శరణార్థులతో వ్యవహరించాల్సిన విధానం
ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు శరణార్థులుగా ఉన్నప్పటి వారి పరిస్థితిని గురించి వారికి జ్ఞాపకం చేయబడింది. (నిర్గమకాండము 22:21; 23:9; ద్వితీయోపదేశకాండము 10:19) కాబట్టి తమ మధ్యనున్న పరదేశుల ఎడల దయగా ప్రవర్తించాలనీ వాస్తవానికి వారిని తమ సహోదరులుగా చూడాలని వారికి ఉపదేశమివ్వబడింది.
దేవుని ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “మీ దేశమందు పరదేశి [అతను తరచూ ఓ శరణార్థి అయ్యుండేవాడు] నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.”—లేవీయకాండము 19:33, 34.
పరదేశులు తరచూ దుర్బలులుగా మరియు భద్రత లేకుండా ఉంటారని గమనించి, యెహోవా వారి సంక్షేమం మరియు కాపుదల కొరకు ప్రత్యేకమైన చట్టాలనిచ్చాడు. వారికి హామీ ఇవ్వబడిన ఈ క్రింది హక్కులను పరిశీలించండి.
న్యాయబద్ధమైన తీర్పుపొందగల హక్కు: “మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను.” ‘పరదేశికి న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు.’—లేవీయకాండము 24:22; ద్వితీయోపదేశకాండము 24:17.
దశమ భాగంలో పాలుపంపులు పొందగల హక్కు: “మూడేసి సంవత్సరముల కొకసారి, ఆ యేట నీకు కలిగిన పంటలో పదియవవంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తిపొందుదురు.”—ద్వితీయోపదేశకాండము 14:28, 29.
న్యాయబద్ధమైన జీతాన్ని పొందగల హక్కు: “నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు.”—ద్వితీయోపదేశకాండము 24:14.
పొరపాటున చంపినవాడు ఆశ్రయం పొందగల హక్కు: “పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమైయుండును.”—సంఖ్యాకాండము 35:15.
పరిగె ఏరుకోగల హక్కు: “మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.”—లేవీయకాండము 19:9, 10.
మన సృష్టికర్తయైన యెహోవా దేవునికి శరణార్థుల ఎడల కరుణ ఉంది, మరి మనం కూడా కరుణ చూపితే ఆయన ఆనందిస్తాడు. “దేవునిపోలి నడుచుకొనుడి” మరియు “ప్రేమగలిగి నడుచు కొనుడి” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—ఎఫెసీయులు 5:1, 2
[Picture Credit Line on page 9]
Boy on left: UN PHOTO 159243/J. Isaac