ముగ్గురు మ్యాజీలు కల్పిథమా లేక వాస్తవమా?
“C+M+B”
ఈ అక్షరములు మీకేమైనా భావమును కలిగియున్నవా? రోమన్ కేథలిక్ చర్చిప్రాంతమైన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో మీరు నివసిస్తున్నట్లయిన అవి మీకొక భావమును కలిగియుండవచ్చును. తరచుగా అక్కడ సంవత్సరముతోపాటు వారి ద్వారాబంధములపై ఆ అక్షరములు వ్రాయబడియుండుటను మీరు చూస్తారు. ఎందుకు?
ప్రసిద్ధమైన ఒక పురాణము ప్రకారము ఈ మూడు అక్షరములు మ్యాజీలని పిలువబడుచున్న లేక ముగ్గురు “జ్ఞానులు” అనబడు గాస్పర్, (జర్మనీలో కాస్పర్ (Caspar), మెలికియర్ (Melchior), బాల్తసర్ (Balthasar).a అను ముగ్గురు మ్యాజీలయొక్క జర్మనుపేర్ల మొదటి అక్షరములు. అందరు అనుకొను విధంగా ఈ మ్యాజీల ఎముకలు 1164లో కోల్నేకు తీసుకురాబడి పట్టణ కెథడ్రల్‌లో పాతిపెట్టబడినవని తలంచబడుతుంది. ఆవిధంగా కోల్నే వారి ఆరాధన కేంద్రంగా తయారయ్యింది. సంవత్సరమున కొకసారి జనవరి 6న— ముగ్గురు పరిశుద్ధరాజుల పండుగయను ఉత్సవములో—యౌవనులు గుంపులుగుంపులుగా పురాతనకాలపు రాజులలాంటి వేషము వేసికొని ప్రతిఇంటింటికి వెళ్తు ద్వారబంధములమీద ఆ అక్షరములను సున్నముతో వ్రాయుదురు. దీనివలన ఇంటివారు దురదృష్టమునుండి కాపాడబడుదురని సంప్రదాయము.
మతపరమైన కళ మరియు పూర్వాచారము చూపుదానినిబట్టి ముగ్గురు మ్యాజీలు లేక “రాజులు” “నక్షత్రము” వలన యేసు పుట్టిన చోటుకు నడిపించబడ్డారు. ఈ “రాజులకు” ఇవ్వబడు గౌరవము, భక్తి దృష్ట్యా ఈ నమ్మకము లేఖనములపై ఆధారపడినదా అను ప్రశ్న ఉత్పన్నమగును.
ఈ సందర్శకులనుగూర్చి కేవలము మత్తయి సువార్త మాత్రమే చూపుచున్నది. (2:1-12) అయితే మత్తయి అక్కడ ముగ్గురున్నారని, వారు ముగ్గురు రాజులని చెప్పుచున్నాడా, వారి పేర్లను ఆయన వ్రాసిపెట్టియున్నాడా? కేథలిక్ వార్తాపత్రిక కిర్‌చెన్‌జ్యుటంగ్ ఫుర్ డాస్ బిస్ట్‌మ్ ఆకెన్ ఈ విధంగా అంగీకరించుచున్నది: “ముగ్గురు పరిశుద్ధ రాజులు వారు ఆవిధంగా ఉన్నట్లు బైబిలులో చూపబడలేదు. ఆరవశతాబ్ద ప్రారంభమునుండి జ్ఞానులు ముగ్గురు రాజులుగా అర్థము చేసికొనబడిరి. . .జోతిష్కుల సంఖ్య విషయంలో మత్తయి ఏ విధమైన వివరములనివ్వటంలేదు. . . . .తొమ్మిదవ శతాబ్దమందు వారు పేర్లతో అనగా గాస్పర్, మెల్‌కియర్, బాల్తసర్, అను పేర్లతో పిలువబడిరి.” అంతేకాక కేథలిక్ రెఫరెన్సు పుస్తకమైన లెక్సికన్ ఫుర్ థియోలజి అండ్ కిర్చె తెలుపునదేమనగా మ్యా’గోయ్ అను గ్రీకుపదమునకు రాజులని భావముకాదు, అయితే “మానవ భవిష్యత్ సంబంధముగా ఖగోళములోని నక్షత్రములను పరిశీలించు శాస్త్రమునుగూర్చిన మర్మజ్ఞానము కలవారని భావము.” జస్టిన్ మార్టయిర్, ఓరిజెన్, టెర్‌టూలియన్, ఈ ముగ్గురు ఈ పదము “జ్యోతిష్కులనే” భావమును కలిగియున్నట్లు అర్థము చేసికొనిరి. ఆధునిక బైబిలు తర్జుమాలుకూడా మత్తయి 2:1, 7నందు “జోతిష్కులను” పదమును ఉపయోగించిరి.—ది లివింగ్ బైబిల్; ఏన్ అమెరికన్ ట్రాన్స్‌లేషన్.
యేసును శిశువుగా వర్ణించు సహజదృశ్యములందు ముగ్గురు రాజులను వివిధరీతులుగా చూపుతున్నను వారు ఆయన పుట్టుకసమయమందు హాజరైయున్నారా? లెక్సికన్ ఇంకను తెలుపునదేమనగా: “బహుశా ఈ సందర్శనము ఒకసంవత్సరము లేక ఆపైన జరిగిందని మత్తయి 2:16 సూచించుచున్నది.” నిజముగా వారు ఆయనను పశువులపాకలో కాక “ఇంటిలో” చూశారు అని 11వ వచనము మాట్లాడుచున్నది.—కింగ్ జేమ్సు వర్షన్.b
“పరిశుద్ధరాజులని” పిలువబడు విషయమేమి? ఆ సందర్శకులను “పరిశుద్ధులని” పిలుచుట సరియైనదేనా? లేఖనము ఎప్పుడును వారిని ఆవిధముగా వర్ణించుటలేదు. నిజమునకు వారు దైవికసూత్రమును భంగపరచువారైయున్నారు. యెషయా 47:13, 14 నందు “ఆకాశములను ఆరాధించువారిని, [సెప్టుజెంటు ప్రకారము “జ్యోతిష్కులు”] నక్షత్రసూచకులను” దేవుడు ఖండించుచున్నాడు. (ద్వితియోపదేశకాండము 18:10ని పోల్చుము.) ఈ జ్యోతిష్కులు “తూర్పుప్రాంతము” నుండి, అనగా చాలావరకు మంత్రసంబంధమైన ఆరాధనకు కేంద్రమైన అపవిత్రమగు బబులోను నుండి వచ్చారు. అచ్చటవారు అబద్ధదేవుళ్లను ఆరాధించువారు. ఆవిధముగా వారు, ఇతరులెవరు చూశారని చెప్పబడని “నక్షత్రము” వలన నడిపించబడ్డారు. అంతేగాక “నక్షత్రము” మొదట వారిని యేసును చంపను ప్రయత్నించిన రాజైన హేరోదుయొద్దకు నడిపించినట్లు మత్తయి చూపుచున్నాడు.—మత్తయి 2:1, 2.
నిశ్చయముగా, వారిని యేసుయొద్దకు నడుపుటకు దేవుడు “నక్షత్రమును” పంపలేదు. చాలావరకు ఈ “నక్షత్రము” దేవుడు నియమించిన పనిని యేసు చేయకముందే ఆయనను నాశనముచేయవలెనని చూచు ఒకనిద్వారా పంపబడియుండదా?—ఆదికాండము 3:15ను పోల్చుము.
“మనుష్యులు కల్పించిన పద్ధతులవలన” దేవుని వాక్యము “నిరర్థకము” చేయబడునని యేసు హెచ్చరించెను. (మత్తయి 15:6) ఈ వ్యక్తులకు సంబంధించిన మానవకల్పిత పద్ధతులన్నియు స్పష్టముగా లేఖనరహితమైనవి. కావున ఈ జ్యోతిష్కులను ఆరాధించుట లేక వారిని పరిశుద్ధులుగా యెంచుట తప్పిదమని మీరు అంగీకరించరా? (w88 12/15)
[అధస్సూచీలు]
a ఈ లాటిన్ మాటకు మతగురువులు క్రైస్టస్ మ్యాన్సియమ్ బెనిడికాట్ అని చూపుతూ, “క్రీస్తు ఈ గృహమును దీవించునుగాక” అను అర్థముతో వివరించుదురు.
b జ్యోతిష్కులు వచ్చుటను గూర్చిన ఇంకా ఎక్కువ సమాచారముకొరకు 1979 డిశంబరు 15, ది వాచ్‌టవర్ పేజి 30 చూడుము.