యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను ఇంత అనారోగ్యంగా ఎందుకు ఉండవలసి వస్తోంది?
జేసన్‌కు 13 ఏండ్లు ఉన్నప్పుడు, తాను భవిష్యత్తులో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బేతేలులో పూర్తికాల పరిచారకునిగా సేవచేస్తానని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక చెక్క పెట్టెను తన కొరకు తయారు చేసుకుని, దానికి బేతేలు పెట్టె అని పేరు పెట్టాడు. తను బేతేలులో పని చేయనారంభించినప్పుడు ఉపయోగకరం కాగలవని అనుకున్న వస్తువులను అందులో కూడబెట్టనారంభించాడు.
అయితే, 18వ జన్మదినం గడిచిన కేవలం మూడు నెలల తర్వాత, జేసన్‌కు క్రోన్జ్ వ్యాధి ఉందని తేలింది. అది ఎడతెగని వేదానాభరితమైన ప్రేగు సంబంధ రుగ్మత. “అది నన్ను కృంగదీసింది. ఉద్యోగస్థలంలో ఉన్న మా నాన్నను పిలిచి ఏడ్వడం మాత్రమే నేను చేయగలిగింది. ఎలాగైనా నేను బేతేలుకు వెళ్ళాలన్న నా ఆశకు భంగం వాటిల్లే పరిస్థితే ఏర్పడిందని నాకు తెలుసు” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు.
“సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచు” ఉండడానికి ప్రాథమిక కారణం అనారోగ్యమే. (రోమీయులు 8:22) రోగులలో కోట్లకొలది మంది లెక్కించలేనంత మంది యౌవనస్థులూ ఉన్నారు. చాలా మంది యౌవనస్థులు చివరికి బాగవుతున్నారు. కానీ మరికొందరు దీర్ఘకాలంగా ఉండే రోగాలను కొందరైతే ప్రాణాంతకమైన రోగాలను ఎదుర్కోవలసిందే. ఆస్త్మా, మధుమేహ వ్యాధి, సికిల్ సెల్ వ్యాధి, అంటువ్యాధులు, మూర్ఛరోగం, మానసిక రుగ్మతలు, క్యాన్సర్ యౌవనస్థులు అనుభవిస్తున్న రుగ్మతల పట్టికలో ఉన్నాయి. కొందరు యౌవనస్థులు ఒకే సమయంలో అనేక రుగ్మతలతో జీవిస్తున్నారు.
‘నాకెందుకిలా జరుగుతోంది?’
రోగం తరచూ మానసికంగాను భావోద్వేగ సంబంధంగాను ఒత్తిళ్ళను సృష్టిస్తుంది. శారీరక బాధల గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఉదాహరణకు, మీరు రుగ్మతవల్ల నెలల తరబడి స్కూలుకు వెళ్ళలేకపోయినట్లయితే, మీరు చదువులో వెనకబడడమే కాక, మీరు సమాజం నుండి వేరు చేయబడినట్లు భావిస్తారు కూడా. 12 ఏండ్ల సన్నీ తను అప్పుడప్పుడు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చినందువల్ల స్కూల్‌కు వెళ్ళలేకపోయాడు. ‘నా క్లాస్ మేట్స్ ఏమి చేస్తున్నారో? ఈ రోజు తను ఏయే విషయాలను పోగొట్టుకుంటున్నాడో?’ అని అతడు బాధపడతాడు.
అలాగే, మీరు క్రైస్తవ కూటాలకు వెళ్ళలేనంతగా, కనీసం బైబిలు కూడా చదవలేనంతగా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ ఆత్మీయ ఎదుగుదలకు భంగం కలుగుతున్నట్లు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, మీకు భావోద్వేగ సంబంధంగానూ, ఆత్మీయంగాను అదనపు మద్దతు అవసరం. మొదట్లో, రోగనిర్ధారణలో తేలిన విషయాన్ని మీరు నమ్మకపోవచ్చు. తర్వాత, మీరు ఏదో విధంగా రుగ్మతను నివారించుకోగల్గేవారే అనుకుని బహుశా మీమీద మీరే కోపగించుకోవచ్చు. ‘నాకిలా జరిగేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు?’ అని గట్టిగా అరవాలని మీకనిపించవచ్చు. (మత్తయి 27:46 పోల్చండి.) నిజానికి, కొంతైనా విషాదంగా ఉండడమనేది సహజం.
అంతేకాక, తను మరింత మంచిగా ఉండేందుకు ప్రయత్నించడం వంటి కొన్ని ప్రత్యేక యత్నాలను చేస్తే దేవుడు తన రుగ్మతను తీసివేస్తాడని కూడా ఒక యౌవనస్థుడు ఊహించుకోవచ్చు. అయితే, ఈ కాలంలో అలా అద్భుతమైన విధంగా స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేయడం లేదు కనుక అలాంటి తలంపు నిరాశకు నడపించవచ్చు.—1 కొరింథీయులు 12:30; 13:8, 13.
మీరు మరణించవలసిన అవసరం ఉండదని—దేవుడు ‘మహాశ్రమలను’ తెచ్చేటప్పుడు మీరు బ్రతికే ఉంటారని మీరు బహుశా నిరీక్షించివుండవచ్చు. (ప్రకటన 7:14, 15; యోహాను 11:26) అలాగైతే, మీకు ప్రాణాంతకమైన రుగ్మత ఉందని తెలుసుకున్నప్పుడు మీకు కలిగిన షాక్ రెండు రెట్లు అవుతుంది. మీరు యెహోవాకు బాధకలిగించేదేమైనా చేశారేమోనని మీరు అనుకోవచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన యథార్థతా పరీక్ష కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని మీరు అనుకోవచ్చు. అయితే అవి సరైన అభిప్రాయాలు కావు. “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు” అని దేవుని వాక్యమైన బైబిలు చెబుతుంది. (యాకోబు 1:13) రోగమూ మరణమూ ప్రస్తుత మానవ జీవన పరిస్థితిలోని అసంతోషకరమైన భాగాలు, మరి మనమందరమూ ‘కాలవశానికి అనుకోని సంఘటనలకు’ గురౌతాము.—ప్రసంగి 9:11.
భయాన్ని అధిగమించడం
తీవ్రమైన అనారోగ్యం కూడా మొదట మీకు ఎంతో భయం కలిగేందుకు కారణం కావచ్చు. హౌ ఇట్ ఫీల్స్ టు ఫైట్ ఫర్ యువర్ లైఫ్ అనే పుస్తకం తీవ్రమైన రుగ్మతలు గల 14 మంది యౌవనస్థుల అభిప్రాయాలను నమోదు చేసింది. ఉదాహరణకు, పదేండ్ల అన్‌టాన్‌కు ఆస్త్మా తీవ్రంగా ఉన్నప్పుడు తను చనిపోబోతున్నాడని భయపడ్డాడు. ఎముకల క్యాన్సర్‌తో పోరాడుతున్న 16 ఏండ్ల ఎలిజబెత్ తను ఇక మేల్కొనని విధంగా నిద్రపోబోతున్నట్లు భయపడింది.
అయితే మరి కొందరు యౌవనస్థులకు వేరే రకం భయాలున్నాయి—తమను పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరన్న భయం లేదా తరువాత జీవితంలో తమకు ఆరోగ్యవంతులైన బిడ్డలు కలగరన్న భయం. తమ వ్యాధి అంటువ్యాధియైనా కాకపోయినా తాము తమ అనారోగ్యాన్ని తమ కుటుంబ సభ్యులకు అంటిస్తామేమో అని మరి కొందరు యౌవనస్థులు భయపడతారు.
ఒక వ్యాధి అలాగే ఉన్నప్పుడు, లేదా తగ్గుతూ ఉన్నప్పుడు, మరో క్రొత్త రోగం వస్తున్నట్లయితే మళ్ళీ భయం పట్టుకుంటుంది. మీకు అలాంటి భయాలు కలుగుతున్నట్లయితే, అవి నిజమైన భయాలేనన్నది మీకు తెలిసిందే. సంతోషకరంగా, మొదట్లో కలిగే వ్యతిరేక భావోద్వేగాలు సమయం గడుస్తున్న కొలది నిమ్మళిస్తాయి. అప్పుడు మీరు మీ పరిస్థితులను మరింత న్యాయబద్ధంగా మదింపు చేసుకోనారంభించగల్గుతారు.
అనారోగ్యాన్ని అధిగమించడమనే సవాలు
“మీరు యౌవనంలో ఉన్నప్పుడు, మీరు అజేయులని మీరు భావించవచ్చు. తర్వాత, అకస్మాత్తుగా తీవ్రమైన వ్యాధి కలిగినప్పుడు మీ అభిప్రాయం మారుతుంది. మీరు క్రియాశీలతను తగ్గించుకోవలసి వస్తున్నందువల్ల మీరు ఒక్కరాత్రిలోనే ముసలివారైనట్లు భావిస్తారు” అని ముందు పేర్కొన్న జేసన్ అభిప్రాయపడుతున్నాడు. అవును, క్రొత్త పరిమితులను ఎదుర్కోవడం సవాలుగానే ఉంటుంది.
మీ పరిస్థితిని ఇతరులు అర్థంచేసుకోలేనప్పుడు మరో పెద్ద సవాలు ఎదురౌతుందని జేసన్ కనుగొన్నాడు. జేసన్‌కున్నది “కనిపించని రోగం” అని చెప్పవచ్చు. అతని పైరూపం లోపలవున్న అతని సమస్యలను గురించి తప్పుడు అభిప్రాయాన్నిస్తుంది. “నా శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవలసినంతగా జీర్ణం చేసుకోదు. నేను తరచూ తినవలసి ఉంటుంది, నేను చాలామంది కన్నా ఎక్కువగా తింటాను. అయినా నేను బక్కపలచగా ఉంటాను. అలాగే, కొన్నిసార్లు నేను చాలా అలసిపోతాను, ఇక మధ్యాహ్నం నా కళ్ళను తెరిచి ఉంచలేను. అయితే నేను మితంలేని వాడనని, లేదా సోమరినని ప్రజలు తలస్తున్నారని వారు చేసే వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ‘నువ్వు ఇంకా బాగా చెయ్యగలవని నీకు తెలుసు. నువ్వు ప్రయత్నం చేయడమే లేదు!’ అని వారంటారు” అని జేసన్ వివరిస్తున్నాడు.
జేసన్‌కు తమ్ముళ్ళు, చెల్లెళ్ళూ ఉన్నారు. బంతాట ఆడేందుకు తమని బయటికి తీసుకు వెళ్ళడం వంటి పనులను తను ముందు చేసినంతగా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడో వాళ్ళు ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేరు. “అయితే నాకు గాయమైతే, అది మానేందుకు కొన్ని వారాలు పడుతుందని నాకు తెలుసు. వాళ్ళు నాకున్న నొప్పిని తమకున్న నొప్పితో పోల్చడానికే మొగ్గు చూపుతూ, ‘తనవైపుకు అవధానాన్ని మళ్ళించుకోవడానికి ఆయన ఊరకే మూలుగుతున్నాడు’ అని వారు అంటారు. వాళ్ళకు మహా అంటే బహుశా పాదాల బెణుకులాంటిదే అత్యంత వేదనాకరమైనది. కనుక నాకు కలిగే నొప్పి ఎలాంటిదో వారు ఊహించనేలేరు” అని జేసన్ అభిప్రాయపడుతున్నాడు.
మీ రోగం మీ కుటుంబానికి భారమౌతున్నట్లు అనిపిస్తున్నట్లయితే, మీరు అపరాధ భావంతో పోరాడుతుండవచ్చు. మీ తలిదండ్రులు కూడా తామే అపరాధులని భావిస్తుండవచ్చు. “నా తలిదండ్రులు ఇరువురూ తామే ఆ రోగాన్ని సంక్రమింపజేసి ఉండవచ్చని నమ్ముతారు. పిలల్లు సాధారణంగా తమ రోగాన్ని గూర్చిన వాస్తవాన్ని అంగీకరించిన తర్వాత సర్దుకుపోతారు. కాని తలిదండ్రులకు అది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నన్ను క్షమాపణ కోరుకుంటారు. వారి అపరాధ భావాలను తొలగించేందుకు నా శాయశక్తులా ఎడతెగక నేను ప్రయత్నించవలసి ఉంది” అని జేసన్ అంటున్నాడు.
చికిత్సకోసం వెళ్ళడం—సరదా కాదు
డాక్టర్ల దగ్గరకు ఎడతెగక వెళ్తూ ఉండడం అనేది ఆతురత చెందేందుకు కారణం కాగలదు. అలా వెళ్తుండడం వల్ల మీరు అల్పులుగా నిస్సహాయులుగా భావించవచ్చు. ఆసుపత్రిలో వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని మీ వంతు కోసం వేచి ఉండడమనేది భయం కలిగించేదిగా ఉంటుంది. “. . . ఎంతో ఒంటరితనంగా అనిపిస్తుంది. వెంట ఎవరైనా ఉంటే బాగుంటుంది” అని హృద్రోగియైన 14 ఏండ్ల జోసఫ్ అంటున్నాడు. విచారకరంగా, కొందరు యౌవనస్థులకు అలాంటి మద్దతు లభించదు, కనీసం తమ తలిదండ్రుల నుండి కూడా లభించడం లేదు.
అలాగే, వైద్య పరీక్షలు కూడా ఆతురతను కలిగించగలవు. నిర్మొహమాటంగా చెబితే, కొన్ని పరీక్షలు పూర్తిగా అసంతోషకరమైనవే అయ్యుండవచ్చు. అయితే, ఆ తర్వాత, మీరు ఫలితాల కోసం వేచి ఉంటున్నప్పుడు ఉత్కంఠభరితమైన రోజులను లేదా వారాలను గడపవలసి ఉండవచ్చు. కానీ ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోండి: వైద్యపరీక్షకు వెళ్ళడమనేది, స్కూల్ పరీక్షకు వెళ్ళినట్లు కాదు; ఏదో ఆరోగ్య సంబంధమైన సమస్య ఉందంటే, దాని అర్థం ఏదో విధంగా మీరు విఫలులయ్యారని కాదు.
నిజానికి, ఒక పరీక్ష మీకు ఎంతో సహాయకరమైన సమాచారాన్ని ఇవ్వగలదు. సులభంగా చికిత్స చేయించుకోగల జబ్బే మీకున్నదని అది మీకు చూపించగలదు. లేదా, అది అలా కానట్లైతే, మీ వ్యాధిని ఎదుర్కొనేందుకు మీరు ఏమి చేయవచ్చో చూపేందుకు అది సహాయపడవచ్చు. అసలు అనుమానించిన వ్యాధి మీకు లేనేలేదని అది చూపించవచ్చు కూడా. కనుక మీ పరిస్థితి గురించి తొందరపాటుతో ఒక నిర్ధారణకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
అమితంగా బాధపడడం మిమ్మల్ని కేవలం మరింత నిస్సత్తువగా చేస్తుంది. “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 12:25) బదులుగా, మన చింతలను గురించి తనకు చెప్పమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనమీద శ్రద్ధ చూపిస్తున్నాడని, సమస్యతో సాధ్యమైనంత చక్కగా వ్యవహరించేందుకు ఆయన తన నడిపింపునూ జ్ఞానాన్నీ ఇస్తాడని మనం నమ్మవలసిన అవసరముంది.—కీర్తన 41:3; సామెతలు 3:5, 6; ఫిలిప్పీయులు 4:6, 7; యాకోబు 1:5.
మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు నీతియుక్తమైన క్రొత్తలోకంలో ప్రవేశపెట్టే ఏర్పాటు చేసినందువల్ల మనం సంతోషంగా ఉండగలం. చనిపోయినవారిని పునరుత్థానం కూడా చేస్తాడు, అలా ఆ క్రొత్త లోకాన్ని అనుభవించే అవకాశాన్ని వారికి ఇస్తాడు. ఆ సమయంలో, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అని బైబిలు మనకు నిశ్చయతనిస్తుంది.—యెషయా 33:24.
అప్పటి వరకు, మీరు తీవ్రమైన అనారోగ్యంతో పోరాడవలసి ఉండవచ్చు. అయితే, మీ పరిస్థితిని అధిగమించేందుకు మీరు చేయగల అనేక ఆచరణాత్మకమైన విషయాలున్నాయి. భవిష్యత్తులో ఒక శీర్షికలో దానిని మనం చర్చించుకుందాం.
[23వ పేజీలోని చిత్రం]
‘నాకిలా జరిగేందుకు దేవుడెందుకు అనుమతించాడు?’ అని మీరు అడగవచ్చు