ప్రపంచ పరిశీలన
మనస్సును తేలికపర్చుకోండి—ఆరోగ్యంగా ఉండండి!
“హాస్యం ద్వారా ప్రజలు మరింత సహించేవారిగా, నిరాశలను చక్కగా అధిగమించేవారిగా, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేవారిగా అవుతారు” అని సావో పౌలో యూనివర్సిటీ ప్రొఫెసర్ సూలీ డామర్జ్యన్ అంటున్నారు. బ్రెజీల్లోని ఓ ఎస్టాడో డి ఎస్. పౌలో పత్రికలోని ఒక నివేదిక ప్రకారం, చదవడం వ్రాయడం నేర్చుకోగలిగినట్లే, మంచి హాస్యం కూడా నేర్చుకోగల్గేదే. స్పష్టంగా, చిరచిరలాడే వ్యక్తి తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది. మనశ్శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన రాకెల్ రోడ్రీగీస్ కెర్బూయీ ఈ విధంగా వివరిస్తున్నాడు: “లోకం నీతియుక్తంగా ఉన్నప్పుడే తాను నవ్వగలడని అనుకునే వ్యక్తి ఎప్పుడూ సులభంగా కోపం తెచ్చుకుంటాడు. అవును మరి, ప్రతిచోటా అవినీతే.” ఎంత ఖాళీగా లేకపోయినా సత్స్వభావం గల ప్రజలు తమ సామాజిక జీవనాన్ని ఆనందిస్తారు అని ఆ నివేదిక పేర్కొంటోంది. “కబుర్లు, కలకండ, లేదా ఐదు నిమిషాలు చక్కని సంగీతం వినడం” వంటి చిన్న విషయాలకు వారు విలువిస్తారు. అయినప్పటికీ డామెర్జియన్ ఇలా హెచ్చరిస్తున్నాడు: “ఒకరు మంచి హాస్యాన్ని నీచమైనదానితో మొరటుతనంతో తికమకచేయకూడదు.”
పిల్లలు ఇష్టపడేది, అసహ్యించుకునేది
పిల్లలు దేన్ని చేయడంలో చాలా తక్కువగా ఆనందిస్తారు? 6 నుండి 11 ఏండ్ల వయస్సున్న పిల్లలను అధ్యయనం చేసిన ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ గూస్టావో ప్యేట్రోపొలీ షేర్మెట్ చేసిన అధ్యయనంలో, “టి.వి. చూస్తూ ఇంట్లో ఉండడం,” లేదా “అమ్మతో పాటు ఇంట్లో ఉండి హోమ్‌వర్క్ చేయడం” అని చాలా మంది పిల్లలు చెప్పారు. లా రిపబ్లికా అనే వార్తాపత్రిక ఇలా చెబుతుంది, నృత్యం నేర్చుకోవడం ఆంగ్లం నేర్చుకోవడం పియానో లేక మరితర పాఠాలు నేర్చుకోవడం వంటి వాటి కొరకై ఉరుకులు పరుగులు తీయవలసి వచ్చేటటువంటి “ఏర్పాట్లు ఉండడం” వారికి చాలా అసంతోషకరమైన విషయం. “ఒంటరిగా ఉండడం” అంటే సాధారణంగా అసహ్యించుకుంటారు. మరోవైపు, తమ తలిదండ్రులు “ఇంటి బయట ఆడుకోవడానికి తమ పిల్లలను అనుమతించాలని” 49 శాతం మంది అబ్బాయిలు ఇష్టపడుతుండగా, తలిదండ్రులు “తమ పిల్లలతో సరదాగా ఆడుకోవాలని” అమ్మాయిలు ఆశిస్తారు. అందుకే, ‘అమ్మ నాతో ఆడేటప్పుడు నాతో నిజంగా ఆడవలసిందే. అమ్మ సరదాగా లేకపోతే అర్థమైపోతుంది, ఇక నేనే మాత్రం సరదాగా ఉండలేను’ అని అమ్మాయిలు అంటారు.
