ప్రపంచ పరిశీలన
నీటి సమస్య
“ఏ చర్యా తీసుకోకపోతే, 2,025 సంవత్సరంరాక ముందే మానవజాతిలో మూడింట రెండొంతులమందికి త్రాగడానికి నీటిచుక్క దొరకదు” అని లెక్స్‌ప్రెస్ అనే ఫ్రెంచ్ పత్రిక ప్రకటిస్తోంది. వార్తాపత్రిక లి ఫిగరో ఇలా సూచిస్తోంది: “ప్రపంచ జనాభాలో నాల్గోవంతు మందికి త్రాగేనీరు నేరుగా అందుబాటులో లేదు.” ఈ నీటి సమస్య విషయమై ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ 1998 మార్చిలో పారిస్‌నందు ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. ఫ్రాన్స్ అధ్యక్షునితోపాటుగా 84 దేశాలనుండి వచ్చిన 200కన్నా ఎక్కువమంది ప్రతినిధులు, ప్రపంచ నీటి సరఫరాను కాపాడేందుకుగల మార్గాల్ని గురించి చర్చించారు. ఉన్నతపర్చబడిన సమస్యల్లో ఒకటేమిటంటే, వ్యవసాయ సంబంధమైన నీటి పారుదల వ్యవస్థల నిర్వహణా లోపాన్నిబట్టీ, నీటి పైపులు కారుతుండడాన్నిబట్టీ నీరు తరచుగా వృథా అవుతుండడమే. నీరు మానవునికి వారసత్వంగా లభించిన సమష్టి సంపద కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తగువిధంగా వినియోగించాల్సి ఉందని ఫ్రెంచ్ అధ్యక్షుడైన జాక్ షిరాక్ నొక్కి చెప్పాడు.
పిల్లలు చిన్న చిన్న ఆనందాల్ని ఇష్టపడతారు
మీ పిల్లల దృష్టిలో మీరొక మంచి అమ్మగా ఎలా ఉండగలరు? విర్ల్‌పూల్ ఫౌండేషన్ అనే సంస్థ 6 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 1,000 మంది అమెరికన్ పిల్లలతో జరిపిన సర్వేలో, అనేకమంది తమ తల్లులతో కలిసి ప్రతీరోజూ చిన్న చిన్న పనుల్ని చేయడానికి, ముఖ్యంగా “కలిసి ఉండడానికి” ఇష్టాన్ని చూపించారు. అమ్మతో కలిసి పిల్లలు చేయాలని ఇష్టపడే కార్యక్రమం, “రాత్రి భోజనాన్ని కలిసి తినడమే.” వాళ్లిష్టపడే రెండో విషయం, “కలిసి తినడానికి బయటకు వెళ్లడం,” “షాపింగ్‌కి కలిసి వెళ్లడం.” దాని తర్వాత వాళ్లిష్టపడే మూడో విషయం, “కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం.” తమ తల్లులకు కృతజ్ఞతలు తెలియజేసే మార్గాల్లో మొదటగా ఎంచుకునే మార్గం కూడా సరళమైనదే. అతి తరచుగా మా అమ్మలను “ఆలింగనం చేసుకొని, ముద్దుపెట్టుకోవడం” ద్వారా తెలియజేస్తామని 70 శాతం మంది తెలియజేశారు. వారి తర్వాతి మార్గాలు ఏమిటంటే “ఐ లవ్ యు,” “థాంక్యూ” అని చెప్పడమే.
గోవుల రాజభోగం
టైర్లను రీసైకిలింగ్ చేసినప్పుడు వచ్చిన రబ్బరు ముక్కల రద్దుతో చేసిన పరుపులు, డైరీ ఫామ్‌లలో కనబడుతున్నాయని ది గ్లోబ్ అండ్ మెయిల్ కెనడా వార్తాపత్రిక రిపోర్టు చేస్తోంది. రెండంగుళాల మందమున్న పరుపులు, గోవులు ఎక్కువకాలంపాటు పాలిచ్చేలా చేయవచ్చునని అనుకుంటున్నారు. ఆ నివేదిక ప్రకారంగా, “డైరీ గోవులు తమ జీవితంలో ఎక్కువ భాగం కాంక్రీటు నేల మీదే గడుపుతాయి,” దాని మూలంగా వాటి “గిట్టల్లో వాపు పెరిగి, కాళ్లకు హాని” కల్గుతుంది. ఆ పరుపులు పశువులకున్న గిట్టల సమస్యల్నీ, కాళ్ల సమస్యల్నీ తగ్గించడం మాత్రమేగాక, అవి విశ్రాంతి తీసుకోవడానికి నేలపైకి ఒరుగుతుండగా వాటి మోకాళ్లకు కుషన్‌లా ఉంటాయి. పచ్చిక బయలులో విశ్రమిస్తున్నటువంటి భావనను గోవుల్లో కలగజేయడమే దాని వెనుకనున్న ఆంతర్యమని పరుపుల ఉత్పత్తిదారుడు ఒకరు చెబుతున్నారు.
స్పానిష్ పిల్లలు, టీవీ
ఐక్యరాజ్య సమితికి చెందిన పిల్లల నిధి స్పానిష్ కమిటీకి సంబంధించిన కార్లొస్ మారియా బ్రూ చెప్పినదాని ప్రకారంగా, స్పెయిన్‌లోని పిల్లలు తమకు పదేళ్ల వయస్సు వచ్చేసరికి టీవీలో 10,000 మారణ కాండలనూ, 1,00,000 కోపోద్రేక దాడులనూ చూడగలరని యూరప్ ప్రెస్ రిపోర్టు చేస్తోంది. అంతేగాక, 4 నుండి 12 ఏళ్ల ప్రాయం మధ్యనున్న స్పానిష్ పిల్లల్లో మూడొంతులకన్నా ఎక్కువమంది టీవీని రోజుకు కనీసం రెండున్నర గంటలపాటు చూస్తారనీ, దాదాపు ఒకవంతు మంది పిల్లలు రోజుకి నాలుగు గంటలపాటు చూస్తారనీ ప్రొఫెసర్ లూయిస్ మీగల్ మార్టిన్జ్ పేర్కొన్నారు. సగటున, “పిల్లలు ఒక సంవత్సరానికి 937 గంటలు టీవీ ముందు గడుపుతారు అంటే, వాళ్లు ప్రతీ సంవత్సరం స్కూలులో గడిపే 900 గంటలకన్నా ఎక్కువ సేపన్నమాట” అని ఆ రిపోర్టు చెబుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్సస్ ఆఫ్ కంప్లూటెన్షియన్ యూనివర్శిటీకి చెందిన రికార్డో పారాస్ ఆత్‌నార్ ప్రకారంగా, టీవీ హింసనేది సమాజంలోని హింసకు దోహదపడవచ్చు, అది హింసకు దోహదపడే సామాజిక కారణాల కలయికల్లో ఒకటి.
స్త్రీలు, హృద్రోగాలు
బ్రెజిల్‌లో హృద్రోగం, 1960ల వరకూ మగవాళ్ల ఆరోగ్య సమస్యగానే ఉండేదని వేజా పత్రిక నివేదిస్తోంది. అయితే, మహిళలు శ్రామికశక్తిలో పాలుపంచుకున్నప్పుడు పరిస్థితులు మారనారంభించాయి. పురుషుల్లానే స్త్రీలూ పని సంబంధమైన “ఒత్తిడికీ, ధూమపానానికీ, ఫాస్ట్‌ఫుడ్‌లకూ” అలవాటుపడ్డప్పుడు, అనేకమంది స్త్రీలకు హృద్రోగ సమస్యలు తలెత్తాయి. హృద్రోగ సమస్యలను నిరోధించే హార్మోనుల కాపుదల స్త్రీలకు కొంతమేరకు ఉందని కొందరు విశ్వసిస్తున్నా, “35 ఏళ్లు దాటిన తర్వాత, హార్మోన్ల కాపుదల తగ్గిపోతుంది, దానితో స్త్రీలు మగవాళ్లలానే అపాయానికి గురయ్యే స్థితిలో ఉంటారు” అని ఆ పత్రిక చెబుతోంది. 1995లో, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ల మూలంగా చనిపోయిన స్త్రీల మొత్తం సంఖ్య కన్నా గుండెపోటు మూలంగా చనిపోయిన స్త్రీల సంఖ్య బ్రెజిల్‌లో రెట్టింపు అయ్యింది.
బొలివియాలో కుటుంబ విచ్ఛిన్నతి
70కన్నా ఎక్కువ శాతంమంది బొలివియన్లు బీదరికంలో మగ్గిపోతున్నారని బొలివియన్ టైమ్స్ నివేదిస్తోంది. తత్ఫలితంగా, అనేకమంది పిల్లలు “క్రూరత్వానికి ఆలవాలంకాగల వీధుల్లో జీవించేందుకు, ముక్కచెక్కలైపోయిన తమ కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు.” అక్కడ వాళ్లకు కొకైన్ అలాగే పెయింట్ థిన్నర్, జిగురు వంటి ఆఘ్రాణించే పదార్థాలు పరిచయం చేయబడుతున్నాయి. బొలివియాలో వినియోగించబడే మాదకద్రవ్యాల్లో 88 శాతం 5 నుండి 24 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న యువతే ఉపయోగిస్తోందని అంచనావేయబడింది. ఆ విధంగా, చట్టవిరుద్ధ మందుల వినియోగం గత పదిహేనేళ్లలో దాదాపు 150 శాతంకన్నా ఎక్కువ పెరిగింది. టైమ్స్ పత్రిక ప్రకారంగా, “ఇలా పెరిగిపోవడానికి గల మూలకారణం, సాంప్రదాయబద్ధమైన కుటుంబ విధానంలో వచ్చిన విచ్ఛిన్నతేనని అనేకమంది పరిగణిస్తున్నారు.”
కొనుగోలుదార్లను ప్రభావితం చేస్తున్న సంగీతం
వైన్ కొనుగోలుదార్లు చేసే సెలక్షన్లను నేపథ్య సంగీతం ప్రభావితం చేయగలదని యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన సైకాలజిస్టుల బృందం ఇంగ్లాండ్‌లో కనుగొంది. “ఫ్రెంచ్ అకార్డియన్ సంగీతాన్ని ప్లే చేసినప్పుడు, ఫ్రెంచ్ వైన్ జర్మన్ వైన్‌కన్నా ఎక్కువగా అమ్ముడుపోయింది, అంటే ఒక జర్మన్ వైన్ బాటిల్ అమ్ముడుపోతే ఐదు ఫ్రెంచ్ వైన్ బాటిళ్లు అమ్ముడు పోయాయి, అయితే జర్మన్ బీర్‌హాల్ సంగీతాన్ని విన్పించగా, ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్ అమ్ముడుపోతే రెండు జర్మన్ వైన్ బాటిళ్లు అమ్ముడుపోయాయని” నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక చెబుతోంది. ఆసక్తిదాయకంగా, “తాము తీసుకునే నిర్ణయం విషయంలో సంగీతం ఒక పాత్రను వహించింది” అన్న విషయాన్ని కొద్దిమంది కొనుగోలుదార్లు మాత్రమే గ్రహించారని పరిశోధకుల్లో ఒకరు చెబుతున్నారు.
వంటచేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1990 నుండి 1994 వరకూ, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో సమ్నర్ రెడ్‌స్టోన్ సెంటర్‌నందు చేరిన అగ్నిప్రమాదాలకు గురైన స్త్రీ బాధితులు మరణించడానికి తరచూ కారణం, వంట వండుతున్నప్పుడు బట్టలకు నిప్పంటుకోవడమేనని టఫ్ట్స్ యూనివర్శిటీ & న్యూట్రిషన్ లెటర్ చెబుతుంది. అగ్నిప్రమాదాలకు గురైనవారు, తరచుగా తమ 60లలో లేదా అంతకన్నా పెద్ద వయస్సులో ఉండి, అలాగే టీ గిన్నెను స్టవ్‌మీదనుండి దించుతుండగా తాము వేసుకున్న వస్త్రాలకున్న చేతులు స్టవ్‌లో పడేంత లూజుగా దుస్తులను ధరించిన స్త్రీలు. ఈ క్రింది సలహాలు, తీవ్రమైన ప్రమాదాలు జరగకుండా అరికట్టేలా ప్రజలకు సహాయపడతాయి. వంట వండుతున్నప్పుడు, (1) స్నానపు దుస్తుల్ని వేసుకోవద్దు లేదా వదులుగా ఉండే దుస్తుల్ని వేసుకోవద్దు, (2) స్టవ్‌పై నుండి పాత్రల్నిగానీ, మూకుడుల్నిగానీ దించేటప్పుడు నిప్పంటుకునే అవకాశాల్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు ఫ్రంట్ బర్నర్‌ను ఉపయోగించండి, (3) ఫైర్ రెసిస్టెంట్ దుస్తుల్ని వేసుకోండి.
ప్రేమ అభివ్యక్తీకరణా?
“యువకుల విషయంలో ప్రేమా, లైంగికంగా అందుబాటులో ఉండడమూ రెంటింటికీ సన్నిహిత సంబంధంవుంది, యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలు లైంగిక సంపర్కానికి ఒప్పుకోకపోతే, వాళ్లు బహుశా దెబ్బలు తినాల్సిందే” అని విట్నెస్ ఎకో అనే దక్షిణ ఆఫ్రికా వార్తాపత్రిక అనుబంధంలో ఒక రిపోర్టు చెబుతోంది. “తమతో లైంగిక సంపర్కం పెట్టుకునేలా అమ్మాయిలపై ఒత్తిడి తీసుకురావడానికి తరచూ హింసను ఉపయోగిస్తూ, పురుషులు సంబంధాల్ని అదుపుచేస్తారు” అని కేప్ టౌన్‌లోని టౌన్ షిప్‌నందున్న టీనేజ్ పిల్లల మధ్య జరిపిన పరిశోధన బయల్పర్చింది. ఇతర పురుషులతో మాట్లాడినందుకు 60 శాతం మంది అమ్మాయిల్ని వాళ్ల పార్టనర్లు కొట్టారని ఒక అధ్యయనం చూపించింది. “భౌతిక దాడి సర్వసాధారణమైపోయింది, వారి స్నేహితులైన అనేకమంది అమ్మాయిలు ఆ దాడిని ప్రేమకొక అభివ్యక్తీకరణగా చూస్తారు.”