కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 2/8 పేజీలు 27-28
  • ప్రేమా స్వరూపియైన దేవునికి మీరెలా భయపడగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమా స్వరూపియైన దేవునికి మీరెలా భయపడగలరు?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆకాశములు, దేవుని మహత్త్వం
  • క్షమించే దేవుడు
  • దేవుని తీర్పుకు భయపడడం
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • బైబిలును—ఎందుకు అధ్యయనం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 2/8 పేజీలు 27-28

బైబిలు ఉద్దేశము

ప్రేమా స్వరూపియైన దేవునికి మీరెలా భయపడగలరు?

“యెహోవాయందు భయభక్తులుగలవాడు . . . ధన్యుడు.”—కీర్తన 112:1.

బైబిలు వర్ణిస్తున్నట్లు, “దేవుడు ప్రేమాస్వరూపియై”తే ఆయనకు భయపడవలసిన అవసరమేముంది? (1 యోహాను 4:16) ప్రేమా, భయమూ అనేవి సాధారణంగా పరస్పర విరుద్ధమైనవిగా పరిగణించబడతాయి. కనుక, దేవునితో మనకున్న సంబంధంలో భయం ఏ పాత్ర వహించాలి? ప్రేమా స్వరూపియైన దేవునికి ఎందుకు భయపడాలి? బైబిలులో “భయం” అనే పదం ఎలా ఉపయోగించబడిందో నిశితంగా పరిశీలిస్తే ఈ విషయంలో మనం మంచి అవగాహనను పొందవచ్చు.

అనేక భాషల్లో ఒక్క పదానికే సందర్భాన్ని బట్టి వివిధ భావాలుంటాయి. ఉదాహరణకు, కొన్ని భాషల్లో, “నాకు ఐస్‌క్రీమ్‌ అంటే చాలా ఇష్టం” అని ఒకరు అనవచ్చు. “నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం” అని కూడా అనవచ్చు. ఇక్కడ వ్యక్తీకరించబడిన రెండు రకాల ఇష్టాలకూ, వాటి తీవ్రతలకూ చాలా తేడా ఉంది. అలాగే, బైబిలు విభిన్న రకాలైన భయాలను గురించి మాట్లాడుతుంది. దైవారాధన సంబంధంగా ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు అది రాబోయే శిక్షను గూర్చిన భయాన్ని, భీతిని, లేదా శిక్షను గూర్చిన స్పృహను సూచించడంలేదు. బదులుగా, దైవభయం అనేది ఆరోగ్యకరమైన అనుభూతులను—సంభ్రమాశ్చర్యం, పూజ్యభావం, ప్రగాఢమైన గౌరవం వంటి వాటిని—తెలియజేస్తుంది. ఈ ఉన్నతమైన భావోద్వేగాలు దేవుని ఎడల ప్రేమకు, ఆకర్షణకు తోడౌతాయే గానీ, ఆయన నుండి పారిపోయేలా లేదా ఆయనకు చిక్కకుండా దాక్కునేలా చేయవు.

దైవ భయం అనారోగ్యకరమైన, క్రుంగదీసేదైన భయాన్ని తీసివేస్తుంది. దేవునికి భయపడే మనిషిని గురించి కీర్తన రచయిత ఇలా వ్రాశాడు: “వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.” (కీర్తన 112:7) దుష్టులనుండి వచ్చే బెదిరింపైనా లేదా సాతాను నుండి వచ్చే బెదిరింపైనా యెహోవా ఎడల మనకు గల ప్రగాఢ గౌరవాన్ని, పూజ్యభావాన్ని తీసివేయలేదు. (లూకా 12:4, 5) మనం దేవుడ్ని ప్రార్థనలో సమీపించేందుకు భయపడము కూడా. బదులుగా, ఈ సందర్భంలో, “ప్రేమ భయమును వెళ్లగొట్టును.”—1 యోహాను 4:18.

ఆకాశములు, దేవుని మహత్త్వం

ప్రాచీన రాజైన దావీదు దైవభయం గల మనిషి. ఆయన సృష్టి యొక్క సౌందర్యాన్ని గురించి, దాని సంకీర్ణతను గురించి ఆలోచించినప్పుడు ఆయన సంభ్రమాశ్చర్యములలో మునిగిపోయాడు. ఆయన ఇలా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:14) రాత్రి ఆకాశంలోకి చూస్తూ, ఆయన ఇలా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి.” (కీర్తన 19:1) ఈ అనుభవం వలన దావీదు భయపడ్డాడని మీరు ఊహిస్తారా? దానికి విరుద్ధంగా, అది ఆయనను యెహోవాకు స్తుతులు చెల్లించేందుకు కదిలించింది.

నేడు ఆకాశాన్ని గూర్చిన పెరిగిన జ్ఞానం మనకు సంభ్రమాశ్చర్య అనుభూతి కలిగేందుకు మరింత బలమైన కారణాన్నిస్తుంది. ఇటీవల, ఖగోళశాస్త్రజ్ఞులు హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తూ, ఆకాశాలను మునుపెన్నడూ ఏ మానవుడు చూడనంత లోతుగా చూడగల్గుతున్నారు. గ్రౌండ్‌-బేస్డ్‌ టెలిస్కోప్‌లతో చూస్తే శూన్యంగా కనిపించిన ఆకాశ భాగాన్ని ఎంచుకుని, అరచేతిలో ఇసుకరేణువును పెట్టుకుని చెయ్యిచాచి ఉంచితే ఇసుక రేణువు ఎంతచిన్నగా కనిపిస్తుందో అంత పరిమాణంలోని ప్రాంతంపై మాత్రమే హబుల్‌ను కేంద్రీకరించారు. అప్పుడు కనిపించిన దృశ్యమేమిటి, వేర్వేరు నక్షత్రాలు కాదుగానీ, అనేక నక్షత్రవీధులు, కోట్ల లెక్కన ఉన్న నక్షత్ర సముదాయమే కనిపించింది—ఏ మానవుడూ మునుపు చూడని దృశ్యమది!

విశ్వం యొక్క పరిమాణమూ, మర్మమూ, అద్భుతమూ నిశిత పరిశీలకునిలో సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. అయినప్పటికీ, అలాంటి అద్భుతాలు మన సృష్టికర్త యొక్క మహత్త్వాన్నీ శక్తినీ కేవలం ప్రతిబింబిస్తున్నాయంతే. బైబిలు యెహోవా దేవుడ్ని “జ్యోతిర్మయుడగు తండ్రి” అని పిలుస్తూ, “నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు” అని మనకు చెబుతుంది.—యాకోబు 1:17; కీర్తన 147:4.

ఆకాశంలో జరిగే సంఘటనలకు పట్టే సమయం కూడా విశ్వం యొక్క గొప్ప పరిమాణాన్ని చూపిస్తుంది. నక్షత్రవీధుల్లో నుండి వస్తున్న ప్రకాశాన్ని హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఫోటో తీసింది. ఆ ప్రకాశం అంతరిక్షం గుండా కోట్ల సంవత్సరాలుగా ప్రయాణిస్తుంది! ఆకాశముల శాశ్వతకాలంతో పోల్చితే మన ఇటీవలి అస్తిత్వం మరియు అల్పత్వం అనేవి నక్షత్రాలను సృష్టించినవాని ఎడల సంభ్రమాశ్చర్యాలనూ, మరియు ప్రగాఢమైన పూజ్యభావాన్నీ కలిగించి తీరుతాయి కదా? (యెషయా 40:22, 26) వీటినన్నింటినీ సృష్టించిన దేవుడు ‘మర్త్యుడైన మనుష్యుని జ్ఞాపకము చేసికొని వాడ్ని ఆదరిస్తాడని’ గ్రహించడం మన సృష్టికర్త ఎడల మనకున్న గౌరవభావాన్ని పెంచి, ఆయనను గురించి తెలుసుకుని, ఆయనను ప్రీతిపరచాలని కోరుకునేలా చేస్తుంది. (కీర్తన 8:3, 4) అలాంటి అత్యున్నత గౌరవాన్ని లేదా మెప్పుదలనే దైవభయమని బైబిలు అంటుంది.

క్షమించే దేవుడు

మనమందరమూ అపరిపూర్ణులమే. సరైనది చేయడానికి మనం ప్రయత్నిస్తున్నా కూడా అసంకల్పితంగా పాపం చేస్తాం. అలా జరిగినప్పుడు, దేవుని అనుగ్రహాన్ని కోల్పోతామని భయపడాలా? కీర్తన రచయిత ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.” (కీర్తన 130:3, 4) ‘గొప్ప సృష్టికర్త’ ఎంతో దయగలవాడు మరియు క్షమించేవాడు అన్న విషయం ఆయన ఆరాధకుల్లో ప్రగాఢమైన మెప్పుదలను, పూజ్యభావాన్ని పురికొల్పుతుంది.—యెషయా 54:5-8.

దైవభయం అనేది మేలు చేయడానికి, అలాగే దేవుడు చెడ్డదని చెప్పే విషయాలను చేయకుండా ఉండేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. మన పరలోక తండ్రితో మనకున్న అనుబంధాన్ని మంచివాడైన ఒక మానవ తండ్రికి తన పిల్లలతో ఉండే అనుబంధంతో పోల్చవచ్చు. వీధిలో ఆడుకోవడాన్ని తమ తండ్రి ఎందుకు నిషేధించాడో పిల్లలకు కొన్నిసార్లు జ్ఞాపకం ఉండకపోవచ్చు. అయినప్పటికీ, వీధిలోని ట్రాఫిక్‌లోకి వెళ్ళిన బంతిని పరుగెట్టుకువెళ్ళి పట్టుకోవాలన్న ప్రేరణ లోలోన కలిగినా, తమ తండ్రి నిషేధించాడన్న తలంపు వాళ్ళను వెనక్కు లాగేస్తుంది—బహుశా మరణం నుండి అది వాళ్ళను కాపాడవచ్చు. అలాగే, వయోజనుడైన ఒకవ్యక్తి యెహోవాకు భయపడడం జీవితాలను—సొంత జీవితాన్ని లేదా ఇతరుల జీవితాలను—నాశనం చేయగల చర్యలనుండి అతడ్ని తప్పించవచ్చు.—సామెతలు 14:27.

దేవుని తీర్పుకు భయపడడం

దానికి విరుద్ధంగా, ఒక వ్యక్తి సొంత మనస్సాక్షి యెహోవాను అప్రీతిపర్చే పనిని చేయడం నుండి మళ్ళించకపోతే, అతడు మరో విధమైన భయానికి లోనయ్యేందుకు కారణముంది. మానవ ప్రభుత్వాలు నేరస్థులను శిక్షించినట్లే, మనఃపూర్వకంగా, పశ్చాత్తాపం లేకుండా తప్పు చేసే వారికి వ్యతిరేకంగా చర్య తీసుకునే అధికారం దేవునికి ఉంది. దేవుడు దుష్టత్వాన్ని తాత్కాలికంగా అనుమతించడం కొందరు తప్పుడు మార్గంలో స్థిరపడేందుకు తావిచ్చింది. కానీ త్వరలోనే, ఒకరోజు ఆయన చెడుకు కారణమయ్యే సమస్తాన్నీ భూమి మీది నుండి తీసివేస్తాడని బైబిలు స్పష్టంగా వివరిస్తుంది. (కీర్తన 37:9, 10; ప్రసంగి 8:11; 1 తిమోతి 5:24) దేవుని నుండి శిక్ష వస్తుందని భయపడేందుకు పశ్చాత్తాపపడని దుష్టునికి కారణముంది. అయితే, బైబిలు సిఫారసు చేసేది అలాంటి భయాన్ని కాదు.

దానికి బదులుగా, బైబిలు యెహోవా భయాన్ని జీవితంలోని రమ్యమైన విషయాలతో—పాటలు పాడడం, ఆనందం, విశ్వాసం, జ్ఞానం, దీర్ఘాయుష్షు, నమ్మకం, క్షేమము, నిరీక్షణ, శాంతి, వంటి చెప్పలేనన్ని విషయాలతో—ముడిపెడుతుంది.a మనం యెహోవా భయంలో నడవడం కొనసాగిస్తే, మనం శాశ్వతకాల ఆశీర్వాదాలను ఆస్వాదిస్తాం.—ద్వితీయోపదేశకాండము 10:12-14.

[అధస్సూచి]

a చూడండి నిర్గమకాండము 15:11; కీర్తన 34:11, 12; 40:3; 111:10; సామెతలు 10:27; 14:26; 22:4; 23:17, 18; అపొస్తలుల కార్యములు 9:31.

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి