కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 12/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శబ్దం వల్ల కలిగే పరిణామాలు
  • శ్రద్ధగల తండ్రులకు ఆనందభరితులైన కుమారులు
  • దుప్పటి క్రింద చదవడం
  • స్టీమ్‌ లోకోమోటీవ్‌ల పునరాగమనమా?
  • చిరునవ్వు చిందించడాన్ని నేర్చుకోవడం
  • త్వరగా గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది
  • తగ్గుతున్న ఐరోపా జననసంఖ్య
  • నిర్లక్ష్యం చేయబడిన హృదయాలు
  • కలిసి తినడం
  • ప్రాణాంతకమైన కలరా పునరాగమనం
  • చిరునవ్వు మంచిది!
    తేజరిల్లు!—2000
  • భద్రతాలేమి—ఒక విశ్వవ్యాప్త సమస్య
    తేజరిల్లు!—1998
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1999
g99 12/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

శబ్దం వల్ల కలిగే పరిణామాలు

ఇండియా జనాభా దాదాపు వందకోట్లకు చేరుకోబోతుంది. ఇండియాలోని చండీఘర్‌లో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ యస్‌. బి. యస్‌. మాన్‌ అభిప్రాయం ప్రకారం, పది మందిలో ఒకరు లేక 10కోట్ల మంది ప్రజలకి ఏదో ఒక రకమైన వినికిడి లోపం ఉంది. ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఒటోలారింగాలజిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా వారి వార్షిక కాన్ఫెరెన్స్‌ను ప్రారంభించేటప్పుడు మాట్లాడుతూ డాక్టర్‌ మాన్‌ ఈ ప్రధాన ఆరోగ్య సమస్యకు కారణం హారన్‌లు, ఇంజన్‌లు, మెషీన్‌లు, విమానాలు, వంటి వాటి వల్ల కలిగే శబ్దకాలుష్యం అని ఆరోపించాడు. పండుగల్లో, సర్వసాధారణంగా కాల్చే టపాసులు కూడా చాలావరకు కారణమని ఆయన అన్నాడు. ఉదాహరణకు, దసరా పండుగ సమయంలో దేశవ్యాప్తంగా, సమాజంలోని దుష్టశక్తులకు ప్రాతినిధ్యం వహించే, హైందవ పురాణగాథలలోని పాత్రల భారీ ప్రతిమలను తయారు చేసి వాటిలో వందలాది టపాసులను ఉంచి, వాటికి నిప్పంటించడం వల్ల భయంకరమైన పెద్ద శబ్దాలు వెలువడుతాయి. దాని తర్వాత వచ్చే, లక్షలాది టపాసులు కాల్చబడే ఐదు రోజుల దీపావళి పండుగ సమయంలో కూడా అలానే జరుగుతుంది.

శ్రద్ధగల తండ్రులకు ఆనందభరితులైన కుమారులు

తమ కుమారుల బాధల్లోనూ, స్కూల్‌ పనిలోనూ, సామాజిక జీవితాల్లోనూ, వ్యక్తిగత శ్రద్ధ చూపే తండ్రులు, “నమ్మకమూ నిరీక్షణలతో నిండిన శ్రద్ధగల, ఆశాభావంగల యౌవనస్థులను” తయారు చేస్తారని లండన్‌కు చెందిన ద టైమ్స్‌ అనే పత్రిక నివేదిస్తుంది. టుమారోస్‌ మెన్‌ అనే ప్రాజెక్టు 13 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 1500 మంది అబ్బాయిలపై చేసిన అధ్యయనంలో, తమ తండ్రులు తమతో సమయాన్ని గడుపుతున్నారనీ, తమ అభివృద్ధిలో మంచి శ్రద్ధను చూపిస్తున్నారనీ భావించిన 90 శాతం మంది అబ్బాయిలు, “ఎంతో స్వాభిమానాన్నీ, ఆనందాన్నీ, నమ్మకాన్నీ” ప్రదర్శించారు. దీనికి విరుద్ధంగా, తమ తండ్రులు తమపై చాలా అరుదుగా శ్రద్ధ చూపిస్తారని లేదా అసలు తమపై శ్రద్ధ చూపించడం లేదని భావించే 72 శాతం మంది “స్వాభిమానం, నమ్మకం అతి తక్కువ స్థాయిలో కలిగి ఉన్నారు, వారు కృంగిపోయి, స్కూల్‌ అంటే ఇష్టపడకుండా నేరాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది.” టుమారోస్‌ మెన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఎడ్రీన్‌ కాట్జ్‌, తండ్రి కుమారులు కలిసి గడిపే సమయం చాలా ఎక్కువ సమయమై ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. “తాను కావాల్సిన వాడిననీ, తనను ప్రేమిస్తున్నారనీ, తాను చెప్పేది వింటారనీ పిల్లవాడు భావించడమే ప్రాముఖ్యమైన విషయం” అని ఆమె చెప్తుంది.

దుప్పటి క్రింద చదవడం

తక్కువ కాంతిలో దుప్పటి క్రింద ఉండి చదవడం పిల్లల కళ్ళకు మంచిది కాదని అపోతేకన్‌ ఉమ్‌షావు అనే జర్మను వార్తాలేఖ నివేదిస్తుంది. టూబిన్‌జిన్‌ యూనివర్సిటీలో కోడిపిల్లలపై చేసిన అధ్యయనం చూపించేదేమిటంటే, చూపు కొంచెం దెబ్బతిన్నా, కాంతి తక్కువగా ఉన్నా కనుగుడ్డు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పిల్లవాడు మంచం మీద దుప్పటి క్రింద చదువుతున్నప్పుడు ఈ రెండు పరిస్థితులు ఉంటాయి: పుస్తకాన్ని మరీ దగ్గరగా పెట్టుకొని చదివేటప్పుడు కన్ను సరిగా దృష్టి నిలుపలేదు గనుక కంటిచూపు దెబ్బతింటుంది, కాంతి మరీ తక్కువగా ఉంటుంది. “తరతరాలుగా యౌవనస్థులు, బ్యాటరీ లైట్ల వంటివి పట్టుకొని, వారికి ఇష్టమైన కథలు దుప్పటి క్రింద గబగబా చదివేశారు, అలా చేయడం ద్వారా వారు తమ సాహిత్యవిద్యకే కాక, హ్రస్వదృష్టికి కూడా పునాది వేసుకున్నారు” అని ఆ వార్తాలేఖ నివేదిస్తుంది.

స్టీమ్‌ లోకోమోటీవ్‌ల పునరాగమనమా?

రైళ్ళను ఇష్టపడే వాళ్ళు, గతించిన కాలాల్లో ఉన్న ప్రభావవంతమైన స్టీమ్‌ లోకోమోటీవ్‌లను, ఇష్టపూర్వకంగా గుర్తు తెచ్చుకొంటారు. వాటికున్న తక్కువ సామర్థ్యమూ, ఎక్కువ కాలుష్యమూ మూలంగా ఈ సర్వోత్కృష్టమైన ఇంజన్‌లు అంతరించిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, ఆవిరి శక్తికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందని స్విస్‌ లోకోమోటీవ్‌ ఫ్యాక్టరీలో ఇంజనీర్‌ అయిన రోజర్‌ వాలర్‌ నమ్ముతున్నాడు. ఆయన కంపెనీలోని, ఆవిరి శక్తితో నడిచే ఎనిమిది ఇంజన్‌లు ఇప్పటికే ఆల్ఫ్స్‌ పర్వతాల్లో పనిచేస్తున్నాయనీ, ప్రామాణిక పట్టాలపై ఉపయోగించడానికి ఆయన ఇటీవల ఒక పాత ఆవిరి ఇంజన్‌ను నవీకరించాడనీ బెర్లినర్‌ స్యూటంగ్‌ అనే పత్రిక నివేదిస్తుంది. ఈ పునర్నవీకరించబడిన లోకోమోటీవ్‌ బొగ్గుకు బదులు పెట్రోలును ఇంధనంగా ఉపయోగించడంవల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది. అది రోలర్‌ బేరింగ్‌లను కూడా ఉపయోగిస్తుంది, అలా చేయడం వల్ల ఘర్షణ తగ్గుతుంది, శక్తి నష్టాన్ని తగ్గించడానికీ, వేడెక్కే సమయాన్ని తక్కువ చేయడానికీ మంచి ఇన్సులేషన్‌ ఉండేలా చేస్తుంది. “ఏ డీజిల్‌ లోకోమోటీవ్‌లకన్నా ఇది తక్కువ ఖర్చుతో కూడినది, పర్యావరణానికి చాలా మంచిదిగానూ ఉంటుంది” అని వాలర్‌ చెప్తున్నాడు.

చిరునవ్వు చిందించడాన్ని నేర్చుకోవడం

మంచి సేవ చేయడాన్ని గర్వకారణంగా తలంచే ప్రజలున్న జపాన్‌లో కంపెనీలు, “తమ ఉద్యోగులు మరింత స్నేహపూర్వకంగా ఎలా ఉండాలో నేర్చుకునేందుకు వారిని పాఠశాలలకు పంపించడం” అధికమౌతోందని అసాహీ ఈవినింగ్‌ న్యూస్‌ అనే పత్రిక తెలియజేస్తుంది. “వ్యాపారం మందకొడిగా సాగుతున్నప్పుడు, కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు చిరునవ్వు, నవ్వు, హాస్యం ఖర్చులేని, ప్రభావవంతమైన మార్గాలని భావిస్తున్నాయి.” ఒక పాఠశాలలో, విద్యార్థులు అద్దం ముందు కూర్చుని, చిరునవ్వు చిందించడాన్ని అభ్యాసం చేస్తారు—“అత్యంత ఆహ్లాదకరమైన చిరునవ్వును చిందించడానికి ప్రయత్నిస్తారు.” తాము ఎక్కువగా ప్రేమించే వ్యక్తి గురించి ఆలోచించమని వాళ్లకి చెబుతారు. విశ్రాంతిగా ఉండి, చాలా సహజంగా నవ్వడానికి సహాయం చేసేందుకు ఆ శిక్షకులు కృషిచేస్తారు. కొంతమంది వ్యాపారస్థులు, తమ ఉద్యోగులను అలా పాఠశాలలకు పంపడమే గాక, నిత్యమూ చిరునవ్వులు చిందిస్తూ ఉండడానికి తర్ఫీదివ్వబడిన పనివారుండే ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్లకు వెళ్లి కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకు రావడానికి వారిని పంపిస్తున్నారు. చిరునవ్వు వ్యాపారాన్ని వృద్ధి చేస్తుందా? ఆ వార్తా పత్రిక చెప్తున్నదాని ప్రకారం, ఒక కాస్మొటిక్‌ కంపెనీ తన ఉద్యోగస్థులను 3,000 మందిని చిరునవ్వు తరగతులకు పంపించడం వల్ల, తమ అమ్మకాలు ఆ సంవత్సరంలో 20 శాతం అభివృద్ధి చెందాయి. ఆ శిక్షణ వల్ల తన ఆఫీసులోని వాతావరణం కూడా మెరుగుపడిందని ఒక ఉద్యోగిని తెలియజేసింది. “చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఆహ్లాదకరమైన బాస్‌ల మధ్య ఉండడం చాలా బావుంటుంది” అని ఆమె తెలియజేసింది.

త్వరగా గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది

“కేన్సర్‌ గురించి సరైన శ్రద్ధతీసుకోవాలన్నా, చికిత్స పొందాలన్నా దాన్ని ముందుగా గుర్తించడమే కీలకం” అని టైమ్స్‌ ఆఫ్‌ జాంబియాలోని ఒక నివేదిక తెలియపర్చింది. విచారకరంగా, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో, వైద్యపరమైన పరీక్షలు చేయించుకుని ఉంటే, త్వరగా గుర్తించబడగల్గి ఉండే కేన్సర్‌ వల్ల అనేకమంది ప్రజలు మరణిస్తున్నారు. స్త్రీలల్లో సాధారణంగా వచ్చే కేన్సర్‌ గర్భకోశ ముఖద్వారానికి వచ్చే కేన్సర్‌, లేదా రొమ్ము కేన్సర్‌. పురుషుల్లోనైతే, శుక్రాశయ గ్రంథికి వచ్చే కేన్సర్‌ లేదా ప్రేవుల్లో వచ్చే కేన్సర్‌. అందుకే జాంబియా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రజలు కేన్సర్‌ గురించి పరీక్షచేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళాల్సిందిగా సిఫారసు చేస్తుంది. త్వరగా గుర్తించడం అంటే “రోగికీ, ఆమె/అతని కుటుంబీకులకూ తక్కువ బాధ, తక్కువ వేదన.” అంతేగాక, సమయానుకూలమైన చర్యలు తీసుకొనేందుకు వైద్యులకు కూడా అది సహాయపడుతుంది” అని టైమ్స్‌ తెలియజేస్తుంది.

తగ్గుతున్న ఐరోపా జననసంఖ్య

“రెండవ ప్రపంచ యుద్ధముగింపు సమయం మొదలుకొని, గతసంవత్సరం యురోపియన్‌ యూనియన్‌లోని జననసంఖ్య అతి తక్కువస్థాయికి పడిపోయింది” అని స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ నివేదిస్తుంది. ఈయూ కొరకైన స్టాటిస్టికల్‌ సంస్థయైన యూరోస్టాట్‌ 1960ల మధ్యకాలంలో సంవత్సరానికి 60 లక్షల మంది పిల్లలు జన్మిస్తే, 1998లో యురోపియన్‌ యూనియన్‌లో 40 లక్షల మంది మాత్రమే పుట్టారని ప్రకటించింది. సగటున, యురోపియన్‌ యూనియన్‌ దేశాల్లో, ప్రతి సంవత్సరం 1000 మంది ప్రజలకు 10.7 జననాలు సంభవిస్తున్నాయి. యురోపియన్‌ యూనియన్‌లోని ఏ దేశం తక్కువ జననరేటు గల దేశం? అది ఇటలీ. కుటుంబ నియంత్రణను రోమన్‌ క్యాథలిక్‌ చర్చి వ్యతిరేకించినప్పటికీ అక్కడ జననాల సంఖ్య తక్కువగా ఉంది. ఆ దేశంలో 1000 మందికి కేవలం 9.2 జననాలే సంభవిస్తున్నాయి. ఐర్లాండులో అత్యధిక జననరేటు ఉంది, 1000 మందికి 14.1 జననాలు సంభవిస్తున్నాయి.

నిర్లక్ష్యం చేయబడిన హృదయాలు

“కెనడాదేశ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొనేందుకు చర్యలు తీసుకొనే బదులు, తమ హృదయాలను అలక్ష్యం చేస్తున్నారు,” అని ద నేషనల్‌ పోస్ట్‌ వార్తాపత్రిక తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో, 45 నుండి 74 సంవత్సరాలున్న 400 మంది కెనడా స్త్రీలపై, కెనడాకు చెందిన హార్ట్‌ అండ్‌ స్ట్రోక్‌ ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్వేలో కనుగొనబడింది ఏమిటంటే, “కేవలం 30 శాతం మంది ఆరోగ్యకరమైన బరువును కలిగివున్నారు, 36 శాతం మంది భౌతిక చురుకుదనాన్ని కలిగివున్నారు, 74 శాతంమంది మాత్రం తాము ఇప్పుడు నిర్వహిస్తున్న వివిధ పాత్రలను బట్టి సతమతమౌతూ ఒత్తిడికి లోనౌతున్నారు.” ఫౌండేషన్‌ తరపున మాట్లాడుతున్న ఎలైసా ఫ్రీమెన్‌, “చాలామంది స్త్రీలు తమ గురించి కన్నా తమ భర్తలను గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు” అని ముగించారు. నివేదిక ప్రకారం, “హృద్రోగం, స్ట్రోక్‌ స్త్రీల మరణాల్లో 40 శాతం మరణాలకు కారణం, అంటే సంవత్సరానికి 41,000 కంటే ఎక్కువ మరణాలు.”

కలిసి తినడం

అనేక దేశాల్లో, తమ పిల్లలు తమతోపాటు తినడం లేదనీ, ఫాస్ట్‌ ఫుడ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారనీ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కానీ అందుకు ఫ్రాన్స్‌ మినహాయింపే. లా క్ర్వాక్స్‌ అనే ఫ్రెంచ్‌ వార్తాపత్రిక చెప్తున్నదాని ప్రకారం, ఇటీవల నిర్వహించబడిన ఒక అధ్యయనం, ఫ్రాన్స్‌లో 84 శాతం కుటుంబాలు వారి రాత్రి భోజనాన్ని కలిసి తింటారు అని బయల్పరచింది. వాస్తవానికి, కుటుంబం కలిసి భోజనం చేసే సమయంలో వాతావరణం నిర్మాణాత్మకంగా ఉంటుందని, 12 నుండి 19 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 95 శాతం మంది భావించారని ఆ అధ్యయనం కనుగొన్నది. క్రమంగా కుటుంబంతో కలిసి భోజనం చేయాల్సిన ప్రాముఖ్యాన్ని నిపుణులు నొక్కితెల్పుతున్నారు. “భోజన సమయం కేవలం ఆహారం తీసుకొనే సమయంగానే కాదు కానీ భావాలు పంచుకొనే సమయంగా కూడా ఉండాలి” అని ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో పనిచేసే డా. ఫ్రాంస్వా బోడ్యా నొక్కి తెల్పారు.

ప్రాణాంతకమైన కలరా పునరాగమనం

ఫిబ్రవరిలో ప్రాణాంతకమైన కలరా పునరాగమనం మూలంగా జాంబియాలోని లుసాకా సిటీ కౌన్సిల్‌, “వీధుల్లో అన్ని రకాలైన తాజా ఆహారపదార్థాల అమ్మకంపై నిషేధాన్ని విధించింది” అని టైమ్స్‌ ఆఫ్‌ జాంబియా నివేదించింది. అదనంగా, “రాజధాని నగరంలో కలరా వల్ల సంభవించిన మరణాల సంఖ్య 42కి చేరుకొనేసరికి, 24 గంటల నిఘాను” హోటల్స్‌, రెస్టారెంట్‌లపై విధించారు అని ఆ నివేదిక తెలియజేస్తుంది. అతిసార వ్యాధి “దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెరగడం పట్ల” ఆరోగ్యసంబంధ అధికారులు ఆందోళనను వ్యక్తం చేశారు. సమస్యను ఎదుర్కోవడానికి, హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ అధికారులు, చెత్తను ఎత్తే వాళ్ళను ఎక్కువమందిని తీసుకోవడం, భూగర్భ జలంతో చాలా సులభంగా కలుషితమయ్యే లోతులేని బావుల్లో క్లోరిన్‌ వేయడం వంటివి చేయడం ద్వారా కలరా నిరోధక ఉద్యమాన్ని చేపట్టారు. లుసాకా సిటీ కౌన్సిల్‌ వాగ్దూత అయిన డానియేల్‌ ఎమ్‌సోకా, “మా లక్ష్యం కలరా మహమ్మారిని రూపుమాపడమే” అని తెల్పారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి