ఆ పిమ్మట అధ్యక్షుడును, యేసు సహోదరుడునైన యాకోబు యిట్లు చెప్పెను: ‘అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు ఏలాగు కటాక్షించెనో సుమెయోను [పేతురుయొక్క హెబ్రీ నామము] వివరించెను.’ ముందే చెప్పబడిన పడిపోయిన “దావీదు గుడారమును” తిరిగికట్టుట [దావీదు వంశావళి క్రమముచొప్పున రాజ్య పునఃస్థాపన] యూదులనుండి అన్యులనుండి యేసు శిష్యులను [రాజ్య వారసులను] సమకూర్చుటద్వారా నెరవేర్చబడుచుండెనని యాకోబు సూచించెను. (ఆమోసు 9:11, 12, సెప్టాజింటు; రోమీయులు 8:17) దేవుడు దీనిని సంకల్పించినందున, శిష్యులు దానిని అంగీకరించవలెను. అన్యులైన క్రైస్తవులకు (1) విగ్రహములకు అర్పించిన వాటిని, (2) జారత్వమును, (3) రక్తమును, గొంతుపిసికి చంపినదానిని విసర్జించవలెనని వ్రాయవలెనని యాకోబు సలహానిచ్చెను. ఈ నిషేధములు మోషే వ్రాతలలోవుండెను, కాగా వాటిని ప్రతి విశ్రాంతి దినమున సమాజమందిరములలో చదువుట జరిగేది.—ఆదికాండము 9:3, 4; 12:15-17; 35:2, 4.
16. ఈనాటికిని నడిపింపునిచ్చు గవర్నింగ్‌బాడి లేఖ ఏ మూడు అంశములను యిచ్చినది?
16 యిప్పుడు గవర్నింగ్‌బాడి ఒక లేఖనువ్రాసి అంతియొకయ, సిరియ, కిలికియలలోని అన్యులైన క్రైస్తవులకు పంపించిరి. (15:22-35) పరిశుద్ధాత్మ మరియు లేఖను వ్రాసినవారు విగ్రహార్పితమైన వాటిని; రక్తమును (కొందరు దానిని క్రమముగా భుజించెడివారు); రక్తము కారకుండ గొంతుపిసికి చంపిన దానిని (అనేకమంది అన్యులు అలాంటి మాంసము రుచికరమైనదని దృష్టించెడివారు); జారత్వమును (గ్రీకు, పోర్నియా, లేఖనసంబంధమైన వివాహమునకు వెలుపటగల అక్రమ లైంగిక సంబంధములను సూచించుచున్నది) విసర్జించుమని పిలుపునిచ్చిరి. వాటిని విసర్జించుటద్వారా వారు ఆత్మీయముగా ఎదుగగలరు, యెహోవా సాక్షులును “ఈ అవశ్యకమైన వాటిని” చేయుటద్వారా యిప్పుడు అలాగే ఎదుగుచున్నారు. “మీకు ఆరోగ్యకరము!” (మీకు మేలు) అనుమాట “వీడ్కోలు” సంబంధముగా చెప్పబడినదైయున్నది, కావున ఈ అవసరతలు ప్రాధమికముగా ఆరోగ్యానికి సంబంధించినవని అనుకొనకూడదు. ఆ లేఖను అంతియొకయలో చదివినప్పుడు, అది యిచ్చిన ప్రోత్సాహమునకు వారెంతగానో ఆనందించిరి. ఆ సమయమున, పౌలు, సీల, బర్నబా మరియు యితరులు చెప్పిన ప్రోత్సాహక మాటలద్వారా అంతియొకయలోని దేవుని ప్రజల విశ్వాసము ఎంతగానో స్థిరపరచబడెను. మనముకూడ తోటి విశ్వాసులను ప్రోత్సహించుటకు మరియు కట్టుటకు తగిన మార్గములను వెదకుదుము గాక.
రెండవ మిషనరీ యాత్ర ప్రారంభమగుట
17. (ఎ) రెండవ మిషనరీ యాత్ర ప్రతిపాదించబడినప్పుడు ఏ సమస్య ఉత్పన్నమాయెను? (బి) పౌలు బర్నబాలు వారి వాదముతో ఎట్లు వ్యవహరించిరి?
17 రెండవ మిషనరీ యాత్రను ప్రతిపాదించినప్పుడు ఒక సమస్య లేవదీయబడెను. (15:36-41) ఆసియలోని కుప్రనందలి సంఘములను తను బర్నబా మరలా దర్శించవలెనని పౌలు సూచించెను. బర్నబా దానికి అంగీకరించెను, అయితే తమవెంట తన సోదరుడైన మార్కునుకూడ తీసుకొని వెళ్లవలెనని అతడు కోరెను. పౌలు దానికి అంగీకరించలేదు ఎందుకనగా పంఫూలియలో వారిని విడిచి వెళ్లిపోయెను. దానితో వారిమధ్య “తీవ్రమైన వాదము కలిగెను.” అయితే వారి వ్యక్తిగత వ్యవహారమందు గవర్నింగ్‌బాడి లేక ఇతర పెద్దలు చేరియుండుటకు ప్రయత్నించుటద్వారా పౌలుగాని బర్నబాగాని తమస్వంత మహిమకొరకు వెదకలేదు. ఎంత శ్రేష్ఠమైన మాదిరి!
18. పౌలు బర్నబాలు విడిపోవుట ఫలితముగా ఏమి కలిగెను, మరియు ఈ సంఘటననుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?
18 అయితే, ఈ వాదము వారిని విడదీసెను. బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్లగా, పౌలు సీలను తన సహవాసిగా ఏర్పరచుకొని, “సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశములద్వారా సంచారము చేసెను.” బర్నబామీద కుటుంబ బాంధవ్యములు ప్రభావము చూపియుండవచ్చును, అయితే అతడు పౌలు అపొస్తలత్వమును, “ఏర్పరచుకొనిన సాధనముగా” ఆయన ఎంపికను గుర్తించవలసి యుండెను. (అపొ.కార్యములు 9:15) మరి మన విషయమేమి? ఈ సంఘటన మనము దైవపాలనా అధికారమును గుర్తించు అవసరతమీద, మరియు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో” పూర్తిగా సహకరించుటమీద ముద్ర వేయవలెను.—మత్తయి 24:45-47.
సమాధానమందు అభివృద్ధి
19. ప్రస్తుత-దిన క్రైస్తవ యౌవనులు తిమోతినందు ఏ మాదిరిని కలిగియుండ గలరు?
19 ఈ వివాదము సంఘ సమాధానముమీద ప్రభావము చూపుటకు అనుమతించబడలేదు. దేవుని ప్రజలు యింకను విశ్వాసమందు స్థిరులుగా చేయబడుచుండిరి. (16:1-5) పౌలు సీలయు దెర్బేకును లుస్త్రకును వెళ్లిరి. అక్కడ యూదా విశ్వాసురాలైన యునీకే, మరియు విశ్వాసికాని గ్రీసు దేశస్థుడైన ఆమె భర్త సంతానమైన తిమోతి అక్కడ నివసించుచుండెను. తిమోతి యౌవనుడై యుండెను, 18 లేక 20 సంవత్సరముల తర్వాతకూడ అతనికి, యిలా చెప్పబడెను: “నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము.” (1 తిమోతి 4:12) అతను “లుస్త్రలోను [దాదాపు 18 మైళ్ల దూరమందున్న] ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడై” నందున, అతడు తన శ్రేష్ఠమైన పరిచర్య మరియు లక్షణముల విషయమై పేరుపొందిన వానిగా యుండెను. అటువంటి పేరును సంపాదించుకొనుటకు ఈనాటి క్రైస్తవ యౌవనస్థులు యెహోవా సహాయము కొరకు వెదకవలెను. పౌలు తిమోతికి సున్నతి చేయించెను. ఎందుకంటే వారు తిమోతి తండ్రి అన్యుడని ఎరిగియున్న యూదుల యిండ్లకు సమాజమందిరములకు వెళ్లవలసియుండిరి, కాగా అపొస్తలుడు మెస్సీయానుగూర్చి నేర్చుకొనవలసియున్న యూదామత స్త్రీపురుషులు ఏ విషయములోను అడ్డు చెప్పకుండుటను కోరుకొనెను. బైబిలు సూత్రములను ఉల్లంఘించకుండ, యెహోవా సాక్షులుకూడ ఈనాడు సువార్త అందరికి ఆమోదయోగ్యమగునట్లు తాము చేయగలిగినంత చేయుదురు.—1 కొరింథీయులు 9:19-23.
20. గవర్నింగ్‌బాడి లేఖకు కట్టుబడియుండుట ఎటువంటి ప్రభావమును కలిగియుండెను, మరియు యిది మనమీద ఎలాంటి ప్రభావము కలిగియుండవలెనని మీరనుకొందురు?
20 తిమోతిని సహాయకునిగా చేసుకొని, పౌలు, సీలయు గవర్నింగ్‌బాడి నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని శిష్యులకు అప్పగించిరి. దాని ఫలితమేమై యుండెను? స్పష్టముగా సిరియ, కిలికియ మరియు గలతీయులను సూచించుచు లూకా యిట్లు వ్రాసెను: “సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” అవును, గవర్నింగ్‌బాడి లేఖకు కట్టుబడియుండుట ఫలితముగా ఐక్యత మరియు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగెను. యెహోవా ప్రజలు ఐక్యతగాను విశ్వాసమందు స్థిరముగాను నిలిచియుండవలసిన మన అపాయకరమైన కాలముల కొరకు, ఎంత శ్రేష్ఠమైన ఉదాహరణ! (w90 6/15)
మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?
◻ పౌలు బర్నబాలు హింసకు ఎట్లు ప్రతిస్పందించిరి?
◻ “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనను” మాటనుండి మనమేమి నేర్చుకొనవచ్చును?
◻ మొదటి-శతాబ్ద గవర్నింగ్‌బాడి పంపిన లేఖలోని మూడు అంశములనుండి మనమే సలహాను పొందవచ్చును?
◻ యెహోవా మొదటి-శతాబ్ద సాక్షులను విశ్వాసమందు స్థిరపరచిన వాస్తవములు ఎట్లు మనకుకూడ అన్వయించును?