23వ అధ్యాయం
యేసు కపెర్నహూములో అద్భుతాలు చేశాడు
మత్తయి 8:14-17 మార్కు 1:21-34 లూకా 4:31-41
యేసు ఒక చెడ్డదూతను వెళ్లగొట్టాడు
పేతురువాళ్ల అత్త బాగైంది
మనుషుల్ని పట్టే జాలర్లు అవ్వమని పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను యేసు ఆహ్వానించాడు. విశ్రాంతి రోజున వాళ్లంతా కపెర్నహూములో ఉన్న ఒక సమాజమందిరానికి వెళ్లారు. యేసు ఆ సమాజమందిరంలో బోధించాడు. ఇక్కడి ప్రజలు కూడా ఆయన బోధించే తీరు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆయన శాస్త్రుల్లా కాకుండా అధికారం ఉన్న వ్యక్తిలా బోధించాడు.
ఆ విశ్రాంతి రోజున సమాజమందిరానికి వచ్చినవాళ్లలో చెడ్డదూత పట్టిన ఒకతను ఉన్నాడు. అతను ఏకంగా సమాజమందిరంలోనే, “నజరేయుడివైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పవిత్రుడివి!” అని గట్టిగా అరిచాడు. అప్పుడు యేసు ఆ చెడ్డదూతను గద్దిస్తూ, “మాట్లాడకుండా అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు.—మార్కు 1:24, 25.
అప్పుడు ఆ చెడ్డదూత అతన్ని కిందపడి గిలగిల కొట్టుకునేలా చేసి, పెద్దగా కేకలు వేశాడు. కానీ “అతనికి ఏ హానీ చేయకుండా” బయటికి వచ్చాడు. (లూకా 4:35) దాంతో, సమాజమందిరంలో ఉన్నవాళ్లు చాలా ఆశ్చర్యపోయి, ‘ఇదేంటి? ఈయన అపవిత్ర దూతల్ని కూడా అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు, వాళ్లు ఈయన మాట వింటున్నారు’ అని మాట్లాడుకున్నారు. (మార్కు 1:27) ఈ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి గలిలయ అంతటా తెలిసిపోయింది.
తర్వాత యేసు, ఆయన శిష్యులు సమాజమందిరం నుండి సీమోను పేతురు ఇంటికి వెళ్లారు. అక్కడ పేతురువాళ్ల అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. ఆమెను బాగుచేయమని వాళ్లు యేసును వేడుకున్నారు. యేసు ఆమె దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకొని లేపాడు, వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. ఆమె యేసుకు, ఆయన శిష్యులకు సేవలు చేయడం మొదలుపెట్టింది, బహుశా ఆమె వాళ్ల కోసం వంట చేసివుంటుంది.
సాయంత్రంకల్లా అన్నిచోట్ల నుండి ప్రజలు రోగుల్ని తీసుకుని పేతురు ఇంటికి వచ్చారు. కాసేపటికే, నగరంలోని వాళ్లంతా ఆ ఇంటి ముందు పోగయ్యారు. ఎందుకు? యేసు వాళ్లను బాగుచేయాలని అక్కడికి వచ్చారు. నిజానికి, “ప్రజలందరూ తమ ఇళ్లలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లలో ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి వాళ్లను బాగుచేశాడు.” (లూకా 4:40) వాళ్ల రోగం ఎలాంటిదైనా, లేఖనాలు ముందే చెప్పినట్లు యేసు వాళ్లను బాగుచేశాడు. (యెషయా 53:4) చెడ్డదూతలు పట్టినవాళ్లను కూడా ఆయన బాగుచేశాడు. ఆ చెడ్డదూతలు బయటికి వస్తూ, “నువ్వు దేవుని కుమారుడివి” అని అరిచేవాళ్లు. (లూకా 4:41) యేసే క్రీస్తని ఆ చెడ్డదూతలకు తెలుసు. అయితే యేసు వాళ్లను గద్దించి, ఇక మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే, వాళ్లు సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు నటించడం ఆయనకు ఇష్టంలేదు.