కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 23-26
  • యెహోవా మా మార్గాన్ని సుగమం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మా మార్గాన్ని సుగమం చేశాడు
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాకు సందేహాలుండేవి
  • వివాహమూ, కుటుంబమూ
  • బైబిలు సత్యాన్ని వెదకడం
  • బైబిలు సత్యాన్ని కనుగొనడం
  • రాజ్యాసక్తులను ముందుంచడం
  • ఎనిమిదిమంది పిల్లలను యెహోవా మార్గాల్లో పెంచడం కష్టమైనా ఆనందదాయకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 23-26

యెహోవా మా మార్గాన్ని సుగమం చేశాడు

నేను 1924లో స్విట్జర్‌లాండ్‌లోని జూగ్‌ జిల్లాలోని కామ్‌ పట్టణానికి సమీపాన జన్మించాను. మా తల్లిదండ్రులకు 13 మంది పిల్లలు—10 మంది అబ్బాయిలూ, ముగ్గురు అమ్మాయిలు. నేనే మొదటి సంతానం. అబ్బాయిని. ఇద్దరు అబ్బాయిలు చిన్నప్పుడే చనిపోయారు. గొప్ప ఆర్థిక మాంద్యం కలిగిన రోజుల్లో, ఒక పొలంలో నివసించేవాళ్ళం. మేము మతనిష్టగల కాథలిక్‌ కుటుంబంలో పెరిగాం.

మా నాన్న నిజాయితీపరుడు, మంచి స్వభావం కలవాడు, కానీ ఆయనకు కోపం వచ్చేది. నాన్నను అమ్మ అసూయతో అన్యాయంగా నిందించినప్పుడు నాన్న అమ్మను కొట్టేవాడు కూడా. నాన్న విశ్వాస్యతను గురించి అనుమానించేందుకు ఆమెకు ఏ కారణమూ లేకపోయినప్పటికీ పొరుగు స్త్రీలతో ఆయన మాట్లాడ్డాన్ని ఆమె సహించలేకపోయేది. ఈ పరిస్థితి నన్ను బాగా కలతపరచేది.

అమ్మ చాలా అంధవిశ్వాసి. చిన్న చిన్న సంఘటనలను కూడా “పాపపరిహార స్థలంలోవున్న దీన ఆత్మల” నుండి వచ్చిన సూచనలని వ్యాఖ్యానించేది. అలాంటి అసంబద్ధమైన నమ్మకాలను నేను అసహ్యించుకునేవాణ్ణి. ఆమె అబద్ధ మత ఆలోచనా సరళిని సమర్థించే పుస్తకాలను ఆమెకు ఇస్తూ ఆమె అంధవిశ్వాసాలను ప్రీస్ట్‌లు ప్రోత్సహించేవారు.

నాకు సందేహాలుండేవి

నా బాల్యం నుండే, దేవుడ్ని గురించీ, మానవుని విధిని గురించిన సందేహాలు నా మనస్సులో అంకురించాయి. నేను హేతుబద్ధమైన నిర్ధారణలకు చేరుకునేందుకు ప్రయత్నం చేశాను. కానీ ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలున్నాయి! పరిశుద్ధుల గురించీ, అద్భుతాల గురించి, మరనేక విషయాల గురించిన కాథలిక్‌ ప్రచురణలను చదివాను. అయితే, అవి నా తార్కిక స్పృహను తృప్తిపరచలేకపోయాయి. నేను అంధకారంలోకి కూరుకుపోతున్నట్లు నాకు అనిపించింది.

నాకున్న సందేహాలను గురించి ఆలోచించవద్దని స్థానిక ప్రీస్ట్‌ నాకు బోధించాడు. ప్రతిదీ అర్థం చేసుకోవాలని కోరుకోవడం అహంకారానికి సూచనయనీ, దేవుడు అహంకారులను వ్యతిరేకిస్తున్నాడనీ ఆయన నాకు చెప్పాడు. ముఖ్యంగా, తమ పాపాలను ఒప్పుకోకుండా చనిపోయేవారిని దేవుడు మండుతున్న నరకంలో వేసి నిత్యమూ హింసిస్తాడన్న బోధ నాకు ఏవగింపును కలిగించింది. దీనర్థం, భూమిమీద ఉన్న అధికసంఖ్యాకులు శాశ్వతంగా పీడించబడతారన్నదే కనుక, ‘ఇది దేవుని ప్రేమతో ఎలా పొందికగా ఉండగలదు?’ అని తరచూ ఆలోచించేవాణ్ణి.

