వాళ్లు దాన్ని వినోదం అన్నారు
ఆ ఆంఫీథియేటర్ ఉత్తేజంతో నిండివుంది. ప్రాచీన రోమ్‌లోని అత్యంత ఉద్వేగభరితమైన దృశ్యాల్లో ఒకదానికొరకు వేలాదిమంది సమకూడారు. జెండాలు, గులాబీలూ, రంగురంగుల బట్టలూ ఎరీనాను ఆడంబరంగా తీర్చిదిద్దాయి. ఫౌంటైన్‌లు పరిమళద్రవ్యాలు కలిపిన నీటిని విరజిమ్ముతూ గాలిని ఆహ్లాదకరమైన సువాసనలతో నింపుతున్నాయి. సంపన్నులు జిగేలుమనే వస్త్రాలు ధరించుకొని వచ్చారు. జనాలు మాట్లాడుకునే శబ్దాల మధ్య అప్పుడప్పుడూ పెద్దగా నవ్వుతున్న శబ్దం వినవస్తుంది, కానీ ఈ జనసమూహం అంత సరదాగా ఉండడం సంభవించనైయున్న ఘోరకృత్యాలను కప్పిపుచ్చుతున్నట్లుగా ఉంది.
కొంచెంసేపట్లో ట్యూబై అశుభసూచక శబ్దంతో ఇద్దరు గ్లేడియేటర్లు పిలువబడ్డారు. ఇద్దరు పోటీదారులు దయారహితంగా క్రూరంగా ఒకరినొకరు ఖడ్గాలతో గాయపర్చుకుంటుంటే జనం ఉన్మత్తంతో నిండిపోయింది. చెవులు చిల్లులుపడేలా ప్రేక్షకులు వేస్తున్న కేకలమధ్య ఖడ్గాలు ఖంగుమనడం అసలు వినిపించడంలేదు. అకస్మాత్తుగా, వారిలో ఒక కత్తివీరుడు మెరుపులా కదిలి తన ప్రత్యర్థిని మట్టికరిపించాడు. క్రిందపడిన గ్లేడియేటర్ భవిష్యత్తు ఇప్పుడు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. వారు తమ చేతిరుమాళ్లను గాలిలో ఊపితే ఆయన బ్రతుకుతాడు. స్త్రీలూ అమ్మాయిలూ కూడావున్న ఆ సభికులు తమ బొటన వ్రేళ్లతో ఒక్క అభినయం చేసి చావుదెబ్బవేయమని ఆజ్ఞాపిస్తారు. కొద్ది క్షణాల్లోనే నిర్జీవంగావున్న శరీరాన్ని ఎరీనా నేలమీదుగా ఈడ్చుకుని వెళ్తారు, రక్తసిక్తమైన మట్టిని పారలతో ఎత్తేసి మళ్లీ తాజా ఇసుక జల్లుతారు, జనం ఇప్పుడు మిగిలిన రక్తపాతానికి సిద్ధపడ్తుంది.
ప్రాచీన రోమ్‌లో నివసించే చాలామందికి అది వినోదం. “కచ్చితమైన నైతికవాదులు సహితం రక్తపాతంలో ఇలా ఆహ్లాదాన్ని అనుభవించడానికి ఏమాత్రం అభ్యంతరం తెల్పలేదు” అని రోమ్: మొదటి వెయ్యి సంవత్సరాలు (ఆంగ్లం) అనే పుస్తకం చెబుతుంది. రోమ్ అందించిన నీచమైన వినోదంలో గ్లేడియేటర్ క్రీడ కేవలం ఒక రకం మాత్రమే. రక్తదాహంతోవున్న ప్రేక్షకులు చూసి ఆనందించడానికి ఎరినాలో యుద్ధనౌకల మధ్య నిజమైన యుద్ధాలుకూడా జరిపేవారు. బహిరంగ మరణశిక్షలు కూడా అమలు జరుపబడేవి, ఈ సందర్భాల్లో దోషియని మరణశిక్ష విధించబడిన నేరస్థుడిని ఒక మ్రానుకు కట్టేసి ఆకలితో నకనకలాడుతున్న క్రూర మృగాలు చీల్చిచెండాడేందుకు విడిచిపెట్టేవారు.
రక్తదాహం అంతగాలేని వారికి రోమ్ వైవిధ్యమైన రంగస్థల నాటకాలను అందించింది. అనుదిన జీవితానికి సంబంధించిన చిన్నచిన్న నాటకాలైన మైమ్ ప్రదర్శనల్లో “వ్యభిచారం, ప్రేమ వ్యవహారాలు ప్రధానాంశాలుగా ఉండేవి” అని తొలి సామ్రాజ్యం క్రింద రోమ్ జీవితమూ, మర్యాదలు (ఆంగ్లం) అనే పుస్తకంలో లుడ్‌విగ్ ఫ్రీడ్‌లెండర్ వ్రాశాడు. “వాటిలోని భాష పూర్తిగా అసభ్యపదజాలంతో కూడిన వ్యక్తీకరణలతో నిండివుండి, ఏవగింపును వ్యక్తంచేసే అభినయాలూ, అశ్లీల భంగిమలూ వంటివాటితోకూడిన వెగటుపుట్టించే హాస్యం పుష్కలంగావుండి, అన్నింటినీ మించి పిల్లనగ్రోవి నాదానికి చేసే వికారమైన నృత్యాలువంటివి ఉండేవి.” ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం “రోమన్ సామ్రాజ్యం కాలంలో వ్యభిచార క్రియలు నిజంగానే మైమ్ రంగస్థలంపై ప్రదర్శించబడేవని సాక్ష్యాధారాలు సూచిస్తున్నాయి.” ఫ్రీడ్‌లెండర్ మైమ్ ప్రదర్శనను “అనైతికమైన, అశ్లీలమైన ప్రదర్శనల్లోకెల్లా అత్యంత బాహాటమైన ఉల్లంఘన” అని సహేతుకంగానే పిలుస్తూ, “అన్నింటికన్నా ఎక్కువ అశ్లీలంగావున్న సన్నివేశాలకు ప్రేక్షకులు అత్యధిక ఆమోదాన్ని తెలియజేసేవారు” అని జతచేస్తున్నాడు.a
నేటి విషయమేమిటి? వినోదం విషయంలో మానవుని అభిరుచి ఏమన్నా మారిందా? తర్వాతి శీర్షికలో చర్చించబడిన సాక్ష్యాధారాన్ని పరిశీలించండి.
[అధస్సూచీలు]
a కొన్నిసార్లు, ఒక నాటకానికి వాస్తవికతను చేకూర్చడానికి రంగస్థలంపై మరణశిక్షను అమలుజరిపేవారు. రోమ్ నాగరికత (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంటుంది: “మరణశిక్ష విధించబడిన నేరస్థుడు విపత్కరమైన ఆ క్షణంలో నటుని స్థానాన్ని తీసుకోవడం అసాధారణమేమీ కాదు.”
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck