బైబిలు ఉద్దేశము
విజ్ఞానశాస్త్రం, బైబిలు పరస్పరం అంగీకరిస్తాయా?
విమానాలూ అణుబాంబుల నుండి జన్యుపరంగా ప్రభావితం చేయబడిన కణాలూ గొఱ్రెల క్లోనింగ్ వంటివాటివరకూ చూసినట్లైతే, మన 20వ శతాబ్దం విజ్ఞానశాస్త్రం శాసించిన ఒక యుగంగా ఉంది. శాస్త్రవేత్తలు మానవుల్ని చంద్రునిమీదికి పంపించారు, మశూచిని నిర్మూలించారు, వ్యవసాయ రంగంలో విప్లవాల్ని సృష్టించారు, వందల కోట్లమందికి ప్రపంచవ్యాప్త సమాచారాన్ని తక్షణమే పొందడాన్ని సాధ్యపర్చారు. అందుకని మరి శాస్త్రవేత్తలు ఏం చెప్పినా ప్రజలు వింటారనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శాస్త్రవేత్తలు, అసలు చెప్పడానికంటూ వారివద్ద ఏమైనావుంటే, బైబిలును గురించి ఏమి చెబుతున్నారు? దానికి బదులుగా, బైబిలు మనకు విజ్ఞానశాస్త్రం గురించి ఏమి చెబుతుంది?
అద్భుతాలు విజ్ఞానశాస్త్రానికి విరుద్ధమా?
“విజ్ఞానశాస్త్రాన్నే ప్రధానంగా నమ్మే ప్రజలు ‘కారకము-ప్రభావం’ల సంబంధాన్ని విశ్వసిస్తారు. ప్రతిదానికీ పరిపూర్ణంగా సహజమైన వివరణ ఉందని వారు భావిస్తారు” అని ఒక సమకాలీన ఎన్సైక్లోపీడియా అంటోంది. బైబిలు విద్యార్థులు కూడా సుస్థాపితమైన విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాలను అంగీకరిస్తారు. అయితే, ప్రస్తుత జ్ఞానం ఆధారంతో విజ్ఞానశాస్త్రపరంగా వివరించలేని అద్భుత సంఘటనల గురించి బైబిలు తరచూ చర్చిస్తుందని కూడా వారు గుర్తిస్తారు. ఉదాహరణలుగా, యెహోషువా దినాల్లో సూర్యుడు నిశ్చలంగా నిలిచివుండడం, యేసు నీళ్లపైన నడవడం వంటివి చెప్పుకోవచ్చు. (యెహోషువ 10:12, 13; మత్తయి 14:23-34) అయినప్పటికీ, ఈ అద్భుతాలు దేవుని శక్తి సహజాతీతంగా పనిచేయడం ఫలితంగా వచ్చినవని చూపించబడ్డాయి.
ఈ విషయం కీలకమైనది. మానవులు దైవిక సహాయం లేకుండానే నీళ్లపైన నడవగలరనో లేక ఏ కారణమూ లేకుండానే ఆకాశంలో సూర్యుని దృశ్య చలనానికి అంతరాయాన్ని కల్గించవచ్చనో బైబిలు చెప్పినట్లైతే అది విజ్ఞానశాస్త్ర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లుండవచ్చు. అయితే, బైబిలు అటువంటి సంఘటనలను దేవుని శక్తికి ఆపాదిస్తున్నప్పుడు, ఆ బైబిలు వృత్తాంతం విజ్ఞానశాస్త్రానికి విరుద్ధంగా పోవడంలేదు. బదులుగా, అలాంటి సంఘటనలను గూర్చిన బైబిలు వృత్తాంతం, చర్చను విజ్ఞానశాస్త్రం ఇప్పుడప్పుడే అవగాహన చేసుకోలేని ఒక రంగంలోకి నడిపిస్తుంది.
బైబిలు విజ్ఞానశాస్త్రాన్ని విభేదిస్తుందా?
మరోవైపు, బైబిలు ప్రజల జీవితాల్లోని సాధారణ సంఘటనల గురించి చర్చిస్తున్న సందర్భాల విషయమేమిటి లేకపోతే చెట్ల గురించీ, జంతువుల గురించీ, ప్రకృతి సంబంధ సంఘటనల గురించీ మాట్లాడుతున్న సందర్భాల విషయమేమిటి? ఆసక్తికరంగా, సందర్భాన్ని పరిగణనలోనికి తీసుకున్నప్పుడు, ఏ బైబిలు ఉదాహరణ కూడా ఇప్పటివరకు తెల్సిన విజ్ఞానశాస్త్ర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లు రుజువు చేయబడలేదు.
ఉదాహరణకు, వేలాది సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల గ్రహణ శక్తిని ప్రతిబింబించే కావ్యభాషను బైబిలు తరచూ ఉపయోగిస్తుంది. యోబు పుస్తకం, యెహోవా ఆకాశాన్ని ‘పోతపోసిన అద్దమంత దట్టమైనదిగా’ వ్యాపింపజేస్తున్నట్లు లేక కొలిమిలో కాల్చి సాగగొడుతున్నట్లు చెబుతున్నప్పుడు, ఆకాశం లోహంతో చేయబడిన అద్దంలా ప్రకాశమానమైన ప్రతిఫలనాన్ని ఇవ్వడాన్ని ఇది చక్కగా అభివర్ణిస్తుంది. (యోబు 37:18) భూమికి “స్తంభముల పాదులు,” లేకపోతే ‘మూలరాయి’ ఉన్నట్లు చెప్పే దృష్టాంతాన్ని మనం ఏమాత్రం అక్షరార్థంగా తీసుకోనట్లే ఆ దృష్టాంతాన్నీ అక్షరార్థంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.—యోబు 38:4-7.
ఇది ప్రాముఖ్యం, ఎందుకంటే అనేకమంది వ్యాఖ్యాతలు అటువంటి వర్ణనలను అక్షరార్థంగా తీసుకున్నారు. (2 సమూయేలు 22:8; కీర్తన 78:23, 24 చూడండి.) బైబిలు ఈ క్రింది విధంగా బోధిస్తుందన్న నిర్ధారణకు వారు వచ్చారు, ఇది ది యాంకర్ బైబిల్ డిక్షనరీ నుండి ఎత్తివ్రాయబడింది.
“మానవజాతి నివసిస్తున్న ఈ భూమి అంతులేని నీటి విశాలంపైన తేలుతున్న ఒక గుండ్రని ఘన పదార్థమో లేక బహుశ ఒక ఫలకమో అయివుంటుందని భావించబడింది. క్రిందనున్న ఈ నీటి వైశాల్యానికి సమాంతరంగా తలకుపైగా రెండవ నీటి వైశాల్యం మొదటిదానిలాగానే అంతులేనిదిగా ఉంది, ఈ ఆకాశ జలాశయానికి ఉన్న రంధ్రాల్లోంచి గొట్టాల్లోంచి నీరు వర్షం రూపంలో క్రిందికి వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, మరితర నక్షత్రాలు భూమికిపైగా కమానులాగావుండే ఒక వంపుగల నిర్మాణానికి స్థిరంగా అంటించబడివున్నాయి. ఈ నిర్మాణం యాజక వర్ణనల్లోని ‘ఆకాశం’ (రాక్వియా) వంటిదే.”
స్పష్టంగా, ఈ వర్ణన ఆధునిక విజ్ఞానశాస్త్రంతో విభేదిస్తుంది. కానీ ఇది ఆకాశాన్ని గురించిన బైబిలు బోధ యొక్క సరియైన మదింపు అనవచ్చా? ఎంతమాత్రం అనలేము. హెబ్రీయుల విశ్వం గురించిన అటువంటి వర్ణనలు, “నిజానికి చీకటి యుగాల్లో యూరప్‌లో ప్రబలంగా ఉన్న భావనలపైన ఎక్కువగా ఆధారపడివున్నాయే గాని, పా[త] ని[బంధన]లోని ఎటువంటి వాస్తవిక వర్ణనపైనా ఆధారపడివున్నవి కావని” ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా అంటుంది. ఈ మధ్యయుగాల్లోని భావనలు ఎక్కడ్నుండి వచ్చాయి? ద బిగినింగ్స్ ఆఫ్ వెస్టర్న్ సైన్స్‌లో డేవిడ్ సి. లిండ్బర్గ్ వివరిస్తున్నట్లుగా, అవి చాలామట్టుకు ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త అయిన అరిస్టాటిల్ యొక్క విశ్వశాస్త్రంపై ఆధారపడివున్నవి, మధ్యయుగాల్లోని చాలామట్టుకు జ్ఞానానికి ఆయన కృతులే ఆధారంగా ఉండినవి.
దేవుడు ఈ 20వ శతాబ్దపు శాస్త్రవేత్తకు ఆకర్షణీయంగా ఉండే భాషను బైబిలు కొరకు ఉపయోగించడం అనవసరమైందిగానూ నిష్ప్రయోజనకరంగానూ ఉండేది. విజ్ఞానశాస్త్ర సూత్రాల్ని ఉల్లేఖించడానికి బదులుగా, దాన్ని మొదట వ్రాసిన ప్రజల అనుదిన జీవితాల్లోనుండి తీసుకోబడిన విస్పష్టమైన దృష్టాంతాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి—ఏ ఒక్క కాలానికో పరిమితం కాకుండా నేడుకూడా సజీవంగా ఉన్నట్లు అన్పించే వర్ణనలూ ఎన్నెన్నో దానిలో ఉన్నాయి.—యోబు 38:8-38; యెషయా 40:12-23.
ఉన్నతమైన మూలంనుండి జ్ఞానం
అయితే, ఆసక్తికరమైన విధంగా కొన్ని బైబిలు వివరణలు ఆ కాలాల్లో నివసిస్తున్న ప్రజల వైజ్ఞానిక జ్ఞానానికి అందని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నట్లు కన్పిస్తాయి. దేవుడు “శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును . . . పరచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను” అని యోబు వర్ణిస్తున్నాడు. (యోబు 26:7) భూమి “శూన్యముపైని” వ్రేలాడదీయబడడం అన్న తలంపే, ఏనుగులపైనో లేకపోతే సముద్ర తాబేళ్లపైనో ఉందని చెప్పే అనేకమంది ప్రాచీన ప్రజల పుక్కిట పురాణాలకు పూర్తి భిన్నంగా ఉంది. మోషే ధర్మశాస్త్రం, ఆ కాలంలోని వైద్యశాస్త్ర పరిజ్ఞానానికి పోలిస్తే ఎంతో ఆధునికమైనది అనిపించే విధంగా పారిశుద్ధ్య సంబంధ విధులను కలిగివుంది. కుష్ఠవ్యాధి ఉందన్న అనుమానం ఉన్న ప్రజలను కడగా ఉంచడం గురించిన నిబంధనలూ, చనిపోయిన వారిని ముట్టుకోవడానికి విరుద్ధంగా నిషేధాలూ నిస్సందేహంగా చాలామంది ఇశ్రాయేలీయుల జీవితాలను కాపాడివుండవచ్చు. (లేవీయకాండము 13; సంఖ్యాకాండము 19:11-16) దానికి పూర్తి విరుద్ధంగా, అష్షూరీయుల వైద్య సంబంధ అభ్యాసాలు “మతమూ, సోదె, పిశాచశాస్త్రంల సమ్మేళనం” అని వర్ణించబడ్డాయి, వీటిలో కుక్క మలంతోనూ, మానవ మూత్రములతోనూ చికిత్స చేయడం వంటివి కూడా ఉన్నాయి.
సృష్టికర్తచే ప్రేరేపించబడిన ఒక పుస్తకంనుండి ఒకరు అపేక్షించినట్లే, బైబిలు మిగతా వాటన్నిటికన్నా ఎంతో ముందుంటూ, విజ్ఞానశాస్త్రపరంగా కచ్చితమైన సమాచారాన్ని కలిగివుంది. అయినా, బైబిలు ఎన్నడూ ఆ ప్రాచీన ప్రజలకు అర్థరహితంగానూ గలిబిలిగానూ ఉండే విజ్ఞానశాస్త్ర వివరణలను అందించడంలోనే మునిగిపోలేదు. ఇప్పటివరకు తెల్సిన విజ్ఞానశాస్త్ర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదేదీ బైబిలులో లేదు. దానికి బదులుగా, జీవపరిణామ సిద్ధాంతం వంటి రుజువు చేయబడని ఎన్నో సిద్ధాంతాలకు విరుద్ధంగా బైబిలు ఎంతో కలిగివుంది.
[25వ పేజీలోని చిత్రం]
భూమి ‘శూన్యముపైన’ వ్రేలాడుతుందని యోబు చేసిన వ్యాఖ్యానం ఆయన సమకాలీనులకు అందుబాటులో లేని జ్ఞానాన్ని సూచిస్తుంది
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
NASA