ప్రపంచ పరిశీలన
కలరా పునరాగమనం
కలరా దాదాపు వందేళ్లకుపైగా గైర్‌హాజరైన తర్వాత దక్షిణమెరికాలో హఠాత్తుగా తిరిగి ప్రవేశించింది. “అక్కడ 1991 నుండి, 14 లక్షల కేసులు నమోదయ్యాయి, వారిలో 10,000 మంది మరణించారు” అని లండన్‌కు చెందిన ది టైమ్స్ చెబుతుంది. ఆరోగ్య సంబంధ అధికారులకు తోడైన మరో చింత ఏమిటంటే, ఇండియా, బంగ్లాదేశ్, ఇరుగుపొరుగు దేశాల్లో కలరా బాక్టీరియా యొక్క ఒక క్రొత్త స్ట్రెయిన్ 1992లో ఉనికిలోకి రావడమే, ఇప్పటికది 2,00,000 మంది ప్రజలపై ప్రభావం చూపింది. కలరా ఒక తీవ్రమైన అతిసార వ్యాధి, తగిన చికిత్స చేయకపోతే 70 శాతం కేసుల్లో మరణం సంభవిస్తుంది. కానీ చికిత్స కన్నా నివారణ మిన్న. త్రాగే నీటినీ పాలనూ మరిగించడం, ఈగలను దూరంగా ఉంచడం, ఉడకబెట్టని పదార్థాలను క్లోరిన్ కలిపిన నీటిలో కడగడం ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు.
ప్రపంచ శాంతి గురించి మాట్లాడడం
స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ యొక్క 1997 వార్షిక పుస్తకం ప్రకారం, ప్రచ్ఛన్న యుద్ధంలో ఒకప్పుడు ప్రముఖ పాత్ర నిర్వహించిన ప్రాంతీయ సంక్షోభాలు ఇక ముగిసినట్లు కనిపిస్తున్నాయి. 1989లో, అంటే ప్రచ్ఛన్న యుద్ధం యొక్క చివరి సంవత్సరంలో, 36 “ప్రముఖ సాయుధ పోరాటాలు” జరిగాయి. 1996లో సాయుధ పోరాటాల సంఖ్య 27కు పడిపోయింది, ఇండియా పాకిస్తాన్‌ల మధ్యనున్న సంఘర్షణ తప్ప మిగతావన్నీ అంతర్గతమైనవి, ఆయా దేశాల్లోనే జరిగిన పోరాటాలే. అంతేగాక, మరణాల సంఖ్యను బట్టి అంచనా వేస్తే, ఈ పోరాటాల్లో అనేకం యొక్క తీవ్రత తగ్గినట్టు లేక పోరాటాలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. “ఏ ఇతర తరం కూడా ప్రపంచ శాంతికి ఇంతగా దగ్గరవ్వలేదని” దక్షిణ ఆఫ్రికా వార్తాపత్రికయైన ది స్టార్ ముగించింది. టైమ్ పత్రిక ఇలా చెబుతుంది: “అమెరికా ఆధిపత్యం . . . ప్రపంచానికి పాక్స్ అమెరికానాను అంటే ఈ శతాబ్దంలో చూడనటువంటి, మానవ చరిత్రలోనే అరుదైనదైన అంతర్జాతీయ శాంతి యుగాన్ని ప్రపంచానికి ప్రసాదించింది.”
ఆకాశం నుండి పశువులను తోలడం
ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది పశుపాలకులు తమ పెద్ద పశువుల గొఱ్ఱెల మందలను వాటి కొట్టాలలోనికి తోలడానికి ఇప్పుడు అల్ట్రాలైట్స్ అని పిలువబడే, మెల్లిగా ఎగిరే విమానాలను ఉపయోగిస్తున్నారని ఆస్ట్రేలియా నందలి బ్రిస్‌బేన్‌కు చెందిన వార్తాపత్రిక అయిన ది సండే నివేదిస్తోంది. తాను అల్ట్రాలైట్‌తో తన గొఱ్ఱెలను తోలిన ప్రతిసారి, రెండు వారాలపాటూ కొంతమంది పనివారికి ఇచ్చే జీతాన్ని తాను పొదుపు చేసుకోగలిగానని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఒక పశుపాలకుడు చెబుతున్నాడు. “గుఱ్ఱం స్థానాన్ని మోటారు సైకిల్ తీసుకుంది, ఇప్పుడు అల్ట్రాలైట్ మోటారు సైకిల్ స్థానాన్ని తీసుకుంటోంది” అని ఆయన అన్నాడు. ఆ తేలిక బరువున్న విమానాల్లో శక్తివంతమైన టేప్‌రికార్డర్లు ఉంటాయి, అవి కుక్కల అరుపులున్న రికార్డింగులను వినిపిస్తాయి. అది విని, “భయపడిపోయిన పశువులు, గొఱ్ఱెలు పరుగెత్తడం ప్రారంభించి, అతిదగ్గరలోవున్న కొట్టాలలోకి వెళతాయి” అని ఆ శీర్షిక చెబుతుంది.
“మరణ దూతలు”
ధనిక పాశ్చాత్య దేశాలు వర్ధమాన దేశాలపై వ్యాధుల “రెట్టింపు భారాన్ని” మోపుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క 1997 నివేదిక చెబుతుంది. లండన్‌కు చెందిన ది డైలి టెలెగ్రాఫ్‌లో నివేదించబడినట్లుగా, వర్ధమాన దేశాలు పొగత్రాగడం, అధిక కాలరీలూ అధిక క్రొవ్వు పదార్థాలూ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక కార్యకలాపాలు తగ్గిపోవడం వంటివి ఇమిడివున్న పాశ్చాత్య జీవన విధానాలను అనుసరిస్తుండగా హృద్రోగం, స్ట్రోక్, మధుమేహం, కొన్ని రకాలైన క్యాన్సర్‌లు చాలా అధికమౌతున్నాయి. భూగోళవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు ఎక్కువకాలం జీవిస్తున్నప్పటికీ, ‘దానికి విలువలేదు, అది నాణ్యమైన జీవితం కాదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టరైన డా. పాల్ క్లైయూస్ చెబుతున్నాడు. ఆయనిలా జత చేస్తున్నాడు: “తాము మరణ దూతలమని చెప్పుకుంటున్న రాజ్యాలు నిజంగా మరణ దూతలే.” ఆరోగ్యవంతమైన జీవన విధానాలను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని తీవ్రతరం చేస్తోంది. లేకపోతే, “భూగోళవ్యాప్తంగా బాధాకరమైన సంక్లిష్ట పరిస్థితి” ఏర్పడుతుందని అది చెబుతుంది.
రొమ్ము క్యాన్సరును మొదట్లోనే గుర్తించడం
బ్రెజిల్‌కు చెందిన మహిళల్లో రొమ్ము క్యాన్సరు అతి సాధారణమైన అంటువ్యాధియనీ, ప్రతి 12 మందిలో ఒకరు దానికి గురౌతున్నారనీ అంచనా వేయబడిందని బ్రెజిల్ పత్రికయైన మెడీసీన కోన్‌సెల్యో ఫెడరల్ నివేదిస్తుంది. 25 ఏళ్లు పైబడ్డ స్త్రీలంతా క్రమంగా తమ రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలని ఆ పత్రిక ప్రోత్సహిస్తోంది. 35 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సులోని స్త్రీలు తొలిసారి మెమోగ్రామ్ తీయించుకోవాలనీ, 40 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సులోని వారు ప్రతి రెండేళ్ల కొకసారి మెమోగ్రామ్‌ను తీయించుకోవాలనీ, అంతకన్నా ఎక్కువ వయస్సువారు ప్రతి సంవత్సరం తీయించుకోవాలనీ కూడా మెడీసీన సిఫారసు చేస్తోంది. అధిక క్రొవ్వుగల పదార్థాలను తీసుకునే స్త్రీలూ, కుటుంబంలో ముందు ఎవరికైనా వ్యాధి ఉన్న కుటుంబాలకు చెందిన వారూ ఎక్కువ ప్రమాదంలో ఉన్నప్పటికీ, 70 శాతం రొమ్ము క్యాన్సర్ రోగులు అధిక ప్రమాదంగల ఏ కోవలోకి రారు. ఈ వాస్తవం, “మొదట్లో గుర్తించడమనే పథకం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుందని” మెడీసీనా పేర్కొంటుంది.—తేజరిల్లు! (ఆంగ్లం) 1994, ఏప్రిల్ 8, చూడండి.
ప్రపంచంలోకెల్లా వృద్ధ వ్యక్తి మరణించింది
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోకెల్లా వృద్ధురాలైన జాన్ ల్వీజ్ కాల్‌మాన్ 122 ఏళ్ల వయస్సులో 1997 ఆగస్టు 4న మరణించిందని ఫ్రెంచి వార్తాపత్రికయైన ల ఫీగారో నివేదిస్తోంది. జాన్ ఆగ్నేయ ఫ్రాన్సు నందలి అరల్స్‌లో, 1875 ఫిబ్రవరి 21న అంటే విద్యుత్ దీపం, ఫోనోగ్రాఫ్, ఆటోమొబైల్ వంటివి కనుగొనబడక మునుపు జన్మించింది. 1896లో వివాహమైన ఆమెకు ఒక కుమార్తె, ఒక మనుమడు. జాన్ తన కుమార్తెకన్నా 63 ఏళ్లు ఎక్కువకాలం జీవించింది. ఆమె మనుమడు 1963లో మరణించాడు. 1888లో, ఆమె యౌవనురాలిగా ఉన్నప్పుడు చిత్రకారుడైన విన్సెంట్ వాన్ గోహ్‌ను కలిసిన విషయం గుర్తు చేసుకుంటోంది. 1904లో నోబెల్ బహుమతి గ్రహీతా, కవీ అయిన ఫ్రేడ్రేరీక్ మిస్ట్రాకు ఆమె స్నేహితురాలు. దీర్ఘాయువు యొక్క రహస్యాల గురించి జాన్ తమాషా అనిపించే చిట్కాలు అనేకం చెప్పింది, వాటిలో నవ్వు, క్రియాశీలత, “నిప్పుకోడిలాంటి కడుపు” వంటివి ఇమిడివున్నాయి.
ద్విభాషా పిల్లలు
ఒక శిశువు తన స్వభాషను నేర్చుకుంటుండగా, ఆ భాషను మాట్లాడేందుకు ఆ శిశువుకున్న సామర్థ్యం మెదడులోని బ్రోకాస్ ప్రాంతం అనే భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఇటీవల, న్యూయార్క్ నందలి మెమోరియల్ స్లొయాన్-కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ నందలి పరిశోధకులు, ద్విభాషా వ్యక్తులు ఒక భాషను లేక రెండో భాషను ఉపయోగించేటప్పుడు మెదడులోని ఏ భాగం క్రియాశీలంగా ఉంటుందో నిర్ధారించడానికి ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనాన్స్ ఇమేజింగ్‌ను ఉపయోగించారు. ఒక వ్యక్తి పసివాడిగా ఉన్నప్పుడు ఒకేసారి రెండు భాషలను నేర్చుకున్నప్పుడు, అవి రెండూ కూడా బ్రోకాస్ ప్రాంతంలోని ఒకే భాగంలో భద్రపర్చబడతాయని వారు కనుగొన్నారు. అయితే, యౌవనంలోగానీ ఆ తర్వాత గానీ రెండవ భాషను నేర్చుకోవడం జరిగితే, అది మొదటిదానితో మిళితమైపోయే బదులు దాని ప్రక్కన ఉంచబడుతున్నట్లు కనిపిస్తుంది. లండన్ వార్తాపత్రిక అయిన ది టైమ్స్ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “మొదటి భాషను నేర్చుకోవడానికి బ్రోకాస్ ప్రాంతంలో ఒక సెట్టు సర్క్యూట్‌లు ఉన్నాయి గనుక, ఇక రెండవ భాషను మరో చోట ఎక్కడైనా ఉంచాలి అన్నట్లు ఉంటుంది.” రెండవ భాషను జీవితంలోని తర్వాతి దశల్లో నేర్చుకోవడం ఎందుకు కష్టంగా ఉంటుందో వివరించడానికి ఇది సహాయపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.
పిల్లల పెంపకం విషయంలో చైనీయుల ఆందోళనలు
చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, తలిదండ్రులు-పిల్లల సంబంధాల గురించి ఇటీవల ఒక భారీ అధ్యయనం జరిగిందని చైనా టుడే నివేదిస్తుంది. నేటి పిల్లలను పెంచడం గురించి అనేకమంది తలిదండ్రులు వ్యక్తపర్చిన ఆందోళనను ఆ పరిశోధన వెల్లడించింది. చైనా టుడే ప్రకారం, “తమ పిల్లలకు దేని గురించి బోధించాలి అనే విషయంలో కొంతమంది పూర్తి సందిగ్ధంలో ఉన్నారు—నిజాయితీ, మితం, సహనం మరియు శ్రద్ధ వంటి చైనీయుల సాంప్రదాయిక నైతికత గురించా లేక ఆధునిక పోటీ వైఖరి గురించా?” పిల్లలపై టీవీ చూపిస్తున్న ప్రతికూల ప్రభావాల గురించి దాదాపు 60 శాతం మంది తలిదండ్రులు వ్యాకులపడ్డారు. బిడ్డ చూసే కార్యక్రమాలను అతడు లేక ఆమె వయస్సు మరియు వ్యక్తిత్వం అనుసారంగా నియంత్రించాలనీ, పిల్లలతోపాటు కార్యక్రమాలను చూసి వాటిని వారితో చర్చించాలనీ, పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూసేందుకు అనుమతించకూడదనీ వార్తా పరిశోధకుడైన బు వే తలిదండ్రులకు సలహా ఇస్తున్నాడు.
ఇప్పటికీ అగ్రశ్రేణే
“ఏ ఇతర పుస్తకం కన్నా బైబిలు ప్రతులే ఇప్పటికీ ఎక్కువగా ముద్రించబడుతున్నాయి” అని ఇఎన్‌ఐ బులెటిన్ నివేదిస్తుంది. బైబిలు అత్యధికంగా పంచిపెట్టబడుతున్న దేశాలు చైనా, అమెరికా, బ్రెజిల్. యునైటెడ్ బైబిల్ సొసైటీస్ (యుబిఎస్) ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, 1996లో మొత్తం బైబిలు యొక్క 1.94 కోట్ల ప్రతులు పంచిపెట్టబడ్డాయి. ఇది ఒక క్రొత్త రికార్డు, 1995 కన్నా 9.1 శాతం పెరుగుదల. “ప్రపంచంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో పంపకంలో విశేషమైన పెరుగుదల” ఉన్నప్పటికీ, “లేఖనాలు ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేయడానికి మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది” అని యుబిఎస్‌లో ప్రచురణా విభాగ సమన్వయకర్తగా పనిచేస్తున్న జాన్ బాల్ చెప్పాడు.
షార్క్ యొక్క బద్ద శత్రువు?
షార్క్‌లు సాధారణంగా మానవులకు భయం పుట్టిస్తాయి. కానీ షార్క్‌లు మానవునికి భయపడడానికి మరెక్కువ కారణం ఉన్నట్లు అనిపిస్తుంది. షార్క్‌లు చేసే దాడికి ప్రతి సంవత్సరం “దాదాపు 40, 50 మంది” మానవులు మరణిస్తున్నారనీ, అయితే జాలరులు సంవత్సరానికి 10,00,00,000 షార్క్‌లను చంపుతున్నట్లు అంచనా వేయబడుతోందనీ, ఫ్రెంచి వార్తాపత్రిక అయిన ల మోండె నివేదిస్తుంది. నాశనం ఇలాగే కొనసాగితే మహాసముద్రాల సహజ సమతుల్యత దెబ్బతింటుందేమోనని భయపడే అనేకమంది సముద్ర జీవశాస్త్రజ్ఞులను ఈ వాస్తవం వ్యాకుల పరుస్తోంది. సముద్ర జీవాల జనసాంద్రతను అదుపు చేయడంలో షార్క్‌లు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. షార్క్‌లు లైంగిక పరిపక్వతకు మెల్లిగా చేరుకుని, సుదీర్ఘమైన గర్భావధి తర్వాత కేవలం కొన్ని పిల్లలనే కంటాయి గనుక, విపరీతంగా చేపలు పట్టడం షార్క్‌ల కొన్ని జాతులను అంతరించిపోయే ప్రమాదంలో పడవేస్తుంది. ప్రాముఖ్యంగా సముద్ర నిపుణులకు మనస్తాపం కలిగించే ఒక విషయమేమిటంటే, “ఫిన్నింగ్”—ఆహారం కొరకు షార్క్ రెక్కలను కోసేసుకుని, అది చనిపోయేందుకు దాన్ని తిరిగి సముద్రంలోకి పడేయడం.
నిరుద్యోగ ఒత్తిడి
జర్మన్ వార్తాపత్రిక అయిన సూడ్యెస్కీ ట్సైటంగ్‌లో ప్రస్తావించబడిన అధ్యయనాల ప్రకారం, నిరుద్యోగం వల్ల కలిగే భావోద్వేగ, సామాజిక ఒత్తిళ్లు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. అలాంటి ఒత్తిడి మూలంగా శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ బలహీనమౌతుందని చెప్పబడుతుంది. ఉద్యోగుల కంటే నిరుద్యోగులకు అధిక రక్త పోటు, గుండె పోటు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. “ఉద్యోగులకంటే దీర్ఘకాల నిరుద్యోగులు ఎదుర్కోవలసిన ఒత్తిడి తీవ్రమైనది, వారు తత్సంబంధిత పరిణామాలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది” అని జర్మనీ నందలి హానోవర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన టోమస్ కీజెల్‌బాక్ చెబుతున్నాడు. “దాదాపు నిరుద్యోగులందరూ నిరుత్సాహానికి సంబంధించిన రుగ్మతలతో ఏదో ఒక రకంగా బాధపడతారు.” యూరోపియన్ యూనియన్‌లో నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య, డెన్మార్క్, ఫిన్‌లాండ్, స్వీడెన్‌లలోని మొత్తం జనాభాను కలుపగా వచ్చే మొత్తానికి దాదాపు సమానంగా ఉందని చెప్పబడుతుంది.