కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 2/8 పేజీలు 20-24
  • వంటగది సరదాగా ఉండగలదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వంటగది సరదాగా ఉండగలదు
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వంటగది అనే “తరగతి గది”లో నేర్చుకోవడం
  • వంట చేయడమొక సరదా!
  • కుటుంబం కలిసి చేయడం
  • పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • “శ్రేష్ఠమైన సమయం” పరిమిత వ్యవధుల్లో వినియోగించబడుతుంది
    తేజరిల్లు!—1993
  • తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర
    తేజరిల్లు!—2005
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 2/8 పేజీలు 20-24

వంటగది సరదాగా ఉండగలదు

“వంటగదికి బయటే ఉండు!” రాత్రి భోజనానికి ముందే ఆకలిగొని ఆహారాన్ని రుచి చూసేందుకు ప్రయత్నించే చాలా మంది పిల్లలకు అలాంటి ఆజ్ఞ ఇవ్వబడింది. అయినప్పటికీ, తమ పిల్లలను వంటగది వెలుపల నిలబెట్టే బదులు, వారిని వంటగదిలోనికి ఆహ్వానించేందుకు తలిదండ్రులకు మంచి కారణమే ఉంది. ఎందుకలా? వాస్తవంగా వంట గది ఆసక్తికరమైన తరగతి గదన్నదే కారణం.

ఎందుకంటే వంటగది సృజనాత్మకతను, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాలను పిల్లలు అభివృద్ధి చేసుకోగల స్థలం, వాళ్ళు ఇతరులను సేవించడానికి నేర్చుకునే స్థలం, ఒక జట్టులోని సభ్యునిగా పనిచేసేందుకు నేర్చుకునే స్థలం, హృదయాలను స్పృశించే అర్థవంతమైన సంభాషణలు సహజంగా జరిగే స్థలం, [జీవితంలో] అవసరమైన పాఠాలను నెమ్మదిగా నేర్పగల స్థలం. అవును, ప్రతి వంటగదిలోను ఉండే అలమారాల్లోను, సొరుగుల్లోను, అరల్లోను ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాలను నేర్చుకోవచ్చు, ఈ సారి వంట చేసేటప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఈ సాంకేతిక శాస్త్ర యుగంలో ఈ సమాచార యుగంలో పిల్లలకు తర్ఫీదునిచ్చే స్థలంగా వంటగదిని ఎందుకు ఉపయోగించాలి? సమయం అన్నదే జవాబు. తమ పిల్లలతో సమయాన్ని గడిపేందుకు—మరింత సమయాన్ని గడిపేందుకు—వేరే ప్రత్యామ్నాయం లేదని చాలా మంది తలిదండ్రులు గుర్తిస్తారు!a దానిని ఎక్కడ కనుగొనాలి అన్నదే సమస్య. ఇంట్లో చేసే పనుల్లో తాము తమ పిల్లలతో కలిసి చేయగల పనుల కొరకు వారికి తర్ఫీదినిచ్చే అవకాశాల కొరకు చూడాలని కొన్ని పుస్తకాలు తలిదండ్రులకు బోధిస్తున్నాయి. ప్రాచీన ఇశ్రాయేలీయుల జనాంగంలోని తలిదండ్రులకు, “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను” అని దేవుడిచ్చిన ఆజ్ఞకు ఇది పొందికగా ఉంది.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.

ఎలాగూ మనం వంటగదిలో క్రమంగా సమయం గడపవలసిందే కనుక, కుటుంబ సభ్యులు కలిసి పనులు చేసేందుకు సౌలభ్యంగా ఉండే స్థలమదేననిపిస్తుంది. మనకు సమయం, శక్తి లేదా కావలసినంత డబ్బు ఉండేవరకు తరచూ వాయిదాలు వేసే ప్రత్యేకమైన వినోదయాత్రల్లా కాదు, ఆకలైనప్పుడు భోజనం చేయవలసిందే. అంతే కాక వంటగది సహజంగానే పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది. అవును మరి, చాకులను జాగ్రత్తగా ఉపయోగించడానికి, మరితర పాత్రలను వాడడానికి తర్ఫీదును వారు మరెక్కడ పొందుతారు? పిల్లలు సరదాపడుతూ ఒక్కోసారి అంతా చిందరవందరగా చేయవచ్చు! అయితే, వంటగది ఏ పాఠాలను నేర్పిస్తుంది?

వంటగది అనే “తరగతి గది”లో నేర్చుకోవడం

నాలుగేండ్ల తన విద్యార్థులకు అల్లంరొట్టెల ఆంటీగా తెలిసిన లవీజ్‌ స్మిత్‌ చిన్న పిల్లలకు వంట నేర్పించడంలో 17 ఏండ్లుగా తనకు గల అనుభవం ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది: “భోజనాన్ని గూర్చి పిల్లలందరూ చెప్పగలరు గనుక, అది ఒక ముఖ్య బోధనా ఉపకరణమౌతుంది. వాసనను, రుచిని, స్పర్శను గ్రహించే వారి ఇంద్రియాలు వారు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటాయి కనుక అవి పూర్తిగా నిమగ్నమౌతాయి. శబ్దాన్ని గుర్తించే, లెక్కలు చేసే, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలను వంట ద్వారా మీరు నేర్పించగలరు.” పోయడం, దంచడం, ఒలవడం, జల్లడపట్టడం, కలపడం, చపాతీలు వత్తడం శారీరకంగా పనిచేసే నైపుణ్యాన్ని, చేతుల కళ్ళ సమన్వయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పిల్లలకు సహాయపడతాయి. వేరు చేయడం (ఎండు ద్రాక్షాను, జీడిపప్పును ప్రత్యేక కుప్పలుగా పేర్చడం) కొలిచేందుకు ఉపయోగించే డబ్బాలను పరిమాణం ప్రకారం ఒక దానిలో ఒకటి పెట్టడం అనేవి లెక్కలు నేర్చుకోవటానికి ప్రాథమిక బోధనా పద్ధతులని తలంచబడుతుంది. వంట తయారు చేసే పద్ధతిలో ఇవ్వబడిన వివరాలను పాటించడం సంఖ్యలను, కొలతను, సమయాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని, భాషను ఉపయోగించేందుకు అభ్యాసమౌతుంది. సురక్షితాన్ని గూర్చి, బాధ్యతను గురించి, వ్యక్తిగత సంస్థీకరణను గూర్చి, కలిసి పని చేయడాన్ని గూర్చి ఎంతో కొంత తెలుసుకోకుండా ఒకరు సంక్లిష్టత మరియు అపాయం నిండి ఉండే వంటగదిలోనికి వెళ్ళే సాహసం చెయ్యలేరు.

వంట నేర్చుకోవడంలోని విలువను నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నప్పటి నుండే వంటగదిలో సహాయం చేయనారంభించిన పిల్లలు కౌమార దశను చేరుకునే సరికి భోజనాలన్నీ తయారు చేయగలగడం అసాధారణమేమీ కాదు. అప్పుడప్పుడు అలా సహాయం చేయడాన్ని బిజీగా ఉన్న ఏ తల్లి/తండ్రి ఆహ్వానించకుండా ఉంటారు? అంతేకాక, తరువాత యుక్తవయస్సులో వివాహితులుగానైనా అవివాహితులుగానే అయినా పెద్దవారి బాధ్యతలను తీసుకునేటప్పుడు ప్రయోజనం చేయగల ఆత్మవిశ్వాసం, స్వయంకృత్యం అనే గుణాలను పెంపొందించుకునేందుకు కూడా పిల్లలకు వంట సహాయపడుతుంది.—1 తిమోతి 6:6 పోల్చండి.

తన 30వ పడి ఆరంభంలోను ఒంటరిగానున్న లీ అనే వ్యక్తి గుర్తుచేసుకుంటూ, “నాకు దాదాపు ఆరేండ్లున్నప్పటి నుండి మా అమ్మ నాకు చిన్న చిన్న వంటకాల్లో తర్ఫీదునివ్వనారంభించింది. మొదట్లో నేను ముఖ్యంగా కుక్కీలను, కేకులను, మరితర మధుర ఫలహారాలను చేయడంలో ఆసక్తి చూపించాను. కాని నాకు తొమ్మిదేండ్లు వచ్చేసరికి, నేను మా కుటుంబానికి అవసరమైన భోజనమంతటి కోసం పథకం వేసి వండగల స్థాయికి ఎదిగాను. మరి నేను క్రమంగా వంట చేసేవాడ్ని. అలా నేను పెద్దవాడినయ్యాక అవివాహితునిగానున్నప్పుడు వంట పనితో సహా ఇంట్లోని వివిధ పనులను చేయడం తెలిసి ఉండడం వల్ల నాకు జీవితం మరింత సులభతరమయ్యిందని కనుగొన్నాను. నేనిప్పుడు విజయవంతమైన వివాహ జీవితాన్ని ఆనందించేందుకు ఇది నాకు సహాయపడిందని నేను కచ్చితంగా చెబుతాను” అన్నాడు.

వంట చేయడమొక సరదా!

తల్లి/తండ్రి వంటగదిలో పిల్లలకు తర్ఫీదునిచ్చేందుకు సమయాన్ని ఎలా కనుగొనగలరు? సాధ్యమైనంత మటుకు ఆటంకాలు లేనప్పుడు సమయాన్ని పట్టిక వేసుకోవాలని ఒక తల్లి సలహా ఇస్తుంది. మీకు చాలా మంది పిల్లలు ఉన్నట్లయితే, వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకోనారంభిస్తున్నట్లయితే ఒక్కోసారి ఒక్కో బిడ్డతో పనిచేయాలని మీరు అనుకోవచ్చు. ఇలా చేసేందుకు, మిగిలిన పిల్లలు కునుకు తీసే సమయాన్ని లేదా వారు పాఠశాలలో ఉండే సమయాన్ని ఎంపిక చేసుకోండి. మీరు ఒంటరిగా వంట చేసేటప్పుడు పట్టే సమయంకన్నా ఎక్కువ సమయాన్ని తీసుకునేందుకు పథకం వేసుకోండి. వంట గదిలో సరదాగా ఉండేందుకు సిద్ధంగా ఉండండి!

మీ పాప అయినా బాబు అయినా తిని ఆస్వాదించే దేనినైనా ఎన్నుకునేందుకు మొదట్లో మీరు అనుమతించండి.b త్వరిత ఫలితాలను తెచ్చే సరళమైన వంటల కొరకు చూడండి. వాడు విజయవంతంగా పూర్తిచేయగల పనులు అందులో ఇమిడివున్నాయని నిశ్చయం చేసుకోండి. మీ బిడ్డకు నెమ్మదిలేని విధంగా విసుగు పుట్టించేదిగా ఉండకుండా ఉండేందుకు, కావలసిన మిశ్రమాలను పాత్రలను కొన్నింటిని ముందుగానే మీ పిల్లవానితో తీయించండి. కావలసిన మిశ్రమాలను మీరు పాక్షికంగా ముందే తయారు చేసుకోవచ్చు, అలాగైతే ఆ వంట పనికి మరీ ఎక్కువ సేపు పట్టదు, అలసట కలిగించేదిగా ఉండదు.

మీరు మీ బిడ్డతోపాటు వంట విధానాన్ని గూర్చి చదువుతూ ఒక్కో పని ఎలా చేయాలో వానికి చూపించండి. మీ బిడ్డకు వంటగదిలో సొంతంగా కొంత స్థలాన్నివ్వండి—బహుశా రెండు పాత్రలు, కొన్ని గిన్నెలు ఉన్న ఒక సొరుగును ఇవ్వండి, ఒక ఏప్రన్‌ను ఇవ్వండి. అబ్బాయి ఆడవాళ్ళ ఏప్రన్‌ వేసుకునే బదులు వంటచేసేటప్పుడు మగవాళ్ళు వేసుకునేటటువంటిది ఒకటి వాని కోసం మీరు కుట్టించవచ్చు. ఆరంభం నుండి, సురక్షితత్త్వం కొరకు ముందు జాగ్రత్తలను తీసుకోవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి, వంటగదిలో జ్ఞానయుక్తమైన నియమాలను పెట్టండి.—22వ పేజీలో “మొదటి పాఠం—సురక్షితత్త్వం” అనే బాక్సును చూడండి.

అన్నింటికంటే ముఖ్యంగా, ఆ పని సరదాగా ఉండేలా ప్రయత్నించండి. మీ పిల్లలు మీరు చేస్తున్నది కేవలం చూస్తుండేలా చేయకండి; అతని చేతులు కడిగించి, భోజనం తయారు చేయడంలో వాని చేతులు నిజంగా నిమగ్నమై ఉండేలా చూడండి. వాడు విశ్లేషించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, ప్రశ్నలు అడిగేందుకు అతన్ని అనుమతించండి. ఏదైనా ఒక వంటకం సరిగ్గా కుదరకపోతే విచారించకండి. మీ బిడ్డ తనంతట తనే చేస్తే, ఎలాగైనా తనే తినే సాధ్యత ఉంది!

కుటుంబం కలిసి చేయడం

నిస్సందేహంగా, వంటగది నుండి వచ్చే గొప్ప ప్రయోజనాల్లో ఐక్యత, కుటుంబ విలువలు ఇమిడి ఉన్నాయి. నేటి కొన్ని గృహాల్లోని కుటుంబ సభ్యులు తమ తమ విభిన్న కార్యకలాపాలకు ఒకరితో ఒకరికి నిజంగా ఏ సంబంధం లేకుండా వెళ్ళడాన్ని మీరు గమనించి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, ఇల్లు కేవలం విశ్రాంతి తీసుకునే స్థలంగా ఇంధనాన్ని నింపుకునే స్థలంగా మారుతుంది. దానికి భిన్నంగా, కలిసి వంట చేసుకునే కుటుంబం కలిసి భోజనం చేసే, కలిసి శుభ్రం చేసే సాధ్యత ఉంది. ఈ పనులు వారు సంభాషించుకునేందుకు, కలిసి పనులు చేసేందుకు, మరియు ఒకరితోనొకరు సన్నిహితంగా ఉండేందుకు క్రమమైన అవకాశాలనిస్తుంది. “వంటగదిలో వాష్‌ బేసిన్‌ దగ్గర నా కుమారులతో చక్కని చర్చలను జరిపేదాన్ని” అని ఒక తల్లి గుర్తు చేసుకుంటుంది. “మేము అనేక సంవత్సరాల వరకు ఉద్దేశపూర్వకంగా డిష్‌వాషర్‌ కొనుక్కోలేదు, అలా, గిన్నెలను చేతులతోనే కడిగి తుడవవలసి ఉండింది. తుడిచే పని మా కుమారులకు వంతులవారీగా అప్పజెప్పబడింది. మామూలుగా సంభాషించుకునేందుకు అంతకన్నా మంచి సమయం దొరికేది కాదు” అని హర్మన్‌ అనే ఒక క్రైస్తవ తండ్రి చెబుతున్నాడు.

అవును, వంటగదిలో మీరు మీ పిల్లలతో గడిపే సమయం—ఒక్కోవారం గడుస్తుండగా, ఒక్కో సంవత్సరం గడుస్తుండగా—ఆత్మీయ విలువలను, దైవిక గుణాలను పెంపొందించగల పునాదిని వేస్తుంది. కలిసి ఉండే అలాంటి విరామ సమయాల్లో తల్లి/తండ్రికి, బిడ్డకు మధ్య హృదయాలను స్పర్శించే సంభాషణలు సహజంగానే జరిగి, తల్లి/తండ్రి చూపించే మాదిరికి గల ప్రభావం బిడ్డ హృదయాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. అలాంటి తర్ఫీదు బిడ్డకు జీవితకాలమంతా ప్రయోజనాన్ని ఇవ్వగలదు, దానిని గూర్చి సామెతలు 22:6 ఇలా చెబుతుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”

ఒక తల్లి/తండ్రిగా మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే మార్గాల కొరకు చూస్తున్నట్లయితే, కేకు తయారు చేయడానికి కానీ, లేక మొత్తం భోజనాన్ని తయారు చేయడానికి కాని సహాయం చేయమని వారిని ఎందుకు ఆహ్వానించకూడదు? వంటగదిలో మీ పిల్లలతో కలిసి పని చేయడం అనేది మీ కుటుంబాన్ని పోషించేందుకు సంరక్షించేందుకు ఒక మార్గమని మీరు కనుగొనగలరు.

[అధస్సూచీలు]

a ఈ అంశాన్ని గూర్చిన చర్చ కొరకు మే 22, 1993 సంచిక తేజరిల్లు! (ఆంగ్లం) లో 16-17 పేజీల్లోని “పరిమిత పరిమాణాల్లో కేటాయించబడే ‘నాణ్యమైన సమయం’” అనే శీర్షికను చూడండి.

b క్లుప్తత కోసం, బిడ్డను గూర్చి “వాడు” అని చెప్పబడుతుంది. అయినప్పటికీ, ఈ సమాచారం అమ్మాయిలకు కూడా సమానంగా వర్తిస్తుంది.

[22వ పేజీలోని బాక్సు]

మొదటి పాఠం—సురక్షితత్త్వం

సురక్షిత స్పృహ కలిగి ఉండండి

• వంటగదిలో పనిచేసేటప్పుడు రాగల అపాయాలను గురించి గంభీరంగానే, అయితే భయపెట్టని రీతిగా వివరించండి, రద్దీగా ఉండే వీధిలో ట్రాఫిక్‌ ప్రమాదాలను గూర్చి ఎలా వివరిస్తారో అలాగే వివరించి చెప్పండి. మీరూ మంచి మాదిరినుంచండి.

• పిల్లలు వంటగదిలో పనిచేస్తున్నప్పుడెల్లా పెద్దవాళ్ల పర్యవేక్షణ ఉండేలా చూడండి. పిల్లవాడు సురక్షితంగా ఉపయోగించగలిగే సమయం వచ్చే వరకూ ఏ పాత్రలనైనా, పరికరాలనైనా ముఖ్యంగా అవి విద్యుత్‌ పరికరాలైతే వాటిని ఉపయోగించేందుకు అనుమతించకండి.

• మీ వంటగదిని క్రమబద్ధమైనదిగా ఉంచండి. చిందినవాటిని శుభ్రం చేయండి, చిందరవందరగా ఉన్నవాటిని వెంటనే సరిచేయండి. మీరు వంటచేసేటప్పుడు పెంపుడు జంతువులను, శ్రద్ధను మళ్ళించే మరితర విషయాలను వంటగదిలో ఉంచకూడదు.

వ్రేళ్ళను కాపాడుకోవాలి

• విద్యుత్‌ గ్రైండర్లను, మిక్సీలను పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. మీ పిల్లవాడు ఆ ఉపకరణంలో ఉన్నదానిని కలిపేందుకు గరిటెను పెట్టేముందు అది ఆఫ్‌ చేయబడిందని ప్లగ్‌ తీసివేయబడిందని నిశ్చయపరచుకోండి.

• మీ చాకులను పదునుగా ఉంచాలి, మొద్దుబారిన చాకును ఉపయోగించడానికి ఎక్కువ బలం ప్రయోగించాలి, కనుక, అవి చేజారే అవకాశం ఉంది.

• మీ పిల్లవాడు చాకును ఉపయోగించడానికి నేర్చుకుంటున్నప్పుడు, వానికి ఈ పద్ధతిలో నేర్పించాలి: (1) చాకును తీసుకునేటప్పుడు దాని పిడిని పట్టుకోవాలి, (2) చాకును ఆ ఆహారపదార్థంపై ఉంచాలి, (3) మరొక చెయ్యిని చాకుపైభాగాన ఉంచాలి, మరియు (4) ఆహార పదార్థాన్ని కోసేందుకు బలం ప్రయోగించాలి.

• కట్టింగ్‌ బోర్డును ఉపయోగించండి. మీ పిల్లవాడు కూరగాయలను కోయడానికి ప్రయత్నిస్తుండగా అవి దొర్లిపోకుండా ఉండేందుకు, వాటిని సగభాగంగా కోసి, చదునుగా ఉన్న వైపును కట్టింగ్‌ బోర్డ్‌పై ఉంచండి.

కాలిపోకుండా జాగ్రత్తపడండి

• ఉపయోగించనప్పుడెల్లా స్టవ్‌ మంట ఆర్పి, నాబ్‌లను ఆఫ్‌ చేసి ఉంచాలి. టవ్వళ్ళను, వంటను గూర్చిన పుస్తకాలను, పాత్రలను పట్టుకునే పరికరాన్ని బర్నర్‌ల నుండి దూరంగా ఉంచాలి.

• పెనం పిడులను స్టవ్‌ మధ్య భాగం వైపుకు వచ్చేలా పెట్టాలి, అక్కడైతే అవి సులభంగా చేతికి తగిలి దానిపైనున్నవి చిందవు.

• మీ బిడ్డ స్టవ్‌ దగ్గర నిలబడడానికి మీరనుమతిస్తున్నట్లయితే, పటిష్ఠంగా గట్టిగా ఉన్న నేలపైనే వాడు నిలబడి ఉన్నాడని నిశ్చయపరచుకోండి.

• వేడిగా ఉన్న వస్తువును మీరు ఎక్కడ దించిపెట్టాలో మీకు ముందే తెలియకుండా అక్కడ నుండి తీసుకోకండి. మీరు వేడి వస్తువును తీసుకుని వెళ్తున్నప్పుడు వంటగదిలో ఉన్న మిగిలినవారికి, ముఖ్యంగా మీరు ఎవరి వెనుకనుండైనా దానిని పట్టుకుని నడుస్తున్నట్లయితే వారికి ఆ విషయం తెలుసని నిశ్చయపరచుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి