కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 3/8 పేజీలు 4-8
  • స్ట్రోక్‌—దాని కారణాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్ట్రోక్‌—దాని కారణాలు
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాని ప్రభావాలు
  • సంభాషణా సమస్యలు
  • భావోద్రేక మార్పులు, వ్యక్తిత్వ మార్పులు
  • కుటుంబ సభ్యులు కూడా బాధితులే
  • దాని పర్యవసానాలను తాళుకోవడం
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • స్ట్రోక్‌!
    తేజరిల్లు!—1998
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 3/8 పేజీలు 4-8

స్ట్రోక్‌—దాని కారణాలు

“శరీరంలో అతి సున్నితమైన అవయవం మెదడే”నని కెనడాలోని లండన్‌లోని వెస్ట్రన్‌ ఒంటారియో యూనివర్శిటీకి చెందిన న్యూరాలజిస్ట్‌ డా. వ్లడీమిర్‌ హాకిన్‌స్కీ అన్నారు. మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2 శాతమే అయినా, అది 1,000 కోట్ల కన్నా ఎక్కువ నాడీ కణాల్ని కల్గివుంది. ఈ కణాలు మనలో అన్ని రకాలైన ఆలోచననూ, కదలికలనూ, సంవేదననూ ఉత్పన్నం చేసేందుకు ఎడతెగకుండా పరస్పరం సంప్రదించుకుంటాయి. శక్తి కోసం ఆక్సిజన్‌, గ్లూకోజ్‌లపై ఆధారపడిన మెదడు, ధమనుల సంక్లిష్టమైన వ్యవస్థ గుండా వాటిని ఎడతెగకుండా పొందుతుంది.

అయితే, మెదడులోని ఏ చిన్న భాగానికైనా ఆక్సిజన్‌ కేవలం కొన్ని సెకన్లు అందకపోయినా, సున్నితమైన నాడీకణాలు చేసే పనులు బలహీనపడిపోతాయి. కొన్ని నిమిషాలకన్నా ఎక్కువసేపు ఇలాగే జరిగితే, మెదడులోని కణాలు అదుపుచేసే విధులు స్థంభించిపోవడంతోపాటూ ఆ కణాలు కూడా నశించడం మొదలౌతుంది గనుక మెదడు దెబ్బతింటుంది. ఈ స్థితినే ఇస్కీమియా అని పిలుస్తారు. ఇస్కీమియా అంటే ధమనులు మూసుకుపోవడం మూలంగా ఆక్సిజన్‌ సరఫరాలో ప్రధానంగా ఏర్పడే కొరతే. ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడం ప్రాణాంతకమైన రసాయనిక ప్రతిచర్యల పరంపరను పుట్టిస్తుండగా, మెదడు కణధాతువులు మరింత దెబ్బతింటాయి. దాని ఫలితమే స్ట్రోక్‌. రక్తనాళాలు చిట్లి, రక్తంతో మెదడు ముంచెత్తబడి, అనుసంధాన మార్గాలు మూసుకుపోయినప్పుడు కూడా స్ట్రోక్‌ వస్తుంది. కండరాలకు చేరే రసాయనిక, ఎలక్ట్రికల్‌ ప్రసరణలకు ఇది అంతరాయం కలుగజేసి, మెదడు ధాతువులు దెబ్బతినడానికి కారణమౌతుంది.

దాని ప్రభావాలు

స్ట్రోక్‌ స్ట్రోక్‌కీ తేడా ఉంటుంది. దాదాపుగా అపరిమితమైన రీతుల్లో స్ట్రోక్‌లు ఆయా వ్యక్తులను ప్రభావితం చేయగలవు. స్ట్రోక్‌ మూలంగా ఏయే పర్యవసానాలైతే కలగడానికి అవకాశముందో ఆయా పర్యవసానాలన్నింటికీ స్ట్రోక్‌కు గురైన వారంతా గురికాకపోయినా, అది చూపించే ప్రభావాలు అంత తీవ్రంకాని, బొత్తిగా గమనించలేని స్థాయి నుండి తీవ్రంగానూ స్పష్టంగా గుర్తించగలిగే బాధాకరమైన స్థాయి వరకూ ఉండవచ్చు. మెదడులో ఏ భాగం స్ట్రోక్‌కు గురౌతుందనే దాన్ని బట్టి, శరీరం నిర్వర్తించే ఆయా విధులు బలహీనమౌతాయి.

స్ట్రోక్‌కు గురైన వాళ్లందరికీ సాధారణంగా కాళ్లూ చేతులు బలహీనమౌతాయి లేక చచ్చుబడిపోతాయి. సాధారణంగా, ఇది శరీరంలో ఒక వైపు మాత్రమే అంటే, మెదడులో స్ట్రోక్‌కు గురైన భాగానికి అభిముఖంగావున్న వైపుకు మాత్రమే పరిమితమౌతుంది. మెదడులో కుడివైపు భాగానికి నష్టం జరిగితే, శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురౌతుంది, ఎడమవైపు భాగానికి నష్టం జరిగితే, కుడి భాగం పక్షవాతానికి గురౌతుంది. కొంతమందికి పడిపోయిన కాళ్లూ చేతులు తిరిగి బలం పుంజుకోవచ్చు. కానీ వాళ్ల కండరాలు సమన్వయాన్ని కోల్పోయి కాళ్లూ చేతులు ఎటుపడితే అటు ఊగిపోయేంతగా వణుకుతాయి. స్ట్రోక్‌ బాధితుడు పడిపోకుండా సమన్వయాన్ని కాపాడుకోడానికి ప్రయత్నించే క్రొత్తగా స్కేటింగ్‌ నేర్చుకుంటున్న వ్యక్తివలే ఉంటాడు. “తమ కాళ్లూ చేతులు కదులుతున్నాయో లేదో, అవెక్కడున్నాయో అనే విషయాన్ని తెలియజేసే స్పర్శజ్ఞానం వాళ్లకుండదు” అని న్యూయార్క్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న డా. డేవిడ్‌ లవైన్‌ అంటున్నారు.

స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడ్డ వారిలో 15 శాతం కంటే ఎక్కువమందికి ఫిట్స్‌ వస్తాయి. అప్పుడు వాళ్ళు తమ కదలికలను అదుపుచేసుకోలేరు, సాధారణంగా ఇది వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు జరుగుతుంది. నొప్పికలగడం, అలాగే స్పర్శేంద్రియాల్లో మార్పులు రావడం కూడా సర్వసాధారణమే. చేతులూ పాదాలూ ఎప్పుడూ మొద్దుబారినట్లు అనిపించే స్ట్రోక్‌ బాధితుడు ఇలా అన్నాడు: “నా కాళ్లకేదైనా తగిలినప్పుడు, నిద్రాభంగం కల్గిన రాత్రుళ్లెన్నో ఉన్నాయి, ఎందుకంటే అలా తగలడం నేను విద్యుద్ఘాతానికి గురైనట్టు అన్పించేది.”

స్ట్రోక్‌ మూలంగా కల్గే పర్యవసానాల్లో ఒకరు ఇద్దరుగా కనబడడమూ, మ్రింగడం కష్టంగా ఉండడమూ చేరివుండవచ్చు. నోటిలోని, గొంతులోని స్పర్శ కేంద్రకాలు పాడైనట్లైతే, నోటిలోనుండి చొల్లుకారడంవంటి సిగ్గుతో కుంచించుకుపోవడానికి కారణమయ్యే వాటిని స్ట్రోక్‌ బాధితులు భరించాల్సివుంటుంది. పంచేంద్రియాలు ఐదింటిలో వేటినైనా ప్రభావితంచేసి, చూపూ, వినికిడీ, వాసనా, రుచీ, స్పర్శజ్ఞానాలకు అంతరాయాల్ని కల్గించవచ్చు.

సంభాషణా సమస్యలు

మసక చీకటిగావున్న వీధిలో ఇద్దరు వస్తాదుల్లాంటి అపరిచితులు మీ వెంటబడ్డారని ఊహించుకోండి. వాళ్లు మీవైపే వడివడిగా వస్తుండడాన్ని మీరు మీ భుజాలమీదుగా గమనించారు. సహాయం కోసం మీరు అరవడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ నోట్లోంచి మాట రాదు! అలాంటి స్థితిలో మీకు కలిగే నిస్పృహను మీరు ఊహించగలరా? మాట్లాడే తమ సామర్థ్యాన్ని ఆకస్మికంగా కోల్పోయినప్పుడు, స్ట్రోక్‌ బాధితుల్లో అనేకులు పొందే అనుభవమదే.

స్ట్రోక్‌ మూలంగా కలిగే అత్యంత వినాశనకరమైన పర్యవసానాల్లో ఒకటేమిటంటే తమ ఆలోచనలనూ, భావాలనూ, నిరీక్షణలనూ, భయాలనూ తెలియజేయలేని అశక్తులుగా ఉండడమే, అంటే స్నేహితులకూ, కుటుంబ సభ్యులకూ అలంకారికంగా దూరంకావడమేనన్న మాట. స్ట్రోక్‌కు గురై బ్రతికిబయటపడిన ఒకవ్యక్తి దాన్నిలా వర్ణించాడు: “ఏదో చెప్పాలని నేను ప్రయత్నించిన ప్రతీసారీ నా నోట మాట వచ్చేది కాదు. నేనిక బలవంతంగా మాట్లాడకుండా కూర్చోవాల్సి వచ్చేది, మౌఖికంగాగానీ, రాతపూర్వకంగాగానీ చెప్పినవాటిని నేను అనుసరించలేక పోయేవాడ్ని. నా చుట్టూ ఉన్న వాళ్లంతా ఏదో పరాయిభాషను మాట్లాడుతున్నారన్నట్టుగా . . . వాళ్ల మాటలు నాకనిపించేవి. నేను భాషను గ్రహించలేకపోయేవాడ్ని, ఉపయోగించలేక పోయేవాడ్ని.”

అయితే, చార్లెస్‌ తనతో మాట్లాడిన ప్రతీదాన్ని అర్థం చేసుకునేవాడు. కానీ జవాబివ్వాల్సి వచ్చినప్పుడు, “నేను చెప్పాలనుకొన్న మాటలను ముందు కూర్చుకుంటాను, కానీ అవి బయటకొస్తున్నప్పుడు కలగాపులగమైపోతాయి. అప్పుడు నాకు, నాలో నేను బంధించబడి పోయానేమోననిపించేది” అని ఆయన రాస్తున్నాడు. స్ట్రోక్‌: ఏన్‌ ఓనర్స్‌ మాన్యువల్‌ అనే తన పుస్తకంలో ఆర్థర్‌ జోసెఫ్స్‌ ఇలా వివరిస్తున్నాడు: “మాట్లాడే సమయంలో వందకుపైగా వివిధ రకాలైన కండరాలు నియంత్రించబడి, సమన్వయపర్చబడతాయి. ఆ కండరాల్లో ప్రతీదాన్నీ సగటున వంద చలన (మోటారు) యూనిట్లకన్నా ఎక్కువ యూనిట్లు నియంత్రిస్తాయి . . . మాట్లాడే ప్రతీ సెకనుకీ ఆశ్చర్యాన్ని కల్గించేరీతిలో 1,40,000 నాడీకండర సంబంధమైన (న్యూరోమస్క్యులార్‌) విధులు అవసరమౌతాయి. ఈ కండరాల్ని నియంత్రిస్తున్న మెదడులోని ఒక భాగానికి గాయం కావడమనేది బహుశా అర్థంపర్థంలేని రీతిలో కలగాపులగంగా మాట్లాడడానికి కారణంకావడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?”

మెదడులోని వాక్‌ భాగంలో అనేక చిత్తవైకల్య ఘటనలను స్ట్రోక్‌ ఉత్పన్నం చేస్తుంది. ఉదాహరణకు, స్ట్రోక్‌ మూలంగా మాట్లాడలేని వ్యక్తి బహుశా పాడగల్గుతాడు. మరొక వ్యక్తైతే అనుకోకుండా యధాలాపంగా చెప్పుకుపోతాడు గానీ వాటిని తాను నిజంగా చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకపోవచ్చు, లేకపోతే లొడలొడా మాట్లాడవచ్చు. ఇతరులైతే చెప్పిన మాటల్నే, పదబంధాల్నే మరలా మరలా చెప్పడమో లేక మాటల్ని తగనిరీతిలో ఉపయోగించడమో చేస్తారు, తాము కాదని చెప్పాలనుకున్నప్పుడు అవుననో లేక అవునని చెప్పాలనుకున్నప్పుడు కాదనో అంటూంటారు. కొందరికైతే తాము ఉపయోగించదల్చుకున్న మాటలేంటో వాళ్లకు తెలుసు, కానీ వాటిని పలికేలా మెదడు నోటినీ, పెదాలనూ, నాలుకనూ ప్రేరేపించలేదు. లేకపోతే కండరాల బలహీనతనుబట్టి వాళ్లు, అస్పష్టంగా మాట్లాడవచ్చు. కొంతమంది మాటల మధ్య పెద్ద పెద్దగా కేకలు వేయవచ్చు.

స్ట్రోక్‌ కల్గించే మరొక నష్టం ఏమిటంటే, బహుశా భావోద్రేక స్థాయిని నియంత్రించే మెదడు భాగాన్ని బలహీనపర్చడం. తత్ఫలితంగా మాట్లాడే మాటలు పీలగా ఉండవచ్చు. లేక ఇతరుల మాటల్లోని భావోద్రేక స్థాయిని గ్రహించడం కష్టమవ్వచ్చు. ఇలాంటి సంభాషణా అంతరాయాలూ, పైన వర్ణించబడిన అంతరాయాలూ కుటుంబసభ్యుల మధ్య అంటే, భార్యాభర్తల మధ్య అడ్డుగోడలుగా నిలవవొచ్చు. గేగ్‌ ఇలా వివరిస్తున్నాడు: “ముఖ కవళికల్నీ, అభినయాల్నీ, నిజం చెప్పాలంటే మొత్తం వ్యక్తిత్వాన్నే స్ట్రోక్‌ ప్రభావితం చేస్తుంది గనుక, ఇంతకు మునుపులాగాక ఉన్నట్టుండి మాకిప్పుడు కలిసిమెలసి ఉండడమనేది కష్టమైపోయింది. ఇది మరలా నేను కొత్తగా కాపురాన్ని ప్రారంభించినట్టూ, నా భార్య ఆలోచనాభిరుచుల్ని గురించి ఇప్పుడు మరలా కొత్తగా తెలుసుకోవాలన్నట్టూ నాకన్పించింది.”

భావోద్రేక మార్పులు, వ్యక్తిత్వ మార్పులు

మనోభావాల్లో అయుక్తమైన ఒడిదుడుకులు, గోలపెట్టి ఏడ్వడం లేక పగలబడి నవ్వడం, విపరీతపుకోపం, అసాధారణ అనుమానాలు, విచారంతో క్రుంగిపోవడం వంటివి తీవ్రమైన భావోద్రేక, వ్యక్తిత్వ అలజడులలో భాగమైవున్నాయి, మరి స్ట్రోక్‌కు గురై బ్రతికి బయట పడినవాళ్లూ, వాళ్ల కుటుంబ సభ్యులూ వాటితో వ్యవహరించాల్సివుంటుంది.

స్ట్రోక్‌ బాధితుడైన గిల్బర్ట్‌ ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు, నేను చాలా చిన్నచిన్న విషయాలకే నవ్వుతూ, లేక ఏడుస్తూ భావోద్రేకానికి గురౌతాను. ఒక్కోసారి, నేను నవ్వినప్పుడు, ‘నువ్వెందుకు నవ్వుతున్నావు?’ అని ఎవరో ఒకరు అడుగుతారు, మరి వాళ్లకేమని చెప్పాలో నాకు తెలియదు.” ఇవీ, వీటితోపాటు తూలిపడిపోకుండా సమన్వయాన్ని కాపాడుకోవడంలోగల సమస్యలూ, కొంచెం కుంటుతూ నడవడమూ వంటివి గిల్బర్ట్‌ ఇలా అనేలా చేశాయి: “నేను మరొక దేహంలో ఉన్నట్టుగానూ, స్ట్రోక్‌ రావడానికి ముందున్న వ్యక్తిలాగాక నేనొక వేరే వ్యక్తినన్నట్టుగానూ భావించాను.”

మనస్సునూ శరీరాన్నీ మార్చేస్తున్న బలహీనతలతో జీవిస్తూ, అనేకమంది భావోద్రేక అలజడుల్లో పడి కొట్టుకుపోతారు. స్ట్రోక్‌ బారినపడి వాక్‌ వైకల్యానికీ, పాక్షికంగా పక్షవాతానికీ గురైన హీరాయూకీ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “తగినంత సమయం గడిచిన తర్వాత కూడా, నాకు బాగవ్వలేదు. నేను ఇంతకుముందు చేస్తున్నట్లుగా నా పనిని నేనిక చేసుకోలేనని గ్రహించి, నిస్పృహకు గురయ్యాను. నేను వస్తువుల్నీ, ప్రజల్నీ నిందించడం మొదలెట్టాను. నా సహనం హద్దులు దాటుతున్నట్టు భావించాను. నేను మగవాడిలాగ ప్రవర్తించలేదు.”

స్ట్రోక్‌ బాధితుల్లో భయాందోళనలు సర్వసాధారణమే. ఎలెన్‌ ఇలా అంటోంది: “రాబోయే స్ట్రోక్‌కు హెచ్చరికగా నా తలలో ఒత్తిడి పెరిగినప్పుడు నాలో అభద్రతా భావాలు కలుగుతాయి. నేనిలా ప్రతికూలంగా ఆలోచించడానికి నన్ను నేను అనుమతించుకుంటే నిజంగానే నేను గజగజలాడిపోతాను.” రాన్‌ తాను ఎదుర్కొంటున్న ఆందోళన గురించి ఇలా వివరిస్తున్నాడు: “సరియైన నిర్ధారణలకు రావడం కొన్నిసార్లు ఇంచుమించుగా అసాధ్యమే. ఏకకాలంలో రెండు మూడు సమస్యల్ని పరిష్కరించుకోవడం నన్ను నిస్పృహకు గురిచేస్తుంది. నేను విషయాల్ని ఎంత త్వరగా మర్చిపోతానంటే, కొన్నిసార్లు కొన్ని నిమిషాల క్రిందట తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గుర్తుంచుకోలేను. తత్ఫలితంగా, నేను కొన్ని భయంకరమైన తప్పుల్ని చేస్తుంటాను, అవి నన్నూ ఇతరుల్నీ సిగ్గుపడేలా చేస్తాయి. కొన్నేళ్ల తర్వాత నేనెలా ఉంటాను? నేను మరలా జ్ఞానయుక్తంగా సంభాషించగలనా, లేక కారును ఒడుపుగా డ్రైవ్‌ చేయగలనా? నేను నా భార్యకు భారంగా తయారవుతానా?”

కుటుంబ సభ్యులు కూడా బాధితులే

అయితే, వినాశకరమైన పర్యవసానాలతో పెనుగులాడేది స్ట్రోక్‌ బాధితులు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా. కొన్ని కేసుల్లోనైతే, గలగలా మాట్లాడుతూ, సమర్థవంతంగా పనిచేసే వ్యక్తి, ఉన్నట్టుండి తమ కళ్లెదుటే నానాటికీ క్షీణించిపోతూ, ఇతరులపై ఆధారపడే ఒక పసిపాపలాంటి స్థితిలోకి మారిపోవడాన్ని చూడడం మూలంగా కలిగే భయంకరమైన షాక్‌ను వాళ్లు తట్టుకోవాలి. కుటుంబ సభ్యులు, బహుశా తమకు అంతగా అలవాటులేని పనులను చేయాల్సి వచ్చినప్పుడు బాంధవ్యాలకు విఘాతం ఏర్పడవచ్చు.

హారూకో విషాదకరమైన ప్రభావాల్ని ఇలా తెలియజేస్తోంది: “మా ఆయన దాదాపుగా ముఖ్యమైన విషయాలన్నింటినీ మర్చిపోయాడు. ఆయన నడుపుతున్న కంపెనీని ఉన్నపళంగా ఆపేయాల్సి వచ్చింది, మా ఇంటినీ, ఆస్తిపాస్తుల్నీ వదులుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందులా ఫ్రీగా మా ఆయనతో మాట్లాడలేకపోవడమూ, సలహా కోసం ఆయన దగ్గరకు వెళ్లలేకపోవడమూ నన్ను అన్నిటికన్నా ఎక్కువగా బాధించింది. రాత్రికీ పగలుకూ మధ్య తేడా తెలియక తికమకపడి, ఆయన రాత్రివేళల్లో అవసరమయ్యే ప్రొటెక్టివ్‌ డయాపర్లను (పరుపు పాడవకుండా ఉండేందుకు వేసుకునే ప్రత్యేకమైన వస్త్రాలను) తరచూ తీసివేసేవారు. ఆయన ఈ స్థితికి వచ్చే సమయం వస్తుందని మాకు తెల్సినప్పటికీ, వాస్తవాన్ని మేమిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది, ఈ తారుమారైన పరిస్థితిలో నేనూ మా అమ్మాయీ ఆయన్ని చూసుకోవాల్సి వస్తుంది.”

“మీరు స్ట్రోక్‌కు గురైన వారిని ఎంతగా ప్రేమించినప్పటికీ, కొన్నిసార్లు వాళ్ల గురించి శ్రద్ధ తీసుకోవడం మిమ్మల్ని కృంగదీయవచ్చు. బాధ్యతా ఒత్తిళ్లూ దాన్ని తగ్గించజాలవు” అని స్ట్రోక్స్‌: వాట్‌ ఫేమిలీస్‌ షుడ్‌ నో అనే పుస్తకంలో ఇలేన్‌ ఫాన్టల్‌ షిమ్‌బర్గ్‌ తెలియజేసింది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తి గురించి కొంతమంది కుటుంబ సభ్యులు తీసుకొంటున్న మితిమీరిన శ్రద్ధ, వారి ఆరోగ్యాన్నీ, భావోద్రేకాల్నీ, ఆధ్యాత్మికతనూ దెబ్బతీయవచ్చు. తన తల్లికి వచ్చిన స్ట్రోక్‌ తన జీవితంపై భయంకరమైన ప్రభావాన్ని చూపించిందని మారియా వివరిస్తోంది: “ప్రతీరోజూ మా అమ్మ దగ్గరకెళ్లి ఆమెతో కలిసి చదువుతూ, ప్రార్థనచేస్తూ, ఆమెను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను, ఆపై ప్రేమలు కురిపించి, గట్టిగా ఆలింగనం చేసుకుని, ముద్దులతో ముంచెత్తుతాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి, భావోద్రేకపరంగా అలిసిపోయేదాన్ని. ఒక్కోసారి వాంతులు చేసుకునేంతగా అలసిపోయేదాన్ని.”

స్ట్రోక్‌కు గురైన వారిని చూసుకునేవారు తాళుకోవాల్సిన అత్యంత క్లిష్టమైన విషయం, ప్రవర్తనలో వచ్చే మార్పే. న్యూరోసైకాలజిస్ట్‌ డా. రొనాల్డ్‌ కాల్వానియో తేజరిల్లు!తో ఇలా అంటున్నారు: “హై కార్టికల్‌ (మెదడులో బూడిదరంగులో ఉండే బాహ్య పొర నిర్వర్తించే) విధులను ప్రభావితంచేసే అంటే, ఒక వ్యక్తి ఆలోచించే విధానాన్నీ, గడిపే జీవితాన్నీ, భావోద్రేక ప్రతిచర్యలనూ ప్రభావితంచేసే రోగం మీకున్నప్పుడు, మనం యావత్‌ వ్యక్తిత్వంతో వ్యవహరిస్తున్నామన్న మాట. అందుకని, సంభవించే మానసికసంబంధమైన బలహీనతలు నిర్దిష్టమైన రీతుల్లో, ఫక్తు నాటకీయంగా కుటుంబమనే ప్రపంచాన్ని నిజంగా మార్చేస్తాయి.” యోషీకో ఇలా అంటోంది: “మా ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత పూర్తిగా మారిపోయినట్టు అన్పించింది. మరీ చిన్నచిన్న విషయాలకు కూడా ఒక్కసారిగా కోప్పడుతున్నారు. అలాంటి సమయాల్లో నాకు నిజంగా దుఃఖమాగదు.”

తరచుగా, కుటుంబ సభ్యులుకాని వాళ్లు వ్యక్తిత్వంలోని మార్పుల్ని గుర్తించలేకపోవచ్చు. అందుకే, స్ట్రోక్‌ బాధితుల గురించి శ్రద్ధ వహించే కొంతమంది, తాము ఒంటరిగా విడిచిపెట్టబడినట్టు భావించి, తమ భారాన్ని తామే భరిస్తుంటారు. మీడోరీ ఇలా వివరిస్తోంది: “స్ట్రోక్‌లు మా ఆయన్ని మానసిక భావోద్రేక వైకల్యానికి గురైనవానిగా మిగిల్చాయి. ఆయనకు ప్రోత్సాహం ఎంతో అవసరమైనా, దాన్ని గురించి ఆయన ఇతరులతో అస్సలు మాట్లాడరు, తనలో తానే బాధపడతారు. కాబట్టి ఆయన భావోద్రేక పరిస్థితులతో వ్యవహరించాల్సిన బాధ్యత కూడా నాపైనే పడింది. ప్రతీరోజూ మా ఆయన చిత్తప్రవృత్తుల్లో వచ్చే మార్పుల్ని గమనించడం నన్ను ఆందోళనకు గురిచేసింది, మరి కొన్నిసార్లు నన్ను భయకంపితురాల్ని చేసింది.”

స్ట్రోక్‌కు గురై బ్రతికి బయట పడిన అనేకులూ, వారి కుటుంబ సభ్యులూ తమ జీవితాల్లో అది తీసుకొచ్చిన మార్పుల్ని ఎలా తాళుకున్నారు? స్ట్రోక్‌ తెచ్చిపెట్టిన వైకల్య ప్రభావాల మూలంగా బాధ పడుతున్న వారికి మనలో ప్రతి ఒక్కరమూ ఏ యే రీతుల్లో మద్దతునివ్వవచ్చు? మా తర్వాతి శీర్షిక వివరిస్తుంది.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

హెచ్చరికా సూచనలు

• ఆకస్మిక బలహీనత, చచ్చుబడిపోవడం, లేక ముఖానికి గానీ, కాలికి గానీ లేక చేతికి గానీ పక్షవాతం రావడం, అదీ ముఖ్యంగా శరీరంలో ఒక వైపున మాత్రమే రావడం

• ఆకస్మికంగా కంటిచూపు మసకబారడం లేక తగ్గిపోవడం, ముఖ్యంగా ఒక కంటికే అలా కావడం; తరచూ ఒక్కరు ఇద్దరుగా కనబడడం

• సరళ వాక్యాలను కూడా మాట్లాడడం లేక అర్థంచేసుకోవడం కూడా కష్టతరమవ్వడం

• ముఖ్యంగా వేరే రోగలక్షణంతోపాటు కలిసివున్నప్పుడు, తలతిరగడం లేక శరీర సమన్వయాన్ని కోల్పోవడం లేక పరస్పర సహకారం లేకపోవడం

అంత సాధారణం కాని రోగలక్షణాలు

• ఆకస్మికంగానూ, చెప్పనలవికాని రీతిలోనూ, తీవ్రంగానూ వచ్చే తలపోటు—ఇది, “ఇంతకు మునుపెన్నడూ రానంత తీవ్రమైన తలపోటు” అని తరచూ వర్ణించబడుతుంది

• ఆకస్మిక వికారం, (రోజుల తరబడిగాక నిమిషాల్లో లేక గంటల్లో దాడిచేసే) సూక్ష్మక్రిముల మూలంగా వచ్చే రోగానికి భిన్నమైన జ్వరం

• కొంతసేపు అచేతనావస్థలో ఉండడం లేక కొంతసేపటి వరకూ ఏం జరుగుతుందో తెలియక పోవడం (మూర్ఛపోవడం, అయోమయంలో పడిపోవడం, వణకడం, కోమాలో పడిపోవడం)

రోగలక్షణాలను అలక్ష్యంచేయకండి

రోగలక్షణాలు కన్పించినప్పుడు, రోగి “ఆసుపత్రి ఎమర్జెన్సీవార్డుకి వీలైనంత త్వరగా వెళ్లాలి. స్ట్రోక్‌కు గురైన మొదటి కొద్ది గంటల్లో చికిత్సచేయబడితే, నష్టాన్ని తగ్గించవచ్చనేందుకు రుజువులున్నాయి” అని డా. డేవిడ్‌ లవైన్‌ ఉద్బోధిస్తున్నారు.

కొన్నిసార్లు రోగలక్షణాలు చాలా కొద్దిసేపు మాత్రమే కన్పించి, తర్వాత మటుమాయమవ్వవచ్చు. ఇలా వస్తూ పోవడాన్ని ట్రేన్సియన్ట్‌ ఇస్కీమిక్‌ ఎటాక్స్‌ (అల్పకాలిక ఇస్కీమిక్‌ పోటులు) అనీ లేక టిఐఎలు అనీ అంటారు. వాటిని అలక్ష్యం చేయకండి, ఎందుకంటే అవి తీవ్రమైన స్ట్రోక్‌ వచ్చే అపాయాల్ని సూచించవచ్చు, వాటితోపాటూ స్ట్రోక్‌ పూర్తిస్థాయిలో కూడా రావొచ్చు. వాటికిగల కారణాలకు డాక్టరు చికిత్సచేయగలడు, మరి భవిష్యత్తులో రాబోయే స్ట్రోక్‌ అపాయాన్ని తగ్గించడానికి సహాయపడగలడు.

అమెరికాలోని కొలరాడోనందలి ఎన్గల్‌ వుడ్‌లోని నేషనల్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ ఇచ్చిన నిర్దేశకసూత్రాల నుండి తీసుకోబడినవి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి