ఒక విశేషమైన పునఃకలయిక
బ్రిటన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
బ్రూస్‌ను వాళ్లమ్మ మారీ 1945లో చివరిసారి చూసినప్పుడు ఆయన వయస్సు రెండేళ్లు. మారీ విడాకులు తీసుకున్న తర్వాత, బ్రూస్ సంరక్షణా బాధ్యత చట్టబద్ధంగా వాళ్ల నాన్నకు అప్పగించబడింది. మారీ తన సహజ భావాలను అణిచివేసుకుని, తనవైపు నుండి ఏవిధమైన భావోద్వేగ సంఘర్షణ ఉండకుండేలా, బ్రూస్‌ను అతని తండ్రీ, అతని తండ్రి క్రొత్త భార్యా పెంచడమే బ్రూస్‌కు అన్ని విధాలా క్షేమకరమైనదై ఉండగలదని ఆమె నిర్ణయించుకుంది. కొంతకాలానికి, ఆమె బ్రూస్‌ను ఇక ఏవిధంగానూ కలుసుకోలేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత మారీ పునర్వివాహం చేసుకుంది, ఆమెకు మరో కుమారుడు కలిగాడు, అయినా ఆమె బ్రూస్ గురించి ఆలోచించేది. వాడెక్కడున్నాడు? ఏమయ్యాడు?
బ్రూస్ నాన్న 1976లో మరణించినప్పుడు, ఆయన అంత్యక్రియలకు మారీ హాజరయ్యింది. ఇప్పుడు తన 30వ పడిలో మంచి యౌవనంలో ఉన్న బ్రూస్ తన సవతి తల్లి దగ్గర ఉంటున్నాడు. బ్రూస్ తన సవతి తల్లిని తన స్వంత తల్లి అనుకుంటున్నాడని మారీ అప్పటికీ విశ్వసించేది గనుక, తన గురించి తాను ఆయనకు తెలియజేసుకోవడం, ప్రాముఖ్యంగా అలాంటి సమయంలో అలా చేయడం దయలేని పనిగా ఉంటుందని ఆమె భావించింది. బ్రూస్ తండ్రి తాను మరో వివాహం చేసుకున్న వెంటనే బ్రూస్‌ను నిరాకరించాడనీ, బ్రూస్‌ను వాళ్ల నానమ్మ పెంచిందనీ మారీకి గనుక తెలిసి ఉంటే ఆమె మరోలా ప్రవర్తించి ఉండేది.
ఆ సమయానికల్లా, మారీ యెహోవా సాక్షియైన సూను కలిసింది, గృహ బైబిలు పఠనానికి వెంటనే అంగీకరించింది. కాకతాళీయంగా, అదే సమయంలో సూ భర్తయైన అలన్, బ్రూస్తోనూ ఆయన భార్యతోనూ బైబిలు పఠనం చేయనారంభించాడు. అయితే, త్వరలోనే, అనారోగ్య సమస్యల మూలంగా, మారీ తన పఠనాన్ని ఆపేసి వేరే స్థలానికి వెళ్లిపోయింది.
1995లో యెహోవాసాక్షులు మళ్లీ మారీని కలిశారు. ఆమె తన బైబిలు పఠనాన్ని పునఃప్రారంభించి త్వరగా అభివృద్ధి సాధించింది. మారీ తాను బాప్తిస్మం తీసుకోవలసిన సమయం దగ్గరపడినప్పుడు, బ్రూస్ గురించి ఒక క్రైస్తవ పెద్దకు తెలియజేసింది. ఆ పెద్ద విచారణ చేసి, బ్రూస్ మరియు ఆయన కుటుంబం యెహోవా సాక్షులయ్యారని మాత్రమే కాదు, బ్రూస్ మారీ స్వంత ఊరిలో సంఘ పెద్దగా ఉన్నాడని కూడా తెలుసుకున్నాడు!
బ్రూస్ సంఘంలోని ఇతర పెద్దలు ఆందోళన చెందారు. రాబోయే ప్రత్యేక సమావేశ దినంలో ఆయన తల్లి బాప్తిస్మం తీసుకోబోతుందని బ్రూస్‌కు వాళ్లు చెబితే, ఆయనెలా ప్రతిస్పందిస్తాడు? ఆమె జీవించివుందన్న విషయమైనా ఆయనకు తెలుసా? అయితే, బ్రూస్ వాస్తవాలను తెలుసుకున్న వెంటనే, మారీని కలవడానికి ఆయన తన కుటుంబంతో సహా వెళ్లాడు. బ్రూస్ తన తల్లిని హత్తుకుని ఇలా ఓదార్చాడు, “గతం అనవసరం; సత్యంలో భవిష్యత్తే ప్రాముఖ్యమైనది!”
1996 మార్చిలో, అప్పటికి 78 ఏండ్ల మారీ ఇంగ్లాండు నందలి యెహోవాసాక్షుల ఈస్ట్ పెనైన్ సమావేశ హాలులో బ్రూస్ చేతుల్లో బాప్తిస్మం తీసుకుంది. తన తల్లిని ఆధ్యాత్మిక సహోదరిగా పొందగలిగినందుకు బ్రూస్ ఎంత ఉత్తేజితుడయ్యాడో కదా!
[24వ పేజీలోని చిత్రం]
బ్రూస్, తన తల్లితో