కాథలిక్క్‌ల పాపసంకీర్తన ఆచారాన్ని గురించి ఆలోచించాను. చెడు తలంపులు గంభీరమైన పాపమనీ, వాటిని ప్రీస్ట్‌ ఎదుట ఒప్పుకోవాలనీ కాథలిక్‌ స్కూల్లో చెప్పినప్పుడు నేను భయపడ్డాను. ‘ప్రతిదీ పాపసంకీర్తనం చేసేందుకుగాను నాకు అన్నీ గుర్తున్నాయా? లేదా నేనేదైనా మర్చిపోయానా, నా పాపసంకీర్తన నిరర్థకమైపోయిందా, నా పాపాలు క్షమించబడకుండా పోయాయా?’ అని ఆలోచించేవాడ్ని. దేవుని కరుణను గురించిన, క్షమించేందుకు ఆయనకున్న సుముఖతను గురించిన సందేహాలు అలా నా హృదయంలో విత్తబడ్డాయి.

మూడు లేదా నాలుగు సంవత్సరాలు, నాలో నిస్సత్తువను కలిగించిన కృంగదీస్తున్న తలంపులతో పోరాడాను. దేవుని మీదున్న విశ్వాసాన్నంతటినీ త్యజించేస్తానని అనుకునేవాణ్ణి. ‘నేను పట్టుదలతో ఉంటే, కచ్చితంగా సరైన మార్గాన్ని కనుగొంటాను’ అని మళ్ళీ నేనే అనుకునేవాడ్ని. కాలక్రమేణా, దేవుని ఉనికిలో నేను నమ్మకాన్ని వృద్ధిచేసుకున్నాను. కానీ మా మత నమ్మకాలను గూర్చిన అనిశ్చితత్వం నన్ను పట్టిపీడించింది.

నాకు చిన్నప్పుడు బోధించబడినదాన్నిబట్టి, అపొస్తలుడైన పేతురుతో “ఈ బండమీద నా చర్చిని కట్టుదును” అని చెప్పినప్పుడు యేసు మనస్సులో ఉన్నది రోమన్‌ కాథలిక్‌ చర్చియేనని నేను నమ్మాను. (మత్తయి 16:18, కాథలిక్‌ డూయే వర్షన్‌) చర్చిలోని మంచి మూలకాలు చివరికి గెలుపుపొందుతాయనే నమ్మకానికి వచ్చాను. ఆ లక్ష్యసాధన దృష్ట్యా నేను చర్చితో సహకరించాలనుకున్నాను.

వివాహమూ, కుటుంబమూ

కుటుంబంలో అందరికన్నా పెద్దవాడినైన నేను నా పెద్ద తమ్ముడు నా స్థానానికి వచ్చే వరకు, నా తండ్రితో పొలంలో పని చేశాను. తర్వాత, నేను కాథలిక్‌ వ్యవసాయ పాఠశాలకు వెళ్ళాను. అక్కడ మాస్టర్‌ డిగ్రీ సంపాదించాను. ఆ తర్వాత, నేను వివాహభాగస్వామి కోసం వెదకడం మొదలుపెట్టాను.

నా చెల్లెలి ద్వారా నాకు మారీయతో పరిచయమైంది. తనతోపాటు నిత్యజీవం కొరకు ప్రయత్నించే భర్త కోసం ఆమె ప్రార్థించిందని నేను తెలుసుకున్నాను. “మేము ప్రేమలో ఐక్యమై సంతోషాన్ని వెదుకుతాం. మా దృష్టిని దేవుని మీదే ఉంచుతాం. మేము జీవమార్గంలో పయనిస్తాం, నిత్య సంతోషమే మా లక్ష్యం” అని మా వివాహ ప్రకటనపై వ్రాశాం. మేము 1958, జూన్‌ 26న జూరిక్‌ సమీపానవున్న ఫార్‌ కాన్వెంట్లో వివాహం చేసుకున్నాం.

నేనూ మారీయ ఒకేలాంటి కుటుంబ నేపథ్యాల నుండి వచ్చినవాళ్ళం. ఆమె చాలా మతనిష్ఠగల కుటుంబం నుండి వచ్చింది, ఏడుమంది పిల్లల్లో ఆమే అందరికన్నా పెద్దది. వాళ్లందరూ పొలం పనుల్లోనూ, పాఠశాల చదువుల్లోనూ, చర్చికి వెళ్ళడంలోనూ బిజీగా ఉండేవాళ్ళు. కనుక వాళ్ళకు ఆడుకోవడానికి సమయం ఉండేది కాదు. మా వివాహజీవితంలోని మొదటి సంవత్సరాలు అంత సాఫీగా గడవలేదు. మత విషయాలపై నాకున్న అనేక సందేహాల మూలంగా తాను వివాహం చేసుకుంది సరైన వ్యక్తినేనా అని మారీయ సంశయించింది. చర్చి బోధలను లేదా యుద్ధాలకు, క్రూసేడ్‌లకూ, ఇన్‌క్విజిషన్‌లకూ మద్దతునిచ్చే దాని అలవాటును ప్రశ్నించడాన్ని ఆమె నిరాకరించింది. అయితే, మేమిద్దరమూ దేవునియందు నమ్మకముంచాం. మాకు సాధ్యమైనంత మేరకు ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తే, ఆయన మమ్మల్ని ఎన్నడూ ఎడబాయడనే నమ్మకంతో ఉన్నాం.

1959లో ప్రాచ్య స్విట్జర్‌లాండ్‌లో హామ్‌బర్గ్‌కు సమీపాన ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నాం. 31 సంవత్సరాల వరకూ అదే మా ఇల్లు. 1960, మార్చి 6న మా మొదటి కుమారుడైన జోసెఫ్‌ పుట్టాడు. తర్వాత, అతనికి ఆరుగురు తమ్ముళ్ళు, రాయెల్‌ అనే చెల్లెలూ పుట్టారు. తాను న్యాయవంతురాలూ, నిష్పక్షపాతీ అయిన తల్లియనీ, తన మనస్సులో పాదుకునివున్న సూత్రాల ఎడల తను నమ్మకస్థురాలనీ మారీయ రుజువు చేసుకుంది. ఆమె కుటుంబానికి నిజమైన ఆశీర్వాదంగా ఉంది.

బైబిలు సత్యాన్ని వెదకడం

కాలక్రమేణా, మా మత సంబంధ అజ్ఞానం మరింత అసహనీయంగా మారింది. 1960ల చివరిలో, కాథలిక్‌ ప్యూపుల్స్‌ హైస్కూల్లో లెక్చర్లకు వెళ్ళడం మొదలుపెట్టాం. కాని మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి మాకు మరింత తికమక అయిపోయేది. ప్రసంగీకులు లేఖనాధారం లేకుండా, తమ సొంత దృక్కోణాలను వివరించేవారు. 1970ల తొలిభాగంలో, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని . . . అడుగుడి, మీకు దొరకును” అని చెప్పిన యేసు మాటలను తలపోశాను.—యోహాను 16:23, 24.

దేవుని వాక్యంలో పైవిధంగా ఇవ్వబడిన హామీ “కాథలిక్‌ చర్చి నిజమైన మతమైతే, దయచేసి నాకు స్పష్టంగా చూపించు. అది అబద్ధ మతమైతే నాకు స్పష్టంగా చూపించు, నేను ప్రతి ఒక్కరికి దానిని ప్రకటిస్తాను” అని నేను మళ్ళీ మళ్ళీ ప్రార్థించడానికి పురికొల్పింది. “అడుగుతూ ఉండండి” అని కొండమీది ప్రసంగంలో యేసు ఇచ్చిన నిర్దేశాన్ని అనుసరిస్తూ నేను మళ్ళీ మళ్ళీ విన్నవించుకున్నాను.—మత్తయి 7:7, 8, NW.

నేను మారీయతో చేసిన సంభాషణలు—ముఖ్యంగా “పరిశుద్ధుల” ఆరాధన, శుక్రవారాల్లో మాంసం తినడం మొదలైన కాథలిక్‌ బోధల్లో 1960లలో వచ్చిన మార్పులను గూర్చిన సంభాషణలు—చివరికి ఆమెకు కూడా సందేహం కలిగేలా చేశాయి. 1970 వసంత కాలంలో, ఒకసారి చర్చిలో పూజకు వెళ్ళినప్పుడు, “ఓ దేవా, నిత్యజీవానికున్న మార్గాన్ని మాకు చూపించు. ఏది సరైన మార్గమో మాకు ఇక ఎంత మాత్రం తెలియదు. దేనికైనా నేను లోబడతాను కానీ, మా కుటుంబమంతటికీ సరైన మార్గాన్ని చూపించు” అని ఆమె ప్రార్థించింది. మా ప్రార్థనలు ఆలకించబడ్డాయి అని మేము గుర్తించే వరకూ, ఆమె చేసిన ప్రార్థన గురించి నాకూ, నేను చేసిన ప్రార్థన గురించి ఆమెకూ తెలియదు.

బైబిలు సత్యాన్ని కనుగొనడం

1970ల తొలిభాగంలో, ఒక ఆదివారం మేము చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఎవరో తలుపు తట్టారు. ఒక వ్యక్తి తన పదేండ్ల కుమారునితోపాటు వచ్చి తాను ఒక యెహోవాసాక్షియని తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను బైబిలు చర్చకు ఒప్పుకున్నాను. యెహోవాసాక్షులను గురించి ఇతరులు నాతో చెప్పినదాన్ని బట్టి, నేను ఆయనది తప్పు మతమని సులభంగా నిరూపించగలనని అనుకున్నాను. వాళ్ళకు బైబిలును గురించి బాగా తెలుసన్న విషయాన్ని నేను నమ్మలేదు.

మా చర్చ రెండు గంటల వరకూ కొనసాగింది, సంతృప్తికరమైన ఫలితమేమి దొరకలేదు. మరుసటి ఆదివారం కూడా అలాగే జరిగింది. నేను మూడవ చర్చ కోసం ఎదురు చూశాను. కానీ ఆ సాక్షి కనిపించలేదు. ప్రయోజనమేమీ ఉండదని ఆయన గ్రహించి ఉండవచ్చు అని మారీయ అన్నది. రెండు వారాల తర్వాత ఆయన మళ్ళీ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. “35 సంవత్సరాలుగా నేను నరకాన్ని గూర్చి ఆలోచిస్తున్నాను. ప్రేమాస్వరూపియైన దేవుడు అంత క్రూరంగా ప్రాణులను పీడిస్తాడంటే అంగీకరించలేకపోతున్నాను” అని వెంటనే అన్నాను.

“మీరన్నది నిజం” అని సాక్షి జవాబిచ్చాడు. “నరకం అనేది పీడించే స్థలమని బైబిలు చెప్పడం లేదు” అనీ అన్నాడు. షీయోల్‌, మరియు హేడీస్‌ అనే హెబ్రీ మరియు గ్రీక్‌ పదాలు కాథలిక్‌ బైబిలులో “నరకం” అని తరచూ తర్జుమా చేయబడ్డాయనీ, అది కేవలం సాధారణ సమాధిని సూచిస్తుందని ఆయన నాకు చూపించాడు. (ఆదికాండము 37:35; యోబు 14:13; అపొస్తలుల కార్యములు 2:31) మానవ ప్రాణం మర్త్యమనీ, పాపానికి శిక్ష మరణమనీ, పీడించబడడం కాదనీ నిరూపించే లేఖనాలను ఆయన చదివాడు. (యెహెజ్కేలు 18:4; రోమీయులు 6:23) మతం అబద్ధాలతో జీవితాంతం నన్ను గ్రుడ్డివాణ్ణి చేసిందని నేను స్పష్టంగా గ్రహించనారంభించాను. ఇక చర్చి యొక్క ఇతర సిద్ధాంతాలు కూడా తప్పేనా అని ఆలోచించనారంభించాను.

నేను ఇంకా మోసగించబడడానికి ఇష్టపడలేదు కనుక, కాథలిక్‌ బైబిల్‌ నిఘంటువునూ, పోప్‌ల చరిత్రను గూర్చిన ఐదు సంపుటులనూ కొన్నాను. ఇవి లైసెన్స్‌వున్న ప్రచురణలే. రోమన్‌ కాథలిక్‌ బిషప్‌ల అథారిటీయే వీటి ముద్రణను అనుమతించింది. పోప్‌ల చరిత్రను చదవగా, పోప్‌లలో కొందరు లోకంలోని మహా చెడ్డ నేరస్థుల్లోని కొందరని నాకు తెలిసింది! బైబిల్‌ నిఘంటువును చూసినప్పుడు, త్రిత్వం, నరకాగ్ని, పాపపరిహార స్థలం, చర్చి యొక్క మరనేక బోధలు బైబిలు ఆధారమైనవి కావని తెలుసుకున్నాను.

నేను ఇప్పుడు సాక్షులతో బైబిలు పఠించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట్లో మారీయ మర్యాద కోసమే కూర్చునేది. కాని త్వరలోనే తాను నేర్చుకున్న సత్యాన్ని అవలంభించింది. నాలుగు నెలల తర్వాత, నేను కాథలిక్‌ చర్చిని విడిచిపెట్టాను. మా పిల్లలు ఇకెన్నడూ మతసంబంధమైన క్లాస్‌లకు రారని ప్రీస్ట్‌కు తెలియజేశాను. మరుసటి ఆదివారం, ప్రీస్ట్‌ తన చర్చి సభ్యులకు యెహోవాసాక్షులను గురించి హెచ్చరించాడు. నేను బైబిలు ఉపయోగించి నా నమ్మకాలను నిరూపించుకుంటానని ప్రతిపాదించాను. కానీ అలాంటి చర్చకు ప్రీస్ట్‌ ఒప్పుకోలేదు.

ఆ తర్వాత, మేము త్వరితగతిన ప్రగతిని సాధించాం. చివరకు, నేనూ, నా భార్యా 1970, డిశంబర్‌ 13న నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు మా సమర్పణను తెలియజేసుకున్నాం. ఒక సంవత్సరం తర్వాత, క్రైస్తవ తాటస్థ్య వివాదంపై నేను రెండు నెలలు జైలులో ఉండవలసి వచ్చింది. (యెషయా 2:4) ఆ కొద్ది కాలం నా భార్యను ఎనిమిది మంది పిల్లలనూ వదిలిపెట్టి వెళ్ళడం అన్నది విషమ పరిస్థితే. పిల్లల వయస్సు 4 నెలల నుండి 12 సంవత్సరాల లోపు మాత్రమే. అంతేకాక, పాడీ పంటా చూసుకోవాలి. అయితే యెహోవా సహాయంతో, నేను లేకుండానే వాళ్ళు నెట్టుకు రాగలిగారు.

రాజ్యాసక్తులను ముందుంచడం

మా కుటుంబంలోని ఎవరూ కూడా అనారోగ్యం ఉన్నప్పుడు తప్ప మరెప్పుడూ సంఘ కూటాలకు హాజరవ్వకుండా ఉండేవారు కాదు. మేము పెద్ద సమావేశాలను కోల్పోకుండా ఉండేలా మా పనిని సంస్థీకరించుకునే వాళ్ళం. అటుక మీద మా పిల్లలు ఆడుకునే ఆటల్లో, క్రైస్తవ కూటాల్లో వాళ్ళు గమనించినవాటిని నటించే ఆటలే ఎక్కువగా ఉండేవి. ఉదాహరణకు, వాళ్ళు ఒకరికొకరు విద్యార్థి ప్రసంగాలను నియమించుకుని, అందింపులను ప్రాక్టీస్‌ చేసేవాళ్ళు. సంతోషకరంగా, మా ఆధ్యాత్మిక నిర్దేశాలకు వాళ్ళందరూ ప్రతిస్పందించారు. ఒక ప్రాంతీయ సమావేశంలో నన్నూ నా భార్యను ఇంటర్వ్యూ చేస్తుండగా మా ఎనిమిది మంది పిల్లలు పెద్దవాడు మొదలుకొని చిన్నదాని వరకూ ఒకే వరుసలో కూర్చుని శ్రద్ధగా వింటున్న సన్నివేశం మరపురాని ఒక జ్ఞాపకం.

“ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” మా పిల్లలను పెంచడమే మా ముఖ్య విషయమైంది. (ఎఫెసీయులు 6:4) మేము టీవీని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాం. మేము తరచూ ఆసక్తిగల తోటి క్రైస్తవులను మా ఇంటికి ఆహ్వానించేవాళ్ళం. అలా మా పిల్లలు వారి అనుభవాల నుండీ, వారి ఉత్సాహం నుండి ప్రయోజనం పొందగల్గేవారు. ఇతరుల ఎడల పరిగణన లేని మాటలను మాట్లాడకుండా, ఇతరులను విమర్శించకుండా ఉండేందుకు మేము జాగ్రత్తపడేవాళ్ళం. ఎవరైనా తప్పు చేస్తే దాని గురించి చర్చించి, అలాచేయడానికి నడిపిన పరిస్థితులేవో చూసేవాళ్ళం. పరిస్థితిని హేతుబద్ధంగా, న్యాయంగా మదింపు చేసేలా మా పిల్లలకు మేము సహాయం చేయడానికి ప్రయత్నించాం. మిగతా యౌవనస్థులతో పోల్చకుండా ఉండేందుకు జాగ్రత్తపడేవాళ్ళం. పిల్లలను అతి గారాబము చేయడంగానీ, లేదా వాళ్ళు చేసిన తప్పుల పర్యవసానాలనుండి తప్పించడం గానీ చేయకుండా ఉండవలసిన దాని ప్రాముఖ్యతను మేము గుర్తించాం.—సామెతలు 29:21.

అయినా, మా పిల్లలను పెంచడంలో సమస్యలు లేకుండా పోలేదు. ఉదాహరణకు, ఒకసారి, డబ్బు చెల్లించకుండానే దుకాణంలో నుండి కలకండ తీసుకోవడానికి మా పిల్లలను వాళ్ళ తోటి విద్యార్థులు ప్రేరేపించారు. అయితే జరిగిన విషయాన్ని మేము తెలుసుకున్నప్పుడు, డబ్బు చెల్లించి, క్షమాపణ కోరాలని మా పిల్లలను దుకాణానికి తిరిగి పంపాం. అది వాళ్ళను చాలా ఇబ్బందిపెట్టింది. కానీ వాళ్ళు నిజాయితీని గురించిన పాఠాన్ని నేర్చుకున్నారు.

ప్రకటనా పనికి మాతో రమ్మని మా పిల్లలను ఊరకే బలవంతం చేసే బదులు, అలాంటి క్రియాశీలతకు ప్రాధాన్యతనిస్తూ మేము మాదిరినుంచాం. పొలం పనులకన్నా కూటాలకూ, ప్రాంతీయ పరిచర్యకూ మేము మొదటి స్థానాన్నివ్వడాన్ని పిల్లలు చూశారు. మా ఎనిమిది మంది పిల్లలనూ యెహోవా మార్గంలో పెంచాలని మేము చేసిన ప్రయత్నాలు కచ్చితంగా ఆశీర్వదించబడ్డాయి.

మా పెద్ద కుమారుడైన జోసెఫ్‌ సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు. ఆయన తన భార్యతోపాటు స్విట్జర్‌లాండ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఆఫీస్‌లో అనేక సంవత్సరాలు సేవ చేశాడు. టోమస్‌ ఒక సంఘపెద్ద. ఆయనా, ఆయన భార్య పయినీర్లు. పూర్తికాల పరిచారకులు పయినీర్లని పిలువబడతారు. డానీల్‌ తన చాంపియన్‌ సైక్లిస్ట్‌ కెరీర్‌ను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆయన సంఘపెద్ద. ఆయనా, ఆయన భార్య మరో సంఘంలో పయినీర్లు. బెన్నో, ఆయన భార్య సెంట్రల్‌ స్విట్జర్‌లాండ్‌లో చురుకైన పరిచారకులు. మా ఐదవ కుమారుడైన క్రిస్టియన్‌ మేము హాజరయ్యే సంఘంలో ఒక పెద్ద. ఆయనకు పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్నారు. ఫ్రాన్జ్‌ ఒక పయినీరు, బెర్న్‌ సంఘంలో ఒక పెద్ద. ఊర్స్‌ ఒకప్పుడు స్విట్జర్‌లాండ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌లో సేవ చేశాడు. ఇతనికి పెళ్ళయ్యింది. ఒక పయినీరుగా సేవచేస్తున్నాడు. మా ఏకైక కుమార్తె రాయెల్‌, ఆమె భర్తా అనేక సంవత్సరాలు పయినీరింగ్‌ చేశారు.

1990 జూన్‌లో లౌకిక ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత, నా పిల్లల మాదిరిని అనుసరిస్తూ, నేను కూడా పయినీర్‌ అయ్యాను. నా జీవితాన్ని గురించీ, నా కుటుంబాన్ని గురించీ వెనక్కి తిరిగి చూస్తే, యెహోవా మా మార్గాన్ని సుగమం చేసి, ‘పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాడని’ నిశ్చయంగా చెప్పగలను.—మలాకీ 3:10.

నా ప్రియమైన భార్యకిష్టమైన బైబిలు పాఠ్యాంశం: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) నాకిష్టమైనది: “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.” (కీర్తన 37:4) ఈ అందమైన వ్యక్తీకరణల్లోని సత్యాన్ని మేమిద్దరమూ అనుభవించి తెలుసుకున్నాం. మన దేవుడైన యెహోవాను, మా పిల్లలతోనూ, వారి కుటుంబాలతోనూ నిత్యం స్తుతించాలన్నదే మా లక్ష్యం.—యోసఫ్‌ హెగ్‌లీ చెప్పినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి