సమస్యలులేని పరదైసు ఒక స్వప్నమేనా?
“ఎంత ప్రశాంతంగా ఉంది!” అమెరికానందలి ఐడహో రాష్ట్రంలోని రెడ్ఫిష్ సరస్సుకు ఎగువనున్న పైన్ వనంగల కొండల నుండి చూస్తే ఆ దృశ్యం నిజానికెంతో ఆహ్లాదకరంగా ఉంది. “పరదైసు అచ్చంగా ఇలాగే ఉంటుందని నేననుకుంటా”నని ఆ పర్యాటకుడన్నాడు.
మధ్యధరా ద్వీపమైన సైప్రస్ యొక్క దక్షిణ తీరాన సూర్యుడు ధగధగా ప్రకాశిస్తున్నాడు. అలలు తీరాన్ని సున్నితంగా తాకుతున్నాయి. కొండమీదున్న రెస్టారెంట్లో కూర్చుని, ఈ దృశ్యాన్ని తిలకిస్తున్న సందర్శకుడు “పరదైసంటే ఇదే” అంటూ ఆ దృశ్యాన్ని మెచ్చుకున్నాడు!
ఇలాంటి దృశ్యాల జ్ఞాపకాలను మనలో అనేకులం పదిలపర్చుకుంటాం. అయితే పరదైసువంటి అందమైన పరిసరాలు అనుదిన జీవితపు కఠినమైన వాస్తవాలకు భిన్నంగా ఉంటాయనే విషయాన్ని ఆ అందమైన ప్రాంతాల్లో నివసించే వారు గుర్తిస్తారు: రాకీ పర్వత పాదాల వద్దనున్న అడవులు తగులబడడం, చేపల మీద తుదకు మానవుల మీద కూడా ప్రభావం చూపే సముద్ర కాలుష్యం, అంతర్జాతీయ మరియు భిన్న సమాజాల మధ్య జరుగుతున్న ప్రాణాంతకమైన పోరాటాలను గురించైతే అసలు చెప్పనక్కర్లేదు.
పరదైసు—అదేమిటి?
పరదైసును మీరెలా వర్ణిస్తారు? ది న్యూ షార్టర్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ తన మొదటి నిర్వచనంగా ఈ అర్థాన్ని అందిస్తుంది: “ఆది[కాండము] 2, 3 అధ్యాయాలలో వర్ణించబడిన ఏదెను తోట.” మొదటి మానవుడైన ఆదాము కొరకు దేవుడు నివాసం ఏర్పరచిన ప్రాంతాన్ని గురించి బైబిల్లోని మొదటి పుస్తకంలోగల వర్ణనను ఇది సూచిస్తుంది. ఆ మొట్టమొదటి పరదైసులో, ‘చూపునకు రమ్యమైన ఆహారమునకు మంచివైన’ వృక్షాలు పుష్కలంగా పెరిగాయి.—ఆదికాండము 2:9.
ఆ నిఘంటువులో ఇవ్వబడిన రెండవ నిర్వచనం “పరదైసును క్రైస్తవ మరియు ముస్లిమ్ వేదాంతంలో ఉన్న పరలోకంతో” ముడిపెడుతోంది, అయితే తర్వాత అదిలా జత చేస్తుంది: “ఇప్పుడు ప్రాముఖ్యంగా కవి[త్వ] సంబంధమైనది.” అయితే మన పర్యాటకునికీ, సందర్శకునికీ మాత్రం పరదైసనేది, నిఘంటువులో ఇవ్వబడిన మూడవ నిర్వచనమైన “అత్యంత గొప్ప సౌందర్యం లేదా సంతోషం ఉండే స్థలంగా” ఉంది.
16వ శతాబ్దానికి చెందిన బ్రిటీష్ రాజనీతివేత్తయైన సర్ థామస్ మోర్ ఉటోపియా అనే పేరుగల పుస్తకంలో, న్యాయవిధానాలూ ప్రభుత్వం మరియు సాంఘిక పరిస్థితులూ పరిపూర్ణంగా ఉన్న ఒక ఊహాకల్పిత దేశాన్ని వర్ణించాడు. అది ఎంత అవాస్తవంగా అనిపించిందంటే నేడు వెబ్స్టర్స్ న్యూ కాలేజియేట్ డిక్షనరీలో “ఉటోపియా” అనే పదం యొక్క ఒక నిర్వచనం “సాంఘిక పురోభివృద్ధి కొరకైన ఆచరణ సాధ్యం కాని పథకం” అని ఉంది.
పీపుల్స్ టెంపుల్ తెగ నాయకుడైన జిమ్ జోన్స్‌ను అనుసరించే వారికి ఉటోపియా అనేది గయానాలోని అడవుల్లో తాము ఏర్పరచుకున్న ఒక స్థావరాన్ని సూచించింది. 1978లో, ఎంతగానో నిరీక్షించి ఎదురుచూసిన ఈ పరదైసు 900 కంటే ఎక్కువమందికి మరణానికి రంగస్థలం కావడం ఎంతో దుఃఖకరం. వాస్తవంగా భయంకరమైన విషయమే! తత్ఫలితంగా, పరదైసును గురించిన భావనను ప్రజలు కొన్నిసార్లు, వ్యాకులతనూ కలతనూ కలిగించే ఆచారాలుగల విచిత్రమైన తెగలతో జత చేస్తారు.
నేరం దౌర్జన్యం భయపెట్టే లోకంలో, పిన్నలనూ పెద్దలనూ కూడా ఒకేలా పట్టి పీడించే రోగాలున్న లోకంలో, ద్వేషం మరియు మత విభేదాలు సముదాయాలను విభాగించే లోకంలో, అందమైన పరిసరాలు కేవలం పైపైకి మాత్రమే ఆకర్షణీయంగా కన్పిస్తాయి. పరదైసు కేవలం ఒక స్వప్నమే అని ప్రజలు భావించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు! అయితే పరదైసును కనుగొనేందుకూ లేక తమకొరకు దాన్ని సృష్టించుకునేందుకూ ప్రయత్నించకుండా ఇది కొంతమంది ప్రజలను ఆపలేదు. వారు ఎంతమేరకు విజయం సాధించారు?