కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 3/8 పేజీలు 8-12
  • దాని పర్యవసానాలను తాళుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దాని పర్యవసానాలను తాళుకోవడం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ సభ్యులూ, స్నేహితులూ ఇచ్చే మద్దతు
  • మద్దతునివ్వడాన్ని నేర్చుకోవడం
  • యెహోవా ప్రేమపూర్వక మద్దతుతో తాళుకోవడం
  • శ్రద్ధ తీసుకొనేవారికి మద్దతు లభిస్తుంది
  • తీవ్రమైన పరిమితులను ఎదుర్కోవడం
  • స్ట్రోక్‌—దాని కారణాలు
    తేజరిల్లు!—1998
  • స్ట్రోక్‌!
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 3/8 పేజీలు 8-12

దాని పర్యవసానాలను తాళుకోవడం

పక్షవాతంతో కాళ్లూ చేతులు పడిపోయి ఆసుపత్రిలో మంచంపైవున్న గిల్బర్ట్‌ తన డాక్టర్ని ఇలా అడిగాడు: “నా కాలూ చెయ్యి నేనెప్పటికైనా మరలా ఉపయోగించగలనా?” గిల్బర్ట్‌ సవాలుతోకూడిన జవాబును విన్నాడు: “మీరు ఎంత తీవ్రంగా కృషిచేస్తే, అంత తొందరగా మీ కాలూ చెయ్యీ మీకొస్తాయి, అంత త్వరగా మీరు దాన్ని సాధించగల్గుతారు.” దానికాయన “నేను సిద్ధం” అని ప్రత్యుత్తరమిచ్చాడు. 65 ఏళ్ల వయస్సులో ఫిజికల్‌ థెరపీకి, అనుకూల దృక్పథంతోడై ఆయన వీల్‌ ఛైర్‌ నుండి చిన్నపిల్లలకు నడకను నేర్పే చక్రాలబండిలాంటి దాని సహాయంతో నడిచేంత వరకూ, అటుతర్వాత చేతికర్ర సహాయంతోనూ, మరి ఆపై మునుపటిలా మామూలుగా పనిచేసుకునే స్థితికి వచ్చేలా సహాయపడింది.

“నేడు స్ట్రోక్‌కు గురైన తర్వాత మరలా పూర్వపుస్థితికి రావడం ఎక్కువగా, మెదడులోని ఒక భాగం పాడైతే, దెబ్బతిన్న మెదడు కణజాలాలు నిర్వహించే పాత్రను మెదడులోని మరితర భాగాలు చేపడతాయనే సిద్ధాంతాన్ని సమర్థిస్తోంది. ఫిజికల్‌ థెరపీ ఉద్దేశాల్లో ఒకటి ఏమిటంటే, పాడవ్వని ఈ భాగాల అంతర్నిహితశక్తిని వెలికితీసి, అవి పునఃసంస్థీకరించబడి, (దాని విధులను నిర్వర్తించేలా) మలచడానికి మెదడు అనుమతించేలా ప్రేరేపణను ఇవ్వడమే”నని వైనర్‌, లీ, బెల్‌ అనే పరిశోధకులు తెలియజేశారు. అయితే, రోగి పునరుద్ధరణను స్ట్రోక్‌కు గురైన మెదడులోని భాగమూ, దాని తీవ్రతా, ఆ వ్యక్తి సాధారణ ఆరోగ్యపరిస్థితీ, పొందే వైద్య సదుపాయాల నాణ్యతా, ఇతరులు ఇచ్చే మద్దతూ వంటి ఇతర కారకాలు కూడా నిర్థారిస్తాయి.

కుటుంబ సభ్యులూ, స్నేహితులూ ఇచ్చే మద్దతు

ఎరికా నడవడాన్నీ, పడిపోయిన తన ఎడమచేయి చేసే పనుల్ని కుడిచేయి చేసేలా దాన్ని ఉపయోగించడాన్నీ నేర్చుకుంటూ, పూర్వస్థితికి తీసుకొచ్చే ఎక్సర్‌సైజుల్ని మూడేళ్లపాటు చేసింది. తాళుకోవడానికి తనకేది సహాయపడిందో ఆమె ఇలా చెబుతోంది: “మా వారూ, నా స్నేహితులూ చివరివరకూ నన్నంటిపెట్టుకొని ఉండడమే అతి ప్రాముఖ్యమైన విషయం. వాళ్లు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం నాకు కొండంత బలాన్నిచ్చింది. విడిచిపెట్టొద్దని వాళ్లు నన్ను ప్రోత్సహించినప్పుడు, అది నన్ను ప్రేరేపించింది.”

తమ ప్రియమైన వారిని మునుపటి స్థితికి తెచ్చే ప్రక్రియలో కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారు. అప్పటికే కొంతవరకు మెరుగుపడిన స్థితిని పోగొట్టుకోకుండా ఇంటిదగ్గర కొనసాగించాల్సిన అవసరమున్న థెరపీలను గురించి వాళ్లు వైద్య సిబ్బందిని ప్రశ్నలడిగి, వాటిని గమనించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులూ, స్నేహితులూ చూపించే సహనమూ, దయా, అవగాహనా, అనురాగమూ వంటివి భద్రతతోకూడిన భావోద్రేక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి, ఆ వాతావరణంలో మాట్లాడడాన్నీ, చదవడాన్నీ, దైనందిన జీవితానికి ఉపయోగపడే మరితర నైపుణ్యాల్నీ తిరిగి నేర్చుకోవచ్చు.

ఎక్సర్‌సైజులనూ, ఫిజికల్‌ థెరపీలనూ చెయ్యీ, చెయ్యీ అని తొందరపెట్టడానికీ, జాలిపడి చేయకుండా ఉండనివ్వడానికి మధ్య సమతూకం కల్గి ఉండేందుకు ప్రయత్నిస్తూ, జాన్‌ తన భార్యయైన ఎలెన్‌కు సహాయపడడంలో బాగా కష్టపడ్డాడు. తన కుటుంబ సభ్యులు చేసిన కృషిని ఆయన ఇలా వర్ణిస్తున్నాడు: “ఎలెన్‌ తన దుస్థితికి తానే జాలిపడి క్రుంగిపోకుండా ఉండేలా మేం చూసుకున్నాం. కొన్నిసార్లు మేం (ఎక్సర్‌సైజులు చేయించడంలో) ఆమె పాలిట నియంతల్లా ఉన్నా, ఆమె పరిమితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సహాయం చేసేవాళ్లం. ఆమె మరీ సున్నిత మనస్కురాలు గనుక, ఆమెకు ఒత్తిడి కలిగించకుండా ఉండేందుకు నేను ప్రయత్నిస్తాను.”

స్పీచ్‌ థెరపిస్ట్‌ సహాయంతో ఎలెన్‌ మళ్లీ మాట్లాడడం నేర్చుకుంటుండగా, జాన్‌ ఆమెకు సహాయం చేశాడు. “కలిసి పనులు చేసుకోవడమనేది ప్రోత్సాహానికొక మాధ్యమంగా ఉండేది, కాబట్టి మేం బైబిల్ని ఒకరి కొరకు మరొకరం బిగ్గరగా చదువుతాం, అది ఆమె మాట్లాడే విధానాన్ని మెరుగుపర్చుకోవడానికి సహాయపడింది. మేం యెహోవాసాక్షులం గనుక, నెమ్మది నెమ్మదిగా మేం పరిచర్యలో భాగంవహించడం మొదలుపెట్టాం. ఈ విధంగా, ఎలెన్‌ భవిష్యత్తు విషయంలో మాకున్న నిరీక్షణను ఇతరులతో పంచుకోగలిగింది. ఎలెన్‌కైతే ఇలా చేయడమనేది ఒక థెరపీలా పనిచేసింది.” మూడేళ్లు ముగిసిపోయేనాటికి, ఎలెన్‌ ఎంతగానో మెరుగుపడింది.

స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడ్డ వ్యక్తులు కోలుకోవడంపై స్నేహితులిచ్చే ప్రోత్సాహమూ, బలమూ ఎంతగానో ప్రభావాన్ని చూపించగలవు గనుక వాటిని ఎన్నటికీ తక్కువ అంచనా వేయకూడదు. స్ట్రోక్‌ అనే వైద్య పత్రిక ఇలా రిపోర్టు చేసింది: “(పెద్ద) మొత్తంలో సామాజిక మద్దతును పొందే వాళ్లు మరింత త్వరగా కోలుకుంటారనీ, అవయవాలు పనిచేయడంలో మొత్తంమీద చెప్పుకోదగిన పురోభివృద్ధి ఉంటుందనీ, తీవ్రమైన స్ట్రోక్‌కు గురైన వ్యక్తులలో కూడా అలానే (ఆ పురోభివృద్ధి) ఉంటుందనీ ఎదురుచూడవచ్చు.”

బర్నీ తన స్నేహితులు తనకిచ్చిన మద్దతును ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయన మనకిలా జ్ఞాపకం చేస్తున్నాడు: “తట్టుకోవడానికి సహాయపడడంలో స్నేహితులు చేసే సందర్శనాలు ప్రాముఖ్యమైనవి. సానుభూతి ఉట్టిపడేలా మాట్లాడడమూ, శ్రద్ధచూపించే దృక్పథమూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యక్తి వైకల్యానికి ఎక్కువ అవధానాన్ని ఇవ్వకుండా, కన్పించిన ఏ అభివృద్ధినైనా గుర్తించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.” స్ట్రోక్‌కు గురైన తర్వాత వచ్చిన పరిణామాల్ని తాళుకునేవారికి మద్దతునివ్వడానికి మనమంతా ఏం చేయవచ్చు? బర్నీ ఇలా సలహా ఇస్తున్నాడు: “కొన్ని పువ్వుల్ని బహుమానంగా తీసుకెళ్లండి, లేకపోతే లేఖనాధార అభిప్రాయాన్నో, ఒక అనుభవాన్నో పంచుకోండి. అలా చేయడం మూలంగా నేనెంతో సహాయాన్ని పొందాను.”

స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడ్డ మెల్వా అనే ఒక వృద్ధురాలు, తన ఆధ్యాత్మిక సహోదరుల్లో ఒకరు తనతో కలిసి ప్రార్థన చేయడం సహాయకరంగా ఉన్నట్టు కనుగొంది. గిల్బర్ట్‌ కూడా దీన్ని సిఫారసు చేస్తున్నాడు, ఆయన ఇలా వివరిస్తున్నాడు: “మీరు మరొకరితో కలిసి ప్రార్థనచేసినప్పుడు అది మీకు వాళ్లపై తగినంత శ్రద్ధ ఉందని నిజంగా చూపిస్తుంది.” స్ట్రోక్‌ మూలంగా కంటి చూపు బలహీనమైపోయిన పీటర్‌, తన పరిమితుల్ని ఇతరులు అర్థంచేసుకొని, తనకు చదివి వినిపించడానికి సమయాన్ని తీసుకోవడాన్ని ఆయన ప్రశంసిస్తున్నాడు.

థెరపీలు చేయించే ఆసుపత్రికి తీసుకెళ్లి తీసుకురావడం కూడా ఒక ప్రేమపూర్వకమైన చర్యయైవుంది. స్ట్రోక్‌ బాధితుల ఇల్లు ఒక సురక్షితమైన స్థలమై ఉండేలా చూడడం కూడా అవసరం. శరీర సమన్వయాన్ని కోల్పోవడమనేది ఒక సమస్యైతే తూలిపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, తనకు చేసిన ఇతర విధములైన సహాయాలతోపాటూ స్నానం చేసేటప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి ఒక కమ్మిని ఏర్పాటు చేసిన స్నేహితుల దయాపూర్వక సహాయాన్ని గిల్బర్ట్‌ కొనియాడాడు.

మద్దతునివ్వడాన్ని నేర్చుకోవడం

మానసిక స్థితుల్లో మార్పూ, ఏడ్వాలని ఎక్కువగా అనిపించడమూ స్ట్రోక్‌ బాధితులకు అవమానకరంగా ఉండవచ్చు, వాటిని చూస్తున్నవారికి వాటికి తామెలా ప్రతిస్పందించాలో తెలియదు గనుక వారికది అయోమయంగా ఉండవచ్చు. అయితే, మద్దతునిచ్చేవారిగా ఉండడాన్ని తెలుసుకుంటూ, స్నేహితులు స్ట్రోక్‌ బాధితునికి ఏర్పడగల ఒంటరితనం నుండి అతనిని తప్పించవచ్చు. సాధారణంగా, తరచుగా ఏడ్వడం తగ్గిపోతుంది. కానీ కన్నీళ్లు జలజలా రాలినప్పుడు, మీరే ఆ స్థానంలో ఉంటే మీరెలా ఊరట పొందాలని అనుకుంటారో అలాగే ఊరడిస్తూ ఆ వ్యక్తి దగ్గర కూర్చొని, ప్రశాంతంగా ఉండండి.

అన్నిటికంటే ముఖ్యంగా, ఎవరి వైకల్యాలైతే బహుశా మీకు ఇంతకు ముందు తెలిసిన వ్యక్తిత్వాన్ని మార్చివేశాయో, అటువంటి వ్యక్తుల ఎడల దైవిక ప్రేమను అలవర్చుకోండి. మీరెలా భావిస్తారో వాళ్లు పసిగడతారు, అది వాళ్లు మీకు చూపించే ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఎరికా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “నేను మరలా మునుపటి వ్యక్తిగా ఎన్నటికీ కాలేను. కానీ స్ట్రోక్‌ బాధితుల నుండి దాన్నెవ్వరూ అపేక్షించకూడదు. బంధువులూ, స్నేహితులూ స్ట్రోక్‌ బాధితులు ప్రస్తుతమున్న రీతిలోనే అతణ్ణి లేక ఆమెనూ ప్రేమించడం నేర్చుకోవాలి. వాళ్లు జాగ్రత్తగా అతని లేక ఆమె వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, మునుపటి ఆకర్షణీయమైన లక్షణాల్లో అనేకం ఇంకా అతనిలో లేక ఆమెలో ఉన్నట్టు కనుగొంటారు.”

ఒకరు మాట్లాడలేక పోయినప్పుడు లేక అర్థమయ్యేలా చెప్పలేకపోయినప్పుడు వారి ఆత్మగౌరవం కుంచించుకుపోతుంది. వారితో మాట్లాడడానికి ప్రయత్నించడం ద్వారా, వాక్‌ వైకల్యానికి గురైనవారి సంభాషణ ఎంతో విలువైనదని స్నేహితులు ధ్రువపర్చగలరు. థాకాషీ ఇలా చెబుతున్నాడు: “నా హృదయంలో నేననుకునేదీ, భావించేదీ మారలేదు. అయితే, ప్రజలు నాతో మామూలుగా సంభాషించలేరు గనుక వాళ్లు నన్ను తప్పించుకు తిరగడానికి ప్రయత్నిస్తారు. నాకు నేనుగా ప్రజల దగ్గరకు సమీపించడం నాకు కష్టమనిపిస్తుంది. కానీ నాతో మాట్లాడడానికి ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు, అది నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది, అది నన్ను ఎంతగానో సంతోషపరుస్తుంది!”

వాక్‌ వైకల్యాల మూలంగా బాధపడుతున్నవారికి మద్దతునిచ్చి, ప్రోత్సహించడానికి మనందరికీ సహాయం చేసే కొన్ని నిర్దేశకసూత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి.

స్ట్రోకుల్లో అనేకం తెలివితేటలపై ప్రభావాన్ని చూపవు. స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడ్డ వారి మాటలను అర్థంచేసుకోవడం బహుశా కష్టతరమే అయినా, వారిలో అనేకులు మానసికంగా చురుగ్గానే ఉంటారు. ఎన్నడూ వాళ్లను తక్కువచేస్తూ మాట్లాడకండి లేక చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడకండి. వారితో గౌరవపూర్వకంగా వ్యవహరించండి.

సహనంతో ఆలకించండి. ఒక ఆలోచనను పునః సమకూర్పు చేసుకోవడంగానీ లేక ఒక మాటనో, పదబంధాన్నో లేక వాక్యాన్నో పూర్తిచేయడానికిగానీ వాళ్లకు సమయం పట్టొచ్చు. అత్యంత శ్రద్ధతో ఆలకించేవాడంటే అసహనంతో వినేవాడుకాడని గుర్తుంచుకోండి.

మీకు అర్థంకాకపోతే అర్థమైనట్టు నటించకండి. దయతో ఇలా ఒప్పుకోండి: “క్షమించండి. నాకు అర్థంకానట్టనిపిస్తుంది. మరోసారి ఎప్పుడైనా ప్రయత్నిద్దాం.”

మామూలుగా మాట్లాడే స్వరంతోనే నెమ్మదిగానూ, స్పష్టంగానూ మాట్లాడండి.

చిన్న చిన్న వాక్యాల్నీ, పరిచయమున్న పదాల్నీ ఉపయోగించండి.

అవుననీ లేక కాదనీ ప్రత్యుత్తరాన్ని నేర్పుగా రాబట్టే ప్రశ్నలను ఉపయోగించి, జవాబిచ్చేలా ప్రోత్సహించండి. వాళ్లు మీ మాటల్ని గ్రహించలేకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి.

మాట్లాడుతున్నప్పుడు చుట్టుప్రక్కల అంతగా శబ్దాలేమీ లేకుండా చూడండి.

యెహోవా ప్రేమపూర్వక మద్దతుతో తాళుకోవడం

మీకు స్ట్రోక్‌ రావడానికిగల కారణాన్ని మీరు తెలుసుకోవడం, తగిన చర్యలను చేపట్టి, భవిష్యత్తులో స్ట్రోక్‌లు రాగల అపాయాన్ని తగ్గించుకునేలా చేయగలుగుతుంది గనుక అలా తెలుసుకోవడం ప్రాముఖ్యమే అయినా, మరలా వస్తుందేమో అనే భయంపై అదుపును సంపాదించడం కూడా ప్రాముఖ్యమే. ఎలెన్‌ ఇలా అంటోంది: “యెషయా 41:10నందలి దేవుని మాటలు నన్ను విశేషంగా ఓదార్చాయి. ఆయన అక్కడిలా అంటున్నాడు: ‘నీకు తోడైయున్నాను భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.’ యెహోవా నాకు నిజంగా ఎంతో వాస్తవమై ఉన్నాడు, నేను భయానికి గురికాకుండా చేస్తున్నాడు.”

ఆనంద్‌ తనను ఆవహించిన నిరాశను తట్టుకునేలా కూడా బైబిలు అతనికి సహాయపడింది: “అది నన్ను పునరుత్తేజితుణ్ణిచేస్తూ, సేదదీరుస్తూ అలాగే నాకు విస్తృతమైన మద్దతునిస్తోంది.” హిరోయుకీ తన మనస్సును లగ్నంచేయలేడు గనుక లేఖనాలనుండి ప్రయోజనాన్ని ఎలా పొందాలనేదే ఆయనకున్న సమస్య. ఆయన ఇలా అంటున్నాడు: “ఆడియో కేసెట్లలో ఉన్న బైబిలు పుస్తకాలను వినడంద్వారా నేను ఓదార్పును పొందాను.”

అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:10) తన స్వశక్తిచే సాధించలేని దానిని ఆయన సాధించగలిగేలా యెహోవా ఆత్మ అపొస్తలుడైన పౌలుకు సహాయపడింది. స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడ్డ వాళ్లు కూడా ఆధ్యాత్మిక బలం కొరకు యెహోవాపై ఆధారపడవచ్చు. ఎరికా ఇలా వివరిస్తోంది: “మనం ఆరోగ్యంగా ఉండి, సమస్తాన్ని మన స్వశక్తితో చేసుకున్నప్పుడు, మనకు సహాయం చేసే అవకాశాన్ని మనం యెహోవాకు ఎక్కువగా ఇవ్వకపోవచ్చు. కానీ నా వైకల్యం యెహోవాతో నాకున్న బాంధవ్యాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో బలపర్చుకొనగలిగేలా చేసింది.”

శ్రద్ధ తీసుకొనేవారికి మద్దతు లభిస్తుంది

శ్రద్ధ తీసుకొనేవారికి వాళ్ల నిర్ణాయక పాత్రను నిర్వహించడంలో మద్దతు అవసరం. మద్దతు కొరకు వాళ్లెటువైపు చూడొచ్చు? ఒక స్థలమేమిటంటే కుటుంబమే. సేవచేసే పని భారాన్ని కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ పంచుకోవాల్సిన అవసరముంది. తన కుమారులు తనకు భావోద్రేక మద్దతును ఎలా ఇచ్చారో యోషికో చెబుతోంది: “వాళ్లు నా సమస్యల్ని వాళ్ల సమస్యలే అన్నంతగా ఆలకిస్తారు.” స్ట్రోక్‌ బాధితునిపై శ్రద్ధనెలా చూపాలో తెలుసుకొనేందుకూ, అలాగే తాము ప్రేమించినవారి వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులతో వ్యవహరించడమెలాగో తెలుసుకొనేందుకూ తమకు లభ్యమయ్యే సమాచారాన్నంతటినీ కుటుంబ సభ్యులు పొందాల్సిన అవసరముంది.

శ్రద్ధ తీసుకొనేవారికి ఇంకెవ్వరు కూడా మద్దతునివ్వవొచ్చు? విక్టర్‌ విషయంలో సహాయం నిమిత్తం డేవిడ్‌, అతని కుటుంబమూ యెహోవాసాక్షుల సంఘంలోని తమ ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఆశ్రయించారు: “వాళ్లు మా అవసరానికి ప్రతిస్పందించారు. మాకు బదులుగా వాళ్లు ఒకరి తర్వాత మరొకరు వంతులవారీగా వచ్చి విక్టర్‌ గురించి శ్రద్ధ తీసుకోవడానికి మా దగ్గర రాత్రిళ్లు పడుకొనేవారు.”

స్ట్రోక్‌ బాధితునికి శ్రద్ధ తీసుకొనే ప్రతి ఒక్కరికీ, తమ ఆధ్యాత్మిక కుటుంబంనుండి హృదయపూర్వకమైన ప్రేమా మద్దతులు అవసరం. కానీ సహాయాన్ని అడగడానికి కొంతమంది ఇబ్బందిపడవచ్చు. హూరుకో ఇలా వివరిస్తోంది: “‘మీకు సహాయం అవసరమైతే సందేహించక మాకు తెలియజేయండి’ అని నాతో తరచూ అనేవారు. కానీ అందరూ ఎంత బిజీగా ఉంటారో తెలుసు కాబట్టి, సహాయం కోసం నా అంతట నేను అడగడానికి తటపటాయించేదాన్ని. ‘నేను శుభ్రంచేయడంలో సహాయపడగలను. మీకు ఏ రోజైతే వీలౌతుంది?’ అనో, ‘నేను మీ కోసం షాపింగ్‌ చేసిపెడతాను, నన్నిప్పుడు మీ ఇంటికి రమ్మంటారా?’ అనో నిర్దిష్టమైన రీతుల్లో ప్రజలు తమ సహాయాన్ని అందిస్తే నేనెంతో కృతజ్ఞత కల్గివుంటాను.”

కెన్జీ భార్య స్ట్రోక్‌కు గురైంది; అయినా, ఆయన ఆమెకు అవసరమైన శ్రద్ధ చూపించగలిగేడు. ప్రార్థనద్వారా తన భారాన్ని యెహోవాపై వేయగలనని ఆయన కనుగొన్నాడు. చివరకు, ఆయన భార్య మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయింది, దానితో తనతో మాట్లాడే భాగస్వామిని కెన్జీ కోల్పోయాడు. కానీ ఆయన అనుదినమూ బైబిల్ని చదువుతాడు. ఆయన ఇలా అంటాడు: “నలిగిన ఆత్మను కల్గినవారి ఎడల యెహోవా చూపించే కోమలమైన శ్రద్ధను ఇది నాకు జ్ఞాపకంచేస్తుంది, మరి ఇది నేను క్రుంగిపోకుండా, ఒంటరితనానికి గురికాకుండా నన్ను కాపాడింది.”

భావోద్రేకాలు దాదాపుగా మనల్ని ముంచెత్తినట్టు అన్పించినప్పుడు యెహోవా ఆత్మపై ఆధారపడడం సహాయపడగలదు. యోషికో, స్ట్రోక్‌కు గురైన తర్వాత నుండి తన భర్త వ్యక్తిత్వంలో వచ్చిన మార్పునూ, ఆయన చూపించే ఆకస్మిక కోపాన్నీ తాళుకుంటూ, ఇలా అంటోంది: “బాధతో బిగ్గరగా ఏడ్వాలని నాలో నాకు కొన్నిసార్లు అన్పిస్తుంది. ఆ సమయాల్లో నేను ఎప్పుడూ యెహోవాకు ప్రార్థిస్తాను, మరి ఆయన ఆత్మ నాకు సమాధానాన్ని ఇస్తుంది.” తన ఎడల యెహోవా చూపించిన యథార్థతను ప్రశంసించడంలో, ఆమె ఏదీ తన క్రైస్తవ జీవితవిధానాన్ని అంతరాయం కల్గించడానికి అనుమతించదు. ఆమె క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరౌతుంది, పరిచర్యలో పాల్గొంటుంది, మరి వ్యక్తిగత బైబిలు పఠనం చేస్తుంది. యోషికో ఇలా అంటోంది: “నా వంతు నేను చేయడంద్వారా, యెహోవా నన్నెన్నడూ ఎడబాయడని నాకు తెలుసు.”

చింతలు తలెత్తినప్పుడు, ఆలకించడానికి యెహోవా ఎల్లప్పుడూ ఉంటాడు. స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడిన భర్తవున్న మిడోరి, అలంకారికంగా చెప్పాలంటే, తాను విడిచిన కన్నీళ్లన్నింటినీ యెహోవా తన “బుడ్డిలో” దాచి ఉంచాడనే వాస్తవం నుండి ఆదరణ పొందుతోంది. (కీర్తన 56:8) “రేపటినిగూర్చి చింతింపకుడి” అని యేసు చెప్పిన మాటల్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటోంది. ఆమె ఇలా అంటోంది: “నూతన లోకం వచ్చేంతవరకూ సహనంకలిగి ఉండాలని నేను నిశ్చయించుకున్నాను.”—మత్తయి 6:31-34.

తీవ్రమైన పరిమితులను ఎదుర్కోవడం

తమను మునుపటి స్థితికి తెచ్చే థెరపీలను, ఎక్సర్‌సైజుల్నీ చేస్తున్న కాలంలో కొందరు చెప్పుకోదగిన రీతిలో కోలుకోవడం వాస్తవమే అయినా, స్ట్రోక్‌ రావడానికి ముందున్న తమ సామర్థ్యాలను మరలా పొందడంలో ఇతరులు అంత ఆశాజనకమైన ఫలితాల్ని పొందలేకపోయారు. మరి వీళ్లు తమ పరిమితులు అంటే బహుశా అవి తీవ్రమైనవిగానూ, దీర్ఘకాలికమైనవిగానూ ఉన్నప్పటికీ వాటిని అంగీకరించే సవాల్ని ఎదుర్కొనేందుకు ఏది సహాయపడగలదు?

స్ట్రోక్‌ మూలంగా అంతగా కదలలేకపోతున్న బర్నీ ఇలా జవాబిస్తున్నాడు: “నా పరిమితుల్ని ప్రశాంతంగా అంగీకరించడానికి, రానైవున్న పరదైసు భూమిపై నిరంతరం జీవించే నా నిరీక్షణానందమూ, నా పరలోకపు తండ్రియైన యెహోవాకు చేసే ప్రార్థనా నాకు సహాయపడ్డాయి.”

ఆమెకున్న పరిమితుల్ని అంగీకరించి కూడా జీవితాన్ని ఆనందించడానికి ఎరికాకూ, ఆమె భర్తయైన గేగ్‌కూ ఆ నిరీక్షణే సహాయపడింది. గేగ్‌ ఇలా వివరిస్తున్నాడు: “ఒకనాటికి పూర్ణ స్వస్థత చేకూరుతుందనే దేవుని వాగ్దానం మాకుంది. కాబట్టి మేం వైకల్యంపై మా మనస్సును కేంద్రీకరించం. ఎరికా ఆరోగ్యం కుదుటపడేందుకు మేం చేయగలిగినవన్నీ చేస్తామనుకోండి. కానీ కండరాల అపరిపూర్ణ సమన్వయంతో జీవించడాన్ని నేర్చుకొని, మరింత అనుకూలమైన వాటిపై కేంద్రీకరిస్తాం.”—యెషయా 33:24; 35:5, 6; ప్రకటన 21:4.

కోలుకోవడానికున్న అవకాశాలు చాలా పరిమితంగావున్న కేసుల్లో, కుటుంబ సభ్యులూ, స్నేహితులూ ఇచ్చే మద్దతు మరింత ప్రధానమైనదౌతుంది. ఆరోగ్యానికి సంబంధించిన రుగ్మతలన్నింటినీ నయంచేసే దేవుని సమయం వచ్చేంతవరకూ తాళుకునేందుకు బాధితునికి వాళ్లు సహాయపడగలరు.

ఆరోగ్యం పునరుద్ధరించబడినప్పుడు స్ట్రోక్‌ బాధితులకూ, వారి కుటుంబాలకూ దివ్యమైన భవిష్యత్తుందని తెలుసుకోవడం, వాళ్లు ఏనాటి సమస్యలతో ఆనాడే వ్యవహరించగలిగేలా సహాయం చేస్తుంది. ఆ విధంగా, వాళ్లు త్వరలోనే రానైవున్న దేవుని నూతన లోకంలో సమస్తమైన బాధలనుండి ఉపశమనాన్ని పొందేందుకు సహనంతో వేచివుండగలరు. (యిర్మీయా 29:11; 2 పేతురు 3:13) ఈ లోగా, యెహోవావైపు తిరిగేవారందరూ ఆయన ఇప్పుడు సహితం సహాయం చేస్తాడనీ, స్ట్రోక్‌ తెచ్చే వైకల్యపు ప్రభావాలను తాళుకొనడంలో వారికి మద్దతునిస్తాడనీ నిశ్చయతను కల్గివుండొచ్చు.—కీర్తన 33:22; 55:22.

[12వ పేజీలోని చిత్రం]

ఆరోగ్యసంబంధమైన రుగ్మతలన్నింటినీ నయంచేసే దేవుని సమయం వచ్చేంతవరకూ తాళుకునేందుకు కుటుంబ సభ్యులూ, స్నేహితులూ స్ట్రోక్‌ బాధితునికి సహాయపడగలరు

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

స్ట్రోక్‌ను నివారించడం

“స్ట్రోక్‌తో వ్యవహరించడంలో శ్రేష్ఠమైన మార్గం ఏమిటంటే అది రాకుండా నివారించేందుకు ప్రయత్నించడమే”నని డా. డేవిడ్‌ లవైన్‌ అంటున్నారు. స్ట్రోకుల్లో అనేకం రావడానికిగల ప్రధాన కారణం, హై బ్లడ్‌ ప్రెషరే (అధిక రక్తపోటు).

అనేకమంది ప్రజల విషయంలోనైతే, పొటాషియమ్‌ ఎక్కువగానూ, ఉప్పు, సాచురేటెడ్‌ క్రొవ్వూ, కొలెస్ట్రాలూ తక్కువగానూ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా హై బ్లడ్‌ ప్రెషర్‌ని కంట్రోలు చెయ్యవచ్చు. బహుశా మద్యపానీయాల వినియోగాన్ని తగ్గించివేయడం కూడా ప్రాముఖ్యమే. ఒకరి వయస్సుకీ, వారి శరీర దారుఢ్యస్థాయికీ తగ్గ ఎక్సర్‌సైజులను క్రమంగా చేయడం, వారు తమ బరువును తగ్గించుకోవడానికి సహాయపడవచ్చు. రకరకాల మందులు లభ్యమవుతున్నాయి కాబట్టి, డాక్టరు పర్యవేక్షణలో మందుల్ని తీసుకోవడం మంచిది.

కేరోటిడ్‌ ఆర్టెరీ (గళధమని) వ్యాధి మెదడుకుపోయే ప్రధాన రక్త సరఫరా మార్గాన్ని ఇరుకుగా చేస్తుంది, మరి ఇదే స్ట్రోక్‌ రావడానికి ప్రధానంగా దోహదపడుతుంది. అది ఎంతమేరకు పూడుకుపోయిందనే దానిపై ఆధారపడి, కేరోటిడ్‌ ఎండార్టెరెక్టోమి అనే సర్జరీని పూడుకుపోయిన ధమనులను శుభ్రంచేయడానికి సిఫారసుచేయవచ్చు. ధమనులు పూడుకుపోయినట్టు తెలియజేసే లక్షణాలను కల్గివున్న, ధమనులు మరీ ఇరుకైపోయిన ప్రజలు, వైద్యసంబంధ చికిత్సతోపాటూ సర్జరీ చేయించుకోవడాన్నుండి ప్రయోజనాన్ని పొందారని అధ్యయనాలు చూపించాయి. అయితే, సర్జరీకి సంబంధించి సమస్యలు ఉండవచ్చు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.

స్ట్రోక్‌కు గురయ్యే అపాయాన్ని హృద్రోగం ఎక్కువచేయగలదు. రక్తం గడ్డలు కట్టుకుపోయి మెదడుకి ప్రయాణించడానికి కారణంకాగల ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ను (క్రమరహితంగా గుండెకొట్టుకోవడాన్ని), యాంటి కాగ్యులెంట్‌ (రక్తం గడ్డగట్టుకోకుండేలా చేసే) మందులను ఉపయోగించి చికిత్సచేయవచ్చు. మరితర హృద్రోగ సమస్యలకైతే, స్ట్రోక్‌ వచ్చే అపాయాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సా, మందులూ అవసరమవ్వవచ్చు. స్ట్రోక్‌కు గురికావడానికి ఎక్కువ శాతం డయాబిటిస్‌ (మధుమేహం) దోహదపడుతుంది, కాబట్టి దాన్ని అదుపుచేసుకోవడం స్ట్రోక్‌ రాకుండా నివారించడానికి సహాయపడుతుంది.

ట్రేన్సియంట్‌ ఇస్కీమిక్‌ ఎటాక్స్‌ (అల్పకాలిక ఇస్కీమిక్‌ పోటులు) అంటే టిఐఎలు, స్ట్రోక్‌ రావొచ్చనడానికి స్పష్టమైన హెచ్చరికలైవున్నాయి. వాటిని అలక్ష్యంచేయకుండా చూసుకోండి. మీ ఫిజీషియన్‌ (డాక్టరు) దగ్గరకు వెళ్లి, నిబిడీకృత కారణంతో వ్యవహరించండి. టిఐఎలు ఎక్కువగా వచ్చినప్పుడు, స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.

స్ట్రోక్‌ని నివారించేందుకు ఆరోగ్యకరమైన, మితంగల జీవనవిధానం ఎంతో సహాయపడగలదు. సమతూకమైన ఆహారమూ, క్రమంగా ఎక్సర్‌సైజులు చేయడమూ, అలాగే మద్యపానీయాల వినియోగాన్ని పరిమితస్థాయిలో ఉంచుకోవడమూ, పొగత్రాగకుండా ఉండడమూ ధమనుల్ని ఆరోగ్యకరంగా ఉంచగలవు, స్ట్రోక్‌ మూలంగా దెబ్బతిన్న ధమనుల్లో ఆరోగ్యకరమైన మార్పుల్ని కూడా పెంపొందించవచ్చు. తాజా పండ్లనూ, కూరగాయల్నీ, కాయ ధాన్యాల్నీ ఎక్కువగా తీసుకోవడం, స్ట్రోక్‌ వచ్చే అపాయాన్ని తగ్గించడానికి సహాయపడిందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి