యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను నా అనారోగ్య పరిస్థితిని ఎలా ఎదుర్కోగలను?
జేసన్ వయస్సు అప్పట్లో కేవలం 18. అయితే, ఆయన జీవిత లక్ష్యాలన్నీ కూడా అప్పుడు చేరుకోలేనివన్నట్లుగా ఆయనకు అనిపించింది. పూర్తికాల క్రైస్తవ పరిచారకుడుగా సేవ చేయాలని ఆయన ఆశించాడు. కానీ తనకు క్రోన్స్ వ్యాధి—వేదనాకరమైన, పేగులను బలహీనపరచే వ్యాధి—ఉందని తర్వాత తెలుసుకున్నాడు. అయితే, నేడు జేసన్ తన పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కుంటున్నాడు.
ఒకవేళ మీరూ తీవ్రమైన అనారోగ్యాన్ని సహిస్తున్నారేమో. ముందటి తేజరిల్లు! సంచిక మీ వంటి యౌవనస్థులు ఎదుర్కునే సవాళ్ళను గూర్చి చర్చించింది.a మీరు మీ పరిస్థితిని విజయవంతంగా ఎలా అధిగమించగలరో ఇప్పుడు చూద్దాం.
అనుకూల మానసిక దృక్పథం
ఏ అనారోగ్యాన్నైనా విజయవంతంగా భరించడంలో అనుకూల మానసిక దృక్పథం ఇమిడి ఉంది. “నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?” అని బైబిలు అంటోంది. (సామెతలు 18:14) విషణ్ణమైన నిరాశావహమైన తలంపులూ భావాలూ స్వస్థత చేకూరడాన్ని మరింత కష్టతరం చేస్తాయి. జేసన్ ఇది నిజమని కనుగొన్నాడు.
మొదట, తనను కృంగదీసే కోపం వంటి ప్రతికూల భావాలతో జేసన్ పోరాడవలసి ఉండింది. మరి ఏమి సహాయపడింది? “కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని కృంగుదలను గూర్చిన శీర్షికలు అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండేందుకు నాకు నిజంగా సహాయపడ్డాయి. నేను ఇప్పుడు ఏరోజుకు ఆరోజు భరించడానికి ప్రయత్నిస్తున్నాను.”b
అలాగే పదిహేడేండ్ల కార్‌మన్ కూడా అనుకూల విషయాల మీద దృష్టినుంచేందుకు నేర్చుకుంది. ఆమె సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నప్పటికీ, తనకు లభించిన ఆశీర్వాదాలను గురించి తలపోస్తుంది. “నా కన్నా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారిని గురించి, నేను చేయగల్గ పనులను కూడా చేయలేని వారి గురించి ఆలోచిస్తాను. అలా నేను కృతజ్ఞురాలినిగా భావిస్తానే తప్ప, నా గురించి నేను బాధపడను” అని ఆమె అంటోంది.
“సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము” అని సామెతలు 17:22 చెబుతోంది. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు నవ్వు అనుచితమని కొందరు భావించవచ్చు. కానీ మెప్పించే హాస్యమూ, ఆహ్లాదకరమైన సహవాసమూ మీ మనస్సును నవోత్తేజితము చేసి, జీవించాలన్న మీ కోరికను పెంచుతాయి. నిజానికి, ఆనందమనేది దైవిక గుణం. దేవుని ఆత్మఫలాల్లో ఒకటి. (గలతీయులు 5:22) మీరు అనారోగ్యంతో పోరాడుతున్నప్పుడు కూడా ఆనందంగా ఉండేందుకు దేవుని ఆత్మ మీకు సహాయపడగలదు.—కీర్తన 41:3.
అర్థంచేసుకునే డాక్టరును కనుగొనడం
యౌవనస్థులను అర్థం చేసుకునే డాక్టరు ఉండడం చాలా సహాయకరంగా ఉంటుంది. యౌవనస్థుల మానసిక మరియు ఉద్వేగ సంబంధమైన అవసరాలు వయోజనుల అవసరాల నుండి సాధారణంగా భిన్నంగా ఉంటాయి. అష్‌లీ తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్ళివలసివచ్చినప్పుడు ఆమె వయస్సు 10 సంవత్సరాలు మాత్రమే. అష్‌లీ డాక్టరు ఆమెతో చాలా సానుభూతిగా ప్రవర్తించాడు, ఆమె అర్థం చేసుకునేలా సరళమైన భాషను ఉపయోగించాడు. బాల్యంలో తనకుండిన అనారోగ్యం తాను డాక్టర్ అయ్యేందుకు ఎలా పురికొల్పిందో ఆయన ఆమెకు చెప్పాడు. ఆయన నెమ్మదిగా స్పష్టంగా ఆమెకు చేయబోయే చికిత్సను గురించి వివరించాడు. కనుక ఇప్పుడు దేనిని నిరీక్షించాలో ఆమెకు తెలుసు.
మీకు గౌరవమిచ్చే, మీ అవసరాలను అర్థం చేసుకునే వైద్య సిబ్బంది కొరకు అన్వేషించాలని మీరూ మీ తల్లిదండ్రులు అనుకోవచ్చు. మీకు అందించబడుతున్న సేవ ఏదైన కారణాన కావలసినంత సౌకర్యం లేనట్లు మీకనిపిస్తే, మీ బాధలను మీ తల్లిదండ్రులకు తెలిపేందుకు జంకకండి.
ఆరోగ్యం కోసం గట్టి ప్రయత్నం చేయండి!
మీకు సాధ్యమయ్యే ప్రతి విధంలోనూ మీ అనారోగ్యంతో పోరాడడం కూడా ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీ పరిస్థితిని గురించి మీకు సాధ్యమైనంత మేరకు తెలుసుకోండి. “జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును” అని బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 24:5) జ్ఞానం తెలియని వాటిని గూర్చిన భయాన్ని తీసివేస్తుంది.
అంతేకాక, అన్ని విషయాలు తెలుపబడిన యౌవనస్థుడు తన చికిత్సలో ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు, దానికి సహకరించే మంచి స్థాయిలో ఉంటాడు. ఉదాహరణకు, డాక్టర్ సిఫారసు చేసేవరకూ రాసిచ్చిన మందు తీసుకోవడాన్ని ఆపకూడదని ఆయన తెలుసుకోవచ్చు. పైన పేర్కొనబడిన కార్‌మన్ తన తల్లిదండ్రుల్లాగే, సికిల్ సెల్ అనీమియా గురించిన పుస్తకాలను చదివింది. కార్‌మన్‌కు ఎక్కువగా సహాయకరంగా ఉండే చికిత్సను పొందేందుకు వారు తెలుసుకున్న వివరాలు వారికి సహాయపడ్డాయి.
మీ డాక్టర్‌ను నిర్దిష్ట ప్రశ్నలను అడగండి. మీకు విషయం స్పష్టంగా అర్థంకాకపోతే మళ్ళీ అడగండి. ఏ మాటలనైతే డాక్టర్ వినాలని కోరుకుంటాడని మీరు తలస్తారో ఆ మాటలు చెప్పే బదులు, మీరేమనుకుంటున్నారు, మీరెలా భావిస్తున్నారు అన్నది ఆయనకు సత్యసంధంగా వివరించండి. బైబిలు చెబుతున్నట్లు, “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.”—సామెతలు 15:22.
ఒక సందర్భంలో అష్‌లీ తన అనారోగ్యాన్ని గురించి ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడనట్లు కనిపించింది. ఆమె తన తల్లితో మాత్రమే ఆ విషయం మాట్లాడేది. “మీకు ప్రతి విషయం వివరంగా చెప్పడం లేదని మీకనిపిస్తుందా?” అని తెలివిగల కార్యకర్త రహస్యంగా ఆమెను అడిగింది. అవునని అష్‌లీ ఒప్పుకుంది. అలా ఆ స్త్రీ అష్‌లీకి అష్‌లీ మెడికల్ రికార్డులను చూపించి, వాటిని వివరించి చెప్పింది. అష్‌లీ గురించి తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడడమే కాకుండా అష్‌లీతో కూడా నేరుగా మాట్లాడేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చించమని డాక్టర్లను కూడా కోరింది. చివరికి అష్‌లీ తన భావాలను వ్యక్తం చేసి, అవసరమైన సహాయాన్ని పొందగలిగింది.
మీ చుట్టూ ఉన్న వారి నుండి మద్దతు
కుటుంబంలోని సభ్యులెవరైనా తీవ్రంగా అనారోగ్యులైతే, అది కలిసి ప్రయత్నం చేయవలసిన అవసరమున్న కుటుంబ విషయమౌతుంది. అష్‌లీ కుటుంబమూ, క్రైస్తవ సంఘమూ ఆమెకు మద్దతునిచ్చేందుకు ఆమె చుట్టూ ఉన్నారు. ఆమె ఆసుపత్రిలో ఉందని సంఘానికీ తరచూ గుర్తు చేయబడేది. సంఘ సభ్యులు ఆమెను క్రమంగా దర్శించేవారు, కుటుంబంలోనివారు మళ్ళీ పాత దినచర్యలకు మళ్ళేవరకూ, ఇంటిపనుల్లోనూ, భోజనం తయారు చేయడంలోను సంఘసభ్యులు ఆ కుటుంబానికి సహాయం చేశారు. పిల్లలను అష్‌లీ దగ్గరకు వెళ్ళనివ్వగల్గేంతగా ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడినప్పుడు, సంఘంలోని పిల్లలు ఆమెను ఆసుపత్రిలో సందర్శించి ఆమెతో సహవసించేవారు. ఇది అష్‌లీకి మాత్రమే కాక, యౌవనస్థులైన ఆమె స్నేహితులకు కూడా ప్రయోజనకరంగా ఉండేది.
అయితే, ఇతరులు మీకు సహాయాన్నందించే ముందు, మీకు సహాయం అవసరమని వారికి తెలియాలి. కార్‌మన్ తన ఉద్వేగ సంబంధమైన, ఆత్మీయమైన మద్దతు కొరకు తన తల్లిదండ్రుల వైపు, అలాగే సంఘ పెద్దల వైపూ చూస్తుంది. తన క్రైస్తవ విశ్వాసాలను పంచుకునే స్కూలు విద్యార్థులనుండి కూడా అలాంటి మద్దతు లభిస్తుందని ఎదురు చూస్తుంది. “వారికి నాపై శ్రద్ధ ఉంది. నా మీద శ్రద్ధ చూపిస్తున్నారని అర్థంచేసుకోగలను” అని కార్‌మన్ అంటోంది.
మీ స్కూల్ సహాయకరమైన వైద్య ఆర్థిక సలహాలను ఇవ్వగల్గవచ్చు. కొంత వ్యక్తిగత మద్దతును కూడా ఇవ్వవచ్చు. ఉదాహరణకు, అష్‌లీకి ఉత్తరం వ్రాయమని లేదా ఆమెను చూడడానికి వెళ్ళమని అష్‌లీ వాళ్ళ ఉపాధ్యాయురాలు తరగతిలోని వారిని ప్రోత్సహించింది. మీరు ఎదుర్కుంటున్న సమస్యలేమిటో మీ ఉపాధ్యాయులకు సరిగ్గా అర్థం కాకపోతే, మీ తల్లిదండ్రులు మీ పరిస్థితి గురించి మీ పాఠశాల అధికారులతో గౌరవపూర్వకంగా మాట్లాడవలసిన అవసరం ఉండవచ్చు.
మనస్సునూ శరీరాన్ని జ్ఞానపూర్వకంగా ఉపయోగించండి
మీరు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యం నుండి కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించడంలో దృష్టి నిలుపడం తప్ప మీరు మరేమీ చేయలేకపోవచ్చు. మీరు పూర్తిగా బలహీనులు కాకపోతే, మీరు చేయగల అనేక నిర్మాణాత్మక విషయాలున్నాయి. జిల్ క్రెమెన్‌ట్స్ అనే రచయిత్రి హౌ ఇట్ ఫీల్స్ టు ఫైట్ ఫర్ యువర్ లైఫ్ అనే తన పుస్తకం కొరకు పరిశోధన చేస్తున్నప్పుడు తను కనుగొన్న విషయంపై ఇలా వ్యాఖ్యానించింది: “ఆసుపత్రి వరండాల్లో నడుస్తూ రెండు సంవత్సరాలు గడిపినప్పుడు, చాలా మంది పిల్లలు గుడ్లప్పజెప్పి టీవీ చూస్తూ ఉండడం కనిపించినప్పుడు నాకు చాలా బాధనిపించింది. ఎక్కువగా చదవాలని ఆ యౌవనస్థులను మనం ప్రోత్సహించవలసిన అవసరముంది. ఆసుపత్రి పడక ఒకరి మెదడుకు మేతనిచ్చేందుకు అత్యుత్తమమైన స్థలం.”
మీరు ఇంట్లో ఉన్నా, లేక ఆసుపత్రిలో ఉన్నా మీరు మీ మానసిక సామర్థ్యాలను ఉపయోగించడం మీ ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లుగా భావించేందుకు తరచూ తోడ్పడగలదు. మీరు ఉత్తరాలు వ్రాయడం ద్వారా లేదా పద్యాలను వ్రాయడం ద్వారా అలా ప్రయత్నించారా? బొమ్మలు గీయడమో, పెయింటింగ్ వేయడమో చేశారా? మీ పరిస్థితి అనుమతిస్తున్నట్లయితే, ఏదైన సంగీత ఉపకరణాన్ని వాయించడం నేర్చుకునే విషయమేమిటి? అంత ఆరోగ్యంగా లేకపోయినప్పటికీ, చాలా సాధ్యతలున్నాయి. కచ్చితంగా, దేవునికి ప్రార్థన చేసే అలవాటునూ, ఆయన వాక్యమైన బైబిలును చదివే అలవాటునూ పెంపొందించుకోవడమే మీరు చేయగల అత్యంత శ్రేష్ఠమైన పని.—కీర్తన 63:6.
మీ పరిస్థితి అనుమతిస్తున్నట్లయితే, సముచితమైన శారీరక పనులు చేయడం వల్ల కూడా మీరు కాస్త కోలుకున్నట్లు భావించగలుగుతారు. ఈ కారణాన వైద్య సదుపాయాల్లో తరచూ యౌవనస్థులైన రోగులకైతే ఫిజికల్ థెరపీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అనేక సందర్భాల్లో సరైనా వ్యాయామం అనేది శారీరక స్వస్థతను పెంపొందించడమే కాక, మీ మానసిక స్థితిని మెరుగుపరచుకునేందుకు కూడా సహాయపడుతుంది.
వదిలిపెట్టకండి!
మరింత బాధల్లో ఉన్నప్పుడు, యేసు దేవునికి ప్రార్థన చేశాడు, ఆయనయందు నమ్మకముంచాడు, తన వేదన మీద కాక, ఆనందమయమైన తన భవిష్యత్తు మీద దృష్టిని కేంద్రీకరించాడు. (హెబ్రీయులు 12:2) ఆయన తన వేదనాకరమైన అనుభవాల నుండి విషయాలను నేర్చుకున్నాడు. (హెబ్రీయులు 4:15, 16; 5:7-9) ఆయన సహాయాన్ని ప్రోత్సాహాన్ని స్వీకరించాడు. (లూకా 22:43) ఆయన తన అసౌకర్యం మీద కాక, ఇతరుల క్షేమం మీద దృష్టి నిలిపాడు.—లూకా 23:39-43; యోహాను 19:26, 27.
మీరు చాలా అనారోగ్యంగా ఉన్నప్పటికీ, మీరు కూడా ఇతరులకు ప్రేరణగా ఉండవచ్చు. పాఠశాల వ్యాసంలో అష్‌లీ అక్క అబీగెయిల్ ఇలా వ్రాసింది: “నేను ఎక్కువగా మెచ్చుకునే వ్యక్తి ఎవరంటే మా చెల్లే. తను ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చినప్పటికీ, తనకు ఐవిఎస్ ఉన్నప్పటికీ, ఎన్నో ఇన్‌జక్షన్‌లు ఇవ్వబడినప్పటికీ, తను చిరునవ్వుతోనే కనిపిస్తుంది!”c
జేసన్ తన లక్ష్యాలను విడిచిపెట్టలేదు. వాటి విషయంలో కొంతమేరకు సర్దుబాటు చేసుకున్నాడు. దేవుని రాజ్యాన్ని బోధించేవారి గొప్ప అవసరత ఎక్కడ ఉందో అక్కడ సేవ చేయాలన్నదే ఆయన లక్ష్యమిప్పుడు. జేసన్ విషయంలోలాగే, మీరూ కోరుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. మరీ అతిజాగ్రత్తగానో అసలు జాగ్రత్తే లేకుండానో ఉండక, మీ సొంత పరిమితులకు తగినట్లుగా జీవించడానికి నేర్చుకోవడమన్నది ప్రాముఖ్యమైన విషయం. మీకు సాధ్యమైనంత శ్రేష్ఠంగా చేసేందుకు జ్ఞానాన్నీ బలాన్నీ ఇచ్చే యెహోవా మీద ఆధారపడండి. (2 కొరింథీయులు 4:16; యాకోబు 1:5) ఈ భూమి పరదైసై, ‘నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనని’ సమయం వస్తుందని గుర్తుంచుకోండి. (యెషయా 33:24) అవును, ఒకనాటికి మీరు మళ్ళీ ఆరోగ్యవంతులౌతారు!
[అధస్సూచీలు]
a మే 8, 1997 తేజరిల్లు! 22-24 పేజీలు చూడండి.
b కావలికోట (ఆంగ్లం) అక్టోబర్ 1, 1991, పేజీ 15; మార్చ్ 1, 1990, పేజీలు 3-9; తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబర్ 22, 1987, పేజీలు 2-16; నవంబర్ 8, 1987, పేజీలు 12-16.
c అలాగే, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం 116-27 పేజీలు చూడండి.
[26వ పేజీలోని చిత్రం]
అష్‌లీ ధైర్యాన్ని ఆమె అక్క అబీగెయిల్ మెచ్చుకుంటుంది