2వ అధ్యాయం
దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్రను గుర్తించడం
“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.” ఆయన చేసిన ప్రతీది “చాలా బాగుంది.” (ఆది. 1:1, 31) యెహోవా, మనుషుల్ని అద్భుతమైన భవిష్యత్తు ఆశీర్వాదాలు పొందేలా సృష్టించాడు. అయితే, ఏదెనులో జరిగిన తిరుగుబాటు వల్ల మనుషుల సంతోషం తాత్కాలికంగా పాడైంది. కానీ భూమిపట్ల, మనుషులపట్ల యెహోవాకున్న సంకల్పం మాత్రం మారలేదు. ఆదాము పిల్లల్లో విధేయత చూపించేవాళ్లకు విడుదల ఉంటుందని దేవుడు సూచించాడు. దేవుడు సత్యారాధనను తిరిగి స్థాపిస్తాడు. దుష్టుణ్ణి, అతని చెడ్డ క్రియలన్నిటినీ పూర్తిగా నాశనం చేస్తాడు. (ఆది. 3:15) పరిస్థితులన్నీ మళ్లీ ‘చాలా బాగుంటాయి.’ అవన్నీ యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేస్తాడు. (1 యోహా. 3:8) కాబట్టి, మనం దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్రను గుర్తించడం ఎంతో ప్రాముఖ్యం.—అపొ. 4:12; ఫిలి. 2:9,11.
క్రీస్తు పాత్ర ఏమిటి?
2 దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్ర ఏమిటో ఆలోచించినప్పుడు, దానికి ఎన్నో రూపాలు ఉన్నాయని గుర్తిస్తాం. యేసు మానవాళికి విమోచకునిగా, ప్రధాన యాజకునిగా, క్రైస్తవ సంఘ శిరస్సుగా, ఇప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఆయనకున్న ఈ పాత్రల గురించి ఆలోచించినప్పుడు దేవుని ఏర్పాటుపట్ల మన కృతజ్ఞత, క్రీస్తుయేసు పట్ల మన ప్రేమ పెరుగుతాయి. ఆయనకున్న వివిధ పాత్రల గురించి బైబిలు వివరిస్తుంది.
మనుషులపట్ల యెహోవా సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో యేసు కీలకమైన వ్యక్తి
3 విధేయులైన మనుషులకు దేవునికి మధ్య శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పడం యేసుక్రీస్తు ద్వారా సాధ్యమౌతుందని ఆయన భూపరిచర్య కాలంలో స్పష్టమైంది. (యోహా. 14:6) మానవాళి విమోచకునిగా యేసు అనేకుల కోసం తనను తాను విమోచన క్రయధనంగా అర్పించుకున్నాడు. (మత్త. 20:28) కాబట్టి యేసు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించే విషయంలో ఆదర్శవంతుడు మాత్రమే కాదు, మనుషులపట్ల యెహోవా సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ఆయనే కీలకమైన వ్యక్తి. దేవుని అనుగ్రహాన్ని తిరిగి పొందడానికి మనకున్న ఏకైక మార్గం ఆయనే. (అపొ. 5:31; 2 కొరిం. 5:18, 19) యేసు ప్రాణ త్యాగం అలాగే పునరుత్థానం వల్ల విధేయులైన మనుషులు దేవుని పరలోక రాజ్య పరిపాలన కింద శాశ్వత ఆశీర్వాదాలు పొందడానికి మార్గం తెరవబడింది.
4 ప్రధాన యాజకునిగా, యేసు ‘మన బలహీనతల్ని అర్థంచేసుకుంటాడు.’ భూమ్మీదున్న తన సమర్పిత అనుచరుల పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేయగలడు. అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “మన ప్రధానయాజకుడు మన బలహీనతల్ని అర్థంచేసుకోలేనివాడు కాదు; మనలాగే ఆయనకు అన్నిరకాల పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఆయన ఏ పాపం చేయలేదు.” దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి చేసిన ఆ ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందమని యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచేవాళ్లను పౌలు ప్రోత్సహించాడు. ఆయనిలా అన్నాడు: “కాబట్టి, మనకు సహాయం అవసరమైనప్పుడు కరుణను, అపారదయను పొందగలిగేలా మనం ఆ అపారదయను అనుగ్రహించే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్లి ధైర్యంగా ప్రార్థిద్దాం.”—హెబ్రీ. 4:14-16; 1 యోహా. 2:2.
5 యేసు క్రైస్తవ సంఘానికి శిరస్సు కూడా. మొదటి శతాబ్దంలోని యేసు అనుచరుల్లాగే నేడు కూడా మనకు మానవ నాయకుడు అవసరంలేదు. యేసు పవిత్రశక్తి ద్వారా, అర్హులైన ఉపకాపరుల ద్వారా నిర్దేశిస్తాడు. వాళ్లు దేవుని మందను చూసుకునే విషయంలో యేసుకు, తన పరలోక తండ్రికి జవాబుదారులు. (హెబ్రీ. 13:17; 1 పేతు. 5:2, 3) యేసు గురించి యెహోవా ఒక ప్రవచనంలో ఇలా చెప్పాడు: “ఇదిగో! నేను ఆయన్ని దేశాలకు సాక్షిగా, జనాలకు నాయకుడిగా, అధిపతిగా చేశాను.” (యెష. 55:4) “మీరు నాయకులు అని కూడా పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు” అని తన శిష్యులకు చెప్పినప్పుడు, ఆ ప్రవచనం తన విషయంలో నెరవేరిందని యేసు రూఢిగా చెప్పాడు.—మత్త. 23:10.
6 మనకు సహాయం చేయాలనే ఆలోచనతో, కోరికతో యేసు ఇలా ఆహ్వానిస్తున్నాడు: “భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.” (మత్త. 11:28-30) యేసుక్రీస్తు క్రైస్తవ సంఘ కార్యకలాపాల్ని సౌమ్యంగా, సేదదీర్పును ఇచ్చే విధంగా పర్యవేక్షించడం ద్వారా తన పరలోక తండ్రియైన యెహోవా దేవునిలాగే ‘మంచి కాపరినని’ నిరూపించుకున్నాడు.—యోహా. 10:11; యెష. 40:11.
7 యేసుక్రీస్తు పాత్రకు ఉన్న మరో రూపం గురించి పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి ఉత్తరంలో ఇలా వివరించాడు: “దేవుడు శత్రువులందర్నీ క్రీస్తు పాదాల కింద ఉంచేంతవరకు క్రీస్తు రాజుగా పరిపాలించాలి. అయితే అన్నీ తనకు లోబర్చబడిన తర్వాత, కుమారుడు కూడా తనకు అన్నిటినీ లోబర్చిన దేవునికి తానే లోబడతాడు. దేవుడే అందరికీ అన్నీ అవ్వాలని ఆయన అలా చేస్తాడు.” (1 కొరిం. 15:25, 28) దేవుని సృష్టిలో మొదటివాడైన యేసు, భూమ్మీదకు రాకముందు దేవుని “ప్రధానశిల్పిగా” ఉన్నాడు. (సామె. 8:22-31) దేవుడు యేసును భూమ్మీదికి పంపించినప్పుడు, యేసు అన్ని సమయాల్లో దేవుని ఇష్టాన్నే చేశాడు. ఆయన అత్యంత కఠినమైన పరీక్షను సహించి, చనిపోయేవరకు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. (యోహా. 4:34; 15:10) తన కుమారుడు తుదిశ్వాస వరకు విశ్వసనీయంగా ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయన్ని పరలోకానికి పునరుత్థానం చేసి, పరలోక రాజ్యానికి రాజయ్యే హక్కును ఇచ్చాడు. (అపొ. 2:32-36) భూమ్మీద నుండి మానవ పరిపాలనను, చెడుతనాన్ని తీసేసే గొప్ప పనిని యెహోవా క్రీస్తుయేసుకు అప్పగించాడు. ఆ పనిలో, వేలకొలది శక్తిమంతమైన పరలోక ప్రాణులకు ఆయన నాయకత్వం వహిస్తాడు. (సామె. 2:21, 22; 2 థెస్స. 1:6-9; ప్రక. 19:11-21; 20:1-3) అప్పుడు భూమంతటి మీద, క్రీస్తు నాయకత్వం కింద ఉండే దేవుని పరలోక రాజ్య పరిపాలన మాత్రమే ఉంటుంది.—ప్రక. 11:15.
క్రీస్తు పాత్రను గుర్తించడం అంటే ఏమిటి?
8 మన ఆదర్శప్రాయుడైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు. మన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను యెహోవా యేసుకు అప్పగించాడు. యేసు మనల్ని ప్రేమగా, శ్రద్ధగా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఆయన చూపించే శ్రద్ధ నుండి మనం ప్రయోజనం పొందాలంటే యెహోవాకు విశ్వసనీయంగా ఉంటూ, ముందుకు సాగిపోతున్న ఆయన సంస్థతోపాటు నడవాలి.
9 మొదటి శతాబ్దంలోని యేసు అనుచరులు, దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్రను పూర్తిగా గుర్తించారు. క్రీస్తు శిరస్సత్వం కింద ఐక్యంగా పనిచేస్తూ, పవిత్రశక్తి ద్వారా ఆయనిచ్చే నిర్దేశానికి లోబడుతూ, తాము క్రీస్తు పాత్రను గుర్తించామని వాళ్లు చూపించారు. (అపొ. 15:12-21) అభిషిక్త క్రైస్తవ సంఘంలోని ఐక్యత గురించి ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం. ఆయన నుండి శరీరమంతా చక్కగా అమర్చబడుతుంది, అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరానికి అవసరమైనదాన్ని అందిస్తాయి. ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది, ప్రేమలో బలపడుతుంది.”—ఎఫె. 4:15, 16.
10 సంఘంలోని ప్రతీఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటూ, క్రీస్తు నాయకత్వం కింద ఐక్యంగా పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది, “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమతో నిండివుంటుంది.—కొలొ. 3:14; 1 కొరిం. 12:14-26.
11 బైబిలు ప్రవచనాల నెరవేర్పులో భాగంగా జరుగుతున్న ప్రపంచ సంఘటనలు, 1914లో యేసుక్రీస్తు రాజ్యాధికారం చేపట్టాడని తిరుగులేని విధంగా నిరూపిస్తున్నాయి. ఆయన ఇప్పుడు తన శత్రువుల మధ్య పరిపాలిస్తున్నాడు. (కీర్త. 2:1-12; 110:1, 2) నేడు భూమ్మీద జీవిస్తున్నవాళ్లు దీనినుండి ఏమి అర్థంచేసుకోవచ్చు? త్వరలోనే, యేసు తన శత్రువుల మీద దేవుని తీర్పును అమలు చేసి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన పాత్రను నిరూపించుకుంటాడు. (ప్రక. 11:15; 12:10; 19:16) ఆ తర్వాత, మొదట్లో ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు యెహోవా వాగ్దానం చేసిన విడుదల, క్రీస్తు కుడివైపున ఉన్న అనుగ్రహం పొందినవాళ్ల విషయంలో నెరవేరుతుంది. (మత్త. 25:34) దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్రను గుర్తించినందుకు మనమెంతో సంతోషిస్తున్నాం కదా! ఈ చివరి రోజుల్లో, క్రీస్తు నాయకత్వం కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్యలో ఐక్యంగా పనిచేద్దాం.