కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 3/8 పేజీలు 25-27
  • జాత్యాభిమానం విషయమేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జాత్యాభిమానం విషయమేమిటి?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సముచితమైన అభిమానానికి విరుద్ధంగా అనుచితమైన అభిమానం
  • జాత్యాభిమానపు మూలం
  • జాతి ఔన్నత్యాన్ని గూర్చిన మిథ్య
  • జాతులన్నీ సమాధానంగా కలిసి జీవించినప్పుడు
    తేజరిల్లు!—1993
  • గర్విష్టిగా ఉండటం తప్పా?
    తేజరిల్లు!—1999
  • గర్వానికి చెల్లించవలసిన మూల్యం—ఎంతెక్కువ?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 3/8 పేజీలు 25-27

యౌవనస్థులు ఇట్లడుగుదురు. . .

జాత్యాభిమానం విషయమేమిటి?

“నాతోటి విద్యార్థి ఒకతను ఎప్పుడూ ఇతర ప్రజల జాతి గురించి, వర్ణం గురించి మాట్లాడుతుంటాడు. ఆయన తన అనేక సంభాషణల్లో తాను వారికంటే ఉన్నతుడనన్నట్లు చెప్పుకుంటాడు” అని 17 ఏళ్ల టాన్య నిట్టూరుస్తుంది.

ఒకరు తమ కుటుంబాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, భాషను బట్టి, లేక జన్మస్థలాన్ని బట్టి గర్వించడమన్నది సహజమే. ఫాంగ్‌ అనే 15 ఏళ్ల ఒకమ్మాయి ఇలా చెబుతుంది, “నేను వియత్నామ్‌ దేశస్థురాలిని, నేను నా సంస్కృతిని బట్టి గర్విస్తున్నాను.”

అయితే తరచూ జాత్యాభిమానం, జాతివాదం సన్నిహిత సంబంధం కలిగివుంటాయి. ఒక వ్యక్తి పైకి మర్యాదస్తుడిలా కనిపించినప్పటికీ, ఈ అభిమానం క్యాన్సరులా పనిచేస్తూ, మెల్లిగా సంబంధాలను నాశనం చేయగలదు. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.” (మత్తయి 12:34) ఉన్నతులమనీ లేక నీచులమనీ లోతుగా పాతుకుపోయిన భావనలు తరచూ బహిర్గతమై, బాధను వేదనను కలిగిస్తాయి.

కొన్నిసార్లు జాత్యాభిమానం హింసకు కూడా దారితీస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో అది యుద్ధాలు, కలహాలు, రక్తపాతంతో కూడిన “జాతి ప్రక్షాళన” వంటివాటికి ఆజ్యం పోసింది. అయితే, జాత్యాభిమానపు మరో వికృత పార్శ్వాన్ని చూడాలంటే మీరు రక్తపాతాన్ని కళ్లారా చూడాలనేమీ లేదు. ఉదాహరణకు, అది ఉందనడానికి రుజువును మీరు స్కూల్లో, మీరు పనిచేసే స్థలంలో, లేక మీ ఇరుగుపొరుగున చూస్తున్నారా? “అవును, కచ్చితంగా చూస్తున్నాను” అని వివరిస్తుంది మెలిస్సా అనే క్రైస్తవ యౌవనస్థురాలు. “నా తోటి విద్యార్థులు కొంతమంది, యాసగా మాట్లాడే పిల్లలను ఆటపట్టిస్తూ, వారి కంటే తాము గొప్పవాళ్లమని చెబుతారు.” అలాగే టాన్యా కూడా ఇలా నివేదిస్తుంది: “‘నేను నీకంటే గొప్పవాడ్ని’ అని స్కూల్లో పిల్లలు నిర్మొహమాటంగా చెప్పడం నేను విన్నాను.” అమెరికాలో జరిపిన ఒక సర్వేలో, జవాబిచ్చినవారిలో దాదాపు సగంమంది గత సంవత్సరంలో తాము వ్యక్తిగతంగా ఏదో రకమైన జాతి దురభిమానాన్ని అనుభవించామని చెప్పారు. “మా స్కూల్లో జాతి సంబంధమైన ఉద్రిక్తత చాలా ప్రబలంగా ఉంది” అని నాటాషా అనే అమ్మాయి చెబుతుంది.

శరణార్థులు వచ్చి మీ స్కూల్లోని, ఇరుగుపొరుగు ప్రాంతాల్లోని, క్రైస్తవ సంఘంలోని సహజ తీరును విశేషంగా మార్చేస్తున్న దేశంలో లేక ప్రాంతంలో మీరు నివసిస్తున్నారనుకోండి. దాని గురించి మీరు కాస్త అసౌకర్యంగా భావిస్తారా? అలాగైతే బహుశా మీరు గుర్తించినదాని కన్నా ఎక్కువగా జాత్యాభిమానం మీ ఆలోచనావిధానంలో ఒక ముఖ్య కారణాంశమై ఉంది.

సముచితమైన అభిమానానికి విరుద్ధంగా అనుచితమైన అభిమానం

అభిమానమన్నది స్వతహాగానే చెడ్డదని దీని భావమా? అలా కానవసరం లేదు. సముచితమైన అభిమానానికి ఒక స్థానం ఉందని బైబిలు చూపిస్తుంది. అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయలోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము.” (2 థెస్సలొనీకయులు 1:4) అలాగే, కొంత మేరకు స్వాభిమానం ఉండడం ఆరోగ్యకరమైనదే, సహజమే. (రోమీయులు 12:3) కాబట్టి ఒకరు తమ జాతి, కుటుంబం, భాష, వర్ణం, లేక జన్మస్థలాన్ని బట్టి కొంతమేరకు అతిశయించడమన్నది తప్పేమీ కాదు. అలాంటి విషయాల గురించి మనం సిగ్గుపడాలని కచ్చితంగా దేవుడు కోరడం లేదు. ఐగుప్తుకు చెందిన ఒక నేరస్థుడూ అపొస్తలుడైన పౌలూ ఒకరేననుకుని గందరగోళం ఏర్పడినప్పుడు, ఆయన ఇలా చెప్పడానికి సంకోచించలేదు: “నేను కిలకియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను.”—అపొస్తలుల కార్యములు 21:39.

అయితే జాత్యాభిమానం, స్వాభిమానాన్ని అధిక మోతాదులో పోషించినప్పుడు లేక ఒకరు ఇతరులను చిన్న చూపు చూసేలా చేసినప్పుడు అది వికృతరూపం దాలుస్తుంది. బైబిలు ఇలా చెబుతుంది: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.” (సామెతలు 8:13) సామెతలు 16:18 ఇలా చెబుతుంది: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.” కాబట్టి ఉన్నత జాతికి చెందినవారమని అతిశయించడం దేవునికి అసహ్యమైనది.—పోల్చండి యాకోబు 4:16.

జాత్యాభిమానపు మూలం

ప్రజలు తమ జాతి విషయంలో అతిశయోక్తికరమైన అభిమానాన్ని కలిగివుండడానికి కారణమేమిటి? లీజ ఫుండర్‌బుర్గ్‌ వ్రాసిన నల్లజాతి వాళ్లు, శ్వేతజాతి వాళ్లు, ఇతర జాతుల వాళ్లు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “అనేకమంది ప్రజలకు జాతిని గురించిన తమ మొదటి (మరియు దీర్ఘకాలం నిలిచే) భావనలు తలిదండ్రుల నుండి కుటుంబం నుండి కలుగుతాయి.” విచారకరంగా, కొంతమంది తలిదండ్రులు కలుగజేసిన అనుభూతులు తరచూ అసమతుల్యమైనవి లేక విరూపితమైనవి అయ్యుంటాయి. తమ జాతికి చెందిన ప్రజలు ఉన్నతులని, ఇతర జాతులకు చెందిన వారు భిన్నంగా ఉంటారని లేక అల్పులని కొంతమంది యౌవనస్థులకు సూటిగా చెప్పబడవచ్చు. అయినా, మరింత తరచుగా, తమ తలిదండ్రులు ఇతర జాతుల ప్రజలతో ఏ సంబంధము లేకపోవడాన్ని యౌవనస్థులు గమనిస్తారు. ఇది కూడా వారి ఆలోచనా విధానంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపించగలదు. వస్త్రధారణ లేక సంగీతం వంటి విషయాలు వచ్చేసరికి యౌవనస్థుల అభిప్రాయాలూ తలిదండ్రుల అభిప్రాయాలూ భిన్నంగా ఉన్నప్పటికీ, జాతి సంబంధంగా అధికశాతం మంది యౌవనుల దృక్కోణాలు తమ తలిదండ్రుల దృక్కోణాలను పోలివున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

అణిచివేతకు మరియు దుర్వ్యవహారానికి గురైనప్పుడు కూడా జాతికి సంబంధించిన అసమతౌల్యమైన దృక్పథాలు వృద్ధి కావచ్చు. (ప్రసంగి 7:7) ఉదాహరణకు, నిమ్నజాతుల వారని పిలువబడుతున్నవారి పిల్లలు తరచూ స్వాభిమానం కొరవడినవారిగా ఉంటారని విద్యావేత్తలు పేర్కొన్నారు. విషయాలను చక్కదిద్దే ప్రయత్నంలో, కొంతమంది విద్యావేత్తలు, పిల్లలకు తమ జాతి చరిత్రను బోధించే విధంగా పాఠశాల పాఠ్యక్రమాన్ని తయారు చేశారు. ఆసక్తికరంగా, ఇలా జాత్యాభిమానాన్ని నొక్కి చెప్పడం కేవలం జాతివాదానికే దోహదపడుతుందని విమర్శకులు వాదిస్తున్నారు.

జాతి గురించిన అనారోగ్యకరమైన దృక్పథాలను వృద్ధి చేసుకోవడంలో వ్యక్తిగత అనుభవం కూడా పాత్ర వహించగలదు. వేరే జాతికి చెందిన ఒక వ్యక్తి వల్ల ఎదురైన ఏదైనా అప్రీతికరమైన అనుభవం, ఆ జాతికి చెందిన వారందరూ అసహ్యకరమైనవారే లేక దురభిమానులే అనే ముగింపుకు ఒకరు వచ్చేలా చేయవచ్చు. జాతి సంబంధ వైషమ్యాలు, పోలీసు జులుం, అసమ్మతి ర్యాలీలు వంటివాటికి సమాచార సాధనాలు ఎక్కువ అవధానాన్ని ఇచ్చినప్పుడు లేక జాతి సంబంధ సముదాయాలను ప్రతికూలమైన విధంగా చిత్రీకరించినప్పుడు ప్రతికూల భావాలు ఏర్పడవచ్చు.

జాతి ఔన్నత్యాన్ని గూర్చిన మిథ్య

తమ జాతిని ఇతరుల జాతి కన్నా ఉన్నతమైనదిగా భావించడానికి తమకు హక్కుందని కొంతమంది చెప్పేదాని విషయమేమిటి? మొదటగా చెప్పాలంటే, ప్రజలను ప్రత్యేకమైన జాతుల్లోకి విభజించడమన్న తలంపే ప్రశ్నించదగినదిగా ఉంది. న్యూస్‌వీక్‌లోని ఒక శీర్షిక ఇలా నివేదించింది: “ఈ అంశాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులకు, జాతి అన్నది, దాన్ని నిర్వచించడానికి చేసే ఏ గంభీరమైన ప్రయత్నాన్నైనా తప్పించుకునిపోయే మోసకరమైనదిగా పేరుపొందిన తలంపు.” నిజమే, “శరీర వర్ణం, జుట్టు తీరు, కను ముక్కు తీరు వంటివాటిలో గమనించదగిన తేడాలు” ఉండవచ్చు. అయితే, “ఈ తేడాలు కేవలం బాహ్యమైనవి మాత్రమే—ఒక జాతి నుండి మరో జాతి గుంపును వేరు చేయడానికి ఏవైనా ప్రత్యేకమైన తేడాలను చూపించాలని శాస్త్రజ్ఞులు ఎంత ప్రయత్నించినా ప్రాథమికంగా వాళ్లు విఫలమయ్యారు. . . . ఈ రంగంలో పని చేస్తున్న అనేకమంది విజ్ఞానశాస్త్రజ్ఞుల ప్రాథమిక ముగింపు ఏమిటంటే, జాతి అన్నది కేవలం ‘సామాజిక నిర్మాణం’ మాత్రమే, అంటే దురభిమానం, మూఢనమ్మకం మరియు మిథ్య వంటివాటి [కలుషిత] మిశ్రమం” అని న్యూస్‌వీక్‌ తెలియజేసింది.

జాతుల మధ్య శాస్త్ర సంబంధమైన తేడాలను చూపించినప్పటికీ, “స్వచ్ఛమైన” జాతి అనే తలంపు మాత్రం కల్పనే. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంటుంది: “స్వచ్ఛమైన జాతులు లేవు; ప్రస్తుతం ఉనికిలోవున్న జాతి సముదాయాలన్నీ పూర్తిగా మిశ్రితమైనవే.” విషయమేదైనప్పటికీ, దేవుడు “యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం[చాడని]” బైబిలు బోధిస్తుంది. (అపొస్తలుల కార్యములు 17:26) శరీర వర్ణం, జుట్టు తీరు, లేక రూపురేఖలు ఎలా ఉన్నప్పటికీ, నిజానికి కేవలం ఒకే జాతి ఉంది, అదే మానవ జాతి. మన పితరుడైన ఆదాము ద్వారా మానవులందరూ సంబంధీకులే.

జాతులన్నిటి ఉమ్మడి వంశమూలం గురించి ప్రాచీన యూదులకు బాగానే తెలుసు. అయినప్పటికీ, కొంతమంది తాము క్రైస్తవులైన తర్వాత కూడా, తమ యూదేతర తోటి విశ్వాసులతో సహా యూదులుకాని వారికన్నా ఉన్నతులమనే నమ్మకానికి అంటిపెట్టుకున్నారు! రోమీయులు 3:9 నందు వ్రాయబడివున్నట్లుగా, “యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని” చెప్పడం ద్వారా అపొస్తలుడైన పౌలు జాతి ఔన్నత్యాన్ని గూర్చిన భావనను పూర్తిగా అణచివేశాడు. దేవుని ఎదుట ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లు ఏ జాతి గుంపూ ప్రగల్భాలు పలుకలేదు. వాస్తవానికి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే ఎవరైనా దేవునితో సంబంధాన్ని కలిగివుండగలరు. (యోహాను 17:3) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన[న్నది]” దేవుని చిత్తం. (ఇటాలిక్కులు మావి.)—1 తిమోతి 2:4.

దేవుని దృష్టిలో జాతులన్నీ సమానమేనని మీరు గుర్తించడం, మీరు మిమ్మల్ని మీరూ అలాగే ఇతరులనూ దృష్టించే విధానంపై విశేషమైన ప్రభావాన్ని చూపించగలదు. ఇతరులతో గౌరవప్రదంగా, మర్యాదగా మెలిగేందుకు, వారి తేడాలను గుణగ్రహించి వాటిని మెచ్చుకునేందుకు అది మిమ్మల్ని పురికొల్పగలదు. ఉదాహరణకు, మొదట్లో ప్రస్తావించబడిన మెలిస్సా, విదేశీ యాసతో మాట్లాడే యౌవనులను చూసి నవ్వడంలో తన తోటి విద్యార్థులతో కలవదు. ఆమె ఇలా చెబుతుంది: “రెండు భాషలు మాట్లాడేవారు తెలివైనవారని నా ఉద్దేశం. మరో భాష మాట్లాడడం నాకిష్టమే అయినా, నేను ఒక్క భాషే మాట్లాడగలను.”

మీ జాతికి, సంస్కృతికి చెందినవారికి వాటి గురించి గర్వించడానికి నిస్సందేహంగా కారణం ఉండవచ్చు, అయితే ఇతర జాతుల వారికి కూడా అలాగే కారణాలు ఉంటాయని కూడా గుర్తుంచుకోండి. మీ సంస్కృతిని బట్టీ, మీ పూర్వీకులు సాధించిన విజయాలను బట్టీ కొంత అభిమానాన్ని కలిగి ఉండడం సహేతుకమే అయినా, మీరు మీ కృషి మరియు కష్టం ద్వారా మీరు వ్యక్తిగతంగా సాధించిన వాటిని బట్టి గర్వించడం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. (ప్రసంగి 2:24) వాస్తవానికి, మీరు గర్వించదగిన సాఫల్యం ఒకటుందని బైబిలు చెబుతుంది. యిర్మీయా 9:24 నందు వ్రాయబడివున్నట్లుగా, దేవుడు తానే ఇలా చెబుతున్నాడు: “అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, . . . యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను.” మీరలా అతిశయించగలరా?

[26వ పేజీలోని చిత్రం]

జాతి గురించిన దేవుని దృక్కోణాన్ని తెలుసుకోవడం, మనం ఇతర జాతుల ప్రజల సహవాసాన్ని ఆనందించడానికి సహాయం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి