ప్రపంచ పరిశీలన
గ్రీస్‌లో మత స్వాతంత్ర్యం పునఃపరిగణించబడింది
“ఇటీవల, [గ్రీక్] ప్రభుత్వం మత స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించిన వివాదాలను విచారిస్తున్నట్లు, అలాగే పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ సవరణ విషయాన్ని కూడా పరిగణిస్తున్నట్లు కనిపిస్తుంది” అని టు వీమా అనే ఏథెన్స్ వార్తాపత్రిక నివేదిస్తుంది. “మత స్వాతంత్ర్య వివాదాలకు సంబంధించిన నియమచట్రాన్ని, మతమార్పిడిని నేరంగా చేసే మెటాక్సాస్ నియంత చట్టాలనూ, అల్పసంఖ్యాక వర్గాలైన నాన్ ఆర్థడాక్స్ మత విభాగాలు చర్చీలను, మీటింగ్ స్థలాలను స్థాపించుకోవడానికి అనుమతించే షరతులనూ పునఃపరిశీలించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోనుండే ఒక అనధికార కమిటీ రూపొందించబడింది” అని కూడా అది చెబుతుంది. గ్రీస్‌లోని యెహోవాసాక్షులు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎదుట అనేక లీగల్ కేసులను తీసురావడమే ఈ సంచలనానికి ముఖ్య కారణమనికూడా ఆ నివేదిక చెప్పుకుపోతుంది.
ప్రపంచంలో అత్యంత పొడవు జుట్టు
ఉత్తర థాయ్‌లాండ్‌లో ఉండే హ్మోంగ్ తెగకు చెందిన హూ సాటీయో అనే 85 ఏండ్ల వ్యక్తి దాదాపు 70 సంవత్సరాలుగా తన జుట్టును కత్తిరించుకోనే లేదు. “నాకు దాదాపు 18 ఏండ్లున్నప్పుడు జుట్టు కత్తిరించుకున్నాను. అదీ అనారోగ్యంగా ఉన్నప్పుడు” అని హూ అంటున్నారు. ఆయన జుట్టు 17 అడుగుల 2 అంగుళాలు అని గిన్నెస్ బుక్ ఆఫ్ వేల్డ్ రికార్డ్స్ కోసం నియమించబడిన న్యాయనిర్ణేత ఇటీవల కొలిచి చెప్పారనీ, ఆయన జుట్టు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు అని అసోసియేటెడ్ ప్రెస్ వివరిస్తుంది. హూ సంవత్సరానికొకసారి తలస్నానం చేసి జుట్టును తడిక మీద వేసి ఆరబెట్టుకుంటాడు. 87 ఏండ్లున్న ఈ అనే పేరుగల ఆయన అన్నయ్య చివరిసారిగా 1957లో తన జుట్టు కత్తిరించుకున్నాడు. ఆయనే హూ దరిదాపుల రాగల సమవుజ్జీ. 13 అడుగుల 8 అంగుళాల పొడవు జుట్టుతో మునుపు రికార్డు సంపాదించిన భారతీయ స్త్రీ జుట్టు కన్నా ఈ జుట్టే ఎక్కువ పొడవు. అంత పొడవైన వెండ్రుకలు ఉపకరిస్తాయని, ముఖ్యంగా థాయ్‌లాండ్‌లోని చల్లని పర్వత శిఖర ప్రాంతాల్లో ఉపకరిస్తాయని హూ భావిస్తాడు. “అది నాకు వెచ్చదనాన్నిస్తుంది” అని ఆయన అంటున్నాడు.
కుపోషణ పిల్లలను పొట్టనపెట్టుకుంటుంది
“కుపోషణ మరే మహామారికన్నా, ప్రకృతి విపత్తు కన్నా, లేదా యుద్ధం కన్నా ఎక్కువ మంది పిల్లలను పొట్టనపెట్టుకుంటుంది” అని ఫ్రెంచ్ దినపత్రికయైన ల మొండ్ నివేదిస్తుంది. కుపోషణ వల్ల, ప్రతి సంవత్సరం దాదాపు డెబ్భై లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని అంచనా. ఐక్య రాజ్య సమితి పిల్లల నిధి (యూనిసెఫ్) 1997 నివేదిక చూపించేదేమంటే, ప్రతి సంవత్సరం ఐదేండ్లలోపు చనిపోయే 120 లక్షల మంది పిల్లల్లో 55 శాతం మరణాలకు కారణం కుపోషణే. పిల్లలను చంపడమే కాక, అనేక శారీరక మరియు మానసిక వైకల్యాలకూ అలాగే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలకూ కుపోషణ బాధ్యత వహిస్తుంది. దక్షిణ ఆసియాలో, ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు, ఆఫ్రికాలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు కుపోషణ వల్ల బాధపడుతున్నారు. అయినప్పటికీ, ఈ సమస్య పారిశ్రామిక దేశాలను కూడా ఎక్కువగా బాధిస్తుంది. ఉదాహరణకు, అమెరికాలో, 12 ఏండ్ల వయస్సులోని ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు తనకు అవసరమైన పోషకాహారాన్ని పొందడం లేదు.
చంద్రునిపై నీళ్ళా?
చంద్రుని ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన నీళ్ళులాగా కనిపిస్తున్నదానిని లూనార్ ప్రోస్పెక్టర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ కనుగొందని ద న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తుంది. స్పేస్‌క్రాఫ్ట్ మీది ఇన్‌స్ట్రక్షన్‌లు హెడ్రోజన్ ఉనికిని సూచిస్తాయి. చంద్రుని మీద హైడ్రోజన్ కనిపించేది బహుశ నీటి మూలపదార్థాల రూపంలోనే అయ్యుంటుందని కూడా తలంచబడుతుంది. వదులుగా ఉన్న మట్టిలో మిళితమైన చిన్న మంచు స్ఫటికాల రూపంలో నీళ్ళు ఉంటాయని నమ్మబడుతుంది. అది రాళ్లుగల మట్టి యొక్క ఒక శాతాన్ని లేదా అంతకన్నా తక్కువ పరిమాణానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ నీళ్ళు మానవ కాలనీలను నిలబెట్టేందుకూ, చంద్రుని నుండి ఎగిరిన స్పేస్‌క్రాఫ్ట్‌కు ఇంధనంగా హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌ను ఇచ్చేందుకూ తోడ్పడగలవని కొందరు శాస్త్రజ్ఞులు ఇప్పుడే ప్రవచిస్తున్నారు. అక్కడ నీళ్ళున్నప్పటికీ, వాటిని అక్కడి నుండి తీయడం లాభసాటి కాదని ఇతరులు అనుకుంటున్నారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డా. బ్రూస్ మురే, చంద్రుని మీద నీళ్ళ కోసం త్రవ్వడం కన్నా, భూమి మీది నుండి నీళ్ళు తీసుకుపోవడమే ఖర్చు తక్కువ పని అని అంటున్నారు.
“ఆదర్శవంతమైన తక్కువ హానికరమైన మందా”?
చాక్లెట్‌కున్న ప్రేరేపణాత్మకమైన, డిప్రెషన్‌ను ఎదిరించే, లైంగిక కోరికలను ఉద్దీపింపజేసే గుణాలను గురించి వందల సంవత్సరాలుగా గొప్పగా చెప్పబడుతుంది. అయినప్పటికీ, ఇటీవలి పరిశోధన, నిజానికి, చాక్లెట్ “ఆతురతా పరిమాణాలను, మనశ్శాంతిని, లైంగిక ప్రవర్తనను” ప్రభావితం చేస్తుందని సూచించవచ్చు అని ల మొండ్ అనే ఫ్రెంచ్ వార్తాపత్రిక నివేదిస్తుంది. చాక్లెట్‌లో ఆంఫిటమైన్‌ల, “గమనార్హమైన ఆన్టీ-డిప్రెసంట్ ప్రత్యేకతలు”వున్న ఇతర పదార్థాల సాదృశ్యం గల పదార్థం ఉండడాన్ని శాస్త్రజ్ఞులు చూశారు. కానిబాస్ ఉత్పన్నం చేసే పరిమాణంలోనే “ఉద్రేకాలను, అనుభూతులను అధికం చేసే” న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన ఆనండమైడ్ కూడా అందులో ఉందని క్రొత్త పరిశోధన చూపిస్తుంది. దానికి చాక్లెట్‌లోని చిన్న మోతాదులో ఉన్న మత్తుపదార్థం తోడవ్వడం వల్ల, “చాక్లెట్ శారీరక మరియు మేధాశక్తికి సంబంధించిన క్రియాశీలతకు శక్తిని ఇస్తూ, ఏదో సుఖానుభూతినీ, ఏ సైడ్ ఎఫక్ట్‌లూ లేకుండా చాలా క్షేమంగా ఉన్నామన్న అనుభూతిని ఇస్తూ, తక్కువ స్థాయిలో వశీకరిస్తూ, ఆదర్శవంతమైన తక్కువ మోతాదులోని మత్తుమందు అని పిలువబడే అర్హతను చాక్లెట్ సంపాదించింది” అనే నిర్ధారణకు ఆ వార్తాపత్రిక వచ్చింది.
వెలకట్టలేనిదానికి వెలకట్టడం
పలు దేశాల్లోని పదమూడు మంది శాస్త్రజ్ఞులు ప్రకృతి సంపదకు వెలకట్టిన నివేదికను సమకూర్చాయి. భూమి ప్రతి హెక్టారులో చేసిన వివిధసేవలు తిరిగి జరిగేలా చేసేందుకు అయ్యే ఖర్చును అంచనా వేసేందుకు, ప్రచురించబడిన 100 కన్నా ఎక్కువ అధ్యయనాలపై శాస్త్రజ్ఞులు పనిచేశారు. (ఒక హెక్టారు దాదాపు 2.5 ఎకరాలకు సమానం.) ఉదాహరణకు, అమెరికాలో సమగ్ర పురోగతి కోసం ఉపయోగించబడిన ప్రతి హెక్టారు చిత్తడి నేలలో, “వరదనీటిని పీల్చుకునే శక్తి తగ్గడం, ప్రతి సంవత్సరం వరదవల్ల కలిగే నష్టాన్ని 3,300 నుండి 11,000 డాలర్ల వరకూ పెంచింది” అని ఒక అధ్యయనం సూచిస్తుంది అని సైన్స్ పత్రిక చెబుతుంది. అనేకులు ప్రకృతి సరుకులనూ, సేవలను తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ, ప్రతి సంవత్సరం వాటి విలువ డబ్బు రూపంలో 33,30,000 కోట్ల డాలర్లు—యావత్ ప్రపంచంలోని మొత్తం జాతీయోత్పత్తులకన్నా దాదాపు రెండు రెట్లు—అవుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
ప్రేమ ఎన్నటికీ పరాజితం కాదు
“తమ తల్లిదండ్రులతోనూ, ఉపాధ్యాయులతోనూ బలమైన భావోద్వేగ అనుబంధాలున్న కౌమారప్రాయంలోనివారు మత్తుమందులనూ, మద్యాన్నీ ఉపయోగించే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే, దౌర్జన్యంలో పాల్గొనే, లేదా చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం పెట్టుకునే అవకాశం చాలా తక్కువ” అని ద వాషింగ్‌టన్ పోస్ట్ నివేదిస్తుంది. మిన్నెసోటా యూనివర్సిటీలోని మరియు చాపెల్ హిల్‌లోని ఉత్తర కరోలినా యూనివర్సిటీలోని పరిశోధకులు, ఒక బిడ్డ, తల్లిదండ్రులు ఇరువురూ ఉన్న ఇంట్లో పెరుగుతున్నా, లేక ఒక్కరే ఉన్న ఇంట్లో పెరుగుతున్నా కూడా అది నిజం. బిడ్డ, తను ప్రేమించబడుతుందన్న అనుభూతిని, మెచ్చుకోబడుతుందన్న అనుభూతిని, తనను అర్థం చేసుకుంటున్నారన్న అనుభూతిని పొందడం ముఖ్యమైన సంగతి. “తమ పాత్ర తగ్గిపోతున్నట్లు తల్లిదండ్రులకు అనిపించినా కూడా, వాళ్ళు తమ పిల్లల కౌమార జీవితంలో చాలా బాగా ఇమిడి ఉండడంలో కొనసాగడం ప్రాముఖ్యం” అన్నది ఆ అధ్యయనం నొక్కి చెబుతున్న మరో కారకం అని పోస్ట్ చెబుతుంది.
దేవుడు లేని బైబిలు
దేవుడి గురించిన అన్ని సంప్రదింపులనూ వదిలేస్తూ, తిరగవ్రాసిన హెబ్రీలేఖనాల భాషాంతరాన్ని డెన్మార్క్‌వాడైన వైద్యుడు ప్రచురించాడు. దేవుడూ, విశ్వాసమూ అనేవి “గత కాల విషయాలు అనీ, మనలను కట్టిపడేయడమే అవి చేయగల్గిందనీ” డా. స్వెన్ లింగ్స్ నమ్ముతున్నారని డెన్మార్క్ వార్తాపత్రికయైన క్రిస్టలీట్ డౌబ్లత్ నివేదిస్తున్నారు. చాలా మంది అసంతోషాన్నీ, ఒంటరితనాన్నీ అనుభవిస్తున్నారనీ లింగ్స్ గమనించారు. “మనం యూదా క్రైస్తవ సంస్కృతిలో జీవిస్తున్నామనీ, మన సంతోష లేమికి యూదా క్రైస్తవ సంస్కృతి తప్పక బాధ్యత వహించాలి” అని లింగ్స్ అంటున్నారు. ఆ వార్తాపత్రిక అభిప్రాయం ప్రకారం, తన క్రొత్త బైబిలు అనువాదంతో, “మన సంస్కృతి పునాదులను కదిలించివేయాలి” అన్నదే లింగ్స్ లక్ష్యం. లింగ్స్ అనువాదమైన బైబిల్ వితౌట్ గాడ్‌లో, ఆదికాండము 3:12లో, “ఆదాము తనకు తాను ఇలా అనుకుంటాడు: ‘నాతో ఉన్న స్త్రీ ఆ వృక్షఫలం నాకిస్తే తిన్నాను’” అని చదువుతాం. కిస్టలీట్ డౌబ్లత్ “మంచు నుండి నీటిని తీసివేయడానికి ప్రయత్నించి, ఆ తర్వాత ఏమి మిగిలిందా అని చూసినట్లుగా లేదూ?” అని ప్రశ్నిస్తున్నారు.