కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 6/8 పేజీలు 4-7
  • వినోదానికి ఏమైంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వినోదానికి ఏమైంది?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత
  • దూరదర్శిని నిన్ను మార్చినదా?
    తేజరిల్లు!—1992
  • ఆరోగ్యకరమైన మానసిక వీక్షణాన్ని ఎలా కాపాడుకోవాలంటే
    తేజరిల్లు!—1999
  • మీరు ఏ సినిమాలు చూస్తారు?
    తేజరిల్లు!—2005
  • యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 6/8 పేజీలు 4-7

వినోదానికి ఏమైంది?

రోమన్ల సంస్కృతి అత్యుచ్ఛస్థాయిలో ఉందని చెప్పబడుతుండగా, తోటి మానవుల వేదనను వారు వినోదంగా ఎలా దృష్టించగల్గారు? “క్రొత్తవైన, మరింత శక్తిమంతమైన ప్రేరేపకాల కొరకైన వాంఛ దీనికిగల కారణాన్ని వివరించగలదు” అని ద కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ క్రిస్టియానిటీ విత్‌ హీథెనిజమ్‌లో గేర్‌హార్ట్‌ ఊల్‌హార్న్‌ వ్రాస్తున్నాడు. “సాధ్యమైనన్ని రకాల సుఖభోగాలతో పూర్తిగా తృప్తులైన ప్రజలు . . . ఇంకెక్కడా కనుగొనబడలేని ఉత్తేజం కొరకు వెదికారు.”

నేడు చాలామంది అదేవిధంగా “క్రొత్తవైన, మరింత శక్తిమంతమైన ప్రేరేపకాల కొరకైన వాంఛ”ను ప్రదర్శిస్తున్నారు. నిజమే, నిజజీవిత మారణకాండను లేక లైంగిక కార్యాల్ని చూడడానికి వారు ఒకచోట సమకూడకపోవచ్చు. కానీ వినోదం విషయంలో వారు చేసుకునే ఎంపిక హింసా, సెక్స్‌ల కొరకైన అదే తపనను వెల్లడిస్తుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

చిత్రాలు. ఇటీవలి సంవత్సరాల్లో చిత్రనిర్మాతలు “వక్రతపట్ల ఇష్టతను” ప్రదర్శించారు అని చిత్ర విమర్శకుడు మైఖేల్‌ మెడ్‌వెడ్‌ నొక్కిచెబుతున్నాడు. “క్రూరత్వాన్నీ, ఉన్మాదాన్నీ చిత్రించడం ఎక్కువ పరిగణనకూ, ప్రత్యేక అవధానానికీ అర్హమైందన్నదే చిత్ర వ్యాపారంలోని సందేశం అన్నట్లుగా కన్పిస్తోంది. అంతేగానీ, ఔదార్యాన్నో లేదా మంచితనాన్నో చూపించే ప్రయత్నాలు చేయడం అంతగా అవధానానికి అర్హమైనవి కావు అన్నదే ఆ సందేశం” అని కూడా ఆయన అన్నాడు.

టీవీతో పోటీ, ప్రజలు సినిమా థియేటరుకు వచ్చేలా వారిని ప్రలోభపెట్టడానికి చిత్ర నిర్మాతలు చివరికి ఎంతదూరమైనా వెళ్లేలా చేసింది. “శక్తిమంతంగా, శ్రద్ధనాకర్షించే విధంగా, ప్రజలు టీవీలో చూసే కార్యక్రమాలన్నింటికన్నా విస్పష్టంగా ఉండే చిత్రాలు మాకు కావాలి” అని ఒక చిత్రనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ అన్నాడు. “వాస్తవానికి చెప్పాలంటే, ఘోరమైన దృశ్యాలు చూపించడానికీ, [వెగటుపుట్టించే] భాషను ఉపయోగించడానికీ మేమేం అంకితంకాలేదు, కానీ ఒక చిత్రాన్ని ప్రజలకు అందివ్వాలంటే కావాల్సింది అదే” అంటున్నాడాయన. నిజానికి, చిత్రాల్లో విస్పష్టమైన రీతిలో హింసను చూపించడాన్నిబట్టి చాలామంది ఇక ఎంతమాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం లేదు. “పైగా ప్రజలు వాటికి అలవాటుపడిపోతున్నారు” అని చిత్ర దర్శకుడైన ఆలన్‌ జె. పక్యులా అంటున్నాడు. “చనిపోయేవారి సంఖ్య నాలుగింతలైంది, విస్ఫోటనాలు విపరీతంగా పెరిగిపోయాయి, మరి ప్రజలు వాటిని వినిపించుకుంటున్నట్లు లేదు. వారు క్రూరత్వంతో కూడిన సంచలనాత్మక విషయాలపట్ల విపరీతమైన దాహాన్ని పెంచుకున్నారు” అని కూడా అంటున్నాడాయన.

టీవీ. జపాన్‌, బ్రెజిల్‌, యూరప్‌లతోపాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో టీవీలో సెక్స్‌ను ఘోరమైన రీతిలో చూపించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అమెరికాలోని సగటు టీవీ వీక్షకుడు ఒక్క సంవత్సరంలోనే దాదాపు 14,000 సెక్స్‌ సంబంధిత దృశ్యాలను చూస్తాడు. “లైంగిక కథనాల్లో, విశృంఖలతలో పెరుగుదల వెనక్కు తగ్గే సూచనలు ఏమాత్రం కన్పించడంలేదు. ఒకప్పుడు నిషిద్ధ విషయాలైన వావివరుసలు తప్పి వ్యభిచరించడం, ఇతరులకూ లేక తమకు తామే బాధను కలుగజేసుకోవడంద్వారా పొందే సుఖానుభూతి, మృగసంయోగం వంటివి ఇప్పుడు లాభార్జనలకు మాధ్యమాలుగా తయారయ్యాయి” అని ఒక పరిశోధనా బృందం నివేదిస్తుంది.

వాచింగ్‌ అమెరికా అనే పుస్తకం ప్రకారం టీవీ కార్యక్రమాలు ఇలా విశృంఖలంగా తయారవ్వడానికి ఒక కారణం ఉంది. అదిలా పేర్కొంటుంది: “సెక్స్‌ బాగా అమ్ముడుపోతుంది. . . . నెట్‌వర్కులూ, నిర్మాణ కంపెనీలూ అభ్యంతరపడే వారికన్నా ఉత్తేజంపొందేవారే ఎక్కువమంది ఉన్నట్లు కనుగొని, వారు తమ ఉత్పాదనల అమ్మకపు శక్యతను క్రమంగా పెంచుకుంటూ పోయారు. మరిన్ని నిషిద్ధ విషయాలను మరింత విస్పష్టమైన రీతిలో చూపించడాన్ని అనుమతిస్తూ వారిలా చేస్తున్నారు.”

వీడియో గేమ్స్‌. నిష్కల్మషమైన యుగంలోని పాక్‌-మ్యాన్‌, డాంకీ కాంగ్‌ అనే తొలి వీడియో గేమ్‌లు అసహ్యకరమైన హింసాత్మకమైన గేమ్‌ల క్రొత్త యుగం కొరకు దారి తొలిగాయి. ప్రొఫెసర్‌ మార్ష కిండర్‌ ఈ గేమ్‌లను “టీవీకన్నా చిత్రాలకన్నా ఘోరమైనవి” అని వర్ణించింది. “నియంత్రణనీ శక్తినీ పొందడానికి ఒకే ఒక్క మార్గం హింస అనే సందేశాన్ని” అవి అందిస్తున్నాయని కూడా ఆమె చెప్పింది.

ఇప్పుడు, అమెరికాలోని వీడియో గేమ్‌లను తయారు చేసే ఒక ప్రముఖ కంపెనీ తన వీడియో గేమ్‌లపై ప్రజా ప్రయోజనార్థం ఒక రేటింగ్‌ వ్యవస్థను ఉపయోగిస్తోంది. 17 ఏళ్లకన్నా తక్కువ వయస్సువారికి ఉపయుక్తం కాదని సూచించే “MA-17” లేబుల్‌ ఉన్న ఒక “మెచ్యూర్‌” గేమ్‌లో తీవ్రమైన హింస, లైంగిక కథనాలు, అసభ్యత ఉండవచ్చు. అయితే, “మెచ్యూర్‌” అనే రేటింగ్‌ ఆ గేమ్‌కుండే ఆకర్షణను అధికం చేయవచ్చని కొంతమంది భయపడుతున్నారు. “నేను 15 ఏండ్లవాడినయ్యుండి, MA-17 అనే లేబుల్‌ అంటించివున్న గేమ్‌ని చూస్తే ఆ గేమ్‌ను ఎలాగైనా సంపాదించుకుంటాను” అని యౌవనుడైన ఒక వీడియో గేమ్‌ ఔత్సాహికుడు అంటున్నాడు.

