సమస్యలులేని పరదైసు కొరకు అన్వేషణ
“మేము చేయాలని అనుకున్నదల్లా సురక్షితమైన, బహుశ ప్రజలు ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ వహించే పాత తరహా జీవన విధానాన్ని పునఃసృష్టించడమే” అని ఒక బ్రిటీష్ దంపతులు వివరించారు. ఉష్ణమండల ద్వీప పరదైసును అన్వేషించి, శాంతియుతంగా కలిసి జీవించే సముదాయాన్ని అక్కడ స్థాపించాలని వారు తీర్మానించుకున్నారు. వారి భావాలను మీరు కచ్చితంగా అర్థం చేసుకోగలరు. సమస్యలులేని పరదైసులో జీవించగలిగే అవకాశం లభిస్తే, ఎవరు మాత్రం దాన్ని వదులుకుంటారు?
వేరుగా ఉండటమే పరిష్కారమా?
వేరుగా ఉండటం కొంతమేరకు భద్రతను అందిస్తుంది గనుక, ఒక ద్వీపంపై జీవించడమనే ఆలోచన పరదైసును వెదకే అనేకులకు నచ్చుతుంది. కొందరు పనామా కాలువ యొక్క పసిఫిక్ తీరానికి దూరంగా ఉన్న ద్వీపాలను గానీ లేదా బలీజ్ దేశానికి దూరంగా ఉన్న ద్వీపాలవంటివైన కరీబియన్ సముద్రంలోని ద్వీపాలను గానీ ఎంచుకున్నారు. ఇతరులు హిందూ మహాసముద్రమందలి సుందర దృశ్య ప్రాంతాల వైపు, ఉదాహరణకు సేషేల్ ద్వీపసముదాయాల వైపు తమ అవధానాన్ని మళ్లిస్తారు.
ఏకాంత సముదాయాన్ని స్థాపించాలనే వ్యూహరచన నిర్మాణ ప్రక్రియలను ఊహించుకోవడమే దుస్సాహసంగా ఉంటుంది. తగినంత డబ్బు అందుబాటులో ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ శాసన నిర్మాణప్రతిబంధకాలు, భూమిని త్వరగా కొనుగోలు చేయడాన్ని పరిమితం చేయవచ్చు. అయితే ఆదర్శవంతమైన ఉష్ణమండల ద్వీపాన్ని పొందగలిగినప్పటికీ, మీరు అక్కడ ఆనందంగా ఉంటారా? మీ పరదైసు చింతలు లేనిదై ఉంటుందా?
బ్రిటన్ తీరం చుట్టూ ఉన్న మారుమూల ద్వీపాలు పెరుగుతున్న జనాభాకు ఇప్పుడు నివాస స్థలాలయ్యాయి. ఆ ద్వీపాలలో ఉన్న క్రొత్త నివాసులు ఎవరంటే ముఖ్యంగా ఏకాంతతనూ ప్రశాంతతనూ వెదకుతున్న ప్రజలే. స్కాట్‌లాండ్ పశ్చిమ తీరానికి దూరంగా ఉన్న 250 ఎకరాల ఓర్సా ద్వీపంపై ఒంటరిగా జీవిస్తున్న ఒక వ్యక్తి, తాను ఎన్నడూ ఒంటరితనాన్ని అనుభవించలేదని చెబుతున్నాడు, ఎందుకంటే ఆయనకు వంద గొర్రెలున్న తన మంద ఎడల శ్రద్ధ వహించే విషయంలో ఎంతో పని ఉంది. ద్వీపంలో ఏకాంతవాసాన్ని వెదకిన ఇతరులు అనతికాలంలోనే ఒంటరి వారౌతారు. కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనీ మరి వారికి రక్షణ అవసరమైందనీ నివేదించబడింది.
సుందర దృశ్యాలుగల ఒక ఉష్ణమండల ద్వీపం పరదైసు వలె ఉంటుందని అనేకమంది ప్రజలు నమ్ముతారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు అంతగా లేని, మనస్సుకు హాయినిచ్చే ప్రాంతంలో జీవించడం వారికి ఎంతో నచ్చుతుంది. అయితే భూగోళం వెచ్చబడే సాధ్యత మరియు దాని మూలంగా సముద్ర మట్టం పెరిగే సాధ్యత ఎడలగల వ్యాకులత అనేకమంది ద్వీపవాసులకు విభ్రాంతి కలిగించింది. సముద్రం పోటుమీద ఉన్నప్పుడు, పశ్చిమ పసిఫిక్‌లో ఉండే టోకలావూ ద్వీప ప్రాంతంగా తయారైన వృత్తాకారపు పగడపు దిబ్బల నివాసులూ, అలాగే హిందూ మహాసముద్ర మందు చెదురుమదురుగా ఉన్న మాల్దీవులకు—ఆ ద్వీపాలు సముద్ర మట్టానికన్నా రెండు మీటర్లు మించని ఎత్తులో ఉన్నాయి—చెందిన వారూ అదే విధంగా ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
దాదాపు 40 విభిన్న ప్రభుత్వాలు తమ బాధకు మద్దతు కోరేందుకు కలిసికట్టుగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప రాష్ట్రాల సమాఖ్యగా సమకూడాయి. చిన్న ద్వీపాల్లో నివసించే వారికి సాధారణంగా దీర్ఘకాలం జీవించే అవకాశం ఎక్కువగా ఉండి, శిశు మరణాలు తక్కువ ఉన్నప్పటికీ, వారు గంభీరమైన వాతావరణ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉపరితలంపై చమురు తెట్టె ఏర్పడడం మరియు సముద్రకాలుష్యం వంటివి కొన్ని ద్వీపాల ఆర్థికస్థితిని దెబ్బ తీస్తాయి. పెద్ద దేశాలు పడేయాలని ప్రయత్నించే విషపూరిత వ్యర్థ పదార్థాల కసువుదొడ్లుగా మరితర ద్వీపాలు మారుతున్నాయి.
మరి పరదైసును వెదకే వారికి, ఒక ద్వీపం ఎంతో కోరదగినదిగా ఉండగలదనే వాస్తవమే ముప్పుగా ఉంది. ఎలా? సూర్యకాంతి సోకే ద్వీపాల సముద్ర తీరాలకు తరలివచ్చే పర్యాటకులు విపరీతమైన జనరద్దీకి మరియు పరిమిత వనరులు తరిగిపోవడానికీ కారణమౌతున్నారు. ఈ సందర్శకులు కాలుష్య సమస్యను కూడా తీవ్రతరం చేస్తున్నారు. ఉదాహరణకు, కరీబియన్ ద్వీపాలకు ప్రతియేట వచ్చే రెండు కోట్లమంది సందర్శకుల వలన కలిగే మురుగు, చెత్తలో కేవలం పదింట ఒక వంతు మాత్రమే శుద్ధీకరణకు నోచుకుంటుంది.
అసాధారణమైన ప్రకృతి సౌందర్యంగల ఇతర ప్రాంతాల్లో కూడా అదే విధమైనది జరుగుతోంది. భారతదేశపు పశ్చిమ తీరానున్న గోవా సంగతే తీసుకోండి. “పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం ‘పరదైసును విషపూరితం చేస్తుంది’” అని ఇండిపెండెంట్ ఆన్ సండే అనే లండన్ పత్రిక చెప్పింది. మరి 1972లో 10,000 మంది ఉన్న పర్యాటకుల సంఖ్య 90వ దశాబ్దపు తొలిభాగంలో పది లక్షలకంటే ఎక్కువకు పెరిగిందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. గోవా యొక్క అతి సున్నితమైన పర్యావరణం మరియు విశిష్టమైన సంస్కృతీ, విపరీతంగా వస్తున్న పర్యాటకుల నుండి ఎక్కువ సొమ్ము చేసుకోవాలని చూస్తున్న హోటలు యజమానుల పేరాశ మూలంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఒక గుంపు హెచ్చరిస్తుంది. కొన్ని హోటళ్ళు బీచ్‌పై అక్రమంగా పుట్టుకొచ్చాయని భారతీయ ప్రభుత్వ నివేదిక ఒకటి నొక్కి చెబుతుంది. ఇసుకను తీసేస్తున్నారు, చెట్లను కొట్టేస్తున్నారు మరి ఇసుక గుట్టలను మట్టం చేస్తున్నారు. మురుగు నీటిని సముద్రతీరంలోకో లేక దగ్గర్లో ఉన్న పొలాల్లోకో పంపిస్తున్నారు, అది కాలుష్యాన్ని కలిగిస్తుంది.
నేరరహితమైనవా?
క్రమేపి విస్తరిస్తున్న నేరం ఎంతో అందమైన ప్రాంతాల పేరు ప్రఖ్యాతులను కూడా నాశనం చేస్తోంది. “పరదైసులో హత్యాకాండ” అనే ముఖ శీర్షికగల ఓ వార్తా నివేదిక, బార్బుడా అనే ఒక చిన్న కరీబియన్ ద్వీపం నుండి వచ్చింది. ఆ ద్వీపం యొక్క తీరానికి కాస్త దూరాన లంగరు వేయబడి ఉన్న ఒక విలాసవంతమైన విహార పడవలో నలుగురిని క్రూరంగా హత్య చేసిన తీరు అందులో వివరించబడింది. ఇటువంటి సంఘటనలు ఆ ప్రాంతమంతటా నేరం వ్యాపిస్తుందేమో అనే చింతను ఎక్కువ చేస్తాయి.
ఒక మధ్య అమెరికా దేశాన్ని గురించి, లండన్‌కు చెందిన ది సండే టైమ్స్ అనే వార్తాపత్రిక “‘పరదైసులో’ మాదక ద్రవ్యాలు ముఠా పోరాటాల్ని ప్రారంభించాయి” అనే ముఖ శీర్షికను ప్రచురించింది. శాంతి అంతరించి పోయిందనే వాస్తవాన్ని గురించి ఒక ప్రాంతీయ సంపాదకుడు విలపిస్తూ, “ఇప్పుడు ఒక పదహారేళ్ల అబ్బాయి వీధిలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఉదయాన్నే చూడటం మామూలు విషయమైంది” అని వ్యాఖ్యానించాడు.
ఒక పరదైసు సముదాయంలో జీవించాలని ఉద్దేశించే వారు, శాంతియుతంగా జీవించేందుకు ఇష్టపడుతున్న ప్రజలను ఆకర్షించాలని కోరుకుంటారు. అయితే వాస్తవం ఏమిటి? ప్రారంభంలో ప్రస్తావించబడిన బ్రిటీష్ దంపతుల విషయంలో త్వరలోనే అభిప్రాయభేదాలు తలెత్తాయి. వారి పథకంలో చేరాలనుకున్న కొంతమంది ఆ పథకం నుండి డబ్బు గడించాలని ప్రయత్నించినట్లు స్పష్టమౌతుంది. “మాకు నాయకులు అక్కర్లేదు. మా పథకాలను నిజం చేసుకునేందుకు మేము మా డబ్బును ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నాము. నేను దాన్ని ఉటోపియన్ సముదాయమని పిలుస్తున్నాను” అని ప్రమోటర్ ప్రకటించాడు. అయితే ఇది అలాంటి ప్రణాళికల్లో మొదటిదేమీ కాదు.—“సముదాయం పరదైసుతో ప్రయోగం చేస్తుంది” అనే బాక్సు చూడండి.
లాటరీని గెలుచుకోవడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించగలమని పరదైసును అన్వేషిస్తున్న మరి ఇతరులు కొందరు నమ్ముతున్నారు. అయితే ఈ విధంగా సాధించిన ఆర్థిక లాభాలు ఎన్నడూ ఆనందాన్ని తీసుకురావు. ఇంతవరకూ అందరిలోకెల్లా అత్యంత ఎక్కువ మొత్తాన్ని లాటరీలో గెలుచుకున్న ఒక బ్రిటీష్ కుటుంబం తీవ్రమైన అంతఃకలహాన్ని అనుభవిస్తుందని 1995 ఫిబ్రవరి నెలలో వచ్చిన ది సండే టైమ్స్ పత్రిక నివేదించింది; డబ్బు గెలుచుకోవడం వారికి “విముఖతను, కుటుంబ కలహాలనూ మరియు నిరాశనూ” మాత్రమే మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇది జరగడం అసాధారణమేమీ కాదు.
ఉటోపియా కొరకైన మానవుని అన్వేషణను గురించిన ఒక అధ్యయనంలో, “తక్షణమే ధనాన్ని సంపాదించాలని కలలుగనడాన్ని” గురించి వ్యాఖ్యానిస్తూ, బెర్నార్డ్ లెవిన్ అనే పత్రికా సంపాదకుడు ఇలా నొక్కి చెప్పాడు: “అనేక ఇతర కలలవలెనే, ఇది కూడా ఓ పీడకలగా మారగలదు. అకస్మాత్తుగా లభించిన ధనం మూలంగా తీవ్రమైన విపత్తులు (అందులో ఆత్మహత్యలు కూడా ఇమిడివున్నాయి) కలగడాన్ని గురించిన కచ్చితమైన కథనాలు ఎంత కోకొల్లలుగా ఉన్నాయంటే, అవి కేవలం యాదృచ్ఛికమని త్రోసిపుచ్చలేము.”
నాశనదిన మతతెగల సంగతేమిటి?
ఇతర పరదైసు పథకాలు మరింత కుటిల సంకల్పాలను కలిగి ఉన్నాయి. టెక్సాస్‌లోని వాకోనందు ప్రభుత్వ చట్టాన్ని అమలుచేసే ప్రతినిధులు, బ్రాంచ్ డేవిడియన్‌లను వారి ఆవరణంలో గత 1993లో ముట్టడించడాన్ని గురించి ఒక వార్తాపత్రిక నివేదించింది. వారు “అస్త్రాలనూ మనస్సును నియంత్రించే పద్ధతులనూ ఉపయోగించారనీ, మరియు నాశనదిన ప్రవక్తలు వారిలో ఉన్నారని మరి ఈ విపత్కర మిశ్రమమే” ఆ నాశనానికి దారితీసిందనీ అది వ్యాఖ్యానించింది. అయితే దుఃఖకరమైన విషయమేమంటే ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదు.
ఈ మధ్యనే భారతదేశ ఆధ్యాత్మిక నేత భగవాన్ శ్రీ రజినీష్ అనుచరులు, ఓరెగాన్‌లో ఒక సముదాయాన్ని స్థాపించారు, అయితే వారు తమ ఇరుగుపొరుగు వారి నైతిక భావాలను గాయపరిచారు. వారి నేతకుగల ధన సంపద, వారు ఆచరిస్తున్న లైంగిక ప్రయోగాలు తాము “ఒక అందమైన ఒయాసిస్‌ను” స్థాపించామనే వారి మాటలను వమ్ము చేస్తున్నాయి.
పరదైసు కొరకు నిరీక్షిస్తున్న ప్రజలచేత నడుపబడుతున్న అనేక మతశాఖలు, కొన్నిసార్లు దౌర్జన్యపూరితమైన ఘర్షణలకు దారి తీసే విచిత్రమైన ఆచారాలను తమ అనుచరులు అనుసరించాలని అపేక్షించడం జరుగుతుంది. లాన్ బ్రోడీ అనే వార్తాపత్రిక విలేఖరి ఇలా వివరిస్తున్నాడు: “తాము శూన్యంలో జీవిస్తున్నామనీ వాస్తవమైన లోకపు ఒత్తిడులను తాము తట్టుకోలేమనీ భావించే వారికి మతశాఖలు ఒక రక్షణ కేంద్రాన్నీ మరియు ఓ సామాజిక వ్యవస్థనూ అందిస్తాయి.” అయినప్పటికీ, అనేకమంది వ్యక్తులు పరదైసులో జీవించడాన్ని ఇష్టపడతారనే వాస్తవాన్ని అతని మాటలు రుజువు చేస్తున్నాయి.
సమస్యలు లేని పరదైసు
సమస్యల పట్టికకు అంతంలేదని అనిపిస్తుంది: కాలుష్యం, నేరం, మాదక ద్రవ్య దుర్వినియోగం, అధిక జనాభా, జాతి సంఘర్షణలు, రాజకీయ మార్పులు, మరి మానవులందరికీ మామూలుగా కలిగే రోగాలు మరియు మరణం సంగతైతే ఇక చెప్పనక్కర లేదు. ఈ గ్రహంమీద ఎక్కడా కూడా ఏమాత్రం సమస్యలులేని పరదైసు లేనేలేదనే విషయం వాస్తవం. బెర్నార్డ్ లెవిన్ ఇలా అంగీకరిస్తున్నాడు: “మానవజాతి చరిత్రమీద ఒక నల్లని మచ్చ ఉంది, మరి అది మానవత్వమున్నప్పటి నుండే ఉన్నట్లుగా అనిపిస్తుంది. వేరేకొద్ది మంది మానవులతో తప్ప సన్నిహిత సంబంధం కలిగి సంతోషంగా జీవించలేని అసమర్థతా రూపం అది ధరిస్తుంది.”
అయితే పూర్తిగా సమస్యలులేని భౌగోళిక పరదైసు తప్పకుండా వస్తుంది. అది ఎంతకాలం నిలుస్తుందనే విషయం ఒక మానవాతీత శక్తి ద్వారా హామీ ఇవ్వబడుతుంది. వాస్తవానికి, 50 లక్షలకంటే ఎక్కవమంది ప్రజలు ప్రస్తుతం కూడా దాని కొరకు కృషి చేస్తున్నారు, మరియు వారు తమ మధ్య సాపేక్షికంగా చింతలు లేని పర్యావరణాన్ని మరియు అమూల్యమైన ఐక్యతను ఇప్పటికే అనుభవిస్తున్నారు. మీరు వాళ్లను ఎక్కడ కనుగొనగలరు? వారు ఇప్పుడు ఆనందిస్తున్న నిరీక్షణనూ మరియు ప్రయోజనాలనూ మీరు కూడా ఎలా పొందవచ్చు? మరి ఆ రాబోయే పరదైసు ఎంతకాలం నిలుస్తుంది?
[6వ పేజీలోని బాక్సు]
సముదాయం పరదైసుతో ప్రయోగం చేస్తుంది
19వ శతాబ్దం తొలి భాగంలో, ఫ్రెంచి సామ్యవాదియైన ఎటిన్నే కాబెట్ (1788-1856) మరియు ఆయన 280 మంది సహవాసులు ఆయన యొక్క ఆదర్శాల ఆధారంగా జీవించాలనే ఉద్దేశంతో ఇల్లినాయిస్ నందలి నవోలో ఒక సముదాయాన్ని స్థాపించారు. అయితే ఎనిమిది సంవత్సరాలలోనే ఎంతటి వివాదం తలెత్తిందంటే లోవా మరియు కాలిఫోర్నియాల్లోని అదే విధమైన ఇతర గుంపుల వలెనే అది కూడా వెంటనే రద్దు చేయబడింది.
మరొక ఫ్రెంచి వ్యక్తి అయిన చార్లెస్ ఫోరియర్ (1772-1837) సహకార వ్యవసాయ సముదాయాన్ని స్థాపించాలని ఆదర్శ సూత్రాలు తయారు చేశాడు, అందులోని సభ్యుల పాత్రలు మారుతూ ఉంటాయి. గుంపు మొత్తం సాధిస్తున్న విజయం ఆధారంగా ప్రతి వ్యక్తికీ ప్రతిఫలం లభించవలసి ఉండేది. ఫ్రాన్సు మరియు అమెరికాల్లో ఈ ఆదర్శాలతో స్థాపించబడిన సముదాయాలు కొద్ది కాలమే నిలిచాయి.
దాదాపు అదే కాలంలో, వేల్స్ దేశస్థుడైన రాబర్ట్ ఓవెన్ అనే సంఘ సంస్కర్త (1771-1858) అందరికీ కలిపి ఒకే వంటగదీ భోజనాల గదీ ఉండే, వందలాది మంది కలిసి జీవించే సహకార గ్రామాలను ప్రతిపాదించాడు. ఆయా కుటుంబాల వారు తమ స్వంత గృహాల్లో నివసిస్తారు మరియు తమ పిల్లలకు మూడేళ్లు వచ్చే వరకూ వారి ఎడల తామే శ్రద్ధ వహిస్తారు. దాని తర్వాత, వారి ఎడల శ్రద్ధ వహించే బాధ్యత యావత్ సముదాయంపై ఉంటుంది. అయితే ఓవెన్ ప్రయోగాలు విఫలమయ్యాయి, పైగా ఆయన తన వ్యక్తిగత ధనాన్ని చాలా పోగొట్టుకున్నాడు.
“అమెరికాలోని ఉటోపియన్ సాంఘిక సముదాయాల్లోకెల్లా అత్యంత విజయవంతమైనదని” ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పిలిచిన సముదాయానికి జాన్ నోయిస్ (1811-1886) స్థాపకుడయ్యాడు. ఆయన అనుచరులు ఏకపత్నీవ్రతాన్ని మానుకుని కేవలం అందరిలో పరస్పర అంగీకారం ద్వారా లైంగిక సంబంధాలను అనుమతించినప్పుడు, వ్యభిచార నేరం క్రింద నోయిస్ చెరసాల పాలయ్యాడు.
మధ్య అమెరికాలోని ఒక “పెట్టుబడిదారీ ఉటోపియా” తరహాదైన లైజీ ఫెయిర్ నగరం, ఉటోపియన్ సముదాయాలను సృష్టించాలనే ఇటీవలి ప్రయత్నమని లండన్‌కు చెందిన ది సండే టైమ్స్ పత్రిక నివేదిస్తుంది. ఆ ప్రణాళిక పెట్టుబడి దారులు కావాలని కోరింది. “21వ శతాబ్దపు అద్భుత నగరంలో” జీవించే ఉత్తరాపేక్షకు ఆకర్షితులైన పరదైసు అన్వేషితులు 5,000 డాలర్లు పంపాలని మరియు ఇలాంటి ఆలోచనేగల వారిని వెదకి, వారు పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు సంబంధించి లాభం పంచుకునే వ్రాతపూర్వక స్థూల విక్రయ విధానంలో చేరాలని ఆహ్వానించింది. నివేదిక చెబుతున్నట్టు, “భవన స్థలమిచ్చేందుకు ఏదైనా ఓ దేశం ప్రభావితం చేయబడి, ఆపై అక్కడ ఒక చిన్న హోటలు నిర్మించబడితే” ఈ డబ్బంతా కేవలం ఈ ప్రణాళిక స్థలాన్ని చూసివచ్చేందుకు ఒక విమాన టికెట్టుకు మాత్రమే సరిపోతుందని ఆ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. అక్కడ ఎలాంటి “పరదైసైనా” నిర్మించబడుతుందనడానికి వాస్తవమైన నిరీక్షణ ఏదీ లేదు.
[7వ పేజీలోని చిత్రం]
ఒక ద్వీపం, పరదైసును అన్వేషించే అనేకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే నేడు అత్యంత శాంతియుతమైన ప్రాంతాల పేరు ప్రఖ్యాతులను కూడా నేరం నాశనం చేస్తోంది