మీ ఇల్లు సురక్షితమైనదేనా?—పరిశీలించాల్సిన 20 విషయాలు
“ఎలాగోలా ఇంటికొచ్చి పడ్డాము!” రోజంతా పనితో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు బహుశ విశ్రాంతిగా మీరు దీర్ఘంగా నిట్టూర్చవచ్చు, ఇంట్లో క్షేమంగా భద్రంగా ఉండటం మీకు సంతోషంగా ఉండవచ్చు. కానీ మీరు నిజంగా క్షేమంగా ఉన్నారా? వింతగా, కొంతమంది తమ ఇళ్లల్లో తమకు తెలియని పెద్దపెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ఇంట్లో పసివారున్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఈ క్రింద ఉన్న కొన్ని అంశాలను మీరు పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేర్పులు ఎందుకు చేసుకోకూడదు?
✔ మొక్కలు. మీకు గానీ చిన్నపిల్లలుంటే మీ మొక్కల్లో విషపూరితమైనవేమీ లేకుండా చూసుకోండి. గుర్తుంచుకోండి, పసిపిల్లలు చేతికి అందిన ప్రతిదీ వాళ్ల నోట్లో పెట్టుకుంటారు.
✔ తెరలు. తెరలనుండి వేలాడే తాళ్ళు దూరంగా ఉంచండి. వాటికి కాళ్లు తగులుకోగలవు, పిల్లల గొంతులకు కూడా చుట్టుకోగలవు.
✔ డ్రాయర్లు, బీరువాలు. గొళ్లాలు ఉండేలా చూడండి. ఇలా చేస్తే వాటిలో ఉండే పదునైన వస్తువుల్ని, ప్రమాదకరమైన క్లీనింగ్ ఉత్పాదనల్ని పిల్లలు ముట్టకుండా ఉంటారు.
✔ మేడమెట్లు. వెల్తురు పడుతుందా, చెత్తాచెదారం లేకుండా ఉందా? పసిపిల్లలు దొర్లకుండా ఉండటానికి సేఫ్టీ గేట్లు పెట్టారా?
✔ స్టవ్. స్టవ్ మీదున్న పాత్రలకు కాడలు చెవులు ఉన్నట్లయితే అవి బయట వైపుకు లేకుండా లోపలకు ఉండేలా చూసుకోండి, ప్రత్యేకించి వాటిలో వండుతున్నప్పుడు.
✔ ప్రెషర్ కుక్కర్. ఉపయోగించిన ప్రతిసారీ శుభ్రం చేయండి. దానికున్న సేఫ్టీ వాల్వ్ సరిగ్గా పని చేస్తూ ఉందోలేదో నిశ్చయపర్చుకోండి.
✔ అగ్నిమాపకం. కనీసం ఇంట్లో ఒక్కటైనా ఉంచండి, తగినంత వయస్సున్న ప్రతి ఒక్కరూ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించండి.
✔ ఊయల. ఊయల చువ్వలు దగ్గరగా ఉండాలి. లేనట్లైతే పసిపిల్లల తల ఇరుక్కోగలదు.
✔ కిటికీలు. పిల్లలు కిటికీలోంచి పడకుండా కిటికీలకు ఊచలు ఉండాలి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అవి పెద్దవాళ్లు తేలికగా ఊడదీసే విధంగా కూడా ఉండాలి.
✔ మందులు, విటమిన్లు. వీటిని తాళం ఉన్న పెట్టెలోనో, పిల్లలు అందుకోలేని స్థలంలోనో పెట్టండి.
✔ స్నానపు తొట్టి. తొట్టి గానీ నిండు బక్కెట్టు గానీ నీళ్లతో నిండి ఉన్నప్పుడు వాటి దగ్గర పసివాళ్లను ఒంటరిగా ఎప్పుడూ ఉంచవద్దు.
✔ మైక్రోవేవ్స్. వీటిలో ఆహారం చాలా త్వరగా వేడి అవుతుందని గుర్తుంచుకోండి.
✔ ఓవెన్. ఈ కరెంటుతో పనిచేసే ఈ కుంపటిని తరచూ పరీక్షిస్తూ ఉండండి. ఊడిన వైర్లు ప్రమాదకరం కావచ్చు.
✔ గ్యాస్ స్టవ్ గ్రిల్స్. ఇవి వేడిగా ఉన్నప్పుడు పిల్లలను వాటికి దగ్గరకు రాకుండా తగినంత దూరంలో ఉంచండి.
✔ గ్యారేజ్ తలుపు. గ్యారేజ్ తలుపు మూసుకుంటున్నప్పుడు దాని క్రిందుగా ఎప్పుడూ వెళ్ళవద్దని పిల్లలకు చెప్పండి, ప్రత్యేకంగా అది కరెంటుతో పనిచేస్తున్నప్పుడు.
✔ స్మోక్ డిటెక్టర్లు. వాటిని శుభ్రంగా ఉంచండి, అవి పనిచేస్తూ ఉన్నదీ తరచూ చూడండి. ప్రతి సంవత్సరం వాటి బ్యాటరీలను మార్చండి.
✔ కరెంటు వైర్లు, ప్లగ్గులు. పాడైపోయిన వైర్లను పారేయండి. ఉపయోగించని సాకెట్లను సేఫ్టీ కవర్లతో మూసేయటం శ్రేష్ఠం.
✔ కరెంటుతో పనిచేసే ఉపకరణాలు. ఈ ఉపకరణాల్ని నీటికి లేదా సింక్కు దూరంగా ఉంచండి. వీటికి ఎర్తింగ్ ఇచ్చినట్లైతే షాక్ కొట్టకుండా ఉంటాయి.
✔ బొమ్మలు పెట్టుకునే పెట్టె. ఈ పెట్టెలకు ఒకటి రెండు రంధ్రాలు పెట్టండి, అలాగే తలుపు మీద పడకుండా ఉండేందుకు హింజ్లను కూడా అమర్చండి.
✔ ఇస్త్రీ పెట్టె. మీ ఇస్త్రీ పెట్టెను దాని వైరును పిల్లలకు అందని స్థలంలో ఉంచండి.