సంగీతం. 1995 సంవత్సరాంతంలో, టాప్‌ 40 ఆల్బమ్‌లలో కేవలం 10 ఆల్బమ్‌లు మాత్రమే మాదకద్రవ్యాలు, హింస, సెక్స్‌లనుండి లేక అసభ్యతనుండి దూరంగా ఉన్నట్లు పాపులర్‌ సంగీతాన్ని సూక్ష్మంగా పరిశీలనం చేసే ఒక పత్రిక చెబుతుంది. “కౌమరంలోని వారికి అందుబాటులో ఉన్న సంగీతం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది, ఆ సంగీతం చాలామట్టుకు పూర్తిగా శూన్యవాదంతో నిండివుంది” అని సెయింట్‌ లూయీ పోస్ట్‌-డిస్పాచ్‌ నివేదిస్తుంది. అదింకా ఇలా అంటుంది: “కౌమారదశలోని కొంతమందికి ఆకర్షణీయంగా ఉన్న [సంగీతం] పూర్తిగా కోపంతోనూ, నైరాశ్యావాదంతోనూ నిండివుంది, అంతేగాక లోకమూ, లోకంతోపాటు వ్యక్తిగతంగా ఆ సంగీతాన్ని వినేవారూ నాశనానికి పోతున్నారనే భావాలను ప్రోత్సహిస్తోంది.”

డెత్‌ మెటల్‌, “గ్రంజ్‌” రాక్‌, “గాంగ్‌స్టా” ర్యాప్‌లు హింసలో మునిగితేలుతున్నట్లు అనిపిస్తోంది. శాన్‌ ఫ్రాన్సిస్కో క్రానికల్‌ నివేదిక ఒకదాని ప్రకారం “అత్యంత భయంకరమైన గ్రూపులు చాలామట్టుకు త్వరలోనే టాప్‌కి చేరుకునే మార్గంలో ఉన్నాయని ఇండస్ట్రీలోని లోపలివారు చాలామంది జోస్యం చెబుతున్నారు.” కోపాన్నీ, మరణాన్నీ ఘనపర్చే పాటలు ఇప్పుడు ఆస్ట్రేలియా, జపాన్‌, యూరప్‌లలో పాపులర్‌ అయ్యాయి. నిజమే, కొన్ని గ్రూపులు కాస్త శ్రేయస్కరమైన సందేశాన్నివ్వడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ, క్రానికల్‌ ఇలా అంటుంది: “నిష్కల్మషమైన సంగీతానికి ఎక్కువ మార్కెట్‌ లేదని సాక్ష్యాధారం సూచిస్తుంది.”

కంప్యూటర్లు. ఇవి చాలా అనుకూల ఉపయోగాలు గల విలువైన ఉపకరణాలు. అయితే, అశ్లీల విషయాల్ని పంపించడానికి కూడా ఇవి కొంతమందిచే ఉపయోగించబడ్తున్నాయి. ఉదాహరణకు, మెక్‌లీన్స్‌ పత్రిక నివేదిస్తున్నదాని ప్రకారం, ఈ అశ్లీలమైన వాటిలో “విపరీతమైన ఘోరమైన లైంగిక అభ్యాసాల వంటివి మొదలుకొని వ్యభిచారమూ, శిశుకాముకత్వమూ వంటివాటి వరకు, ఏ విషయం గురించి అయినా చిత్రాలూ, లిఖిత సమాచారమూ చాలామంది పెద్దలకే దిగ్భ్రమ కల్గించే విధంగా ఉంటాయి. ఇక వారి పిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు.”

చదివే సమాచారం. పాపులర్‌ పుస్తకాల్లోని సమాచారం చాలామట్టుకు సెక్స్‌తోనూ, హింసతోనూ పొంగిపొర్లుతున్నాయి. అమెరికా, కెనడాల్లో ఇటీవలెనే “షాక్‌ ఫిక్షన్‌” అనేది వేలంవెర్రిగా ఉంది—దీన్లో ఎనిమిది సంవత్సరాల లేత వయస్సువారిని గురిగా పెట్టుకుని వ్రాయబడిన అసహ్యకరమైన హర్రర్‌ కథలు ఉన్నాయి. ఈ పుస్తకాలు “చాలా చిన్నపిల్లల్లో సహితం సున్నితత్వం లేకుండా చేస్తున్నాయి. వారి ఆలోచనా సామర్థ్యాలు పెరగడం ప్రారంభించడానికి ముందే వాటి పెరుగుదలను నిరోధిస్తున్నాయి” అని న్యూయార్క్‌ టీచర్‌లో డయాన వెస్ట్‌ వ్రాస్తోంది.

అమెరికాలోనూ, జపాన్‌లోనూ, హాంగ్‌ కాంగ్‌లోనూ ప్రచురించబడే కామిక్‌ పుస్తకాల్లో చాలామట్టుకు “తీవ్రమైన, క్రూరమైన యుద్ధాల్నీ, నరమాంసభక్షణనీ, శిరశ్ఛేదననీ, సాతానువాదాన్నీ, మానభంగాన్నీ, అసభ్యతనీ” చూపిస్తున్నాయని నేషనల్‌ కోయలిషన్‌ ఆన్‌ టెలివిజన్‌ వయలెన్స్‌ (NCTV) జరిపిన ఒక అధ్యయనం నివేదిస్తోంది. “ఈ పత్రికల్లోని హింసా, సెక్స్‌ సంబంధిత నీచమైన సమాచారాల తీవ్రత దిగ్భ్రాంతి కలిగించేదిగా ఉంది” అని NCTV రీసెర్చి డైరెక్టరైన డా. థామస్‌ రాడెకి చెబుతున్నాడు. “మనల్ని మనం ఎంత సున్నితత్వం లేకుండా తయారయ్యేలా అనుమతించుకున్నామో ఇది చూపిస్తుంది” అన్నాడాయన.

జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత

స్పష్టంగా, నేటి ప్రపంచంలో సెక్స్‌పట్ల, హింసపట్ల ఎంతో వ్యామోహం ఉంది, ఇది వినోద పరిశ్రమలో ప్రతిబింబిస్తోంది. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వర్ణించిన పరిస్థితిని ఇది పోలివుంది: “వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.” (ఎఫెసీయులు 4:19) నేడు చాలామంది యుక్తమైన రీతిలోనే మరి శ్రేష్ఠమైనదానికొరకు ఎదురు చూస్తున్నారు. మీరు కూడానా? అలాగైతే, ఆరోగ్యకరమైన వినోదాన్ని మీరు కనుగొనగలరని తెలుసుకోవడానికి మీరు సంతోషిస్తారు. ఎలాగో తర్వాతి శీర్షిక చూపిస్తుంది.

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

టీవీ హానికరంగా ఉండవచ్చు

అమెరికాలో 1939లో న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్‌ ఫెయిర్‌లో టీవీ రంగప్రవేశం చేసింది. అక్కడవున్న ఒక విలేఖరి ఈ క్రొత్త పరికరం యొక్క భవిష్యత్తు గురించి తనకున్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. “టీవీతోవున్న సమస్య ఏమిటంటే ప్రజలు దానిముందు కూర్చుని కళ్లప్పగించి దాని తెరను చూడాలి; సగటు అమెరికా కుటుంబానికి అందుకు సమయం లేదు” అని ఆయన వ్రాశాడు.

ఆయనెంత పొరపాటు పడ్డాడు! నిజానికి, ఒక సగటు అమెరికావాసి కళాశాలనుండి పట్టభద్రుడయ్యేసరికి తన అధ్యాపకుని ముందు కూర్చుని గడిపిన సమయంకన్నా టీవీముందు కూర్చుని గడిపిన సమయం 50 శాతం ఎక్కువుంటుందని చెప్పబడుతుంది. “టీవీ చాలా ఎక్కువగా చూసిన పిల్లలు ఎక్కువ దురుసుగానూ, ఎక్కువ నైరాశ్యావాదంతోనూ, ఎక్కువ బరువుతోనూ, తక్కువ ఊహాశక్తితోనూ, తక్కువ తదానుభూతితోనూ, టీవీని తక్కువగా చూసే తమ తోటివారికన్నా తక్కువ సామర్థ్యంగల విద్యార్థులుగానూ ఉంటారని డా. మాడిలన్‌ లవైన్‌ హింసను చూడడం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో అంటుంది.

ఆమె ఇచ్చే సలహా? “ఇంట్లోని మిగిలిన ఉపకరణాల్లాగే టీవీకీ నిర్దిష్టమైన ఉపయోగం ఉందని పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కసారి మన జుట్టు ఆరిన తర్వాత హెయిర్‌ డ్రైయర్‌ను ఆన్‌ చేసే ఉంచము, లేకపోతే టోస్ట్‌ బయటికి వచ్చిన తర్వాత టోస్టర్‌ని ఆన్‌ చేసే ఉంచము. ఈ ఉపకరణాలకు నిర్దిష్టమైన ఉపయోగాలు ఉన్నాయని గుర్తిస్తాము, వాటిని ఎప్పుడు కట్టేయాలో మనకు తెల్సు. మన పిల్లలకు టీవీని గురించి అదేవిధంగా నేర్పించాలి.”

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా వినోదం

స్థానికంగా వినోదంలో ఎటువంటి ధోరణులు ఉన్నాయో వివరించమని తేజరిల్లు! ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని తన విలేఖరులను కోరింది. ఈ క్రిందనున్నవి వారి వ్యాఖ్యానాల్లో కొన్ని.

బ్రెజిల్‌: “టీవీ కార్యక్రమాలు మరీ నీచస్థితికి దిగజారాయి. అయితే, చాలామంది తలిదండ్రులు బయట పనిచేస్తుండగా పిల్లలు తరచూ టీవీద్వారా వినోదాన్ని పొందుతారు. అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథనాలు ఉన్న సీడీ-రామ్‌లు, ఘోరమైన హింసను చూపించే వీడియో గేమ్‌లు ప్రజాదరణ పొందుతున్నాయి.”

చెక్‌ రిపబ్లిక్‌: “కమ్యూనిజం పడిపోయిన తర్వాత, పాశ్చాత్య దేశాల టీవీ కార్యక్రమాలూ, పోర్నోగ్రఫీ దుకాణాలతోపాటు ఇక్కడ ఇంతకు మునుపెన్నడూ చూసి ఎరుగనటువంటి వినోదం ఈ దేశంలోకి వెల్లువలా వచ్చిపడింది. యౌవనస్థులు డిస్కోలకూ, బిలియర్డ్‌ క్లబ్బులకూ, బార్‌లకూ తరచూ వెళ్తూవుంటారు. భారీ మొత్తంలో వాణిజ్య ప్రకటనలూ, స్నేహితుల ఒత్తిడీ తరచూ వారిపైన బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.”

జర్మనీ: “విషాదకరంగా, చాలామంది తలిదండ్రులు తమ పిల్లల కొరకు వినోదాన్ని ఏర్పాటు చేయలేనంతగా అలసిపోయివుంటారు, అందుకని యౌవనులు సరదాగా సమయం గడపడానికి ఒకరిమీద మరొకరు ఆధారపడుతూవుంటారు. కొంతమంది కంప్యూటర్‌ గేమ్‌లతో తమను తాము ఒంటరివారిగా చేసుకుంటారు. మరితరులు మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా ఉపయోగించే, రేవ్స్‌ అని పిలువబడే రాత్రంతా నడిచే డాన్స్‌ కార్యక్రమాలకు హాజరౌతారు.”

జపాన్‌: “యౌవనులకూ, పెద్దలకూ కామిక్‌ పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెళ్లబుచ్చడం అంటే ఇష్టం, కానీ వీటిలో అత్యధికం హింసా, అనైతికతా, దుర్భాష వంటివాటితో నిండివుంటాయి. జూదం కూడా సర్వసాధారణమే. ఇంకొక కలతపర్చే ధోరణి ఏమంటే కొంతమంది అమ్మాయిలు, అనైతికమైన కార్యాలనిమిత్తం అమ్మాయిల్ని పురుషులకు సరఫరా చేస్తామని విస్తృతంగా అడ్వర్టయిజ్‌ చేయబడిన టెలిఫోన్‌ క్లబ్బులకు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది కేవలం సరదాకు మాత్రమే ఫోన్‌ చేస్తారు, ఇతరులు డబ్బుకోసం డేటింగ్‌ చేసేంతవరకూ వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది వ్యభిచారానికి నడిపిస్తుంది.”

నైజీరియా: “అనియంత్రిత వీడియో థియేటర్లు పశ్చిమ ఆఫ్రికా అంతటా విస్తరిస్తున్నాయి. ఈ తాత్కాలిక గుడిసెల్లోకి పిల్లల్తోసహా ఏ వయస్సులోని వారికైనా ప్రవేశం ఉంటుంది. పోర్నోగ్రఫీ, హర్రర్‌ వీడియోలు ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు, టీవీలో ప్రసారం చేయబడే స్థానికంగా నిర్మించబడిన చిత్రాలు సామాన్యంగా అభిచారాన్ని చూపిస్తుంటాయి.”

దక్షిణ ఆఫ్రికా: “రేవ్స్‌ ఇక్కడ వర్ధిల్లుతున్నాయి. వీటిలో తరచూ మాదకద్రవ్యాలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి.”

స్వీడన్‌: “బార్‌లూ, నైట్‌క్లబ్బులూ స్వీడన్‌లో విజయవంతంగా నడుస్తున్నాయి. తరచూ నేరస్థులూ, మాదకద్రవ్యాల వ్యాపారస్తులూ ఇలాంటి స్థలాల్లో గుమిగూడుతుంటారు. టీవీ, వీడియో వినోదం హింసా, అభిచారం, అనైతికతలతో నిండివుంటాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి