మా పాఠకుల నుండి
ఎందుకింత అనారోగ్యం? “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను ఇంత అనారోగ్యంగా ఎందుకు ఉండవలసి వస్తోంది?” (మే 8, 1997) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. 21 ఏండ్ల నాకు సికిల్-సెల్ ఎనీమియా ఉంది. ఈ శీర్షికలో ఉన్న యౌవనస్థుల అనుభూతులను నేను అర్థం చేసుకోగలను. ఈ అనారోగ్యసమస్య ఉన్న నన్ను ఎవరన్నా ప్రేమించి, పెళ్ళి చేసుకుంటారా అని తరచూ అనుకునేదాన్ని. కానీ మీ శీర్షికలు నాకు సహాయం చేశాయి ఎందుకంటే ఆ విధంగా భావించేది నేనొక్కదాన్నే కాదని నాకిప్పుడు తెలిసింది.
డి. ఆర్., అమెరికా
“యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను ఇంత అనారోగ్యంగా ఎందుకు ఉండవలసి వస్తోంది?” (మే 8, 1997) అనే శీర్షికలో జేసన్ వ్యక్తం చేసిన భావోద్వేగాలన్నిటినీ నేనూ అనుభవించాను. నేను ఆ శీర్షికను చదివిన ప్రతిసారీ, నా పరిస్థితిని అర్థం చేసుకుని, గ్రహించి నన్ను పట్టించుకొనే ఒకవ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నా ఒత్తిళ్ళ భారాన్ని తగ్గించినందుకు కృతజ్ఞతలు. యెహోవా శ్రద్ధ వహిస్తాడనీ, తగిన సమయంలో అన్ని రకాల రుగ్మతలను తీసివేస్తాడనీ నాకు తెలుసు.
ఓ. ఎ., ఘానా
ఈ శీర్షిక రావడానికి రెండు వారాల ముందు నాకు మూర్ఛరోగం ఉన్నట్లు తెలిసింది. నాకు ఈ మధ్యనే 18వ ఏడు వచ్చింది, ఇటీవలే పొందిన నా స్వేచ్ఛలను ఆ అనారోగ్యం పరిమితం చేసింది. గుర్తుపెట్టుకుని అనేక మందులు సమయానికి వేసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు చనిపోయిన దుఃఖంలో ఉన్న నా తల్లిదండ్రులకు, నా అనారోగ్యం ఎంతో మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈ శీర్షిక నేను ఏడ్చేంతగా నన్ను స్పృశించి కదిలించింది. నాలోనే అణుచుకున్న నా అంతర్గత భావాలను అది చర్చించింది, మరిప్పుడు నేను మళ్ళీ మామూలుగా అయ్యానని భావిస్తున్నాను. ఇలాంటి సమస్యలు, చింతలు గల ఇతరులు కూడా ఉన్నారని నేను గ్రహించగల్గాను. నేను (ఆధ్యాత్మికంగా) బలంగా ఉండేందుకు కావల్సిన సమాచారాన్ని యెహోవా తన సంస్థ ద్వారా ముద్రిత రూపంలో అందిస్తున్నాడు.
డి. ఎస్., అమెరికా
ఈ శీర్షికను నేను చదివినప్పుడు, నా అనారోగ్యం మరెవ్వరికన్నా నా తల్లిదండ్రులను ఎక్కువ బాధిస్తుందని తెలుసుకున్నాను. నాకు వాళ్ళనుండే ఆ జబ్బు సంక్రమించిందనీ, ఆ తలంపు వారిని కృంగదీస్తుందనీ చెప్పారు. నేను వారిని చూసినప్పుడు నాకూ అలాగే అనిపించింది, వారి విషయంలో నేను కూడా ఎంతో బాధ పడుతున్నాను.
వై. హెచ్., జపాన్
బాల్యంలో నేను ఆరోగ్యంగానే ఉండేవాడిని. ఏమైనా, పెద్దయ్యే కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జబ్బులు వచ్చాయి. నేను పూర్తికాల పరిచర్య మొదలు పెట్టాను, మొదటి రెండు నెలలు నా అనారోగ్యం మూలాన నా లక్ష్యాలను చేరుకోలేక పోయాను. యెహోవాకు వ్యతిరేకంగా నేను ఏదో చేశాను కాబట్టే అనారోగ్యం చేత నేను శిక్షించబడుతున్నానన్న తప్పుడు ఆలోచనతో ఎంతో కృంగిపోయాను. ఈ శీర్షిక నేను నా పరిస్థితికి తగ్గట్లు సర్దుబాట్లు చేసుకోవడానికీ ధైర్యంగా ఉండడానికీ సహాయం చేసింది.
సి. కె., ఘానా
నా తొమ్మిదేండ్ల కూతురికి నేర్చుకొనే సామర్థ్యం లేదు, ఆమెకు మెదడు పక్షవాతం ఉంది. ఆమె చాలా తెలివైనది, తన అశక్తతలు తన మామూలు కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయని ఆమెకు తెలుసు. సాధారణంగా ఆమె ఆనందంగా ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ, తన అశక్తత అప్పుడప్పుడు కృంగదీస్తుంది. తాను కూడా ఇతర పిల్లల లాగ ఉండబోయే రాబోయే పరదైసును గూర్చి రాత్రిపూట వాళ్ళ నాన్నతో చేసే చర్చలతో పాటు, ఈ శీర్షిక కూడా ఆమెనెంతో ప్రోత్సాహపరచింది.
వై. పి., అమెరికా
దాదాపు పదేండ్లుగా, ‘కనిపించని రోగం’తో నేను బాధ పడుతున్నాను, అది నా జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపింది. దాని మూలంగా నేను పూర్తికాల పరిచర్యను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ శీర్షికను చదివినపుడు, నా కష్టాల్ని అర్థం చేసుకునే వారొకరున్నారని మొదటిసారిగా అనిపించింది. నేనేమి ఒంటరిదాన్ని కాదన్న విషయం నాకు ఉపశమనం కలిగించింది. పెద్ద భారాన్ని నాపైనుంచి తీసివేసినట్లుంది. మీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ప్రోత్సాహకరమైన సమయానుకూలమైన ఈ శీర్షికలు మనం ఈ పాత విధానంలో కొనసాగేలా చేస్తాయి.
ఎల్. కె., కెనడా