మీరే ఎంపిక చేసుకోండి
“మీ క్రొత్త సంవత్సరం అసంతోషకరంగా ఆరంభమయ్యిందా?” అని న్యూ సైంటిస్ట్ పత్రికలోని ఒక శీర్షిక ప్రశ్నించింది. “విచారపడకండి. మీరు ఎంపిక చేసుకునేందుకు ప్రపంచంలో కనీసం మరో 14 క్రొత్త సంవత్సరాలున్నాయి.” నిజానికి, గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించిన దేశాలు మాత్రమే జనవరి 1ని సంవత్సరంలోని మొదటి దినంగా ఎంచుతాయి. క్యాలెండర్ సంవత్సరం జనవరి 1తో ఆరంభమవ్వాలని సా.శ.పూ. 46లో తీర్మానించినది జూలియస్ సీజర్. మరి 1582లో పోప్ గ్రెగరి క్యాలెండర్‌ను నవీకరించినప్పుడు అది అలాగే ఉంచబడింది. విభిన్న సంస్కృతులు వాటి వాటి క్రొత్త సంవత్సర దినాలను వృద్ధి చేసుకోగా కనీసం 26 విభిన్న క్రొత్త సంవత్సర దినాలు అకస్మాత్తుగా కనిపించాయి. ఇప్పటికీ శేషించి ఉన్నవాటిలో ఒకటైన చైనీస్ పద్ధతి అతి పురాతనమైనది. వారికి క్రొత్త సంవత్సరం అనేది ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న ఆరంభమయ్యింది. యూదుల క్రొత్త సంవత్సరం అక్టోబర్ 2న ఆరంభమౌతుంది. ముస్లిమ్ క్యాలెండర్ పూర్తిగా చాంద్ర మాస సంబంధమైనది, దానికి దానిదైన తేదీ ఉంటుంది—అదే మే 8.
“చైనాలో వృద్ధుల జనాభా”
“చైనాలో వృద్ధుల జనాభా స్థిరమైన రేటులో పెరుగుతోంది, 1994వ సంవత్సరాంతమయ్యే సరికి చైనాలో 60 ఏండ్లు దాటిన వృద్ధుల సంఖ్య 11,69,70,000 ఉండింది. అది 1990 నాటి కంటే 14.16 శాతం పెరుగుదల” అని చైనా టుడే అనే పత్రిక నివేదిస్తోంది. 60 ఏండ్లు దాటిన ప్రజల సంఖ్య ఇప్పుడు మొత్తం జనాభాలో దాదాపు 10 శాతం ఉంది, ఇప్పుడు వృద్ధుల జనాభా మొత్తం జనాభా కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువగా పెరుగుతోంది. వాళ్ళ అవసరాలెలా తీర్చడం జరుగుతుంది? పని చేయడం వలన లభించే ఆదాయం, పెన్షన్లు, సాంఘిక భీమా, మరియు ఉపశమన కార్యక్రమాలు అనేకుల అవసరాలను తీరుస్తున్నప్పటికీ, చైనాలోని 57 శాతం కన్నా ఎక్కువ మంది వృద్ధులను వారి పిల్లలు లేదా ఇతర బంధువులు చూసుకుంటున్నారు. “చైనాలో కుటుంబ బంధాలు దృఢంగా ఉంటాయి కనుక, వృద్ధులను గౌరవించే, వారిని చూసుకునే మంచి సాంప్రదాయం చైనాకుంది కనుక, చాలా మంది వృద్ధులు వారి బంధువులతోనే నివసిస్తారు, మరి వాళ్ళు వాళ్ళను బాగా చూసుకుంటారు. చైనాలో కేవలం 7 శాతం మంది వృద్ధులు మాత్రమే తమంతట తామే బ్రతుకుతారు” అని చైనా టుడే చెబుతుంది.
బాల శ్రామికులు—పెరుగుతున్న ఓ సమస్య
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, ప్రపంచమంతటా ఉన్న 10, 14 ఏండ్ల వయస్సు గల పిల్లలో 13 శాతం మంది పిల్లలు—దాదాపు 7.3 కోట్ల మంది పిల్లలు పని చేయడానికి బలవంతపెట్టబడుతున్నారు. పదేండ్లలోపు పిల్లలను గూర్చిన, పూర్తికాలం ఇంటి పనిలో ఉన్న బాలికలను గూర్చిన గణాంకం అందుబాటులో ఉన్నట్లయితే, లోకంలో ఉన్న బాల శ్రామిక వర్గాలు కోట్ల లెక్కన ఉండే సాధ్యత ఉందని కూడా ఆ నివేదిక తెలిపింది. జెనీవాలో ఉన్న ఒక సంస్థ 80 సంవత్సరాలుగా బాల శ్రామికత్వానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ సమస్య ముఖ్యంగా ఆఫ్రికాలోను, మరియు లాటిన్ అమెరికాలోను పెరుగుతూ విస్తృతమౌతూ ఉంది. దాసి పని చేయడం, పని చేసే స్థలంలో అపాయకరమైన పరిస్థితులు ఈ కోట్ల కొలది పిల్లల దౌర్భాగ్యంగా ఉండగా, వ్యభిచారం ఒక ప్రత్యేక సమస్యగా తయారయ్యింది. కొన్ని దేశాల్లో “పెద్దవాళ్ళు లైంగికతకు పిల్లలను ఉపయోగించడం [హెచ్.ఐ.వి.] సోకడాన్ని నివారించే శ్రేష్ఠమైన మాధ్యమంగా భావిస్తారు” అని ఆ నివేదిక చెబుతుంది. ఆ సంస్థ “సమస్యను నిర్లక్ష్యం చేసిన . . . ప్రభుత్వ అధికారులను నిందించింది” అని పారిస్‌లోని ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ చెప్పింది.