ప్రపంచ పరిశీలన
టోక్యోలో రాకపోకలు జరిపే కాకులు
జపాన్‌లో టోక్యోలో ఉన్న కాకులు ప్రతిరోజు నగరానికీ, నగర శివార్లకు రాకపోకలు జరిపే అలవాటు చేసుకున్నాయని ద డెయిలీ యోమీయూరీ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం, టోక్యోలోని పార్కుల్లోనూ, ఆలయ ప్రాంగణాల్లోనూ వాటి సంఖ్య పెరిగేసరికి అవి గూళ్ళను మరోచోట కట్టుకోవడం తప్పనిసరవ్వడంతో ఈ రాకపోకలు ప్రారంభమయ్యాయని కొందరు పక్షుల నిపుణులు అంటున్నారు. కాకులు నగరశివార్లలోని జీవితంలోని సౌకర్యాలను కనుగొన్నది అప్పుడే. అయితే, అవి కోల్పోయిన విషయమొకటుంది, అదే ఆ ఆకర్షణీయమైన నగర భోజనం—చెత్త కుండీలు, మిగిలిపోగా పారేయబడిన ఆహారపదార్థాలు. “జీతం తీసుకునే పనివాళ్ళకు మల్లే రాకపోకల పద్ధతిని” అవలంబించడం ద్వారా అవి ఆ సమస్యను అధిగమించాయనీ, “అవి ఉదయాన ఆహార అన్వేషణ కోసం నగర ప్రాంతాలకు ఎగిరి వస్తాయనీ, సాయంకాలం నగరశివార్లకు తిరిగి వెళ్తాయనీ” ద డెయిలీ యోమీయూరీ చెబుతుంది.
ప్రకృతి సంపద అపాయంలో ఉంది
ఇండియాలో మొక్కలైనా జంతువులైనా సమృద్ధంగా ఉండే ఈశాన్య ప్రాంతంలో, ఇప్పుడు అపాయంలో ఉన్నవాటి లిస్ట్‌లో 650 జాతుల మొక్కలూ, 70 జాతుల జంతువులూ ఉన్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా, మేఘాలయ రాష్ట్రంలో ఉన్న క్షీణించిన ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యాన్ని అపాయంలో పడవేసే ‘అత్యవసర పరిస్థితినెదుర్కుంటున్న’ 18 ‘ప్రాంతాల్లో’ ఒకటిగా గుర్తించబడింది. ది ఏష్యన్ ఏజ్‌లో నివేదించినట్లు, ఆవరణ వ్యవస్థకు ఇతర అపాయాలుండడమే కాక, అది మానవుల దోపిడీకీ, దొంగవేటకు కూడా గురవుతుంది. ఆవరణ సంబంధంగా, ఇండియాలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల్లోని జీవ వైవిధ్యం దేశంలోని మిగతా ప్రాంతాల్లో కన్నా మరింత దుర్బలంగాను, సున్నితమైనదిగానూ పరిగణించబడుతుంది.
శిశువుకు పాలు త్రాగించే విషయంలో సందిగ్ధావస్థ
“రెండు దశాబ్దాలుగా, డాక్టర్‌లు, ప్రజా ఆరోగ్య ఏజెన్సీలు పేద దేశాల్లోని క్రొత్త తల్లులకు ఇచ్చిన సలహా ఒకటే: మీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారికి చనుపాలను ఇవ్వండి. కానీ ఇప్పుడు ఎయిడ్స్ మహామారి ఆ సరళమైన సూత్రాన్ని నిరర్థకమైనదిగా చేస్తుంది. ఎయిడ్స్ వచ్చిన తల్లులు చనుపాల ద్వారా ఎయిడ్స్ వ్యాధిని చాలా ఎక్కువ మోతాదులో సంక్రమింపజేస్తారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. . . . హెచ్.ఐ.వి. ఉన్న శిశువుల్లో మూడింట ఒకవంతు మంది తల్లిపాల ద్వారానే ఎయిడ్స్‌ను పొందారని ఇటీవల అమెరికా అంచనా వేసింది” అని ద న్యూయార్క్ టైమ్స్ చెబుతుంది. శిశువుల కొరకైన ఆహార ఫార్ములాయే ఇక దానికి ప్రత్యామ్నాయం. అయితే దానివల్ల కూడా సమస్యలున్నాయి. అనేక దేశాల్లోని తల్లుల దగ్గర ఆ ఫార్ములాను కొనేందుకైనా, లేదా సీసాలను స్టెరిలైజ్ చేసేందుకైనా సరిపడా డబ్బు లేదు. మంచి నీళ్ళు అంత అందుబాటులో లేవు. దాని ఫలితంగా, పసిపిల్లలు అతిసారం వల్లా నిర్జలీకరణం వల్లా అలాగే, శ్వాససంబంధమైన ఉదర సంబంధమైన వ్యాధుల వల్లా బాధపడవలసి వస్తుంది. పేద కుటుంబాలవారు ఫార్ములాకు ఎక్కువ నీళ్ళను కలుపుతారు, అది పిల్లల కుపోషణకు కారణమౌతుంది. ఇప్పుడు ఆరోగ్య అధికారులు ఈ రెండు సమస్యల పరిష్కారాలను సమతుల్యంగా ఉంచేందుకు కఠిన యత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, రోజుకు 1,000 కన్నా ఎక్కువ మంది శిశువులకూ, పిల్లలకూ క్రొత్తగా హెచ్. ఐ. వి సోకుతోంది.
అసాధారణ స్నేహం
చాలా కాలం నుండీ, శాస్త్రజ్ఞులు చీమలకు ఆఫ్రికా కసివింద చెట్లకూ మధ్య ఉన్న సంబంధాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్లు చీమలకు అవసరమైన ఆహారాన్నీ, ఆశ్రయాన్నీ ఇస్తాయి. చీమలు అందుకు బదులుగా, చెట్లకు హానిని కలిగించే కీటకాలపై, ఆకులను తినడానికి వచ్చే ప్రమాదకారులైన జంతువులపై దాడిచేస్తాయి. ఈ చెట్లు తమ మనుగడ కోసం వాటి కాపుదలపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. చెట్ల పువ్వుల్లో పుప్పొడి వెదజల్లబడేందుకు ఎగిరే కీటకాల అవసరం కూడా ఉంది. ఈ వాస్తవం దృష్ట్యా, పుప్పొడిని వెదజల్లే కీటకాలు తమ పనిని పూర్తి చేసే అవకాశాన్ని ఎలా పొందుతాయి? నేచర్ అనే విజ్ఞాన శాస్త్ర పత్రిక అభిప్రాయం ప్రకారం, ‘పువ్వులు విరివిగా పూసేటప్పుడు’ చీమలను ఆటంకపరచే రసాయనాన్ని చెట్లు ఉత్పత్తి చేస్తాయి. ఇది కీటకాలు “ఆ నిర్ణాయక సమయంలో” పువ్వులను సందర్శించేందుకు వీలుకల్పిస్తుంది. పరాగ సంపర్కం జరిగిన తర్వాత, చీమలు తమ కాపలా పనికి తిరిగి వచ్చేస్తాయి.
ప్రపంచంలో పారిశుద్ధ్య స్థాయి దిగజారిపోతోంది
“ప్రపంచ జనాభాలోని సగం కంటే ఎక్కువ మందికి, అంటే దాదాపు మూడు వందల కోట్లమంది ప్రజలకు కనీసం శుభ్రమైన మరుగుదొడ్లు కూడా లేవు” అని ద న్యూయార్క్ టైమ్స్ చెబుతుంది. ఈ సమాచారం యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి బాలల నిధి) నిర్వహించిన ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్స్ అనే వార్షిక సర్వేలో తేలిన ఫలితాల్లోనిది. “గణాంకాలు చూపిస్తున్న ప్రకారం పారిశుద్ధ్యమనేది ప్రపంచవ్యాప్తంగా తక్కువస్థాయికి దిగజారుతుందే తప్ప మెరుగవ్వడం లేదు” అని కూడా ఆ సర్వే బయల్పరుస్తుంది. ఉదాహరణకు, పేదలకు మంచి నీటి సరఫరా చేయడంలో అభివృద్ధిని సాధించిన కొన్ని దేశాలు మురుగునీటి పారుదల విషయంలో విఫలమవుతున్నాయి. ఈ ప్రాథమిక పారిశుద్ధ్యం యొక్క అభావం క్రొత్త రోగాలు వ్యాప్తి చెందేందుకు, పాత వ్యాధులు మళ్ళీ తలెత్తేందుకూ బాగా కారణమౌతాయని నివేదిక చెబుతోంది. ప్రతి సంవత్సరం, అపరిశుభ్ర పరిసరాల వల్ల కలిగే వ్యాధుల వల్ల 20 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారని అంచనావేయబడింది. ఆక్తర్ హమీద్ ఖాన్ అనే అధ్యయన విలేఖరి ఇలా అన్నాడు: “మీకు మధ్యయుగం నాటి పారిశుద్ధ్య వసతులే ఉంటే, మీకు మధ్యయుగంలోలాగే వ్యాధులూ ఉంటాయి.”
గూటెన్‌బర్గ్ బైబిల్ కనుగొనబడింది
15వ శతాబ్దంలో యోహానాస్ గూటెన్‌బర్గ్ ముద్రించిన బైబిలు భాగం జర్మనీలోని, రెన్స్‌బర్గ్‌లోని చర్చి యొక్క ప్రాచీనగ్రంథాలయంలో కనుగొనబడింది. 1996 తొలిభాగంలో దానిని కనుగొన్న తర్వాత, అది యథార్థంగా గూటెన్‌బర్గ్ బైబిలు అని ప్రకటించే ముందు ఆ బైబిలులోని 150 పేజీల భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించడం జరిగిందని వీస్‌బాడెనెర్ కూరీర్ నివేదిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, 48 గూటెన్‌బర్గ్ బైబిళ్ళు ఉనికిలో ఉన్నాయనీ, వాటిలో 20 సంపూర్ణ బైబిళ్ళనీ తెలియబడుతుంది. “యోహానాన్ గూటెన్‌బర్గ్ ముద్రించిన ప్రసిద్ధిగాంచిన రెండు సంపుటుల బైబిళ్ళు పుస్తక ముద్రణలో మొదటి పెద్ద గ్రంథాలని ఎంచబడుతున్నాయి” అని ఆ వార్తాపత్రిక చెబుతుంది. చివరిగా కనుగొన్న భాగానికి “తొలుత వేయబడిన పుస్తకం గొలుసు ఇప్పటికీ ఉంది. దొంగిలించబడకుండా ఉండేందుకు ఆ గొలుసుతో ఆ బైబిలును ప్రసంగవేదికకు బిగించి ఉంచారు.”