ప్రపంచ పరిశీలన
వ్యవసాయ ఉత్పత్తుల పోషక విలువలు తగ్గాయా?
భూమి సారం కోల్పోవడం ఫలితంగా ఈ రోజుల్లో పండ్లు, కూరగాయల్లో పోషక విలువలు తగ్గిపోయాయా? తగ్గలేదు అన్నది భూశాస్త్రవేత్తల జవాబు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ వెల్‌నెస్ లెటర్ ఇలా చెబుతుంది: “మొక్కలు తమంతట తామే విటమిన్లను ఉత్పత్తి చేసుకుంటాయి.” అందుకని, నేలలో తగినన్ని ఖనిజాలు లేకపోతే, మొక్కలు సరిగ్గా పెరగవు. మొక్కల్లో పూత రాకపోవచ్చు, లేదా పీలగామారి తర్వాత చచ్చిపోవచ్చు. ఇలాంటివి జరగకుండా నివారించడానికి, రైతులు రసాయన ఎరువులను ఉపయోగిస్తూ ఖనిజాలను తిరిగి భూమిలోకి భర్తీచేస్తున్నారు. వెల్‌నెస్ లెటర్ ప్రకారం: “మీరు కొనే పండ్లు, కూరగాయలు తాజాగా కన్పిస్తే, వాటిలో ఉండవల్సిన పోషకాలు వాటిలో ఉన్నాయని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.”
నేరము, జాతివాదం
తూర్పు యూరప్, బాల్కన్ దేశాలు, ప్రాముఖ్యంగా అల్బేనియా నుండి వచ్చిన శరణార్థుల మూలానా వలస వచ్చినవారి మూలానా గ్రీస్‌లో ఇటీవల నేరం పెరిగిందని కొంతమంది నింద వేస్తారు. ఆ దేశంలో విదేశీయులకు వ్యతిరేకంగా ఒక రకమైన “విదేశీద్వేషం, చాలా తరచుగా జాతివాదంతో కూడిన ఉన్మాదం” ఏర్పడడానికి నేరంలో ఈ రకమైన పెరుగుదల కారణమైందని రికార్డోస్ సోమరిటీస్ అనే విలేఖరి టో వీమ అనే వార్తాపత్రికలో నివేదించాడు. అలా అయినప్పటికీ, గ్రీకులు చేసిన నేరాలకన్నా, విదేశీయులు చేసినవి ఎక్కువ ఏమీ కాదు. ఉదాహరణకి, నివేదికలు తెలియపర్చేదేమంటే, “100లో 96 నేరాలు [గ్రీకులే] జరిపిస్తున్నారు” అని వార్తాపత్రిక నివేదిస్తుంది. “ఈ నేరాలకు ఆర్థిక, సాంఘిక పరిస్థితులు కారణాలు” గానీ, “జాతివాదం కాదు” అని సోమరిటీస్ ప్రకటించాడు. “ఒక క్రమమైన పద్ధతిలో విదేశీ ద్వేషాన్నీ, జాతివాదాన్నీ పెంపొదిస్తున్నాయని” ఈ మాధ్యమాలు గ్రీసులోని నేరాలను పక్షపాతంతో నివేదిస్తున్నాయని ఈయన వార్తా మాధ్యమాలను నిందిస్తున్నాడు.
చైనాలో తిరిగి కన్పించిన అరుదైన లేడి
చైనా టుడే ప్రకారం, “50 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని భావించబడిన టిబెట్ ప్రాంతపు ఎర్ర లేడి తిరిగి టిబెట్ స్వతంత్ర పరిపాలక ప్రాంతములోని షాన్నాన్ ప్రిఫెక్చర్‌లో కన్పించింది.” సంవత్సరాలుగా వేటగాళ్ళు అనేక ఎర్ర లేళ్ళను వాటి విలువైన కొమ్ముల కోసం చంపడం వల్ల వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. వీటి ఎత్తు 1.2 మీటర్లు మరియు 110 కిలోల బరువు ఉంటుంది. యుద్ధం మరియు వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల వల్ల కూడా ఎర్ర లేళ్ళు క్షీణించాయి. ఈ అందమైన లేళ్లలో 200 కంటే తక్కువే ఉనికిలో ఉన్నాయని అంచనా. వీటిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చారు.
గంగా నది దగ్గర పండుగ
1998 ఏప్రిల్‌లో కుంభమేళా—అంటే కుండల పండుగ ముగింపుకు వస్తుండగా లక్షలాది మంది హిందువులు గంగలో స్నానాలు చేశారు. మూణ్ణెల్లపాటు జరిగే ఈ కుంభమేళా, అమరత్వం కోసం హిందువులు దీనిని పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ భారతదేశంలోని నాలుగు నగరాల్లో ఒక నగరం తర్వాత మరో నగరంలో మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పురాణ కథల ప్రకారం దేవతలు రాక్షసులు అమరత్వాన్ని ఇచ్చే అమృతం కోసం స్వర్గంలో యుద్ధం చేస్తున్నప్పుడు భూమిమీద అది ఈ నగరాల్లో పడింది. గతంలో, భారతదేశం యొక్క పవిత్ర జలాల్లో స్నానాలు చేయడానికి జరిగిన తొక్కిసలాటలలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
“ప్రపంచానికి నిప్పు అంటిన సంవత్సరం”
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ యొక్క అంతర్జాతీయ అటవీ కార్యక్రమానికి ప్రధాని అయిన జాన్-పాల్ జాన్‌రనో “1997ని ప్రపంచానికి నిప్పు అంటిన సంవత్సరంగా గుర్తుంచుకుంటాము” అని అన్నాడు. అంటార్కిటికా ఖండం తప్పించి ప్రతి ఖండంలోను అగ్నిజ్వాలలు చెలరేగాయి. ఉదాహరణకు, స్విట్జర్లాండ్ అంతటి పరిమాణంలోని అడవులు ఇండోనేషియాలోను బ్రెజిల్‌లోను అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనికి కారణాలుగా వ్యవసాయం నిమిత్తం అడవుల్ని ఉద్దేశపూర్వకంగా కొట్టివేయడం మొదలుకొని అనావృష్టి వరకు పేర్కొనబడ్డాయి. ఈ అనావృష్టి ఎల్ నీన్యో ద్వారా ఏర్పడిన విపరీత వాతావరణ పరిస్థితుల ఫలితం అని భావించబడుతుంది. సహజ ఇంధనాలను కాల్చడం మూలంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మోతాదులు పెరిగిపోవడం గాలి కాలుష్యానికి తోడయ్యింది. తద్వారా గ్రహం వేడెక్కే ప్రమాదాన్ని పెంచిందని లండన్‌లోని ద ఇండిపెండెంట్ నివేదిస్తుంది. మిస్టర్ జాన్‌రనో ఇలా హెచ్చరిస్తున్నాడు: “వినాశనకరమైన విషవలయాన్ని మనమే సృష్టించుకుంటున్నాము, పెరుగుతున్న అగ్నిజ్వాలలు వాతావరణంలోని మార్పుల కారణంగాను, అంతేగాక ఆ మార్పులు సంభవించడానికి దోహదం కూడా చేస్తున్నాయి.”
అధిక కాల్షియం అవసరం
“యౌవనులైన పిల్లల ఎముకలు పెరుగుతుంటాయి కాబట్టి వారికి ఎక్కువ కాల్షియం అవసరం” అని గెజూయింట్‌హైట్ ఇన్ వోర్ట్ అంట్ బిల్ట్ అనే ఆరోగ్యసంబంధమైన వార్తాలేఖ హెచ్చరిస్తుంది. ప్రతిరోజు 1,200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలని సిఫారసు చేయబడినప్పటికీ, జర్మనీలో 15 నుండి 19 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల్లో 56 శాతం మంది, అబ్బాయిల్లో 75 శాతం మంది మాత్రమే ఆ మోతాదును తీసుకుంటున్నారు. యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ ఆస్టియోపోరోసిస్‌కు చెందిన మేరీ ఫ్రేజర్ “యూరప్ అంతటిలో బాలికలకు ఇచ్చే కాల్షియం సరిపోవడం లేదు” అని చెబుతుంది. ఈ కొరత ప్రభావం చాలా కాలంపాటు కనిపించకపోయినా, దానివల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనమయ్యే పరిస్థితి) ఏర్పడగలదు. “జున్ను, పాలు, పెరుగు, నువ్వులు, అమరాంథ్ గింజలు, చిక్కుళ్లు, కూరగాయలు, పప్పులు, చేపలు కాల్షియం అధికంగా ఉన్న ఆహారపదార్థాలు” అని ఆ శీర్షిక తెలియజేస్తుంది.
మృత్యువుని స్వల్పం చేయడం
జోర్నల్ డో బ్రేజిల్ వివరిస్తున్న ప్రకారం “మృత్యువు అతి సామాన్యమైన విషయం అని ఎంచకుండా ఉండాలంటే సినిమాల ద్వారా, టీవీ ద్వారా ప్రోత్సహించబడుతున్న హీరోయిజాన్ని తల్లిదండ్రులు, టీచర్లు నిరుత్సాహపర్చాలి.” రియో డి జెనీరోలో జరిపిన అధ్యయనం తెల్పుతున్న ప్రకారం, 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు 10 శాతం నేరాలకు పాల్పడుతున్నారు. “తుపాకీలు పట్టుకొని, దాడిచేసి, వికలాంగుల్ని చేసి, స్కూల్లో తోటివారిని చంపి, చివరికి పిల్లలపై లైంగిక అవినీతి చర్యలకు పాల్పడేది వాళ్ళే” అని ఆ శీర్షిక నివేదిస్తుంది. “ఇప్పుడు మనకున్న సంస్కృతి—పోటీని పురికొల్పి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుండి ఏదైనా పొందాలంటే వాడ్ని చంపాల్సిందేనన్న సందేశాన్ని సినిమాల్లో చూపిస్తున్న ఈ సంస్కృతిని బట్టి ఆ పిల్లలు మానసిక కలవరానికి గురౌతారు” అని ఒక సైకియాట్రిస్ట్ ఆల్ఫ్రడో కేస్ట్రో నేటో చెబుతున్నాడు. తుపాకీలకు బదులుగా, విద్యాసంబంధమైన ఆట వస్తువులను సూచించాలని విద్యావేత్త అయిన జోసెఫా పెక్ చెబుతూ, “ఒక హీరో ప్రతీ ఒక్కరిని చంపడం మూర్ఖమైన పని అనీ, అది అవాస్తవికమైనదనీ, ఆయుధాలు స్టేటస్ సింబల్స్ కాదని లేదా శక్తికి చిహ్నాలు కావుగానీ అవి మనుషులను చంపేంత ప్రమాదకరమైనవనీ” పిల్లలకు నేర్పించడం ప్రాముఖ్యం అని కూడా చెబుతుంది.
రోగుల్ని దోచుకోవడం
జర్మన్ ఆసుపత్రుల్లో దొంగల బెడద ఎక్కువవుతూ ఉంది. “కొలోన్ నందలి యూనివర్శిటీ ఆసుపత్రులలోనే 300 దొంగతనాలు రిపోర్ట్ చేయబడ్డాయి” అని ఎమ్స్‌డెట్టెనర్ టేజ్‌బ్లెట్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. “చేతిలో పూలగుత్తి, పెదవులపై చిరునవ్వు—ఈ రెండూ ఉంటే చాలు దోపిడీ సొమ్ము చేతిలో పడ్డట్టే. రోగుల్ని దర్శించడానికి వచ్చేవారిగా నటించే వీరు, ఆసుపత్రి పడకల నుండి మొదలుకొని షెల్ఫుల వరకు వారిదే రాజ్యం. ప్రాముఖ్యంగా వృద్ధ రోగులు ఈ దొంగల పనిని సులభతరం చేస్తున్నారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒక వృద్ధుడు ఆసుపత్రి పడకమీది దిండు క్రింద కొన్ని వేల డ్యూష్ మార్క్‌లు పెట్టుకోవడం కనిపించింది. సందర్శించడానికి కచ్చితమైన సమయాలు లేకపోవడం దొంగలకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది, అంతేకాదు దాదాపు అందరూ ఏ అడ్డూ లేకుండా ఆసుపత్రిలోనికి ప్రవేశించవచ్చు. అందుకని, డబ్బునుగానీ విలువైన వస్తువుల్నిగానీ ఆసుపత్రి సేఫ్‌లలో పెట్టుకుని తాళం వేయమని లేదా జాగ్రత్తచేయడానికి ఎవరికైనా ఇవ్వమని రోగుల్ని హెచ్చరించారు.
చెవి గుర్తులు
ఈ మధ్య లండన్‌లో, దొంగను పట్టుకోవడానికి అతని యొక్క చెవే అతన్ని పట్టి ఇచ్చింది. ఎలా? ఇతను నేరం చేసే ప్రదేశంలో వ్రేళ్ల గుర్తులు వదలకుండా ఎంతో జాగ్రత్త పడే ఇతనికి దొంగతనం చేయడానికి ముందు ఇంటిలో ఎవరైనా ఉన్నారేమో అని, కిటికీ దగ్గర లేక తాళం తీసే రంధ్రం దగ్గర చెవిని పెట్టి పసిగట్టే అలవాటు ఉంది. ఆ విధంగా అతని చెవి గుర్తులు ఆ భాగంలో ఉండేవి. “వ్రేలి గుర్తులు లాగానే చెవి గుర్తులు కూడా విభిన్నమైనవి” అని స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గో యూనివర్శిటీలోని వైద్యన్యాయశాస్త్రంలో పాథాలజిస్ట్ అయిన ప్రొఫెసర్ పీటర్ వానేసిస్ తెలిపాడు. అయితే, వ్రేలి గుర్తుల్లా కాక చెవులు, జుట్టు గోళ్లలా వయస్సు పెరిగే కొలదీ పెరుగుతూ ఉంటాయని లండన్‌లోని ద డైలీ టెలిగ్రాఫ్ రిపోర్టు చేసింది. మన చెవుల సైజు ఎంతైనప్పటికీ అవి విభిన్నమైనవని పోలీసులకు తెలుసు—ఈ దొంగకు లాగానే. బ్రిటన్‌లో చెవిగుర్తు ఆధారంగా దోషియని నిరూపించబడిన మొదటి వ్యక్తి ఈయనే, ఈయన ఐదు నేరాలను ఒప్పుకున్నాడు.