యేసుయొక్క జీవితము పరిచర్య
కోరదగిన ఒకమానవాతీత పాలకుడు
వేలాది మందికి యేసు, అద్భుతరీతిగా భోజనము పెట్టినప్పుడు, ప్రజలు ఆశ్చర్యచకితులైనారు. “నిజముగా ఈలోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే,” అని వారన్నారు. యేసు, మోషేకంటె గొప్ప ప్రవక్త మాత్రమేకాక, ఆయన అత్యంత కోరదగిన పాలకుడుకాగలడని వారనుకొనిరి. కనుక వారు ఆయనను పట్టుకొని రాజుగా చేయదలిచిరి.
అయితే, వారిపథకమును యేసు ఎరిగియుండెను. కనుక వారిచే బలవంతముగా పట్టబడుటను తప్పించుకొనుటకు ఆయన వెంటనే అచ్చటి నుండి వెళ్లిపోయెను. ఆయన జనసమూహమును పంపివేసి తన శిష్యులను తమపడవను ఎక్కి వెళ్లండని బలవంతపెట్టి, ప్రార్థించుటకు కొండకు వెళ్లిపోయెను. ఆ రాత్రి యేసు అచ్చట ఒంటరిగా ఉండెను.
తెల్లవారుటకు కొంచెము ముందు, సముద్రముమీద పెద్దగాలివిసరగా సముద్ర అలలురేగుటను యేసు తానున్న ఎత్తయిన ప్రదేశమునుండి గమనించెను. అది పస్కాపండుగ సమీపమునగనుక పూర్ణచంద్రుని వెలుతురులో, తనశిష్యులు పడవలో కెరటములకు ఎదురు వెళ్ళుటకు ప్రయాసపడుటను యేసుచూచెను. వారు తమశక్తికొలది పడవను నడుపుచున్నారు.
దీనిని గమనించి, యేసు కొండదిగి పడవయొద్దకు ఆలలపై నడచుట ప్రారంభించెను. సుమారు మూడునాలుగు మైళ్లదూరమును పూర్తిచేసి ఆయన తన శిష్యులయొద్దకుచేరెను. అయితే, ఆయన వారిని దాటివెళ్ళునట్లుగా కొనసాగెను. వారు ఆయనను చూచి “ఇది ఒక భూతము!” అని కేకలు వేసిరి.
యేసు ఓదార్పుగా: “నేనే భయపడకండి,” అనెను.
అందుకు పేతురు యిట్లనెను “ప్రభువా నీవే అయితే నీళ్లమీద నడచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము.”
“రమ్ము!” అని యేసుప్రత్యుత్తరమిచ్చెను.
అప్పుడు పేతురు దోనెదిగి యేసునొద్దకు నీళ్లమీద నడచి వెళ్లెను. కాని గాలితుఫానును చూచి పేతురు భయపడి, మునిగిపోసాగి, “ప్రభువా నన్ను రక్షించుము!” అని కేకవేసెను.
వెంటనే యేసు చేయిచాచి అతనిని పట్టుకొని: “అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి?” అనెను.
పిమ్మట యేసు, పేతురు పడవ ఎక్కినప్పుడు గాలి అణిగెను, శిష్యులు ఆశ్చర్యపడిరి. కానివారు ఆశ్చర్యపడవల్సిన వారేనా? కొన్నిగంటలక్రితం కేవలం ఐదురొట్టెలు రెండు చిన్నచేపలతో వేలాదిమందికి ఆహారముపెట్టిన ఆ గొప్ప అద్భుతమును మెచ్చుకొన్నవారై “రొట్టెలయొక్క భావమును” గ్రహించియుంటే ఆయన నీటిపై నడచి గాలిని అణచివేసిన సంగతికి ఆశ్చర్యపడనవసరములేదు. అయినను, యిప్పుడు శిష్యులు యేసుకు వందనముచేసి “నీవు నిజముగా దేవునికుమారుడవు” అనిరి.
కొద్దిసేపు అయిన తరువాత వారు గెన్నేసరెతు చేరుకొనిరి, యిది కపెర్నహూము సమీపమున గల ఒక అందమైన ఫలవంతమైన ప్రాంతము. వారు తమపడవకు అక్కడ లంగరువేసారు. అయితే వారు ఒడ్డునకు వచ్చినప్పుడు, అక్కడి ప్రజలు యేసును గుర్తుపట్టి, చుట్టుపట్లఉన్న ప్రాంతమునకు రోగులైనవారిని కనుగొనడాన్కి వెళ్లిరి. వారందరిని తమ మంచములమీదనే తీసికొనివచ్చినప్పుడు యేసు యొక్క వస్త్రపుచెంగును ముట్టి సంపూర్ణ స్వస్థతపొందారు.
అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టినదానిని, చవిచూచిన జనసమూహము ఆమరుసటి రోజున యేసు వెళ్లిపోయెనని తెలిసికొనిరి. తిబెరయనుండి చిన్నపడవలు వచ్చినప్పుడు వారు వాటిలోఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు బయలుదేరారు. వారు ఆయనను కనుగొన్నప్పుడు యిలా అడిగారు: “బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి?” దానికి యేసు ప్రత్యుత్తరము గూఢమైనదానిని బయలుపరచునదిగా ఉండును. యోహాను 6:14-25; మత్తయి 14:22-36; మార్కు 6:45-56.
◆ వేలాదిమందికి యేసు అద్భుతరీతిగా ఆహారముపెట్టిన తరువాత ప్రజలు ఆయనను ఏమిచేయాలని తలంచారు?
◆ తాను వెళ్లిన కొండమీదనుండి యేసు ఏమిచూచెను, అప్పుడు ఆయన ఏమిచేసెను?
◆ ఈ సంగతుల విషయములో శిష్యులు ఎందుకు అంత ఆశ్చర్యపడనవసరములేదు?
◆ వారు తీరమును చేరుకున్నప్పుడు ఏమి జరిగింది? (w87 9/15)
[9వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]