3వ అధ్యాయం
“మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి”
సా.శ. 33 పెంతెకొస్తు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన అపొస్తలులు పరిపాలక సభగా ఏర్పడి, కొత్తగా స్థాపించబడిన క్రైస్తవ సంఘాన్ని నిర్దేశించడంలో నాయకత్వం వహించారు. (అపొ. 6:2-4; హెబ్రీ. 13:7) దాదాపు సా.శ. 49 కల్లా, పరిపాలక సభలో యేసు అపొస్తలులతో పాటు ఇతరులు కూడా భాగమయ్యారు. ఉదాహరణకు, సున్నతికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, పరిపాలక సభలో యెరూషలేములోని అపొస్తలులతోపాటు ఇతర పెద్దలు కూడా ఉన్నారు. (అపొ. 15:1, 2) వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులందర్నీ ప్రభావితం చేసే విషయాలను పరిశీలించడం వీళ్ల బాధ్యత. వాళ్లు సంఘాలకు ఉత్తరాలు పంపించేవాళ్లు, తమ నిర్ణయాల్ని తెలియజేసేవాళ్లు. దానివల్ల సంఘాలు బలపడ్డాయి, శిష్యులందరూ తమ ఆలోచనల్లో, పనుల్లో ఐక్యంగా ఉండగలిగారు. పరిపాలక సభ ఇచ్చే నిర్దేశానికి సంఘాలన్నీ ఇష్టపూర్వకంగా లోబడ్డాయి, విధేయత చూపించాయి. దానివల్ల వాళ్లు యెహోవా ఆశీర్వాదాలు పొంది, అభివృద్ధి చెందారు.—అపొ. 8:1, 14, 15; 15:22-31; 16:4, 5; హెబ్రీ. 13:17.
2 అపొస్తలులు చనిపోయిన తర్వాత, గొప్ప మతభ్రష్టత్వం పుట్టుకొచ్చింది. (2 థెస్స. 2:3-12) గోధుమలు, గురుగులు గురించిన ఉదాహరణలో యేసు ముందే చెప్పినట్లు, గోధుమల (అభిషిక్త క్రైస్తవులు) మధ్యలో గురుగులు (నకిలీ క్రైస్తవులు) విత్తబడ్డాయి. కొన్ని శతాబ్దాలపాటు, కోతకాలం వరకు అంటే “ఈ వ్యవస్థ ముగింపు” వరకు ఆ రెండూ కలిసి పెరిగేలా అనుమతించబడ్డాయి. (మత్త. 13:24-30, 36-43) ఆ కాలంలో, ప్రతీ అభిషిక్త క్రైస్తవునిపై యేసు ఆమోదం ఉన్నప్పటికీ, ఆయన తన అనుచరులకు నిర్దేశం ఇవ్వడానికి ఒక పరిపాలక సభను గానీ, భూమ్మీద స్పష్టమైన మాధ్యమాన్ని గానీ ఉపయోగించలేదు. (మత్త. 28:20) అయితే, కోతకాలంలో ఒక మార్పు జరుగుతుందని యేసు ముందే చెప్పాడు.
3 “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు?” అనే ప్రశ్న వేసి యేసుక్రీస్తు ఓ ఉదాహరణ చెప్పాడు. “ఈ వ్యవస్థ ముగింపుకు” సంబంధించిన ‘సూచనలో’ భాగంగా ఆయన ఆ ఉదాహరణను చెప్పాడు. (మత్త. 24:3, 42-47) ఈ నమ్మకమైన దాసుడు, దేవుని ప్రజలకు “తగిన సమయంలో” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడంలో బిజీగా ఉంటాడని యేసు చెప్పాడు. మొదటి శతాబ్దంలో, నాయకత్వం వహించడానికి యేసు ఒక్క వ్యక్తిని కాదుగానీ పురుషుల గుంపును ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా, ఈ వ్యవస్థ ముగింపులో ఆయన ఉపయోగించుకుంటున్న నమ్మకమైన దాసుడు కూడా ఒక్క వ్యక్తి కాదు.
‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ గుర్తించడం
4 తన అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి యేసు ఎవర్ని నియమించాడు? భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవుల్ని నియమిస్తాడని చెప్పడమే సరైనది. బైబిలు వాళ్లను, “రాజులైన యాజక బృందం” అని పిలుస్తుంది. “చీకటిలో నుండి అద్భుతమైన తన వెలుగులోకి [తమను] పిలిచిన దేవుని ‘గొప్ప లక్షణాల గురించి’” ప్రకటించే బాధ్యత వాళ్లమీద ఉంది. (1 పేతు. 2:9; మలా. 2:7; ప్రక. 12:17) భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవుల్లో అందరూ నమ్మకమైన దాసునిగా ఉంటారా? లేదు. యేసు ఓ సందర్భంలో స్త్రీలకు, పిల్లలకు మాత్రమే కాకుండా దాదాపు 5,000 మంది పురుషులకు అద్భుతరీతిలో ఆహారాన్ని అందించాడు. ఆ సమయంలో, ఆయన ఆహారాన్ని శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు ప్రజలకు పంచిపెట్టారు. (మత్త. 14:19) అలా, యేసు కొద్దిమంది చేతుల మీదుగా చాలామందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. నేడు కూడా ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని అదే పద్ధతిలో అందిస్తున్నాడు.
5 కాబట్టి, క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేసి, పంచిపెట్టడంలో నేరుగా భాగం వహించే అభిషిక్త సహోదరుల చిన్న గుంపుతో ఏర్పడిందే “నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడు.” (లూకా 12:42) ఈ చివరి రోజులన్నిటిలో, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునిగా’ ఏర్పడిన ఈ అభిషిక్త సహోదరులు ప్రధాన కార్యాలయంలో కలిసి సేవ చేస్తారు. నేడు ఈ అభిషిక్త క్రైస్తవులే యెహోవాసాక్షుల పరిపాలక సభగా ఏర్పడ్డారు.
6 బైబిలు ప్రవచనాల నెరవేర్పు గురించిన సమాచారాన్ని ప్రచురించడానికి యేసు ఈ పరిపాలక సభను ఉపయోగించుకుంటున్నాడు. అంతేకాదు, రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాల్ని పాటించడానికి అవసరమైన నిర్దేశాన్ని కూడా పరిపాలక సభ ద్వారా ఇస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక ఆహారం, యెహోవాసాక్షుల స్థానిక సంఘాల ద్వారా పంచిపెట్టబడుతోంది. (యెష. 43:10; గల. 6:16) బైబిలు కాలాల్లో, ఒక నమ్మకస్థుడైన దాసుడు లేదా గృహనిర్వాహకుడు ఇంటి నిర్వహణా బాధ్యతను చూసుకునేవాడు. అదేవిధంగా నమ్మకమైన, బుద్ధిగల దాసునికి విశ్వాస గృహాన్ని చూసుకునే బాధ్యత అప్పగించబడింది. అంతేకాదు, నమ్మకమైన దాసుడు ఈ బాధ్యతల్ని కూడా చూసుకుంటాడు: సంస్థ ఆస్తుల్ని, ప్రకటనా పనిని, ప్రాంతీయ-ప్రాదేశిక సమావేశ కార్యక్రమాల్ని పర్యవేక్షించడం; సంస్థలోని వేర్వేరు విభాగాల్లో సేవ చేయడానికి పర్యవేక్షకుల్ని నియమించడం; బైబిలు ప్రచురణల ఉత్పత్తిని చూసుకోవడం. ఇలా “ఇంట్లోని సేవకులకు” ఉపయోగపడే ప్రతీదాన్ని నమ్మకమైన దాసుడు పర్యవేక్షిస్తాడు.—మత్త. 24:45.
7 అయితే “ఇంట్లోని సేవకులు” ఎవరు? ఒక్కమాటలో చెప్పాలంటే, ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకునే వాళ్లందరూ ఆ ఇంట్లోని సేవకులే. మొదట్లో ఆ ‘ఇంట్లోని సేవకుల్లో’ అందరూ అభిషిక్తులే ఉండేవాళ్లు. ఆ తర్వాత, ‘వేరే గొర్రెలకు’ చెందిన గొప్పసమూహం కూడా కలిసింది. (యోహా. 10:16) నమ్మకమైన దాసుడు అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారం నుండి ఆ రెండు గుంపుల వాళ్లూ పోషించబడుతున్నారు.
8 మహాశ్రమ కాలంలో యేసు ఈ చెడ్డ వ్యవస్థ మీద తీర్పును ప్రకటించి, అమలు చేయడానికి వచ్చినప్పుడు, నమ్మకమైన దాసుణ్ణి “తన ఆస్తి అంతటి మీద” నియమిస్తాడు. (మత్త. 24:46, 47) అప్పుడు, నమ్మకమైన దాసునిగా ఏర్పడిన అభిషిక్త క్రైస్తవులు తమ పరలోక బహుమానం పొందుతారు. 1,44,000 మందిలోని మిగతావాళ్లలాగే వీళ్లు కూడా పరలోకంలో క్రీస్తుతోపాటు రాజ్యాధికారాన్ని పొందుతారు. అప్పుడు భూమ్మీద నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఉండకపోయినా, మెస్సీయ రాజ్య పౌరులకు అవసరమైన నిర్దేశాన్ని ఇవ్వడానికి యెహోవా, యేసు భూమ్మీద ‘అధిపతుల్ని’ నియమిస్తారు.—కీర్త. 45:16.
“నాయకత్వం వహిస్తున్నవాళ్లను” ఎందుకు గుర్తుచేసుకోవాలి?
9 “నాయకత్వం వహిస్తున్నవాళ్లను” గుర్తుచేసుకోవడానికి, వాళ్లమీద మనకున్న నమ్మకాన్ని చూపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలా చేయడం ఎందుకు మనకే మంచిది? అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “వాళ్లు మీ ప్రాణాలకు కాపలాగా ఉన్నారు, ఈ విషయంలో వాళ్లు దేవునికి లెక్క అప్పజెప్పాలి. మీరు అలా లోబడివుంటే వాళ్లు దుఃఖంతో కాకుండా సంతోషంతో ఆ పని చేయగలుగుతారు. ఒకవేళ వాళ్లు దుఃఖంతో ఆ పని చేయాల్సివస్తే మీకే నష్టం.” (హెబ్రీ. 13:17) వీళ్లు మన ఆధ్యాత్మిక సంరక్షణను, సంక్షేమాన్ని కనిపెట్టుకొని ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ల మాట వింటూ, వాళ్లిచ్చే నిర్దేశానికి లోబడడం చాలా ప్రాముఖ్యం.
10 మొదటి కొరింథీయులు 16:14 లో పౌలు ఇలా చెప్పాడు: “మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి.” కాబట్టి నాయకత్వం వహించేవాళ్లు దేవుని ప్రజల తరఫున తీసుకునే నిర్ణయాలు, అత్యుత్తమ లక్షణమైన ప్రేమ మీదే ఆధారపడి ఉంటాయి. ప్రేమ గురించి 1 కొరింథీయులు 13:4-8 వచనాలు ఇలా చెప్తున్నాయి: “ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది. ప్రేమ అసూయపడదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు, అమర్యాదగా ప్రవర్తించదు, సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు. ప్రేమ హానిని మనసులో పెట్టుకోదు. అది చెడు విషయంలో సంతోషించదు కానీ, సత్యం విషయంలో సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.” యెహోవా సేవకుల ప్రయోజనం కోసం తీసుకునే నిర్ణయాలన్నిటికీ ప్రేమే ఆధారం కాబట్టి, అలాంటి నిర్దేశం కింద మనం సురక్షితంగా ఉండవచ్చు. అంతేకాదు, ఇది యెహోవా ప్రేమకు ఒక నిదర్శనం.
మన ఆధ్యాత్మిక సంరక్షణను, సంక్షేమాన్ని కనిపెట్టుకొని ఉండేవాళ్లకు లోబడడం చాలా ప్రాముఖ్యం
11 మొదటి శతాబ్దంలోలాగే ఇప్పుడు కూడా, తన ప్రజల్లో నాయకత్వం వహించడానికి యెహోవా అపరిపూర్ణ పురుషుల్ని ఉపయోగించుకుంటున్నాడు. అయితే, గతంలో కూడా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన అపరిపూర్ణ మనుషుల్నే ఉపయోగించుకున్నాడు. నోవహు ఓడను నిర్మించి, తన కాలంలో రానున్న జలప్రళయం గురించి ప్రజలకు ప్రకటించాడు. (ఆది. 6:13, 14, 22; 2 పేతు. 2:5) యెహోవా తన ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించడానికి మోషేను నియమించాడు. (నిర్గ. 3:10) అపరిపూర్ణ మనుషులు బైబిల్ని రాయడానికి ప్రేరేపించబడ్డారు. (2 తిమో. 3:16; 2 పేతు. 1:21) నేడు ప్రకటించే, శిష్యులను చేసే పనిని నిర్దేశించడానికి యెహోవా అపరిపూర్ణ మనుషుల్ని ఉపయోగించుకుంటున్నంత మాత్రాన, దేవుని సంస్థ మీద మనకున్న నమ్మకం తగ్గదు. యెహోవా సహాయమే లేకపోతే సంస్థ ఇవన్నీ సాధించేది కాదని మనకు తెలుసు కాబట్టి మన నమ్మకం ఇంకా పెరుగుతుంది. నమ్మకమైన దాసునికి ఎదురైన ఎన్నో కష్టాల్ని బట్టి, సంపాదించుకున్న అనుభవాన్ని బట్టి, విషయాల్ని దేవుని పవిత్రశక్తి నడిపిస్తుందని వాళ్లు చూపించారు. నేడు తన సంస్థలోని దృశ్య భాగం మీద యెహోవా ఎన్నో ఆశీర్వాదాల్ని కుమ్మరించాడు. కాబట్టి, మనం సంస్థకు హృదయపూర్వకంగా, పూర్తిగా మద్దతిస్తూ దానిమీద నమ్మకం ఉంచుతాం.
మన నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?
12 సంఘంలో బాధ్యతాయుత స్థానాల్లో నియమించబడినవాళ్లు తమ నియామకాల్ని సంతోషంగా స్వీకరించి, నమ్మకంగా నిర్వర్తించడం ద్వారా యెహోవామీద, ఆయన ఏర్పాట్లమీద తమకు నమ్మకం ఉందని చూపిస్తారు. (అపొ. 20:28) రాజ్య ప్రచారకులుగా మనం ఇంటింటి పరిచర్యను, పునర్దర్శనాలను, గృహ బైబిలు అధ్యయనాలను ఉత్సాహంగా చేస్తాం. (మత్త. 24:14; 28:19, 20) నమ్మకమైన దాసుడు సమృద్ధిగా ఇస్తున్న ఆధ్యాత్మిక ఆహారం నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే, క్రైస్తవ కూటాలకు, ప్రాంతీయ-ప్రాదేశిక సమావేశాలకు సిద్ధపడాలి, హాజరవ్వాలి. అక్కడ మనం సహోదరసహోదరీలతో సహవసిస్తున్నప్పుడు ఒకరి నుండి ఒకరం ఎంతో ప్రోత్సాహం పొందుతాం.—హెబ్రీ. 10:24, 25.
13 మనం విరాళాలతో యెహోవా సంస్థకు మద్దతిచ్చినప్పుడు, దానిమీద నమ్మకం ఉందని రుజువుచేస్తాం. (సామె. 3:9, 10) అంతేకాదు, మన సహోదరులు వస్తుపరమైన అవసరంలో ఉన్నారని తెలిసినప్పుడు, మనం వెంటనే సహాయం చేస్తాం. (గల. 6:10; 1 తిమో. 6:18) మనం సహోదర ప్రేమతోనే ఇవన్నీ చేస్తాం. యెహోవా, ఆయన సంస్థ మనపట్ల చూపిస్తున్న మంచితనానికి కృతజ్ఞత చూపించే అవకాశాల కోసం ఎల్లప్పుడు ఎదురుచూస్తాం.—యోహా. 13:35.
14 సంస్థ తీసుకునే నిర్ణయాలకు మద్దతివ్వడం ద్వారా కూడా మనకు దానిపై నమ్మకం ఉందని చూపిస్తాం. పర్యవేక్షించే స్థానంలో నియమించబడిన సహోదరులు అంటే ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘ పెద్దలు ఇచ్చే నిర్దేశాలకు వినయంగా లోబడడం కూడా అందులో భాగమే. “నాయకత్వం వహిస్తున్న” వాళ్లలో ఆ సహోదరులు కూడా ఉన్నారు కాబట్టి మనం వాళ్లకు విధేయత చూపిస్తూ లోబడి ఉండాలి. (హెబ్రీ. 13:7, 17) కొన్ని నిర్ణయాలు మనకు పూర్తిగా అర్థంకాకపోయినా, వాటికి కట్టుబడి ఉండడం మన శాశ్వత ప్రయోజనం కోసమేనని మనకు తెలుసు. దేవుని వాక్యానికి, ఆయన సంస్థకు విధేయత చూపిస్తే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనం మన యజమానియైన యేసుక్రీస్తుకు లోబడుతున్నామని చూపిస్తాం.
15 అవును, నమ్మకమైన, బుద్ధిగల దాసునిపై మనం పూర్తి నమ్మకం ఉంచడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ వ్యవస్థకు దేవుడైన సాతాను, యెహోవా పేరుకూ ఆయన సంస్థకూ మచ్చ తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. (2 కొరిం. 4:4) సాతాను దుష్ట పన్నాగాల్లో చిక్కుకోకండి! (2 కొరిం. 2:11) అగాధంలో బంధించబడడానికి తనకు “కొంచెం సమయమే” ఉందని సాతానుకు తెలుసు. అందుకే, దేవుని ప్రజల్లో సాధ్యమైనంత ఎక్కువమందిని యెహోవా నుండి దూరం చేయాలని అతడు కంకణం కట్టుకున్నాడు. (ప్రక. 12:12) సాతాను తన ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తుండగా, మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతూ ఉందాం. యెహోవా మీద, నేడు తన ప్రజల్ని నిర్దేశించడానికి ఆయన ఉపయోగిస్తున్న మాధ్యమం మీద నమ్మకం ఉంచుదాం. అలా చేయడంవల్ల మనందరం ఐకమత్యంగా ఉంటాం.