5వ పాఠం
బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి
యెహోవా మనకు బైబిలు అనే గొప్ప బహుమతిని ఇచ్చాడు, అందులో 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. అయితే, ‘బైబిలు ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని ఎవరు రాశారు?’ అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ఆ ప్రశ్నలకు మనం ఈ పాఠంలో జవాబులు చూస్తాం.
1. బైబిల్ని మనుషులు రాసినప్పుడు, అది దేవుని నుండి వచ్చిందని ఎలా చెప్పవచ్చు?
బైబిల్ని దాదాపు 40 మంది మనుషులు రాశారు. బైబిల్ని రాయడానికి సుమారు 1,600 సంవత్సరాలు పట్టింది (క్రీస్తు పూర్వం 1513 నుండి దాదాపు క్రీస్తు శకం 98 వరకు). బైబిల్ని రాసినవాళ్లలో పశువుల కాపరులు, జాలర్లు, రాజులు ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. అయినా బైబిలంతా ఒకేలా ఉంది. ఇదెలా సాధ్యం? దాన్ని రాయించింది దేవుడే కాబట్టి అది సాధ్యమైంది. (1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.) బైబిల్ని రాసినవాళ్లు తమ సొంత ఆలోచనల్ని కాదుగానీ, “పవిత్రశక్తితోa ప్రేరేపించబడి, దేవుని నుండి వచ్చిన విషయాలు” రాశారు. (2 పేతురు 1:21) దేవుడు పవిత్రశక్తిని ఉపయోగించి తన ఆలోచనల్ని వాళ్ల మనసులో పెట్టాడు, అప్పుడు వాళ్లు వాటిని రాశారు.—2 తిమోతి 3:16.
2. బైబిలు ఎవరెవరికి అందుబాటులో ఉంది?
“ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలు” బైబిల్లో ఉన్న మంచివార్త నుండి ప్రయోజనం పొందవచ్చు అని దేవుడు చెప్పాడు. (ప్రకటన 14:6 చదవండి.) దేవుడు చెప్పినట్టే, ఈ రోజు బైబిలు చాలా భాషల్లో ఉంది. వేరే ఏ పుస్తకం కూడా ఇన్ని భాషల్లో లేదు. బైబిలు దాదాపు అన్ని ప్రాంతాల, అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉంది.
3. యెహోవా బైబిల్ని ఎలా భద్రపర్చాడు?
మొదట్లో బైబిల్ని జంతు చర్మాలతో లేదా పపైరస్ మొక్కలతో తయారుచేసిన కాగితాల మీద రాశారు. కానీ అవి త్వరగా పాడైపోయేవి. అందుకే, బైబిల్ని ప్రేమించినవాళ్లు దాన్ని చాలా జాగ్రత్తగా తమ చేతితో ఎన్నో కాపీలు రాశారు. అధికారం-పలుకుబడి ఉన్నవాళ్లు, మత బోధకులు బైబిల్ని అంతం చేయాలని చూసినా, చాలామంది తమ ప్రాణాలకు తెగించి దాన్ని కాపాడారు. ఇవన్నీ దాటుకుని బైబిలు మన కాలం వరకు వచ్చేలా యెహోవా దాన్ని భద్రపర్చాడు. అవును, “దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది.”—యెషయా 40:8.
ఎక్కువ తెలుసుకోండి
దేవుడు బైబిల్ని ఎలా రాయించాడో, దాన్ని ఎలా కాపాడాడో, ఎలా అందరికీ అందుబాటులోకి తెచ్చాడో తెలుసుకోండి.
4. బైబిలుకు మూలం ఎవరో బైబిలే చెప్తుంది
వీడియో చూడండి. 2 తిమోతి 3:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
బైబిల్ని రాసింది మనుషులైతే, అది దేవుని వాక్యం ఎలా అవుతుంది?
దేవుడు తన ఆలోచనల్ని భూమ్మీద ఉన్న మనుషులకు తెలియజేయగలడు అని మీరు నమ్ముతున్నారా?
యజమాని ఎవరితోనైనా ఉత్తరం రాయిస్తే, అందులోని మాటలు ఆ యజమానివే అవుతాయి గానీ రాసిన వ్యక్తివి అవ్వవు. అదేవిధంగా బైబిల్ని మనుషులు రాసినా, అందులో ఉన్న మాటలు దేవునివే
5. బైబిలు ఎన్నో దాడుల్ని తట్టుకుని నిలిచింది
బైబిలు దేవుని వాక్యం కాబట్టి మన కాలం వరకు వచ్చేలా ఆయనే దాన్ని భద్రపర్చాడు. చరిత్ర అంతటిలో, అధికారం-పలుకుబడి ఉన్నవాళ్లు బైబిల్ని అంతం చేయాలని చూశారు. ప్రజలకు బైబిలు అందకుండా చేయాలని మత బోధకులు చాలా ప్రయత్నించారు. అయితే వ్యతిరేకత ఉన్నా, చంపేస్తామని బెదిరించినా చాలామంది తమ ప్రాణాలకు తెగించి బైబిల్ని కాపాడారు. అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
చాలామంది తమ ప్రాణాలకు తెగించి బైబిల్ని ఎలా కాపాడారో తెలుసుకున్నాక, మీకు దాన్ని చదవాలనిపిస్తుందా? ఎందుకు?
కీర్తన 119:97 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
బైబిల్ని అనువదించడానికి, పంచిపెట్టడానికి చాలామంది ఎందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు?
6. అందరికీ అందుబాటులో ఉన్న పుస్తకం
చరిత్రలో అన్నిటికన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించిన, పంచిపెట్టిన పుస్తకం బైబిలు. అపొస్తలుల కార్యాలు 10:34, 35 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
తన వాక్యం ఎక్కువ భాషల్లోకి అనువాదం అవ్వాలని, పంచిపెట్టబడాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు?
బైబిలుకు సంబంధించి మీకు ఏ విషయం బాగా నచ్చింది?
ప్రపంచంలో దాదాపు
100 శాతం
మందికి బైబిలు అందుబాటులో ఉంది,
అది కూడా వాళ్లకు అర్థమయ్యే భాషలో
బైబిలు లేదా బైబిల్లోని కొన్ని పుస్తకాలు
3,000
కన్నా ఎక్కువ
భాషల్లో ఉన్నాయి
500 కోట్ల
బైబిళ్లను ఇప్పటివరకు ముద్రించారని అంచనా,
వేరే ఏ పుస్తకాన్ని ఇంత ఎక్కువగా ముద్రించలేదు
కొంతమంది ఇలా అంటారు: “బైబిలు కేవలం మనుషులు రాసిన ఒక పాత పుస్తకం.”
మీరేమంటారు?
బైబిలు దేవుని వాక్యం అనడానికి ఏ రుజువులు ఉన్నాయి?
ఒక్కమాటలో
బైబిలు దేవుని వాక్యం. అది అందరికీ అందుబాటులో ఉండేలా దేవుడు చూసుకున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
బైబిల్ని మనుషులు రాసినప్పుడు, అది దేవుని వాక్యం ఎలా అవుతుంది?
బైబిలు గురించి ఈ పాఠంలో నేర్చుకున్న విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది?
బైబిల్ని మీ వరకు తీసుకురావడానికి దేవుడు ఇంత చేశాడని తెలుసుకున్నాక మీకు ఏమనిపిస్తుంది?
ఇవి కూడా చూడండి
ప్రాచీన రాతప్రతుల నుండి నేటి అనువాదాల వరకు ఉన్న బైబిలు చరిత్రను తెలుసుకోండి.
బైబిలు మూడు పెద్దపెద్ద దాడుల్ని తట్టుకొని ఎలా నిలిచిందో తెలుసుకోండి.
బైబిల్ని అనువదించడానికి కొంతమంది తమ ప్రాణాల్ని ఎలా పణంగా పెట్టారో చూడండి.
బైబిల్ని చాలాసార్లు నకలు రాశారు, అనువదించారు. అయినా అందులో ఏ మార్పులూ జరగలేదని మీరు ఎందుకు నమ్మవచ్చు?