యౌవనస్థులు ఇట్లడుగుదురు. . .
ఆయన నన్ను ప్రేమించకపోతే నేనేం చేయను?
“నాకు ఆందోళనగా ఉంది. నేనాయనను ప్రేమిస్తున్నాను. మరి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు తెలీదు. నేనేం చేయను? నేను తనను ప్రేమిస్తున్నానని ఆయనతో చెప్పేయనా? అమ్మో, నేను చెప్పలేను! అందరూ ఏమనుకుంటారు?—హూడ.a
లెబనన్‌కు చెందిన యౌవన హూడ ప్రేమించిన వ్యక్తి ఆమెను ప్రేమించలేదు. ఇది సర్వసాధారణమైన సమస్యే. జేన అనే మరొక యౌవనస్థురాలు కూడా అలాంటిదే అనుభవించింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ఆయన మా పొరుగింట్లో ఉండేవాడు గనుక నేను ఆయన్ను ప్రతిరోజూ చూసేదాన్ని. ఆయన ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాడు. నేను ఆయనను ప్రేమించడం ప్రారంభించాను.”
ఎవరినైనా ఇష్టపడటంలో తప్పేమీ లేదు, అయితే వివాహం చేసుకోవడానికి ఆ వ్యక్తి తగిన వాడైనంత మేరకూ, అందులో తప్పేమీ లేదు. (సామెతలు 5:15; 1 కొరింథీయులు 7:39) ఒక యౌవనస్థురాలు వివాహం చేసుకుని కుటుంబాన్ని కలిగి ఉండాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పూ లేదు. అయితే మీరు సరైన వ్యక్తినే ఎంచుకుని ప్రేమించినప్పటికీ, ఆయనకు మీ భావాలను గురించి తెలియకపోతే లేక ఆయన మీ పట్ల అలాంటి భావాలను కలిగిలేకపోతే అప్పుడేం చేయాలి?
ప్రేమరోగంలోని బాధ
హూడ వలెనే, మీరు కూడా ఒక భావోద్రేకపర తుపానులో చిక్కుకుని ఉన్నట్లు భావించవచ్చు. అత్యానంద భరితమైన క్షణాల తర్వాత వెంటనే విపరీతమైన దుఃఖం కలుగవచ్చు. “కొన్నిసార్లు నేను లోకంలో అందరికంటే ఆనందంగా ఉన్న అమ్మాయిని అనిపిస్తుంది, కొన్నిసార్లు లోకంలో నాకే ఎక్కువ దుఃఖం ఉందని అనిపిస్తుంది” అని జేన చెబుతోంది. మీరు మీ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు, దాన్ని మీరు తిరిగి పొందలేకపోతే అది చింతనూ, నిద్రలేమినీ, కృంగుదలను కూడా కలిగించవచ్చు.
“ఆశ నెరవేర్పు ఆలస్యమైతే హృదయం కృశిస్తుంది” అని బైబిలు సామెతలు 13:12 (పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం) నందు చెబుతోంది. ఆశలు అసలు నెరవేరకపోతే, అది అంతకంటే ఘోరంగా ఉంటుంది! మీరు ఆ వ్యక్తిని గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు, ఆయనను గురించిన చిన్న వార్త వినేందుకైనా తపిస్తుండవచ్చు. మీరు ఆయన అవధానాన్ని చూరగొనేందుకు మార్గాలను వెదుకుతుండవచ్చు లేక ఆయనతో కలిసి సమయం గడిపేందుకు పిచ్చి పిచ్చి కారణాలను వెదుకుతుండవచ్చు. మీరు ఆయన దరిదాపుల్లో ఉన్నప్పుడు, మీరు మామూలుగా ప్రవర్తించడం చాలా కష్టంగా ఉంటుండవచ్చు.
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి అప్పుడప్పుడూ మీ పైనే ప్రత్యేకంగా అవధానాన్ని నిలిపి, తర్వాత ఇతర సమయాల్లో ఆయనకు మీపైన ఎలాంటి ఆసక్తీ లేదన్నట్లు ప్రవర్తిస్తే, పరిస్థితి మరీ గందరగోళంగా మారవచ్చు. ఆయన ఎవరికైనా అవధానమిస్తున్నట్లు లేక ఇతరుల పట్ల మర్యాదగా గౌరవనీయంగా ప్రవర్తిస్తున్నట్లు మీరు గమనిస్తే, బహుశా మీలో అసూయా భావం తలెత్తవచ్చు. బైబిలు ఇలా చెబుతోంది: “క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము [“అసూయ,” NW] ఎదుట ఎవడు నిలువగలడు?”—సామెతలు 27:4.
హూడ ఇలా అంగీకరిస్తోంది: “నాకెంత తీవ్రమైన అసూయ కలిగిందంటే, నేను గనుక దాన్ని సరి చేసుకోకపోయి ఉంటే, నాకు పిచ్చి పట్టి ఉండేది.” మీపై మీకు అసహ్యం కూడా కలుగవచ్చు. హూడ ఇలా చెబుతోంది: “నన్ను ప్రేమించని వ్యక్తిని ప్రేమించినందుకూ, నన్ను నేను ఇలా హింసించుకుంటున్నందుకూ నేను నిందించుకున్నాను.”
పాశ్చాత్య దేశాల్లో ఒక యౌవనురాలు ఒక పురుషుని వద్దకు వెళ్లి తన భావాలను నిస్సంకోచంగా వ్యక్తం చేయగలిగినప్పటికీ, స్త్రీలంతా అలా చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చు. కొన్ని సంస్కృతుల్లో, ఒక అమ్మాయి అలా చొరవ తీసుకోవడం అనుచితమైన పనిగా లేక చివరకు విభ్రాంతికరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. మిమ్మల్ని ప్రేమించని వ్యక్తితో మీరు ప్రేమలో పడినప్పుడు మీరేమి చేయగలరు?
మీ భావాలను పరిశీలించుకోవడం
మొదట, మీ భావాలను ప్రశాంతంగా, సహేతుకంగా పరిశీలించుకునేందుకు ప్రయత్నించండి. బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు.” (సామెతలు 28:26) ఎందుకు? ఎందుకంటే చాలా తరచుగా మన మనస్సు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. (యిర్మీయా 17:9) మనం ప్రేమ అనుకునేది చివరకు మరింకేదో అని తేలుతుంది. “ఎవరైనా నాకు అవధానమివ్వాలనీ, ప్రేమ చూపాలని నేను కోరుకున్నాను. ఎవరైనా నన్ను ప్రేమించి, నాపట్ల శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుకున్నాను. చిన్నప్పటి నుండీ నాపట్ల ఎవరూ ప్రేమ చూపించలేదు. అది నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది” అని హూడ అంగీకరిస్తోంది. మీరు ప్రేమరహిత లేక దౌర్జన్యపూరిత కుటుంబ వాతావరణం నుండి వస్తే, మీరు ప్రేమా గుర్తింపుల కొరకు తపించిపోతుండవచ్చు. అయితే ప్రణయమే దానికి విరుగుడా?
విచారంగానూ ఒంటరిగానూ ఉన్నట్లు భావించేవారు తరచూ మంచి వివాహ జతలుగా ఉండలేరన్నది విషాదకరమైన విషయం. తాము దేని కొరకు తపించిపోతున్నామో, దాన్ని తాము వివాహ సంబంధంలో పొందగలమని అపేక్షిస్తూ వాళ్లు వివాహం చేసుకుంటారు. అయితే, నిజమైన సంతోషం ఇవ్వడం నుండి వస్తుంది గానీ పొందడం నుండి కాదు. (అపొస్తలుల కార్యములు 20:35) తన గురించి తాను మంచి అభిప్రాయాన్ని కలిగివుండే, అలాగే “తన సొంతకార్యములను మాత్రమేగాక యతరుల కార్యములను కూడ” చూసే స్త్రీయే మంచి వివాహ భాగస్వామిగా ఉండగలదు.—ఫిలిప్పీయులు 2:4.
మీరు వివాహం చేసుకోవాలని తపించిపోతూ ఉంటే, మగవారు మీపట్ల చూపించే ఏ కాస్త శ్రద్ధనుబట్టి అయినా మీరు సులభంగా అతిగా ప్రతిస్పందించగలరు. కొన్నిసార్లు ప్రణయం కొరకైన ఒక యౌవనస్థురాలి కోరిక ఆమె స్నేహితురాళ్ల ద్వారా, కుటుంబం ద్వారా పెంచి పోషించబడుతుంది. కొన్ని సమాజాల్లో ఒక అమ్మాయికి పెళ్లీడు రాగానే ఆమె వివాహం జరిగి తీరాలన్నట్లు భావిస్తారు. మధ్యప్రాచ్యంలో స్త్రీలు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఒక స్త్రీకి ముప్పైయ్యేళ్లు నిండినా ఆమె అవివాహితగానే ఉంటే, ఆమె కుటుంబసభ్యులు ఆమె గురించి తీవ్రంగా చింతించడం మొదలుపెడతారు.” కుటుంబ ప్రతిష్ఠ కూడా అందులో ఇమిడి వుంటుంది గనుక, ఒక తండ్రి తన కుమార్తెలకు వీలైనంత చిన్న వయస్సులోనే పెళ్లి చేసి పంపించాలని ప్రయత్నించవచ్చు.
అయినప్పటికీ, బైబిలు సూత్రాలు సాంప్రదాయంకంటే ప్రాముఖ్యమైనవి. ‘ఈడు మించిపోయేంత’ వరకూ ఆగమని లేఖనాలు యౌవనులను ప్రోత్సహిస్తున్నాయి. (1 కొరింథీయులు 7:36) కాబట్టి, మీ స్నేహితులూ లేక తలిదండ్రులూ మీరు వివాహం చేసుకోవాలని అనవసరమైన ఒత్తిడి తీసుకువస్తుంటే అప్పుడేమిటి? దైవభక్తిగల షూలమ్మీతి, ‘ప్రేమ దానంతట అది మేలుకొనేవరకు దాన్ని లేపవద్దనీ, పురికొల్పవద్దనీ’ తన తోటివారికి ఖండితంగా చెప్పేసింది. (పరమగీతము 2:7, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం) బహుశ ఆ విధంగా దృఢంగా చెప్పడం, ప్రాముఖ్యంగా మీ తలిదండ్రులు దైవభయంగలవారైతే, అలా చెప్పడం మంచి ఫలితాలను తీసుకురావచ్చు.
వాస్తవాలను ఎదుర్కోవడం
మీరు ప్రేమిస్తున్నానని భావించే వ్యక్తిని గురించి మీరు చివరికి వాస్తవాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. అలా చేయడం సులభం కాకపోవచ్చు, అది మీకు భావోద్రేకపర బాధను కలిగించవచ్చు. అయితే లేఖనాలు ఇలా సలహా ఇస్తున్నాయి: “సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము.” (సామెతలు 23:23) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను ప్రేమలో పడేందుకు నాకు సహేతుకమైన కారణాలున్నాయా? ఈ వ్యక్తిని గురించి నిజంగా నాకెంత మేరకు తెలుసు? ఆయన తలంపులూ, భావాలూ, అభిప్రాయాలూ, అలవాట్లూ, నైతికవిలువలూ, సామర్థ్యాలూ, కౌశల్యాలూ మరియు జీవిత విధానాన్ని గురించి నాకు ఏమి తెలుసు?’
ఈ వ్యక్తి నాపట్ల నిజమైన ఆసక్తిని చూపించాడా లేదా అన్నది పరిగణించవలసిన మరొక విషయం. తరచూ, దయా గుణాన్నీ లేక స్నేహభావాన్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. “ఆయన దయగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, అయితే నేను ఆయన మాటలనూ, క్రియలనూ వ్యక్తిగత ఆసక్తి అని భావించాను, ఎందుకంటే నాకు కావలసినవి అవే మరి. ఆయనకు నాలో ఆసక్తి లేదని నేను తెలుసుకున్నప్పుడు నేను అవమానింపబడినట్లు భావించాను. నాపట్ల ఆసక్తి చూపేందుకు నేను ఆయనకు తగనని, నాలో ఏదో లోపం ఉందనీ నేను భావించాను.”
అలాంటి అనుభవం మూలంగా బహుశ మీరు కూడా అదే విధంగా భావించి ఉండవచ్చు. మీరు ఆయనకు నచ్చలేదంటే దాని భావం ఇక మీరు మరొకరికి అసలు నచ్చరని కాదని గుర్తించండి. ఎంతైనా, లోకంలో ఉన్న పురుషుడు ఆయనొక్కడే కాదుగా!
బాధను తట్టుకోవడం
అయినప్పటికీ, మీకు కలిగిన బాధను తట్టుకుని దాన్ని అధిగమించేందుకు కొంతసమయం పట్టవచ్చు. అయితే ఏది సహాయం చేయగలదు? ఒక మార్గం ఏమంటే, మనస్సు విప్పి ఒక ‘నిజమైన స్నేహితురాలితో’ అంటే మీరు చెప్పేది వినగల పరిపక్వత ఉన్న క్రైస్తవురాలితో చెప్పుకోవచ్చు. (సామెతలు 17:17) బహుశ సంఘంలోని పెద్ద వయస్సుగల స్త్రీతో మీరు మాట్లాడవచ్చు. సహాయాన్నీ మద్దతునూ ఇవ్వడంలో క్రైస్తవ తలిదండ్రులు కూడా ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించగలరు. “మా సంఘంలోని ఒక క్రైస్తవ స్త్రీ నా వ్యథను గుర్తించింది, ఆమె పరిపక్వతతో నాకు సహాయం చేయగలిగింది. నేను ఆమెవద్ద ఉపశమనాన్ని పొందాను, ఆమెకు అంతా చెప్పుకున్నాను. నా తలిదండ్రులతో మాట్లాడమని ఆమె నన్ను ప్రోత్సహించింది. నేను వాళ్లతో మాట్లాడాను, వాళ్లు నన్ను అర్థంచేసుకుని నాకు సహాయం చేశారని” జేన జ్ఞాపకం చేసుకుంటోంది.
ప్రార్థనా శక్తిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. (కీర్తన 55:22) “యెహోవాకు నేను చేసిన ప్రార్థనలు నేనా బాధను మర్చిపోయేందుకు నాకు సహాయం చేశాయి. నేను కావలికోట, తేజరిల్లు! పత్రికలలోని సహాయకర శీర్షికలను కూడా చదివాను” అని హూడ చెబుతోంది. అంతేగాక, మిమ్మల్ని మీరు ఏకాంతపర్చుకోకూడదన్నది చాలా ప్రాముఖ్యం. (సామెతలు 18:1) ఇతరులతో సహవసించడం మొదలుపెట్టండి. “నేను పనిలో బిజీగా ఉండి, పయినీరింగ్ [పూర్తికాల పరిచర్య] ప్రారంభించడమే నాకు సహాయం చేసిన మరొక విషయం” అని జేన జ్ఞాపకం చేసుకుంటోంది. “నేను సంఘంలోని ఇతర స్త్రీలతో నా సహవాసాన్ని పెంచుకున్నాను. నేను ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందేందుకు ఇది నాకు సహాయం చేసింది.”
బైబిలు ‘ప్రేమించుటకు’ సమయం ఉందని చెబుతోంది, కొంతకాలానికి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. (ప్రసంగి 3:8) మానవులు వైవాహిక జీవితంలోని ఆహ్లాదకరమైన విషయాలను ఆనందించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు, మన మహోన్నత సృష్టికర్త చేసిన చక్కని ఏర్పాటును బహుశ మీరు కూడా త్వరలోనే ఆనందించవచ్చు. అంతలో, అపొస్తలుడైన పౌలు చెప్పిన విధంగా “చింతలేని” సమయమైన మీ అవివాహ దశలోని సంవత్సరాలనుండి సంపూర్ణ ప్రయోజనాన్ని పొందేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు? (1 కొరింథీయులు 7:32-34) ఏది ఏమైనప్పటికీ, “నీవు [యెహోవా] నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు” అనే బైబిలు వాగ్దాన నెరవేర్పు విషయమై నిశ్చయతను కలిగి ఉండండి.—కీర్తన 145:16.
[అధస్సూచి]
a ఇందులో ఇమిడివున్న వారి గోప్యతను కాపాడేందుకు పేర్లు మార్చబడ్డాయి.
[27వ పేజీలోని చిత్రం]
కొన్నిసార్లు, దయచూపించడాన్ని అపార్థం చేసుకోవచ్చు