యేసుయొక్క జీవితము పరిచర్య
రొట్టెలు మరియు పులుపు
దెకపొలినందు గొప్ప జనసమూహము యేసు నొద్దకు వచ్చెను. అన్యజనులతో నిండిన యీప్రాంతమునకు అనేకులు చాల దూరమునుండి వచ్చిరి. ఆయన బోధవిని వారి అంగహీనతలనుండి స్వస్థతనొందుటకు వారు వచ్చిరి. అన్య ప్రాంతముల ద్వారా ప్రయాణముచేయునపుడు వారు సాధారణముగ సరకులు మోసికొనుటకు వాడుక చొప్పున పెద్దపెద్ద గంపలు తెచ్చుకొనిరి.
అయినను అనుకొనని రీతిగా, యేసు శిష్యులను పిలిచి “జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు. వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నార”నును.
అందుకాయన శిష్యులు “ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడనుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని” అందురు.
“మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి”? యేసు తెలిసికొనగోరెను.
“ఏడురొట్టెలు, కొన్ని చిన్న చేపల”ని వారు జవాబు చెప్పుదురు.
జనులను నేలమీద కూర్చుండుడని ఆజ్ఞాపించి, యేసు ఆ రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి తన శిష్యులకిచ్చుటకు ప్రారంభించెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించగా వారందరు తృప్తిగా తిందురు. స్త్రీలు, పిల్లలుగాక నాలుగువేలమంది పురుషులు తినిన తరువాత, మిగిలిన ముక్కలు ఎత్తగా ఏడుగంపలు నిండెను!
యేసు జనసమూహములను పంపివేసి, శిష్యులతో దోనెయెక్కి గలిలయ సముద్రము పశ్చిమ తీరమునకు దాటివెళ్ళును. ఇక్కడ ఈసారి, పరిసయ్యులు సద్ధూకయ్యుల మతమునకు చెందిన సభ్యులతో కలసి యేసును శోధించుటకు ప్రయత్నించుదురు. ఆకాశమునుండి ఒక సూచక క్రియను చూపుమందురు.
తనను శోధించుటకు వారు చేయు ప్రయత్నములను ఎరిగినవాడై, యేసు “సాయంకాలమున మీరు- ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురుగదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురుగాని యీకాలముల సూచనలు వివేచింపలేర”నును.
దానితో యేసు వారిని చెడ్డతరమువారని వ్యభిచారులని అనును. అంతకుముందు పరిసయ్యులతో చెప్పినట్లే, యోనాను గూర్చిన సూచన తప్ప మరి ఏ సూచక క్రియ వారి కనుగ్రహింప బడదని హెచ్చరించును. వారిని విడిచి యేసు, ఆయన శిష్యులు దోనె యెక్కి గలిలయ సముద్రమునకు ఈశాన్య తీరమున నున్న బేత్సయిదా వైపు వెళ్ళుదురు. వారు రొట్టెలు తెచ్చుట మరిచినట్లు మార్గములో గ్రహించిరి. వారివద్ద ఒక్క రొట్టెమాత్రమే ఉండెను.
పరిసయ్యులను, సద్ధూకయ్యులను బలపర్చిన హేరోదీయులను తాను ఎదుర్కెనిన విషయము మనస్సునందున్నవాడై యేసు “చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్తపడుడని” హెచ్చరించును.
వారు రొట్టెలు తెచ్చుట మర్చిపోయిన విషయమును యేసు ప్రస్తావించుచున్నాడని శిష్యులు నమ్ముచున్నందున, పులుపు రొట్టెను గూర్చిన తలంపును వారిమనస్సునకు తెచ్చినట్లున్నది. వారు ఈ విషయమును తర్కించుటకు ప్రారంభించుదురు. వారు అపార్థము చేసికొనిన సంగతి గ్రహించి “రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుచున్నారు?” అని యేసు అడుగును.
ఈ మధ్యనే బహుశ ఒకటి, రెండు రోజుల క్రితమే యేసు అద్భుతరీతిగ వేలాది జనులకు రొట్టెలను పంచిపెట్టి ఆఖరి అద్భుతమును జరిగించెను. నిజమైన రొట్టెలే లేవని ఆయన వారికి జ్ఞాపకముచేయుచు “మీరు జ్ఞాపకము చేసికొనరా? నేను అయిదు వేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి” అని అడిగెను.
“పండ్రెండు” అని వారు జవాబు చెప్పిరి.
“నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టి నప్పుడు ముక్కలు ఎన్నిగంపల నిండ ఎత్తిరని” అడుగగా,
“ఏడు,” అని వారు జవాబు చెప్పిరి.
“మీరింకను గ్రహింపకున్నారా?” అని ప్రశ్నించును. “నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్ధూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్తపడుడని” చెప్పును.
శిష్యులు చివరకు విషయమును గ్రహింతురు. పులుపు అనునది పొంగునట్లు చేసి రొట్టె ఉబ్బునట్లు చేయును. ఈ పదము తరచు అవినీతిని చూపించుటకు వాడబడును. శిష్యులు ఇప్పుడు గ్రహించుదురు. యేసు ఒక సూచనను వాడుచున్నట్లు, “పరిసయ్యుల, సద్ధూకయ్యుల బోధను గూర్చి” వారు జాగ్రత్తపడవలయునని వారి బోధ కలుషితముచేయునని హెచ్చరించుచున్నట్లు వారు తెలిసికొందురు. మార్కు 8:1-21; మత్తయి 15:32–16:12.
◆ పెద్దపెద్ద సరకుల గంపలను ప్రజలెందుకు వెంట తెచ్చుకొందురు?
◆ దెకపొలి విడిచిపెట్టి, యేసు దోనెపై ఏఏ ప్రాంతములకు వెళ్ళును?
◆ పులుపును గూర్చి యేసు పలికిన మాటలను శిష్యులెట్లు అపార్థము చేసికొనిరి?
◆ ‘పరిసయ్యుల సద్ధూకయ్యుల పులుపు’ అని నప్పుడు యేసు భావమేమి? (w87 12/1)